వచన సాహిత్యము వ్యాసములు నిగమశర్మ అక్క : రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ

ఈ చల్లని తల్లి పేరేమో తెనాలి రామకృష్ణకవి మనకుఁ దెలుపలేదు. అతనికే తెలియదేమో. వాల్మీకి అగస్త్యునికి పేరు లేని యన్న నొకనిని సృజించెను. అతనికి పేరొక్కటే కాదు, మఱేదియు లేదు. ఈయమ సృష్టి యట్టిది కాదు. రామకృష్ణుఁ డమృతములో లేఖిని నద్ది దిద్ది తీర్చి యాడించిన పుత్తడిబొమ్మ యిది. కావున పేరు లేకున్న నేమి? నిగమశర్మవంటి పెద్దపేరే "నేతిబీరకాయ" కాలేదా? తెనాలివారి నిర్మాణములో పేరు పెంపు గల యే యితర వ్యక్తికిని ఈ యనామధేయకుఁగల జీవకళలో, నయనాణ్యములలో పదింట నొక పాలును లేదు.

ఎవఁడో యొక చిత్రకారుని వేళాకోళము చేయుటకై తానును చిత్రింపఁగలఁడని చెప్పి, గోడనిండ తోఁకలు వ్రాసి గుఱ్ఱము లాప్రక్క నున్నవని చెప్పి రాయలవారిని నవ్వించిన వాఁడట రామకృష్ణుఁడు! వాని కవిత్వమందేమో యీ ధర్మము చాలఁ గానవచ్చును. అంగసృష్టి ఆంగిసృష్టికన్న ఎక్కువ. కాని యా యంగములే, ప్రాతఃకాలమున ప్రాకారము మీఁద నిక్కి చూచు లేఁదీగల కొనలవలె, ప్రాణశక్తితో తకతకలాడు చుండును. సంపూర్ణ వస్తు నిర్మాణమునకు అతనియందు లేనిది నేర్పుగాదు, ఓర్పు. వేళాకోళపుఁ గందువలను, పరిహాసపు పట్టులను వెదకుట యతని స్వభావము. గావున ఒక వస్తువు నాద్యంత పుష్టిగా పరీక్షించులోపల చూపు వేఱొక చోటికి పారును. మొదటిదానియెడ శ్రద్ధ తగ్గును. పరిహాస కుశలత తెలివికి, చురుకుదనమునకు గుర్తు. అది గలచోట సామాన్యముగ సోమరితనమును, అశ్రద్ధయు నుండును. కథలలోని కొంటె భాగవతపు రామకృష్ణుఁడే కావ్యములందును కొంచెము నాగరక వేషపు నాజూకులతో ప్రతిఫలించుచున్నాఁడనుట రసికు లందఱును గమనించిన విషయమే. ఇతని రచనలలోని మాటలపోటు నిర్లక్ష్యపు నడక, భావముల తీండ్ర - అన్నియు దాని పరిణామములే. కాని కొంత శ్రద్ధ వహించి పనిచేసెనా ప్రతిమ యంగములు అంగాంగములును కళ కళలాడునట్లు నిలుపక పట్టి ప్రదర్శించు అపూర్వసూత్రధార విద్య ఇతనికిఁ గలదనుట కీ పేరులేని పేరంటాలే శాశ్వత సాక్షి.

ఈమె తండ్రి సభాపతి. పేరుకుఁ దగినట్లు 'వేదముల్‌ వోసిన గాదె, శాస్త్రములు పుట్టిన యిల్లు, కళాకలాపముల్‌ డాసిన రచ్చ,' పీఠికాపుర సంస్థానమున పేరెన్నికగన్న వైదికాచార్యుఁడు, ఆగర్భ శ్రీమంతుడు. రాజాధిరాజుల మ్రొక్కులు గొన్నవాఁడు. ఆహితాగ్ని, ఇంటిలో ముప్రొద్దు భగవదారాధన, అతిథుల సమారాధన, శిష్యుల వేదముల సంత, శాస్త్రముల చదువు, వీనికిఁ దోడు వడ్డి వ్యాపారము, కుడివారము మేలువారము రెండును గల సేద్యము, దానికి వలయు పశు శిశు దాస దాసీ జనములు, 'రాజాలయమునకు రాకపోకలు' - వీనితో తీరిక గలిగినప్పుడు 'అంగడి'కిఁ బోయి గ్రామ కార్యము దీర్పవలసిన ధర్మాధికారము. ఇట్లితఁడు వైదిక లౌకికములు రెంటిని సమానముగా కలిపి మెదిపి కరువుపోసిన దొడ్డ విగ్రహము. చదువు, చనవు, పరువు - మూఁడును సంపాదించిన మూర్తి.

