వచన వ్యాసములు పోలిపెద్ది వేంకటరాయకవి - పరిచయము

పోలిపెద్ది వేంకటరాయకవి (క్రీ॥ శ॥ 1800-1875)

- వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)

పోలిపెద్ది వేంకటరాయకవి (1) వేణుగోపాల శతకము (2) లావణ్య శతకములే కాక, తిట్లదండకమును గూడ చెప్పినాఁడు. ఇతఁడు వేణుగోపాల శతక మెవరి ప్రోత్సాహమును లేకయే, స్వబుద్ధిచేతనే వ్రాసినాఁడని తోఁచుచున్నది. పైఁగా నితఁడు తిట్లదండకములోఁ దాను వేణుగోపాల భక్తుఁడని చెప్పుకొనినాఁడు. ఆ భాగము మాత్రము:

“వేదవేదాంతతత్త్వజ్ఞుఁడన్, వైదికశ్రేష్ఠుఁడన్, సజ్జనస్తవ్యుఁడన్, సాధుసాంగత్యమున్గల్గువాఁడన్, సదాచారశీలుండ, శ్రీ వేణుగోపాల సద్భక్తుఁడన్, పోలిపెద్దాన్వయాబ్ధీందుతుల్యుండ, శ్రీ వేంకనార్యుండ, నాస్థానవిద్వాంసుఁడన్, సత్కవీంద్రుండ, శ్రీకారువేటీ పురాధీశు, శ్రీమన్మహామండలేత్యాది వాక్యాళిసంశోభితున్, రాజరాజేశ్వరున్, మాకరాడ్వంశసంజాతు, శ్రీ వేంకట్పెరుమాళ్ల రాజాశ్రితుండన్, సదా రాజసన్మానితుండన్”
దీనినిబట్టి కవి సదాచారముగల వైదికశ్రేష్ఠుడనియుఁ గార్వేటినగర రాజేంద్రుఁడయిన మాకరాడ్వంశస్థుఁడగు శ్రీ వేంకటపెరుమాళ రాజాస్థాన విద్వత్కవీశ్వరుఁడనియు స్పష్టమగుచున్నది.

కార్వేటినగరములో నెలకొన్న వేణుగోపాలస్వామి యీ కవికి కులదైవమగుటచేత నప్పటి సంస్థానములోని యక్రమములనే కాక, సంఘములోఁ గనిపించు దురాచారములను దీవ్రముగా విమర్శించుచు నా దేవుని పేరనే మకుటరచన చేసినాఁడు. ఆ తరువాతనే యితనికి రాజాస్థానములోఁ బ్రవేశము దొరకినట్లు తెలియుచున్నది. అప్పటి ప్రభువైన శ్రీకుమారవేంకట పెరుమాళ్రాజులుంగారియొద్ద మంత్రిగా నుండిన వ్యక్తి తన్ను ముందుగా చూడనిదే, యెవరుగాని ప్రభుదర్శనము చేయరాదనే యహంభావము గలవాఁడఁట! ఆ వ్యక్తి పేరు కవి చెప్పలేదు, కాని యతని యవలక్షణములను గుఱించి మాత్రము వేణుగోపాల శతకములో నీ విధముగ వర్ణించినాఁడు:

“పీనుఁగందపు మోము, పిల్లిమీసంబులు, కట్టెశరీరంబు, కాకినలుపు,
ఆర్చుకన్నులు, వెన్నునంటిన యుదరంబు, నురుఁగు చారలముంపు నోటికంపు,
చెయిచెయ్యి దిగరాచి చెక్కిళ్లు రుద్దుట, దవడలుసొట్ట, పాదములుమిట్ట,
ఒరుఠీవి జూచి మేలోర్వలేకేడ్చుట, దౌర్భాగ్యగుణములు తగని యాస,
ఇట్టి యవలక్షణవుమంత్రి నేర్పరించ, దొరల కపకీర్తిఁ దెచ్చు నా దుర్జనుండు”

తన కపకీర్తిదాయకమైన యీ వేణుగోపాల శతకమునుగూర్చి యా మంత్రి విని సన్నిహితులయిన పండితుల సలహాల ననుసరించి, వేంకటరాయకవికిఁ బ్రభువర్యుని ‘బేటి’ చేయించినాఁడని తెలియుచున్నది. ఈ కవీంద్రుని విద్వత్ప్రతిభకు మెచ్చుకొని, రాజుగారితనిని ‘లావణ్య శతక’మను శృంగార విషయికమయిన కృతిని నిర్మించుమనినట్లు కవియే తన లావణ్య శతకములోని మొదటి సీసపద్యములోఁ దెలుపుకొనినాఁడు.

“శ్రీమదఖండ లక్ష్మీప్రసన్నుఁడు మాకరాట్కులాంభోధి కైరవహితుండు,
సరసుఁడౌ వేంకట పెరుమాళ్ల రాజేంద్రుఁ డొకసారి కొలువుకూర్చుండి, నన్నుఁ
గని పోలిపెద్ది వేంకటరాయ సుకవీంద్ర! రమ్మని ప్రేమ మీఱంగఁ బురుష
విరహంబు, శ్రీహరిస్మరణ శృంగారంబుగను, జమత్కృతి శతకంబొనర్పు
మనిన, శారద నేకదంతుని భజించి నే రచించెదఁ బద్యముల్ నేర్చినటుల
నీదు కృప లేక కృతిసేయ నేరికయిన వశమె శ్రీరామరామ! లావణ్య సీమ!”

ఇతనికిఁ బ్రభువు “నవరసాలంకారశృంగారవాణీవిలాసపుర”మను ‘బేచరు’ గ్రామమును వంశపారంపర్యముగా ననుభవించుకొను హక్కుతో శ్రోత్రియముగా ధారాదత్తము చేసినాఁడు. ఇది చిఱుతని తాలూకాలో నున్నది. జమీందారీ లెక్కలలో (ఆ కాలములో) పై పేరు తోడనే యా గ్రామము సూచింపఁబడుచుండునది. కొంత కాలమున కది భటవృత్తిమాన్యము క్రింద వారి ‘రికార్డు’లలో ‘దాఖలు’ కాఁజొచ్చినది. ఇప్పటికిని, ఆ శ్రోత్రియమును కవిగారి మునిమనుమఁడు (అతని పేరుకూడ వేంకటరాయఁడే) 60 యేండ్లపడిలో నున్నవాఁ డనుభవించుచున్నాఁడు.

కవికాశ్రయమిచ్చిన యీ కుమారవేంకట పెరుమాళ్రాజులుంగారు క్రీ॥ శ॥ 1884 (తారణ) సంవత్సరములోఁ జనిపోయినట్లు “పద్మావతీ పరిణయ”మను సంస్కృతకావ్యములో నున్నది. ఆ పక్షమున నీ వేంకటపెరుమాళ్రాజులుంగారు వందొమ్మిదవ శతాబ్దపు ప్రథమపాదములోఁ బుట్టి క్రీ॥ శ॥ 1860 ప్రాంతములోఁ బట్టాభిషిక్తులయి యా తరువాత క్రీ॥ శ॥1884 వఱకు రాజ్యము పరిపాలించిరనుట సహేతుకము.

దీనికి మఱియొక యాధారముకూడ లేకపోలేదు. పై వేంకట పెరుమాళ్రాజులుంగారి తమ్ములయిన తిరుమలరాజులుంగారికి గరుడాద్రి సుబ్రహ్మణ్యవిద్వత్కవి తనచే రచింపఁబడిన “శత్రుఘ్న విజయ”మను కృతి నంకితము చేసినాఁడు. ఆ గ్రంథము శా. శ. 1786 (ప్రభవ) అనఁగా క్రీ॥ శ॥ 1864 సం॥ రం పూర్తియయినట్లుగా గ్రంథాంతములో నున్నది. ఆ సమయములో శ్రీకుమారవేంకట పెరుమాళ్రాజులుంగారే రాజ్యపాలకులు. ఆ తరువాత 20 ఏండ్లు ప్రభువులుగానుండి ముందు పేరాలో సూచించినట్లు క్రీ॥ శ॥ 1884లో మరణించిరను నిర్ణయము సత్యదూరము కాదు.

పై కాలనిర్ణయము ననుసరించి మన కవియు, నతని పోషకప్రభువునకు ఏవో కొన్ని యేండ్ల తేడాతో, సమకాలికుఁడై యుండినాఁడనుటలో సందేహము లేదు. ఈ సమకాలికత్వమును వారి తరువాతి వంశపరంపర దృఢపఱచుచున్నది. శ్రీకుమారవేంకట పెరుమాళ్రాజులుంగారికి బ్రహ్మ (బొమ్మ)రాజు, కావేరి రాజు, సింగరి రాజను మువ్వురు పుత్రులు. బ్రహ్మ రాజు పుత్రుఁడు తిరుమల రాజు. అతనికిఁ గుమారవేంకట పెరుమాళ్రాజు, కుమారస్వామి రాజు ననువారు పుత్రులు. వీరిరువురికిని సంతానము లేదు. అందు మొదటివారు (కుమారవేంకట పెరుమాళ్రాజు) 25 సంవత్సరముల (దాదాపు) క్రిందట పట్టాభిషేకము చేసికొని నేటికి 6-7 సంవత్సరములకు పూర్వము గతించిరి. రెండవవారయిన కుమారస్వామి రాజాబహదరువారు 1951 సం॥న వయోజనవోటింగు ఎన్నికలలోఁ బ్రజాపార్టి పక్షమున మదరాసు శాసనసభ కెన్నుకొనఁబడి 1952 సం॥రం నవంబరు మాసములో స్వర్గస్థులయిరి.

చెప్పవచ్చిన దేమనఁగా, మొదటి కుమారవేంకట పెరుమాళ్రాజులుంగారికి రెండవ కుమారవేంకట పెరుమాళ్రాజులుంగారు మూఁడవతరమువారు. వేణుగోపాల లావణ్య శతకముల కర్తయయిన వేంకటరాయనికి, రెండవ (సజీవుఁడైన) వేంకటరాయఁడు మూఁడవతరమువాఁడు. కావున ప్రభువుయొక్క కవియొక్క వయస్సులలో నంతగా తేడా యుండదు.

ఈ పోలిపెద్ది వేంకటరాయకవి కవితాప్రౌఢిమ యసామాన్యమైనది. ఇతని శతక సీసపద్యముల గమకమే యొక కొంగ్రొత్త నాజూకుతనము సంతరించుకొనినది. నన్నయాది ప్రాచీనుల కావ్యములకుఁ పెద్దనాది మధ్యకవుల ప్రబంధములకు నెంత భేదము కనిపించుచున్నదో యంత తేడా యితని సీసపద్యములకుఁ దక్కిన శతకకవుల సీసపద్యముల కగపడును. జానుతెనుఁగు పలుకుబడులు, జాతీయములు మొదలైనవి ఈతని సొమ్ములు. అప్రయత్నముగా నట్టివి ఇతని పద్యములలో సందర్భానుసారముగా వచ్చి కూర్చుండును. అట్టి కవితకుఁ బ్రభువు ముగ్ధుఁడైనాఁడనిన నబ్బుర మేమున్నది?

ఇతఁడు కుకవిదూషణ చేయుచు, తెలుఁగు జాతీయ కవిత్వస్వరూపమును నిర్ణయించు సందర్భములోనిది ఈ క్రింది పద్యము:

“పాకంబునకుఁ దగు ఫణితిఁ గానక, కిరీటము వెట్టినట్లు నీమములు లేక,
తెనుఁగు పోయెడు జాడ తెలియఁజాలక, పెక్కు శృంగారరీతులు చేతఁ గాక,
గ్రామ్యదేశ్యమ్ముల క్రమము లెఱుంగక, జాతీయములు గూర్చు సరణి రాక,
పెళుచుమాటల దొంతి పేర్చుచు, సాధారణములౌ యతిప్రయోగములు లేక,
ఒకరి కయితను గని హేళనోక్తులాడు కుకవిశుంఠల మూతిపైఁ గొట్టునటుల
నేనొనర్చెదఁ బద్యముల్ నీదు కరుణ...” (లావణ్య శతకము)
తెనుఁగు పోయెడు జాడ తెలియవలెనఁట! గ్రామ్యదేశ్యమ్ముల క్రమము లెఱుఁగవలెనఁట! జాతీయములు గూర్పవలెనఁట! పెళుచుమాటల (చెత్తపదములేమో) దొంతి పేర్చరాదఁట! ఇవి యితని కవిత్వ నియమములు. తానీ నియమములను బాటించుచునే తన రెండు శతకములను వ్రాసినాఁడని వానిని చదువువారికి స్పష్టమగును.

