వచన సాహిత్యము | వ్యాసములు | శ్రమనుండి పుట్టిన కళలు |
శ్రమనుండి పుట్టిన కళలు : శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు
చైతన్య స్రవంతి
తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 నుంచి
TANAవారి సౌజన్యంతో.
ఆదిమ కాలంలో మానవుని జీవన పోరాటానికి సాధనాలు రాళ్ళు, రప్పలు, కట్టెలు, కర్రలు మాత్రమే. మనుష్యులు సమూహాలుగా జీవించిన ఆ రోజుల్లో జంతువులను వేటాడి ఆహారంగా తినేవారు. వావివరసలుండేవి కావు. భాష లేదు.
ఆహారం కొరకు జంతువులను వధించడానికి ఆయుధాలు అవసరమయ్యాయి. దానికి మానవుడు కట్టెలను, రాళ్ళను పదునుగా చేయడం ప్రారంభించాడు. ఆ క్రమంలోనే ఈటెలు, బల్లేలు, బాణాలు, గొడ్డళ్ళు తయారయ్యాయి. ఎండలు, వర్షాలు నుండి రక్షణ కొరకు నివాసానికి కొండలను గుహలుగా తొలుచుకోవటం ప్రారంభించాడు.
భాషలేని ఆ రోజుల్లో ఒకరితో మరొకరు మాట్లాడుకోవటానికి, చేసిన, చేయవలసిన పనులను తెలియజెప్పుకొనేందుకు ఆనాటి మానవులు చేతి సైగలు జేసుకొనేవాళ్ళు. ఆదిమ మానవుడి ఆ జీవితంలోనే వివిధ కళలకు పునాది పడింది. ఆదిమ మానవుడి బ్రతుకు పోరాటానికి కట్టెలను, రాళ్ళను ఆయుధాలుగా రూపొందించడం, నివాసానికి కొండలను గుహలుగా తొలుచుకొనడం క్రమక్రమంగా శిల్పకళకు, హస్తకళకు, చిత్రలేఖనానికి, ఇతర హస్తకళలకు కూడా పునాదులు పడ్డాయి. ఆదిమ మానవుడు సమష్టి జీవనంలో ఆనందంతో వేసిన గెంతులు నాట్యంగా రూపుదిద్దుకొన్నాయి. సంభాషణ రూపంలో ఒకరికొకరు చేసుకొన్న సైగలే అభినయంగా రూపు దిద్దుకొన్నాయి.
ఆ విధంగా ఆదిమకాలంలోనే సామాన్యుని జీవితం నుండి అందునా శ్రమ నుండి వివిధ కళలు ఆవిర్భవించాయి. లక్షలాది సంవత్సరాల పరిణామ క్రమంలో ప్రస్తుత రూపాలను సంతరించుకొన్నాయి మన కళలు.
శ్రమ లేనిదే జీవితం లేదు. శ్రమ నుండే అన్ని సంపదలు. అసలు శ్రమే మానవుణ్ణి నాలుగు పాదాల నడిచే జంతుజాతి నుండి వేరు చేసింది. శ్రమించటం ద్వారానే అవయవాల్లో మార్పు, మేధ పెరుగుదల, స్వరపేటిక ఏర్పాటు వగైరా జరిగాయి.
మానవుడు మినహా ప్రాణికోటి యావత్తు ప్రకృతికి లోబడి ప్రకృతి ప్రసాదించిన ఆహారం తిని జీవిస్తుంది. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే అంతరించిపోతుంది. కాని మానవుడు తన మేధస్సుతో ప్రకృతిని అవగాహన చేసుకొన్నాడు. తనకు అనుకూలంగా మార్చుకొన్నాడు. తన జీవితాన్ని సౌఖ్యవంతం చేసుకొన్నాడు. దీనికంతటికి మూలం శ్రమ అనేది మనకు అర్థమయ్యే సత్యం. అందువలన అన్నింటికీ మూలం శ్రమ. కళలకు కూడా జన్మ నిచ్చింది శ్రమ, శ్రమజీవులు అనేది దాగని సత్యం.
