వచన సాహిత్యము | పీఠికలు | శ్రీమదొంటిమిట్ట రఘువీరశతకము |
అయ్యలరాజు త్రిపురాంతకకవి - శ్రీమదొంటిమిట్ట రఘువీరశతకము
పీఠిక
- శ్రీ ’వాసుదాసు’ వావిలికొలను సుబ్బారావు
ఈ గ్రంథమునకు శ్రీమదొంటిమిట్ట రఘువీరశతక మని పేరు. పద్యంబులందు ముకుటంబుగా “నొంటిమిట్ట రఘువీరా జానకీనాయకా” యని యుండుటచే దీనిని జానకీనాయక శతక మని చెప్పవచ్చును గాని యాదినుండియు దీనికి నొంటిమిట్ట రఘువీర శతకమనియే నామధేయము. స్థల ప్రశస్తిఁబట్టి దాని నిర్దేశింపఁ బూర్వులిట్లు వాడఁజొచ్చిరి.
నూఱు పద్యములు గల గ్రంథమునకు శతకమని పేరు. అయినను గొన్ని శతకములందు నిన్నూఱుపద్యములును గలవు. ఈ శతకంబున నూట యెనిమిది పద్యములు గలవు. అష్టోత్తరశతనామములచేఁ గదా భగవంతు నర్చింతురు. అష్టోత్తరశత గాయత్రిగదా జపింతురు. కావున సంప్రదాయజ్ఞుఁడైన యీ మహాకవివర్యుఁ డష్టోత్తరశత పద్యహారము శ్రీకోదండరామస్వాములవారి కర్పించి ధన్యుండయ్యె.
అష్టోత్తరశతసంఖ్యా రహస్యము కొంచెము విచారింతము. వేదమాతయు ‘న గాయత్ర్యాః పరమ్మంత్ర’మ్మని మంత్రంబులం దెల్ల నుత్తమమని ప్రసిద్ధిగాంచినదియు గాయత్రీ మంత్రము. అది ౩౨ యక్షరములు గలది. గృహస్థులు లోనగువారు ౨౪ అక్షరములే జపింతురు. ౩౨ అక్షరములు సన్యాసులు జపింతురు. సంస్కృతంబున బహువచనము మూఁడవది. బహుత్వమున మూఁడు నికృష్టమైనది. మూఁటికి ముమ్మాటికి నని యందుము గదా. కావున గాయత్రిని ౨౪ x ౪ = ౯౬ గృహస్థాదులు, ౩౨ x ౩ = ౯౬ మార్లు సన్న్యాసులును జపింతురు. ఎటు తిరిగి ౯౬ సిద్ధము. ౯౬ ప్రణవసూచకము ౯ + ౬ = ౧౫ ప్రణవాక్షరము గదా. ఏ మంత్రమైనను బురశ్చరణ చేయువా రుచ్చారణ ధ్యానాదుల లోపము పూరింపఁగోరి జపించినదానిలో నెనిమిదవవం తెక్కువగ జపింతురు కావున ౯౬ + ౧౨ = ౧౦౮ యయ్యె. మంత్రాదులం దన్నిట నీవిధి యనుష్ఠేయము. ఆదిశబ్దముచే శ్రీరామకోటియు గ్రహింపనగు. రామశబ్దమే మంత్రము.
ఈ శతకము కడప మండలమునఁ గడప పురంబునకు నొకటిన్నర యామడ దూరంబుననుండి సంస్కృతమున నేకశిలా నగరమనియుఁ, దెనుఁగున నొంటిమిట్ట యనియు వాడంబడు గ్రామంబున జనించెనని ౨–వ పద్యమువలనఁ దెలియనగు. ప్రకృతము తెలిసినంతవఱకుఁ గవీంద్రరత్నాకరమైన యొంటిమిట్టయందు జనించిన గ్రంథములలో నిదియే మొదటిదని చెప్పుటయుఁ దప్పుగాదని తోఁచెడి. కాలకర్మవశతను, జనుల నిర్భాగ్యదశచేతను, దివ్యక్షేత్రములలో నొకటియై యెంతో ప్రశస్తి గన్న యీ క్షేత్రము మబ్బుమాటుననున్న సూర్యునివలె నింతవఱకు మఱఁగుపడి మఱవఁబడి యుండెను. ప్రజల భాగ్యోదయమున నది మరల ధూమములేని యగ్నిజ్వాలవలెఁ బ్రకాశింప దొరకొనినది. ఈ కార్యమున సహాయులగువారే సార్థక జన్ములు. ముక్తికాంతా మనోహరులు. బమ్మెర పోతనామాత్యుఁడిందే శ్రీభాగవతమును దెనిఁగించెను. అయ్యలరాజ వంశజ కవులిక్కడివారే.
