వచన సాహిత్యము వ్యాసములు రవీంద్రుని ఒకగీతిక : తెనుగు అనువాదాలు
శ్రీ "శ్రీవాత్సవ"

(భారతి - మార్చి, 1962)

రవీంద్రుని శతవార్షికజయంతి వత్సరములో ఆయన ప్రతిభ అనేక విధాల ద్యోతకం చేయడానికి అన్ని దేశాల లోను ప్రయత్నము జరిగినది. భారతదేశంలో అన్ని ప్రాంతాలలోను సంవత్సరంపాటు, కవి రవీంద్రుని స్మృతి చిహ్నంగా ఎన్నో భవనములు నిర్మించారు. ఉత్సవములు జరిపారు. ఉపన్యాసాలు చేశారు. నాటకములు వేయించారు. నవగీతాలు ఆలాపించారు. ఆయన గ్రంథావళిని వివిధ భాషల లోనికి అనువాదం చేయించారు. ఈ సందర్భములో తెనుగులోకూడ లెక్క లేనన్ని అనువాదములు వెలువడినవి. రవీంద్రుని గ్రంథములన్నీ చదివినా చదువకపోయినా ఆయన "గీతాంజలి" బెంగాలీలోకాని, ఇంగ్లీషులోకాని చదువ గల్గితే - కొంత అయినా ఆ మహాకవి ప్రతిభను అర్థంచేసుకోవచ్చు. ఆ గీతాంజలి వివిధభాషలలో వెలువడినట్లే తెలుగులోకూడ ప్రచురణపొందినది. ప్రస్తుతము పది అనువాదముల వరకు లభ్యమగుచున్నవి. వానిలో మౌలిక రచనకు ఎంతవరకు న్యాయము చేకూరినదియు పరిశీలించుట కష్టసాధ్యమే. అనువాదరచన ఒకభాషనుండి మరొక భాషకు పరివర్తనపొందే సమయంలో చీరె అంచుకి "ఉల్టా" వేసి చూపినట్లు "సీదా" అంచు తీరుతెన్నులలో రూపముమాత్రం లీలగ గోచరింప చేస్తుంది కాని అసలు రచన పూర్ణస్వరూపము సాక్షాత్కరింప చేయజాలదని ఒక ప్రసిద్ధ ఫ్రెంచి రచయిత అన్నాడు. తెలుగులో గీతాంజలి పొందిన రూపాంతరాలు చూస్తే ఉల్టా కాదుకదా, అసలుస్వరూపమే గుర్తించలేనంత రీతిగా మారినట్లు అనిపిస్తుంది, ఈ సమీక్షలో గీతాంజలిలోని 101 పద్యాలు తీసికోకుండా మచ్చుకు ఒక గీతికమాత్రం తీసికొని - దానిమాతృకను ఇంగ్లీషులోను, బెంగాలీలోను ముందు చదువుకొందాం; తరువాత అది తెనుగులో మన కవులు అనువాదం చేసిన విధానమును గమనించుదాం. ఈ విషయంలో - పాఠకుల ఓర్పు, అధ్యయనదృష్టి, నిగ్రహము పరీక్షలోనికి రావచ్చును. అయినాకాని ఓపికతో భరించి తారతమ్య పరిశీలన చేయగలరని భావిస్తున్నాము.

ఈపరిశీలనకు తీసికొన్న గీతికకు రవీంద్రు డిచ్చిన శీర్షిక "ప్రార్థన". దీనిని 1909లో కవి రచించి ఒక బెంగాలీ పుస్తకంలో ప్రకటించారు. 1911-12 సంవత్సరాల మధ్య తాను స్వయంగా చేసిన ఇంగ్లీషు అనువాదంలో చేర్చి "గీతాంజలి" గ్రంథములో 35వ గీతముగా ప్రకటించారు.