ఇతని కవిత్వములో భావగోపనమనునది యెక్కడను లేదు. ఏ నీతినైనను, బూతునైనను, చెప్పవలసి వచ్చినప్పుడు ‘ఖరాఖండి’గా, కచ్చితముగా సూటిగా చెప్పువాఁడు. ఈ విషయములో నితఁడు “నీతులు బూతులు లోకఖ్యాతులురా” యనిన కవిచౌడప్ప కన్నయే యగును. జుగుప్స, రోఁత యను వస్తువు లితని కేకోశమునను లేవు.

ఇతని మొదటి కృతియైన వేణుగోపాల శతకమునకు “మదరిపువిఫాల, మునిజనహృదయలోల, వేణుగోపాల, భక్తసంత్రాణశీల” యనునది మకుటము. ఇందులో 100 కి తక్కువగనే పద్యములున్నవి. ప్రాచీనపు వ్రాతప్రతులలో నెందులోనను 85 పద్యములకు మించి లేవు. 1900 సం॥రంలో రంగవిలాసముద్రాక్షరశాలలో నచ్చయిన ప్రతిలో 88 పద్యములు మాత్రమే కలవు. మఱియొక ముద్రిత ప్రతిలో (చాల ప్రాఁతదియే కాని, ముందు వెనుక పుటలు లేనందున ఎప్పటిదో తెలియదు) 84 పద్యములున్నవి. ఇప్పటి ముద్రితప్రతులలో 90 పద్యములకు మించి యున్నవి (కాని 100 కి లోపు). వీనిలోను ఇటువంటి తక్కిన ‘బజారు’ ప్రతులలోను, రామలింగేశాది శతకముల సరుకు కొంతవఱకుఁ గలసియున్నది.

నాయొద్దనున్న వేణుగోపాల శతకప్రతు లేడింటిలోను మిక్కిలి ప్రాచీనమైనది క్రీ॥ శ॥ 1880 లో ముద్రింపఁబడినది. అర్వాచీనమైనది క్రీ॥ శ॥ 1949 లో అచ్చు వేయఁబడినది. మొదటిదానిలో 88 పద్యములున్నవి. రెండవదానిలో 96 పద్యములున్నవి. మిగిలిన ప్రతులలో 80-90 పద్యములకు నడుమ పలుసంఖ్యలుగా నున్నవి. పైఁగా క్రీ॥ శ॥ 1883 ప్రతికి 1949 ప్రతికి పాఠభేదములు పరిశీలించుటలో నా రెండుప్రతులకును తేడా హస్తిమశకాంతరముగాఁ గనిపించుచున్నది. మూలకవి భావములను బరిష్కర్త లంతుపట్టుటకు వీలులేనివిధముగాఁ బాదములకుఁ బాదములే పూర్తిగా మార్చిరి. అట్లు చేయుట వలన, బొత్తిగ కవిభావములనే చాలచోట్ల ధ్వంసీకరించిరి.

పరిష్కర్తలైనవారు ప్రభుత్వము నిషేధించునను భయము చేత మూలగ్రంథములోని జుగుప్సాంశములను దొలఁగించి, యాకుకందని పోఁకకుఁ బొందని తమ భావములను జొప్పించి, గ్రంథకర్తల యభిప్రాయములను హత్య చేయుటకంటె నా చోట్లలోఁ జుక్కలు పెట్టి విడిచివేయుట మేలు. లేదా, యా గ్రంథపుటూసే యెత్తకయుండుట యంతకంటె నుత్తమము. మన సారస్వతములో మహాకావ్యములన్నిటికి నీ యరిష్టము -కాదు- అంటుజాడ్యము పూర్తిగా వ్యాపించి, పరిపాటిగా జరుగుచుండుట నరికట్టకున్న భాషామహాదేవికి, నామె నారాధించిన పూర్వవిద్వత్కవులకు నెంతయో ద్రోహము చేసినవార మగుదుము. ఉదాహరణముగాఁ గూచిమంచి జగ్గకవి చంద్రరేఖావిలాపమును దీసికొనినఁ జాలును. ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారపు వ్రాతప్రతికిని ముద్రితప్రతికిని పోలికయే లేదు. ఈ విషయమయి, యిదివఱకే మన పెద్దలు శ్రీ గిడుగు వేంకటరామమూర్తిపంతులువారివంటి మహావిద్వాంసు లనేకులు నెత్తిని నోరు పెట్టుకొని ఘోషించినారు. కాని కాలపరిస్థితులను బట్టి, యట్టివారి ప్రయత్నము లేటికెదురీఁతగను గేవలమరణ్యరోదనముగను బరిణమించినది. ఇఁక నిప్పటి భాషాభ్యుదయకాము లీవిషయమున నొక యాందోళనము -మహావిప్లవము- లేవఁదీయుట యెంతయైన నవసరము. దీనినిగూర్చి యీ సందర్భమునఁ జెప్పుట యప్రస్తుతము. ప్రకృత మనుసరామః!

వేణుగోపాల శతకములోని పద్యములు పెక్కు విషయములకు సంబంధించినవి. అందులో ముఖ్యముగా నా కాలములోని రాజులను, ప్రభువులను, మంత్రులను, అధికారులను, వారి చర్యలను తీవ్రముగా నిరసించుచు చెప్పిన పద్యములు, సామాన్యనీతుల నుటంకించు పద్యములు నెక్కువగాఁ గనిపించుచున్నవి.

ఈ మహాకవి లోకవృత్తములను స్వానుభవముచేతఁ జక్కఁగా గ్రహించిన గొప్ప లౌక్యుఁడు. అద్భుత మేధాసంపన్నుఁడు. సీసపద్యములు నడపుటలో నీ కవిధోరణి తక్కిన సీస శతకకారుల కలవడలేదనిన, నతిశయోక్తి యనిపించుకొనదు. అడిదము సూరకవి రవంత యితనితో మొగ్గుచూపునేమో? కాని గాటయిన శబ్దములు సూటిగా నెదుటివారి మనస్సులలో నాటుకొనునట్లు చేయుటలో నితఁ డతనికంటే ఘనుఁడు, అఖండుఁడు. ఇతనికి భావదాస్య శబ్దదాస్యము లేకోశమున లేవు. రసోచితాలంకారములతో శబ్దము లనర్గళముగ దొర్లుకొని పోవుచుండును. ఇంతటి యుద్దండకవీంద్రుఁ డేదైన కావ్యము రచింపకపోవుట తెలుఁగువారి దురదృష్టము. అయిన నాంధ్రభాషారమ కీతని వేణుగోపాల లావణ్య శతకద్వయము రెండుపేటల ముత్యాలహారము, అందులోని పదక మితని తిట్లదండకము.

ఇతఁడు కవుల నిగ్రహానుగ్రహాదిక సామర్థ్యములను వారి యౌన్నత్యమును గూర్చి:

“కలకొద్దిలో వరములు దెల్పి మన్నించి యిచ్చినవాని దీవించవలయు
సిరిచేత మత్తుఁడై పరు వెఱుంగని లోభి దేబెను పెళ్లునఁ దిట్టవలయుఁ
దిట్టిన నప్పుడే తెలిసి ఖేదమునొంది యింద్రుఁడైనను బిచ్చ మెత్తవలయు
దీవించెనా చాల దీర్ఘాయువును బొంది బీదైన నందలం బెక్కవలయు,
నట్టియాతఁడు సుకవి, లేనట్టియతని కవి యనఁగ నేల? కవిమాలకాకి గాఁడె” ॥మద ॥
అని వ్రాయుటవలనఁ దాను తన ప్రత్యర్థియైన కోవూరి రామయ్య యను రాజకీయోద్యోగిపైఁ జెప్పిన ‘తిట్లదండకము’ మూలమున నతని మరణమునకు కారకుఁడయి యుండుననుట ఋజువగుచున్నది.[1]

ఇతఁడు రాజాస్థానమును బ్రవేశింపఁగనే ప్రభువు మంత్రులు తప్పఁ దక్కినవారందఱు లేచి గౌరవించువారఁట! ఒక దినమున నితఁడు సభకుఁ బోఁగా రాజుగా రమితముగా నభిమానించు నొకానొక వేశ్యకాంత లేవలేదఁట! అపుడు రుద్రుఁడై కవి యిట్లు చెప్పినాఁడఁట-

“ఆస్థానమందు విద్వాంసులఁ గని లేచి, మొక్కఁబూనని వారమోహినులను,
దలఁ గొఱిగించి, మెత్తని సున్నమును బూసి, బొగ్గుగందంబున బొట్టమర్చి,
చెప్పుల మెడఁ గట్టి, చింపిచేఁటలఁ గొట్టి, గాడిదపైఁ బెట్టి, కాల మెట్టి
తటుకున గ్రామప్రదక్షిణం బొనరించి, నిల్చినచోట పేణీళ్లు చల్లి
విప్రదూషకులను వారి వెంటనిచ్చి సాగనంపించవలయును శమను పురికి” ॥మద ॥

ఆ కాలపు రాజుల ప్రవర్తనలను వారి నాశ్రయించినవారి నడవడులను వివరించుచు, రాజు లెట్లుండవలయునో బోధించినాఁడు. ఈ క్రింది పద్యములు రాజులకు సంబంధించినవి:

 1. “కొండెసిగల్, తలగుడ్డలు, పాకోళ్లు, చలువవస్త్రములు, బొజ్జలు, కటార్లు,
  కాసికోకలు గంపెడేసి జన్నిదములు జాళువా జలతారు డాలువార్లు,
  సన్నంపు తిరుచూర్ణపు న్నీటునామాలు, జొల్లు విడెమ్ములు వల్లెవాట్లు,
  దాడీలు వెదురాకుతరహా సొగసుకోర్లు అంతకంతకు ‘గార్లటంచుఁ’ బేర్లు
  సమరమునఁ జొచ్చి ఱొమ్ముగాయముల కోర్చి శత్రువులఁ జంపనేరని క్షత్రియులకు
  ఏల? కాల్పనె? యీ వట్టియెమ్మెలెల్ల”
  (ఇతని పోషకప్రభువులగు కార్వేటినగరాధీశులు సూర్యవంశక్షత్రియులు. కాన క్షత్రియప్రభువులనే యిందుఁ బేర్కొనినాఁడు.)
 2. “పరదళంబులఁ గాంచి భయముచే నుఱికిన రాజుగాఁడతుఁడు గోరాజు గాని”
 3. “పానంబు, జూదంబు, పరసతిపై బాళి, ధనకాంక్ష, మోహంబు, తగని యాస
  అనుదినంబును వేఁట, యధికనిద్దురఁ గొంట, పేదఱికంబును, పిఱికితనము,
  అతిక్రౌర్యమును, మందగతి, హెచ్చు కోపము, అమితవాచాలత, అనృతములును,
  ఖండితం బాడుట, గర్వంబు, ప్రజ్ఞలు, విడువని వైరంబు, విప్రనింద,
  ఆప్తజనముల దూఱుట, నసురతిండి, మానవేంద్రుల పదవికి హానులివ్వి”
 4. “ఘనము నల్పంబు నెఱుఁగక కలియుగమున నవని నడుతురు మూర్ఖులైనట్టి దొరలు”
 5. “క్ష్మాతలేంద్రుల సేవ కష్టంబు, వారలిత్తురని గర్వమున నిక్కి యెగురరాదు”
 6. “మద్యపాయులతోడ మచ్చిక కారాదు, బడవాల గొప్పగాఁ బట్టరాదు,
  శాత్రవునింట భోజనము సేయఁగరాదు, సన్న్యాసులను గేలి సలుపరాదు,
  దేవభూసురవృత్తి తెరువునఁ బోరాదు, పరులాండ్రఁ గని యాసపడఁగరాదు,
  కంకోష్ఠునకు నధికార మీయఁగరాదు, చెలఁగి లోభిని చెంతఁ జేర్పరాదు,
  లంచగాండ్రను దగవుల కుంచరాదు, మాతృపితరులయెడ భక్తి మఱువరాదు”
 7. “రాజులమంచు బొజ్జలు నిమిరినఁ గాదు, అని మొనలో నఱుకాడవలయు”
 8. “ఏకచక్రముగ భూమేలిన రాజైన కడ కేడుజేనెల కాటికేను”

రాజోద్యోగులనుగూర్చి నిర్దాక్షిణ్యముగ ఖండించుటలో నీతఁ డందెవేసిన చేయి. వారి యవినీతులను నిరసించుచు నితఁడు చెప్పిన యొక్కొక్క పద్యము నక్షరలక్షల విలువ కలవి. మంత్రులు, దివానులు, బక్షీలు, ముసద్దీలు, శిరస్తాలు, రాయసములు, తుదకు గ్రామాధికారులు కూడ నితని చేతిగంటముపోటు తప్పించుకొనలేకపోయిరి.

