వచన సాహిత్యము వ్యాసములు నయాగరా - అభ్యుదయ ప్రస్థానంలో తొలిమజిలీ
డా॥ జి. వి. సుబ్రహ్మణ్యం

నయాగరా - అభ్యుదయ ప్రస్థానంలో తొలిమజిలీ

అక్షరాల ఆలోచనలు (విమర్శన వ్యాస సంకలనం) - ఆచార్య జి. వి. సుబ్రహ్మణ్యం
ప్రచురణ - యువభారతి
జనవరి, 1988

'అడుగుజాడలు' (కుందుర్తి కృతులపై సమీక్షావ్యాస సంకలనం) లో ప్రచురితం. జనవరి 1976
సం: డా॥ పోరంకి దక్షిణాముర్తి
ప్రచురణ: శ్రీనివాస సాహితీ సమితి, హైదరాబాదు

నేను 'నయాగరా' కవితా సంపుటాన్ని చదువుతున్నప్పుడు అలవోకగా నా మనస్సులో 'కనపడలేదా మరో ప్రపంచపు - కణకణ మండే త్రేతాగ్ని' అన్న శ్రీశ్రీ మహాప్రస్థాన గేయ చరణాలు నినదించాయి. ఆ గేయంలో 'త్రేతాగ్ని' ప్రతీకకు అర్థం వేరు, ఈ స్మృతిలోని తాత్పర్యం వేరు. బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, ఏల్పూరి సుబ్రహ్మణ్యం గారలు ముగ్గురు కలిసి - ఒక్కొక్కరూ మూడేసి ఖండకావ్యాల చొప్పున - సంకలనంచేసి ప్రచురించిన 'నయాగరా' నాకు త్రేతాగ్నిలా అనిపించింది. ఈ సంపుటి అభ్యుదయ కవితా ప్రస్థానంలో ఒక మజిలీ; 'అభ్యుదయ కవితా యుగంలో అచ్చయిన తొలికావ్యం.'

1"శ్రీశ్రీ 'మహాప్రస్థాన' సంపుటిలో సమస్తదేశములకు, ప్రపంచ మానవులకు సంబంధించిన సంఘటనలను, అనుభవములను మాత్రమే వర్ణించినాడు. ప్రత్యేకముగా కొన్ని దేశములలోని ఉద్యమముల నీతడు స్వీకరించలేదు. శ్రీశ్రీ వదిలిన యీ యంశమును తరువాతి అభ్యుదయ కవులు స్వీకరించిరి. 1944లో వెలువడిన 'నయాగరా' కవితా సంపుటి ఈ ధోరణికి ప్రతినిధి వంటిది .... సీతారామరాజు మన్య విప్లవము, దండి సత్యాగ్రహమున పాల్గొన్నందున ప్రభుత్వముచేత యావజ్జీవ కారాగార శిక్ష విధింపబడిన విప్లవనాయకుడు ఠాకూర్‌ చంద్రసింగ్‌ వీర చరిత్ర మున్నగు సంఘటనలు వీరి కవితా వస్తువులైనవి. అంతేకాక పారీస్‌ వీధులు, చైనా లోయలు, బర్మా అడవులు, మాస్కో గేట్లు, సోల్జర్లు, టాంక్‌ డ్రైవర్లు, గెరిల్లాల గుంపులు, కొడవలి పదును, 'ఎర్రజెండా' సమ్మెట పెట్టు నిప్పుల గొంతుక మున్నగునవి వీరి గేయములలో స్థాన మేర్పరచుకొనినవి. శ్రీశ్రీ స్వీకరించిన 'జగన్నాథ రథ చక్రములు', 'అవతారము' లోని యముని మహిషపు లోహఘంటల వంటి సంకేతములు కాక, వాస్తవిక సంఘటనలు, నగ్నానుభూతులు స్వీకరింప బడినవి. అభ్యుదయ కవిత్వ వికాస దశలో గమనింపదగిన మజిలీ 'నయాగరా' కవితా సంపుటి. రమణారెడ్డి గారన్నట్లుగా - శ్రీశ్రీ కల్పించింది వాతావరణం మట్టుకే కాగా 'నయాగరా' కల్పించింది ఆ వాతావరణం లోని స్థూల రేఖలు"

