వచన సాహిత్యము వ్యాసములు 1947 - 1972 : నేనూ - ఈ పాతికేళ్ల సాహిత్యం : శ్రీ శ్రీ

మహతి ఆగష్టు 1972, యువభారతి ప్రచురణ నుండి; వారి సౌజన్యంతో

1947 ఒక కొండగుర్తు. ఆయేడు మనకి స్వాతంత్ర్యం వచ్చిందంటారు(చరిత్రకారులు). బ్రిటిష్‌వాళ్లు దీన్ని "ప్రదానం" చేశా మంటారు. కాంగ్రెస్‌వాళ్ళు దీన్ని అహింసతో, సత్యాగ్రహంతో సాధించామంటారు. నేను మాత్రం మన కింకా "స్వ"రాజ్యం రాలేదంటాను.

మనం తెలుగువాళ్ళం. 1947 లో ముక్కోటి ఆంధ్రులం. ఇప్పుడు నాలుగు కోట్లదాకా పెరిగాం. మన ప్రదేశం ఫ్రాన్సుకన్నా పెద్దది. (మన భాష మాత్రం ఫ్రెంచికన్నా గొప్పది కాదు.) ఒకప్పుడు తెలుగు భాష దక్షిణాపథం అంతటికీ రాజభాషగా ఉండేది ("దేశ భాషలందు తెలుగు లెస్స"). మనం కడచిన వెయ్యేళ్ళలో ప్రపంచానికి కనీసం ముగ్గురు మహాకవులను ప్రసాదించాం. (తిక్కన, వేమన, గురజాడ).

ఇప్పుడు మనం 20వ శతాబ్దంలో ఉన్నాం. ఈ శతాబ్దం నాది! (తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు!) నేను 1910లో పుట్టేను (తోకచుక్కలాగ). మూడుసార్లు మృత్యువుతో పోరాడి గెలిచాను. 1918లో మొదటి గీతం రాశాను (గణ యతి ప్రాస లంటే ఏమిటో తెలియకుండా!) 1920లో మొదటి నవల (వీరసింహ విజయసింహులు) రాసిపారేశాను. 1925లో మొదటి నవలిక (పరమాణు రహస్యం) అచ్చయింది. దాని ప్రతులు ఇప్పుడు లేవు. విశాఖ పట్టణం హిందూ రీడింగురూము లైబ్రరీలో ఉండేది.

1928లో మొదటి ఖండకావ్య సంపుటి (ప్రభావ) మా నాన్నగా రిచ్చిన డబ్బుతో రాజమండ్రీ సరస్వతీ పవర్‌ ప్రెస్సులో అచ్చు వేయించాను. దీని ముద్రణ వ్యవహారమంతా మిత్రుడు పురిపండా చూసుకోవడమే కాక, కృష్ణశాస్త్రి కృష్ణపక్షాన్ని శివశంకరశాస్త్రి లోకానికి పరిచయం చేసినట్లు, నా తొలి కవితను తన ఉపోద్ఘాతంతో లోకంమీదికి వదిలేడు.

1930లో నేను 63రోజులు టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడ్డాను. జీవితం మృత్యువుతో ఎలా పోరాడుతుందో స్వయంగా తెలుసుకున్నాను ("ఇక లాభం లే"దని నన్ను మంచంమీదనుంచి కిందకు దించెయ్యటం నాకు బాగా జ్ఞాపకం). ఇది నా రెండవ మృత్యువు. 1955లో మెంటల్‌ క్లినిక్‌లో ఉండటం మూడవది. మొదటిసారి నేను పుట్టిన తొలినెలల్లోనే చచ్చిపోవలసింది. మా బంధు వొకాయన చుట్టచురకలతో నాటువైద్యం చేసి నన్ను బతికించాడట. దీనికి గుర్తుగా నా నుదుటిమీదా, మెడ వెనకాతలా, చేతి మణికట్లమీదా మచ్చలున్నాయి.

1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాతనుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను. అప్పటినుంచీ తెలుగు సాహిత్యం చరిత్ర శ్రీశ్రీ స్వీయచరిత్ర. ఈ శతాబ్దపు తొలిపాదంలో జమీందారీ కవిత్వం మీద భావకవిత్వం తిరుగుబాటు చేసింది. చిన్నప్పటినుంచీ తిరుగుబాటు మనస్తత్వం గల నేను భావకవిత్వాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాను (నాకు బాగా జ్ఞాపకం, ఆ రోజుల్లో మా బంధువొకాయన నా కవితాశక్తిని తెగమెచ్చుకుంటూ, నేనొక సలక్షణమైన మహాప్రబంధం రాస్తే బాగుంటుం దని సిఫార్సు చేశాడు. ఆ సిఫార్సును నేను బుట్టదాఖలా చేశాను).