మంత్రికుండవలసిన లక్షణములనుగూర్చి యీ క్రింది పద్యములో కవి యుద్ఘాటించిన విధము చూడుఁడు:

“కనుముక్కు తీరు, చక్కని కాంతిపొందిన శుభలక్షణంబును, సూక్ష్మబుద్ధి,
ఘనత, వివేకవిక్రమము, బాంధవ్యవిమర్శ, విలాసంబు, మానుషంబు,
సరసవాచాలత, సాహసం, బొకవేళ విద్యావిచక్షణ, విప్రపూజ,
వితరణ, మేలు భూపతియందు భయభక్తి, నీతియు, సర్వంబు నేర్చునోర్పు,
స్నానసంధ్యాద్యనుష్ఠానసంపన్నత, గాంభీర్యము, పరోపకారచింత,
ఇట్టి మంత్రిని జేర్చుకొన్నట్టి దొరకు కీర్తి, సౌఖ్యము, సకలదిగ్విజయము, సిరి
గలిగియుండును దోషముల్దొలఁగి చనును ”
(ఇది పంచపాదిసీసము; ఎత్తుగీతమును పంచపాదియే.)

ఇతడు దుర్మంత్రులను తెగ తిట్టినాడు:

 1. “విద్యాధికుల రాజు వివరించి నిలిపెనా? ఇందరేమిటికంచుఁ గుందుచుండు
  మోయీను కుగ్రాణముఁ జెప్పఁ గొట్లగింజలకు బరాతముల్ సరవి వ్రాయు,
  తిండికిఁ జేటుగాఁ బండితులేల, తెప్పున సెలవిమ్మని పోరుచుండు,
  బారిసాల్వలు దెచ్చి బహుమతులిమ్మన్న చలువకరీదు వస్త్రములనిచ్చు,
  నిట్టి యపకీర్తిమంత్రిని బెట్టఁదగదు మంచిమాటల సాగనంపించవలయు”
 2. “మంత్రులమని బొంకుమాటలాడినఁ గాదు ఇప్పింప నేర్చి తామీయవలయు”
 3. “యాచకులఁ జూచి, తల వ్రేలవేసి, పెద్దసున్న జుట్టుఁగదా ముండగన్న కొడుకు”
 4. “రాజసభలఁ బరోపకారములు దెలుప శ్రేష్ఠులకుఁ గాక దుష్టులు చెప్పఁగలరె”
 5. “పలువ మంత్రైన దొరలకు పరువు లేదు”
 6. “ధర్మవిదులైన రాజసంస్థానములను జేరు నొక్కొక్క చీవాట్లమారి శుంఠ”
 7. “మానాభిమానముల్ మాని ప్రవర్తించు మంకుగులాములు మంత్రులైరి”
 8. “పలువతో సరసంబు ప్రాణహాని యొనర్చు దుష్టుడు మంత్రైన దొరను జెఱచు”
 9. “తనకు గతిలేక ఒకరిచ్చుతఱిని, వారి మతులఁ జెఱచెడి రండకుఁ గ్రతువులేల”

రాజాస్థానమున నున్న యుద్యోగులలోఁ బ్రభువునొద్ద మిక్కిలి చనవుగల యొకానొక యధికారి తనకుఁ గీడుసేయ, నీ కవీశ్వరుఁ డతని పుట్టుపూర్వోత్తరములన్నియు నేకరువు పెట్టుచు దూషించిన విధము గమనింపఁదగినది:

“పంచాంగములు మోసి, బడవాతనము జేసి, పల్లెకూటము జెప్పి, పసులఁ గాచి
హీనవృత్తిని బిచ్చమెత్తి, గోడలు దాఁటి, ముద్దకూళ్లకుఁబోయి, మొత్తులఁ బడి,
విస్తళ్లు గుట్టి, గోవెలనంబివాకిటఁ గసవూడ్చి, లంజెల కాళ్లు పిసికి,
కన్నతొత్తుల తమ్మకళ్ళెత్తి, గతి చెడి, ఆలుబిడ్డలఁ బరులంటఁ జేసి-
నట్టి దేబెకు సిరిగల్గెనేని, వాఁడు కవివరుల దూఱు, బంధువర్గముల గేరు,
పరుని పనిమీఱు, నొకరిని జెఱుపఁగోరు”

ప్రభుని సన్నిధానవర్తులైన దుష్టాధికారులను, వారి సంకుచిత బుద్ధుల నెట్లు వర్ణించినాఁడో చూడుఁడు:

“అవనీశ్వరుఁడు మందుఁడైన, నర్థుల కీయవద్దని, వద్ది దివాను చెప్పు,
మునిషీ యొకఁడు చెప్పు, బకిషీ యొకఁడు చెప్పు, తరువాత నా మజుందారు చెప్పు,
తలఁ ద్రిప్పుచును శిరస్తా చెప్పు, వెంటనే కేలు మొగిడ్చి వకీలు చెప్పు,
దేశపాండ్యా తాను తినవలెనని చెప్పు, ముసరద్ది చెవిలోన మొనసి చెప్పు,
యశముఁ గోరిన దొరకొడుకైనవాఁడు, ఇన్ని చెప్పులు గడద్రోసి యియ్యవలయు”

రాయసములు పిండములు తిను వాయసములఁట! (రాయసములకు రూపాంతరము వ్రాయసములు. ఈ రాయసము లనఁబడువారు పూర్వము ప్రభువు సన్నిధానములో నెప్పుడు నుండువారు. సామ్రాజ్య వ్యవహారములలోఁ బ్రభువులు జారీచేయు ఫర్మానాలు, హుకుములు ఎప్పటికప్పుడు వీరే వ్రాయువారు. ఆంతరంగిక కార్యదర్శులు, అనఁగా నిప్పటి యున్నతోద్యోగుల దగ్గఱ నుండు (Private Secretaries) వంటి వారు.) అట్టివారిని గూర్చి కూడ వేంకటరాయకవీంద్రుఁడు విడువలేదు. రాయసముల వేషములనుగూర్చి యతఁడు చిత్రించిన విధమెంత సహజముగా నున్నదో చూడుఁడు:

“వంకరపాగాలు, వంపుముచ్చెలజోళ్లు, చెవిసందుకలములు, చేరుమాళ్లు
మీఁగాళ్లపై పింజలూఁగెడు ధోవతుల్, బిగితరంబైన పార్షీ మొహర్లు,
చేఁపలవంటి పుస్తీమీసముల్, కలందాన్పెట్టె, లంగవస్త్రముల చుంగు,
సొగసుగా దొర వద్ద తగినట్టు కూర్చుండి, ఱంకులాండ్రకు సిఫారసులు చేసి,
కవిభటుల కార్యములకు విఘ్నములు చేయు రాయసా ల్పిండములుదిను వాయసాలు”
కార్వేటినగర ప్రభువుల రాచఱికపు దుస్తులలో “వంకరపాగాలు” ఈనాఁటికిని ముఖ్యములయినవి. విజయదశమి దర్బా రలంకరించు రాజబంధువుల కందఱికి నీ పాగ గౌరవచిహ్నము.

ఈ కవి “కాఁపువానికి గ్రామాధికారమైన దేవభూసుర వృత్తులు తీయఁగోరు” అన్నాడు. కాని యాంధ్రదేశమున ననేకగ్రామములలో నానువాయితిగా గ్రామాధికారము కాఁపులదిగనే కనిపించుచున్నది. ఈ విషయము చరిత్రలుకూడ ఋజువుపఱుచుచున్నవి.

లోభులను చాల నీచముగను, నలక్ష్యముగను నితఁడు నిందించిన పద్యములలో హాస్యరసము తొణికిసలాడుచున్నది.

“తల్లి ఱంకున పుండ్లు తాఁకివచ్చినయట్లు, మూలనిక్షే పంబు ముణిఁగినట్లు,
కూతురి ముడుపెల్ల కొల్లబోయినయట్లు, కాణాచిపల్లెలు కాలినట్లు,
తన యాలి గడనెల్ల దండుగకయినట్లు, తండ్రి తద్దినమేమొ తప్పినట్లు,
చెల్లెపై బడి దొంగ చేసిపోయినయట్లు, కొడుకు నప్పుడె తలగొట్టినట్లు,
దిగులు పడిచూచి, మూర్ఛిల్లి, తెప్పిఱిల్లి కవుల కీయగ వద్దని కన్ను మీటు”
“వయసు దీఱిన కాంత వక్షోజముల భంగి, సంగమంబైన శిశ్నంబు కరణి,
గర్భిణియగు వారకాంత యుండెడి తీరు, పాండురోగి ముఖంబు భంగి, ముసలి
యెద్దు ముడ్డిని పేడ ఎళ్ళొచ్చు కైవడి, ఈనఁబోయిన గాడ్దెయోని కరణి
అగ్గి దాఁకినవాని యండాల పోలిక, మగఁడు పోయిన లేమ పగిది, లుబ్ధు
యాచకులఁ జూచి తల వ్రేలవేసి పెద్దసున్న జుట్టుఁగదా, ముండగన్న కొడుకు”

అత్యంత జుగుప్సాకరములగు పదములనైన జంకుకొంకులు లేక ప్రయోగించి యెల్లరకును తేటతెల్లమగునట్లు నీతులను బోధించుట యితని ముఖ్యలక్ష్యముగాఁ దోఁచుచున్నది. ఈ క్రిందివి యందుఁ గొన్ని.

 1. “తొడ పల్చనగు నింతి నడిగండి బలుపెద్ద”
 2. “చినిగిన దొండి బల్చెణుకుల కళుకు నా, వెస నూత్నబాలిక వెఱచుఁ గాక”
 3. “వ్యాసాదులగు మౌనివర్యులు తపసెల్ల పోగొట్టుకొన్నది పూకుకేను,
  జలజాతభవ శివాదులుగూడ బ్రమయుట దుర్గంధమగు నుచ్చదొండికేను”
 4. “స్ఖలితశిశ్నము వికాసంబులు కడుగొప్ప”
 5. “సుంకర్లకును, వర్ణసంకర్ల కొకసారి ముడ్డి చూపెడి తొత్తుముండలకును”
 6. “భట్టరాచార్యుల వట్టలు కాఁగానె పొసఁగ శ్రీచూర్ణపు బుఱ్ఱలౌనె?
  అలరాచకూఁతు స్మరాలయంబైనను పూజకు దాసాని పుష్పమౌనె?
  అల్ల యేలేశ్వరోపాధ్యాయు శిశ్నంబు రాచూరి పెద్దఫిరంగియౌనె?
  అల తాళ్లపాక చిన్నన్న శష్పములైన తంబురదండెకు తంతులౌనె?
  హంకరించిన యెటువంటి మంకునైన తిట్టవలయును కవులకు దిట్టమిదియె”
ఇట్టి ప్రయోగముల కొకయంతుపొంతు, హద్దుపద్దు కనఁబడదు. మెఱికలవంటి యద్భుతములగు నీతులుగూడఁ బొంకముగఁ బాఠకులకు హృదయంగమములుగ రచించిన శతకకవులలో నగ్రతాంబూలమున కీ మహాకవి సర్వవిధముల నర్హుఁడు.

పరవధూకాంక్షను సకారణముగా నిరసించునది యీ క్రింది పద్యము:

“పరకాంతపై నాసపడెడి మానవులకు నగుబాటు, మనమునఁ దగని దిగులు,
నగడు, విరుద్ధంబు, నాచారహీనత, చేసొమ్ము పోవుట, సిగ్గు చెడుట,
అపకీర్తి, బంధుజనాళి దూషించుట, నీతియుఁ దొలఁగుట, నిద్ర సెడుట,
పరలోకహాని, లంపటనొంది మూల్గుట, పరువు దప్పుట, దేహబలము చెడుట,
తన యాలి చేతిపోటునఁ గృశించుట, దాని పరుఁడు గన్గొనిన జీవంబుఁ గొనుట,
ముజ్జగము లేలు నా విరాణ్మూర్తికైన కాని దుర్వృత్తి తగదెంతవానికైన”

అదృష్టవంతుఁడగువాని కీ క్రిందివన్నియు నమరిన నదియే భూతలస్వర్గమని కవి వివరించుచున్నాఁడు:

“అగ్రజన్మము, తీరమందు వాసంబును, వితరణ గుణము, వివేక గరిమ,
సంగీత సాహిత్య సంపన్నతయు, మఱి రసయుత విబుధ సంరక్షణంబు,
అనుకూలమైన చక్కని భార్య, రాజసన్మానంబు, ప్రఖ్యాతి, మానుషంబు,
సౌందర్య, మతిదృఢశక్తి, విలాసంబు, జ్ఞానంబు, నీ పదధ్యాననిష్ఠ,
ఇన్ని విధముల నొప్పి, వర్తించు నరుఁడు భూతలస్వర్గసుఖములు పొందుచుండు”

పైఁ జెప్పినట్లు కాక, దుఃఖభాగుఁడగు సంసారి కీ క్రింది కారణములచే సన్న్యాసమే తగుననియు నాప్తులే తన కవమానము తెచ్చుచో మానవంతుఁడయినవాని కంతకంటె మించిన మార్గము లేదనియు, కవి యభిప్రాయము.