శ్రీకృష్ణలీలామృతంబున నీగ్రామ మిట్లు వర్ణింపఁబడెను–
సీ. జానకీరామలక్ష్మణ దివ్యమణులకు, నుదిరిబంగరుగుట్ట యొంటిమిట్ట సాధుమందారమౌ సంజీవరాయని, కొప్పైన నెట్ట మా యొంటిమిట్ట భక్తాగ్రగణ్యులౌ పరమసాధువులుండ, యోగ్యమౌ మెట్ట మా యొంటిమిట్ట భవ్యచరిత్రులౌ వరకవిచంద్రుల, కుదయించు మిట్ట మా యొంటిమిట్ట గీ. ఉగ్రశీలురకును జెట్ట యొంటిమిట్ట యొంటితనమునకును హట్ట మొంటిమిట్ట యొఱపుఁ బున్నెంపుఁ బూబుట్ట యొంటిమిట్ట యురవు ధర్మాళి కనకట్ట యొంటిమిట్ట చం. అవనిని క్షీరవార్ధియను ఖ్యాతివహించెను బోతరాజభా గవతసుధాఘటంబునకుఁ, గ్రమ్మఱ నయ్యలరాజవంశ్య స త్కవివరపాళి నిల్వఁగను గల్పధరారుహమన్న సత్ప్రథన్ దవిలిన యొంటిమిట్టకును దక్కుపురంబులు సాటియెట్లగున్
ఈ కవి తండ్రి యయ్యలరా జించుమించు క్రీ.శ. ౧౩౮౩ నందు జనించెను. ఆయన కుమారుఁడైన యీ గ్రంథకర్త తిప్పరాజు ౧౪౧౩ నందును, నీయన పుత్రుఁడు పర్వతరాజు ౧౪౪౩ నందును, నీయన నందనుం డక్కయార్యుఁడు ౧౪౭౩ నందును, రామాభ్యుదయ గ్రంథకర్తయైన రామభద్రుఁడు ౧౫౦౩ నందును జనించి యుండవలయును.
క్రీ.శ. ౧౪౧౩ నం దీకవి జనించెనేని యితని నలువదవ యేఁట నీ కృతి రచింపఁబడెనని యూహింపనగు. ఎట్లన మూఁడవ పద్యమునందు
శా. ఆ కర్ణాటక మండలాధిపతిచే నాస్థానమధ్యంబులో నాకావ్యంబులు మెచ్చఁ జేసితివి నానారాజులుం జూడఁగా
నని శ్రీ సరస్వతీదేవి స్తుతింపఁబడెను గావున నింతకుముం దనేక కావ్యంబులు చేసి యీయన రాయల యాస్థానకవియై యుండినట్లు తెలియుచున్నది. అంతియగాక ౭౩–వ పద్యంబున
శా. బాలత్వంబునఁ గొంతకాలము వృథా పాపంపు దుర్బుద్ధినై చాలన్ జవ్వనమందు గర్వమతినై సంసారినై దుష్క్రియా జాల భ్రాంతిఁ జరింతుఁ గాని నినుఁ గాంక్షం గొల్వలేదయ్య
యని చెప్పుటచే నీ శతకము యౌవన వార్ధకసంధియం దైనఁ జెప్పియుండవలెను. కావునఁ గవి తన నలువదవయేఁట దీని రచియించెనని యూహించుట సత్యమునకు విశేషదూరమై యుండదు. కావున నీశతకము రమారమి క్రీ.శ. ౧౪౫౩వ సంవత్సరమున జనించి యుండవలెను. ఈయన కావ్యము లన్నియుఁ బేరైన లేక నానాఁడే నశించినను తన కంకిత మీయఁబడిన దగుటచేతను, దొలుత వెలికిఁదీసి ముద్రించినాఁడను పేరు వీనికి రావలయునను దలంపుచేతను ౪౬౮ సంవత్సరములు దీనిని శ్రీ కోదండరామమూర్తి నష్టము క్రిమిదష్టము గాకుండ రక్షించెను. నా కృతులయందును భగవంతున కిట్టి కరుణాకటాక్షము స్థిరమై నిలుచును గాక. ఈ కాలమును గణించిన విధము పోతరాజ విజయంబున ౩౪– వ పుటయందుఁ గాననగు. అందుఁ బ్రమాదవశమున ౨౦ సంవత్సరములు వ్యత్యస్తముగ వ్రాయఁబడినది. పాఠకులు సవరించుకొందురు గాక.
కవి ‘యొంటిమిట్ట రఘువీరా’ యని సంబోధించుటచేఁ గృతిభర్త యొంటిమిట్టయందు దుష్టశిక్ష శిష్టరక్ష సలుప భక్తులపాలి పారిజాతమై స్వయంవ్యక్తమూర్తియై వెలసిన శ్రీకోదండరామమూర్తి యగుట నిస్సందేహము. కవి రఘువీరుఁడని ప్రయోగించుటచేత నొంటిమిట్ట యందలి స్వామికి రఘువీరుఁడని పేరే కాని కోదండరాముఁ డని పేరులేదని యొకానొకరు వాదించిరి గాని యది బాలభాషితము గాన నుపేక్షింపఁ దగినది. దేవాలయమందలి శాసనములందు రఘునాథ రఘునాయక కోదండరామేతి పదంబులు గానవచ్చెడిని. రఘునాథా యని యీ కవియుఁ బ్రయోగించి యున్నాఁడు.
