వచన సాహిత్యము | పీఠికలు | ఆముఖము |
ఆముఖము
(‘సుగ్రీవవిజయము’ (1973) పీఠిక - డా. జి.వి. సుబ్రహ్మణ్యం)
గాన మనినతోడనే మనకు స్ఫురించువారు యక్ష కిన్నర గంధర్వులు. పాటకు వారి ఫణితులే పరమప్రమాణములు. అందు గాంధర్వవిద్య దేవలోకమున వర్తించునది యని సంగీతశాస్త్రజ్ఞుల యభిప్రాయము. శాస్త్రీయసంగీత పద్ధతిలో నది నరుల కందని మ్రానిపండువంటిది. ఈ యంశమును పింగళి సూరన కళాపూర్ణోదయ ప్రబంధమున నారదతుంబుర గానమాత్సర్య వృత్తాంతమున సూచించి యున్నాఁడు. దేవర్షియైన నారదుఁడు గంధర్వుఁడైన తుంబురుని గాంధర్వసంగీతవిద్యాపాండిత్యమున మించుటకై దైవాంశసంభూతుఁడైన శ్రీకృష్ణుని శిష్యత్వము నెఱపిన ట్లా కథలో వర్ణింపఁబడినది. అనఁగా గాంధర్వసంగీతవిద్య మార్గసంగీతమునకుఁ బరాకాష్ఠయను తాత్పర్య మేర్పడుచున్నది. అయినచో యక్షకిన్నర సంగీతఫణితు లెటువంటివి? అను మీమాంస వచ్చును. కిన్నరులు సామాన్యముగా విజయగీతములను, శృంగారగీతములను సామూహికముగా (Chorus) గాని, జంటలు జంటలుగాఁ గాని పాడుచుండుటను వర్ణించుట ప్రాచీన సంప్రదాయము. గంధర్వులు శుద్ధరాగప్రస్తారకులైనచోఁ గిన్నరులు గేయగానకోవిదు లనఁదగియున్నారు. అనఁగా గంధర్వసంగీతమునందుకంటె కిన్నరగానమునందు సాహిత్యస్పర్శ యెక్కువ యని యూహింప వీలగుచున్నది. యక్షులు గంధర్వకిన్నరులవలె శుద్ధరాగ గేయగానములందే కాక నృత్యాభినయములందును బ్రావీణ్యము కలవారుగాఁ గానఁబడుచున్నారు. యక్షులు కామరూపులని ప్రసిద్ధి. కోరిన రూపములను ధరించి పాత్రోచితముగా నాట్యము చేయుచు గానమొనరించు నేర్పు వారికి వెన్నతో వచ్చిన విద్య. యక్షులయందు గంధర్వ కిన్నరాదులందుకంటె రూపకప్రక్రియ రూపుకట్టుట కనువైన గానఫణితి వెలయుట కవకాశమున్నది. కావున యక్షగాన మనఁగా నృత్త-నృత్య-నాట్యాభినయ విశిష్టమైన గానమనియు, సంగీతరూపక సంప్రదాయమునకు మూలబీజమనియు మనము భావింపవచ్చును.
యక్ష ప్రశంస వేదవాఙ్మయమునుండి వినవచ్చుచున్నది.
‘‘యేన కర్మాణ్యపసో మనీషిణో
యజ్ఞే కృణ్వంతి విదధేషు ధీరాః
యదపూర్వం యక్షమంతః ప్రజానాం
త న్మేమనః శివసంకల్ప మస్తు”[1]
ఇత్యాది వేదమంత్రము లందులకుఁ బ్రమాణములు. తరువాత బ్రాహ్మణ-బౌద్ధ-జైన సారస్వతములయందును యక్ష ప్రశస్తి కలదు. జైమినిబ్రాహ్మణమునందు విచిత్రమైన వస్తువను నర్థమున యక్షశబ్దము వాడఁబడిన దనియు, గుహ్యసూత్రములలో భూతాదులతో పాటు యక్షావాహనముగూడ కలదనియు. వారు రోగగ్రహావేశశక్తులుగాఁ బేర్కొనఁబడిరనియు, బౌద్ధసారస్వతమున యక్షులు నీతి ప్రవర్తకులుగాను, రక్షకశక్తులుగాను గీర్తింపఁబడిరనియు, బౌద్ధశిల్పములందు యక్షయక్షిణీ ద్వారపాలక ప్రతిమలు గానవచ్చుచున్నవనియు, జైన సారస్వతమునందు వారు కామరూపులుగను, దయాళువులుగను, రక్షణచణులైన రణశూరులుగను ప్రశంసింపఁబడిరనియు, వాల్మీకిరామాయణమున యక్షత్వ మమరత్వమువలె దివ్యపదమనియు, భారతమున యక్షులు ధర్మపరాయణులనియు, జిజ్ఞాసువులనియు, శైల-జల-వనదేవతలనియు సూచింపఁబడినదనియు, భట్టికావ్యమున యక్షులు స్తోత్రపాఠకులనియు, కాళిదాసుని మేఘసందేశమున నృత్య-గీత-సంగీత ప్రియులనియు, బ్రాహ్మణ-బౌద్ధ-జైన సారస్వతములందు వారు మహిమాన్వితులుగను, దేవయోనులుగను,మాయావిద్యానిపుణులుగను, రాక్షసకల్పులైన రాజసశక్తులుగను, కుబేరానుయాయులుగను బేర్కొనఁబడిరనియు విమర్శకులు తెలిపి యున్నారు.[2]
‘రామాయణమున దక్షిణ హిందూదేశ’ మను వ్యాసమున శ్రీ వి.ఆర్.ఆర్. దీక్షితారుగారు యక్షులు పూర్వము సింహళమున రాజ్యమేలుచుండిరనియు, బలిచక్రవర్తి సేనానియగు సుమాలి వారి నోడించి యచ్చట రాక్షసరాజ్యము స్థాపించెననియు, రాక్షసరాజ్య మంతరించిన తరువాత మఱల యక్షులు సింహళమున రాజ్యమును స్థాపించుకొని క్రీ. పూ. 5వ శతాబ్దివఱ కచ్చట పరిపాలనము సాగించిరని ‘మహావంశ’మను గ్రంథమువలన దెలియుచున్నదనియు, వారు రాక్షసవంశశాఖకుఁ జెందినవారనియు వ్రాసి యుండిరి. మఱికొన్ని గ్రంథములవలన యక్షప్రభువైన కుబేరుఁడు లంకాధిపతి యనియు నతనిని రావణుఁ డోడించి రాజ్య మాక్రమించుకొనఁగా, నాతఁడు సపరివారుఁడై దక్షిణ భారతదేశమునకు వలస వచ్చెననియుఁ దెలియుచున్నది. దీనిని బట్టి యక్షులు దేవయోనులే కాక మానవులవలె భౌమజీవులనియు స్పష్టమగుచున్నది. ఈ యంశములను బలపఱచు కథాసాక్ష్యములను బ్రహ్మవైవర్త, శివపురాణముల నుండియు, ఉత్తరరామాణమునుండియు విమర్శకులు చూపించుచున్నారు.[3]
కుబేరవంశీయులైన యక్షులకును, ఆంధ్రులకును సంబంధబాంధవ్యము లున్నవని శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు పేర్కొనుచున్నారు: “ప్రత్యేకించి కళింగరాజ్యాధినేత అయిన అరిందముని కుమారుఁడుగా, దముఁడుగా పుట్టాడన్న విషయం చూస్తే ఆంధ్రులకు, కుబేరుడికీ, కుబేరజాతికీ సంబంధం ఉండి తీరాలన్న విషయం తేటతెల్లమవుతోంది. కళింగులు, ఆంధ్రులు భిన్నులన్న అభిప్రాయం కొందరిలో వున్నా ఒకవిధంగా వీరు ఆగర్భసోదరులే ! విశ్వామిత్ర శాపదష్టులైన పుత్రులు ఆంధ్రులయ్యారని కథవున్నా ప్రముఖ వేదఖగోళశాస్త్రజ్ఞుడైన మహర్షి దీర్ఘతముని (మామతేయుడు) పౌత్రులుగా కూడా ఆంధ్రజాతి ఒకటి ఉన్నట్లు స్పష్టమౌతున్నది. ‘బలి భార్య అయిన సుధేష్ణకు దీర్ఘతమ మహర్షి సంయోగానుగ్రహంతో అంగరాజు జన్మించాడు. ఈ అంగరాజుకు వంగ, కళింగ, సింహ, ఆంధ్రపుత్రులు కలిగారు’ అని భారత భాగవతాలు పేర్కొన్నాయి. కాగా వంగులు, కళింగులు, సింహులు, ఆంధ్రులు అన్నదమ్ములన్నమాట! ఒక తండ్రి బిడ్డలే నన్నమాట! దీర్ఘతముని వంశీయులైన కళింగులు పాలించిన దేశాధీశుఁడైన అరిందమునికి పుత్రుడై పుట్టిన దముడు కుబేరుఁడై అలకాధిపత్యాదులు పొందినా కళింగుడే కదా! తొలుత పరిస్థితి ఏమైనా కళింగాంధ్రాలు దేశపరంగా వొక్కటే. మఱి యక్షరాజైన కుబేరుఁడు ఒకప్పుడు సరిహద్దుదేశమైన కళింగదేశంలో వున్నా ఆంధ్రుల సోదరుడుగా తరువాతి ఆంధ్రదేశంలో ఉన్నట్లేకదా! కాగా అత్యంత ప్రాచీనకాలంలోనే దేవయోనిభేదజీవులైన యక్షులతో కళింగాంధ్రులకు సంబంధబాంధవ్యాలున్నట్లు విస్పష్టంగా అర్థమవుతున్నది. దీర్ఘతమ మహర్షి వంశీయులైన వంగ, కళింగ, సింహాంధ్రుల విషయమూ, కళింగాధిపుడైన అరిందముని పుత్రుడైన దముని కుబేరత్వ విషయమూ తమ దృష్టికి రానందువల్ల కాబోలు, కీర్తిశేషులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు ‘యక్షులు’ ‘ఆక్షస్’ (Oxus) నదీప్రాంతంవారో, లేదా ‘యఛి’ (yuchi) అనే మంగోల్జాతివారో అయి వుంటారని కొన్ని అభిప్రాయాలున్నట్లు ప్రతిపాదించారు.
క్రీ.పూ. 3, 4 శతాబ్దములలో వెలసిన వాత్స్యాయన కామసూత్రములందు ‘యక్షరాత్రి’ ప్రసక్తి కలదు. అది యొక ద్యూతక్రీడ యని యశోధరుని జయమంగళవ్యాఖ్య వివరించినది. యక్షరాత్రి కీ వ్యాఖ్యానము ననుసరించి అక్షరాత్రి యను భావమేర్పడుచున్నది. పక్షరాత్రి యను పాఠభేదము కూడ కలదని కొందఱి యభిప్రాయము. జయమంగళుని వ్యాఖ్య నిర్దుష్టము కాదనియు, యక్షరాత్రి పదము ద్యూతక్రీడ యను నర్థమున వాడఁబడలేదనియుఁ దైవారాధనపరమైన యుత్సవపరముగాఁ బేర్కొనఁబడినదనియు కొందఱు భావించుచున్నారు.
