వచన సాహిత్యము వ్యాసములు నవ్య సంప్రదాయ కవిత్వోద్యమం : విశ్వనాథ
ఆచార్య జి. వి. సుబ్రహ్మణ్యం

విశ్వనాథ సాహిత్య వ్యక్తిత్వం
సంకలన కర్త : డా॥ కోవెల సంపత్కుమారాచార్య
ప్రచురణ: తెలుగు అకాడమి, 1989

నవ్య సంప్రదాయ కవిత్వోద్యమం : విశ్వనాథ
ఆచార్య జి. వి. సుబ్రహ్మణ్యం

సమాజం ఆచరించడానికి యోగ్యమై అర్థవంతమైన అవగాహనతో కూడుకొన్న ఒకజాతి యొక్క సజీవ విజ్ఞానం సంప్రదాయం. సంప్రదాయం లేని సమాజం ఉండదు, ప్రవాహం లేని నదిలాగా. అయితే, సంప్రదాయం ఆచరణస్థాయిలో సామాన్య ప్రజాజీవితంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆచరణ వెనుక అవగాహనను రక్షించుకొనే స్థాయి మేధావి వర్గంలో గోచరిస్తుంది. ప్రపంచ జాతుల సంప్రదాయ ధారల్లో ప్రదర్శితమయ్యే ప్రగతి పథాలను పరిశీలించి తమ జాతి జీవన విధానానికి అనువైన వానిని సంవదించుకొనే వినూత్న ప్రయత్నాలను చేసే దార్శనికులలో సంప్రదాయం సజీవంగా ముందుకు సాగుతుంది. సంప్రదాయం సజీవ విజ్ఞాన రూపం కాబట్టి దర్శనం దాని జీవశక్తి. దర్శనం జీవితానికి క్రొత్త వ్యాఖ్యానం. పాత విలువలతో కొత్తవిలువలకు సమన్వయం. ఈ సమన్వయంలో పాత కొత్తలకు అన్వయం చెప్పటంలో ఆచరణ యోగ్యతను సాధించడంలో దార్శనికుల నడుమ మేధావుల మధ్య సంఘర్షణలు రావచ్చు, అభిప్రాయ భేదాలేర్పడవచ్చు, సిద్ధాంతరాద్ధాంతా లేర్పడవచ్చు. ఇవన్నీ పాత కొత్తల మేలు కలయికగా రూపొందే సంప్రదాయ ధారకు అవగాహనతో కూడుకొన్న సమన్వయాన్ని అందించటానికి దార్శనికులు, మేధావులు చేసే విజ్ఞానమయ వివేచనమే. దార్శనికుల నవ్యదర్శనమో సమన్వయమో మొదట మేధావి వర్గంలో ఇంకాలి. వారు వాటి వ్యాఖ్యానం చేసి నిత్యజీవితానికి, ఆచరణకు వినియోగపడేటట్లుగా సామాన్య ప్రజలకు వినిపిస్తారు. తాము ఆచరిస్తున్న ఆచరణలకు అర్థం మారిందని తెలిస్తేనో, అర్థం లేదని తెలిస్తేనో కాని, ప్రజలు తమ ఆచారాలను మానరు. ఈ మూడు పొరల్లోనూ సంప్రదాయం ప్రవహిస్తుంది. అయితే, దార్శనిక విజ్ఞానంగా ఉండే సంప్రదాయం జాతి జీవనానికి తాత్త్విక భూమిక. అర్థవంతమైన అవగాహనగా పరివర్తనం చెందే దార్శనిక విజ్ఞానం ఉద్యమ భూమిక. ఆచరణ యోగ్యమైన సమాజ జీవన పద్ధతిగా మారే అవగాహన సమాజవాస్తవ చేతన తాత్త్విక భూమిక సమాజ చేతనలోని వాస్తవాచరణంగా మారటానికి కొంతకాలం పడుతుంది. మొదటి పొరలో నుండి మూడో పొరదాకా సంప్రదాయం ఇంకేసరికి మొదటి పొరలోనే మరొక మార్పు రావచ్చు. అందువలన ఈ మూడు పొరలలో ఐక్యత, ఏకవాక్యత అనేది ఒకనిర్దిష్టమైన కాలంలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అలా ఉండకపోయిన కాలంలో సంప్రదాయం సమాజంలో అంతస్సంఘర్షణకు గురియౌతున్నట్లు గోచరిస్తుంది. ఆ సంఘర్షణ ఆచరణ పరిధిలో బలంగా ఉంటే సంస్కరణోద్యమంగా రూపొందుతుంది. అవగాహన పరిధిలో గాఢంగా గోచరిస్తే అభినవ ప్రయోగోద్యమంగా అవతరిస్తుంది. విజ్ఞాన పరిధిలో సిద్ధాంతాల ప్రమాణాల జీవితాన్ని విలువకట్టే తాత్త్విక సూత్రాన్వేషణోద్యమంగా వెలువడుతుంది. మూడు పొరల్లో నుండి ప్రవహించే సంప్రదాయం కొన్ని యుగాలు జాతి జీవనాన్ని శాసిస్తుంది. కాని, మార్పే సంప్రదాయానికి మనుగడ నిచ్చేది; కూర్పే కొత్తదనాన్ని అందించేది.

జాతి జీవనంలో లాగానే సాహిత్య జీవితంలోకూడా సంప్రదాయం అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూనే ఉంటుంది. సాహిత్య దర్శనం సంప్రదాయ తాత్త్విక భూమిక వివిధ ప్రయోగాలద్వారా సాహిత్య దర్శన కళాత్మక వ్యాఖ్యానం ఉద్యమ భూమిక. ఉద్యమ భూమిక ద్వారా అందే అవగాహన ప్రాతిపదికతో కళాత్మక విలువలను అనుశీలించే విమర్శ విధానం ఆచరణ భూమిక. సాహిత్య రంగంలో ఒక క్రొత్త రచన వెలువడిందంటే ఒక క్రొత్త విలువ పొటమరించిందన్నమాట. దానివెనుక ఒక అవగాహనకాని, సమన్వయంగాని, దృక్పథంగాని, తత్త్వంగాని, దర్శనంగాని తప్పక ఉండి ఉంటుంది. దానిని గ్రహించి వ్యాఖ్యానించినప్పుడే ఆ క్రొత్త రచన అందించే విలువ యొక్క రుచి అవగతం అవుతుంది. ఆ విలువ సంప్రదాయంలో అంటే సాహిత్య ప్రస్థాన ప్రగతిలో ఒక ఘట్టంగా, ఒక పరిణామంగా, ఒక వికాసంగా అన్వయింపబడేంతవరకు సిద్ధాంత రాద్ధాంతాలు తప్పవు. అవగాహన కుదుటపడితే ప్రయోగం సాహిత్య సంప్రదాయంలో సాహిత్య సజీవ దర్శన విజ్ఞానంలో ఒకభాగంగా కుదురుకుంటుంది. అలా కుదురుకొనకపోతే సాహిత్య ప్రయోగం జాతి అనుభవంలో ఇముడలేదు. కొన్నాళ్ళు క్రొత్తగా కనపడ్డా కొద్దికాలంలోనే కనుమరుగై పోతుంది. కాబట్టి సంప్రదాయంలో సమన్వయం పొంది సజీవంగా సంప్రదాయాన్ని ముందుకు సాగింపగలిగిందే వినూత్న ప్రయోగం. టి. ఎస్‌. ఇలియట్‌ మాటలు గమనింప దగినవి - 1"The existing order is complete before the new work arrives; for order to presist after the supervention of novelty. The whole existing order must be, if ever so slightly altered; and so the relations, proportions, values of each work of art towards the whole are readjusted; and this is confirmity between the old and the new" గతానికీ వర్తమానానికీ మధ్య జరిగే ధ్రువీకరణమే సజీవ ంప్రదాయ ప్రగతి. ప్రగతి నెంత సాధించినా సంప్రదాయం జాతి జీవ లక్షణాన్ని కోల్పోదు; కోల్పోరాదు.