కృతిపతి జగత్ప్రసిద్ధుఁడైనను దేశకాలావస్థాభేదములం బట్టి చెప్పవలసిన విషయంబు విస్తారంబుగఁ గలదు. గ్రంథవిస్తరభీతి సంక్షేపింపఁ జేసెడి. పితృవాక్యపరిపాలనము నెపముగ శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సహితుఁడై రాక్షస సంహారముఁ జేసి మునీశ్వరుల రక్షింప దండకాటవియందు నానా ఋష్యాశ్రమములందుఁ బది సంవత్సరములు సంచరించెనని శ్రీమద్రామాయణము వచించుచున్నది. ఆ సమయంబున మృకండ్వాది మునీశ్వరుల కాశ్రయమైన యీ ప్రదేశమందును వారు సంచరించి కొన్నినాళ్లిచ్చట వసించిరి. ఇట్లు శ్రీ సీతారామలక్ష్మణ చరణకమల పరాగముచేఁ బవిత్రమైన దీ ప్రదేశము. ఇట్లీ మూర్తిత్రయము సంచారము సేయునెడ శ్రీ రాముఁడు ముందుగను, నడుమ సీతాదేవియు, నామె వెనుక ధనుర్ధారియై లక్ష్మణుఁడును బ్రణవార్థము బోధించుచుఁ బోవుచుండిరి.
శ్లో. అగ్రతః ప్రయయౌ రామః, సీతామధ్యే సుశోభనా। పృష్ఠతస్తు ధనుష్పాణి, ర్లక్ష్మణోఽనుజగామహ॥
దీనికిఁ దెనుఁగు –
తే. అగ్రవర్తియై శ్రీరాముఁ డరుగుచుండె నువిద తనుమధ్య మధ్యమం దుండె సీత మహితకోదండదండ సంభరణహస్తుఁ డోలి వెన్నంటె లక్ష్మణుఁ డొప్పు ప్రేమ
ఈ పద్యమున మొదటి మూఁడు పాదములందలి మొదటి యక్షరములు గూర్చి చదివిన అ + ఉ + మ యని ప్రణవ మేర్పడుచున్నది. పద్యార్థము ప్రణవార్థమును బోధించుచున్నది. మాయా మానుషమూర్తియైన శ్రీరామచంద్రుఁడు మార్గదర్శియై తన యాచరణముచేత లోకులకు శిష్టాచార తత్త్వములు బోధించెను గాని గీతాచార్యునివలె వాగ్రూపముగ నుపన్యసించినవాఁడు గాఁడు. ఈ విషయము శ్రీకృష్ణలీలామృతంబునఁ గననగు. తత్త్వవేదులయిన మునీశ్వరు లీతత్త్వము గ్రహించి కృతార్థులైరి. శ్రీరామనామ మహత్త్వ రహస్యము ముద్రింపఁబడుచున్న శ్రీరామనామ మాహాత్మ్యంబుచే నెఱుఁగనగు. అట్లు కొన్ని దినము లందు వసించి తన బాణప్రయోగంబునఁ బాతాళగంగను భూమికిఁ దెప్పించి శ్రీరాముఁ డిచ్చటి మునీశ్వరుల కానందదాయి యయ్యె. అది మొద లాదివ్యతీర్థము శ్రీరామతీర్థమని ప్రసిద్ధి కాంచెను.
నిరంతర రామనామ జపముచే విరక్తి యుదయింప శివుఁడు భార్యను బుత్రులను సర్వమును ద్యజించి యేకాంగియై లింగమై యిచ్చట శ్రీరామసేవ సేయుచున్నవాఁడు. కావుననే యీ యొంటి లింగమునకు నొంటిమిట్ట రామలింగ మని ఖ్యాతి కలిగెను. ఈ లింగ మిప్పుడు కట్టమీఁది వీరాంజనేయుల కోవెలయందు నెలకొల్పఁబడి యున్నది.
శ్రీసీతారామలక్ష్మణు లీప్రదేశము విడిచి యితరాశ్రమములకుఁ బోవ సమకట్టఁ దద్వియోగ తాపంబున కోపక తద్దర్శన సేవాదుల మాని యుండఁజాలక యిందలి మునీశ్వరులెల్లఁ బోవలదని శరణాగతులు కాఁగా భక్తవాంఛాపూర్తియే దీక్షగాఁ గొన్న కరుణాసముద్రుఁడగు రామభద్రుఁ డాత్యంతిక కార్య విధముఁ దెలిపి ప్రణవార్థంబు బోధపడఁ దమ ప్రతిరూపంబు లర్చకై యొసంగి చనియె. ఏకాక్షరంబున నక్షరత్రయంబుం బోలె నేకశిలయందు మూఁడు విగ్రహములు జనించి జ్ఞానముగల భక్తులకుఁ దత్త్వసూచకమై యున్నవి. ఇప్పుడు గ్రామము కూఁడఁ బ్రణవాకారమును వహించియున్నది.