క్రీ.శ. 11, 12 శతాబ్దములలో నున్న హేమచంద్రుఁడు తన దేశీనామమాలలో యక్షరాత్రికి ప్రాకృతరూపమైన ‘జక్ఖరత్తీ’ యను శబ్దమునకు దీపావళి యను నర్థము చెప్పియున్నాఁడు. నేపాళదేశమున ధనాధిదేవతయైన లక్ష్మీదేవికి దీపావళినాఁడు పూజలు జరుగుననియు, నందు జూదముల తిరునాళ్ళు జరుపుకొను నాచారము కలదనియు నను నంశము దాని కుపబలకముగా నున్నది.
కర్ణాటక యక్షగాన పరిశోధకులు శ్రీ యం. గోవిందరావుగారు కన్నడదేశమునందలి దక్షిణ కనరా మండలమున గల మందర్తి, మర్నకట్టె, కటిల్, ధర్మస్థల దేవాలయములందు యక్షగానమేళములవారు దీపావళినాడు తమ యిష్టదైవములనుగూర్చిన యుత్సవములు చేసికొను నాచారము కానవచ్చుచున్నదని పేర్కొని యుండిరి. శ్రీ ముళియ తిమ్మప్ప యను మఱియొక కన్నడవిమర్శకుఁడు కుబేరుఁడు బలిచక్రవర్తి నుండి లంకారాజ్యమును దిరిగి పొందిన సందర్భమును దీపావళి పండుగగా జరుపుకొను నాచారము కలదని తెలిపియుండిరి.
వీరి వాదమును గొంద ఱంగీకరించుట లేదు. శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు యక్షిణులలో తులసియక్షిణి శక్తిమంతమైనదని మంత్రశాస్త్ర ప్రసిద్ధమనియు, కార్తిక పూర్ణిమనాఁడు జరుగు తులస్యుద్వాపన మహోత్సవమునే యక్షులు పండుగగా జరుపుకొనువారనియు, దానికి యక్షరాత్రి యను పేరు వచ్చియుండవచ్చుననియు భావించిరి. మొత్తమునకు యక్షరాత్రి యను సంప్రదాయము యక్షు లొనర్చుకొను ఉత్సవవిశేషమనియు, నది దీపావళి కావచ్చుననియు, నందు వారు నృత్యగీతాదులతోడనే కాక, ద్యూత క్రీడాదులతోఁ గూడ వేడుకలు జరుపుకొనుచుండెడివారనియు, నట్టి సంప్రదాయము గుజరాతు, మార్వారు, నేపాలు, కర్ణాటక ప్రాంతములయందు వ్యాపించియున్నదనియుఁ దెలియుచున్నది.
‘విద్యాధరోఽప్సరో యక్షో రక్షో గంధర్వకిన్నరాః,
పిశాచో గుహ్యక స్సిద్ధో భూతోఽమీ దేవయోనయః’
యక్షులు విద్యాధరాదులవలె దేవయోనులే కాక గానలోలులు.
‘‘యక్షాశ్చ నాగాఽపి కిన్నరాశ్చ
గాంధర్వముఖ్యాఽపి గానలోలాః”
గానలోలుపత్వముతో పాటు కామరూపత్వము వారి ప్రత్యేకలక్షణము. ఇట్టి దేవయోనులు భౌమజీవులునై యుండిరనుటకుఁ దార్కాణములు వెనుక చూపఁబడి యున్నవి. కాని, భౌమజీవులైన యక్షులు క్షాత్రధర్మము నెఱపినట్లు కానఁబడుచున్నది. మానవరాజవంశములందు యక్షరాజవంశము లను ప్రత్యేక ప్రసిద్ధి కానవచ్చుట లేదు. అట్లగుటచే యక్షగాన ప్రవర్తకులైన యక్షులెవరను ప్రశ్న యుదయింపఁగలదు.
నృత్యగానలోలులై బహురూపప్రక్రియను జీవికకై స్వీకరించి జీవించు నొకజాతివారికి యక్షనామము ప్రసిద్ధమై అన్వర్థముగా నిలచియుండవచ్చు ను. అట్టి జాతులు కర్ణాటాంధ్రదేశములం దున్నట్లు నిదర్శనములు కానవచ్చుచున్నవి.
‘యక్ష’ శబ్దమునకు వికృతులుగాఁ గన్నడమున ‘ఎక్క’యు, తెలుగున ‘జక్క’యుఁ గానఁబడుచున్నవి. కన్నడకవులలో అభినవపంపఁడు, అగ్గళుఁడు ‘ఎక్కలు’, ‘ఎక్కలగాణలు’ అను శబ్దములను, రత్నాకరవర్ణి ‘ఎక్కడిగలు’ అను శబ్దమును వాడియుండిరి. ఆంధ్రకవులు యక్షశబ్దమునకు మారుగా జక్కులు, జక్కిణి శబ్దములను వాడియుండిరి. ‘జక్కువీడు’ (జక్కులజాతివాఁడు), ‘జక్కులఱేడు’ (కుబేరుఁడు) మొదలగునవి యిట్టివి. ‘జక్క’ శబ్దప్రయోగవిచారము చేయుచు శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగా రిట్లు వ్రాసియున్నారు:
“జక్కి శబ్దానికి గుర్రం అనీ, ‘కట్టుపడిపోవటం’ అనీ అర్థాలున్నా యి. చివరికి ‘జక్కిమోర’ అన్న శబ్దం తెలుగులో(అశ్వముఖులకు) కిన్నరుల కుపయోగించారు పూర్వులు. ‘జక్కిఒడలు’ వంటి పదాలను రూపొందిస్తే కింపురుషులు (నరముఖం, అశ్వశరీరం కలవారు) అని కూడా అర్థం వస్తుంది. జక్కులు బహువచనరూపం చూస్తే దాని ఏకవచనరూపం విస్తృతవ్యవహారంలో లేకపోయినా ‘జక్కి’ ఉన్నదని స్పష్టపడుతుంది. అసలు ‘యక్ష’ శబ్దమే ‘యక్షి’ అయి ‘జక్కి’గా మారిందని స్పష్టంగా అర్థమవుతున్నది. యక్షిణీవిద్య అని ‘యక్షిణి’ అని కనికట్టువిద్యపట్ల, ఇంద్రజాలంపట్ల ఉపయోగిస్తాము. లేనిదానిని ఉన్నట్లు చూపడం కనికట్టువిద్య లక్షణం. యక్షుల కామరూపత్వం ఇటువంటి విద్యలన్నింటికీ మూలమనడంలో సందేహం లేదు. ‘జక్కి’ అంటే ‘కట్టుపడిపోవటం’ అని తెలుగులో అర్థం ఉన్నదని పేర్కొన్నాను. దానికి మూలరూపమైన ‘యక్ష’ శబ్దానికి కూడా“కట్టి వేసేవాడు’ అని అర్థం ఉన్నది. వివిధవిద్యలతో పాటు నృత్యగానాది విద్యలతో కూడా కట్టివేయగలవారు- తన్మయాంబుధిలో ముంచగలవారు- కాబట్టే వారికి ‘యక్షు’లన్న పేరు వచ్చివుండవచ్చు.”[4]
‘యక్ష' శబ్దవాచ్యులైన దేవయోనులయందుఁ బ్రకటితములగు నృత్యగానాది లక్షణవిశేషములు వృత్తులుగా గలిగిన మానవులలో నొకజాతిని యక్షులనియు, ఎక్కులనియు, జక్కులనియు పిలుచుట పరిపాటియైనదని పై శబ్దవిచారముల వలన మనము సులభముగా గ్రహింపవచ్చును. కన్నడదేశమున ‘ఎక్కడిగలు, ఎక్కడిగాణలు’ అని పిలువఁబడు నీ తెగవారు నేఁడు కానవచ్చుట లేదు. కాని ఆంధ్రదేశమున గుంటూరు గోదావరి మండలములందు ‘జక్కులజాతి’ వారు కానవచ్చుచున్నారు.
‘జక్కులు - జక్కిణి’ శబ్దములు జాతిపరముగా నన్వయించుటకు తగిన ప్రమాణములను జూపించుచు ఆచార్య యస్వీ జోగారావుగారు వ్రాసిన యంశముల నిచ్చట పొందుపఱచుచున్నాను:
“వీరిని గుఱించి ఇ. థర్స్టన్ (E. Thurston) వ్రాసిన ‘Casts and Tribes of South India’ అను గ్రంథము ద్వితీయభాగము 438వ పుటలో నిట్లున్నది.
‘Jakkula- Described as an inferior caste of prostitutes, mostly of Balija caste; and as wizards and a dancing and theatrical caste. At Tenali in Kristna District, it was customary for each family to give up one girl for prostitution’ etc.
దీనినిబట్టి జక్కులవారికి నాట్యకళతో సంబంధముండినట్లు విశదమగుచున్నది. కళావంతు లనిపించుకొనువారియెడ నట్టి సంబంధము సహజము. వారి కొలము బిరుదు సార్థకము. మార్వారు గంధర్వుల సామ్యమున నీ జక్కులవారు తొల్లి మతప్రచార నిమిత్తముననో లేక యది యొక ప్రధానవృత్తిగా నవలంబించియో యక్షగాన ప్రవర్తకులైనవారెల్లఁ గాలక్రమమునఁ గలిసి యేర్పడిన జాతి యనియు, వారి వృత్తికి సంబంధించిన యక్ష (జక్క) శబ్దము తరువాత వారికి జాతివాచకముగాఁ బరిణమించియుండుననియు నూహింపవచ్చును.”
“ఆంధ్రదేశమున జక్కులవారి ప్రశస్తి చిరకాలానుగతముగా వినవచ్చుచున్నది. ఈనాఁడు రాయలసీమలో నున్న జక్కసానికుంట్ల (కర్నూలు జిల్లా, పత్తికొండ తాలూకా), జక్కుల చెఱువు (గుత్తి తాలూకా), జక్కల చెఱువు (పెనుగొండ తా.) జక్కసముద్రము (హిందూపురం తా.) జక్కులాడికి (బళ్లారి జిల్లా) మొదలగు గ్రామనామములు ప్రాచీనకాలమున నాయాప్రాంతమునందలి జక్కులజాతి ప్రాచుర్యమును సూచించును. అందు కొన్ని గ్రామము లొకప్పుడు వారి కీనాములుగా నీయఁబడినట్లు స్థానికమైన ప్రతీతి కలదు. క్రీ.శ. తే. 9-6-1481న జక్కుల కన్నాయి యనునామె తిరుమల దేవస్థానమున వేయించిన శాసన మొకటి కలదు.[5] అది క్రీ.శ. 15వ శతాబ్దినాఁటి జక్కులవారి ప్రాభవమును సూచించును.”