తల్లి 'అతులనిష్ఠ' గల ముసలి ముత్తైదువ. అత్తగా రవసాన కాలమున నిచ్చిన హరి సుదర్శనపుఁ బేరు అమూల్య పవిత్రాభరణముగా నెంచి పండుగ వేళలఁ బెట్టుకొని తీసి దాఁచుచు, తరతరముల నుండి కూడఁ బెట్టఁగా వచ్చిన 'మూల విత్తము' రహస్యమును బైలుపడనీయక భద్రముగాఁ గాపాడుచు, వయసు ముదిరినను గొడ్డువోక బిడ్డలను కడుపునిండఁ గనుచు, ధర్మార్థములు రెంటిని సమానముగా సంసారమందు నిర్వహింపఁ గల్గిన పెద్ద యిల్లాలు.

ఇట్టి తలిదండ్రుల కడుపునఁ బుట్టి పెరిగిన పెద్దకూఁతురు మన కథానాయిక. కులాభిమానము, ధర్మార్థములందలి జాగ్రత్త, తెలివి తేటలు, పలుకుల నయగారము, శీలనైర్మల్యము, పనిపాటల యందలి దిట్టతనము, తీవ్రమైన ప్రయోజన దృష్టి - ఇవన్నియు నామెకు చిన్ననాఁటి నుండి చెప్పక చూపక వచ్చిన చిట్టలు; వ్రాఁత చదువుల సమాచారము తెలియరాదు. ప్రాయశః ఆమె వానిని నేర్వలేదు. నష్టమును అంతగా లేదు. అత్తవారిల్లు పుట్టినింటి కైదామడల దూరము. ఈ సంసారముతో వియ్యమందిన యా సంసారపు పెద్దతన మెట్టిదో మనము కొంత యూహింపఁగలము. తమకంటె గొప్పవారింటికే యాఁడబిడ్డ నిచ్చుట కందఱును ప్రయత్నింతురు. ఇఁక భర్త! - అతఁడు రామకృష్ణకవి పెద్ద కుంచె నద్ది గోడపైఁ దీఁడి చిత్రించిన తోఁకలలో నొకటి. భార్య చేతితోఁ దాఁకినచోఁ గదలును, అంతే. ఇరువురికిని 'ఇంతలు అంతలు నగు సంతానము' సమృద్ధి.

తనయింటఁ దాను మర్యాదగా సంసారము చేసికొనుచున్న యామెకు పుట్టినింటి నుండి వార్త యొకటి వచ్చి చాల మనసు నొప్పించినది. తమ్ముఁడు నిగమశర్మ పచ్చి పోకిరియై పోయినాఁడు. ఆస్తియెల్ల నించుమించుగా కరఁగఁ దిన్నాఁడు. ఆచార వ్యవహారము లడుగంటినవి. మానమర్యాదలు, చదువు సంతలు నశింపవచ్చినవి. అభక్ష్య భక్షణము, అపేయపానము, అప్పులు, జూదము, మోసము, దొంగఱికము మొదలగు వానికి లోఁగి కడపటి లోఁతునకు దిగినాఁడు. కంచెంత కాఁపురము. తలిదండ్రులు ముదుకలు. దిక్కు విచారించు వారు లేరు.

ఇంటి పెద్దకూఁతురు తాను. నిగముఁడు తానెత్తి ముద్దాడి పెంచి పెద్దచేసిన తమ్ముఁగుఱ్ఱ. వానికి బుద్ధిచెప్పి త్రోవకుఁ దేలేనా యనుకొన్నది. మగనిని బిడ్డలను గట్టుకొని యొకనాఁడు బయలుదేఱి పుట్టినింటికి వచ్చినది.