ఆధునికాంధ్ర సాహిత్య రంగంలో వినపడే సాహిత్య పారిభాషిక పదాల్లో సంప్రదాయవాదం, నవ్యసంప్రదాయవాదం అనేవి సంప్రదాయానికి అనుకూలంగానూ, కాల్పనికవాదం, అభ్యుదయవాదం, విప్లవవాదం మొదలైనవి సంప్రదాయానికి విరుద్ధమైనవిగానూ కనపడుతూ ఉన్నాయి. వీటిలో నవ్య సంప్రదాయోద్యమంలో కవిత నిర్వహించిన పాత్రను సమీక్షించటం ఈ వ్యాస తాత్పర్యం.

ఇంగ్లీషులో 'నియోక్లాసిసిజమ్‌' అనే పదానికి సమానార్థకంగా తెలుగులో 'నవ్య సంప్రదాయవాదం' అని వ్యవహరిస్తున్నారు. కాల్పనిక కవితాయుగ చైతన్యం నుండి విడివడి విశ్వనాథ సత్యనారాయణగారు 1933-34 ప్రాంతంలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం రచించటం ప్రారంభించిన నాటినుంచి నవ్య సంప్రదాయోద్యమం ప్రారంభమైనట్లు విమర్శకులు భావిస్తున్నారు. అయితే, ఈ మాట దాదాపు 1982 తరువాతనే ప్రచారంలోకి వచ్చింది. అంతకు పూర్వం సంప్రదాయోద్యమమనే వాడేవారు. ఈ మాటకు ప్రాచుర్యం కలిగించింది విశ్వవిద్యాలయాచార్యులే అనుకుంటాను. ఆధునికాంధ్ర సాహిత్యధోరణులను, ఉద్యమాలను వివేచించి, వాటి స్వభావాలకు అనుగుణంగా ఉండే పేర్లను పెట్టాలనే ప్రయత్నంలో 1933-34 నుంచి శ్రీశ్రీ 'మహాప్రస్థానం'తో అభ్యుదయ కవితోద్యమం రూపుతాలిస్తే, విశ్వనాథ కల్పవృక్షం రచనతో నవ్యసంప్రదాయ కవిత్వోద్యమం బలపడ్డట్టు సమన్వయించడం జరిగింది. శ్రీమద్రామాయణ కల్పవృక్ష రచనం 1961 దాకా సాగింది. ఈ మధ్యకాలంలో అభ్యుదయ కవిత్వోద్యమం పుట్టటం, పెరగటం, విరగటం కూడా జరిగింది. నవ్య సంప్రదాయ ప్రయోగాలు నేటికీ సాహితీ క్షేత్రంలో సజీవంగా సాగుతున్నవని చాలమంది అంగీకరిస్తున్నారు. నవ్య సంప్రదాయ కవిత్యోద్యమాన్ని నవీన ప్రబంధోద్యమనీ, నవ్యకావ్య దృక్పథమనీ పిలిచేవారు కొందరున్నారు. ఏమైనా వీరందరి దృష్టిలో 'నియోక్లాసిసిజమ్‌' అనే ఆంగ్లపదానికి ఇవన్నీ పర్యాయపదాలే.

ఇంగ్లీషు సాహిత్యంలో వచ్చిన నవ్యసంప్రదాయ యుగానికీ, తెలుగులో వచ్చినదానికీ స్వరూప స్వభావాల్లో సామ్యంతోపాటు భేదంకూడా విశేషంగా గోచరిస్తుంది. ఇంగ్లీషులో నవ్యసంప్రదాయ యుగం రెస్టోరేషన్‌ యుగం తరువాత 17వ శతాబ్ది చివరి నుండి 18వ శతాబ్ది చివరిదాకా ప్రవర్తిల్లింది. దాని తరువాత కాల్పనిక కవిత్వోద్యమం వచ్చి, 19వ శతాబ్ది పూర్వపాదంలో తన ప్రత్యేకతను ప్రదర్శించింది. కాల్పనిక కవిత్వోద్యమానికి ప్రతిగా విక్టోరియన్‌ సాహిత్యయుగ చైతన్యం 19వ శతాబ్ది పూర్వార్ధంలోనే మొదలై ఆ శతాబ్ది చివరిపాదందాకా సాగింది. కాగా, తెలుగులో నవ్య సంప్రదాయ కవిత్వోద్యమం భావకవిత్వయుగం తరువాత సాగింది. ఈ చారిత్రక సత్యం నవ్య సంప్రదాయ కవిత్వోద్యమంలోని కొన్ని విలువలను వివేచించటానికి తోడ్పడుతుంది.

నవ్య సంప్రదాయ కవితా చైతన్యం, కాల్పనిక కవితా చైతన్యం ప్రాచుర్యం వహించిన ఆయాకాలాలను సాహిత్య చరిత్రలో వేరువేరు యుగాలుగా పరిగణించే పద్ధతిని కొందరు అంగీకరింపరు. అవి రెండూ పరస్పరం ప్రత్యర్ధులుగా సాహిత్యంలో సదా సాగుతూ ఉండే శక్తివంతమైన చైతన్యాలని వారు పేర్కొంటారు. "There are many people who think of neo-classic and Romantic as terms standing for ideas rather than fixed periods, as representing the great polar opposits of English Poetry, irrespective of dates, literary movements or eras. Most critics, however, prefer to limit the application of the terms to specific periods to believe that it is possible to isolate some major aspects of the theory of neo-classic poetry which set the poetry in sharp and essential contrast that of two generations of romantic poets." 2 - అని యుగ వివేచనాన్ని సమర్థించే వారూ ఉన్నారు. తెలుగు విమర్శకు లందరూ దాదాపు పై రెండో అభిప్రాయాన్నే బలపరుస్తున్నారు.