“వివిధజాతుల యుత్పత్తుల గుఱించి యైతిహ్యము లనేకము చిత్రచిత్రములుగా విశ్రుతము లగుచుండును. అట్లే యీ జక్కులవా రసలు యక్షస్వరూపులే యైనట్లొక గాథ కలదు. క్రీడాభిరామమున ‘కామవల్లీ మహాలక్ష్మి కైటభారి, వలపు వాడుచు వచ్చె జక్కుల పురంధ్రి’ యని యున్నది. దానికిఁ గామెపల్లివారి వీథిభాగవతములోని లక్ష్మీనారాయణుల ప్రణయఘట్టమును బాడుచు వచ్చినది జక్కులపురంధ్రి యని కొంద ఱపవ్యాఖ్యానము గావించిరి. ఆ కామవల్లియే ‘కామేశ్వరి పాట’యను స్త్రీలపాటలోని కామేశ్వరి యని యా కామేశ్వరి కథను కీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు క్రీడాభిరామ పీఠికలో వివరించి యున్నారు. ఈ కథలో మహాలక్ష్మి శాపవశమునఁ బార్వతికి సద్యోగర్భమున సప్తకన్యకలుగా నుద్భవించినదని యున్నది. అందొకతె పేరు ‘జక్కులమ్మ’ యఁట. కామవల్లి కడగొట్టుది. ... ఆ సప్తకన్యలనే ‘అక్కలు’ లేక ‘అక్కదేవత’ లందురు. ... ... క్రీడాభిరామమునఁ గామవల్లి వలపు వాడుచు వచ్చిన జక్కుల పురంధ్రి ప్రశంస వెంట ‘అక్కల’ కొలువు వర్ణింపఁబడినది. ఒక గృహస్థు సంతానార్థియై వారి నారాధించినట్లును, నా సందర్భమున అక్క లేడుగురును లేచి యాడిరనియు, నా యక్కలే ‘యక్షకన్య’లనియు (అనఁగా నిఁట జక్కుల పడుచులనియు) జెప్పఁబడినది. యక్షశబ్దమునకు- ‘జక్క’, ‘ఎక్క’ అను రూపాంతరములే గాక ‘అక్క’ యను రూపవికృతియు నంగీకార్యమే యనియు, నది భాషాశాస్త్రసమ్మతమే యనియు ఆచార్య శ్రీ గంటి జోగి సోమయాజిగా రనుచున్నారు.”[6]
జక్కులపాట యను సమాసమే సంస్కృతీకరింపఁబడి యక్షగాన మయ్యెనని కీ. శే. పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారి వాదము. విమర్శకులు దీనిని పూర్తిగా నంగీకరించుట లేదు. యక్షగానమను పదమే ముందేర్పడి యది ‘జక్కులపాట’గాఁ బరిణమించినదని పేర్కొనుచు శిష్ట వ్యవహారమున ‘యక్షగాన’మనియు, జనసామాన్య వ్యవహారమున ‘జక్కులపాట’ మొదలగు రూపములందును బ్రచురిత మయ్యెనని భావించుచున్నారు.
శ్రీనాథుఁడు భీమఖండమున ‘కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగానసరణి’ యని ‘యక్ష గాన’ శబ్దమును వాడి యదియొక గానసరణి యని సూచించినాఁడు. ‘యక్షోఘ గీత మపి గానశైలీమ్’ అని సంగీతసుధ యక్షగాన మొక గానశైలి యని పేర్కొనినది. ఆంజనేయకృతమగు నొక ప్రాచీనలక్షణగ్రంథమున యక్షగానశైలి ప్రశంస కలదని యందురు కాని ప్రస్తుత మా గ్రంథము లభించుట లేదు. అట్లగుటచే యక్షగానసరణిని గాని శైలిని గాని గుర్తించుటకు మనకు వీలుపడుట లేదు. ఈ నడుమ కళాప్రపూర్ణ శ్రీవడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు ‘యక్షప్రియ’ రాగపరమైన రచనయే క్రమముగా యక్షగాన మయ్యెనని వ్రాసియున్నారు.[7] అంతేకాక ‘అసలు యక్షగానమంటే యక్షుల గురించి చేసే గానం, యక్షులు చేసే గానం, యక్షులు గానం చేసినట్లు చేయబడే గానం అని అర్థాలు. యక్షులు చేసే గానం యేదైనా కావచ్చు. వారి ననుకరించి చేసేది యేదైనా కావచ్చు. యక్షుల గురించి చేసేది అంటే యక్షుల ప్రీతికై చేసే గానం కావచ్చు. కేవలం యక్షుల గాథలే గానం చేసేదీ కావచ్చు. యక్షుల ప్రీతికి యక్షుల గాథలే కాక యితర గాథలూ వారి కిష్టమైనవి గానం చెయ్యవచ్చును. ఈ దృష్ట్యా గానయోగ్యమైన ప్రబంధం యేదైనా సరే కావ్యమేదైనా సరే ‘యక్షగాన’ మనడానికి సమర్హమైన దన్నమాట’ అని యక్షగాన శబ్దార్థాలను విస్తరించి నిరూపించినారు.
‘యక్షగాన శబ్దార్థమునుగూర్చి శ్రీ యం. గోవిందరావుగారు తమ వ్యాసమున లడ్విగ్, గెల్డ్నర్ అను పాశ్చాత్య పండితు లిరువురు యక్ష శబ్దమునకు ‘ఉత్సవము’ (Festivity) అను నర్థము చెప్పినారనియు, నది గాని యంగీకార్య మగుచో యక్షగాన మనఁగా నొక యుత్సవసమయమునఁ జేయఁబడు సంగీతగోష్ఠి యని చెప్పవచ్చునని యన్నా’ రని ఆచార్య యస్వీ జోగారావుగారు పేర్కొని యుండిరి.
యక్షగానము స్వభావముచే గానప్రధాన మయ్యును, స్వరూపముచే రూపకప్రక్రియావిశిష్టమై తెలుఁగు సాహిత్యమున గానవచ్చుచున్నది గానముగాఁ బ్రారంభమై నృత్యాభినయవిశిష్టముగాఁ బెంపుఁ గాంచిన దేశిరూపకరచనా విశేష ప్రక్రియ యక్షగానము.
బ్రాహ్మణ-బౌద్ధ-జైన సారస్వతములందుఁ గానవచ్చు యక్షుల గానమెట్టిదో మనకుఁ దెలియరాదు. బౌద్ధులు జైనులు మతప్రశస్తిని జాటు కథలను, గాథలను బ్రాకృతాది భాషలలో గీతములుగనో, రూపకములుగనో యక్షపాత్రల చేతఁ బాడించి యుండవచ్చును. కాని, యట్టివి మన కిప్పు డలభ్యములు. కన్నడ విమర్శకులు కొందఱు ‘బెదండె’, ‘చత్తాణము’ లనెడి కావ్యభేదములు, యక్షగాన సదృశములనియు క్రీ.శ. 9 శతాబ్దినాటికే అవి కానవచ్చుచున్నవనియు పేర్కొనినను వానికి లక్ష్యములైన గ్రంథములు దొరుకుట లేదు. కవిరాజమార్గలక్షణానుసారము వాని స్వరూపములను భావించినచో నవి యక్షగానముల వంటివనుటకు వీలు లేకున్నది.
క్రీ.శ. 12వ శతాబ్దమున కన్నడ సాహిత్యమున వెలసిన చంద్రప్రభా పురాణమునందును, మల్లినాథ పురాణమునందును ‘ఎక్కలగాణ’ల ప్రసక్తి వినవచ్చుచున్నది. అగ్గళుడు రచించిన చంద్రప్రభా పురాణమునందు వనవిహారము చేయుచున్న నాయకుఁడు మేళతాళములతో నిమిత్తములేకయే దేశీయగీతము నొక ‘ఎక్కలగాణ’ యింపుగాఁ బాడుచుండ వినుచుండెనని వర్ణింపఁబడినది. అభినవపంపని మల్లినాథ పురాణములో కమలామోదియైన తుమ్మెద ఝంకారము కమలాలయయైన లక్ష్మిని గీర్తించుచు పాడెడు ‘ఎక్కల’ గానముతోఁ బోల్చి వర్ణింపఁబడినది. ఆ పురాణమునందే ‘యక్షాందోళన’మను యక్షిణి నాట్యము ప్రస్తావింపఁబడినది. ఆ యాందోళికానృత్యమును గూర్చి వివరించుచు శ్రీముట్నూరి సంగమేశముగా రిట్లు వ్రాసిరి: “కన్నడ యక్షగానాల్లో నటివేషాన్ని యక్షిణీవేషమనీ, శ్రీవేషమనీ, మోహినీ వేషమనీ పరిపరివిధాల పిలుస్తారు. ఈమె మొదటిసారి రంగస్థలానికి వచ్చినప్పుడు నడుము వరకు అట్టతో కట్టిన ఒక తొట్టెవంటి చౌకంలో నిల్చి నృత్తగతులు ప్రదర్శిస్తుంది. ఈ నృత్తాన్ని ఆందోళికానృత్యమనీ మంచెచప్పరనృత్యమనీ పిలుస్తారు.” ఇట్టి యక్షాందోళన నాట్యమునకును ప్రాథమికాంధ్ర యక్షగానమునకును గొంత సంబంధ బాంధవ్య ముండి యుండవచ్చు నని విమర్శకులు భావించుచున్నారు.
ఆంధ్రసాహిత్యమున ‘యక్షగాన’ ప్రశస్తి స్పష్టముగా వినవచ్చినది శ్రీనాథుని భీమఖండముననే.
“కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు
గాంధర్వమున యక్షగాన సరణి”
(భీమఖ. 3.65)
అది క్రీ.శ. 1430 ప్రాంతము. అంతకుఁ బూర్వము పాల్కురికి సోమనాథుని (క్రీ.శ. 1280-1340) పండితారాధ్య చరిత్రమున యక్షపాత్రల నేపథ్యములతోడి యాటపాటల ప్రసక్తి కానవచ్చుచున్నది. అందలి పర్వతప్రకరణమున శివరాత్రిజాగరమునఁ బ్రవర్తిల్లెడి బహువిధములైన వినోదములను వివరించుచు.
‘‘ఆదట గంధర్వ యక్ష విద్యాధ-
రాదులై పాడెడు నాడెడువారు (?)