'నయాగరా'లోని కుందుర్తి ఆంజనేయులుగారి కవితా ఖండాలను గురించిన సమీక్షే యీ వ్యాస తాత్పర్యం. కుందుర్తి తమ కవితా స్వభావాన్ని పేర్కొంటూ అన్నమాటలు ముందు మనవి చేస్తాను.
2"ఆ రోజుల్లో కుండ పోతగా ఆవేశం కుమ్మరించడమే కవిత్వమనే వాదం మాది. దీనికి తోడు ఎర్ర జండా నాయకత్వాన యీ సమాజ వ్యవస్థ మారాలని మా కవితలో వుండే సందేశం. కమ్యూనిష్టు మానిఫెస్టోను మించిన ఉత్తమ కవిత్వం ప్రపంచంలో లేదని మేం వాదిస్తూవుంటే సంప్రదాయ వాదులైన కవి మిత్రులు కొందరు నిర్ఘాంత పోయి వింటుండే వారు. వాళ్లు రసమనీ, వ్యంగ్యమనీ ధ్వని అనీ పూర్వ అలంకారిక పారిభాషిక పదాలు వాడుతూ వుంటే వాటిని ఆధునిక కవిత్వానికి అన్వయించి చెప్పేపని నాదిగా వుండేది. ... అభ్యుదయ కవిత్వం నయాగరా రోజులనుండి ఎన్నో మలుపులు తిరిగి మజిలీలు దాటి, ఎంతోదూరం ప్రయాణం చేసింది. ... ... ... ఇప్పటి విప్లవకవుల వీరావేశాన్ని చూస్తుంటే అది ఒక ఋజురేఖలో కాకుండా ఒక వలయాకార పరిధి మీద తిరుగుతూ మళ్లీ అదే స్థానానికి వచ్చిందా అనిపిస్తుంది."

ఈ మాటల్ని బట్టి మనకు తెలిసే విషయాలు ప్రధానంగా మూడు. ఒకటి: 'నయాగరా'లోని ఆంజనేయులుగారి కవిత్వానికి, అభ్యుదయ కవిత్వానికి ఆది ధర్మమైన, ఆవేశం మొదటి లక్షణం. రెండు: సామ్యవాద సిద్ధాంతానికి సంబంధించిందే కవితా వస్తువు. మూడు: ప్రాచీనాలంకారికులు చెప్పిన పారిభాషిక పదాలతోను, ప్రక్రియా నిర్వచనాలతోనూ, ప్రమాణాలతోను వీరి కవితాన్ని పరిశీలించటం కాకుండా కవిత్వానికుండే మౌలిక ధర్మాలను దృష్టిలో పెట్టుకొని గమనిస్తే ఈ కవిత్వంలోనూ కవితాంశ కనపడుతుంది. మరొకటి కవితా లక్షణం కాకపోయినా చారిత్రక సత్యం. ఈనాటి విప్లవ కవిత్వంలో కనపడే ఆవేశం ఆనాటి అభ్యుదయ కవితారంభ దశలో వెలువడిన ఆవేశం లాంటిదే. ఈ అంశాలు నయాగరా కవిత్వ స్వభావ, స్వరూప, ప్రమాణ, ప్రాశస్త్యాలను క్రమంగా నిరూపిస్తున్నాయని తెలుసు కోవడం సులభం.