తెలుగులో 'సంప్రదాయ కవిత్వం' Traditional Poetry అనే అర్థంలో వాడబడటం లేదు. Classical Poetry అనే అర్థంలో వాడుతున్నాం. సంప్రదాయవాదం అంటే క్లాసిసిజం అనే చెప్పుకోవాలి. 'క్లాసిక్‌' అంటే ప్రథమశ్రేణి అనీ, ఆదర్శస్థాయి అనీ మొదట్లో అర్థం ఉండేది. ఏ ప్రక్రియలోనైనా ప్రయోగం జరిగినప్పుడు దాన్ని అనుశీలించటానికి 'క్లాసిక్‌ ఫారమ్‌'ను ప్రమాణంగా గ్రహించటం సంప్రదాయం మార్గం. ప్రాథమిక ప్రయోగం నుంచి పరిణత ప్రయోగం దాకా పరిణతిని సాధించే పద్ధతిగాని, ఆదర్శ రూపంనుండి ప్రక్రియావైవిధ్యాన్ని సాధించే ప్రయోగాలను నిర్వహించే పద్ధతిగాని సంప్రదాయ మార్గంలో సాధారణంగా గోచరిస్తుంది. స్థూలంగా మొదటి పద్ధతిని సంప్రదాయమార్గమనీ, రెండవ పద్ధతిని నవ్యసంప్రదాయ మార్గమనీ పేర్కొనవచ్చు.

ప్రాచీనాంధ్ర సాహిత్యంలో కావ్య ప్రక్రియకు క్లాసిక్‌ రూపం ప్రబంధం. దానిని తెలుగు కవులు యుగయుగాల ప్రయోగాలతో పదహారో శతాబ్దిలో సాధింపగలిగలిగారని విమర్శకులు వివేచించటం ప్రసిద్ధమే. నన్నెచోడుని నుండి క్రమంగా పరిణతి చెందిన ఆ ప్రక్రియా వికాసం ఆయా కవుల కవిత్వోద్యమ స్ఫూర్తితో ఆదర్శస్థాయికి అందుకోగలిగింది. ఇలాగే ఒక్కొక్క సాహిత్య ప్రక్రియకు, ఒక్కొక్క ఆరంభం ఉంటుంది, ప్రయోగ వికాస దశ ఉంటుంది; పరిణత రూపసాధన దశ ఉంటుంది. ఆ వికాసం వెనుక ఆయా కవులు ఆ ప్రక్రియను దర్శించిన సాహిత్య దృక్పథాల ప్రత్యేకతలు కూడా ప్రత్యక్షమౌతూ ఉంటాయి. వాటికి సంబంధించిన అవగాహనను, అనుశీలనను, ఆదర్శ రూపసాధనను సంప్రదాయోద్యమ మంటారు. ఒక్కొక్క ప్రక్రియ వెనుక ఒక ఉద్యమం ఉన్మీలితమౌతుంది.

కావ్యనాటక ప్రబంధేతిహాసాలవంటి బలమైన సాహిత్య ప్రక్రియలు మాత్రమే కాక శతక దండకాల వంటి సాధారణ ప్రక్రియలు కూడా సాహిత్యంలో ఉన్నాయి. వీటిల్లో క్లాసిక్‌ రూపాలు ఉన్నా ఆదర్శ శిఖరాల్లాగా ఉండవు. అయినప్పుడు ఆ ప్రక్రియల్లోని ప్రయోగాలను నిర్మించే యత్నాన్ని ఒక ధోరణిగా పేర్కొనవచ్చు. అంటే తెలుగులో ప్రబంధ కవిత్వోద్యమం, శతక రచనా ధోరణి - ఇలా ఉండటం సహజమన్నమాట. సంప్రదాయంలో ఉద్యమం ఏమిటి అనే వారున్నారు. అది అర్థంలేని ప్రశ్న. తాత్త్విక భిత్తిక ఉన్న ఏ ప్రయోగ ప్రయత్నమైనా ఉద్యమస్ఫూర్తిని పొందగలుగుతుంది. ధ్వని ప్రస్థానంలో కవిత్రయం సాధించిన కావ్యేతిహాస కవిత్వోద్యమం మూడు శతాబ్దాలు సాగింది. రసోన్ముఖమైన రీతి ప్రస్థానం శ్రీనాథునితో మొలకెత్తి ఒక శతాబ్దం కవిత్వాన్ని ఉర్రూతలూపింది. భక్తికవితా ప్రస్థానం పాల్కురికితో మొదలై పోతన్నలో క్లాసిక్‌ రూపాన్ని అందుకోగలిగింది. అలంకార ప్రస్థానం ప్రేరణగా సాగిన ప్రబంధ కవుల వివిధ ప్రయోగాలు ప్రౌఢ కవితావతారాలుగా రెండు శతాబ్దాలు తమమనుగడను సాగించికొని క్లాసిక్‌ రూపాలను అందించగలిగాయి. సంప్రదాయవాదానికి సాహిత్య సిద్ధాంతం తాత్త్వికభూమిక; ప్రయోగం ప్రగతి; క్లాసిక్‌ రూపం గమ్యం.

హోమర్‌, వర్జిల్‌, డాంటె, షేక్‌స్పియర్‌, వాల్మీకి, వ్యాసుడు, భవభూతి, నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథుడు, పోతన మొదలైన వారు ఆయా భాషాసాహిత్యాల్లో ప్రథమ శ్రేణి కవులు. వారి రచనలు క్లాసిక్సు. ఆ రచనలను ఆధారంగా చేసికొని తరువాతివారు కొన్ని సాహిత్య సిద్ధాంతాలను, సూత్రాలను ఏర్పరుచుకుంటారు. వాటి ననుసరించి రచించబడినవి 'నియోక్లాసిక్‌' రచనలనిపించుకొంటాయి. ఈ భేదాన్ని నవ్య సంప్రదాయ కవిత్వోద్యమాన్ని వివేచించేటప్పుడు విస్మరించటానికి వీలు లేదు. కాని, విమర్శకులు కొందరు ఈ వివేచనాన్ని అంత సూక్ష్మంగా పాటించటం లేదు. "The great neo-classic poets are fundamentally conservatives and traditionists" 3 అనే ధోరణితో నవ్య సంప్రదాయకవులు నవ్యతను సాధించలేరనీ, గతానుగతికమైన రచనను నిర్వహిస్తారనీ భావించి వారిని పరిగణనలోకి తీసికోరు. దానికి కారణం ఆ ఉద్యమాన్ని గురించిన సరియైన అవగాహన వారికి లేక పోవటమే.