ఇంటిలోఁ జూడగా అన్నియు నన్ని త్రోవలై చెడి చెటాకులఁ గలసినవి. 'సన్నాహము' అను జీవధర్మమే లేదు. ఎవరును ఏ పనికిని పూనుకొనువారు గానరారైరి. తల్లిదండ్రులు చెఱియొక మూల ప్రాణావశిష్టులై వగల మునిఁగి సుడివడి యున్నారు. పెరుమాళ్ళ యింటిలో బూజు నిండినది. పాత్రలు ప్రాఁచి పట్టినవి. పెద్దయిల్లు చూచి మధ్యాహ్నమునకు వచ్చు నతిథులు మాటాడించువారు లేక వేఱు గృహముల వెదకఁబోవు చున్నారు. చిన్నపిల్లలు వేళ కన్నము, నీరు విచారించువారు లేక మాసి నలఁగినారు. పాడియావులు బందెలు దొడ్లకో, బైటి తెరువులకో పాలయినవి. పనివారు మొగముఁ జూపుట యరుదైనది. వారి జీతబత్తెము లరయువారు లేరు. పుస్తక భాండాగారములోని తాటాకుల గ్రంథములు కొన్ని - దీపారాధన యందలి యసడ్డచేఁ గాఁబోలు - నిప్పుపాలైనవి. కొన్ని దుమ్ముదిని త్రాళ్ళుదెగి చెల్లాచెదరైనవి. కొన్నిటిని ఎరవు తీసికొని పోయినవారు నిగమశర్మ పుణ్యాన మాకే దక్కెనని తామే యుంచుకొన్నారు. శిష్యుల పాఠ ప్రవచనముల మాట చెప్పనే పనిలేదు. మడి, మట్ర, చేను, చెట్టు - మొదలగునవియెల్ల చేయివేసినవారి సొత్తులైనవి. ఇన్ని యనర్థములకు మూలకారణము తమ్ముఁ డింటిలో లేఁడు. ఎక్కడనున్నాఁడో, ఎప్పుడు వచ్చునో, రానే రాఁడో తెల్పువారు లేరు.

ఇట్టి సన్నివేశమునఁ గాలుపెట్టి యా మగనాలు తానును ఏడ్చువారిజతలో కన్నీరు గార్చుచు నెదచెడి కూర్చుండలేదు. తాను ధైర్యముతో నిలబఁడి యిరువది చేతులఁ బనిచేసి యిరువది కాళ్లతోఁ దిరుగకున్న ఈ యింటికి ముక్తిలేదని యెఱిఁగెను. కాని వచ్చిన వెంటనే సవరించు ప్రయత్నములు చేయలేదు. ఆత్రపు దోష మామె యెఱుఁగును. కావున మౌనముతో 'కొన్ని దినములు గడపినది.' ఏల? సన్నివేశము వెనుకముందులు కలయఁ జూచుటకు, కళ్ళెపుఁ ద్రాళ్ళన్నియు బిగువుగాఁ జేతులఁ బట్టుకొనుటకు తా నెంతైనను పొరుగూరిది గదా! ఆఁడబిడ్డగదా! ఇంత పెద్ద సంసారము చెడినది. చక్కఁబెట్ట వలయునన్నచో తటాలున తనమాట లెవరు విందురు? ఈ తీర్పునకు నేర్పును, ఓర్పును గావలయును. కావుననే మొగము సిండ్రించుకొని వారిని వీరిని గసరి తిట్టక, యుపదేశముల, ఉపన్యాసముల గొడవకుఁ బోక, మొట్టమొదలు మూలస్తంభములవంటి ముసలి తలిదండ్రులను దేర్పవలయునని తలఁచినది. 'తీండ్రగల వచన రచనా చమత్కారంబులు' ప్రయోగించి వారివంత కొంత దొలఁగించి మొగముల దెలివి గలిగించినది. వారికి వలయు నుపచారములెల్లఁ దానే చేసినది. 'భగవదారాధనకు వలయు నేర్పాటులు చేసి జరిపించినది.' తొంగిచూచి పోఁబోవు నతిథులను దయ చేయుఁడని పిలిచి యాదరించి యుపచరించినది. తల్లిని రహస్యముగా నడిగి తమ్ముని చేతికిఁ దప్పిన మూలధన మున్నచోటు తెలిసికొని మఱింత భద్రపఱిచినది. నయభయముల చేతను కలియఁగలపు మాటలచేతను పిల్లలను, పనివాండ్రను లోఁగఁ జేసి కొన్నది. పసులకొట్టును జక్కఁబెట్టి పాడి వెలయించినది. భర్తను బిలిచి పుస్తకముల భాండాగారమునఁ గూర్చుండఁబెట్టి వాని దుమ్ము దులిపించి, కట్టించి, ఎరవు పోయిన చోటులు దెలిసికొని పంపి బదనామి చేయించి తెప్పించి నిలువరించినది. శిష్యులు మరల వచ్చి చదువుసంతలు జరుపుకొనునట్లు ప్రోత్సహించినది. పైరు పంటలు రైతులపాలు గానీక తన కొడుకుల నప్పుడప్పుడు పంపి యుస్తువారీ చేయించి స్వాములున్నారనిపించి హద్దుకుఁ దెచ్చినది. మెఱుఁగుఁ దీగవలె నన్నింటను దానేయై పాఱాడి యిల్లు వెలిఁగించినది.