కోదండధరుండైన శ్రీరాముఁడు నృసింహమూర్తికంటెను నుగ్రతరమూర్తి యని యుపాసకుల తలంపు. శర కోదండధారణము ద్వివిధము. కొన్ని మూర్తుల కుడి కేల బాణాగ్రము నేలఁ జూచుచుండును. ఎడమచేయి ధనుష్కోటిని బట్టి యుండును. కొన్ని మూర్తులయందు బాణాగ్రము మిన్ను చూచుచుండును. వామపాణి లస్తకంబున నుండును. ఈ విధము సద్యశ్శరప్రయోగ సన్నాహమును సూచించును గావున మొదటి యాకారమునకంటె రెండవది రౌద్రమందురు. ఈ విధముగ శరచాపములు పట్టుటఁ జూచియే ప్రేమస్వరూప యగు శ్రీసీత లోకమాత శ్రీరామునకు నహింసావిషయము బోధించెను. ఈ దేశమును రావణాసురుఁడు శూర్పణఖకుఁ బసుపుకుంకుమములకై యిచ్చెనని యందురు. ఇది సత్యమైనను గాకున్నను రాక్షసాంశజనితులు నేఁటికి నీప్రాంతములఁ గలరు గావున నీదేశము పూర్వము రాక్షస ప్రచురప్రదేశ మనుటయందు సందియము లేదు. ఇట్టిచోట నుద్యతాయుధులై రామలక్ష్మణులు చరించియుండుట వింతగాదు. కావున నొంటిమిట్టయం దిట్టిమూర్తులే కానవచ్చుచున్నవారు.
నృసింహు రౌద్రమును బ్రహ్లాదునివలె నిట్టి యుగ్రమూర్తియగు శ్రీరామమూర్తి రౌద్రమును నేకపాదరుద్రుఁడగు నాంజనేయుఁడు దక్క దక్కినవా రెవ్వరు సహింపఁగలరు? కావునఁ బ్రక్కల నెదుటను భక్తాంజనేయులు సంజీవరాయాఖ్య వహించి నిలిచి యున్నవారు. శ్రీ కోదండరామ రౌద్రాగ్నిని గొంతవఱకుఁ జల్లార్పఁ బ్రసన్నాంజనేయులు పాల్పడియుండుటచేతఁ బూర్వము నగరముగా నుండిన యీ ప్రదేశ మిప్పుడు కుగ్రామమై నామావశిష్టకల్పమై యైన నున్నదిగాని లేని యెడల నీ దేవతాపరిచారకులు కుమతిధారులు గావించు దుండగముల కెన్నడో యీ గ్రామము నామావశిష్టమై యుండవలయును. నీచులు కలహింతురు, సాధువులు సంధి గోరుదురను న్యాయముగాని, పోరు నష్టి పొందు లాభమను నీతిగాని పాటింపక పూర్వమీ దేవాలయ ధర్మాధికారులు పరస్పరము కలహించి స్వామి కశనాభావము గల్పించి యాదరింపక యాదరింపఁ బూనుకొనువారిని దమ కలహములచే నిరుత్సాహపఱుచుచుండినవారు. “అమ్మ తాను బెట్ట దడుగుకొని తిననీయ”దను సామెత గలదుకదా. ఇట్టి పుణ్యజనులు హతశేషులు నేఁటికి నిరువురు మువ్వురు గలరు. వారికి సాధుబుద్ధి నొసఁగి కాండకాండాసనమండితుఁడైన రఘువీరుండు చక్కఁబఱుచుఁగాక.
అత్యున్నతదశయందుండిన యీ మహాదేవాలయమున కిట్టి దుర్దశ యెట్లు లభించెనని కొందఱు సందేహింప వచ్చును. ౨౮–౧౧–౨౧ తేదియందు శ్రీకోదండరామస్వాములవారి దేవాలయమందు దేవస్థానపుఁ (గమిటిదార్లు) నల్వురు సభగూడిరి. తత్పూర్వము ౧౯ –౯–౨౧ తేదియందు నలువురు కమిటిదార్లు నల్వురు రెడ్ల ధర్మకర్తల నేర్పాటుచేసిరి. దేవపూజాపాకాదులందు లోపములఁ గనిపెట్ట నొక బ్రాహ్మణుని బై విచారణ కొకబ్రాహ్మణేతరుని నేర్పఱిచినఁ జాలరా యిందఱేలయని ప్రశ్నించితిని. రెడ్ల మర్యాదలు కాపాడుకొనుటకై యని ప్రత్యుత్తరమొసఁగఁబడెను. కంటిరిగదా లోకులారా! దేవాలయము వీరికై పుట్టెనో వీరు దేవాలయమునకై యేర్పడిరో యాలోచించు బుద్ధిబలము వీరికి లేదాయెఁ గదా. అంతియ గాదు. రెండు వింతవార్తల నీ సభయందు వింటిని. బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులని వర్ణక్రమము వేదశాస్త్రచోదితమైయుండ వైశ్యులకు ముందు మీకెట్లు మర్యాద కలిగెనని యొక రెడ్డిగారి నడిగితిని. మేము రెడ్లము. క్షత్రియజాతివారమని ప్రత్యుత్తర మొసంగఁబడియె. ఏ గ్రంథమందును నే నిదివఱకు దీనిని జదివినవాఁడను గాను గావున నచ్చెరువుగొని తఱచి చూతమని నీవు క్షత్రియబీజమునకుఁ బుట్టితివా యని