ఈ గీతంలో కవి భావించిన ఊహాస్వర్గం ఎటువంటిదో నిర్వచించారు. ఆదర్శములకోసం, ఆశయాలకోసం ఆవేశంతో అశ్రాంతము పరితపించే భావుకులు వర్తమాన కాలంతో అసంతృప్తి పొంది - భవిష్యత్తులో బంగారుభూమిని ఊహించుకొని కలలు కంటారు. ఆ భావనా ప్రపంచము ఎక్కడా లేకపోవచ్చు. వాస్తవంగా అది అనుభవైకవేద్యం గాకపోవచ్చును. అదే ఒక "యుటోపియా"గా ఎందరో రచయితలు భావించు కొన్నారు. రవీంద్రుడు తన చుట్టుప్రక్కల వాతావరణంచూచి భరించలేక దానినిమించిన అద్భత లోకంలోనికి రమ్మని పిలుస్తున్నారు. గీతాంజలిలో ఈయన భగవత్‌భక్తిప్రేరితుడై శతాధిక గేయములను గానంచేశారు. తన హృదయవీణ మ్రోగించారు. తన కుటీర ద్వారమును సదా తెఱచి యుంచారు. తన జీవనవల్లభుని పదముల సవ్వడికోసం ఆత్రంతో ఎదురుచూచారు. నవరత్న ఖచిత సింహాసనంమీద తననాథుని ప్రతిష్ఠించుకొన్నారు. ఆలయ ఘంటా నినాదాలమధ్యకాక అంతర హృదయాంతరాళాలలో రాజాధిరాజ పరమేశ్వరుని ఆరాధించుకొన్నారు. ఆ భక్తిలో, ఆ పూజనలో, ఆ నివేదనలో ఉపనిషత్‌ సూక్తులు ఉలికి పడినవి. వైష్ణవ పదావళి మధురముగా పలికినవి. మౌనవీణలు మ్రోగినవి. అదొక క్రొత్త కంఠము, క్రొత్త స్వరము, క్రొత్త విధానము, క్రొత్త భావన. ఈ క్రొత్తలో కొంత అస్పష్టత, కొంత అనవగాహన ఉన్నప్పటికీ, యీ కలస్వనం పాశ్చాత్యులను, భౌతికవాదులను కూడ ఆకర్షించినది. ఆశ్చర్య చకితులను చేసినది. అందుకే వారు "గీతాంజలి"కి సాహిత్యములో అత్యంత ఘనమైన బహుమతి, నోబెల్‌ పురస్కారము, నిచ్చి 1913లో గౌరవించారు.

ఆ గీతాంజలిలో ఒకటి అయిన "ప్రార్థన"కు బెంగాలీలో మాతృక ఇది.

చిత్త జెథా భయశూన్య, ఉచ్ఛ జెథా శిర
జ్ఞాన జెథా ముక్త, జెథా గృహేర్‌ ప్రాచీర
అపన ప్రాంగణతలే, దివస శర్వరీ
వసుధేర్‌ రాఖేనాయ్‌, ఖండ క్షుద్ర కరి,
జెథా వాక్య హృదయేర్‌, ఉత్‌ సముఖ హోతే
ఉచ్ఛ్వాసియా ఉఠే, జెథా నిర్వారిత స్రోతే
దేశదేశ దిశేదిశే కర్మధారా థాయ్‌
అజస్ర సహస్రవిధ చరితార్థ తాయ్‌
జెథా తుచ్ఛ ఆచారేర్‌, మరుబాలు రాశి
విచారేర్‌ స్రోతః పథో, ఫీలేనాయి గ్రాసి
పౌరుషేర్‌ కొరేని శతథా, నిత్య జెథా
తుమి సర్వ కర్మ చింతా ఆనందేర్‌ నేతా,
నిజహస్త నిర్దయ ఆఘాత కరి పితః
భారతేర్‌ సేయీ స్వర్గ కరో జాగరిత

ఈ పాటలో మాటలు చాలావరకు సంస్కృతశబ్దాలే. తెలుగువారికి సులువుగా అర్థంకావచ్చును. భారతదేశం ప్రస్తుతం ఉన్నట్లుగాక మరొకస్వర్గంలోనికి మేల్కొనేటట్లు చేయుమని భగవంతునికి ప్రార్థన - "కరో జాగరిత" అనే ప్రార్థనార్థకం ఉపయోగించటంచేత - జాగరిత మొనరింపుము, మేల్కొనగజేయుము అనేఅర్థం స్ఫురిస్తున్నది. మేలుకొలుపు నిద్రపోతున్న వారికిగదా! అంటే అంతవరకు భారతదేశం నిద్రాముద్రితమై యున్నదని తాత్పర్యము. ఈ ప్రార్థన ఎవరికి? "ఆనందేర్‌ నేతా" "పిత" అని సంబోధించి లోకపిత అయిన భగవంతుని ఆనందనేతగా సంభావించుకున్నారు. ఈ భారతదేశాన్ని ఒక స్వర్గలోకం లోకి మేల్కొనేటట్లు చేయవలసిందని ప్రార్థిస్తూ కవి ఆస్వర్గం ఎలాగఉంటుందో దానిని నిర్వచిస్తున్నారు. బెంగాలీలో సంస్కృత సంప్రదాయం ప్రకారం యచ్ఛబ్దము, తచ్ఛబ్దము ఉంటాయి. అందుకే "జెథా" అని ప్రతిపంక్తిలోనూ ప్రయోగించి "ఎక్కడయితే" అని సూచిస్తున్నారు. అది తా నూహించుకొన్న స్వర్గవర్ణన. ఇందులో వాడిన పదాలు - చిత్తము, భయశూన్యము, శిరము, ఉచ్ఛము, జ్ఞానము, ముక్తము - తెనుగు తత్సమాలే. అదేకొంచెం మారిస్తే

