వచన సాహిత్యము వ్యాసములు బుర్రకథ - సామాజిక ప్రయోజనం

బుర్రకథ - సామాజిక ప్రయోజనం : ఆచార్య ఎస్‌. గంగప్ప

చైతన్య స్రవంతి
తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 నుంచి
TANAవారి సౌజన్యంతో.

జానపద విజ్ఞానం అనంతం. అందులో జానపద కళలు ఒక భాగం. ఈ జానపద కళల్ని జానపద ప్రదర్శన కళారూపాలనడం సముచితం. వీటిలో ప్రముఖ జానపద ప్రదర్శన కళారూపం బుర్రకథ. ఈనాడు ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని ప్రసాదించి, ఉత్తేజపరచి చైతన్యవంతుల్ని చేయగలిగిన మహత్తర మాధ్యమం బుర్రకథ. అందునా ప్రజానాట్యమండలి ప్రసార సాధనాల్లో అత్యుత్తమ ప్రదర్శన కళారూపమీ బుర్రకథ. అంతేగాక సులభంగా ఉండే ముగ్గురు వ్యక్తులు- ప్రధాన కథాప్రవర్తకుడు, ఇద్దరు వంతలతో ప్రదర్శింప వీలయ్యే జానపద ప్రదర్శన కళారూపం బుర్రకథ.

ఆధునిక యుగంలో అధ్యయన సౌలభ్యం కోసం ఈ జానపద విజ్ఞానం నాలుగు విధాలుగా విభజితం. మౌఖిక జానపద విజ్ఞానం (Oral Folklore), సాంఘిక జానపద ఆచారాలు (Social Folk Customs), జానపద వస్తు సంస్కృతి (Material Folk Culture), జానపద కళలు (Folk Arts)- అని నాలుగు విభాగాలు. ఇందులో నాల్గవ విభాగమైన జానపద కళలు సంగీతం, నృత్యం, రూపకం- అని మూడు విధాలుగా విభజింపబడ్డాయి. మళ్ళీ ఈ మూడు, రెండు రెండు విధాలుగా సంగీతం- వాద్య సంగీతమనీ, గాత్ర సంగీతమనీ; నృత్యం- పాటతో కూడిన నృత్యం, పాట లేని కేవల నృత్యమనీ; రూపకం- ధార్మిక రూపకం, భౌతిక రూపకమనీ విభజితం.

అయితే ఈ జానపద కళలకు జానపద విజ్ఞానంలోని ఇతర విభాగాలతో సంబంధముంది. సంగీత నృత్య రూపకాలకు జానపద సాహిత్యంతోను, పండుగ పబ్బాలు, వినోదాలు, ఆటలు, నమ్మకాలు, మతం- మొదలైన వాటితోను సంబంధముంది. సంగీతంలో వాద్యాలు, రూపకాలలో వేషభూషలు, చిత్రకళ, శిల్పం మొదలైన వాటి వాడకముంటుంది. కాబట్టి జానపద కళలు, తక్కిన జానపద విజ్ఞానాంశాలు పరస్పరం పూరకాలనడం స్పష్టం.

జానపద కళారూపాలు

ఆదిమ మానవుడు తనలో కలిగిన భావోద్వేగానికి అనుగుణంగా లయాన్వితంగా నాట్యం చేయడం నేర్చుకొన్నాడు. ఆ వెనుక తోడుగా మాటలు నేర్చి, పాట పాడడం సాగించాడు. వీటికి వాద్యాలను సహాయంగా గ్రహించాడు. అప్పటి నుంచి జానపదుడు గేయాలను, క్రమంగా గేయ గాథలను ఆలపించి, అభినయించి, తన ఆనందాన్ని, దుఃఖాన్ని, కష్టాన్ని, నష్టాన్ని తెలుపుతూ పలుభావాల ప్రకటనను చేయనారంభించాడు. అంటే ఆట, మాట, పాట క్రమవికాసం చెందాయి. ఇలా ప్రారంభమైన ఈ గేయ గాథల్లో ప్రాఙ్మానవ విజ్ఞానమంతా ఇమిడి ఉంది. ప్రాచీన సంస్కృతి సంపన్నమై ఉంది. సంఘజీవనరీతి విదితమవుతుంది. ఆనాటి ప్రాక్తన మానవునిలో ప్రముఖంగా వెలసిన మతం ప్రాధాన్యం వహిస్తుంది. ఈనాటి మత స్వరూపానికి మౌలికాంశంగా ఆనాటి మతముండేదని తెలుస్తుంది. ప్రాక్తన మానవునకు తెలియని, విశ్వసించిన అతి మానుష శక్తులకు సంబంధించినదే ప్రాచీన మతం.