ప్రశ్నించితిని. అవునని యా పెద్దమనుష్యుఁడు జంకు కొంకు కళంకు లేక నిశ్శంకముగ శంఖఘోషముతో నిండుసభలో నూర్వురు విన వచించెను. అంతతో నుండిన మేలే. వైశ్యులు మాతంగజాతులని కూడఁ జెప్పెను. ఈ రెండు విషయము లితరులు వచించినఁ దర్కించియుందునుగాని వీనిని వచించినవారు నేను రాజంపేఁట తాలూకాలో రివిన్యూ ఇన్స్పెక్టరుగా నుండిన కాలములో నాకుఁ బరిచితులును బ్రాజ్ఞులును, జదువరులును, నుదారులై సర్వము తహశీల్దార్ల కొసఁగి మాఱట తహశీల్దార్లని కీర్తికన్న గుండ్లూరు వాస్తవ్యులు మహారాజశ్రీ ఆవుల బాలయ్యగారి కృష్ణారెడ్డిగారగుటచేత నిందు సత్యము గలదేమోయని జంకితిని. నా సందేహము తీర్చుకొనఁ జరిత్రకారు లీరెండువిషయములఁ దర్కించి యిదమిత్థమ్మని సిద్ధాంతము చేయుదురుగాక యని యిందు వెల్లడించితి. ఇంకనైనను స్వామికార్యమునఁ దదేక దృష్టినిడి పరస్పర కలహములు మాని స్వప్రతిష్ఠ లాశింపక వంచన మాని కైంకర్యరతులై యిహమునఁ గీర్తిసంపదలను, బరమున మోక్షలక్ష్మిని నీగ్రామజనులు నధికారులందఱుఁ బొంద భగవంతుఁడు వీరికి సాధుబుద్ధి నొసంగును గాక. పూర్వచరిత్రలవలన గలిగిన నష్టిని నపకీర్తిని బాపము నెఱింగి యిప్పటివారు బుద్ధిమంతులై నీచకలహముల నాసక్తి మాని శాశ్వతకీర్తి ముక్తుల సంపాదించెదరో లేక శాశ్వతాపకీర్తి నరకముల పాలయ్యెదరో ముందుముందు లోకమెఱుంగఁగలదు. ఇప్పటికి వీరి చర్యలందు శుభోదర్క సూచనలే కానవచ్చుచున్నవని సంతోషించుచున్నవాఁడను. కొందఱు కుమతిధారులు తప్పఁ బూర్ణమనస్సుతో నందఱు స్వామికైంకర్య మొనర్చుచున్నవారు. తిరుపతి వేంకటాచలపతి, ఘటికాచల నృసింహమూర్తివలె జాగ్రదర్చామూర్తులని యెన్నిక గన్నవారిలో నొంటిమిట్ట శ్రీకోదండరామమూర్తి యొక్కఁడనుటకు భక్తుల స్వప్నంబులఁ దోఁచుటయు, మ్రొక్కువారల కోరికలు సఫలముగఁ జేయుటయు, నిజస్వచోరుల నిర్మూలించుటయు లోనగునని ప్రత్యక్ష నిదర్శనములు. భద్రాచల రామమూర్తి గోపన్న విషయమున జరపిన యద్భుత కార్యమునకంటె నత్యద్భుతమహిమలు భక్తుల విషయంబున నొంటిమిట్ట శ్రీకోదండ రామస్వాములవారు కనఁబఱచి యున్నవారు. అవి యొంటిమిట్ట కోదండరామభక్త చరిత్రమందు వివరింపఁబడును. ఏనాఁటి మాటయో యేల? నేఁడు పునరుద్ధారణ కార్యనిర్వహణమందుఁ గనఁబఱుచు నద్భుతలీల లాశ్చర్య జనకములై యున్నవి.
మతిమంతులు భక్తులపాలి కొంగు బంగారమైన యీ శ్రీరామమూర్తిని దర్శించి సేవించి భజించి యర్చించి యుపాసించి ధన్యులగుదురు గాక.
ఈ రఘువీరశతకర్త యెవరైనది గ్రంథమువలనఁ దెలియరాదు. అష్టోత్తరశత నియతికి భంగమువచ్చునని ౧౦౯వ పద్యముగఁ దనపేరు వ్రాయనే లేదో, కవి వ్రాసియుండిన ఖిలమైపోయెనో తెలియదు. ౨–వ పద్యములోఁ “బద్యముల్ నూఱుం జెప్పెద నూరుఁబేరు వెలయన్” అను దానికిఁ గృతిపతి యూరుఁ బేరనియే యర్థము గ్రహింపవలసియున్నది. అయినను నీ గ్రంథమున నొంటిమిట్ట రఘువీరా యని యుండుటచేతను, రామాభ్యుదయ గ్రంథకర్తయై యీ కవికి మునిమనుమఁడగు నయ్యలరాజు రామభద్రకవి “శ్రీమదొంటిమిట్ట రఘువీరశతక నిర్మాణకర్మఠ జగదేకఖ్యాతిధుర్యాయ్యలరాజు తిప్పమనీషి పర్వతాభిధానపౌత్ర” యని వ్రాసియుండుటచేతను, నీవంశమందే జనించిన రెట్టమత గ్రంథకర్త “రఘువీరశతక నిర్మాణకర్మఠరాయకవి తిప్పనార్య” యని వచించుటచేతను నీ శతకమును రచించిన కవి యయ్యలరాజు తిప్పరాజని యేర్పడుచున్నది. కవి యింటి పేరయ్యలరాజువారు. కావున నీ కవి తిప్పరాజును నార్వేల నియోగిబ్రాహ్మణుఁడని యేర్పడుచున్నది.