చిత్తమెచట భయశూన్యమొ
శిరమెచట ఉచ్ఛమొ
జ్ఞాన మెచట ముక్తమొ
దేశదేశములలో దిశదిశలలో కర్మధార
అజస్ర సహస్ర విధముల చరితార్థమగునో -
అనవచ్చును.

ఇటువంటి పద్యభాగాలు తెనుగువారికి అర్థమవుతూనే ఉన్నవి. ఈపాటలో రవీంద్రుని ఉద్దేశము నాటి సమకాలీన జీవితముపైన విమర్శయే! గుణీభూతవ్యంగ్యముగా తెలియ జేయాలని వారికోరిక. నాటి సాంఘిక, రాజకీయములమీద వ్యాఖ్యయే ఇది. అవి వందేమాతరమ్‌ రోజులు. వంగవిభజనాందోళన విపరీత పరిస్థితులకు దారితీసి కాగిచల్లారిన సమయం. ప్రభుత్వము పరులది. నిరంకుశాధికారం క్రీనీడలలో ప్రజలు భయభీతులతో అల్లాడిపోతున్నారు. దేశప్రజలకు గౌరవములేదు, స్వేచ్ఛలేదు, స్వాతంత్ర్యము లేదు. చదువులపై ఆంక్ష. జ్ఞానముపై నిషేధము. సత్యము పలుకుట అపరాధము. మూఢాచారాలు, చాదస్తాలు పెరిగి, సరిగా ఆలోచించే శక్తిని పోగొట్టాయి. ప్రజలు తమలోతాము నిర్మించుకొన్న అడ్డుగోడలతో సంఘం ఛిన్నాభిన్నమై పోయింది. ప్రజలు సోమరులయి పోయారు. పనిచేయరు. శ్రమించరు. కర్మధారపైన ధ్యాసలేదు. పౌరుషము నూరు దిక్కులుగా చెదరిపోయింది. అటువంటి నిద్రాముద్రిత జాతిని నిర్దయగా నిజహస్తంతో కొట్టి, తట్టి, లేపమని రవీంద్రుని ప్రార్థన. యాభై యేండ్ల క్రితం గురుదేవుడు ఒక ద్రష్టగా పలికిన వాక్కులు నేటికి నిజము కాలేదు. మనకు స్వాతంత్ర్యము లభించినా - గురుదేవు డూహించిన స్వేచ్ఛాస్వర్గము ఇంకా బహుదూరంలోనే ఉన్నది. తమ అభిప్రాయాన్ని బెంగాలీపాటలో చెప్పినదే, ఇంగ్లీషులోనూ అన్నారు. ఈ గీతానికి రవీంద్రుడు స్వయముగా చేసిన ఇంగ్లీషురచన చూడండి. గురుదేవుని స్వహస్తలిపిలోనే చదువుకోవచ్చును.

ఇది ఆయనచేసిన అనువాదమే అయినా, బెంగాలీనుండి కొంతవిస్తరించి, కొంతగుస్తరించి మార్పుచేర్పులతో కూర్చినది. దీనిలో అర్థం తేటతెల్లంగా ఉంది. మాటలు పొందికగా కుదిరినవి. అస్పష్టతలేదు. చెప్పవలసిన అభిప్రాయం శక్తివంతంగా చక్కగా చెప్పారు. బెంగాలీలో వట్టి స్వర్గమే అంటే, ఇంగ్లీషులో ఆ స్వర్గానికి స్వాతంత్ర్యం చేర్చి Heaven of Freedom అన్నారు. మేలుకొలుపు అందులోను ఉన్నది, ఇందులోను ఉన్నది. బెంగాలీలో ఆనందనేత అయిన "పిత"ను ఇంగ్లీషులో My Father ఓ నాతండ్రీ అని మాత్రం సంబోధించారు. అంతమాత్రం చాలును అనుకొన్నారు.