విధమునఁ బ్రచ్ఛన్నవేషముల్ దాల్చి
యధికోత్సవము దులుకాడునట్లు”
కొంద రాడెడివారని వర్ణించెను. దీనివలన గంధర్వయక్షాదుల వేషములను ధరించి పాడుచుండెడివారివలెఁ బ్రచ్ఛన్నవేషములను దాల్చి రూపకవిశేషములను బ్రదర్శించెడి యాచార మొకటి యప్పటికే ప్రసిద్ధమై యున్నదని స్పష్ట మగుచున్నది. బౌద్ధ-జైన మతప్రచార సాహిత్యములం దట్టి యక్షపాత్రలు ధరించి గూడెడివా రుండియుండవచ్చును; లేక జక్కులజాతివంటివారు ప్రదర్శించు యక్షగానములు వెలసియుండి యుండవచ్చును. వారి ననుసరించుచు నాడిన యాట లిందు ప్రసక్తములై యున్నవి. వానితో పాటు నాటకములు, బహురూపములు, వెడ్డంగము, తోలుబొమ్మలాటలు మొదలగు రూపకప్రక్రియలును, తెరలు, వేషధారణ విశేషములు, సంగీతపు హంగులు, అభినయభంగులు మొదలగు నెన్నియో విశేషములును వర్ణింపఁబడినవి. అనగా నన్ని రూపకప్రక్రియల యందును యక్షాదిరూపధారణములతోఁ బాడుచుండెడు రూపకప్రక్రియయు నొకటి ప్రసిద్ధమని స్పష్టమగుచున్నది. అట్టిది నేటి యక్షగానప్రక్రియకు మూలకందమై యుండుననుటలో విప్రతిపత్తి లేదు. ఆ ప్రక్రియ కట్టి ప్రసిద్ధి, ప్రచారములు రావలయునన్నచో నా కాలమునఁ గనీస మొక రెండు శతాబ్దులకుఁ బూర్వమే యది యుత్పత్తియై యుండవచ్చును. కావున యక్షగానముల ప్రాథమిక స్వరూపము తెలుగున క్రీ.శ. 1000 సం|| నాఁటికే వెలసియుండెనని యూహించుటకు వీలగుచున్నది.
కాని, యప్పటినుండియు శ్రీనాథుని కాలము వఱకు గల మధ్యకాలమున నెట్టి యక్షగానములు రచింపఁబడినట్లు కానరాదు. ఒకవేళ రచింపఁబడియున్నను నేఁడు మనకు లభ్యమగుటలేదు. శ్రీనాథుని క్రీడాభిరామము వీథి యను రూపకవిశేషము. అది ప్రేమాభిరామమున కనువాదము. అందు జక్కులపురంధ్రి పాట పాడుట వర్ణింపఁబడినది.
సీ. “కోణాగ్ర సంఘర్ష ఘుమఘుమధ్వని తార- | కంఠస్వరంబుతో గారవింప
మసిబొట్టు బోనాన నసలు కొల్పిన కన్ను- | కొడుపుచేఁ దాటించు నెడప దడప
శ్రుతికి నుత్కర్షంబుఁ జూపంగ వలయుచోఁ | జెవిత్రాడు బిగియించు జీవగఱ్ఱ
గిల్కుగిల్కున మ్రోయు కింకిణీగుచ్ఛంబు | తాళమానంబుతో మేళవింప
రాగముననుండి లంఘించు రాగమునకు | నురుమ యూరుద్వయంబుపై నొత్తిగిల్లి
కామవల్లీ మహాలక్ష్మి కైటభారి | వలపు వాడుచు వచ్చె జక్కుల పురంధ్రి.”
-క్రీ.రా. 135
దీనితోపాటు ‘అక్కల’ (యక్షకన్యల) యాటయు నందు వర్ణింపఁబడి యున్నది. దీనిని గమనించినచోఁ బాల్కురికి సోమనాథుని కాలమునకుఁ బూర్వమే పాత్రలచే నాటపాటల రూపమునఁ ప్రయోగింపఁబడు యక్షగానప్రక్రియ జక్కులవారిచేఁ బరిపోషింపఁబడుచుండెననియు, నదియే కాలక్రమమున నా జాతివారలలో నొక విశిష్టగానసరణిగా, నేకపాత్రముచే శ్రుతితాళరాగసమన్వితమై, వాద్యోపకరణసహితమై, కథాఖ్యానయుతమై నృత్యానుకూలముగా ప్రయోగించు నాట్యప్రక్రియగా విస్తరించెననియు స్పష్టమగుచున్నది.
క్రీ.శ. 1537 ప్రాంతమున తాళ్లపాక చినతిరుమలాచార్యులు తన తాతయగు తాళ్లపాక అన్నమాచార్యుని (క్రీ.శ. 1408-1503) సంకీర్తనలక్షణము నాంధ్రీకరించుచు దరువులు, జక్కుల రేకులు[8], ఏలలు చందమామపదములు మొదలగువాని నెఱిఁగించి యా వరుసలోనే
“యక్షగానపదంబులు నవ్విధమున
సముచితానేకవిధ తాళసంగతులును
నవరసాలంక్రియాసవర్ణంబు లగుచు
నలరు నని హరికీర్తనాచార్యుఁ డనియె”
-సం.ల. 66 ప.
అని యక్షగాన పదమును నిర్వచించెను. పైఁ బేర్కొనిన జక్కులరేకు పదముల లక్షణము లెఱిఁగింపక యక్షగాన పదముల నిర్వచనమొనరించుటచే నా రెండును స్వరూపస్వభావములందు సమానములని యూహింప వీలగుచున్నది. దీనిని బట్టి క్రీ.శ. 15వ శతాబ్దినాటికి యక్షగానమున కథయు, వివిధ తాళసంగతులు, నవరసాలంక్రియాసవర్ణములు చేరి దానికి కావ్యస్వరూపసంపత్తిని సంఘటించినవని తెలియుచున్నది.
యక్షగానములు మొదట సంగీత సంకీర్తనల రూపమున ప్రారంభమై కథాకథన ప్రబంధరూపములుగా పదునేనవ శతాబ్దమునాటికే పరిణామము చెందెనని పైఁ బరిశీలనమువలన గమనింపవచ్చును.
తెలుఁగున నుపలభ్యమానములగుచున్న యక్షగానములలో కందుకూరి రుద్రకవి విరచితమైన సుగ్రీవవిజయము ప్రప్రథమ యక్షగానమని పండితులు భావించుచుండిరి. కాని, తెలుఁగున నిప్పటికి దొరకుచున్న యక్షగాన వాఙ్మయమును బరిశీలించి క్రీ.శ. 15వ శతాబ్ది యుత్తరార్ధమున నుండిన ప్రోలుగంటి చెన్న శౌరి రచించిన ‘సౌరభిచరిత’మను జక్కులకథయే ప్రప్రథమ యక్షగానమనియు, క్రీ.శ. 1500 ప్రాంతమున నున్న వెల్లంకి తాతంభట్టు కవిచింతామణియం దుదాహరించిన ‘లక్ష్మీకల్యాణము రేకు’లకు నాకరమైన యక్షగానము రెండవది యనియు, చక్రపురి రాఘవాచార్యుఁడను కవి 18వ శతాబ్దమున రచించిన విప్రనారాయణ చరిత్రము మూఁడవదియనియు, కందుకూరి రుద్రకవి విరచితమైన ‘సుగ్రీవవిజయము’ నాల్గవది యనియు డా|| యస్వీ జోగారావుగారు తమ సిద్ధాంత వ్యాసమునఁ బేర్కొని యుండిరి. అందు మొదటి రెండును లభించుటలేదు. విప్రనారాయణ చరిత్ర మదరాసు ప్రాచ్యలిఖిత భాండాగారమునఁ గలదు. సుగ్రీవవిజయము ప్రకటితము.
పదునైదవ శతాబ్ది యుత్తరార్ధమున వెలువడిన యక్షగానములు కొన్ని మనకు లభించుటనుబట్టి యంతకుఁ బూర్వము యక్షగానరచన సాగియుండలేదని భావించుట పొరపాటు. పదునేనవ శతాబ్ది పూర్వార్ధమున వెలసిన తాళ్ళపాక అన్నమాచార్యుని సంకీర్తన లక్షణమునఁ బేర్కొనఁబడిన ‘యక్షగాన పదము’ల ప్రశంస అందుకు సాక్ష్యము. క్రీ.శ. 1385-1445 సం||ల నడుమనున్న గౌరన మహాకవి తన లక్షణదీపికయందు మధురకవిత్వ స్వరూపము నెఱిఁగించుచు “యక్షగానంబున వెలయు పదంబులు, దరువులు, నేలలు, ధవళంబులు, మంగళహారతులు, శోభనంబులు, నుయ్యాలజోలలు, జక్కులరేకుపదంబులు, చందమామ సుద్దులు, అష్టకంబులు, ఏకపద ద్విపద చతుష్పదాష్టపదులు నివి యాదిగాఁ గల్గు” నన్నింటిని బేర్కొని యుండుటను బట్టియు, నవి యన్నియు యక్షగానములందుఁ గానఁబడుచుండుటను బట్టియు పదునాల్గవ శతాబ్దినాఁటికే యక్షగాన రచనము పరిపక్వదశ నంది లక్ష్యము లెన్నియో వెలసియున్నట్లు భావింప వీలగుచున్నది. కాని, మన దురదృష్టవశమున నట్టి దేశిసాహిత్యభాండారము మనకు కనుమఱుగై పోయినది.
పదునాఱవ శతాబ్ది తరువాత వెలసిన లక్షణ గ్రంథములందు యక్షగానలక్షణములు మనకు స్పష్టముగాఁ గానవచ్చుచున్నవి. ఉదాహరణమునకు- పదునాఱవ శతాబ్ది పూర్వార్ధమున నున్న చిత్రకవి పెద్దన తన లక్షణసార సంగ్రహమున నిట్లు పేర్కొనెను:
సీ. “వృషభగతి త్రిపుటరే కంఘ్రియుగమగుఁ | దుద నేఁడు లఘువులు తొలఁగఁజేయ,
జంపెరేకునకు లక్షణము ద్విరదగతి | యగుఁ గొన నొక లఘు వందు మాన,
రచ్చరేకగును దురగవల్గనము గతి | మఱి యేకతాళియౌ మధురగతిని
అటతాళమున మాత్ర లంఘ్రి కిర్వదినాల్గు | నాల్గిట విరతి పద్నాలుగింట
తే. నిలుచు నర్ధంపు నర్ధచంద్రికలు దీన | యక్షగానాది కృతులతో నార్యులిడిన
రగడ భేదంబు లవి యౌను రమ్యచర్య | యవిత నిజవాససముదాయ ! యాంజనేయ!”
(2.141)
ఇందు పెద్దన త్రిపుటరేకు, జంపెరేకు, రచ్చరేకు, అర్ధచంద్రికల తాళగతులకు, రగడగతులకు గల సామ్యభేదములను తెలియపఱచెను. ఇట్టి విధానమునే యనుసరించి యక్షగానమునం దుండెడి రగడ భేదముల నప్పకవి క్రీ.శ. 1650 ప్రాంతమున బేర్కొనెను.