అంతియగాక ౯౭–వ పద్యంబున“తిరునామంబు ధరింపఁడేని నొసలన్” అని వ్రాయుటచే నీ కవి తిరుమణి శ్రీచూర్ణములు ధరించు నూర్ధ్వపుండ్రధారి యని యేర్పడుచున్నది. కవి ౪౬–వ పద్యంబున “నీ పేరునుం బెట్టితిన్ నీ పెన్ముద్రలుదాల్చితిన్ భుజములన్” అనుటచేఁ బంచసంస్కారవిశిష్టుఁడైన విశిష్టాద్వైతియనుట స్పష్టము. ఈ పద్యమునందే “నీ పాదోదక మక్షులం దదిమికొంటిం, గొంటి నాలోనికిన్, నీ పళ్లెంబు ప్రసాదముం గుడిచితిన్” అనుటచే నీవలివారి విచారణలోపముచేఁ దీర్థప్రసాదస్వీకరణమీ కోవెలయందు నిలిచిపోయెఁగాని పూర్వమాళ్వారుల ప్రతిష్ఠయుఁ దీర్థప్రసాదస్వీకారమున్నట్టు వెల్లడి యగుచున్నది. ఆళ్వారుల విగ్రహములు భిన్నములై యందందుఁ గోవెలలోఁ గానవచ్చెడి. వాస్తవమిట్టుండ నీదేవాలయము ౩౦౦ సంవత్సరములనాఁటి కీవలిదని వాదించువారెంత విజ్ఞులో కదా.
౫౨–వ పద్యములో “ఏకాదశిం గూడుతిన్నా మూఢాత్ముఁ” డనుటచే వ్రతనైష్ఠికుఁడని యేర్పడుచున్నది. ౧౪–వ పద్యమున నీకవి
మ. పటునిర్ఘాతకఠోరనాదము ఘనబ్రహ్మాండభాండంబుఁ బి క్కటిలంజేయుచు వచ్చునప్పు డితరుల్ గాండీవినామంబులె న్నుట మేలందురు, వైష్ణవుల్ దలఁప రన్యుం గోరి యెంతెంత దు ర్ఘటముల్ వచ్చిన నిన్నెగాక రఘువీరా! జానకీనాయకా!
యనుటచే నీయన వీరవైష్ణవుఁడని యేర్పడుచున్నది.
ఆఱువేలనియోగులు వైష్ణవప్రపత్తి గలవారు సాధారణముగ గోలకొండ వ్యాపారులుగా నుందురు గావున నీయనయు గోలకొండ వేపారియో యని సందేహింపఁదగి యున్నది.
౨౩–౭౯వ పద్యములం జదివిన నీయన కేవలభక్తిమార్గ నిష్ఠుఁడని చెప్పవలసియున్నది.
ఈయన వీరవైష్ణవ ప్రపత్తి మఱియొకవిధముగఁ గూడఁ దెలియనగు.
ఈయనకుఁ దల్లిదండ్రులు పెట్టినపేరు తిప్పరాజు. తిప్ప శబ్దము త్రిపురాంతక శబ్దభవము. ఇది శైవనామమగుచున్నది. వైష్ణవభక్తిపూర్ణుఁడైన యీకవి యీపేరు తనకు సరికాదని రామరాజనియో మఱియేదో రామనామమును దానుంచుకొన్న వాఁడని “నీపేరును బెట్టితిన్” (౪౬–వ పద్యం) “నాపేరు పెట్టినవానిన్” (౩౫–వ పద్యం) అను ప్రయోగములు దెలుపుచున్నవి. ఆత్మనే పదమనిత్యముగావున “పెట్టుకొంటిన్” అనుటకు మాఱు– పెట్టితిన్ అని పరస్మైపదము ప్రయోగించెను. పట్టము గట్టుకొని యేలుమనుటకుఁ “బట్టముగట్టి యేలుము మమున్” అని నన్నయభట్టారకుఁడును బ్రయోగించెఁ గదా. ౪౬–వ పద్యమునఁ గ్రమమును జూచిన నిది యాత్మనేపదార్థమునఁ బ్రయోగింపఁబడెనని స్పష్టమగును. అటుగాదేని తన కుమారున కా పేరు పెట్టెనని యూహింపవలసి వచ్చును. అది నిరాకరము. ‘శైవశాస్త్రమతము’ గనిన వాని తనూభవుఁడయ్యు బమ్మెరపోతరాజు వైష్ణవభక్తియుక్తుఁడయ్యెంగదా. ఒంటిమిట్ట కోదండరామ మాహాత్మ్యముం గని శివునంతటి మహానుభావుఁడు సర్వసంగ త్యాగియై రామలింగమని రామనామాంకితుఁడై యుండ మనుష్యులు తద్భక్తులై తన్నామాంకితు లగుట యేమిచిత్రము.
౭౨–వ పద్యములోని యైతిహ్యము పద్మోత్తరపురాణంబునఁ గలదుగాని ౧౬–వ పద్యంబులోని యైతిహ్యమెందలిదో నాకుం దెలియదు. తెలిసినవారు తెలిపి నా వందనము లందుకొన వేఁడెద.