కుందుర్తి కవిత్వానికి ప్రజోద్యమాల చైతన్యం ప్రాణం. ఆ చైతన్యానికి స్పందించి వెలువడేదే ఆయన కవిత్వం.
3"సాధారణంగా నే నెన్నుకొనే కావ్యవస్తువులు చైతన్యవంతమైన ప్రజోద్యమాలకు సంబంధించినట్టివిగా వుంటాయి. ఏదో ఒకరూపంలో ఆనాటి పాలకవ్యవస్థమీద ప్రజలు చేసిన తిరుగుబాటు నా హృదయంలో చైతన్య స్ఫోరకములై నన్ను ఆపాదమస్తకం కదిలిస్తాయి. వాటి జయాపజయాలతో నిమిత్తం లేదు. ... రాజకీయ నాయకుల సిద్ధాంత భేదాలతో నాకు నిమిత్తం లేదు. గాంధీజీ తన అహింసా దృష్టితో చూచి కాదన్న మాత్రాన అల్లూరి సీతారామరాజు మహావీరుడు కాకుండా పోడు. అదే విధంగా కమ్యూనిష్టు సిద్ధాంత వేత్తలు కాదన్నంత మాత్రాన గాంధీజీ తన వుద్యమాలద్వారా ప్రజలలో తెచ్చిన చైతన్యానికి చరిత్రలో స్థానం లేకుండా పోదు. ఈ దృష్టితో చూచినపుడు ఎన్నిలోపాలువున్నా ప్రజలలో ఉవ్వెత్తుగా పొంగిన చైతన్య మహాసముద్రతరంగాలన్నీ నాకు కావలసిన చుట్టాలే. ప్రేమకవిత్వాన్ని వదలిన తరువాత తెలుగుకవిత్వంలో విజృంభించింది ప్రధానముగా వీరరసము. దానికితోడు అత్యధిక సంఖ్యాకులైన సామాన్య ప్రజానీకపు విముక్తికి సంబంధించిన ఊహలో ఉన్నటువంటి కరుణరసం అంతర్వాహినిగా వుండనేవున్నది. ఆధునిక కాలంలో వచ్చిన కవిత్వమంతా ఈ రెండింటి సమ్మేళనమే" అన్న వాక్యాలు కుందుర్తి కవితాసమీక్షకు పనికివచ్చే ప్రమాణ సూత్రాలు.

కుందుర్తి కమ్యూనిష్టు సిద్ధాంతాలకు కట్టుబడినా, వాటిని మించిన మానవతా వాదాన్ని మన్నించినవాడు. ప్రజా ఉద్యమాలు ఏ ప్రాంతానికి సంబంధించినా ఏ సిద్ధాంతాలను ఆశ్రయించి నడిచినా ఆయన ఆదరాభిమానాలను చూరగొన్నాయి. కుందుర్తి విప్లవం ఒక రాజకీయ సిద్ధాంతానికి కట్టుబడింది కాదు, అభ్యుదయ పథానికి అంకితమైనది. పీడిత ప్రజ చేసే ఉద్యమం ఆయన కవితకు ఊపిరి, కుందుర్తి వ్యక్తిత్వం అభ్యుదయ సాహిత్యంలో ప్రత్యేకత సాధించుకున్నది ఈ ప్రవృత్తి వికాసంతోనే. అందువల్లనే ఆయన మానవతా వాదాన్ని మన్నించిన మార్క్సిస్టు కవిగా మన్ననలు పొందుతున్నారు.

కుందుర్తి కవితా ప్రవృత్తిని తీర్చి దిద్దింది ఆయన ప్రయోగ శీలం.
4"ఆధునిక తెనుగు కవిత్వానికి సంబంధించి నేను ప్రతిపాదించి ప్రచారం చేసిన మరొక ముఖ్య విషయము కథా కావ్య సిద్ధాంతము. దీనికి ఆద్యుడైన శ్రీశ్రీ మొదలుకొని బాల గంగాధర తిలక్‌ వంటి అనేక మంది ప్రముఖులు అంగీకరించటానికి ఇష్టపడక పోయినా ఆధునికుల రచనలును జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఇప్పటికే చాలావరకు చాల చోట్ల ప్రవేశించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. నేననేది ప్రతి ఒక్క కవీ బృహత్కావ్యాలే రాయాలని కాదు. కొందరికి అంత శక్తి కూడా లేకపోవచ్చు, కాని 'పూర్ణమ్మ కథ', 'విదూషకుని ఆత్మహత్య', 'బాటసారి', 'బిక్షువర్షీయసి' మొదలగు వాటిలోవలె కథాంశమేదైనా వుంటేనే నాకు బాగుంటుంది. ఈమాత్రం కథాంశం కూడా లేని కవితలు కేవలం ప్రబోధ గేయాలు, వర్ణనాత్మక రచనలుగా సాహిత్యంలో వుండవచ్చు. కాని, రసపోషణ మొదలగు కావ్య లక్షణాలకు ఇవి అంతగా సరిపోవని నా అనుమానం." అన్న కుందుర్తిగారి మాట లిక్కడ గమనింప దగినవి.