ఇంక దీనికి తెలుగు అనువాదాలు చూద్దాం. తెనుగులో హెచ్చుభాగం ఆంగ్ల రచనకు అనువాదాలే. కొన్ని ఆంగ్లమాతృకనుండి హిందీలోకి రూపాంతరం పొందిన తరువాత, హిందీనుండి తెలుగు సేతలు కావచ్చును. ముందు కేవలము వచనములో చేసిన అనువాదం తీసికొందాము:

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద
ప్రపంచం విడిపోలేదో
ఎక్కడ సత్యాంతరాళంలోంచి
పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ అలసట నెరగనిశ్రమ తనబాహువుల్ని
పరిపూర్ణతవైపు జాస్తుందో
ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన
బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ
కార్యాలలోకీ నీచే నడపబడుతుందో
ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రీ నాదేశాన్ని మేల్కొలుపు.

చలంగారి ఈ అనువాదము ఇంగ్లీషు రచనలోని భావాన్ని కొంత వరకు తెలుగులో తెలిసేటట్టు చెప్పింది. అయితే దీనిలో యచ్ఛబ్దము, తచ్ఛబ్దము, బడుధాతువు తెనుగు పలుకుబడికి విరోధాలు. మనుషులు తలలెత్తి తిరగటం, అలసట నెరగనిశ్రమ, తన బాహువుల్ని సాచటం, బుద్ధిప్రవాహం, మనసు నడపబడటం, స్వర్గానికి మేల్కొలపడం తెనుగు నుడికారాలు కావు. ఇంగ్లీషు వాక్యవిన్యాసములతో అన్వయములతో పలికినవి. బెంగాలీలోని లయగాని, ఇంగ్లీషులోని బలంగాని ఈయనువాదంలో రాలేదు. భావం లీలగా తెలుస్తున్నది. అదే మేలు!

మరొక అనువాదం, బెంగాలీ, ఇంగ్లీషు బాగా తెలిసి ప్రసిద్ధ యుగకర్తలుగా తెనుగుదేశంలో పేరుగాంచిన శాంతినికేతన అంతేవాసి, ఆచార్య రాయప్రోలు సుబ్బారావుగారు రచించినది.

ఎచట చేతము భీతి నెరుగదు
ఊర్ధ్వముగ శిర మెత్తు నెచ్చట
సదసదర్థ విచార మెక్కడ
భాసిలున్‌ స్వచ్ఛందమై

ఇండ్లు వాకిండ్లనుచు కట్టిన
ఇరుకు గోడలలో ప్రపంచము
భిన్నమై యింతింతలై సం
కుచితమై పడదే దెసన్‌

వాక్కులెక్కడ వెడలు సత్య మ
హాగుహాగుహ్యాంతరాళము-
అలయ కెచ్చట పరమసిద్ధికి
కర్మ చేతులు సాచెడిన్‌

దారిచెడి నిర్మలవివేక సు
ధా ప్రవాహము ఇంకి యెండదు
శుష్కశూన్యాచారదగ్ధము
లయిన యిసుకఎడారులన్‌

ఎందు ముందుకు నడుచు హృదయము
భవదపార కృపావలంబన
అనవరత విస్తృతములగు స
ద్భావ కర్మ పథంబులన్‌

ఆ మహోన్నత సుస్వతంత్ర
స్వర్గసీమల కభిముఖముగా
మేలుకొలుప గదయ్య తండ్రీ
నా మహా దేశ ప్రజన్‌.