౧౩–వ పద్యమునఁ గర్ణాటాధీశ్వర యొంటిమిట్ట రఘువీరా యని స్వామిని సంబోధించుటచేఁ గడపమండలముగూడఁ గర్ణాటకమని పేరొంది యుండినట్లు తెలియనగు. శుద్ధాంధ్రుఁడైన శ్రీనాథుఁడు ‘నా కవిత్వంబు నిజము కర్ణాటభాష’ యనుట చేతను, శుద్ధాంధ్ర దేశమైన కడపమండలము కర్ణాటముగా నీకవి చెప్పుటచేతను గర్ణాటాంధ్ర శబ్దములు పర్యాయములనువారి వాదమే సత్యమేమో.
కవిరత్నాకరమైన యొంటిమిట్ట యీ కవి స్వస్థలమని మీఁద వచించితిని. కవిరత్నములకు రత్నములకు నిజజన్మస్థలంబుల విలువలేదు. కేవల విరక్తుఁడైన బమ్మెర పోతనవంటి సత్కవీశ్వరులు తప్పఁ దక్కినవా రుదరపోషణార్థము గ్రామాంతర దేశాంతరవాసులు కాక తప్పదు. పూర్వము విద్యావంతులను రాజులు సమ్మానించుచుండిరి గావున నట్టి యుదారశీలురైన ప్రభువులుండుచోటికిఁ బండిన చెట్టునకై పక్షులవలెఁ గవులు పోవుచుండిరి. అట్టులె యీకవియు నిజదేశాధీశ్వరుఁడైన రాజు నొద్దకుఁబోయి యాయనయొద్ద నాస్థానకవియై రాయకవి యని పేరుపొంది యచటఁ దత్పతులకుం బ్రీతిగఁ గృతులర్పించి పొట్ట పోసికొనుచుండెను. ఈయన కాలపు రాయలు (విద్యానగర సంస్థానాధిపతి) ౧౪౪౩ సంవత్సరము మొదలు ౧౪౪౨ సంవత్సరము వఱకుండిన ప్రౌఢదేవరాయలై యుండవలయు. ఈయనకు వెనుకను నీకవి జీవించియుండవచ్చును. ఈ రాయల మరణానంతర మీకవి కచ్చటఁ దగిన సమ్మానము లభింపమిఁ గాఁబోలు మరల స్వగ్రామమైన యొంటిమిట్ట కరుదెంచి యీ శతకము రచించెను.
శా. ఆ కర్ణాటక మండలాధిపతిచే నాస్థానమధ్యంబులో నా కావ్యంబులు మెచ్చఁజేసితివి నానారాజులుం జూడఁగా నీకుం బద్యము లిచ్చుచో నిపుడు వాణీదేవి నా జిహ్వకున్ రాకుంటెట్లు? వసించుఁగాక రఘువీరా! జానకీనాయకా!
౩–వ పద్యమును జూచునది.
రాయల యాస్థానకవియని పేర్పొందిన యీ కవి తుదకు
మ. అడుగున్విద్యకు లోనుచేసితివి నన్నావంత నావంతలే కడియాసం గొనుచున్ దురాత్మకుల నే నర్థించుచున్నాఁడ
ననియు,
మ. క్షితిలో నల్పులమీఁదఁ జెప్పిన కృతుల్ ఛీ ఛీ నిరర్థంబులౌ నుతిపాత్రమ్ములుగావు మేఁక మెడచన్నుల్ నేతిబీఱాకులౌ ... ... ... మ. తమ గర్వంబునఁ దారు పొంగిపడుచున్ దైవంబు మంత్రంబు తం త్రములన్ వీడఁగ నాడుచున్ దిరుగు నిర్భాగ్యుల్ మహారాజులై మము నూరింపఁగ నేము నిన్నెఱిఁగి నీ మంత్రం బెఱింగిన్ దరి ద్రమతిన్ వేఁడఁగఁ బోవుటెట్లు రఘువీరా! జానకీనాయకా! మ. పిసినిం జూచి మహాప్రదాతయనుచున్ బీభత్సకుత్సాంగునిన్ బ్రసవాస్త్ర ప్రతిమానరూపుఁడనుచున్ బందం బ్రియంబంద శ త్రుసమూహాంతకుఁ డంచు నెప్పుడు నరస్తోత్రంబు గావించు నీ రసుఁడన్ నిన్ను నుతింపనేర రఘువీరా! జానకీనాయకా!
అని నిర్వేదింపఁ గారణ మేమి కల్గెనో.
ఈ పద్యములు ప్రౌఢదేవరాయలనో తదనంతర ప్రభువునో యుద్దేశించి వ్రాయఁబడినవనుట నిస్సందేహము. సంస్థానాధిపతులయొద్దకుఁ బోయిన కవుల గతులు శోకాలాపములు గాంచికాంచి కాఁబోలు బమ్మెరపోతన
ఉ. ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ బమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్. ఉ. కాటుకకంటినీరు చనుగట్టులపైఁ బడ నేలయేడ్చెదో కైటభదైత్యమర్దనుని గాదిలికోడల! యో మదంబ! యో హాటకగర్భురాణి! నిను నాఁకట గ్రాసము కోసరంబు క ర్ణాటకిరాటకీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ! ఉ. బాలరసాలసాల నవపల్లవ కోమలకావ్యకన్యకన్ గూళల కిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతరసీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదర పోషణార్థమై.