సీ. “తుద నేడు లఘువులు తొలగించి చదివినఁ | ద్రిపుటకు వృషభగతిపదయుగము,
లలిఁ గడపల నొక్క లఘు మానిన జంపె | మను ద్విరదగతి సమపదయుగము
గురుతగు రచ్చరేకుఁ దురగవల్గనా- | హ్వయ మేకతాళి యా మధురగతికి
నంఘ్రి కిర్వదినాలు గటతాళమున మాత్ర | లోలి విశ్రాంతి పద్నాలుగింటఁ
తే. దెలియ నర్ధంబు నర్ధచంద్రికలు వీన | యక్షగాన ప్రబంధంబు లతుకవచ్చు
రగడభేదంబు లివి యండ్రు రసఁ గవీంద్రు | లవితనిజసేవకస్తోమ! యబ్ధిధామ !
(4.303)
యక్షగానములందలి రగడ భేదములు త్రిపుటాదితాళముల కనువుగా రచింపఁబడుచున్నట్లు తెలియుచున్నవి కాని వాని పేర్లు తెలియుటలేదు. పెద్దనయు, నప్పకవియు యక్షగానమునందలి రగడ భేదములైన ఛందములను మాత్రమే పేర్కొనియుండిరి కాని వానియం దుపయోగింపఁబడుచున్న వివిధ దేశీచ్ఛందముల వివరముల నెఱిఁగింపలేదు. గౌరన లక్షణదీపిక యందలి కొన్ని కానఁబడుచున్నవి. విజయరాఘవుని యాస్థానమున నున్న చెంగల్వకాళకవి రాజగోపాల విలాసావతారికలోఁ బేర్కొనఁబడిన
“యక్షగానంబు రావణహస్త ముడుకు
దండెమీటులు చెంగులు తాళములును
జోల సువ్వాల ధవళంబు లేల లమర
కొంద ఱతివలు వినిపించి రందముగను.”
1.24
అను పద్యము ననుసరించి యందలి ఛందోవిశేషములు తెలియుచున్నవి. ఈ యుగమునందే యున్న గణపవరపు వేంకటకవి తన లక్షణశిరోమణిలో నిట్లు పేర్కొనినాఁడు.
“... ... యక్షగానంబునకును
పద్యగద్యంబులు బహువిధతాళముల్
రేకులు గూర్ప వర్తిల్లు.”
లాక్షణికులుగాని, కవులుగాని యక్షగానముయొక్క సమగ్రస్వరూపమును నిర్వచించినట్లు కానరాదు. యక్షగానములపైఁ బరిశోధన గావించిన ఆచార్య యస్వీ జోగారావుగారు సాహిత్యప్రక్రియగా యక్షగానము నిట్లు నిర్వచించి యుండిరి.
“యక్షగానమునం దితివృత్త మెట్టిదైన గావచ్చును. రచనాప్రక్రియ శ్రవ్యముగాని, దృశ్యముగాని కావచ్చును. ఏ ప్రక్రియయందైన గీతిధర్మము విహితము. అందు రాగతాళములలో నొకదానికిఁ గాని రెండింటికిఁ గాని తగు ప్రాధాన్యము గల రచనావిశేషములు (రేకు, దరువు, పదము, కీర్తన మొ||), ద్విపద (మంజరియును), పద్యములు (జాత్యుపజాతి వృత్తము, అర్ధపద్యములు, సంస్కృత శ్లోకములును), వచనము (సంధి ప్రయోజననాత్మకము గాని, సంవాదాత్మకము గాని, వర్ణనాత్మకమైనను గాఁదగును), చూర్ణికలు, విన్నపములు మొ|| గద్యప్రభేదములు నుండఁదగును. ఏలాది గీతప్రబంధవిశేషముల ప్రయోగ మైచ్ఛికము.”‘మంగళారంభాని మంగళమధ్యాని మంగళాంతాని ప్రథన్తే’ యను సంప్రదాయము ననుసరించి యక్షగానములు భగవత్స్తుతితో నారంభమగును. తరువాత వినాయకస్తుతి, పూర్వకవిస్తుతి, కుకవినింద, కృతిభర్తృవర్ణనము, షష్ఠ్యంతములు ప్రవర్తింపఁబడి యక్షగాన కథారంభము చేయఁబడును. ఇట్టి పూర్వరంగము శ్రవ్యకావ్యోచితమయ్యు దృశ్యప్రక్రియ నాశ్రయించి గానముచేయఁబడుచుండును. సంస్కృత నాటకములందువలె సూత్రధార ప్రవేశము కానరాదు! కాని హంగుదారుల పోహళింపు, వాద్యగానముల మేళవింపు గానవచ్చుచున్నది. ప్రాథమిక యక్షగానములందు నటియే రంగమున నృత్యము చేయుచు నాయా గీతముల నాలపించుచుండినట్లును, వంతదారులు సంధివచనము లాలపించుచుండినట్లును దెలియవచ్చుచున్నది. వేషరచనము, తెర లుపయోగించుట రూపక ప్రయోగానుగుణ్యమును సూచించుచున్నది. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోఁ దెరలోనుండి వెలువడి నాట్యమొనర్చెడి నటిని వర్ణించిన విధము గాంచుడు-
“శిరమున నురమున జెవుల కంఠమున
గరముల గూకటిగాళ్లఁ జెల్వార
గవదండలును గనుగవ గదలికలు
సవరంబులును గలశంబు దండలును
భసింతబు బూత పైఁబరగు బచ్చెనలు
నలరారు చిఱుగట్టియలును నందియలు
సరిరత్నపంక్తుల జలపోషణములు
గర మొప్ప తొంగళ్లు గల చల్లడములు
బొల్చు దంతావళుల్ బుష్పమాలికలు
దాల్చి యత్యద్భుతోత్సవ లీలఁ దనర
జనులు హర్షింప నాస్థానముల్ సొచ్చి
యనుకూల వివిధ వాద్యసమ్మేళనమును
నార్భటం బిచ్చి యొయ్యన జవనికల
గర్భంబు వెడలి యక్కజము వటిల్ల...”
రంగస్థలమునకు నలువైపుల నుండు ప్రేక్షకులకుఁ బ్రదర్శనము కనఁబడునట్లుగా ప్రయోగము నిర్వహింపఁబడెడిది.
కాలక్రమమున నొకేపాత్ర యాడుచుఁ బాడుచు కథను వినిపించు ప్రక్రియ తగ్గుమొగము పట్టి యొక్కొకపాత్ర యొక్కొక నటుడు ధరించి ప్రయోగించు ప్రక్రియ వ్యాప్తికెక్కినది. అట్టి యక్షగానములకు యక్షగాన నాటకములనియు, వీథి నాటకములనియు, బయలాటలనియు పేళ్ళు వచ్చినవి. ఇట్టి పరిణామము తంజావూరు నాయకరాజుల కాలమునందు ప్రసిద్ధి కెక్కినది. విజయరాఘవ నాయకుఁడు యక్షగానమును నాటకముగాఁ బేర్కొనినాఁడు. దైవస్తుతి షష్ఠ్యంతములకు బదులు కైవారమును నటీసూత్రధారులను బ్రవేశపెట్టినాఁడు. రగడలు, త్రిపుటలు మొదలైనవానికంటె పదములు, దరువులు, జతులు మొదలైనవానిని విరివిగాఁ జొప్పించినాఁడు. ఆ కాలమున యక్షగానములలో పాత్రల సంఖ్యతో పాటు నాటకీయత పెంపొందినది. పురాణేతిహాసపురుషుల జీవితాలనే కాక సమకాలీన మహాపురుషుల జీవితగాథలు యక్షగానములలో వస్తువులుగాఁ గైకొనఁబడినవి.
యక్షగాన ప్రక్రియతో సన్నిహిత సంబంధము పెంచుకొని వెలువడినవి కలాపము, బుఱ్ఱకథ, హరికథ, వీథినాటకము, కూచిపూడి భాగవతములు మొదలగు దేశిరూపక ప్రక్రియలు. ఇటీవలి వీథినాటకములలో సమకాలీన రాజకీయములకు సంబంధించిన యితివృత్తములును గ్రహింపఁబడినవి. తెలుఁగున నాటకరచన మభివృద్ధి చెందుటచే యక్షగాన రచనాప్రక్రియ వెనుకంజ వేసినను, అంతంరించి మాత్రము పోలేదు.
కీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ద్రావిడభాషలలో వెలసిన కురవంజు లనఁబడు దేశీయ దృశ్యరచనలే గేయవిశిష్ట నాట్యరచనలై పల్లెలందు జక్కులవారిచేఁ బ్రదర్శింపఁబడుచు, క్రమముగా నగరముల కెఁగఁబ్రాకి యక్షగానము లనఁబడెనని భావించిరి. ఈ వాదమును విమర్శించి ఆచార్య యస్వీ జోగారావుగారు కొఱవంజి దృశ్యరచనలకంటె యక్షగానములు ప్రాచీనములుగా గనుపట్టుచున్నవనియు, వానియందు కొన్ని సాదృశ్యములు గనఁబడుచున్నను వాని మధ్య జన్యజనక సంబంధము కానరాదనియు, సమాంతరముగాఁ బెరిగిన సాహిత్య ప్రక్రియలనియుఁ బ్రతిపాదించిరి.
బొమ్మలాటనుండి యక్షగానము జనించినదని శ్రీనేలటూరి వెంకటరమణయ్యగారి వాదము. దానిని విమర్శించి ఆచార్య యస్వీ జోగారావుగారు “బొమ్మలాట-యక్షగానములయొక్క నైసర్గిక స్వరూపమును బరిశీలించినచో నా రెండింటికిని గాఢమైన యనుబంధము కలదనిపించును. అయితే అది యనుబంధము మాత్రమే. జన్యజనక భావసంబంధము కాద’ని నిశ్చయించిరి.
యక్షగానము దేశి సంప్రదాయమున జనించిన రూపకప్రక్రియ యని పలువురు విమర్శకులు భావించుచున్నారు. కాని, యది సంస్కృతోపరూపక జన్యమని భావించెడివారును గలరు. యక్షగానముల యుత్పత్తి పరిణామ వికాసములను బరిశీలించినచో మొదట దేశియై జనించిన యక్షగానము పరిణామమున మార్గలక్షణములను దనయందు లీనమొనర్చుకొని విస్తరించినదని స్పష్టము కాఁ గలదు.