కాల్పనిక కవితాయుగ కవికీ, నవ్య సంప్రదాయ కవితాయుగకవికీ ఉండే భేదాన్ని తెలుసుకోవటానికి శ్రీ వడలి మందేశ్వరరావుగారి ఈ మాటలు తోడ్పడతాయి. "రొమాంటిస్టు ఎలాగైనా స్వేచ్ఛాప్రియుడు. వెనుకటి బంధనాలను ఊడ్చుకుంటాడు. శృంఖలాలను తెంచుకోవటం అతని కవసరం. అతని నూతన ఆలోచనలు వెనుకటి మూసలలో ఇమడవు. అందుచేత గతంతో అతను తెగ త్రెంపులు చేసుకోవాలనుకుంటాడు. క్లాసిసిస్టు అలా అనడు పైకి. సంప్రదాయవాదిలా కనపడతాడు. స్వేచ్ఛను కోరుతున్నట్టే కనపడడు. కాని, వెనుకటి కవులు చూపిన బాటను సునిశితంగా పరిశీలిస్తాడు. ఆ మార్గాన్నే పయనించినట్లు కనబడతాడు. కాని, ఆ మార్గాన్ని విస్తృతపరుస్తాడు. వెనుకటి ఛందస్సుల్ని అంగీకరించినట్లు కనపడతాడు. అందులో కొత్తలయను ప్రవేశపెడతాడు. వెనుకటి అలంకారాలనే వాడినట్లు కనపడతాడు. కాని, ఇతని శబ్దచిత్రాలు కొత్తగా ఉంటాయి. కాని,ఇవన్నీ బాహ్యస్వరూపానికి సంబంధించినవి, క్లాసిసిస్టును నిక్కచ్చిగా పట్టి ఇచ్చేది అతని ఆలోచనా విధానం, శిల్పదృష్టి, లోచూపు, సంప్రదాయం మీద తిరగబడినా అనుసరించినా అతని ఆలోచనా విధానం విశ్లేషణను ఆకర్షిస్తుంది; శిల్పదృష్టి అకుంఠితంగా ఉంటుంది; లోచూపు లోకానికి ఉపకరించేది అవుతుంది."4 ఈ మాటలు తెలుగులోని నవ్యసంప్రదాయవాద కవులకూ, విశేషించి విశ్వనాథకూ తప్పక అన్వయిస్తాయి.

"నేను ఏమి వ్రాస్తానో నేను తెలుసుకొని వ్రాస్తాను. అనాది నుంచీ ఈ దేశంలో ఒకటి జ్ఞానం అనిపించుకొంటూ వస్తున్నది. ఆ జ్ఞానం నా పాఠకులకు కల్పించి నేను సఫలుణ్ణయి వాళ్ళని జ్ఞానవంతులను చేస్తున్నాను అనేభావం నాకు ఉన్నది. ఈభావం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారని నాకు తెలుసు ... పూర్వ సాహిత్యం ఒకటి ఉన్నది ... నేను పోతే నాతో పోయే వాళ్లు నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, పోతన్న, పెద్దన్న, తెనాలి రామకృష్ణుడు మొదలయినవారు" 5- అని చెప్పుకున్న విశ్వనాథ ప్రాచీనాంధ్ర కవుల ప్రమాణాలను గౌరవిస్తూనే తనదైన మహాకావ్య రచనను చేపట్టిన నవ్య సంప్రదాయ యుగ చైతన్య మూర్తి.

నవ్య సంప్రదాయ యుగకర్త విశ్వనాథ. ఆయన ఇంగ్లీషు సాహిత్యంలోని నవ్య సంప్రదాయ యుగ కవులకంటె, విమర్శకులకంటె, విక్టోరియన్‌ యుగ కవుల సాహితీ ధోరణికే సన్నిహితుడుగా కనపడతాడు. జీవితాన్ని ఉదాత్త నైతిక తాత్త్విక కళాదృక్పథంతో దర్శించి భావించటమే కవుల ధర్మమనీ, కవిత్వం ద్వారా సమాజంలో శాశ్వత నైతిక ప్రమాణాల విలువలు పునరుద్ధరింపబడాలనీ, ఉత్తమ కావ్యేతివృత్తాలు, ఉదాత్త శైలి కవితకు అత్యవసరమనీ తలంచిన విక్టోరియన్‌ యుగకవుల దృక్పథాలు విశ్వనాథలో కనపడుతాయి. శ్రీ ఆర్‌. ఎస్‌. సుదర్శనంగారన్నట్లు "కాల్పనికోద్యమ ప్రభావంతో ప్రారంభమైన విశ్వనాథ సత్యనారాయణ సాహితీకృషి అనతికాలంలోనే ఆ ప్రభావాన్ని అధిగమించి, ఆయన యేర్పరుచుకొన్న విశిష్ట దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ పరిణతి చెందింది. ఆయన ప్రతిభ భావనాత్మకమే కాదు; ఆలోచనాత్మకం కూడా. ఆపైన అదిభౌతిక దర్శనశక్తి (Capacity for spiritual insight) ఒకటి ఆయన భావనకు, సామాన్యంగా కాల్పనికయుగ రచయితలకు లేని, తత్త్వపరిపూర్ణతను ఇచ్చింది."6

తెలుగులో కాల్పనిక యుగ చైతన్యానికి వ్యతిరేకంగా నవ్యోద్యమాలకు రెండింటికి శ్రీకారం చుట్టినవారు శ్రీశ్రీ, విశ్వనాథ. వీరిద్దరూ సమాజంలోని రెండు ప్రవృత్తులకు ప్రతినిధులుగా నిలిచారు. వీరిద్దరూ కవితలను సమాజంకోసమే వ్రాశారు. సమాజం చైతన్యాగ్ని వంటిది. సాహిత్యానుభవం కోసం పంచజిహ్వలతో అర్రులు చాస్తూ ఉంటుంది. వాస్తవ, కాల్పనిక, వైజ్ఞానిక, జీవచైతన్య, ఆధ్యాత్మికానుభూతుల కొరకై సమాజం తన కామనను వ్యక్తం చేయటమే ఆ పంచజిహ్వల ప్రవృత్తి. ఆ పంచ జిహ్వలతో ఆస్వాదించే కళానుభవమే పరిపూర్ణం, సమగ్రం. సమాజానికి సమగ్రానుభవాన్ని అందించటమే ఒక్కొక్క జిహ్వ కనువైన అనుభూతికోసం తీవ్రయత్నం చేసిన ఘట్టాలుకూడా చరిత్రలో కనపడతాయి. ఒకకాలంలో సమాజం వాస్తవ దృక్పథాన్ని పెంచుకుంటుంది; మరొక కాలఖండంలో కాల్పనికతను వరిస్తుంది; మరొక తరుణంలో జీవ చైతన్యశక్తినీ, అలాగే మరికొన్ని కాలాల్లో హేతువాదాన్నీ, భక్తినీ, ఆధ్యాత్మికానుభవాన్నీ వాంఛిస్తుంది. వాటికి తగిన ప్రేరక శక్తులు ఆయా కాలాల్లో బలంగా పుంజుకోవటం చూస్తుంటాం. ఒకకాలంలో ఒక చైతన్యం ఉవ్వెత్తుగా పొంగుతున్నప్పుడు, దానిని కవులు పోషిస్తూ ఒకధోరణినో, ఒక ఉద్యమాన్నో సాగిస్తున్నప్పుడు, సమాజ చైతన్యంలోని మరోభాగంగా ఉండే తదితర ప్రవృత్తులు బలహీనంగా ఉన్నా, చచ్చిపోవు. తమ శక్తులను కూడగట్టుకోవటానికి మందంగానో లేదా తీవ్రంగానో, వ్యక్తంగానో లేదా అవ్యక్తంగానో కృషి చేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఆ శక్తులన్నింటికీ ప్రతినిధిగా ఒక రచయితో, లేదా కొందరు రచయితలో తమ ప్రయత్నాలను బలంగా సాగించవచ్చు. ఇటువంటిపనే అభ్యుదయ కవిత్వోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లోనే విశ్వనాథ సత్యనారాయణగారు శ్రీమద్రామాయణ కల్పవృక్షం రచిస్తూ మేరువులా సాధించిన నవ్య సంప్రదాయ యుగసిద్ధి.