ప్రబోధం, వర్ణనం, కథనం - అనే మూడు పద్ధతుల్లో మూడవ పద్ధతిని గూడా అభ్యుదయ సాహిత్యంలో సాధించే ప్రయోగాన్ని కుందుర్తిగారు సమర్థించారు. మార్గదర్శకాలైన రచనలు వెలయించారు. అయితే, కుందుర్తి కథనం పురాణ కథనం కాదు, ప్రబంధ కథనం కాదు, అది ఒక విధమైన కథా సమీక్షనం, కథను కథగా చెప్పటం ఆయన ధ్యేయం కాదు, కథలోని వస్తువును కవితామయంగా వ్యాఖ్యానిస్తూ కథా సూత్రాన్ని అంతస్స్రోతస్వినిగా ప్రవహింపజేయటం ఆయన రచనాస్వభావం.

"మతానికి నవాబు పెట్టిన ముద్దు పేరు
ఆనాటి రజాకారు
తెలుగుజాతి గుండెమీద
కుంపటిలా రజాకార్లు గ్రామాలను మండించారు
దండించారు; పాపం పండించారు,
తల్లి ఒడిలోకి తరలిపోనున్న తెలుగునేల చెక్కమీద
దండయాత్ర చేశారు
నవాబు దర్జాల రాజ్యం ఏక ఖండగా
స్వతంత్రంగా ఉండాలని వాదించారు."

ఇలా సాగిన 'తెలంగాణా' కావ్యరచనం కథాకథనమే ప్రధానంగా కలది అనుకోలేం. ఒక ఇతిహాసాన్ని సమీక్షించే సాహిత్య చరిత్రకారుని కవిత్వ సముల్లాస మనుకుంటాం. కథ కవితా శైలిలో మజ్జనోన్మజ్జనం చేయటం కుందుర్తి కావ్యశిల్పం. అందుకే 'తెలంగాణ' ఒక కొత్త రకం కథా కావ్యం.

కుందుర్తి కథా కావ్య రచనా ప్రవృత్తి ఆయన కవితకు సమీక్షా దృష్టిని ప్రసాదించింది. ఈ లక్షణం మొదటి కావ్యం అయిన 'నయాగరా'లో కనపడుతుంది. ఒక కవి భావి కవితా జీవితంలో పండించుకొన్న ప్రయోగ శిల్పాల బీజావస్థ తొలి కవితల్లో కనపడటం సహజం. బీజమే ఒక మహా వృక్షానికి తొలిరూపం.