ఇ ట్లన్నిటను ఆమె జాణతనము సాఁగినది గాని తన చిన్నమరఁదలిని జూచినప్పు డేమి చేయవలయునో తోఁపలేదు. వయసు చిన్నది; పొంగివచ్చు యౌవనము; అరుదైన చక్కఁదనము. కాఁపురమునకు వచ్చిన నాఁటినుండియు మగని మొగమైనఁ జక్కఁగాఁ జూచినదో లేదో! తనవారు, నావా రనువారు లేరు. మీఁదుమిక్కిలి తా నెంత మనసునొచ్చి 'నలంగియు నత్తమామల చిత్తంబు వచ్చునట్లు భక్తిశక్తులు మెఱసి పాటులంబడు' ధర్మము, కర్మముఁ గల యిల్లాలు. ఆ వేదనామూర్తియెడ తన ధైర్య మెందుకును బనికిరాక, వదినె, యూరక 'వగచి వగచి తెగచి కడుపు చుమ్మలుచుట్టి కన్నీరుట్టిపడం బొట్టుపొరలగు చుండి'నది. అనివార్యమగు దుఃఖమునకు హార్దమగు సహానుభూతియే ప్రతీకారము. ఇట్టి వదినెను సంపాదించుకొనఁగల పుణ్యవతులు మరఁదండ్రెందఱు గలరు?

ఇ ట్లెన్నాళ్ళు గడచెనో! ఉన్నదున్నట్టుగా 'చుక్కతెగి పడిన వడుపున' ఒక్కనాఁడు తమ్ముడు వచ్చి వాలినాడు. అప్పులవారివలె ఆఁకలికిని దలదాఁచుకొనుట సాధ్యము గాదు గదా! ఎన్ని పూటలనుండి పస్తుండెనో? మధ్యాహ్న భోజన పంక్తికి తండ్రి మొగము కనఁబడునని భయము. కావున మెల్లఁగ తల్లిని బీడించి 'చల్ది వంటకము' దిని చప్పున తప్పించుకొని పోదమని వచ్చినాఁడు. కాలిడిన వెంటనే అక్క మొగము కనిపించినది. తప్పించుకొని పోఁగలడా? ఆ ప్రేమమయి చిఱునవ్వు సంకెలలను ద్రెంచుకొని, ఆ మహనీయ మూర్తియెడ తనకుఁ గల గౌరవభావమును దిగఁద్రోసి పోవుటకు శక్తి యెక్కడిది? వచ్చి నమస్కరించినాఁడు. ఇతరులు పెద్దవారు తన్ను శిక్షింపగా 'గడుసువడి సడికోర్చి గడిదేఱి వంకపరక చాటును మాని' 'రాజారోషు'గాఁ దిరుగమరిగినవాఁడు ఆమె యెదుర వంచిన తల యెత్తలేఁడయ్యెను.