“అబ్బ మేలోర్చలేనట్టివాఁడైనను, మోహంబు గల తల్లి మూఁగదైన,
ఆలు రాకాసైన, అల్లుఁ డనాథైన, కూఁతురు పెనుఱంకుపోతుదైన,
కొడుకు తుందుడుకైన, కోడలు దొంగైన, తనకు సాధ్యుఁడుగాని తమ్ముడైన,
గృహకృత్యములు పొరుగిండ్ల వెంబడిపోయి, చెప్పి యేడ్చెడి చెడ్డచెల్లెలైన,
నరుని ఖేదంబు వర్ణింపఁ దరము కాదు, యంతటను సన్న్యసించుటయైన మేలు”

కలియుగమున ధర్మములు తాఱుమాఱయినవని యీ కవి యేవిధముగా వాపోవుచున్నాడో చూడుఁడు:

“అక్షరం బెఱుఁగని యాకారపుష్టిచే వర్ణసంకరులు విద్వాంసులైరి,
బాజారి ఱంకుకు పంచాయతీ చెప్పు పాతలంజలు వీరమాతలైరి,
గోమాత లఱువగ కోసి వండుక తిను మాలమాదిగలు భూపాలులైరి,
మానాభిమానముల్ మాని ప్రవర్తించు మంకుగులాములు మంత్రులైరి,
అహహ! కలియుగధర్మ మేమనగ వచ్చు, ఇన్నిటికి నోర్చి యూరక యుండఁ దరమె”
“వేదశాస్త్రంబులు వినసొంపు లేదాయె, సంగీతవిద్య బల్ చౌకనాయె
కవితారసజ్ఞత కలలోను లేదాయె, పారమార్థికబుద్ధి భస్మమాయె,
భూతలేంద్రులకు దుర్బుద్ధులే మెండాయె, నీచమహత్వంబె నెగడిపోయె,
వర్ణాశ్రమాచారవర్తన లేదాయె, హీనకులంబులు హెచ్చనాయె,
అవని నిఁకమీద నొక్కదుడ్డంత తళుకుయోని గల లంజముండగా నుండవలయు”

ఇట్టి యభిప్రాయమునే శ్రీనాథకవిసార్వభౌముఁడుకూడ నీ క్రింది చాటువులో వెల్లడించినాఁడు:

“కవితల్ చెప్పిన, పాడ నేర్చిన వృథా కష్టంబె; యీ భోగపుం
జవరాండ్రే కద భాగ్యశాలినులు పుంస్త్వంబేల పో, పోచకా?
సవరంగా, సొగసిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టింతువేని వరిష్ఠంబు” అని.

ఈ విధముగాఁ బరిశీలించుటకు మొదలు పెట్టిన నిది యింతటనంతట దెమలు విషయము కాదు. కనుక దీని నింతటితో ముగించి యితని ప్రయోగవిశేషములనుగూర్చి కొంచెము పరిశీలించుట మంచిది.

ఇతని శతకములోని యొక్కొక్క పద్యపాదము నొక్కొక్క సామెత యనుటలో నతిశయోక్తి లేదు. ఉపమానములు చదువుచుండిన నుపమేయములను జదువవలసిన యవసరము లేకుండనే వెంటనే పాఠకు లూహించుకొనునంత సన్నిహితత్వ మా రెండింటికీ నుండుట యీతని కవిత్వములో నొక విశిష్టత.

ఇందులో లాక్షణికవిరుద్ధ ప్రయోగములు పుంఖానుపుంఖములుగా నున్నవి. సహజకవులలో (చౌడప్ప, వేమన మొదలైనవారిలో) కూడ నిది యొక్కటే పెద్దలోపము. అయిన నట్టివారిలో నది దోషముగాఁ బరిగణించుటకంటె నిరంకుశత్వముగా సమర్థించుట యుక్తమని నా యభిప్రాయము.

ఇఁక నితని శతకములో (వేణుగోపాల శతకము) దేశ్యములు, నన్యదేశ్యములు నగు శబ్దముల ప్రయోగములు గుదిగ్రుచ్చఁబడినట్లు. (శతకము) కడవెడల నగపడుచున్నవి. జాతీయశబ్దములకు ఈతని శతకములు రెండును పెన్నిధులు. ఈ రాయలసీమ కవికిఁ దెలిసినన్ని జాతీయములు, మన తెలుఁగునాఁట నడిగడ్డపయిన జీవించిన యే కవికిని దెలిసి యుండవని చెప్పుట సాహసము కాదు. నేటికి నట్టి జాతీయకవులకు రాయలసీమ జన్మభూమి. శ్రీ గడియారమువా రట్టివారిలో నొకరనిన సమ్మతింపని యాంధ్రుఁడుండఁడు.

ఈ వేంకటరాయకవి చేసిన జాతీయప్రయోగములు కొన్నింటి నిట సూచించుట యుక్తము:

లొట్టెడు (కల్లు), గుడిసెవేటి (జార) తుందుడుకు, బేగములు, కుట్టుపోఁగులు, అధికప్రసంగి, మూతినాకు, (ఇచ్చకాలాడు), రద్ది, చంకనెక్కు, చాందిని, అమీరుసాహెబు, అతిరసాలు, దివాను, మునిషీ, బక్‍షీ, మజుందారు, శిరస్తా, వకీలు, దేశపాండ్యా, ముసరద్ది, ఱంకులాడి, మాచకమ్మ, తగవర్లు, నెత్తిగీత, గొడ్రాలిముండ, నడిగండి, పోచీలు, బగిసి (సిగ్గు), జరీకుచ్చులజీని, పంగటించు, అంబలి, తెడ్డు, బజారురచ్చ, లాహిరికసరు, కొండెసిగలు, పాకోళ్లు, కఠారులు, కాసికోకలు, డాలువార్లు, వల్లెవాట్లు, తరహా, ఎమ్మెలు, గడికరణము, గ్రామదండుగ, మడియరండ, చౌడోలు, దరిబేసి, మంకుగులాము, బాజారిఱంకు, పాతలంజ, పంచాయతి, ధగిడీ, కొణతంబు, నొష్ట, బదనిక, కూచిమతము, లంజకొడుకు, ముచ్చెలు, బడవాతనము, పల్లెకూటము, ముదిలంజ, దిడ్డికంత, ముష్టికూళ్లు, మొత్తులు, తమ్మకళ్లు, దేబె, వస్తాదుతనం, అసురతిండి, రాయసము, దీర్ఘనత్తి, వకాలతు, ఉగ్రాణకాఁడు, బుగ్గ (నీటియూఁట), చట్టు, చీవాట్లమారి, బహదరి, బడవా, దళవాయి, ధర్మచేట, పడిసేటి తొత్తు, పౌజులకమ్ములు, తాటాకు దుద్దులు, కంఠోష్ఠుడు, లంచకాండ్రు, పలువ, అచ్చినవాఁడు, హంకరింపు, చల్లడము, చౌకట్లు, మీర్జాకుళాయి, బులాకు, బాజిబందు, వంకరపాగాలు, చేరుమాళ్లు, పింజెలు, పార్షి మొహర్లు, కలందానుపెట్టె, సిపారసులు, సున్నచుట్టు, ఎంగిలియెగ్గు, పలుగాకులు, మేకమెడచన్నులు, బొండుమల్లెలు, బారాహజారి, పిసినారి, మోయీను, బరాతము, ఏడు జేనెల కాటికి, ముడ్డిచూపు, బంగిబాయీలు, రంకులరాట్నము, ద్రాబ, తెగ తినడము, పోతురాజు, కాటేరి, కొక్కురాళ్లు, గుత్తలంజ.

ఇట్టి జాతీయములన్నియు మన భాషాశాస్త్రవేత్తలు పరిశోధించి, ప్రత్యేకముగా నొక కోశము తయారుచేసి భాషాదేవి కొక భూషణముగా సమర్పించుట యెంతైన నవసరము. అప్పుడుగాని మన సారస్వత మహత్య మిట్టిదని, మన స్వతంత్ర వాఙ్మయసంపద యింతటిదని గ్రహింపఁజాలము. అట్టి సుదిన మెన్నడో!

ఇకఁ బ్రస్తుత మితనిచే వ్రాయఁబడిన మఱియొక శతకము లావణ్య శతకమును గూర్చి యించుక తెలిసికొందము. ఈ శతకము తన ప్రభువైన శ్రీమాకరాజు వేంకట పెరుమాళ్లరాజుగారి ప్రోత్సాహముచేత “పురుషవిరహంబు శ్రీహరిస్మరణశృంగారంబు” గాఁ దాను రచించుచున్నానని కవి చెప్పుకొనినట్లు ఇదివఱకే తెలిపియున్నాను.

లావణ్య శతకములోని శృంగారము మార్దవముగను, సరసముగను, హృదయంగమముగను నడచినది. పచ్చిబూతులబుంగ కాదు. జుగుప్స కలిగించునది కాదు. మన ప్రబంధకర్తలలో చాలమంది సంభోగవర్ణనలు మొదలైనవి వర్ణించు ప్రసక్తి వచ్చునప్పటి కట్టివానికి దీర్ఘసంస్కృతజటిలసమాసముల ‘బురఖా’ తగిలించుచు వచ్చిరి.

ఆంధ్రకవితా పితామహుని శృంగార పద్యము మచ్చునకు చూపెదను:

“సహసా నఖంపచ స్తనదత్తపరిరంభ మామూలపరిచుంబితాధరోష్ఠ
మతిశయ ప్రేమకల్పిత దంతసంబాధ మగణితగ్లాని, శయ్యానిపాత
మతివేలమణిత యాచ్ఞార్థగల్ల చపేట మతిదీన వాక్సూచి తాత్మవిరహ
మంకురత్పులక జాలక విద్ధ సర్వాంగ మానందకృత హారవా సనాబ్జ
మాక్రమక్షీణ మతివర్ణ మానిమీలితాక్ష మాస్విన్నగండ మాయత్తచేష్ట,
మాస్తిమితభాషణారవ మావధూటిప్రథమసురతంబు గంధర్వపతిఁ గరంచె”

ఇతని సమకాలికుఁడే యయిన ధూర్జటి యొక మెట్టు క్రిందికి దిగి, వర్ణించిన శృంగార మంత నిగూఢము కాదు:

“మంచలమీఁద నెక్కి, కటిమండలిఁ జుట్టిన పాఱుటాకు లిం
చించుక సంచలించి మరునిల్లు బయల్పడఁ జేయఁ బిట్టలం
జెంచెత లార్చివ్రేయుదురు చిత్రముగా, నొడిపిళ్ల, బాహుమూ
లాంచితదీధితుల్ చిఱుతలైన చనుంగవమీఁదఁ బర్వఁగన్”

ఇఁకఁ గుండ బ్రద్దలుకొట్టినట్లు, బాహాటముగా, శృంగార విషయములను దేటతెనుఁగులోఁ జెప్పిన శేషము వేంకటకవీంద్రుని యీ క్రింది పద్యము చిత్తగింపుఁడు:

“కన్నాత లాగించి కాంతుమోము గదించి, సారెసారెకు మోవి చప్పరించి,
రతి చాతురికి మెచ్చి, రమణుఁ గౌఁగిటఁ గ్రుచ్చి, మోహాన నూఱాఱు ముద్దులిచ్చి,
తనియక యెదురెక్కి దయచేయుమని మ్రొక్కి గుదికాళ్లు వెన్నునఁ గూర్చి నొక్కి
మదనుశాస్త్ర మెఱింగి, మనసు కొంకు దొఱంగి, కాయంబు లొక్కటిగాఁగ మెలఁగి,
అరిది సూదంటుశిలవలె హత్తిహత్తి, గొనబుఁ దీవియ చందానఁ బెనఁగి పెనఁగి,
కౌముదిని జంద్రశిలవలెఁ గరఁగి కరఁగి, సమరతుల నేలె, నా బాల సరసలీల”

కవిచౌడప్ప సరేసరి. రసాభాస శృంగారమున కతఁడు పెట్టినది భిక్ష! దొంగదాపఱికములు - చాటుమాటు లతని కేకోశమునను లేవు. గ్రామ్యశృంగార మెంతసొగసుగ వర్ణించినాఁడో గమనించుఁడు.

“అడియేన్ ‘దాస’నటంచును జడియక మడి జాఱఁదీసి సాతనివనితన్
గుడి వెనుక నంబి చేసెను ‘గడసాధన’ కుందవరపు కవిచౌడప్పా”
ఇందులోని నాజూకేమనఁగా - నసభ్యశబ్దములు వాడకుండ నసభ్యశృంగారము నుటంకించుట. ఇది కొంచెము గడుసరితనమే. ఈ చమత్కారము, చాకచక్యము అందఱికిని రాదు. పచ్చిబూతైనను నెబ్బెఱికము కనఁబడదు. పైగా ‘నంబుల’ యవినీతికి మంచి కొరడాదెబ్బ. కనుకనే యతని కవిత్వములో, బూతనుకొనినదానిలోనే, నీతియు నుండును. ఆ మాట నతఁడే చెప్పినాఁడు. “నీతులు బూతులు లోకఖ్యాతులు” అని. కావున నెంతశృంగారమైనను బ్రతి కవియుఁ దన కృతిలోఁ దడవక విడువఁడు. కాని యాయా కవుల యభిరుచులనుబట్టి లేఁత ముదురు పాకములలో నది సాఁగుచుండును.