సమాజ సాహిత్యానుభూతిని దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తే విశ్వనాథవారి రామాయణ కల్పవృక్ష రచనా పరమార్థం మరింత స్పష్టంగా గోచరిస్తుంది. కాల్పనిక కవితాయుగంలో వెలసిన వివిధ కవితాశాఖలూ, కవుల రచనల్లో గోచరించే వివిధ ధోరణులూ ఆకాలంలోని సమాజ ప్రవృత్తి కాల్పనిక చైతన్యంద్వారా ఒక సమగ్రానుభూతిని పొందాలని యత్నించినట్లు నిరూపిస్తున్నాయి. గురజాడ కాల్పనిక చైతన్యంలోని వాస్తవికతా ప్రవృత్తిని పోషించాడు; రాయప్రోలు అమలిన శృంగార సిద్ధాంతంద్వారా వైజ్ఞానికానుభవస్ఫూర్తిని కాల్పనికయుగ చైతన్యాని కందించాడు. హేతువాదులు కూడా ఇటువంటి ప్రవృత్తిని పోషించిన వారే. ప్రణయతత్త్వ శాఖను పూయించిన కవులందరూ జీవ చైతన్యానుభూతిని కాల్పనిక ప్రవృత్తికి పోషకంగా అనుసంధించారు. దేశభక్తి, మధురభక్తి ప్రవృత్తులు ఆధ్యాత్మికానుభవంలోని అభినవరుచుల నందిస్తూ కాల్పనిక చైతన్యానికి ఒక సమగ్రత నాపాదించాయి. ఇలా భావకవిత్వయుగంలో కాల్పనిక చైతన్యం కేంద్రంగా చేసికొని సమాజం సమగ్రానుభవసిద్ధిని సాధించింది.

విశ్వనాథ సత్యనారాయణగారు ఈ స్థితిని సమీక్షించి అంతకంటె ఒక అడుగు ముందుకు వేసి, పంచవిధ ప్రవృత్తుల ద్వారా సమాజం పొందే కళానుభవాన్ని సమాహార రూపంగా అందింపగలిగిన ఒక మహాకావ్యాన్ని రచించటానికి పూనుకున్నాడు. రామాయణ కల్పవృక్షం పేరుకు తగ్గట్లు సమాజం కాంక్షించే వాస్తవిక, కాల్పనిక, వైజ్ఞానిక, జీవచైతన్య, ఆధ్యాత్మికానుభవాల సంపుటిని అందింపగలిగిన విశిష్ట రచన. ఆయన జీవుని వేదన సమగ్ర కళానుభూతి కోసం సమాజ జీవచైతన్యం వ్యక్తం చేస్తున్న ఆవేదన, పంచజిహ్వల సమాజచేతనకు విశ్వనాథ అందించిన అమృత నైవేద్యమే అనుభవకోశమే శ్రీమద్రామాయణ కల్పవృక్షం.

ఆ కావ్యంలోని సన్నివేశాలూ, పాత్ర స్వభావాలూ సమాజంలో కానవచ్చే జీవిత వృత్తాలకు ప్రతిబింబాలుగా ఉండటం వల్ల వాస్తవానుభవాన్నీ, కాల్పనిక చైతన్యంతోనూ కల్పనా మహనీయ విశేషాలతోనూ పద్యాల్లో వ్రాసిన నవలా అన్నట్లు పఠితలను రమింపచేయటం వలన కాల్పనికానుభవాన్నీ, భారతీయ తత్త్వ శాస్త్ర మర్యాద ధారతో- అందులోనూ అద్వైత మత దృష్టితో - రామకథా తత్త్వాన్ని వ్యాఖ్యానించటంచేత జ్ఞానానుభవాన్నీ, జీవవేదనా భరితమైన ఆకావ్యమంతా జీవ చైతన్య ప్రవృత్తి భరితమై ఉండటంచేత రసానుభవాన్నీ, భక్తి కర్మజ్ఞాన మార్గాల విశిష్ట సమన్వయంగా సాగే భారతీయ జీవన పరమార్థధార పరమరమ్యంగా కావ్యార్థాలలో వ్యంజింపబడటంచేత ఆధ్యాత్మికానుభవాన్నీ సమాజ సమగ్రానుభవసంసిద్ధికి అందించే శక్తిమంతమైన కావ్యంగా రూపొందింది. పరిపూర్ణ కావ్య రసానుభూతి కోసం పరితపించే సాహితీ జగత్తుకు ఉపాయనంగా అందించిన కావ్యం. నవ్య సంప్రదాయ కవితా ప్రవృత్తికి పతాక శ్రీమద్రామాయణ కల్పవృక్షం.

నవ్య సంప్రదాయవాదిగా విశ్వనాథ "రసము వేయిరెట్లు గొప్పది నవకథాదృతిని మించి" అని పునః స్థాపించ దలచాడు. ఆధునిక యుగంలో కళానుభవాన్ని ఆస్వాద యోగ్యంగా చేయటానికి మూడు పద్ధతు లేర్పడ్డాయి. వాటిని 1. స్వాత్మీయీకరణం, 2. సామాజికీకరణం, 3. సాధారణీకరణం అని పిలువవచ్చు. స్వాత్మీయీకరణం భావకవిత్వాన్ని ఆస్వాదించటానికి పఠిత కుపయోగించే పద్ధతి. సామాజికునికి అనుభవ యోగ్యమైన స్వీయానుభవాన్ని ఆత్మనాయకంగా కవి కవితలో వ్యక్తీకరించటం. దాన్ని సామాజికుడు ఆత్మీకరించుకొని తాదాత్మ్యంతో అనుభవించటం అనే ప్రక్రియ ఇందులో గాఢంగా కనపడుతుంది. కాబట్టి దీన్ని స్వాత్మీయీకరణం అని పేర్కొనటం జరిగింది. "అభ్యుదయ కవిత్వం ఉత్తేజం ద్వారా క్రియాశీలతా పర్యవసాయి, లేక కార్యోత్సాహ పర్యవసాయి" (రా.రా) ఇలా పర్యవసించే పద్ధతి సామాజికీకరణం. ఇందులో కవి కవితలలో ప్రకటించే ఉద్రేక ఉత్తేజాలకంటె సామాజికులు రచనవలన పొందే ఉద్రేకానికీ, ఉత్తేజానికీ, ఉత్సాహానికీ, ఉద్యమకర్తవ్యాలపట్ల ఉన్ముఖీకరణానికీ ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రక్రియ ఏదైనా ఈ పద్ధతిలో ఫలితం ఒక్కటే.