నయాగరాలో ఆంజనేయులుగారి మొదటి కావ్యఖండం 'మన్యంలో'. ఇందులో వస్తువు అల్లూరి సీతారామరాజు విప్లవం. దాన్ని కథగా రాస్తే నవల కావచ్చు. పెంచిరాస్తే ప్రబంధం కావచ్చు. కుందుర్తి దాని కథను చెప్పటానికి వ్రాయలేదా కావ్యం! విప్లవ తత్వాన్ని చెప్పటానికి వ్రాశారు. "సమిష్టి సత్యాగ్రహం దేశాన్ని సకలం ముంచెత్తిన రోజులు" అంటూ పూర్వరంగాన్ని సూత్రబద్ధం చేశారు. 'మన్యంలో, తిరుగుబాటు, ప్రభుత్వం విరగబాటు అణి చేసిన, గొడ్డలి పెట్టు' అని ప్రస్తావనను నిర్వహిస్తూ కథా తత్వాన్ని సూచ్యార్థ సూచనంగా అందించారు. 'మదరాసునుండి, మలబారునుండి,, తోలుకవచ్చిన సైన్యంలో కమాండరిన్‌ చీఫులు, శివాలయం గోడమీద, చెక్కించిన, విగ్రహాలు' - ఇందులో కథా ఉంది, శిల్పమూ ఉంది. కమాండరిన్‌ చీఫులకథ చివరి మూడుముక్కల్లో అలంకార ధ్వని నాశ్రయించి అద్భుత శిల్పాన్ని ప్రదర్శించింది. ఇటువంటి సంగ్రహ సమీక్షలో కుందుర్తి కవితాశక్తి అణుశక్తిలా ప్రత్యక్షమౌతుంది. 'బంధించిన, బానిసత్వ, విచ్ఛేదక వీరమూర్తి, విప్లవ శరదాకాశం, వెలిగించిన విద్యుద్దీపం, రామరాజు హృదయంలో, రగిలిన స్వాతంత్ర్యేచ్ఛ' అనే భాగంలో ఆవేశం ఉంది, వర్ణనం ఉంది. వీరుణ్ణి ఆశ్రయించి కథాస్మృతి ఉంది. 'మన్య విప్లవం, మా చరిత్రలో, వీచిన జంఝానిల వీచిక' అంటంలో సమీక్షాత్మకమైన ప్రబోధం ఉంది. మొత్తానికి 'మన్యంలో' కవిత కుందుర్తి కవితలో ఉన్న కథాత్మక, వర్ణనాత్మక, ప్రబోధాత్మక చైతన్యానికి సూక్ష్మదర్శిని. ముప్పేటగా సాగిన కవితా గుణస్రవంతులకు సంగమతీర్థం.

'జయిస్తుంది' ఖండకావ్యం కుందుర్తి కవితావేశానికి ప్రతినిధి. వస్తు స్వభావాన్ని బట్టి రచనా ప్రవృత్తిని, ప్రక్రియా ప్రస్తారాన్ని సారించటం కుందుర్తిగారికున్న సహజ గుణం. శ్రీశ్రీ 'మరోప్రపంచం' గేయచ్ఛాయల్లో నడిచిన ఈ కవిత విప్లవ సైన్య ప్రగతికి దుందుభి. శ్రీశ్రీ గేయంలో గతి నాశ్రయించి ఆవేశం ఉరకలెత్తింది. 'జయిస్తుంది' కావ్యం వచన కవితా ఖండిక. అంతర్లయతో నిండిన భావోద్వేగం దీనికి ప్రాణం!

"గతకాల కథల్లో లేందీ
కన్పించే నేటిది కాందీ
మరో ప్రపంచపు
మహదాశయమే
మార్గదర్శిగా
నడిచే
సైన్యం
కదలిన
కనక రథంలా
వదలిన
బ్రహ్మాస్త్రంలా
ఫెళఫెళ ఫెళఫెళ
నడిచే
విప్లవ సైన్యం
జయిస్తుంది జయిస్తుంది"

ఈ ఖండికలో శ్రీశ్రీ రచనలో ఉన్న కదను లేదు; కాని కుందుర్తి రచనలో కనపడే పదనువుంది. శ్రీశ్రీ నాదవంతమైన జలపాతాన్ని సృష్టించాడు; కుందుర్తి రాళ్ల గుళ్ల మధ్య ఒంపులు తిరుగుతూ ఒడుపుగా పారే సెలయేటిని సృష్టించాడు. ఒకటి గేయ గతివల్ల సాధ్యమైంది; మరొకటి వచనగతివల్ల సాధ్యమైంది. ఒకటి ఆలోచనను ఆవేశంలో అంతర్భవింప చేస్తుంది. అక్కడ శబ్దం వెంట అర్థం పరుగెడుతుంది. ఇక్కడ అర్థంవెంట శబ్దం అనుసరిస్తుంది. అక్కడ శ్రవణానందంతో కవితానందం శ్రుతి కలుపుతుంది; ఇక్కడ కవితానందం మననానందంగా మలుపు తిరుగుతుంది. ఒకటి ఆబాలగోపాలాన్ని వెంట తీసుకుపోతుంది; మరొకటి బుద్ధిజీవుల్ని పలకరిస్తుంది. అందువల్లనే కుందుర్తిగారన్నారు - "వచనకవిత్వం మొదలగు ఈ రూపాలు కొద్దో గొప్పో చదువూ సంస్కారం గల మధ్యతరగతి ప్రజలను మాత్రమే ప్రబోధితం చేయగలుగుతాయి-" అని.