1925నుంచీ 50దాకా సాగిన రెండో పాతికేళ్ళలో భావకవిత్వంమీద యువకవుల తిరుగుబాటు సాగింది. ఈ పాతికేళ్ళలోనే రెండో ప్రపంచయుద్ధం ప్రారంభం కావటం, పోవడం, మనకి స్వరాజ్యం రావడం జరిగాయి. స్వరాజ్యం వచ్చిన కొత్త రోజుల్లో - "భావకవిత్వం: ఒక శవపరీక్ష" అనే వ్యాసం రాద్దామని నేను చాలా ఉబలాటపడ్డాను. వ్యాసం అయితే రాయలేదుకాని భావకవిత్వం మాత్రం సాహిత్యరంగంనుంచి నిష్క్రమించిం దన్న యథార్థాన్ని ఋజువు చెయ్యవలసిన అవసరం లేకపోయింది.

అలా నిష్క్రమించిన భావకవిత్వం స్థానాన్ని అభ్యుదయ కవిత్వం ఆక్రమించింది. ఆక్రమించి ఈ కొత్త కవిత్వం ఏమిటి సాధించింది? ఈ ప్రశ్నకి నాకన్నా, నా కవితా సోదరుడు సోమసుందర్‌ చక్కని, నమగ్రమైన జవాబివ్వ గలడు. నే నిక్కడ చెప్పదలచింది ఒకేఒక్క విషయం మాత్రం. అభ్యుదయోద్యమం తెలుగు సాహిత్యంలో గ్రాంథికభాషకు, శాశ్వతంగా ఉద్వాసన చెప్పింది. నవలల్లో, నాటకాల్లో, పత్రికా సంపాదకీయాల్లో, రేడియో ప్రసంగాల్లో సర్వత్రా వ్యావహారికభాష విజయపతాకం ఎగురవేసింది. కవిత్వంలో గణబద్ధచ్ఛందస్సుల ఫ్యూడలిజం నడ్డి విరగ్గొట్టి మాత్రాబద్ధచ్ఛందస్సుల ప్రజాస్వామ్యాన్ని స్థాపించింది.

ఆ రోజుల్లో నేను
"నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ..."
అంటూ సింగిల్‌ పన్నా కవిత్వాలు రాస్తూ ఉంటే అబ్బూరి రామకృష్ణారావుగారు హాస్యాని కొక వచనగీతం ఉదాహరించేవారు.
"కాళీ పే
కేజీ పే
ట్టేలూ ఆ
మ్మబడును."
ఇదో కర్రల అడితీవద్ద బల్లమీద స్థలం చాలక పోవటం వల్ల నిలువుగా వ్రాసిన ప్రకటన. దీన్ని - "కాళీ పేకేజీ పెట్టెలు అమ్మబడును" అని చదువుకోవాలి. తెలుగులో వచనగీతానికి ఈవిధంగా హుషారిచ్చినవారు శ్రీ అబ్బూరి రామకృష్ణారావుగారు (నా కవిత్వాన్ని ఎంత వేళాకోళం చేసేవారో నా కంత ప్రోత్సాహంకూడా ఇచ్చేవారు). చాలా కాలం కిందట నేను వ్రాసిన "పొలాలనన్నీ హలాల దున్నీ" అనే గేయాన్ని మెచ్చుకుంటూ అభ్యుదయ రచయితల లండన్‌ మానిఫెస్టో సారాంశం అంతా ఇందులో దించేశావోయ్‌ అన్నారు. ఇది నా మనస్సులో పదిలంగా దాచుకున్న పొగడ్తలలో ఒకటి!

ఇంకోటి ఇక్కడే చెప్పాలని ఉంది. ఈ సింగిల్‌ పన్నా గేయాలు రాసే రోజుల్లోనే ఒకసారి అడవి బాపిరాజుగారు భీమవరంలో ఒక కవిసమ్మేళనం ఏర్పాటు చేశారు. అందులో నేను కవితాపఠనం చేస్తూ ఉంటే వెనకనుంచి ఒక పదిపన్నెండేండ్ల కుర్రాడు, "ఓస్‌ ఇదే కవిత్వం అంటే ఇలాంటిది నేనూ రాసెయ్యగలను" అనటం వినిపించింది. ఆ వయస్సు కుర్రాడిచేత అలా అనిపించగల కవిత్వం వ్రాసినందుకు ఇప్పటికీ నేను గర్విస్తున్నాను.

పికాసో చిత్రాన్ని చూసిన ఒక అమెరికన్‌ కోటీశ్వరుడు, "ఓస్‌! ఇలాంటి చిత్రాన్ని నా పదేళ్ళకొడుకుకూడా గీకెయ్యగలడు" అన్నాడట. పక్కనే ఉన్న ఇంకో కోటీశ్వరుడు "చిత్రలేఖనం అంటే ఏమిటో తెలిసినవాడు పికాసో చిత్రాన్ని మాత్రం లక్షల ఖరీదుకి కొంటాడని మరిచిపోకు బ్రదర్‌" అన్నాడట!

మొన్న ఈమధ్యనే, హైద్రాబాదు వీరశైవ హాస్టల్‌లో విప్లవ రచయితల సంఘం ద్వితీయ వార్షికోత్సవం జరిగినప్పుడు శ్రీ అబ్బూరి రామకృష్ణారావుగారు నాకు మరో యోగ్యతాపత్రం ప్రసాదించారు. "you are waging a heroic battle" అన్నారు. "నువ్వు వీరోచితంగా పోరాడుతున్నావు" అన్నారు. సాహిత్య అకాడమీలో సభ్యత్వం కన్నా మిన్నగా దీన్ని ఎన్నుకుంటాను.