నమస్కరించిన తమ్ముని గౌఁగిలింపఁ బోయినది. కాని వానిని సమీపించి చూచినప్పుడు తాఁక మనము రాలేదు. ఎక్కడ చూచినను మేనినిండ 'మదోన్మత్త మత్తకాశినీదత్తంబులగు నఖాంకంబులు' నెత్తురులు చిలుకుచుండెను. మనసునఁగాని, మేనిలోఁగాని యింతయు మైల కెన్నఁడును చోటీయని యామెకు వాని యిట్టి శరీరము గౌఁగిలించుట యాయూరి వాడ వదినెలఁ గౌఁగిలింతయే యగునని తోఁచెఁ గాఁబోలు! ఊరక, లోని వెగటెల్ల నడఁచుకొని, 'సీమంతపుఁ బెండ్లి కొడుకవు గమ్మని హేతుగర్భితంబుగా' ఆశీర్వదించినది. అతఁడు గుమ్మడికాయల దొంగ; గిలియున్నది. ఆ దీవనలోని భావము కనుఁగొన్నాఁడు. ఉపన్యాసములు, ఉపదేశములు, చీవాట్లును ఈమెయు నుపక్రమించునేమో! ఇది యెక్కడి గొడవ; పోదమని యుంకించినాఁడు. ఆమె వ్రేలును జూపకయే హస్తమునే గాదు మేనెల్లఁ దిగమ్రింగఁగల జాణ. ఆత్రపడి వాని కసహ్యమైన భావమును సూచించి పొరపడితినని యెఱిఁగినది. వానిది సోఁకోర్వని సుకుమారత్వము. ఈ త్రోవ గాదని నిర్ణయించి 'తరంగిత వినయసౌహార్ద మార్దవ మధురంబులగు మాటల తేటలం బందిరి వెట్టి' నది. ఆ పందిరియే వానిపాలికి పంజరమై పోయినది. చాలనందుకు 'నీ చిన్న మేనల్లుని జూచితివా? ఇంద' అని యిందు బింబమువంటి తన కడగొట్టు కొడుకును - ఊరక చూపలేదు - చంకకిచ్చినది. వాని మొగమునఁ గానవచ్చిన యాఁకలి నకనకలు చూచి, వీనిఁ గట్టివేయు బ్రహ్మాస్త్ర మిదిరాయని 'మీ బావ బంతి నారగింతువుగాక, శాకపాకంబులు నిముషంబులోనం గావింతు' నని ప్రయోగించినది. ఈలోన ముఖ్యమైన వ్యక్తిని మరఁదలిని మఱచునా? ఆమెకు కనుసన్న చేసి వానికాళ్లు గడిగించినది. ఇఁక ఇన్ని బంగారుత్రాళ్ళ నుండి తప్పించుకొనుట యెట్లు? వాఁడు గ్రుక్కుమిక్కనక తలంటు స్నానము, నూతన వస్త్రధారణము, వెండ్రుకల తడియార్పు, పూలముడుపు, గంధపు మైపూఁత - మొదలగు నన్ని యుపచారములకును మేనొగ్గినాఁడు. అపురూపుముగా మగనికీ సేవలు చేయఁగల్గి వాని యిల్లాలు ధన్యురాలనను కొన్నది. ఆమె యాశలు మొలచినవి.

ఇంతలో వంట తయారైనది. దేవతలకు బోనాలు పెట్టినంత - సామాన్యముగా మెచ్చుకొను స్వభావము లేని, పోరాని పెద్దచుట్టమునకు విందులు చేసినంత - శ్రద్ధతో భయముతో అక్క తమ్మునికి పలువగల వంటలు వండినది. 'కనుగీటి నంతలోననె!' తలిదండ్రులకును భర్తకును మౌనమంత్రము వేసినది. తన బిడ్డలతోపాటు వారి పంక్తిలో తమ్మునికి చేయార తానే తృప్తిగా వడ్డించినది. వాఁడు భుజించిన పిదప - ఎంత చెడినను వైదికుల యింటి బిడ్డఁడు గదా - వార్చి యింటి తిన్నెపైఁ గూర్చున్నాఁడు. భార్యకు రెండవమాఱు కనుసన్న చేయనక్కర లేదుగదా! ఆమె వచ్చి అరుగుచెంత నిలుచుకొని తాంబూలము చుట్టి యిచ్చుచున్నది. అతని కిప్పుడు పదునాల్గు లోకములును చల్లగా సుఖముగా నిండుగడుపుతోఁ గానవచ్చుచున్నవి. చీవాట్లను, తిట్లను చిఱునగవుతో స్వీకరింపఁగల యుదార హృదయముతో నున్నాఁడు.