దీనికి రాయప్రోలువారు "గీతాంజలి" అని శీర్షిక పెట్టారు. ముత్యాలసరము నడకలో పాటగా అనువదించిన కారణంచేత కొన్ని పడికట్టురాళ్లు అలంకారాలు పొదగవలసి వచ్చింది. "భాసిలున్‌ స్వచ్ఛందమై" "అభిముఖముగా" "భవదపార కృపావలంబన" - ఇటువంటివి మూలంలోలేవు. కొన్ని భావాలు పునరుక్తిగా చెప్పారు. "కర్మధార"ను వీరు కర్మచేశారు. కాని తెలుగులో "కర్మ" మరొక అర్థం స్ఫురింపజేస్తుంది. అదేమి కర్మయో! "ఇండ్లు వాకిండ్లనచు కట్టడం" "సదసదర్థ విచారము" మూలంలో కనిపించవు. సత్యము అంతరాళాలలోనుంచి హృదయోద్గతమై మూలంలో పలికితే, వాక్కులు గుహా గుహ్యాంతరాళములో నిగూఢమై పోయాయి. స్వర్గము - బహువచనంలో స్వర్గసీమలుగామారి "ఆ మహోన్నత సుస్వతంత్ర" విశేషణాన్ని సంతరించుకొన్నది. తండ్రీ అనే సంబోధనలో అయ్యకూడ ప్రవేశించి - భారతభూమిని మార్చి "నా మహాదేశ ప్రజన్‌" అని వాచ్యంగా చెప్పుకొన్నారు. అర్థము, భావము అస్పష్టంగానే ఉండిపోయాయి. అందుబాటులోకి రాలేదు.

ఇంతకంటే అస్పష్టంగా చేసిన మరొక అనువాదం అభ్యుదయకవి కె. వి. రమణారెడ్డిగారిది.

నిర్భీకమై హృదయ మెచ్చట మనేనో
అభిమానమున శిరము ఉన్నతి గనేనో
స్వచ్ఛందమై జ్ఞానమెట రహించేనో
తుచ్ఛ సంకుచితానేక స్వార్థ కుడ్యాలతో
పృథివి శకలప్రాయమై రూపుజెడదో
ఋత హృదయమెచ్చో వచోజన్మస్థానమో
నిర్ణిద్రసాధనాదీక్ష ఎచ్చో సర్వ సం
పూర్ణ విస్ఫూర్తికై చేతు లెగయించునో
మృత సంప్రదాయ నిర్జల సైకతాలలో
స్ఫటికాచ్ఛ యోచనాఝరు లింక బారవో
భావక్రియాపారవిస్తారమున మదికి
త్రోవ జూపించి మునుముందు సాగింతువో
అట్టి స్వేచ్ఛాస్వర్గ ప్రాంగణములో, తండ్రి
తట్టి మేల్కొల్పు మీ నా మాతృదేశమును.

జంపె తాళంలో నడిచిన ఈ గీతంలో - సంస్కృత సమాసాలు హెచ్చుగా ఉండి తక తకిట తక మనుచు భీకరంగా పలుకుతున్నాయి. స్వర్గములో ప్రాంగణము చేర్చి, తట్టి మేల్కొలుపుమని కోరి, దేశాన్ని "నా మాతృదేశం" చేశారు. "మనేనో", "కనేనో", "రహించేనో" అనేవి వాడుక పదాలయినా శ్రవణసుఖంగా లేవు. నిర్భీకమై హృదయం మనేనో అనేది - "మనసు ఎక్కడ నిర్భయంగా ఉంటుందో" అనే భావాన్ని తెలియజేయటంలేదు. "మృత సంప్రదాయ నిర్జల సైకతాలు", "స్ఫటికాచ్ఛ యోచనాఝరులు", "భావక్రియాపార విస్తారము" భావాన్ని, అర్థాన్ని మరింత అవ్యక్తం చేసివేశాయి. మూలములోని అందము లీలగానే నిలిచి పోయింది.

మూడు రూపాంతరాలు పొంది, హిందీనుండి తెలుగు లోనికి వచ్చిన అనువాదం చూడండి - రాను రాను శల్యముల వంటి శబ్దములు మిగిలి జీవితప్రాయమైన భావార్థములు చివరకు ఏవిధంగా పలచబడి పోయాయో దీనినిబట్టి గ్రహించవచ్చును.

ఎచట మనసు నిర్భయమో
ప్రోన్నతమో ఫాలపటము
నిర్నిబంధమో జ్ఞానకళిక
కౌటుంబిక కుడ్యాలయిన
సంస్కృతి విభజింప బడదో
సత్యతటిని ఎయ్యెడ
నిస్వనించునో కలకల
పురుషకార మెయ్యెడ
విజయమంది పూర్ణమగునా
పునీత వివేక నీరధార
శుష్క మౌఢ్య సైకత తటాల
నెక్కడ నొరయదొ
నీ కరచాలితమై మానవచేతన
వ్యాపక భావాల సంసృజించి
ఉదాత్త క్రియల సవరించునొ
ఆ స్వచ్ఛంద లోకాంచలాల కాంతులు
స్వామీ! నా దేశము వెలుగొందనిమ్ము!