ఆచార్య యస్వీ జోగారావుగారు యక్షగానములను ప్రయోజన ప్రాధాన్యమును బట్టియు, నితివృత్త వైవిధ్యమును బట్టియు నీ విధముగా విభజించినారు. ప్రయోజన ప్రాధాన్యమును బట్టి యక్షగానములు శ్రవ్యములనియు, దృశ్యములనియు, ఉభయ ప్రయోజనాత్మకములనియు మూఁడు విధములు. అందు శ్రవ్యములలోఁ బ్రబంధములవలె పఠనమునకు మాత్రమే పనికి వచ్చునవి యనియు, హరికథలవలె జంగంకథలవలె కథాఖ్యానమునకుఁ బనికి వచ్చునవి యనియు రెండు తెఱఁగులు కాననగును. దృశ్యములను వీథినాటకములు, బొమ్మలాటలు, మార్గనాటకములు, ఆధునిక నాటకముల విధానము ననుసరించినవిగాఁ జతుర్విధమున విభజింపవచ్చును.
ఇతివృత్త వైవిధ్యమును బట్టి పౌరాణికములనియు, స్థలపురాణములు లేక క్షేత్రమాహాత్మ్యములనియు, చారిత్రకములనియు, మహాపురుషుల చరిత్రలనియు, తాత్కాలికేతివృత్తములు గలవనియు, సాంఘికేతివృత్తములనియు, జానపదగాథలనియు, కల్యాణకథలనియు, తత్త్వవిషయికములనియు, విలాస-చరిత్ర-విజయాది నామములతోఁ గనవచ్చు నితరములనియు విభజింపవచ్చును.
యక్షగానముల వైశిష్ట్యము నుగ్గడించుచు డా|| యస్వీ జోగారావుగారువి సర్వోపభోగ్యములైన సమాహార కళాస్వరూపములనియు, వివిధప్రక్రియానుబంధములనియు, బహువిధ పదకవితాప్రభేద సమీకరణములనియు, వస్తువైవిధ్య శోభితములనియు, శృంగార వీర కరుణ హాస్య రసప్రధానములనియు, ఛందోవైవిధ్యమునకును, భాషావైవిధ్యమునకును, లోకవృత్త ప్రదర్శనమునకును నాకరములనియు బేర్కొనిరి. యక్షగానముయొక్క దేశిక నాటకకళాప్రాతినిధ్యమును గూర్చి వారు నుడివిన మాట లిచ్చట సంస్మరణీయములు:
“దేశివాఙ్మయ మంతయు మధురకవితాశాఖకుఁ జెందిన గీతప్రబంధముల ప్రాచుర్యము గలది కావున నట్టి గీతప్రబంధముల కెన్నిటికో యక్షగాన మాకర మగుటచేత యక్షగానమును దేశివాఙ్మయకోశమంతటికినిఁ బ్రతినిధి యనఁ జెల్లును. కాని, యక్షగాన మనఁగా నీనాఁడు గానప్రక్రియగాఁ గాక రూపకప్రక్రియగాఁ బరిగణింపఁబడుచున్నది. అయితే యక్షగానమునకు ముందే దేశమున వీథినాటకములు ప్రచారమునందుండినను, అది యా వీథినాటకములతో నేకమై నాటకప్రక్రియగా రూపొంది, నాటక శబ్దవాచ్యమునై మధ్యలో మార్గనాటక ప్రభావము సోకినను దన వ్యక్తిత్వమును గోల్పోక, కలాపము, కొరవంజి మొదలగునవి దేశీయదృశ్యరచనలుగా రూపొందుటకై తన ప్రక్రియాసత్త్వమును దానము చేసి, బొమ్మలాటలకును వాటమైన వంతపాటగా బరిఢవిల్లి యుండుటఁ జేసి, దానిని దేశిసరణికిఁ జెందిన నాట్యకలాప్రపంచమునకుఁ గూడ తగిన ప్రతినిధి యనుటలో విప్రతిపత్తి యుండరాదు.”
రామాయణకథలోఁ బతాకనాయకుఁడు సుగ్రీవుఁడు. స్వీయకార్యమును సాధించుకొని నాయకునకుఁ గార్యసాధనమునఁ దోడుపడువాఁడు పతాకనాయకుఁడు. ప్రధానేతివృత్తమునకు సమాంతరముగా నడచు పతాకనాయక వృత్తము మహాకావ్యములందు నాతివిస్తృతమయ్యు రసవంతముగ నుండును. అట్టి వస్తువు సామాన్యముగా నొక ప్రత్యేక లఘుకృతి కితివృత్తపుష్టిని గల్పింప సమర్థమై యుండును. సుగ్రీవుని వృత్తాంత మట్టి కండపుష్టికల కథ. రావణుని నోడించిన వాలితో సుగ్రీవునకైన వైరభావము, యుద్ధము వీరరసప్రధానములు. తారాశోకము కరుణరసప్రపూరితము. ధర్మసంస్థాపనమునకై రాముఁ డొనరించిన స్నేహకార్యము ధర్మవీరపరిపోషకము. హనుమంతుని నీతిచాతుర్యము కథాసంవిధానసమర్థము. ఇట్టి సహజవస్తుసంపద నిండారిన వస్తువును గ్రహించి యక్షగానముగా రచించిన కవివతంసుఁడు కందుకూరి రుద్రయ.
‘కాళికాంబా ప్రసాద సంకలిత కవిత్వచాతుర్యుఁ’డైన కందుకూరి రుద్రకవి విశ్వబ్రాహ్మణుఁడు. ఇతని తండ్రి పెదలింగనార్యుడు. ఇతని యింటిపేరును బట్టి నెల్లూరు మండలమునందలి కందుకూ రితని వాసమై యుండవచ్చును. ఇతఁడు సుగ్రీవ విజయమను యక్షగానమునే కాక నిరంకుశోపాఖ్యానమను ప్రబంధమును, జనార్దనాష్టకమును గూడ రచించెను. శ్రీకృష్ణదేవరాయల భువనవిజయమున వెలసిన అష్టదిగ్గజమహాకవులలో నీతఁ డొకఁ డనియు, నీతఁడా సభాభవనమున నీశాన్యదిక్కున నధివసించెడివాఁడనియు బ్రతీతి కలదు. మల్కిభరామని ప్రసిద్ధి గాంచిన ఇబ్రహీంకుతుబ్షా రుద్రకవికి ద్వయతింత్రిణీ జనపదమును దానమిచ్చినట్లు శాసనప్రమాణము కలదు. ఆ గ్రామమునే ‘రెండుచింతల’ యని పిలచెదరు. ఆ గ్రామమున నీ కవివంశీయు లా యగ్రహారము ననుభవించుచుండిరనియు, నా వంశమున వారికి ‘కవివారు’ అను నామ మేర్పడెననియు, రుద్రకవి యా గ్రామమున వసించి యుండెననియు కీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తెల్పియున్నారు. రుద్రకవి నిరంకుశోపాఖ్యానమును తాళికోట యుద్ధానంతరము వ్రాసియుండుననుటకుఁ గావ్యప్రమాణములు కలవు కావున నా కవి క్రీ.శ. 1500 నుండి 1580 సం||ల నడిమి కాలమున నివసించియుండవచ్చునని విమర్శకులు భావించుచున్నారు. ఇందు కొందరి కభిప్రాయభేదములున్నను అతఁడు పదునాఱవ శతాబ్ది యుత్తరార్ధము వాఁడనుటలో నెట్టి సంశయమును లేదు.
రుద్రకవి కందుకూరి జనార్దనస్వామి భక్తుఁడు. అతని యక్షగానకృతి నా దేవున కంకిత మిచ్చి కృత్యారంభమునందును, అంతమున ద్విపదయందును ఆ స్వామిని కీర్తించెను.
సుగ్రీవవిజయమునందలి వస్తువును బట్టి యది ప్రఖ్యాతము, పౌరాణికము. రామాయణమునందలి కిష్కింధకాండమునుండి యీ కావ్యవృత్తము గైకొనఁబడినది. సహజరస సన్నివేశబంధురమై యుండుటచే రుద్రకవి మూలకథ నెట్టి మార్పులు చేయక తన కావ్యమున నిబంధించుకొనెను.
సుగ్రీవవిజయము మంగళారంభసూచకమైన శ్రీకారము మొదట నిలిచిన యుత్పలమాలా వృత్తముతో నారంభమగును. అదియే నాందీపద్య మనదగియున్నది. అందు రుద్రకవి త్రిమూర్తులకును, త్రిశక్తులకును, విఘ్నేశ్వరునకును, గురువునకును నమస్కరించి, కావ్యవిద్యావిదులను నుతించి, కవితాజడులైన కుకవులను నిరసించెను.ఆపై నా కవీశ్వరుఁడు, కృతీశ్వరుఁడైన జనార్దనస్వామిని (త్రిపుటలో) నుతించెను. దశావతారస్తుత్యాత్మకమైన షష్ఠ్యంతముల నర్ధచంద్రికలలో నాపై రచించి కథాక్రమమున కుపక్రమించెను. ఈ రచనావిధానము శ్రవ్యకావ్యోచిత రచనాప్రక్రియతో నారంభించు ప్రాచీనాంధ్రయక్షగాన సంప్రదాయమును దెలుపుచున్నది.
కావ్యారంభమువలెనే కథారంభమునుగూడ శ్రీకారముతో నారంభించుట యొక విశేషము. రుద్రకవి కథాకథనమును సంగ్రహముగను సూటిగను సాగించి, రసభావపోషకములైన సంభాషణములను బ్రకరణోచితముగా విస్తరించి రచించుట యతని కావ్యమునఁ గానవచ్చు రచనావిశేషము.