వేంకటరాయకవికృతమయిన యీ లావణ్య శతకరచన పరిశీలించిన, శేషము వేంకటపతి పద్యములకు, చౌడప్ప పద్యములకు మధ్యస్థమయిన ధోరణిలో నడచినదని దృఢముగాఁ జెప్పవచ్చును.

ఇక నిట్టి శృంగార శతకములను రాజాశ్రితులైన కవులు తమ ప్రభువుల ప్రోత్సాహము చేత వ్రాయు పద్ధతి యా కాలమున నుండునట్లు కనఁబడుచున్నది. కార్వేటినగరాస్థానకవియైన యీ పోలిపెద్ది వేంకటరాయఁడు “లావణ్య శతకము” వ్రాయఁగా, వేంకటగిరి సంస్థానాస్థానకవియైన గోపీనాథము వేంకటకవి “బ్రహ్మానంద శతకము” వ్రాసినాఁడు. ఈ రెండు శతకములకు మకుటనిర్మాణముకూడ నొక క్రొత్త త్రోవను దొక్కినది. “వశమె శ్రీరామరామ, లావణ్యసీమ” యనునది లావణ్య శతక మకుటము. “అరసి చూడ బ్రహ్మానంద మదియ కాదె” యనునది బ్రహ్మానంద శతక మకుటము. కాని ‘లావణ్య’ శబ్దము శృంగారరసపోషక సన్నిహిత సాధనమయినట్లు “బ్రహ్మానంద” శబ్దము కాఁజాలదు. పైఁగాఁ దత్త్వజిజ్ఞాసువులు చదువుటకుఁ బుస్తకము తెఱచిననే తప్ప యిది యిట్టివిషయమును బోధించునను సంగతి గ్రహింపలేరు. రామాయణమువంటి పవిత్రగ్రంథమును రచించిన వేంకటకవి, యీ బూతు శతకమునకు ‘బ్రహ్మానంద శతక’మని పేరు పెట్టుట యెంతవఱకు సమంజసమో కాని, పాఠకలోకమును మాత్రము వాత్స్యాయన కూచిమారాదుల శాస్త్రాంశములలోనికి ‘బోల్తా’ కొట్టించును. ఈ యభిప్రాయము, అనఁగాఁ గేవలము కామకళాప్రపూర్ణతయే బ్రహ్మానందమను సిద్ధాంతమును పెద్దన్నగారు కూడ సమ్మతించిరి. “ఎందే నింద్రియముల్ సుఖంబు గను నా యింపే పరబ్రహ్మ ‘మానందో బ్రహ్మ’ మటన్న ప్రాఁజదువు నంతర్బుద్ధి నూహింపుమా” అని.

బ్రహ్మానంద శతకముకంటె లావణ్య శతకము పదలాలిత్యములోను, నర్థగౌరవములోను, భావప్రపుష్టిలోను జాతీయశబ్దజాల ప్రయోగములోను, ధారాశుద్ధిలోను, శృంగారరసావిష్కరణ సౌష్ఠవములోను నుత్కృష్టమైనది.

ఇందులోని యెత్తుగీతములు సాధారణముగా నంత్యప్రాసనియమముతో “బారాహజారి”వలె ‘కదం’ త్రొక్కుచు సీసపద్యమునకు నైజమయిన గాంభీర్యమును బ్రస్ఫుటము చేయుచుండును. ఈ క్రింద నట్టివానిని కొన్నిటిని సూచించుట యవసరము.

 1. “మదిని దలపోసి, యితర రామలను రోసి, నేర్పు లెడఁజేసి, కంటికి నిదురఁ బాసి, మమత నిను డాసి, యుండక మరుని గాసి”
 2. “వెలఁది! కడుసోలి, బ్రతిమాలి, వెతల చాలి, భావమటు తూలి, తమిఁ దేలి, పాలుమాలి, యెడతెగని బాళి, నీ జోలికింత జాలి”
 3. “ఎపుడు నేఁ గందు, నీ యుసురెవరిఁ జెందు, నెటుల మతిఁ బొందు, నీ తమి కేమిమందు, జాలి నెటులొంచు, దెవతె నీ సరిపసందు”
 4. “తగని మరులాయె, మానసోద్భవుని మాయ గెలువరాదాయె, మనసేమొ నిలువదాయె, క్షణము యుగమాయె, నిపుడింత చలము సేయ”
 5. “వింత నీ చెంత లేని నివ్వెఱఁగు, కాంత! వేసవొక్కింత, తమియింత, వెగటు కొంత, యీ దినము నంతకంత నీమీఁది చింత”
 6. “బడలికను లేచి, నెమ్మోము పాఱఁ జూచి, మది నొకటి దోఁచి, నవ్వి యమ్మాట దాఁచి, చేతఁజేయూచి పలుకు నీ చెలువ మెన్న”
 7. “అనుచు నేనుందు, నేఁటికి నబ్బె సందు, కనికరము జెందు, మనసుకీ కపట మెందుకొఱకు, నీ పొందు లేనిదే కొదవయెందు”
 8. “విరహు లదరంగఁ, దమ్ముల వేడ్క క్రుంగఁ, గలువ లుప్పొంగ, నింగి రెక్కలు చెలంగ, గ్రౌర్యము వెలుంగ, మింటజక్కవల గొంగ”
 9. “పాదములు ముట్టి, గండదీపంబు దట్టి, చేతఁ జెయి వెట్టి, యాకున శిరముగొట్టి బాసచేసిన
 10. “వలపులమిటారి నిత్యము వచ్చుదారి చూచి వేసారి, మనమున సొంపుమీఱి, మగువ నొకసారి, నెనయక మరుని బారి”
ఇట్టి వింకను గలవు.

ఈ శతకములో - దేశ్యములు, జాతీయములు కుప్పలుతిప్పలుగా నున్నవి. అందులోఁ గొన్ని:

తొడల కొక్కెసము, అత్తరురవ మెఱుఁగు, కడాని హొరంగు, జలపూఁత, ముమ్మరించు, బిందీలు, పికిలిచెండ్లు, కుసుంబావన్నె, కసికాటు, సురటి, లంకెలు, అక్కళించు, డింకిసేయు, పికిలిపిట్టలు, కీల్గంటు, సరిగెకంగోరు, ఠాయి, జులాయింపు, జరీపాగా, తురాయి, విరులపంకా, ఊదారంగు, సికాకుళము సెల్లా, హవుసు, హొయలు, జమాయించు, సునాయించు, ఎలగోలు, ముత్యాలచేర్లు, ముప్పరిపట్టు పగ్గాలు, చేవ కంబాలు, అద్దాల బారు, పరదాలచాటు, కటికెములు (దారిచూపు చోపుదారులు), పచ్చాకూదుబత్తీలు, పన్నీరు, గంబురు, గులాబి యత్తరు, అరగజాలు, క్రొత్తకైరావళ్లు, రసదాడి, కైలాగులు, గులాల్వన్నె, మొల్కపాంజేలు, జొత్తుపెట్టెలు, చెఱఁగుమాయు, తలుపుగుబ్బలు, బరిణెకప్పులు, వీణెకాయలు, పుట్టచెండ్లు, రసగుండ్లు, కారంజి, పచ్చాకుదిండు, తక్కెంబు, సవరణపఱచు, కందువమాటలు, లోడీలు, జెట్టీలు, మసకాడు, తీగెపన్నీరుపూవు, ఉడాయిపావడ, గరిడి, పచ్చిబోయ, వేరువిత్తు, బుగ్గపోటులు, జుంటితేనె, మోజు, జల్తారుపేటు, గిల్కుమట్టెలు, రవకసీదా గోటు, పచ్చిమరాటి మొగ్గ, దవనంపు మొలక, గోవజవాది బరణి, దర్పకుని బొక్కసము, లోక తరబడి, కన్నడదస్తురి, రతిహుమాపిట్ట, ఆకుమడుపులు, పేటులెత్తు, తాపితా రయిక, కైజీతములవారు.

అన్యదేశ్యము లీకవి ప్రయోగించినన్ని మఱే కవియుఁ ప్రయోగించి యుండఁడేమో! హైదరు టిప్పుసుల్తానుల కర్ణాటప్రభుత్వములోఁ దెలుఁగుసంస్థానము లన్నిటిలోను నిరాఘాటముగా నన్యదేశ్యాలు వ్యవహరించుచు వచ్చుటచేత, నవి మన భాషలో నొక భాగమయి, స్థిరముగా నిలిచిపోయినవి. ఈ కవి యట్టిపదముల నందముగాఁ బద్యపాదములలో సందర్భానుసారముగా చేర్చుటవలన నితని కవిత్వమున కొక వింతశోభ వచ్చినది. అట్టివానిని గొన్నిఁటి నీక్రింద చూపుదును.
“గజనిమ్మపండ్లు నే నజరు చేసెద” - “తీపైన బేషక్ మఠా పఠాన్ తుర్కి కచ్చీ మాదువాను తేజీల పాగ” - “జుల్పతీపిల్ల” - “చిగురు భాండాకమ్మి” - “అస్సల్ కడాని బొమ్మ” “నిద్దా హొంతకారి” - “గరిగు లేతాకు తేగా బాదుషా” - “సామువస్తాదు” - “కన్నడదస్తురి” - “సెబాసు షట్పదమా” - “పికమా బళారె” - “దస్తురుమాలు” - “ముస్తీబు” “కంకణంబులు మొఱయ పంఖాలు పూని” - “బిరుదు జట్టీ” - “లోడీలు” - “ఇంగిలీక పరఖు” - “జాఫల్ రసంబు”- “గుర్షా పూలు” - “ గుల్ఖందు” - “చొక్కపు జవాజి” - “జాఫరా అగరు” - “కచేరీ” - “నకలు” - “సరదార్లు” - “బల్కుషామతు”ను జెంది - “ఖూబైన బాసుజిలీబు తేజీ” - “హరోలుతయారి కతారు” - “జల్తారు భారీపోషకు” - “బహుపరాకు” - “జాతి జంగాతి బనాతి కనాతి సరాతి లోదటను సూరవుతు” లందు - “మొఖమల్ ఖురాళ” మిమ్ముగ - “నఖాసీ” చుట్టు - “తగుట చీనీలు” - “నమరుష మేనా” - “కలశములు” - “కమాను” వాకిళ్లు - నీలంపు “మేకీలు” - “కొణిగె” తీరు - అద్దాల బారు “గుడారు” - “చదురు” సేయంగ - “హొయలు” - “భారీబురాన్పురీ” పాగ - చెంగావి “కుతినీ తమాను” - “ఖుబువహవాజల్దుఘోడా” - “సఫేదా” రంగు - “మహలె”క్కి దారిజూచి - “బాకి” చెల్లగ - “నులఫా” లొసంగి - “పౌజు” లెల్లను “రాయబారులు” సేయ - “ఫాదుషా” - “తురాయి” - “భేషైన” రవల “సర్ఫేషు” - “జిగిబర్దవాని తెగా” వరపై - “మొఖమల్ గలీబా” - “తేజీపఠాణి” - “కీనుఖాబు” పావడ - “జరీబుటా” వల్వ - “మహతాబి” చీర - “బస్తా” వన్నె - “కుసుంబా కలాబతు” - “ముగాదు” - సొగసు “కల్మా”.