త్రిశ్రంలో నడపడానికి యత్నించిన యీ గేయానువాదము కొన్ని మాత్రలు ఎక్కువయి, కొన్ని మాత్రలు తక్కువయి ఎగుడు దిగుడుగా నడిచినది. ఇది యెలాగూ పాడుకోవడానికి వీలులేదు కనక అర్థమైనా సరిగా విడమరచి చెపుతున్నదేమో అని పరిశీలిస్తే "ప్రోన్నతమైన ఫాలపటము"లోను, "నిర్నిబంధమైన జ్ఞానకళిక"లోను, "సత్యతటిని నిస్వనించు కలకల"లోను, "పునీత వివేక నీరధార"లోను, "శుష్కమౌఢ్య సైకత తటాల"లోను ఇంకిపోయినది. "మానవచేతన నీకరచాలితమై వ్యాపకభావాల సంసృజించి ఉదాత్త క్రియల సవరించడం" ఏమిటో మరి! తెనుగుతనము లేక హిందీ మాటల కూర్పును ధ్వనిస్తుంది. "స్వర్గము" "స్వచ్ఛంద లోకాంచలాల కాంతుల"యింది. "మేలుకొననిమ్ము" "వెలుగొందనిమ్ము" అయింది. "తండ్రి" "స్వామి" అయ్యాడు.

ఇలాంటిదే హిందీనుండి తెలుగు అనువాద మొకటి ఉన్నది. దాని ప్రసక్తికూడ ఇక్కడ అనవసరము. తెనుగులో తొలి అనువాదము తేటగీతులలో ఆదిపూడి సోమనాథరావుగారు నలభైయేండ్లక్రితం చేశారు. అది కూడ ఇచ్చట చెప్పవలసినంత ప్రత్యేకత కలదికాదు.

ఇటీవల వచ్చిన మరొక అనువాదం బి. వి. సింగరాచార్యగారు చేసినది - ఉదాహరిస్తున్నాము. ఇది కూడ ఇంగ్లీషు మాతృక నుండి చేసినదే అనుకోవచ్చును.

మానసము భయలేశమేని సోకని సీమ
మానవుడు శిరమెత్తి మసలగలిగెడు సీమ
జ్ఞాన సముపార్జనాసక్తి గలిగిన సర్వ
మానవుల కది యుచితమై లభించెడు సీమ
జగతి సంఘస్వార్థ సంకుచిత కుడ్యాలి
విగతైక్యయై శకలవికలత గనని సీమ
పద పదము సత్యసంపదల బొదలెడు సీమ
ప్రతి యుద్యమము సత్యపథము కాస జను సీమ
సదసద్వివేచనా స్వచ్ఛాంబు ఝరి దుష్ట
సంప్రదాయోషరస్థలి లయింపని సీమ
నిత్య విస్తృత భావనా క్రియా వీథులను
నీవ తోడై మాకు త్రోవ జూపెడు సీమ
స్వాతంత్ర్య రుచిర మా
స్వర్గ సీమగ తండ్రి!
జాగరిత మొనరుపుము
నాజన్మభూమి!

ఇందులో యచ్ఛబ్ద తచ్ఛబ్దాలు విడిచిపెట్టి, తెనుగుతనం పలికే ద్విపదగతి రగడలోనికి అనువాదం చేశారు. గతి, లయ, నడక సరిపోయినవి. మూలంలో శబ్దం "జాగరితం" యథాతథంగా వాడుకొన్నారు. కాని స్వర్గసీమలో "జాగరితం" చేయమని రవీంద్రుడంటే స్వర్గసీమగా మార్చవలసిందని అనువాదకుని ప్రార్థన. ఇందులోకూడ సంస్కృత సమాసాలుకొన్ని మూలంలోని అర్థాన్ని కొంచెం దూరంచేశాయి. ఛందస్సుకు అనువుగా కొన్ని వ్యర్థపదాలు దొర్లక తప్పలేదు. జ్ఞానము ఉచితము అని వీరు "ఫ్రీ" అనే శబ్దానికి అనువాదం చేశారు. బెంగాలీలో అది "ముక్తము" అంటే ఏసంకెలలూ లేనిదని తాత్పర్యము. జ్ఞానము ఏ శృంఖలాలు లేకుండా స్వేచ్ఛగా లభించే చోటులో తనదేశం మేల్కొనాలని గురుదేవుని భావన.