సీతాన్వేషణపరులైన రామలక్ష్మణులు తాపసవేషములందున్నను శరచాపధరులై యుండుటచే సుగ్రీవుఁడు వారిని గాంచి వాలి పంపున వచ్చినవారని భయపడును. హనుమంతుఁడు వారి రూపసంపదను వర్ణించి, యట్టి తేజోధనులకు దుష్టగుణములుండవని వివరించి, వారికఁడ కేఁగి వారి పూనిక నెఱిఁగి వచ్చెదనని సూచించును. సుగ్రీవుఁడు యందుల కంగీకరించును. హనుమంతుఁడు రామలక్ష్మణుల సన్నిధి కేఁగి, నమస్కరించి, వారి యాగమనకార్యమును గూర్చి ప్రశ్నించును. లక్ష్మణుఁడు తమ వృత్తాంతము నెఱిఁగించి, హనుమంతుని వర్తనమును బ్రశంసించి, యతని వివరములను గూర్చి ప్రశ్నించును. హనుమంతుఁడు సుగ్రీవుని గుణగణముల నుగ్గడించి, తా నతని మంత్రి యనియు, వారి కాతని యేలికను బంటు చేయు నేర్పు తనకుఁ గలదనియు విన్నవించును. రాము నానతని లక్ష్మణుఁడు ‘రాముఁడు జగదేకవీరుఁడయ్యును రాజు లొంటిగా రణమున కేఁగుట పాడికాదు కావున సుగ్రీవుని తోడు దీసికొనఁ దలచుచుండె’నని తెలిపెను. హనుమంతుఁడు సుగ్రీవున కడ కేఁగి యతని నందుల కొప్పించి రామలక్ష్మణులతో నతని కగ్నిసాక్షిగా స్నేహము ననుసంధించెను. సుగ్రీవుఁడు సీత ఋష్యమూక పర్వతముపై జారవిడిచిన యాభరణముల మూఁటను రామునకుఁ జూపించెను. రాముఁ డా యాభరణములను గాంచి సీతను స్మరించుచు శోకమూర్తియై విలపించును. కొంతవడికి తేరుకొని రాముఁడు వాలిని సంహరించి కిష్కింధను సుగ్రీవున కిచ్చెదనని ప్రతినచేసి వాలిసుగ్రీవుల వైరమునకుఁ గారణవృత్తాంతము నాతఁడు చెప్పగా వినును. దుందుభిశవమును గొనఁగోట మీటియు, సప్తతాళములను బడఁగొట్టియు దన పరాక్రమమును బ్రదర్శించి, సుగ్రీవునికి ధైర్యము దెప్పించును. సుగ్రీవుఁడు రాముని పరాక్రమమును గీర్తించి శరణు వేడును. రాముఁడు సుగ్రీవుని వాలితో యుద్ధము చేయుటకుఁ బురికొల్పి తాను వృక్షముచాటున నిలిచి బాణసంధానమునకై వేచియుండును. వాలిసుగ్రీవుల ద్వంద్వయుద్ధమున సుగ్రీవుఁడు వాలిచే నొత్తఁబడును. రాముఁడు వారి రూపసాదృశ్యమును గాంచి సుగ్రీవుని గుర్తింపలేక శరసంధానము గావింపడయ్యెను.రాముఁడు ఖిన్నుఁడైన సుగ్రీవునకు ధైర్యము చెప్పి, గజపుష్పమాల నాతని మెడలో నలంకరించి, మఱల వాలితో బోరుమని పురిగొల్పును. తార వలదని వారించినను వినక బలోన్మత్తుఁడైన వాలి సుగ్రీవుని నధిక్షేపించుచు గలిసి పోరునెఁడ శ్రీరాముఁడు చెట్టుచాటునుండి బాణమును సంధించి వాలిని గూలనేయును.
వాలి రాముని వర్తనము నధిక్షేపించును. రాముఁడు తన చర్య ధర్మబద్ధమేయని సమర్థించుకొనును. మూర్ఛాగతుఁడైన వాలిని గాంచి తార హృదయవిదారకముగా శోకించును. రాము నెత్తిపొడుపు మాటలతో నధిక్షేపించును. సుగ్రీవుని వక్రోక్తులతో నిందించును. వాలి మూర్ఛ దెలిసి తమ్ముని జేరఁ బిలిచి, రాజులను మదిలోన నమ్మవలదని బోధించి, అంగదుని నతని కప్పగించి, కంఠమాలిక నతని కర్పించును. అంగదుఁడు తండ్రిపాటునకు వెక్కివెక్కి యేడ్చుచుండ నాతనిని కరుణారస ముట్టిపడునట్లుఁ లాలించి, పినతండ్రిని సేవింపుమని యాదేశించి, రామబాణనిహతుఁ డగుచున్నందులకు సంతసించి, ప్రాణములు పోకమునుపే బాణమును బెకలింపుమని రామునిఁ బ్రార్థించును. రాముఁడు బాణము తీయుటతో నతని ప్రాణములు గూడ వెడలును. అంగద సుగ్రీవతారాదుల శోకము మిన్నంటును.
పురజను లీ వృత్తాంతమును విని బహువిధములుగా తలంతురు. చివరకు వాలికంటె సుగ్రీవుఁడే యుత్తముఁడని సమాధానపడుదురు. రామునానతి చొప్పున సుగ్రీవునకు కిష్కింధారాజ్యపట్టాభిషేకము జరుగును. పుణ్యాంగనలు ధవళములు, చెంచెతలు ఏలలు, పాడి రాముని గీర్తింతురు. సుగ్రీవుఁడు రామునకుఁ గానుకలు పెట్టి కిష్కింధ కాహ్వానించును. కాని, మునివృత్తిఁ జరించుచున్న రామలక్ష్మణులు పట్టణవాసము నుజ్జగించి వానకాలము వెడలునంతవఱకు మాల్యవంతమున నుండుటకు నిశ్చయించుకొందురు. కిష్కింధలో సుగ్రీవుఁడు తారాసమేతుఁడై వేడ్కగాఁ గాలము పుచ్చుచుండును.
ఈ కథలో నాయువుపట్టు సంఘర్షణము. రామాయణమున రామునకు సహాయకుఁడు సుగ్రీవుఁడు. ఈ కథలో సుగ్రీవునకు సహాయకుఁడు రాముఁడు. సుగ్రీవుని యుద్ధవిజయ మిందలి వస్తువు. ప్రతినాయకుఁడు వాలి. వాలి మరణము రాముని సహాయమున సాధించుట నాయకుని కార్యము. కథలో వధ్యుఁడయ్యు నతనియందుఁ బఠితకు సానుభూతి కలుగవలెను. అది వాలి పరాక్రమౌదార్యవివేకవర్తనములవలన గొంత కలుగును. తారావిలాపము వలన కొంత కలుగును. అంగదుని శోకమువలన కొంత కలుగును. ప్రతినాయకుఁ డుద్ధతుఁడయ్యు విషాదనాయకునివలెఁ జిత్రింపఁబడవలెను. అట్టి చిత్రణమున కందుకూరి రుద్రకవి కృతకృత్యుఁడయ్యెను. ఈ కథలో ధర్మాధర్మముల సంఘర్షణము కలదు. స్నేహవిరోధముల సన్నికర్ష కలదు. దానిపై కథానిర్మాణమంతయుఁ జిత్రముగా సాగును. పఠిత నాకట్టుకొనును.
కందుకూరి రుద్రకవి సంభాషణల నిర్వహణమున నందెవైచిన చేయి. వానిని విస్తరించి రసపోషణముగా దీర్చిదిద్దుటయం దతడు శ్రద్ధ వహించెను. హనుమంతుఁడు సుగ్రీవునితోడను, రామలక్ష్మణులతోడను, లక్ష్మణుఁడు హనుమంతుని తోడను చేసిన సంభాషణములను త్రిపుట-జంపె-ద్విపదలయందు విస్తరించి వ్రాసెను. సీతాస్మరణమున రాముఁడు పలికిన శోకాలాపముల నతివేలముగాఁ ద్రిపుట-జంపెలలో విస్తరించి కరుణరసస్ఫోరకముగా రచియించెను. సుగ్రీవుఁడు రామునితోఁ బలికిన మాటలను జంపె-త్రిపుట-అటతాళ గతులతో నడిపించెను. తార వాలితోఁ బలికిన పలుకులు అటతాళ గతితోడను, వాలి సమాధానము జంపెతాళమునను, వాలి శ్రీరామునితో నన్నమాటలు త్రిపుట-జంపె తాళములందును, రాముని సమాధానము జంపెతాళమునందును తారాశోకము అటతాళ, జంపెతాళ, త్రిపుట తాళములలోను, వాలిభాషణము జంపె తాళమునను, ద్విపదలోను జనవాక్యములను జంపెలోను, వాలి రామునిఁ జేసిన ప్రశంస సీసపద్యము, జంపెలోను నడిపిన విధమును గాంచినచో నాతఁడు రూపకప్రక్రియ కనుగుణముగా నాయా పాత్రధారులు తత్తత్సన్ని వేశములయందు సంభాషణలను బాడుచు నభినయించుట కనువుగా రచించినట్లు స్పష్టము కాఁగలదు.
కథాకథనమున నీ కవి వచనమును, ద్విపదను, అర్ధచంద్రికలను ప్రధానముగా వాడుకొనినను, అంతర్గాథయైన వాలిసుగ్రీవుల వైరవృత్తాంతమును వివిధగతులలో రసోదంచితముగ నడిపెను. రాముని శోకమూర్తిని వర్ణించు నర్ధచంద్రికయు (23), యుద్ధవర్ణనమున ద్విపదయు (56), సుగ్రీవుని దైన్యమున నేకతాళమును (62) ఛందోమర్మజ్ఞుఁడు చూపించు రచనాశిల్పములు.
ఈ యక్షగానమున నున్న రచనలలో కథాకథనమును, బాత్రసంభాషణమును బెనవైచికొనినవి కొన్ని కలవు. దానివలన నీ యక్షగానము కథాగానమున కుద్దేశింపఁబడినదని భావించుటకు వీలగుచున్నది. కాని, యట్టి పట్టులకంటె స్వతంత్రసంభాషణము లున్న భాగము లధికములగుటచేఁ బ్రదర్శనానుకూల్య మీ యక్షగానమున కున్నదని విమర్శకులు భావించుచున్నారు.
సంగ్రహరచమైనను ఈ యక్షగానమున పాత్రల స్వభావశీలములను గన్నులకు కట్టునట్లు కందుకూరి రుద్రకవి చిత్రించినాఁడు. ఇందు నాయకుఁడు సుగ్రీవుఁడు. అతనికి వాలి యన్నచో సింహస్వప్నము. రామలక్ష్మణులను గాంచి యతఁడు భయపడుటలో నది స్పష్టము. స్నేహశీలి హనుమంతుని తోడను, రామలక్ష్మణుల తోడను అతఁడు వర్తించిన విధమున నది నిరూపితము. అండ యున్నచో గొండలను పిండిచేయువాఁడు. రాముని సాయమున వాలితో యుద్ధమునకుఁ గడంగుట యందువలననే. కష్టము వచ్చినచో క్రుంగిపోవువాఁడు, అన్నను చంపియు నతని వియోగమునకు విలపించినవాఁడు. నమ్మినవారిని మోసగింపనివాఁడు.
శ్రీరాముఁడు ధీరోదాత్తుఁడు. ధర్మవర్తనుఁడు. అతని బహిఃప్రాణము సీత. ఆమె సొమ్ములను గాంచినప్పు డాతఁడు పొందిన శోక మతని ప్రేమకు వ్యాఖ్యానము. చూడుడు 19 త్రిపుట. అనంతదుఃఖము ముంచుకొని వచ్చినను అంతలో తేరుకొని కర్తవ్యనిష్ఠుఁడు కాఁగలడు. అది ధీరోదాత్తలక్షణము. కార్యము సాధించువఱకు నిదురపోనివాఁడు. ఆశ్రితరక్షకుఁడు. ఇట్టి గుణము లాతఁడు సుగ్రీవునకు విజయము సాధించిపెట్టుటలోఁ గానఁబడుచున్నవి.
లక్ష్మణుఁడు అన్నను వెన్నంటు నీడవంటివాఁడు. సమయోచితవాక్యనిపుణుఁడు. హనుమంతుఁడు నమ్మినబంటు, మంత్రి, కార్యసాధననిపుణుఁడు.