జానపద గేయ గాథలను శిష్ట సాహిత్యంతో పోల్చినప్పుడు ఏమాత్రమూ పోలిక కన్పించదు. అలంకారములూ, శబ్దాడంబరమూ, వర్ణనా వైదగ్ధ్యమూ- మొదలైన లక్షణాలేవీ ఉండవు. జానపదులకు సహజమైన రీతిలో అతి సామాన్య పద్ధతిలో- నిసర్గ మనోజ్ఞంగా- ఈ కళారూపాలుంటాయి. అందువల్లనే అనాదినుంచి పండితుల అనాదరణకు గురి అయి, నశించిపోగా మిగిలినది ఈ మాత్రం పామర జన సముదాయంలో బతికి బట్టకట్టి జీవిస్తున్నాయి. అందుకు అట్టడుగు సమాజంలోని గాయక భిక్షుకులే వీటి పరిరక్షణకు కారకులవుతున్నారు. గ్రామీణ ప్రజల్లో ఇంకా మేల్కొన్న సృజనాత్మకత వీటిని సంరక్షిస్తూ వస్తుంది. ఇవి జనప్రియ కళారూపాలు (Popular Arts). కళ జీవిత ప్రతిబింబం. దానికి నిదర్శనాలీ జానపద కళారూపాలు. అతి సామాన్యమైన జీవనరీతిని, అనుభూతులను, ఆచార వ్యవహారాల్ని, విశ్వాసాల్ని ప్రతిబింబించే విధంగా జానపద కళాకారుడు నిర్మించుకొంటాడనడం గూడ జానపద కళారూపాలే ఆ కళాకారుడి జీవనరీతికి దర్పణమనడం సమంజసం.

జానపద ప్రదర్శన కళారూపాలు - బుర్రకథ

ఇందాక పేర్కొన్నట్లు జానపద కళలనబడే ఈ విభాగంలో సంగీతం, నృత్యం, అభినయం ఉండే ప్రదర్శన కళలు చేరుతాయి. గాత్ర సంగీతం, వాద్య సంగీతంతో పాటు తోలుబొమ్మలాటలు, యక్షగానం, జంగం కథలు, బుర్రకథలు, వీధి భాగవతం, కోలాటం, పగటి వేషాలు, బహురూపులు, గారడి విద్యలు మొదలైన కళారూపాలు ఇందులో ప్రాముఖ్యం వహిస్తాయి.

జానపద కళలు (Folk Arts) అనడం కంటే ప్రజాకళలు (People's Arts) అనడం సముచితం. జానపద కళలు అనడం కంటే జానపద ప్రదర్శన కళారూపాలు (Folk Performing Arts) లేదా ప్రజాప్రదర్శన కళారూపాలు అనడం మరింత సమంజసంగా ఉంటుంది. ఆధునిక యుగంలో బుర్రకథలు అత్యంత ప్రాముఖ్యం వహించాయి. ప్రదర్శన కళారూపాల్లో వీటికి విశిష్టస్థానముంది.

బుర్రకథ - పుట్టుపూర్వోత్తరాలు

బుర్రకథల లక్షణాల స్వరూపస్వభావాలను తెలుసుకొనే ముందు బుర్రకథల పుట్టుకను గూర్చి తెలుసుకోవడం అవసరం. ఆచార్య నాయని కృష్ణకుమారిగారు ప్రాచీనమైన జానపద గేయగాథల్లో ముఖ్యంగా జంగం కథలే బుర్రకథలకు మూలమని నిరూపించారు. 2

నాటకం లలిత కళల సమాహార రూపం. అలాగే బుర్రకథ సంగీతం, నృత్యం, అభినయం, రూపకం- అనే జానపద ప్రదర్శన కళారూపాల సమ్మేళనం. చెవికింపు గొలిపే సంగీతము, కంటికి విందొనర్చే నృత్యాభినయము, మనస్సును మురిపించే చమత్కారవంతమైన మాటలు, పాటలు, పద్యాలు, హాస్యము, వంతల వింతల వినోదము సామాన్యుల్నే గాక అసామాన్య మాన్యుల్నీ ఆకర్షించేవి బుర్రకథలు. ఇవి బహుశా అతి ప్రాచీనమై ఉండవచ్చు. కానీ కాలాన్ని నిర్ణయించే చరిత్ర లేదు. అయినా తత్సంబంధి జానపద గేయగాథా ప్రారంభ వికాసాలను పరికిస్తే బుర్రకథ ప్రాచీనత విదితమవుతుంది.