బెంగాలీ నుండి యథాతథంగా తెలుగులోనికి అనువాదం చేస్తే యెలాగ పలుకుతుందో తెలుసుకోవడానికి రజనీకాంతరావుగారి అనువాదం నిదర్శనంగా చూపించవచ్చును.

చిత్తమెచట భయ శూన్యమో
శీర్షమెచట ఉత్తుంగమో
జ్ఞానమెచట ఉన్ముక్తమొ
భవప్రాచీగృహప్రాంగణ తలమున
దివారాత్ర మృత్తికారేణువుల
క్షుద్ర ఖండములుకావో
వాక్కులెచట హృదయోద్గతోచ్ఛ్వసన
మొరసి వెలువడునొ
కర్మధార యెట అజస్ర సహస్ర విధాల
చరితార్థంబై అనివారితస్రోతంబై
దేశ దేశముల దెసదెస పరచునొ
తుచ్ఛాచారపు మరుప్రాంతమున
విచార స్రోతస్విని ఎట నింకునొ
శతవిధాల పురుషయత్న మెచ్చట
నిత్యము నీయిచ్ఛావిధి నెగడునొ
అట్టి స్వర్గతలి భారత భూస్థలి
నిజ హస్తమ్మున నిర్భయాహతిని
జాగరితను గావింపవో పితా
సర్వకర్మ సుఖ దుఃఖ విధాతా.

ఈ యనువాదములో వంగమాతృకలోని శబ్దమాధురి, లయ తేవడానికి కృషి జరిగినది. కాని అర్థం మరింత జటిలమైనది. బెంగాలీ పరిమళం ముసురుకొన్నది కాని తెనుగుతనం లోపించినది. "చిత్తమెచట భయశూన్యము" అను పంక్తి, మనస్సు ఎక్కడ నిర్భయంగా ఉంటుందో అనేభావాన్ని వెల్లడించడం లేదు. అలాగే "శీర్ష మెచట ఉత్తుంగమో" కూడ తెలుగుజాతీయము "తలెత్తుక తిరగడం"కాని శీర్ష ముత్తుంగముకాదు.

ఇలాగ రవీంద్రుని గీతాలు ఎందరెందరో యధాశక్తి అనువాదాలు చేశారు. ఆ విధంగా రవీంద్రుని యెడల తమకుగల భక్తి గౌరవములు వెల్లడి చేశారు. సంతోషమే. ఆయన భావ వైఖరిని లీలామాత్రంగా నయినా ఎవ్వరూ తెలుగులోనికి తేవడానికి ప్రయత్నం చేయలేదు. కాని, భావ ప్రకటనా స్వాతంత్ర్యము అందరికీ ఉన్న యీ కాలంలో, అచ్చు యంత్రము అవలీలగా లభిస్తున్నది. అందరూ అనువాదాలు చేయవచ్చు, అచ్చు వేయవచ్చును, ఆనందించవచ్చును. కాని ఆ రచనల వెనుక మౌలిక రచయిత ప్రతిభను ఎంతవరకు వ్యక్తపరచగలిగారు, అనేది ప్రశ్న! వివిధ కవుల అనువాదాలు పరిశీలించుటలో - తెనుగులో వెలువడిన రవీంద్ర రచనలను స్థాలీపులాకముగా పరిచయము చేయుటకు, రవీంద్ర గీతావళి అధ్యయనము చేయుటకు, జరిగిన ప్రయత్నమేకాని, ఆ యా రచయితల కృషిని న్యూనపరచుటకాదు. తేలిక చేయుట కాదు. రవీంద్ర ప్రతిభను, గీతములను అర్థము చేసికొనుటకు, వానిని అనువాదము చేసి ప్రయత్నించువారిలో "ఎందరో మహానుభావులు - వారందరికి వందనములు."

AndhraBharati AMdhra bhArati - ravIMdruni oka gItika tenugu anuvAdAlu SrI SrIvAtsava - telugu vachana sAhityamu - vyAsamulu - khaMDakAvyamu - bhAvakavitvamu Sankhavaram Sampat Raghavacharya Sankhavaram Sampat Raghavacharyulu ( telugu andhra )