తానును యింతలో భుజించి వంటయింటిపనుల ముగించి వచ్చినది. పరగడపుతో ఈ మహాకార్యము నెఱవేర్చుట తనకును కష్టముగదా. చంట వెంట సందడిసేయు సంతానము. నెమ్మదిగా అరుగు దగ్గఱ నిలిచి, చీరపేల చిట్టడవిగా నున్న వాని తలను జూచి "సీ, ఏమిరా యిది" అని ప్రేమ ప్రస్తావన చేసి, జుట్టుముడి విడిచి విదలించి, ఈళ్ళు గ్రుక్కి, అంట్లఁ బొడిచి, గోరు ముక్కుల దిగదువ్వి, తూరుపెత్తి, పేల నన్నిటిని దిగిచి, ముడి వేసినది. వాని మెడకు మన్ను నలఁచినది. పాణీపద్మములు గరగరగా గడుగుకొన్నది. ఆవేళకు సరిగా అదనెఱిఁగిన మరఁదలు విడెము మడచి యిచ్చుచుండఁగా, దాసి తెచ్చి పెట్టిన పీటపైఁ గుడిప్రక్క నించుక యోరగిల్లి కూర్చున్నది. ఎడమ ప్రక్క బిడ్డఁడు చనుద్రావుచున్నాఁడు. ఈ ఠీవిని భావించి కవి "పద్మ కర్ణికఁ గొలువున్న పద్మవోలె" నున్నదన్న పోలికలో నతిశయోక్తి యేమైనఁ గలదా? కావుననే యతడు ముక్కాలు మువ్వీసము ఆస్తియంతయుఁ కరఁగి పోయిన యాయింటిలోఁ గూఁడ - నిగమశర్మ తల్లి నడిగి కాఁబోలు - దాఁచి యుంచిన "పసిమి పసిఁడి వీవన" తెప్పించి మరఁదలిచే వదినెకు విసరించుచున్నాఁడు! వజ్రాల వీవనతో విసరినను ఆ దివ్య మూర్తికిఁ దక్కువయే కదా!

చెప్పవలసిన మాటలు చెప్పుట కింతకంటె మంచి సమయమేది? "ఏమి నాయనా! ఎన్నాళ్ళాయెరా మా యూరికి నీవు వచ్చి? ప్రారంభించి యఖండముగా జరుగుతున్న వేదపాఠమునకు విఘ్నమగునని వెఱచితివి గదా!" అని తిన్నగా ఏసమాటలతో నుపక్రమించినది. కాని ద్రౌపది వలెనే యామెయు "రక్కెసతాల్మి" తో మదిలో నణఁచి పెట్టుకొన్న యలుక యీ సన్నసన్న మఱుఁగు మాటలతోఁ దీఱునా? "సాలగ్రామాల గనిలో గులక రాయివలె సముద్రము వంటి యాతండ్రి కడుపున ఇట్టి వాఁడవెట్లురా పుట్టితివి!" అని యొక్కమాటుగాఁ గసరి పల్కినది. బ్రహ్మనుండి తమ వఱకు మచ్చపేరెఱుఁగని బ్రాహ్మణ వంశమే! తలిదండ్రులు ముసలివారు. తమ్ములు కసుగందులు. తా నింటికి పెద్దకొడుకు. వారిగతి యేమి? చేసికొన్న యిల్లాలి దిక్కేమి? వచ్చిపోవు విద్వాంసుల మన్నించు మాట యెట్లు? ఇంటి మర్యాదల కేమి త్రోవ? తన యొక్కని చెడు నడవడిచే ఇంటి వారందఱి శీలము పిల్లి శీలమని, చదువులు చిలుకచదువులని తోడివారెల్ల నవ్వుచున్నారే! "ఏల యిట్లు బేలవైతివి? అన్నా! ఏల నీకీగుణము?" అని కడుపోపక కెరలి పల్కినది.