ఇట్టి యన్యదేశ్యములు శ్రీకృష్ణరాయల కాలమునకే మన సారస్వతములో విశేషముగా చేరినవనుట కీ క్రింది పద్యము లుదాహరణములు. (ఇవి యెవరి రచనమో తెలియదు).
“రాయగ్రామణి, కృష్ణరాయ భవదుగ్ర క్రూరఖడ్గాహిచే
గాయంబూడ్చి కళింగదేశ నృపతుల్ “కానర్ఝరీపోషణీ
మాయాభీకు ముటూరులోటు కుహుటూ మాయాసటా జాహరే
మాయాగ్గేయమడే” యటండ్రు దివి రంభాజూకునిం జోరునిన్”
“సమరక్షోణిని గృష్ణరాయల భుజశాతాసిచేఁ బడ్డ, దు
ర్దమదోర్దండ పుళిందకోటి యవనవ్రాతంబు, సప్తాశ్వమా
ర్గమునం గాంచి ‘సెబాసహో, హరిహరంగా ఖూబు ఘోడాకి తే
తుముకీ బాయిల బాయి దే ములికి’ యందుర్మింటికిం బోవుచున్”

తరువాతకూడ చాలమంది మధ్యకవు లీయన్యదేశ్యపద ప్రయోగములమీఁద మోజుపడిరి. ఆధునికులలో శ్రీకళాప్రపూర్ణులు వేదము వేంకటరాయశాస్త్రులవారు:

“బురసాపట్టు జరీబుటా పరికిణీముస్తీబుతో సాదరా,
బురఖా తోడ జవాహరీ పటలితో భూకాంత కూడెన్ మధున్”

శ్రీ తిరుపతివేంకటకవులును

“దేఖో హుకు” మంచు నిచ్చె - బంగారుజడ “బరాబరులు” చేయ
క్రుద్ధుఁడగు భీష్ము ముందర “కోన్కిస్క”
ఈ విధముగా శబ్దము లుపయోగించినారు. శ్రీజాషువాగారి కవిత్వములో నీలాటివి చాలఁ గలవు. ప్రకృతము మన మింగ్లీషుపదములు చాల వాడుచున్నాము. పక్కా సంస్కృతము, కల్తీ లేని యచ్చతెనుఁగు పదములు తప్పఁ దక్కినవి వాడరాదను దీక్షతో మడికట్టుకొని కూర్చుండు ఛాందసులను మినహాయించిన, భాషకుఁ దుష్టి, పుష్టి కూర్పవలయునను కవులు దేశకాలపాత్రల ననుసరించి, కవిత్వము సాగించిననే తప్ప, వారి గ్రంథములకు లోకములో ‘చెలామణి’ యుండదు. నన్నయ నాఁటి సాహిత్యము అంతమాత్రము చేతఁ దుడిచిపెట్టుకొని పోదు. ఆ మాటకు వచ్చిన “ఏను, ఏము, ఈవు, ఈరు, కోలె, బలె, ఆకె, ఈకె” మొదలగు శబ్దములను, “ అట్లుకానినాఁడు, అగుటం జేసి, భక్తిమైన్” మొదలగు ప్రయోగముల నెందఱు చేయుచున్నారు? నన్నయభట్టు సీసపద్య నియమము నెందఱు పాటించుచున్నారు? భాషాభిజ్ఞులు, శబ్దసాధకులు నాయా కాలముల ననుసరించి, వాడుకలోనుండు జాతీయములను, విపరీతముగాఁ దమ గ్రంథములలో నుపయోగించుచునే వచ్చిరి. అట్టివారిలో పాల్కురికి సోమనాథుఁడు, నన్నెచోడుఁడు మున్నగు మహాకవులు ముఖ్యులు. ఈ పోలిపెద్ది వేంకటరాయకవివంటి శతకకవులుకూడ చాలమంది యా రకమునకుఁ జెందినవారే! అట్టివా రుపయోగించిన జాతీయముల నన్నింటిని పరిశోధించి, వాని యర్థనిర్ణయమును జేయుటకు శబ్దశాస్త్రవేత్తలు పూనుకొనిన, తమిళమువలెనే మన భాష కూడ స్వతంత్రముగాఁ బ్రకాశింపఁగలదు. వాఙ్మయమును సంపద్వంతము కాఁగలదు.

ఇకఁ బ్రకృతము లావణ్య శతకకారుని కాలమున కాంధ్రపురంధ్రు లెట్టి యాభరణములు ధరించువారో యతఁడు సూచించిన కొన్ని నగలను బట్టి తెలియఁగలదు.

(1) పాపటచేర్లు, (2) బిందీలు, (3) బాజుబందులు, (4) రాకడి, (5) నెలవంకరతనంపు బిళ్లలు, (6) ఒడ్డాణము (గంటలు), (7) చెంపఖల్లీలు, (8) చంద్రహారములు, (9) పోచీలు, (10) కంకణాలు, (11) సరలు, (12) పాటీలు, (18) గొలుసులు, (14) పావడంబులు, (15) చిఱుగజ్జెలు, (16) అందెలు, (17) మొల్కపాంజేలు, (18) వజ్రాల బేసరి, (19) బులాకీనత్తు, (20) చేకట్లు, (21) పైఁడి కుచ్చులు.

జాతీయాలు కొన్ని:

(1) నేరమా, పల్కు బంగారమా? (2) అతివ, దానిల్లు బంగారమైరి. (3) పూమొగ్గతో బుగ్గపోటులు, (4) గ్రుక్క త్రిప్పదు దాని గొంతుకోయ, (5) కాపురాలు గుత్తసేయు, (6) పైమాట లొకలక్ష పలుకవచ్చు, (7) మిద్దెపై పరుగులు, (8) మీసాలపై తేనె, (9) ఏనుఁగుదిన్న వెలఁగకాయలు, (10) దూరమగు కొండనునుపు.

లావణ్య శతకమునందును, వేణుగోపాల శతకమందువలెనే లాక్షణికవిరుద్ధ ప్రయోగములు గలవు:

సేనా (చాల), చెయ్యి, పట్టనియవె, తరబడైన, మోవంచు (మోవి + అంచు), సరేను, పావురగతి, ఆనితే, పట్టితే, అయింది, తెలుసు, మూతువు, చేసుక, తెలుసుక, పోతే పోదాము, - ఇట్టివున్నను నందులో కొన్ని (ఛందోనియమములకు భంగము కలిగింపనివి) సవరించుటకు వీలుపడును.

ఈ శతకములో సరిగ నూఱుపద్యములున్నవి. అన్నిటిలోను శృంగారరసము తొణికిసలాడుచున్నది. సాధారణముగా నిందలి పద్యములలో వర్ణితలయిన నాయికలు ముగ్ధాప్రౌఢలు. కన్యావర్ణనముకూడ నొకానొక చోట నున్నది; పైఁగా నాయికలను (ఆయా పరిస్థితులలో స్వభావసిద్ధముగా) ఉచిత నేపథ్యములతో రసనంతముగాఁ బాఠకుల కన్నులకు కట్టునట్లు చిత్రించి నిలుపుటలో వేంకటరాయకవి మిక్కిలి చాకచక్యము కలవాఁడు.

కన్యావస్థలో నున్నదాని చేష్టలనుగూర్చి యీ క్రిందిపద్య మెంత యద్భుతముగా నున్నదో గమనింపుఁడు:

“తాళిగట్టని చిన్నతనమునఁ దన యీడు చేడియలను గూడి యాడుచుండి,
ననుఁ జూచి ‘బావవచ్చె’ నటంచు, బాజుబందులక్రింది చెండ్లంది దుముకులాడ,
పరుగున నాదుపైఁ బడి, కౌఁగిలించిన, ఎనలేని కడువేడ్క నెత్తి, లేత
మొలక మెఱుంగుచన్నులు, నాభి, చెక్కులు, గళమును, పచ్చవిల్కానినగరు,
ముద్దు పెట్టుక నవ్వుచు, ‘ముదిత, నీవు ఎవరి పెండ్లాడెద’ వటంచు నేను బలుక
‘నిన్నె’ యని మీసములు బాటు నీటుదలఁప పశమటే, రామరామ లావణ్యసీమ!”

ఈ క్రిందిది ముగ్ధా వర్ణనము. తొలికేళి రాత్రి గడచినపిదప యుదయముననే చెలికత్తెలకు నాయికకు జరిగిన సంభాషణ మిందులో నున్నది.

“అది కేళికను మై యలసియుండిన తీరు గని నేస్తమగు జోడుగరితలెల్ల
‘సతి, రేయి పతి సేయు రతి వింతలే’ మన, ‘నేమందు? నదియ నే నెఱుఁగఁ, బాన్పు
చేరఁబోవగను గుచ్చెలఁ బట్టి తీసిన వడి, నీవిముడియును వదలె; నపుడు
సిగ్గుచేఁ బయ్యెదచెఱఁగు దివ్వెకుఁ దెఱచాటు సేయఁగ హారచయమునందుఁ
గలుగు రతనాలు దివెలుగా వెలుంగ నతిభయంబునఁ గనులు మూసితిని,
నవల నేమి కనుగొన’ నని పల్కు ప్రేమ దలఁప!”

ప్రౌఢా వర్ణనము:

“సమబంధ మొనరించు సమయముందునఁ గరమ్ములు మధ్యమునకు లంకెలు దవిల్చి,
గుదికాళ్లు పిఱుఁదల నదిమి, వాతెఱల నొండొండఁ బల్మొనలతో నొరయఁ గొనుచు,
ఱెక్కలన్గూర్చి, కన్ ఱెప్ప లల్లార్చుచుఁ గడుపక్కళించి వెన్కలకుఁ దిరిగి
తను చివుక్కనఁగ ‘బైకొను విధంబిది గాదు డింక సేయుదము లెండి’ యని లేచి
‘ వెనుకఁ జిక్కితిరో’ యని వెన్ను జఱచి నొసట చెమ్మటఁ బయ్యెద నొత్తికొనుచు
నిలిచి ననుఁ జూచి పలికిన నీటుదలఁప”

అభిసారికా వర్ణనము: (సంకేతస్థలమునకు నాయకునికిఁ గబురు పెట్టుట)

“పసమించు నెమ్మేనఁ బసపాని, మెత్తని పాదంబులకు జొత్తు పట్టెలుంచి,
తళ్కు చెక్కిళ్లఁ జేతుల మంచిగందమ్ము బూసి, కుంకుమ నడ్డఁబొట్టు వెట్టి,
జాజిపువ్వుల మంచిజాఱు కొప్పమరించి, సొగసుకాటుక కనుసోగ దీర్చి,
‘చెఱఁగు మాసె, నిఁకేమి సేతు’ నంచని భర్తతోఁ బొంకి, ననుఁ బ్రేమతో నుపవని
కలువకొలనికిఁ బడమటిగట్టు పొన్నగున్నలకుఁ దోడి తెమ్మని గుఱుతు చెప్పి,
కన్నె నంపించునాఁటి సౌఖ్యము దలంప”

ఖండితా వర్ణనము:

“పసుపునిగ్గైన దుప్పటితోడఁ, గాటుకమరకాను దుస్తు రుమాలుతోడఁ
జెక్కిటఁ గొనగోటి జీరలతోడ, నవ్వెలందిచ్చు దొంతర విడెముతోడ,
నతివ పల్కొనకాటు లారని మోవితో వెన్నున కీల్జడ వ్రేటుతోడ
సొగసైన నిద్దుర సొలపుతో, రతులకు బడలిన నెమ్మోము బాగుతోడ
నే నితరకాంతఁ గూడి రాఁగానె, యున్న చిన్నె పరికించి మనమునఁ జిడిముడగుచు
నపుడు నిను నీవె దూరుకొన్నది తలంప”

కోపనా వర్ణనము:

“కోపమేటికి? ముద్దుగుల్కు నెమ్మొగమెత్తి చూడవే నను బాల సుగుణశీల,
వలచి వచ్చితి నంచు వంచనేమిటికి నన్మన్నించవే భామ మధురసీమ,
చుల్కచేయక తేనెఁ జిల్కఁ బ్రేమఁగ నొక్క మాటాడవే యింతి, మదనుదంతి,
గబ్బిగుబ్బల ఱొమ్ముఁ గదియించి నాయెద నానవే యో చాన హంసయాన
యేలనే గోల? చలము నీకేల? సైఁపఁజాల, నీ జాలమేల? నన్ జాలరతులఁ
దేల దయ నేలకున్న నీ వేళఁ దాళ”

ఈ శతకములోఁ జాలవఱకుఁ గవి ప్రౌఢలనే వర్ణించినాఁడు. అందుచేత ఇందలి పద్యములు నాయికానాయకుల ప్రణయానుభూతికి నిదర్శనములైన యనేక శృంగారచేష్టలను బ్రదర్శించునవిగా నున్నవి.