ఈ రెండు పద్ధతులకంటె సంప్రదాయధారగా వస్తున్న రసానుభవ విధానమే సులభమైనదనీ, ఉదాత్తమైనదనీ విశ్వనాథ నిరూపించదలుచుకున్నాడు. రససిద్ధాంతంలో సాధారణీకరణం ప్రసిద్ధం. అది కథనాశ్రయించిన కావ్యాలకే ఎక్కువగా వర్తిస్తుంది. సామాజికానుభవ చైతన్యాన్ని గమనించిన కవి సామాజికుల సహాయనుభూతిని పొందగలిగిన పాత్రలను, సన్నివేశాలను, భావాలను సంపుటీకరించి సాహితీ ప్రక్రియలను వెలువరిస్తాడు. ఆ ప్రక్రియల్లో కావ్యం, ఇతిహాసం ఉదాత్తమైనవి. కావ్యపాత్రలద్వారా వ్యక్తమయ్యే భావాలను అనుభవాలను పఠిత సాధారణీకరణం ద్వారా స్వీయానుభవాలుగా మార్చుకొని సాత్త్విక చైతన్యంతో విశ్వజనీనంగా రమిస్తాడు. ఆ రమణంలోని చిత్త ద్రవ స్థితియే రసానుభవం. ఇది పాతబడ్డదని భ్రమించటం పొరపాటు. ఇది విశ్వజనీనం కాబట్టి ప్రతియుగంలోనూ బ్రతికే ఉంటుంది. తద్విరుద్ధమైన ప్రయోగాలకు ప్రాబల్యం వచ్చినప్పుడు స్వీయశక్తి ప్రదర్శనం కోసం అభినవాసక్తితో విజృంభిస్తుంది. అంతే తప్ప దానికి చావు లేదు. పై మూడు విధాలలో అత్యంత సరళమైనదీ, శక్తివంతమైనదీ ఈ సాధారణీకరణం. అభినవ సంప్రదాయవాదికి సాధారణీకరణం పరమ ప్రమాణం. కాల్పనిక, అభ్యుదయ, విప్లవ కవిత్వాలలో పొందలేని ఈ కళానుభవ స్థితికి విశ్వనాథవారి కావ్యం కల్పవృక్షం.

తెలుగులో నవ్యసాంప్రదాయ కవితా చైతన్యాన్ని పోషించిన మరొక ప్రసిద్ధ ప్రక్రియ చారిత్రక కావ్యం. దేశీయతను, జాతీయతను రంగరించుకొన్న ఉదాత్త కావ్యేతివృత్తాలను ఎన్నుకొని పరోక్షంగా భారతీయ స్వాతంత్ర్యోద్యమానికీ, స్వాతంత్ర్య సముపార్జనానంతరం దేశస్వాతంత్ర్య పరిరక్షణ ప్రవృత్తికీ పోషకంగా రసవత్తర కావ్యనిర్మాణం ఈ ప్రక్రియలో సాగింది. చారిత్రక కావ్యం ఎన్నివిధాలుగా వెలువడటానికి వీలుందో అన్ని విధాలుగా రూపొందిన గౌరవం ఆధునికాంధ్ర సాహిత్యానికి, విశేషించి నవ్యసంప్రదాయోద్యమానికి దక్కుతున్నది.

సాహిత్య ప్రక్రియలన్నింటిలో లాగానే చారిత్రక కావ్యాలలో కూడా స్వభావాలను బట్టి భేదాలు కనపడతాయి. భారతీయ సాహిత్యాల్లో మొట్టమొదట వెలసిన చారిత్రక కావ్యాలు పురాణేతిహాసాలు. అందులో మానవజాతి వికాసాన్ని దార్శనిక దృష్టితో వ్యాఖ్యానించేది పురాణం. ఒక రాజ వంశాన్ని గాని, ఒక వీరుని జీవిత గాథనుగాని, పురుషార్థ సాధనామయమైన ధర్మదృష్టితో చిత్రించేది ఇతిహాసం. పురాణంలో సర్గాదులు దర్శన మూలాలు, ఇతిహాసంలోని కథార్థాలు పరంపరాగతమైన శ్రుతి మూలాలు. వస్తువుల స్వభావాన్ని బట్టి భేదించినా వేదార్థబృంహితత్వం వాటియందు నియతలక్షణంగా నిలిచి ఉంటుంది. ఇతిహాసపరిధి కంటె కావ్యపరిధి పరిమితం. ఒక పురుషార్థాన్ని కానీ, ఒక ప్రయోజనాన్ని కానీ సాధించటానికి ఆరంభమైన ఒక కార్యం విస్తరిల్లి ఫలమంత మయ్యేంతవరకు స్వయంసమగ్రంగా చిత్రించబడే వస్తుజీవితం కావ్యం. ఈ ప్రక్రియలు సంప్రదాయవాదాన్ని సజీవంగా నిలిపేవి. కావ్యంలోని వస్తువు చారిత్రకమైతే అది చారిత్రక కావ్యం అవుతుంది.

కావ్యంలో వస్తువు, నాయకుడు, రసం అనే అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. చారిత్రక కావ్యంలో వాటితోపాటు దేశకాల పాత్రలు ప్రత్యేక గౌరవాన్ని సంపాదిస్తాయి. వస్తువు దేశసంబంధి, నాయకుడు కాలసంబంధి, రసం పాత్రసంబంధి. చరిత్రలోని ఒకసన్నివేశం ఒకప్రాంతంలో కార్యకారణ సంబద్ధంగా సంభవిస్తుంది. కాలానుగుణమైన ప్రయోజనాన్ని సాధించటానికి నాయకపాత్ర లేదా ఒక ఉద్యమ చైతన్యం, ఆ సన్నివేశాన్ని దిద్ది తీరుస్తుంది, ఫలాన్ని సాధిస్తుంది. ఆపాత్ర సాగించే కార్య ప్రవృత్తిలో భావరూపంగా జాలువారే మానసిక చైతన్యం రసవృత్తి. చారిత్రక కావ్యం ఇలా ఒక చారిత్రక ఘట్టానికి రసజీవితాన్ని అలవరుస్తుంది. దానితో, సీమలకు పరిమితమైన దేశం ఆవరణాలను ఛేదించుకొని అనుభవ క్షేత్రంగా మారుతుంది. వ్యష్టిగా భాసించే నాయకుడు సమాజంలోని సమిష్టి చైతన్యంలోని సజీవశక్తిగా మారిపోతాడు. అతడు వ్యక్తంచేసే రసభావ జగత్తు వ్యక్తి పరిధిని దాటి విశ్వజనీనంగా వ్యాపించి, జాతిలోని వాసనా జగత్తును జాగృతం చేసి రసీకృతం చేస్తుంది. చరిత్రలో లేని కళానుభవం చారిత్రక కావ్యంలో ఉంటుంది. ఆ అనుభవం కోసమే అది పుడుతుంది; జీవిస్తుంది.