'తరువాత' కావ్యఖండిక అంతర్లయతో ఆలోచనను రంగరించి చేసిన రచన. గతితార్కిక భౌతిక వాదానికి కవితారూపాన్ని కల్పించిన ప్రయోగం. శ్రీశ్రీ దేశ చరిత్రల ప్రభావం దీనిమీద బలంగా ఉంది. అందులోకంటె కొన్ని అంశాలను సుస్పష్టరేఖలతో వాచ్యంచేసే యత్నం ఇందులో కనపడుతుంది.

'అన్యాయం అక్రమమూ
సంఘంలో చదరంగం
పరస్పరం దొమ్మీ దోపిడి
ఆరంభించని
ఆదియుగంలా
మంచి మీద బ్రతకమంది!'

'అందరికీ
అవకాశాలూ
సరిపోయే వస్తూత్పత్తి
పంపిణిలో సమాన భాగం
కోరుకోను హక్కుందట'

ఈ ఖండికలో ప్రతిపాద్యాంశానికున్న ప్రాధాన్యం ప్రతిపాదన విధానానికి లేదు. వస్తువు నలంకరించి స్పష్టతకు దూరంకావటం ఇష్టంలేకపోవటమే కుందుర్తినీ కృతినిలా రచింపచేసింది.

కవిత్వపుశైలి సామాన్యప్రజల సంభాషణస్థాయికి రావాలనే లక్ష్యంతో కలం పట్టిన కవి శ్రీకుందుర్తి. ఈలక్ష్యం గేయంతో సాధించటం, బుర్రకథల వంటి ప్రక్రియలతో సాధించటం తేలిక అనికూడా కుందుర్తికి తెలుసు. అయినా వచన కవితకు ఆశక్తిని సాధించాలని కుందుర్తి సాహిత్య జీవితలక్ష్యం. కుందుర్తి కవితా శైలి తెలుగుదనంలోని బలాన్ని పుంజుకున్న పలుకుబడులతో సరళంగా సాగుతుంది. మనసులోనుండి దూసుకొనివచ్చే భావాలకు ఛందస్సుల వేషాలు వేయకుండా, రంగలాస్యం చేయించకుండా, శ్రీరంగనీతులు చెప్పకుండా, చురుకుతనంతో చలాకీతనాన్నీ, సమీక్షాగౌరవంతో సౌజన్యశీలాన్నీ, సూటిదనంతో సౌకుమార్యాన్నీ, ఆవేశంతో ఆలోచననూ, అంతర్లయలో అంతర్నియమాన్నీ, కథతో బోధనూ, వక్రోక్తితో వ్యంగ్యాన్నీ, వాస్తవంతో వర్ణననూ, విప్లవంతో వివేకాన్నీ, మార్క్సిజంతో మానవత్వాన్నీ, సమ్మిళితంచేసి వచన కవితా ప్రపంచంలో ప్రముఖాచార్య పీఠాన్ని ఆక్రమించిన శ్రీకుందుర్తి సాహిత్యయాత్రలో మొదటి మజిలీ 'నయాగరా'.

ఈ జలపాతంలో ప్రభవించిన విద్యుత్తే కుందుర్తి కృతులనిండా వెలుగు వాకలుగా ప్రవహించింది.


1ఆధునికాంధ్ర కవిత్వము. డా॥ సి. నారాయణరెడ్డి పుట 695
వెనక్కి
2'నయాగరా' - ద్వితీయ ముద్రణ పీఠిక - శ్రీకుందుర్తి
వెనక్కి
3కుందుర్తి కృతులు - పీఠిక - శ్రీ కుందుర్తి పుటలు 3 - 4
వెనక్కి
4కుందుర్తి కృతులు - పీఠిక - శ్రీ కుందుర్తి పుట 3
వెనక్కి


నయాగరా కవితలు

AndhraBharati AMdhra bhArati - telugu vachana sAhityamu - vyAsamulu - abhyudaya prasthAnaMlO tolimajilI - nayAgarA - DA. ji. vi. subrahmaNyaM ( telugu andhra )