బుర్రకథ - నిర్వచనాలు

ఈ గేయగాథల్ని సంగీతంతో, వాద్యాల సాయంతో, వంతల తోడ్పాటుతో, పాదన్యాస హస్తచలనంతో రసస్ఫూర్తివంతంగా గాథాప్రవర్తకులు నిర్వహిస్తారు. సాహిత్యంతో పాటు గాథాప్రవర్తకుని అంగవిన్యాసాది ముఖ కవళికలు మొదలైనవాటి అభినయం మూలాన్నే ప్రేక్షకులు ఆనందిస్తారు. కాబట్టి వీటిలో సామాన్యజన జీవనరీతి, నాటకీయత, గానమనే లక్షణాలు మూడు జనాకర్షక గుణాలు.

"కథకుడు కాలికి గజ్జె కట్టి, కించిదవయవ చలనమున, పదవిన్యాసమున, లయబద్ధముగ ప్రజా సమూహము నెదుట గానము చేయును. ఇట్టివానికే యాంధ్ర దేశమున బుర్రకథలనియు, జంగము కథలనియు, పదములనియు, తందాన కథలనియు, పురాణములనియు, కతలనియు వ్యవహారము కలదు. కథకుడు చేతియందు సొరబుర్ర తోడనో, గుమ్మడి బుర్రతోడనో చేసిన తంబూరా, శారద వంటి వాద్యముల ధరించి, వాని ధ్వనులతో మేళవించిన గానము గల కథలను పాడుటచే వీనికి బుర్రకథలను పేరు వచ్చినది. ఈ పేరు మిక్కిలి విరివిగా సర్కారు ప్రాంతమునందు వాడబడుచున్నది. ముఖ్యముగా కృష్ణా, గుంటూరు జిల్లాల యందును, పల్నాటి ప్రాంతమునందును దీనికి వాడుక యెక్కువ కలదు." 3

బుర్రకథ - లక్షణాలు

ఈ కథలకు జంగం కథలన్న పేరు కోస్తా జిల్లాలలో ప్రచారం వచ్చింది. జంగం శబ్దం కులసంబంధి కాక, బసవేశ్వర స్థాపితమై వీరశైవ మతావలంబులు జంగాలని పిలవబడేవారు. వీరశైవ మత ప్రచారానికై వీరు శివభక్తుల గాథలను పాడి వినిపించేవారు. ఇవి జంగాలు చెప్పే కథలు గనుక జంగం కథలు. ఈ జంగాల గూర్చి ఆచార్య బి. రామరాజుగారు వివరంగా తెలిపారు. 4 ఈ జంగం కథలను పాల్కురికి సోమనాథుడు పేర్కొన్నాడు. 5 అయితే ఈ జంగాలు కథలు చెప్పే తీరును పాల్కురికి పేర్కొనలేదు. పిచ్చుకుంట్లు, ఎర్రగొల్లలు, వీరముష్టులు, శారదకాండ్రు మొదలైన వారందరూ శైవులు. జంగం అంటే శివసంబంధి, శివభక్త సంబంధి కథలను చెప్పేవారని ఆచార్య కృష్ణకుమారిగారు వివరించారు. 6 ఈ జంగాలను వారు వాయించే బుడిగెను బట్టి బుడిగ జంగాలని అంటారు. ఇంకా పిడికి జంగాలు, ఈతముక్కల జంగాలు, సెట్టి బలిజలు జంగమ తెగకు చెందినవారని తెలుస్తుంది. 7 ఈ జంగాలు చెప్పే కథలే జంగం కథలు. ఇవి ఈనాటి బుర్రకథలకు పూర్వరూపాలు.