యిట్లు వచించెను. నిష్కారణముగఁ బ్రభువుల దూషించెననుటకంటెఁ బోతన్న పూర్వకవులు రాజుల నాశ్రయించి పడెడిపాట్లు కన్నారఁగాంచి యాచన రోసి యట్లు చెప్పెననుట యుక్తియుక్తముగదా. మహిషశతకోత్పత్తి కిట్టిదేకదా కారణము. అటైనచో నీ గ్రంథము భాగవతమునకంటెఁ గించిత్పూర్వమే రచియింపఁబడి యుండవలయును.
ఈ యభిప్రాయమును దృఢపఱుచు
మ. పరనారీకుచకుంభపాలికలపైఁ బాదాబ్జయుగ్మంబుపైఁ గరమూలంబులపైఁ గపోలతటిపైఁ గంఠంబుపైఁ గొప్పుపై పరువుల్ పాఱెడు నాతలంపులు...... ౬౯ప.
ఈ పద్యమును భాగవతములోని
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ దనువుపై నంసోత్తరీయంబుపైఁ బాదాబ్జంబులపైఁ గపోలతటిపైఁ బాలిండ్లపై.... ౮ స్కంధ. భాగ
యీ పద్యముతోఁ బోల్చిచూచినపుడు మంచి పద్యము దుష్కామపరముగ వినియోగింపఁబడియుండుటకు వగచి భగవత్పరముగఁ బోతన వ్రాసెనని తోఁచెడి. భవభూతి మాలతీమాధవంబున “లీనేవ ప్రతిబింబితేవ” యను శ్లోకరత్నము భగవత్పరము గాకపోయెనని వగచినవారు గలరు గదా.
కవితావిషయ మించుక వచించి యిప్పటికే దీర్ఘతరమైన యీ పీఠికను ముగించెదను. ఈశతకము సర్వజనహృదయంగమమైన మనోహరశైలి వ్రాయఁబడినది. కుదుటఁబడిన ముదురు కవిత్వముగావున సమభూమిని బాఱు గంగాప్రవాహమువలె నేకవిధమైన శైలిగలదై యుడుదుడుకులు లేక సర్వజన శ్లాఘాపాత్రమై యున్నది. ఈయనయు శబ్దాలంకారప్రియుఁడనుటకు ఛందశ్శాస్త్రమర్మజ్ఞుఁడనుటకు ననేకప్రయోగములు గలవు. అయినను ఉదయింపన్ అనుటకు ఉదయించన్ అనియు రమణులన్నశ్వత్థనారాయణయని ద్రుతప్రకృతిసంధియుఁ బ్రయోగించెను. మొదటి దోష మీయనయందేగాక యీయన సమకాలికులగు నితరకవులు కొందఱయందును గలదు. పక్షవాద మందురేమో. రెండవ ప్రయోగమునకు ‘అన్నిష్టసఖి నూఁదియున్నదాని’, ‘ఎన్నఁడున్నేని’ అను భారతప్రయోగములే శరణము. బమ్మెరపోతనయు నిట్టి సంధి కూర్చెను. ఈయన రేఫఱకారములకు యతిప్రాసముల మైత్రిఁ కూర్చెను. అందును మతభేదము గలదుగదా. ఇట్టివి కొందఱు దోషములనినఁ గొందఱు సాధువులందురు. ఇట్టివిగాక లక్షణదోషము లిందెందును గానరావు. కవిత్రయమువారు ప్రయోగించిన దగుటచే నఖండయతి యీ కవియుఁ బ్రయోగించెను. కౌసల్యాపరిణయ టీకయు ఛందోదర్పణముఁ గనుఁడు.
ఈ గ్రంథము వ్రాఁతప్రతి దోషభూయిష్ఠమై యున్నది. అవి లేఖకుల యజ్ఞానకృతములు ప్రమాదపతితములై యున్నవి. కవిహృదయమని తోఁచినవి నా మతమునఁ దప్పైనను నట్లే యుంచి తక్కినవానిని సవరించితిని.
మ. మును నాకెన్నఁడు దోషముల్ గలవు నొప్పిం బొందకే మని కాలుబంటులిఁక నన్నాపేరు నాపేరు పె ట్టినవానికిన్ బరలోకదూరుఁడని వప్పేదెట్లు పొండంచు
అను పద్య మిట్లే కవి వ్రాసెనని యేమతిమంతుఁ డనును?
ఇంకను దోషము లిం దెందేని గాననగు. విజ్ఞులు క్షమింతురుగాక.
వ్రాఁతప్రతి సిద్ధముచేయించి చిత్తుప్రతియు సవరించి యిచ్చిన నా మిత్రులు బ్ర॥శ్రీ॥రా॥శ్రీ॥ క్రొత్తపల్లి సూర్యారావు పంతులుగారికిఁ గృతజ్ఞతాపూర్వక వందనము లర్పించుచున్నాఁడను.
వావిలికొలను సుబ్బఁడు
వాల్మీకాశ్రమము,
ఒంటిమిట్ట,
15–12–1921
(బ్రిటిష్ మోడల్ ప్రెస్. చూలై. మద్రాస్ – 1921).
![]() |
![]() |