కాని యిది తప్పు దారి. పాపము చేయువారు తిట్లచే నెప్పుడును తమనడత మానరు. మీఁదు మిక్కిలి తిరుగఁబడుదురు. వెనుక గురుజనము శిక్షించినప్పుడు వారికదే మర్యాద జరిగినది. వచ్చినపని వానిని దారికిఁ దెచ్చుట గాని, తన కడుపు కసిదీఱ నాలుగు తిట్లు తిట్టి మరలిపోవుట గాదు. అది యుదాసీనులు అజ్ఞానులును జేయు పని; హితకాంక్షులు చేయునది కాదు. ఆ "కుశలాశయ" కిది తెలియక పోవునా! అలుక మగిడించికొన్నది. స్వరము మార్చినది. సామరస్యము వెలిఁబుచ్చినది. "భారతమునకు కర్ణునివలె నీవే యీ యింటి కాధారము. నీవులేనిది కథ నడువదు." అని యతని పౌరుషమున కన్వయించి పురికొల్పినది. "నీవు యజ్ఞము చేయఁగా వేదికను నే నలంకరించి సుమంగలీ పూజ లందుదునని గంపెఁడాసతో వేయిమందిలోఁ జెప్పు కొన్నానే! నా యాశలు త్రెంచితివే!" యని సౌభ్రాత్రమును జూపి కన్నీరు పెట్టుకొనఁ బోయినది. 'కామవికారము బలమై యుండెనేని రూపగుణశీలములు గల్గు బ్రాహ్మణకన్యలను వేయి మందినైనను పెండ్లాడరాదా! బ్రాహ్మణగృహస్థునికి బహుపత్నీ వ్రతము తప్పని యెవరు చెప్పఁగలవారు! ఈ పాడు వారకాంతల వ్యవహారము నీ కెందుకు? వారి దోపిళ్ళకు మన్నీలు, ఆఢ్యులును దట్టుకొనఁజాలరే! ఇంక బాపన సంసారులము మన గతి యేమి?' అని తీవ్రమైన వ్యావహారిక దృష్టితో వాదించినది. "అదియుఁ బోనీ! చేతనున్న డబ్బు మాత్రము తెలివితో వెచ్చించి యూరకుంటివా! అట్లయియుండిన నాకింత దుఃఖముండదే! 'ముక్కారుంబండు నఖండ సేతువృతముల్‌ కాశ్మీరఖండంపుఁ గేదారంబుల్‌ తెగనమ్మి'తివే! నీకేమి భార్యలేదా? బిడ్డలు పుట్టరా? వెన్నంటి పుట్టిన తమ్ములు లేరా? ఇట్లు కులధ్వంసము చేయుదురా యెవరైన?" అని తనవారి తప్పులను క్షమించి సరిపుచ్చుకోఁగల స్త్రీ హృదయమార్దవమును వెలువఱచి అధర్మము చేసినను అవివేకముగా చేయరాదను సామాన్య న్యాయమును సాటి చెప్పినది. వేశ్యాజనుల వంకరటింకర లన్నియు సూదులతోఁ బొడిచినట్లు వాని గుండెకంటనొత్తి క్రుచ్చి యెత్తి పెట్టినది. కడకు వానిచేతిలో చేయివేసి "చేయి మీఁదుగా నడచిన పూర్ణకాముఁడవే! నా తమ్ముఁడవే! నీ కీ బికారితనమేల? వలదు నాయనా! ఇంకనైన వదలు తండ్రీ!" యని దీనదీనముగా వేఁడుకొన్నది. "నీకు గావలసెనా హరికౌస్తుభమైనఁ దెచ్చెద" నని ధీరధీరముగా ప్రతిజ్ఞ చేసినది! తమ్మునికి దెచ్చి యీకున్నను ఆమె తానే కౌస్తుభమై తెనాలి కవి మూలమున తెలుఁగు వారి చేతి కబ్బినది!

ఇంతటి తెలివి తెగువలు, నగవు బిగువులు, అందచందములు కరువుపోసి తయారు చేసిన అపూర్వామృత మూర్తికి రామకృష్ణకవి దృష్టిచుక్కగా నొక మసిబొట్టు ముక్కుపైఁ బెట్టినాఁడు.

అక్క సద్బుద్ధిమాట లాదరించి నిగమశర్మ నాల్గునా ళ్ళింటిలో వివేకము దెచ్చుకొన్న వానివలె నుండి, యొకనాటి రాత్రి చేతికి దొరకిన యింటి సొమ్ముల నెల్ల హరించి మూటగట్టుకొని పండుకొన్న "పడుకకును జెప్పక" పాఱిపోయెను. అప్పుడింట నందఱు నేడ్చిరి. వారితోడ నక్కయు నేడ్చినది. ఎందుకనుకొన్నారు? తమ్ముఁడు చెడెనే యని కాదు; ఇల్లు మునిఁగెనే యని గాదు; తన ప్రయత్నము వ్యర్థమాయెనే యనియునుగాదు! మఱి "క్రొత్తగా చేయించుకొన్న ముక్కర" పోయెనే యని 'దుర్వారయై' యడలెనఁట!

పరిహాసము పవిత్ర వస్తువునుగూడ గమనింపదేమో!

AndhraBharati AMdhra bhArati - telugu vachana sAhityamu - vyAsamulu - nigamasharma akka - rALLapalli anaMta kRiShNa sharma ( telugu andhra )