ప్రతినాయక పక్షమున వాలి, తార, అంగదుఁడను పాత్రలు బలీయములైనవి. సుగ్రీవుని విజయము వీరిని విషాదసాగరమున ముంచినది. అట్టి విషాదమును వివరించి రచించుటచే పఠిత కా పాత్రలయందు సానుభూతి కలుగుచున్నది. వాలి పాత్రను రుద్రకవి ఉదాత్తీకరించినాఁడు. అతని యహంకారము, తొందఱపాటు, పరపత్నీవ్యామోహము, బలగర్వము సుగ్రీవుఁడు చెప్పిన కథవలనఁ దెలిసినను, అతఁడు వాలితో రణమున కేఁగుచు,
‘‘గతిలేక పోయి రాఘవు మఱుఁగుఁ జొచ్చె రవి
సుతుఁడు నాకేమిటికి సుదతి ! యీ రోత!’’
యని తారతో ననిన పలుకులు అభిమానస్ఫోరకములై పఠితల మనములఁ జూఱఁ గొనును.
‘‘అన్నదమ్ములు మేము మాలో నలిగి చిత్తములోనఁ బోరుచు
నున్న నీకుఁ బ్రసక్తి గలదే యొకని దునుమన్’’
అని రాముని ప్రశ్నించుట యందును,
“శ్రీరామ! నీ రామఁ జెఱఁగొన్న రావణుని
వారధుల ముంచితిని వాలమునఁ జుట్టి
ఒకమాట నాకుఁ జెప్పక పోయితివి గాక
సకలదైత్యుల దున్మి జానకిని దేనె”
అనెడి సాభిమానోక్తులయందును,
“రామవిభుతోడ మునుపేమి చేసెదనంటి
వామాట చెల్లించి యతనికృప నొందు”
మని సుగ్రీవునికి బోధించిన హితోక్తులందును,
“ప్రతిలేని కపిరాజ్యపట్టంబు నినుఁగట్టి
సుతుఁడ! నీ విభవంబు సూడలేనైతి”
నని సుతునితోఁ బలికిన కరుణరసార్ద్రములైన పల్కులందును, వాలి యభిమాన-స్నేహ-వాత్సల్యమూర్తులను రూపుకట్టించి కృతార్థుడైనాఁడు రుద్రకవి. తారాశోకము కరుణరసవార్ధి. ఆమె రామునిననిన ఎత్తిపొడుపుమాటలు రామబాణములకంటె వాడియైన ములుకులు. బాలుఁడైన అంగదుఁడు దుర్భర పితృశోకాకులమూర్తి. వీరి సంభాషణలు రక్తికట్టించుటయే కథలోని పట్టు. రుద్రకవి తన రచనాసామర్థ్యమంతయు నందుఁ బ్రదర్శించి చిరస్మరణీయుఁడయ్యెను.
సుగ్రీవవిజయమున నంగిరసము వీరము. సుగ్రీవునియందు శ్రీరామవర్ధితమైన వీరము పోషింపఁబడినది. వాలియందు రౌద్రము, కరుణమును. తారయందు కరుణమును బోషింపఁబడినవి. ప్రతినాయకపక్షవర్తియైన కరుణరసము నాయకుని వీరమునకుఁ బోషకము. శ్రీరాముని పరాక్రమజనితమైన వీరాద్భుతములు అంగిరసపోషకములు.
కందుకూరి రుద్రకవి కవిత్వము నిరంకుశోపాఖ్యానమునందువలెఁ గాక యిందు ప్రసన్నమధురమై తేనెలూరుచు కథాప్రవృత్తికిని, రసవృత్తికిని దోహదకారి యగుచున్నది. ఈ యక్షగానము ప్రజాదరణ పొందినదని చెప్పుచు కీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు వ్రాసిన వాక్యము లిచ్చట స్మరణీయములు.
“ఈ రుద్రకవి సుగ్రీవవిజయమునుగూడ స్త్రీవృద్ధపామరాదులు పలువురు పాడుచుందురట! ఆయా పాత్రముల పాటలు తత్తద్వేషధారులు వచ్చి పాడునట్లును, తక్కిన సంధివచనాదులు ఒకరిద్దఱు సూత్రధారప్రాయులు పఠించునట్లు నీ సుగ్రీవవిజయము వీథియాటగా నాడఁబడుచుండెడిది.”
ఈ యక్షగానమున నొక వృత్తము, రెండు సీసములు, ఒక కందము, మూఁడు గీతపద్యములు, రెండువందలకు మించిన ద్విపదలు, సంధివచనప్రాయములైన వచనములు, త్రిపుట, జంపె, కుఱుచజంపె, అటతాళము, ఏకతాళము మొదలగు తాళప్రధానములైన దరువులు, ధవళములు, శోభన మంగళములు, ఏలలు, అర్ధచంద్రికలు మొదలగు దేశిచ్ఛందములును వాడఁబడినవి.
సుగ్రీవ విజయ యక్షగానరచన మా కాలమునందు వెలసిన యక్షగానముల స్వరూపస్వభావములతో సంవాదము నొందుటయే కాక, తరువాత వెలసిన యక్షగాన రచనలపైఁ దన ప్రభావమును వైచినది. ఆంధ్రమున లభించుచున్న నత్యంతప్రాచీన యక్షగానములలోఁ దలమానికముగా సుగ్రీవవిజయము ప్రసిద్ధికెక్కినది.
కందుకూరి రుద్రకవి సుగ్రీవవిజయము తమిళమున యక్షగాన రూపముననే అనువదింపఁబడినది. ఆ యనువాద లిఖితప్రతులు మదరాసు ప్రాచీనలిఖితపుస్తకభాండార తమిళగ్రంథముల నం. 509-511. ఇట్టి గౌరవ మీ యక్షగాన ప్రసిద్ధిని జాటుచున్నది. ఈ సుగ్రీవ విజయ యక్షగానమును కీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారిచే పరిష్కరింపఁబడి శ్రీ కపిలేశ్వరపురాధీశ్వరులచే ప్రకటింపబడిన ప్రతి నాధారముగాఁ గొని ప్రకటించుటయైనది. అందు శ్రీశాస్త్రిగారు మదరాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండారములోని యాఱు ప్రతులను, ఆంధ్రసాహిత్య పరిషత్ప్రతులను రెండింటిని పరిశోధించి పాఠనిర్ణయములు గావించి యుండిరి. ఆ ప్రతియం దధస్సూచికలలో కొన్ని రాగములు సూచింపఁబడియున్నవి. ఉదా: త్రిపుట (3) - ఆహిరిరాగము; అర్ధచంద్రికలు (5) - సౌరాష్ట్రరాగము; జంపె (13) - భైరవి రాగము; జంపె (15) - కల్యాణిరాగము; త్రిపుట (19) - ఆహిరి; జంపె (26) - పాడిరాగము; అర్ధచంద్రికలు (27) - నాటరాగము; అటతాళము (32) - గంభీరనాటరాగము; అర్ధచంద్రికలు (34) - పాడిరాగము; అటతాళము (36) - ఆహిరి రాగము; త్రిపుట (41) - ఆహిరిరాగము; జంపె (44) - రామప్రియరాగము; త్రిపుట (46) - ఆహిరిరాగము; ఏకతాళము (52) - సౌరాష్ట్రరాగము; త్రిపుట (55) - ఆహిరిరాగము; అటతాళము (70) - ఆహిరిరాగము. సంగీతమర్మజ్ఞులు వీని సార్థక్యమును భావింపఁగలరు. ఆ ప్రతియందే అధఃసూచికలో నిచ్చిన మంగళమును కావ్యాంత మంగళసూచకముగా నుండనొప్పుననియు, తరువాతి యక్షగానములలో నది గానవచ్చుచున్నదనియు భావించి యీ ప్రతిలో పాఠమునందే గ్రహించుటయైనది.
నే నీ పీఠికవ్రాయుటలో ఆచార్య డా. యస్వీ జోగారావుగారి ఆంధ్రయక్షగాన వాఙ్మయచరిత్ర ప్రధానముగాఁ దోడ్పడినది. కీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రి, వాఙ్మయాధ్యక్షులు శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య, ఆచార్య డా|| దివాకర్ల వేంకటావధానిగారలు రచించిన పీఠికలును, వ్యాసములును సహాయకారులైనవి. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనముల నర్పించుకొనుచున్నాను.
కీ.శే. వేటూరి ప్రభాకరశాస్త్రిగారి పీఠికతో ప్రకటితమైన ప్రతిని నా కందఁజేసిన మిత్రులు శ్రీ నిడదవోలు సుందరేశ్వరరావుగారికిని, యీ గ్రంథమునకు పీఠిక వ్రాయుట కవకాశమిచ్చుటయే కాక, ప్రస్తుత మందుబాటులో లేని ఈ యక్షగానమును ముద్రించి సాహితీబంధువులకు, విద్యార్థులకు నెనలేని సేవ చేయుచున్న మాధవీ బుక్ సెంటర్ అధినేత శ్రీ ఎ. వేంకటేశ్వరరావుగారికిని నా కృతజ్ఞతలు.
-జి.వి. సుబ్రహ్మణ్యం
[1] చూడు: సీతా కల్యాణము, (యక్షగానము) తొలిపలుకు - వాఙ్మయమహాధ్యక్ష శ్రీవడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు. పుట. vi
[2] చూడు: ఆంధ్రయక్షగాన వాఙ్మయ చరిత్ర. ప్ర. భా. పుట. 3-5.
[3] చూడు: సీతాకల్యాణ యక్షగానము తొలిపలుకు. పుటలు x నుండి xiii
[4] సీతాకల్యాణము (యక్షగానము) తొలిపలుకు. పుట. xv
[5] తిరుపతి దేవస్థాన శాసనములు, ద్వితీయసంపుటము. నం. 77.
[6] ఆంధ్ర యక్షగానవాఙ్మయచరిత్ర. ప్ర. భా. పు. 17-18; 22-24.
[7] సీతాకల్యాణము (యక్షగానము) తొలిపలుకు. పుట viii & xviii
[8] గౌరనకవి (క్రీ.శ. 1380-1440 ) రచించిన లక్షణదీపికలో జక్కులరేకుపదములు మధురకవితలలోఁ జేరునని తెల్పి యుండెను.
సుగ్రీవవిజయము - కందుకూరి రుద్రకవి
మధురకవితలు - ‘సుగ్రీవవిజయము’ (1939) పీఠిక - వేటూరి ప్రభాకర శాస్త్రి
రుద్రకవి - సుగ్రీవవిజయం : డా|| ఆర్. అనంత పద్మనాభరావు (‘150 వసంతాల వావిళ్ల వాఙ్మయ వైజయంతి’నుండి)
![]() |
![]() |