పైన పేర్కొన్నట్లు శారదకాండ్రు శారదను, జంగాలు బుడిగెలను వాద్యాలుగా వాడుతారు. రెంటిలోను వంతల ప్రాముఖ్యముంది. ఒకరుగాని ఇద్దరుగాని వంతలుంటారు. సాధారణంగా వంతలు గుమ్మెటలను వాయిస్తారు. ఈ సందర్భంలో ధేనువకొండ వెంకయ్య రచించిన విరాటపర్వం జంగం కథను స్మరించవలసి ఉంది. అందులో జంగం కథను ప్రవర్తింపజేసే రీతిని, లక్షణాన్ని వివరించిన తీరును గమనించదగ్గది.

నీటుగ విభూతిరేఖలు దీర్చియు నిల్వుటంగీల్దొడిగి
వేటురుమాలాల్‌ పేటుపాగాల్వల్లెవాటు లొనరదాల్చి
జోడుగుమ్మెటల్‌ దట్టుచు వంతలు బాడుచు మరియొకడు
పొడిమగా చేబూని సితారా భుజమున ధరియించీ
గజ్జెలు మువ్వలు అందెలు పదముల ఘల్లని మ్రోయగనూ
తఝనిత తకయని నాట్యము సల్పుచు దంబుర మీటుచునూ
సంగతిగా సభవారికెల్ల పైసల పూర్వకముగా
చెంగున దుముకుచు జంగంబులకును జీవ కథనముగా

అనే జంగం కథల లక్షణాలే దాదాపుగా బుర్రకథా లక్షణాలనడంలో సందేహం లేదు. ఇందులో బుర్రలు కాక బుడిగెలనే గుమ్మెటలుగా పేర్కొనడం జరిగింది.

బుర్రకథను తెలుగుజాతి ప్రాచీన సంగీత రూపకమని నిరూపించిన తిరుమల రామచంద్రగారు దీని లక్షణాలను వివరించారు.

"బుర్రకథ అనే వ్యవహారం ప్రధాన కథకుడు శృతిసారించే తంబూర బుర్రను బట్టి వచ్చింది. తందాన కథ, తందాన పాట అనే వాడుక తందాన తందాన అని వంతలవారు చేసే అనుశృతిని బట్టి వచ్చింది.

ప్రధాన కథకుడు ఒక చేత్తో శృతి కోసం తంబూర మీటుతూ, జేబురుమాలు వంటి గుడ్డకొసను కట్టిన జంతరను బొటనవ్రేలికి తొడుక్కున్న మరొక చేత్తో తాళంవేస్తూ కథ చెబుతాడు. (తాళం వేసే జంతరను గుంబీలు, అందెలు అనడం కూడా కద్దు.) ఆ వెనుక ఇద్దరు స్త్రీలు గుమ్మెటలు వాయిస్తూ వంత పాడుతారు. వంతకు (బహుశా ప్రధాన కథకుడు కాబోలు) ఇద్దరు ఇంతులు కావాలని సిరి జంగాలు రెండు పెండ్లిండ్లు చేసుకొనడం కూడా ఆచారం. ఇది దీని ప్రత్యేకత." 8

ద్రుత తాళంబున వీరగుంభితక ధుం ధుం ధుం కిటాత్కార సం
గతి వాయింపుచు నాంతరాళికయతి గ్రామాభిరామంబుగా
యతిగూడం ద్విపద ప్రబంధమున వీరానీకముం బాడె నొ
క్కతె ప్రత్యక్షరముం గుమారకులు ఫీట్కారంబునం దూలగన్‌.
        (క్రీడాభిరామము, ప. 85)

"ఇక్కడ మద్దెల వాయిస్తూ పాడినది ఒకతె. నేడు బుర్రకథలో గుమ్మెటను వాయించేవారు స్త్రీలే అయినా గాయకుడు, కథకుడు పురుషుడే కనుక అది నేడు మనం విని ఆనందించే బుర్రకథ గాదని సందేహం కలుగవచ్చు. కానీ దాని పరిణామమే నేటి బుర్రకథ." 9

పై ద్రుతతాళంబులోన అనే పద్యములోని వివరాలను మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారిలా వివరించారు. గుంభిత శబ్దమే గుమ్మెట వాద్యమనీ, ఇది గంభీరంగా, గుంభనంగా ఉండే ధ్వని కావడం వల్ల ఇది గుంభిత అయిందనీ, వీటిని స్త్రీలు వాయించినట్లే ఈనాడు పురుషులు, స్త్రీలు కూడా వాయిస్తున్నారనీ, దీన్ని ఢక్కీ అని కూడా అంటారనీ వివరించారు. యక్షగానాలు యక్షులు వినిపిస్తే, బుర్రకథలను జంగాలు పాడి వినిపిస్తారు. యక్షగానంలో సూత్రధారి, విదూషకులుండగా, బుర్రకథలో వంతలున్నారు. హాస్యం రెండింటా సమానమే. 10