తెలుగులో వెలువడిన చారిత్రక కావ్య ప్రయోగాల్లో ముఖ్యమైనవి మూడు విధాలు. అవి: 1. చారిత్రక వస్తు కావ్యం. 2. చారిత్రక రసకావ్యం. 3. చారిత్రక తత్త్వకావ్యం. వీటిలో వస్తుకావ్యం చరిత్రలోని ఘట్టాలను వర్ణించే ప్రవృత్తికి ప్రాధాన్యం ఇస్తుంది. ఒక పరిణామ సూత్రాన్ని గాని, సమన్వయ విధానాన్నిగాని, వ్యాఖ్యాన వైఖరినిగాని ఆశ్రయించి కావ్యమునందలి సన్నివేశాలు దారానికి గ్రుచ్చబడిన పూసల్లాగా అమర్చబడటం వస్తుకావ్య లక్షణం. ఆంధ్రపురాణం, వందేమాతరం లాంటి కావ్యాలు ఈ వర్గానికి చెందే చారిత్రక కావ్యాలు. చారిత్రక రసకావ్యం ఏక నాయకమై రసప్రధానమై సాగుతుంది. ఇందులోని వస్తువు చారిత్రకం; నాయకుడు చారిత్రక వ్యక్తి; అయినా ఈ రెండూ రసపోషణకు అడ్డురావు, ప్రఖ్యాతేతివృత్తం గల కావ్యంలో లాగా. ఈ వర్గానికి చెందిన కావ్యాలు రాణా ప్రతాపసింహ చరిత్ర, శివభారతం మొదలైనవి. ఈ రెండింటికంటె చారిత్రక తత్త్వ కావ్యం విశిష్టమైనది. ఇందలి వస్తువు కథ కోసంగానీ, రసం కోసంగానీ చెప్పబడదు. చారిత్రక సన్నివేశం వెనుక రచయిత దర్శించిన తాత్త్విక సిద్ధాంతం గమ్యమానంగా నిలుస్తుంది. ఈ ప్రక్రియలో కవి కథనెలా చిత్రించాడన్నది ప్రధానం కాదు; కవి కథనెలా ఒక తత్త్వానికి వ్యాఖ్యగా నిబంధించాడన్నదే ప్రధానం. ఇటువంటి కావ్యాలకు విశ్వనాథవారి ఝాన్సీరాణి, శివార్పణం లాంటివి చక్కని ఉదాహరణలు. చారిత్రక కావ్యాలలో మహా కావ్యాలు ఉండవచ్చు; ఖండ కావ్యాలు ఉండవచ్చు. అంతేకాదు వ్యంగ్య కావ్యాలు, అధిక్షేప కావ్యాలు, వంశకావ్యాలూ, ఉద్యమ చరిత్రలూ, మహాపురుష చరిత్రలూ - ఇలా ఎన్నో రకాలు ఉండవచ్చు. ఈ దృష్టితో చూస్తే జాషువా పిరదౌసి, తుమ్మలవారి ఆత్మకథ, పుట్టపర్తి నారాయణాచార్యులవారి సిపాయిపితూరి లాంటి కావ్యాలు ఈ శాఖలో ప్రయోగాలుగా నిలుస్తాయి. త్వమేవాహం, తెలంగాణా కావ్యాలు మొదలైనవి అభ్యుదయ కవితా చైతన్యంలో వచ్చిన చారిత్రక కావ్యాలు.

ఆధునికాంధ్ర సాహిత్యంలో ప్రబోధకవిత్వం దేశ చరిత్రను కవితామయంగా చిత్రించి, ఉత్తేజకరంగా ఉల్లేఖించి, ఉపదేశాత్మకంగా అభివ్యక్తీకరించే పద్ధతిని తెలుగువానికి నేర్పింది. ఆంధ్రేతిహాసంలోని చరిత్ర విశేషాలను మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి మనీషులు వెలికితీసి కుప్పలు పోశారు. విశ్వనాథ వంటి మహాకవులు ఖండకావ్యాలుగా చారిత్రక ఘట్టాలను చిత్రించి దేశాభిమానంతోపాటు ఆత్మాభిమానాన్ని నేర్పారు. దుర్భాక రాజశేఖర శతావధానిగారు రాజస్థాన వీరగాథలలోనుంచి రాణాప్రతాపుని చారిత్రకగాథను స్వాతంత్ర్యోద్యమ చైతన్య స్ఫోరకంగా చిత్రించి తెలుగువారికి వినిపించారు. అదే వరుసలో ఎన్నో కావ్యాలను ఈ ఉద్యమానికి ఉపాయనంగా సమర్పించారు. రాణా ప్రతాపుడు సాగించినది రాజకీయ యుద్ధమైన ఆకృతిలో మనకు స్వరాజ్యోద్యమానికి ప్రతిబింబంగా భాసించింది. తెలుగువారు సాగించే స్వాతంత్ర్య సంగ్రామానికి ఒక క్రొత్త ఆవేశాన్ని అందించింది. రాణా ప్రతాపునిలో మనకు గాంధీ మహాత్ముడు దోబూచులాడుతూ ప్రత్యక్షమౌతాడు. అతనిలోని త్యాగం, దీక్ష, స్వార్థరాహిత్యం, సత్యనిరతి - నేటి చరిత్రలో కరువై పోతున్నాయి. దేశంలో వున్న కరువుల్లో ఇది ఒకటి. శివభారతం చారిత్రక రసకావ్యాలలో తలమానికం. దుర్భాకవారు కవితతో జాతిలో ఆవేశం మోసులెత్తింపజేస్తే, గడియారం వారు కవితతో జాతిని ఆలోచింప జేసారు. శివాజీ చరిత్రలో సంగ్రామగాథ ఎంత ఉన్నదో, ధర్మబోధ అంత ఉన్నది. జాతికి వీరమాతలు కావాలి; ధర్మవీరులు కావాలి; ధర్మవీరం త్యాగశీలంతో తేజరిల్లాలి. భక్తిగా సాగి శక్తిగా రూపొందాలి; ఐహికంలో ఆముష్మికం దీపించాలి. శివాజీ చరిత్ర తెలుగువారికి దేశభక్తిని, ధర్మరక్తిని ప్రబోధించింది. స్వాతంత్ర్యానికి పూర్వం రాణాప్రతాపుడు; స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత శివాజీ మనకు మార్గదర్శకులుగా నిలుస్తారు.

ఏ జాతి చరిత్రనైనా కావ్యంగా వ్రాస్తే అది ఇతిహాస మౌతుంది. చరిత్ర రసవ్యాఖ్యతో రమణీయాకృతి తాలుస్తుంది. తెలుగు రేడుల ప్రతాప చరిత్ర మధునాపంతులవారి ఆంధ్రపురాణం. వస్తుకావ్యాలలో విలక్షణమైన మార్గం దానిది. అలాగే దేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర కవితా జీవితంలో జాలువారిన కృతి ముదిగొండ వీరభద్రమూర్తిగారి 'వందేమాతరం'. విశ్వనాథవారు చారిత్రక తత్త్వ కావ్య ప్రక్రియను తెలుగులో వెలయించిన ప్రయోక్త. ఆయన కవితకు దర్శన శక్తి ఉంది. దాన్ని చరిత్రకు నేర్పాడాయన. వానమామలై వరదాచార్యులు గారు పోతన చరిత్రను మనోజ్ఞ మహాకావ్యంగా వినిర్మించారు. ఆంధ్రుల ఆత్మస్థానీయుడు పోతన. అతని చరిత్ర ఆధునికాంధ్ర మహా కావ్యాలలో అనర్ఘమైనదిగా ఆచార్యులవారు రచించారు. ఇలా, పేరు పేరునా చారిత్రక కావ్యాలను అనుశీలించడం అసాధ్యం. నవ్య సంప్రదాయ యుగ చైతన్యానికి చారిత్రక కావ్య రచనం ఉద్యమస్ఫూర్తి నందించింది. ఇది కాదనటానికి వీలులేని సత్యం.