 1. ఉపరతి:
  “తమిని కళలూర, నొసటఁ గ్రొంజెమట జాఱఁ, గదలవదలని యెదనెద నదిమినదిమి
  యుపరతి యొనర్చునాఁటి నీ హొయలు దలఁతు” (ప్రౌఢ)
 2. తొలిరతి:
  “నూతనకేళి నే నొనరింపఁ బూనినఁ జిడిముడి, లోజంకు, సిగ్గు, వెఱగు
  వేఁగుట, వేసట, వెల్లవాటును, జాలి, మడిమ విదల్పు, పెందొడల వడఁకు,
  బొమముడి, కనుమూఁత, మోవియార్చుట, లల్త, మైచెమర్చుట, తడంబడుట, సొలపు
  పలుమొన బిగియించు పటిమ, యధైర్యంబు, కసరు, తొందర, బాళి, కడలుకొనఁగ;
  బొలఁతి నన్నెంచనపుడు, నే బుజ్జగించఁ గౌను నసియాడ, మన్మథకళలు వీడ,
  రత మొనర్చిన నాఁటి నీ వితము నెన్న” (ముగ్ధ)
 3. మార్నీటిరేయి రతి:
  “... ... ... ... ... ... ... ... ... ... ... ... గొలుసులు పావడంబులు చిఱుగజ్జె లం,
  దెలు పదమ్ముల ఝళంఝళలు సేయ, వలరాయనింట జిల్జిలమంచుఁ గళఁ గుసుం-
  బాపువ్వు రసము కైవడిని గురియ, బోటి మార్నీటిరేయి నీతోటి నెనయు
  నాఁటి వేడుక లింక నేనాఁటికైన కోటి యిచ్చినఁ గల్గ దాపాటి దలఁప”
 4. వేసవినాటి రతి: (ఈ భోగము రాజులకు ఆ కాలములో సహజము)
  “కారంజిలో నీతకాయల మోపాని తేలెడు పచ్చని తెప్పపల్క
  పై; గెంపురాకోళ్ళ పట్టెనుంచము దోమ తెఱుచుట్టు, దివ్వెకంబాలబారు
  తొడిమ తీసిన రెక్క విడు మల్లెపూ పాన్పు, పచ్చాకుదిండ్లు, కోపైన లోడు,
  దనరు కుంకుమపువ్వు, తక్కెంబు, కీలుబొమ్మలు వేయు పంఖాల చలువగాడ్పు
  లెగయ వేసవినెలఁ బవ్వళించియున్న వచ్చి చెయ్యానితే, ఎక్కివత్తు ననుచుఁ
  బలికి నాతోడఁ గలసిన వగల నెన్న”

ఆయా దేశస్త్రీల కేశబంధనములు: “కన్నడదస్తూరిగా సిగ వేసి” - యనుటలో, సిగముడి నాజూకుగా వేయుటలోఁ గర్ణాటాంగనలు ప్రసిద్ధి కెక్కినవారని కవి యభిప్రాయము. అదే విధముగాఁ బాండ్యదేశస్త్రీలు గొజ్జంగిపూలరేకులతో జడలు సొంపుగా నల్లుకొనువారని, కళింగకామినులు రకరకాల కీలుగంట్లు వేసికొందురని, విదర్భకాంతలు మెడల కానునట్లుగా నునుగొప్పులు సవరించుకొనువారని వర్ణించినాఁడు.

అయిన వర్ణనార్హములయిన విషయములు శృంగారవతులలో నెన్నియో యుండఁగా నాయా దేశస్త్రీల కురుల సౌభాగ్యమును మాత్రమే (అంతగా) యీ శతకములో ముచ్చటింపవలసిన యవసరమేమి? - అనఁగా “కురూపికైనను కురులంద”మను లోకోక్తి యున్నది కదా!

ఇటీవల మన రాష్ట్రములో “నందాల రాణి” నెన్నుకొను విషయమున “క్రొమ్ముడి” ప్రాధాన్యము వహించినది. “అజంతా” శిల్పచిత్రములలోని రమణులవలె కురుల “క్రొమ్ముడి” దిద్దుకొనినదఁట! అది నిర్ణాయకుల దృష్టి నాకర్షించుటచేత నే యీ వనితామతల్లి రాష్ట్రములోని తక్కిన యందకత్తెల నందఱిని తలఁదన్ని న సౌందర్యవతిగా వారిచేత తీర్మానింపఁబడినది.

కేశసంపద ప్రాశస్త్యమును దెలుపుటకు దీని నింత విపులముగా ముచ్చటింపవలసి వచ్చినది.

ఇంక నీ కవికాలమునకు భోగులైనవారు ధరించు నంబరములను గుఱించి యక్కడక్కడ నీ శతకములోఁ బ్రస్తావించుటవలన వాని యాధిక్యత స్పష్టమగుచున్నది. చూడుఁడు:
అభ్యంగన స్నానమైన పిమ్మట -

 1. ‘సికాకుళము’ సెల్లా నొంటి కొంగు గట్టి,
 2. ‘మైసూరుకుతినీ’ తమాను వేసుక, జరీపాగా తురాయి గన్పడఁగఁ జుట్టి,
 3. ‘సీమపన్నీరు’ పైఁ జిలుకుచు హొయలుగా భారీబురాన్పురీపాగ చుట్టి,
 4. ‘నారాయణవనంబు చీరె’ కుచ్చంచులు మీఁగాళ్ల కెలమిఁ గైలాగు లెసఁగ,
 5. ‘జల్తారుపేటు గంజముచీర’ కుచ్చిళ్లు గిల్కుమట్టెలఁ దట్టి పల్కరింప,
 6. “వాసించు ‘గోవజవాది’ బరణి”
దాదాపు శతాబ్దము క్రిందవఱుకు మన దేశమునకు విదేశములకు వ్యాపారము (ఇప్పటివలె నిర్బంధములతోఁ గాక) ధారాళముగా సాగుచుండునది. మన దేశములోఁ దయారగు శ్రీకాకుళము సెల్లాలకును, మైసూరు (కుతిని) పట్టుకు, జరీయంచులు గల గంజాము చీరలకు, నారాయణవనము కోకలకు మన తెలుఁగునాటిలోననే కాక, దేశవ్యాప్తమయిన ప్రఖ్యాతి యుండునట్లు కనిపించుచున్నది. కాని పాశ్చాత్యదేశముల నేతయంత్రముల పోటీకి నిలువలేక శ్రీకాకుళము రవసెల్లాలు, గంజాము చీరలు రూపుమాసినవి. కాని నారాయణవనము చీరెలకు పంచెలకు నేఁటికిని బ్రసిద్ధి కలదు. అక్కడి నేతవస్త్రములు, చాల చిక్కనగను, సున్నితముగ నుండును. ఇకఁ బట్టుపరిశ్రమకు నేఁడే కాక యానాఁడును మైసూరు పేరు గడించినది. ఇప్పుడు మైసూరుపట్టునే “ బెంగుళూరు” పట్టు అనుచున్నాము.

సీమపన్నీరు: ఈ లావణ్య శతకకారుని కాలమునకు సీమపన్నీ రపురూపమయిన సుగంధద్రవ్యము. మన దేశములో చిరకాలముగా “హిమాంబువు”లని యొక విధమైన పన్నీరు తయారగునది. అది కేవలము గులాబిపూవుల సారముతోడనే కాక, యనేక రకముల సుగంధపుష్పరసములతో సమ్మిళితమై యుండునది. దానిలో నప్పటమయిన గులాబిపూవులతో సిద్ధపఱచు పన్నీటిలోనుండు మధురమార్దవ శీతలాది గుణాళిగాని, స్వచ్ఛసువాసనాపరిపుష్ట సౌఖ్యానందప్రదముగాని యుండదు. అందుచేతనే రాజభోగ్యమయిన పన్నీరు (Rose water) మనవారి కాలమున సీమనుండి దిగుమతి యగునది,

ఈ శతకములోఁ గొన్ని బంధాలను గూర్చిన ప్రసక్తిగూడ కవి సూచించినాఁడు:

 1. దండెంబులకు ఱొమ్ము తట్టి మ్రొగ్గఁగఁ దోఁచు ధేనుకాబంధంబు పూను కరణి.
 2. బిరుదు జట్టీలతోఁ బెనఁగొను తఱిఁ దోచు నురగబంధము సేయుచున్న పగిది.
 3. గుబ్బచనుమొన లెదనాని గుఱుతులుంచ తరుణి చౌశీతిబంధపద్ధతు లెఱింగి రతులఁ దేలించు నీ చమత్కృతిఁ దలంప.

రతులలో విహంగమగతుల ననుసరించుట కామకళాబంధచతురతాసంపాదనకు నాంది కాబోలు!

“పికిలి పిట్టల రీతిఁ బెదవికాటందుచు గూర్చుం డెదుర్కొని కొంతసేపు,
చిలుకల గతి ముద్దుపలుకు లొప్పుగను పైకొని హాయిగా రతి గొంతసేపు
కన్నెపావురమున గళమున మణితంబు గులికించి హొయలుగాఁ గొంతసేపు,
కళలుప్పతిల్లఁ బ్రక్కలు గోటఁ జెనకుచుఁ గోకిలరవముచేఁ గొంతసేపు,
వింత గోర్వంకపోరులఁ గొంతసేపు, గునుపుతో ప్రక్కమార్పులఁ గొంతసేపు
క్రీడ సల్పిన నాఁటి నీ రీతి నెన్న”

నాయకుని మన్మథోన్మత్తునిగాఁ జేసి యశ్లీలములను గూడ నతని నోటిగుండ పలికించి శివాలాడుటలో నీ కవి వెనుకాడువాఁడు కాఁడు.

 1. వలరాజునగరి ముంగలనైన నుంచవే జీత మొల్లని కొల్వు సేతుఁగాని,
 2. అవునంచు మరునిల్లు నివిరిదేమన, నిటు లడుగవద్దని చిన్ని యాన పెట్టు.
 3. కుసుమబాణునినగరెల్లఁ గొల్లసేయ నెపుడు గల్గును, జాన, నీ హితము మాన.
 4. వనిత నాతోడ నొకసారి నెనయఁగానె, దర్పకుని బొక్కసము కేమి తక్కువగునె?

కవిసార్వభౌముఁడు “ఏదేనొక్క మనోహరాంగకము” అనిన పద్యములో నే గుహ్యాంగమును వర్ణించినాఁడో దాని నీ కవి వాచ్యముగా నుత్ప్రేక్షానుప్రాణితోపమలతో స్పష్టముగా వివరించినాఁడు.

“కమలారి కృష్ణపాడ్యమి ఱేయి రాఁగఁ దూర్పున, నాకసము పర్వు పోలికనఁగ,
నమర వసంతకాలమునందు వికసించు తీఁగ పన్నీరు పూదీప్తి యనఁగ,
శుకవాహనునకు సేవకులు వేయు నుడాయి పావడచెంగావి భారి యనఁగ,
మదనుని రాణి సీమంతవీథిని నంటి వగఁ గాంచు సిందూరవర్ణ మనఁగ
కుందనపుఁ బళ్లెమునఁ దోఁటకూరవిత్తు లెండ నెరపినఁ బై బిల్లలేడి పదము
నిడిన గతిఁ దోఁచు నీ మరునిల్లు దలఁప”
ఇది లావణ్య శతక శృంగారవర్ణనాంశములకుఁ బరాకాష్ఠ.

ఈ శతకములో ననుకరణములు కొన్ని కనఁబడుచున్నవి.

“అనాఘ్రాతం పుష్పం కిసలయ మలూనం కరరుహైః”
అను కవికులగురుని శ్లోకమునకు క్రిందిపద్యము భావానుకరణము:
“చిలుక ముక్కునఁ గాటు చెందని బింబంబు, పొగలేక నిల్చు కప్పురపుదివ్వె,
కోయిల నొక్కుగా గొఱుకని చివురాకు, గాటంపు బచ్చి మరాటి మొగ్గ,
తుమ్మెద వ్రాలని కమ్మ దామరపూవు, నవకమౌ మేల్దవనంపు మొల్క
సానపై దీరిన జాతివజ్రపురవ వాసించు గోవజవాదిబరణి
వలపులమిటారి నిత్యము వచ్చుదారి చూచి వేసారి, మనమున సొంపుమీఱి,
మగువ నొకసారి నెనయక మరుని బారి”

ప్రబంధకవుల వెఱ్ఱిమొఱ్ఱి భావములు, తలతిక్క వర్ణనలు నీ కవికి కూడ సహజముగా నలవడినట్లు తోఁచుచున్నది. ఈ శతకములోఁ గొన్ని పద్యములు పై యంశములను ఋజువు చేయుచున్నవి.

సాధారణముగా మధ్యకవులు వ్రాసిన ప్రబంధములు పెక్కింటిలో వ్యంగ్యభావస్ఫోరకముగా, నౌషధములను, మహర్షులను, పుణ్య క్షేత్రములు మొదలైనవానిని జవరాండ్ర (ముఖ్యముగా నాయికల) యంగప్రత్యంగములకు నుపమించుచు కేశాది పాదాంతమువఱకు వర్ణించువారు. ఈ శతకములోను నట్టివి యున్నవి.

కూచిమంచి తిమ్మకవి రసికజనమనోభిరామములోనిది ఈ క్రింది పద్యము:

“కలకంఠి జఘనంబు కాంచికాస్థానంబు, మధురామృతస్థలి మగువ మోవి,
అన్నులమిన్న పదాగ్రంబు కూర్మంబు, పడతుక జిల్గు నెన్నడుము మాయ,
నీలజీమూతంబు నెలఁత ధమ్మిల్లంబు, రాకేందుముఖి రోమరాజి కాశి,
నలినలోచన నిమ్ననాభి కేదారంబు, భామ చన్దోయి శ్రీపర్వతంబు,
గాఁగ నృపచంద్ర సుక్షేత్రగరిమ నెపుడు జెలగుచున్నది దాని భజింపగలుగు”
ఇందులోని పుణ్యక్షేత్రములు ధ్వన్యర్థములు; నాయికావయవరూపకములుగా గ్రహింపఁబడినవి.