అన్నట్టు వి.ర.సం. దాకా ఇంకా రాలేదుకదూ! అ.ర.సం. తొలిరోజుల్లోనే ఉన్నాంకదూ! ఆ రోజుల్లో - స్వరాజ్యం వచ్చిన కొత్త దినాల్లో నెహ్రూగారి చమ్కీ ఉపన్యాసాల మధ్య భారతదేశంలో సామ్యవాద భానూదయం అయిపోతున్నట్టుగానే అందరమూ భ్రమపడ్డాం. నెహ్రూ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తెలంగాణా ఉద్యమాన్ని అణగద్రొక్కినా కాంగ్రెస్‌మీదా, గాంధీగారి మీదా ప్రజల్లో ఉన్న భక్తి ఏమాత్రమూ చెక్కు చెదరలేదు. కాంగ్రెస్‌ ద్వారా సామ్యవాదం సిద్ధిస్తుందని ఇంకా నమ్ముతున్న అమాయకులు ఇప్పటికీ ఉండటమూ, అందులో అభ్యుదయ రచయితలు అగ్రేసరులుగా నిలబడడమూ ఈనాడు చరిత్ర మనమీద ప్లే చేస్తున్న ప్రాక్టికల్‌ జోక్స్‌లో ముఖ్యమైనది. 25 సంవత్సరాల కాంగ్రెస్‌ పరిపాలన తర్వాత కూడా సాహిత్యంలో సమ్రాట్టులూ, సార్వభౌములూ, చక్రవర్తులూ ఉట్టికట్టుకుని ఊరేగుతున్నా రంటే భూస్వామ్య వ్యవస్థ పునాదు లింకా చెక్కు చెదరకుండా నిలిచే ఉన్నాయన్నమాట. ఈ పునాదులను పెల్లగించడం కోసమే వి.ర.సం. ఆవిర్భవించింది. నిస్సందేహంగా తన చారిత్రక కర్తవ్యం నిర్వహిస్తుంది.

75శాతం నిరక్షరాస్యులమీద 25శాతం అక్షరాస్యులూ, 90శాతం దరిద్రులమీద 10శాతం ధనవంతులూ పరిపాలన సాగిస్తున్న వ్యవస్థ మనది. ఇదే ప్రజాస్వామ్యం అనుకోవడమంత సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఈ వ్యవస్థను మార్చాలని ఉద్ఘోషించడం కన్నా ఇంకో ఉత్కృష్ట ధర్మం ఏ సాహిత్య పరుడికైనా ఎలా ఉంటుందో నే నూహించలేను. మరి ఈ వ్యవస్థకి రకరకాలుగా కొమ్ముకాచే రాతగాళ్ళంతా నా దృష్టిలో ప్రజాద్రోహులే.

ఈ వ్యాసంలో ఇకమీద ఏం వ్రాసినా విప్లవ సాహిత్యం మీదనే వ్రాయవలసి ఉంటుంది. వి.ర.సం. గ్రంథాలను నిషేధిస్తూ, వి.ర.సం. రచయితలను నిర్బంధిస్తూ, విప్లవ సాహిత్యాన్ని ప్రదర్శించే వీరయ్యలమీద కూడా దాడిచేస్తూ ఈ ప్రభుత్వం ఎలా సామ్యవాదాన్ని స్థాపించగలదో నా కర్థంగాదు. ఒకటి మాత్రం నిశ్చయం. యువతరం బేషరతుగా విప్లవాన్ని ఆహ్వానిస్తోంది. ఆ తరానికి మన పాలకవర్గం దూరమై ఆకాశహర్మ్యాల్లో నివసిస్తోంది. యువతరం విజృంభించడం, దాని ఫలితంగా పాలకవర్గం పతనం కావడం త్వరలోనే తప్పనిసరి అని చెప్పడానికి ఏ మీనమేషాలను గుణించ నక్కరలేదు.

1970లో నా షష్టిపూర్తి జరిగింది. అప్పుడే తెలుగు సాహిత్యం ఒక పెద్ద మలుపు తీసుకుంది. ఆయేడే విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. దానికి నన్ను అధ్యక్షుడుగా ఎన్నుకున్న వారందరికీ నా ధన్యవాదాలు.

ఇండియాకు రాష్ట్రపతి కావడంకన్నా, వి.ర.సం. అధ్యక్షుణ్ణి కావడమే నాకు మహదానందకరం. తెలుగు కవితారంగంలోనూ, కథానికారంగంలోనూ విప్లవ రచయితలు జేగీయమానంగా ముందుకుపోతున్నారు. ఇతర క్షేత్రాల్లో కూడా ఎన్నిక చెయ్యదగ్గ విజయాలు సాధించడానికి ఎంతోకాలం పట్టదు.

AndhraBharati AMdhra bhArati - telugu vachana sAhityamu - vyAsamulu - 1947 - 1972 : nEnU - I pAtikELla sAhityaM : shrI shrI ( telugu andhra )