అంతేకాదు, ఈనాడు సాంకేతికంగా ఉన్నతదశకు చేరిన కళలన్నింటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన జానపద కళలే కదా మాతృకలు! ఒకనాడు గ్రామసీమల్లో బ్రతుకుతెరువు కోసం శ్రమజీవులు రూపొందించుకొన్న తోలుబొమ్మలాటయే కదా నేటి సినిమాకి మూలం! గ్రామవాసులు ఉల్లాసంగా పాడుకొనే కోలాటం పాటలు, భజన కీర్తనలే కదా నేటి మధురమైన పాటలకు మూలం! పశువులను మేపే పశుకాపరులు తయారుచేసుకొన్న పిల్లన గ్రోవే కదా, నేటి మృదువైన వేణువాద్యం!
గ్రామాలలో సామాన్యప్రజల జీవితాల్లో ఒకనాడు వివిధ కళారూపాలు మిళితమై ఉండేవి. ముఖ్యంగా శ్రమ జీవుల కార్యకలాపాల్లో పాట కలగలిసి ఉండేది. ఏ పని చేస్తున్నా పాట పనికి ఊతంగా ఉండేది. పొలాల్లో రైతులు నాట్లు వేస్తూ పాటలు, కోతలు కోస్తూ, నూర్పిళ్ళు చేస్తూ పాటలు. బోయీలు పల్లకీలు మోస్తూ పాటలు. స్త్రీలు రోటిలో దంచుతున్నా, తిరగలి విసురుతున్నా పాటలు. పెళ్ళిళ్ళలో పాటలు, అంపకాల్లో పాటలు. ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. కోలాటాలు, చెక్క భజనలు, బృందావన భజనలు మొదలగు సమష్టి కళారూపాలు ప్రతి గ్రామంలో పండుగలకు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. బ్రతుకుతెరువు కోసం జంగం కథ, బైనీడి కథ, జముకుల కథ, ఒగ్గు కథ మొదలగు కళారూపాలు కొందరు ప్రదర్శిస్తూ ఉండేవారు. గంగిరెద్దులు, పకీర్లు, వీధి భాగవతాలు, డప్పు నృత్యాలు, పగటి వేషాలు కొందరికి జీవనాన్ని ఇస్తుండేవి. ఆనాటి ఆ కళల నుండే ప్రస్తుతపు ఆధునిక కళలు రూపొందాయి.
అందువల్ల శ్రమ నుండి, శ్రమజీవుల జీవితాల నుండి పుట్టిన కళలన్నీ శ్రమజీవులకే ఉపయోగపడాలి. ప్రజలను చైతన్యం పరచటానికి కళలు శక్తివంతమైన సాధనాలు. కళలు రెండంచుల కత్తిలాంటివి. మనిషిని మహోన్నతుడుగా తీర్చిదిద్దగలవూ, అధఃపాతాళానికి నెట్టగలవూ. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో నేడు పక్కదారులు పట్టిన మన ఆధునిక కళల ప్రేరేపణతో ప్రస్తుతం మన సమాజంలో పెరుగుతున్న దుర్ఘటనలు చూస్తుంటే కళల యొక్క ప్రభావమేమిటో మనకు బాగా అర్థం అవుతుంది. కాబట్టి కళలన్నీ ప్రయోజనాత్మకంగా ఉండాలి. జన చైతన్యానికి, మేల్కొలపటానికి ఆయుధాలుగా ఉపయోగపడాలి. శ్రమజీవుల జీవితాల నుండి ఆవిర్భవించిన కళలు వారికే అంకితం కావాలి.
- దృశ్యం ప్రత్యేక సంచిక సౌజన్యంతో
నల్లూరి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి అధ్యక్షులు. ప్రగతిశీల సాంస్కృతిక రంగంలో ఐదున్నర దశాబ్దాల క్రియాశీల పాత్ర ఆయనది. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో నటుడిగా, ప్రయోక్తగా పాల్గొన్నారు. కొన్ని చలన చిత్రాల్లో కూడా నటించారు. ఒంగోలు కేంద్రంగా ఎందరినో ఆ జిల్లాలోను, రాష్ట్రంలోను ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దారు.
ఈ వ్యాసము చైతన్య స్రవంతి - తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 లోనిది. ఆ కార్యక్రమాల వివరాలను ఇక్కడ చూడగలరు. దీనిని ఇక్కడ ఉంచుటకు అనుమతినిచ్చిన TANA వారికి, జంపాల చౌదరిగారికి మా కృతజ్ఞతలు. దీనికి మాకు తోడ్పడిన వాసిరెడ్డి నవీన్ గారికి, సీత(అక్షర క్రియేషన్స్) గారికి మా కృతజ్ఞతలు.
![]() |
![]() |