ఇంక లావణ్య శతకములో దీనిననుసరించి రాగములను రూపకములుగాఁ జేసికొని, కవి యబలాంగములను వర్ణించిన పద్య మీ క్రిందిది:

“నీలాంబరౌర, పెన్నెరుల సౌరుదనంబు, వీనులు శ్రీరాగ విభవ మేలు,
పొలతి నెమ్మొగము సంపూర్ణచంద్రిక మణితము పరీక్షింప ఘంటారవంబు;
సారంగి చూపుల చపలత వీక్షింప మెఱుపగు లేఁగౌను మేఘరంజి
చారు రోమావళి శంకరాభరణంబు, తీరైన కెమ్మోవి దీపకళిక,
ముదిత క్రొంజిగిమేను మోహన, సద్గుణలావణ్యగరిమ కల్యాణి, భళిర!
నడక మెల్లదనంబు పున్నాగ, దాని సురత మానందభైరవి, సొంపు నాట”

వేణుగోపాల శతకములో నితఁడు “పరవధూకాంక్ష”ను నిరసించి చెప్పిన పద్యమును జూపితిని; యట్టిదే కొన్ని పదముల మార్పుతో నిందున్నది. గమనించుఁడు:

“స్త్రీలపై నతిబాళి జెందిన పురుషుల కపకీర్తి, దీనత, నగడు, దిగులు,
పరువు తక్కువ, మోక్షపదవికి దొలఁగుట, నైష్ఠికహీనత, నవ్వుబాటు,
చుట్టపక్కంబులు సుళ్లగించుట, గాసి, విబుధాళి గన్న భవిష్యహాని,
మానంబు విడి యవమానంబు నొందుట, ధనము గోల్పోవుట, తనువు చెడుట
వసుధలోపల నెటువంటివారికైన దగని వలపిటు కారాదు, తరుణి నీదు
కృపను గాంచక మన్మథ చపలమణఁప”

క్రింది పద్యము పురుషులు స్త్రీలను నమ్మరాదని స్పష్టముగా బోధించును. చేడియల మంచితనము నమ్మరాదఁట!

“మనసెఱుంగగ రాదు, మాట నిల్కడ లేదు, దాని వర్తన నహి, వలపు సున్న,
కనువిచ్చి చూడరు, చనవిచ్చి కూడరు, నేస్తంబు పూజ్యము, నెనరు నాస్తి,
మర్యాద లెంచరు, మన్నన గాంచరు, గుణము చక్కని దిల్ల, గుట్టు కల్ల,
కపటంబు మానరు, కడువేడ్కఁ బూనరు, సత్యమన్నను వట్టి, జాలి మట్టి,
సాహసము మెండు, మిక్కిలిచలము నిండు, అంగిట విషంబు, మున్నాల్కయందుఁ
దీయఁదనము గదె, చేడియల మంచితనము”

ఈ విశ్వాసగుణమునుగూర్చి యింకను రెండు పద్యములున్నవి. ఇఁకఁ బురుషుల హితముకూడ నమ్మరాదని యీ క్రింది పద్యములో కవి తెలుపుచున్నాఁడు,

“మగవారి మాట బూరుగుపంటితే, టద్దమునఁ గానఁజడు పైఁడిమూట, దూర
మగు కొండనున్ను, లేనుఁగుదిన్న వెలఁగకాయలు, మబ్బులోఁ దళుక్కనెడి మెఱుపు
మిద్దెపైఁ బరుగులు, మీసాలపైఁ దేనె, పొగ ముల్లెగట్టిన పోల్కి, తేట
నీటిలో జాబిల్లి నీడ, లేగిన యెండమావులు, రతివేళ మరులు -సతుల
వద్ద నున్నంతసేపె, యావలను బోవ నెంత కఠినంబు! పురుషుల హితము నమ్మ
వచ్చునా, యని పల్కు నీ వగఁ దలంతు”

స్త్రీపురుషు లొకరినొకరు నమ్మరాదనుటలోఁ గవిహృదయమేమో? అట్లు నమ్మకున్న సంసారములు సుఖప్రదముగా సాగుట కవకాశము లుండవనుట యనుభవసిద్ధము. ఈ నమ్మక ముభయత్ర కుదిరిననే గార్హస్థ్యము స్వర్గతుల్యమగును. కాని పక్షమున చెప్పవలసిన దేమున్నది? ఇంతకు ఈ నీతి, అవినీతికిఁ బాల్పడు విటీవిటులను గూర్చి చెప్పఁబడినవైన నొకవిధముగా సమర్థనీయమగును.

ప్రబంధములలోని శృంగారమంతయు నీ లావణ్య శతకమునఁ గ్రోడీకరింపఁగలిగిన యీ మహాకవి మేధావిశేషము స్తుతింపఁదగినది,

ఈ కవి పోషకులైన మాకరాజ వంశస్థులు తమ మొదటి ముఖ్యనగరమైన నారాయణవనమును, కవికాలమునకే విడిచిపెట్టి దానికి పదిమైళ్ల దూరమునఁ గల కార్వేటినగరమును నూతనముగా నిర్మించుకొనినట్లు

“నవ్వుకొంచును కార్వేటినగరరాజ వీధి నెదురైన సిగ్గున వీఁపుగప్పి
త్రోవ తొలగిన నాఁటి నీ భావ మెంతు”
అనుటవలన స్పష్టమగుచున్నది.


[1]ఇతఁడు పై జెప్పిన శతకద్వయమే కాక ‘తిట్లదండక’మను చిన్నకృతికూడ నితఁడు చేసెను. అందు వచ్చిన తిట్టు మరల రాదు. అద్భుతమయిన ధారాధోరణి. ఇట్టి దండకమునకుఁ గారణమయిన యితివృత్తము నించుక తెలిసికొందము.

కార్వేటినగరమున ఆ కాలమున రాచనగరున నిత్యావసరవస్తుభాండారాధ్యక్షుఁడుగ (ఉగ్రాణాధికారిగ) కోవూరి రామయ్య యను నియోగిబ్రాహ్మణుఁ డుండెడివాఁడు.

అతని నివాసమందిర మగ్రహారమున మన కవియింటికిఁ బ్రక్కదే. ఒకానొకనాఁడు రామయ్యయింటి దొడ్డిలోని కూరపాదులలోని మొలకలను వేంకటరాయకవి బఱ్ఱె మేసిపోయినది. అది చూచిన రామయ్య భార్య, కామాక్షమ్మ క్రోధావేశమునఁ గవిగారి యింటికిఁ బోయి వారితోఁ దగవులాడెను. అప్పుడు కవి ఆమెం గని “అమ్మా, ఏదో తెలివిలేని గొడ్డు చేసిన పనికి ఇంత యల్లరెందులకు? దానిని స్వేచ్ఛగా మేఁతకు విడిచిన తప్పు మాదే. నీ తోటకూర మొలకల క్రయము వలసిన నిత్తును. పొరపాటును క్షమించుము” అని బతిమాలెను. కాని యీర్ష్యాపరురాలయిన కామాక్షమ్మకు ఆ మాటలు రుచింపమిచేఁ జీటికిమాటికి నాకున పోకున కవిని అతని కుటుంబమును దిట్టుచునే యుండెను. అట్లొక సంవత్సరము గడచెను.

ఒకనాడు ప్రాతఃకాలమున మన కవి యెటకో పోయివచ్చుచు అమ్మలక్కలతో నింటివాకిట నిలిచి బిగ్గఱగాఁ దన్ను దూషించు కామాక్షమ్మను జూచి క్రోధము పట్టజాలకయు, రాజోద్యోగి భార్య కావునఁ దటాలున నేమియుఁ జేయజాలకయు విసవిస ప్రభువుచెంత కేఁగి “రాజేంద్రా, కోవూరి రామయ్య భార్య స్వల్పదోషమును బురస్కరించికొని మమ్మెల్ల నొక్కయేడాదిగా నాడిపోసికొనుచున్నది. దీనికి బ్రతీకారమే లేదా?” అని జరిగిన విషయమంతయు బూసగుచ్చినట్లు నివేదించి “క్షత్రియ ప్రభువులైన తామొక్క క్షణముగూడ నిట్టి యవినయ మోర్వరు. అప్పుడే తల దీయించి యుందురు. బ్రాహ్మణుఁడను గనుక నోర్వదగినంత కాల మోర్చితి. ఇఁక నోర్వఁజాలను. క్షాత్రమునఁ బ్రతీకారము చేయింతురా? కాదని బ్రాహ్మ్యమున నేనే చేయుదునా?” అనఁగానే యేలిక కవిం జూచి ‘యేమి చేయుమందు’ రనెను. కవియుఁ ‘మీరైనఁ దలఁ దీయింతురు. కాని అది బ్రాహ్మణస్త్రీహత్య యగుటచే మనకిరువురకు నరకము తప్పదు. కానఁ దల గొఱిగింపుఁడు. చాలును’ అని మనవి చేసికొనఁ బ్రభునకుఁ బచ్చివెలగకాయఁ గుత్తుక నడఁచికొన్నట్లయి, కొంతసేపేమియుఁ బలుకకుండి, తుదకు “మేమట్టి కార్యమునకుఁ బూనుకొనుట భావ్యమా? లోక మేమనుకొనును? ఇక్కార్యము అపకీర్తికారకము గదా! శాంతింపుడు” అని ప్రాధేయపడెను. “అగుచో నేనే ఆమె తల గొఱిగించెదను. అంతవఱకు నాకు శాంతికలుగదు ప్రభూ! మన్నింపుడు” అనెను. అయినను రామయ్యను విచారించి మందలింతమను నూహతో రాజేంద్రుఁ డాతనికొఱకు హర్కారును బంపెను.

ఱేని యానతి ననుసరించి సత్వరముగ రామయ్య అతని సన్నిధానమునకు వచ్చుచుండ, అల్లంతదూరముననే ఆతనిం గాంచి దండతాడితభుజంగమువలె వేంకటరాయకవి మండిపడి “ఛీఛీ, ఒరే పాతకా, ఘాతకా, ప్రేత” అని యారంభించి “కోవూరి రామా, అయో రామ, రామా!” యని దండకము ముగించెను. దానిని బఠించుచున్నంతసేపు నృపాలుఁ డా కవి వంక గ్రుడ్లప్పగించి చూచుచుండి నిట్టూర్పు పుచ్చి లేచి యంతిపురిం బ్రవేశించెను. కవీంద్రుఁడును గోపభారము తగ్గిపోవ శాంతించి యింటిదారిని బట్టెను. దురదృష్టవంతుఁడగు కోవూరి రామయ్య ప్రభునియెదుట దనకు జరిగిన పరాభవమునకు ఖేదమొందుచుఁ, దలవాంచి పరాకుతో నింటిని జొచ్చునపుడు ద్వారబంధము గాటముగ శిరమునకుఁదగిలి గొప్ప గాయమయి, పడుకఁ బట్టి వేదనాదోదూయమానుడై కొలదిదినములలో మరణించెను. కవికోరికయు సిద్ధించెను,

ఈ చరిత్ర ముప్పదియైదేండ్లనాఁడు మా యూర (కార్వేటినగరమున) నాకు వేదాధ్యాపక గురువులుగ వెలసిన శ్రీతిప్పావఝుల అనంతయ్యగారు చెప్పఁగా వింటిని. వారి కప్పటి వయస్సు డెబ్బది దాఁటినది. చరిత్రకాలమున వారు చాలఁ జిన్నవారఁట.

తిట్లదండకము”నకయి నే నిరువదియేండ్లుగఁ బ్రయత్నింప నిప్పటికి దొరకినది. పుత్తూరుబోర్డు ఉన్నత పాఠశాలా ప్రధానాంధ్రపండితులగు విద్వాన్ శ్రీ టి. శ్రీనివాసరావుగారు సంగ్రహమగు పై చరిత్రతోఁ గూడ తిట్లదండకము సంపాదించి పంపినందులకు వారికెంతయు గృతజ్ఞుడను.

-శ్రీ వేదము వేంకటకృష్ణశర్మ (త్రిలిఙ్గ 27 ఏప్రిలు 1953)

వెనక్కి

వేణుగోపాలశతకము - పోలిపెద్ది వేంకటరాయకవి
పీఠిక - శ్రీ కె. గోపాలకృష్ణరావు
(అధిక్షేప శతకములు - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ప్రచురణ, 1982)

AndhraBharati AMdhra bhArati - పోలిపెద్ది వేంకటరాయకవి - వేదము వేంకటకృష్ణశర్మ - ఆంధ్రభారతి - (శతకవాఙ్మయసర్వస్వమునుండి) ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) Polipeddi VenkataRayaKavi - Vedamu Venkata Krihsna Sarma - AndhraBharati AMdhra bhArati ( telugu kAvyamulu andhra kAvyamulu)