వచన సాహిత్యము | పీఠికలు | శ్రీమదొంటిమిట్ట రఘువీరశతకము |
అయ్యలరాజు త్రిపురాంతకకవి - శ్రీమదొంటిమిట్ట రఘువీరశతకము
పీఠిక
- శ్రీ హర్కారే గుండేరావు (గద్వాల సంస్థానం ప్రచురణ, 1930)
శతకమనునది యొక కావ్యవిశేషము. ఈ శతకము రచించు వాడుక యెంతకాలమునుండి పట్టుబడినది నిశ్చయించుట యశక్యము. ప్రాయశః సంస్కృత భాషలోనున్న అమరు, భర్తృహరి మొదలగు శతకముల యనుకరణమనియే యూహింపనగును. ఈ యనుకరణము నన్నయ భట్టారకునికంటెఁ బూర్వము నుండియే యున్నటులఁ దోచుచున్నది. ఇటువలెనే సంస్కృతమునఁ బాదుకాసహస్రాదులుగూడ నున్నవికాని అట్టి వీ యాంధ్రభాష యందెచ్చటను గనుపడుటలేదు.
ఈ గ్రంథకర్త త్రిపురాంతక కవి. ఈతఁడు రాయకవి అయ్యలరాజు కొమారుఁడని యిందలి యంత్య పద్యముచే నెరుంగ నయ్యెను.
ఇతండు కర్ణాటక మహారాజు సభలోఁ దన కవితాప్రౌఢిమచే నెల్లరిని మెప్పించినటుల ‘ఆ కర్ణాటక’ – అను పద్యమున వ్రాసియున్నాడు. దీనిచే నితఁడు ఆంధ్రభోజుఁడని ప్రఖ్యాతినందిన శ్రీ శ్రీ కృష్ణదేవరాయుల సమకాలికుఁడనియో? అథవా విజయనగర సామ్రాజ్యకాలములో నున్నవాఁడనియో తెలియుచున్నది.
మఱియు ‘నేటన్ దీఱె’ – అన్న పద్యములో వంటిమిట్ట గ్రామమున నుండు శ్రీరాముని స్తుతియించినాఁడు గనుక కర్ణాట దేశాంతర్గత కడపజిల్లాలోనివాడుఁగా నూహింపనగుచున్నది. ఈ వంటిమిట్ట నిజాంరాజ్యాంతర్గతమైన వరంగలు కాదని నా యభిప్రాయము.
త్రిపురాంతకుఁడని పేరుగలవాడైనను ఇతండు కేవల వైష్ణవుండనియు తప్త ముద్రాధారణపరుండనియు ‘తిరునామంబు’, ‘నీ పాదోదకము’ – అను పద్యములవలన స్పష్టమగుచున్నది.
ఈతని కవిత శుద్ధముగను, రసవంతముగను, కైశికీవృత్తి నవలంబించినదిగ నుండుటచే సహృదయ హృదయంగమమై యలరారుచున్నది.
ఈతఁడు కేవల భగవద్భక్తుండు శుద్ధభావ పరిపూర్ణుఁడునై యుండుటేగాక రాజసభాపూజితుండునై యుండియుఁ కొంతకాలమునకు నరస్తుతి యతితుచ్ఛమని విసుకుఁజెంది యైహికసుఖముఁ దృణీకరించి సంసార విముఖుఁడై యాత్యంతిక సుఖముఁగోరి శ్రీరామచంద్రుని నీ శతకముచే స్తుతియించెను. ‘నిలువెల్లన్’ – అను పద్యములో నితని యంతర్భక్తి, ‘కొంకన్ గారణమేమి’ – అను పద్యములో చిత్తశుద్ధి సదృష్టాంతముగా మఱియు ‘ఇల నిన్నున్’ – అన్న పద్యములో కేవల శరణాగతి లక్షణములు స్పష్టముగఁ జూపియున్నాఁడు. ఇవి చాల హృదయంగమమై యున్నవి.
ఇంతియేగాక ‘గోమేధాధ్వర’ – ‘పురసంహారుఁడు’ – ‘సకలామ్నాయములున్’ – ‘తపముల్ జేసిన’ – అను పద్యములయందు భగవన్నామ మాహాత్మ్యము సర్వోత్తమముగా వర్ణించియున్నాఁడు.
‘దనుజాధీశులు’ – ‘వడి నీ బాణము’ – ‘చావుల్ మర్త్యులకెల్ల’ – ‘తిరునామంబు’ – ‘దేవా! నాదొక’ – ‘నానాజీవ’ – అనునట్టి పద్యములలో శబ్దాలంకార పాటవముఁ గర్ణానందముగాఁ జెప్పియున్నాఁడు.
‘తలఁపం జిత్రము’ – అను పద్యములో అద్భుతరసము, ‘ఏ దైవాల వరాలకంటె’ నన్న పద్యములో అతిశయోక్తి, గర్భితస్వభావోక్తి మఱియు ‘పురసంహారుని’ – అను పద్యములో కేవలశాంతరసము, ‘ఘనసారంబును’ – అను పద్యములో దేహనిందాపరబీభత్సరసము సంపూర్ణముగా వర్ణించి యున్నాఁడు.
మఱియు ‘వృథగా నెవ్వఁడు’ – అను పద్యములో నితఁడు భగవంతునియందే సంపూర్ణవిశ్వాస ముంచినది స్పష్ట మగుచున్నది.
‘నానాజీవమనోనివాస’ – అను పద్యమువలన నితఁడు యోగశాస్త్రమునుఁ జక్కగా నభ్యసించినటులఁ దెలియుచున్నది.
‘నేటన్ దీఱె’ – నను పద్యమువలన నితఁడు మనఃప్రసాదముగలిగి కృతకృత్యుఁ డైనటులనేగాక కేవల నిరపేక్షావృత్తి నందినటులనుగూడఁ దెలియుచున్నది.
మఱియు అచ్చటచ్చట పునరుక్తులు అర్థహీనపదములేగాక హీనోపమ మొదలైన (‘నా యజ్ఞానము’ – అను పద్యములో) దోషములుగూడ కనబడుచున్నవి. కాని, భక్తినిర్భరమైన స్తోత్రమయ కవితాప్రవాహమునందు ఈ దోషములు విశేష విచారణీయములు గావు.
ఈ కారణములఁ బట్టి ఈ కవి భగవద్భక్తుఁ డనుటకు సందియము లేదు. ఇట్టి యుత్తమ గ్రంథమును ముద్రింపించి భాషాసేవనొనరించిన శ్రీమతీ మ॥రా॥రా॥శ్రీ గద్వాల మహారాణీ శ్రీశ్రీ ఆదిలక్ష్మీదేవమ్మ గారికి మరియు శ్రీమంతు మ॥రా॥రా॥శ్రీ రాజా సోమేశ్వరరావు బహద్దరు గారికి శ్రీచెన్న కేశవస్వామి ఇతోప్యధిక సకల సుఖము లొసగి రక్షించు గాత.
ఇట్లు,
హ, గుండేరావు.
గద్వాల సంస్థానం
జిల్లా నాజం.
శ్రీచెన్నకేశవ పాఠశాలా కార్యదర్శి.
29–1–30
![]() |
![]() |