నవ్య సంప్రదాయక కవితా చైతన్యానికి పుష్టిని చేకూర్చినది కావ్య రచనా ప్రక్రియ. దానిని పోషించిన కవులెందరో ఈ వరుసలో ఉన్నారు. తుమ్మల, పింగళి, కాటూరి, నాయని, ఇంద్రగంటి, పుట్టపర్తి, జాషువా, రాయప్రోలు, కరుణశ్రీ, బోయిభీమన్న, ఉత్పల, జ్ఞానానందకవి, విశ్వనాథ వెంకటేశ్వర్లు, కొండవీటి వెంకటకవి, యస్వీ జోగారావు, పువ్వాడ శేషగిరిరావు, బీర్నిడి ప్రసన్న, వి.వి.యల్‌, స్ఫూర్తిశ్రీ, బాడాల రామయ్య, కరుటూరి సత్యనారాయణ, వఝల కాళిదాసు మొదలైన వారు ఎందరో మహానుభావులు. వీరు పద్య రచనంలో ఆధునిక కవితా శిల్పాలను వెలార్చిన ప్రయోక్తలు. నవ్యసంప్రదాయ మార్గానికి మణిదీపాలు. అభ్యుదయమార్గంలో నడిచినా కొంతవరకు నవ్య సంప్రదాయధారకు తోడ్పడే రచనలు చేసిన కవులుగా దాశరథి, నారాయణరెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ, జె.బాపురెడ్డి మొదలగు కవులను పేర్కొనవచ్చు.

నవ్య సంప్రదాయ కవిత్వోద్యమం ఈ శతాబ్ది రెండవపాదంలో మొదలై నేటికీ నిర్భయంగా నిండుగా సాగుతోంది. కడచిన యాభై యేళ్ల నుంచీ వస్తున్న సాహిత్యోద్యమాలను పరిశీలిస్తే అవి మూడు రకాలుగా గోచరిస్తాయి. 1. రాజకీయ పార్టీ మద్దతుగానీ, అజమాయిషీ కాని ఉన్న రచయితల సంఘాలు నిర్వహించినవి. 2. పార్టీల బలం వెనుకలేని స్వతంత్ర రచయితల సంఘాలుకాని, కొందరు రచయితలు సంఘటితంగాకాని సాగించినవి. 3. సంఘీభావ స్పృహ లేకుండానే సమకాలీన ఒక చైతన్యాన్ని రచయితలు ఎవరంతట వారుగా పోషించినవి. వీటిలో మొదటి రకానికి ఉదాహరణగా అభ్యుదయ రచయితల సంఘాన్నీ, విప్లవ రచయితల సంఘాన్నీ పేర్కొనవచ్చు. రెండవ రకానికి తెలంగాణా రచయితల సంఘం, ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌, కవిసేన మొదలైనవి పేర్కొనవచ్చు. మూడవ రకానికి నవ్య సంప్రదాయ కవిత్వోద్యమంలో పాల్గొన్న రచయితలను పేర్కొనవచ్చు. వీరికి రచయితల సంఘాలు లేక పోవచ్చు, మేనిఫెస్టోలు లేకపోవచ్చు. సంప్రదాయవాదాన్నీ, నవ్యసంప్రదాయవాదాన్నీ ఎదుర్కొంటున్న ఎందరో అభ్యుదయ విప్లవవాదులకు ఎదురుగా మహారథుల్లా నిలిచి ఆధునిక చైతన్యంతో సంప్రదాయాన్ని రక్షిస్తున్న కవులు, రచయితలు వీరు. ఆధునిక యుగంలో సమాజం సాహిత్యానుభవాన్ని పొందే అదృష్టాన్ని అందించిన, అందిస్తున్న అక్షరశిల్పులు, రసమూర్తులు, నవ్య సంప్రదాయ కవితాయుగ సారథులు.

ఖండ కావ్యం మహాకావ్యాన్ని అదృశ్యం చేయలేక పోయింది. వచన కవిత్వం ఖండకావ్య రచనలో పడి మహాకావ్య శిల్పాన్ని మరచిపోయింది. కుందుర్తి ప్రేరణతో కొన్ని ప్రయోగాలు తలయెత్తినా, నడుము నిలపలేక పోయాయి; నాలుగు కాలాలు నడిచి పోలేక పోయాయి. పద్యం నడుము విరగ్గొడతానని పఠాభి, నారాయణబాబు లాంటి వారు పోలీసుజులుం చేసినా, లాటీ చార్జీలో దెబ్బలు తిన్న స్వాతంత్ర్య యోధుడు లాగా పద్యం నేటికీ బ్రతికే ఉంది. పద్యానికి నెచ్చెలి గేయం. వీళ్ళిద్దరూ దేశంలో తలయెత్తుకొని తిరగటమే కాదు, గౌరవాదరాలను కూడా పొందుతున్నారు. వచన కవిత్వంతో విసిగిపోయిన నేటి సహృదయలోకం గేయంతో గొంతు కలుపుతున్నది. పద్యాన్ని హృద్యంగా ఆహ్వానిస్తున్నది. ఈ ఫలితాలన్నీ నవ్యసంప్రదాయ కవిత్వోద్యమం సాధించినవే; నినాదాలతో కాదు నిశ్శబ్దంగా, నిండుదనంతో.

ఒక్క మాటలో చెప్పాలంటే, నవ్య సంప్రదాయ కవిత్వోద్యమం గాంధీ మహాత్ముని సత్యాగ్రహోద్యమం వంటిది. అభ్యుదయ కవిత్వోద్యమం సుభాస్‌ చంద్రబోస్‌ సాగించిన స్వాతంత్ర్యపు పోరాటం వంటిది. విప్లవ కవిత్వోద్యమం సిపాయీల తిరుగుబాటు వంటిది.

సూచికలు:


1Selected Prose of T.S.Eliot, Editor: John Hayward, Penguin Books Ltd. (3rd Ed.),1958 - పు. 38-3 9
వెనక్కి
2Literary Criticism - A Glossaary of major terms, Patric Murray, Longman Group Ltd, London, 1978
వెనక్కి
3Literary Criticism - A Glossaary of major terms, Patric Murray, Longman Group Ltd, London, 1978
వెనక్కి
4సాహిత్యం - విమర్శ, సమదర్శిని ప్రచురణ, 1984, పు.70-71
వెనక్కి
5మహతి - యువభారతి ప్రచురణ, 1972. వ్యాసము - నేనూ నా సాహిత్య రచనలు, పు.4
వెనక్కి
6సాహిత్యంలో దృక్పథాలు - నవోదయ పబ్లిషర్స్‌, 1963, పు.48
వెనక్కి
AndhraBharati AMdhra bhArati - telugu vachana sAhityamu - vyAsamulu - navya saMpradAya kavitvOdyamaM : vishvanAtha -- AchArya ji. vi. subrahmaNyaM ( telugu andhra )