బుర్రకథ - నామోత్పత్తి

బుర్రకథ నామోత్పత్తిని గూర్చి, బుర్రకథలు ఇటీవలవనీ, సంప్రదాయ వీరగాథానుకరణలనీ తంగిరాల వెంకట సుబ్బారావుగారు వివరించారు.

"బుర్రకథ నామోత్పత్తిని గూర్చి రెండు సిద్ధాంతము లున్నవి. ఈ కథలను పాడుటలో తంబురను, గుమ్మెటలను ఉపయోగింతురు. తంబురతో చెప్పెడి కథ కావున దీనికి తంబుర కథయని పేరు వచ్చి, ఈ పేరులోని తం అను మొదటి యక్షరము లోపించి, 'బుర'కథగా మారి, రేఫకు జడ్డ రాగా 'బుర్ర'కథ అయినదని కొందరి తలంపు. మరికొందరు వేరుగా తలంచుచున్నారు. గుమ్మెటకు బుర్ర యను పేరు గలదట. (ఆంధ్రదేశమున నొక్క గుంటూరు మండలమున మాత్రమే యిట్టి వాడుక కలదని తెలియుచున్నది.) బుర్రలు వాయించుచు చెప్పెడి కథ కావున బుర్రకథ యను పేరు వచ్చినదట. ఇందు మొదటి సిద్ధాంతమే నాకు సమంజసముగా దోచుచున్నది. గుమ్మెటలకు బుర్రలను పేరు ఎక్కువ ప్రచారమున లేదు. ఒకవేళ ఇట్టిదున్నను, ఇది అజ్ఞానముచే వచ్చిన అర్థ విపరిణామము కావచ్చును. తంబుర కథ, తంబుఱా కథ అను పేరు జానపద గాథాకారులలో నేటికిని విరివిగా వ్యాప్తి యందున్నవి. అసలు తంబుర శబ్దములోనే బుర్ర శబ్దము ఇమిడి యున్నది. తంత్రి + బుర్ర = తంబుర. కాబట్టి తంబుర కథ యను పేరు నుండియే బుర్రకథయను పేరు వచ్చి యుండుననుట సమంజసము." 11

తంత్రి + బుర్ర = తంబుర అని శబ్దరత్నాకరంలో, సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఉన్నదే. అయితే తంబుర కథలులో తం పోయి, రేఫకు జడ్డ వచ్చి, బుర్రకథలుగా మారడం ఎప్పుడెప్పుడు జరిగిందో తగిన ఆధారాలుంటే అంగీకరించవచ్చు. వాటిని తంగిరాల వారు చూపించలేదు. అయినా సొరబుర్రల మూలంగానే బుర్రకథ వచ్చి ఉంటుందని భావించడమే సమంజసంగా తోస్తుంది.

బుర్రకథ - ప్రాచీనత

ఇలాంటి బుర్రకథలకు మూలమైన కథాగేయాల పుట్టుక ఎప్పటిదని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. హాలుడు సేకరించిన ప్రాకృత గాథల్లో ఈ పాటల ప్రసక్తి ఉంది. కానీ ఆనాటి తెలుగు గేయగాథల్ని ఎవరూ సేకరించలేదు. ప్రారంభంలోని శాసనాల్లో గాని, భారతంలో గానీ వీటిని గూర్చి లేదు. నన్నెచోడుని కుమారసంభవంలో గౌడు గీతాల ప్రసక్తి ఉంది. 12 పాల్కురికి సోమనాథుడు తోలుబొమ్మలు, కొయ్యబొమ్మలాడించే వారిని, 13 భక్తకూటాల్లో భక్తుల చరిత్రలను కథలుగా పాడేవారిని, 14 కోలాటం, గొండ్లి, పేరిణి, కేళిక లాంటి జానపద నృత్యాలను వేణు వాద్యాలతో పాడే ఆనంద గీతాలు, శంకర గీతాలను పాడేవారిని 15 పేర్కొన్నాడు. వీటిని పాడుకొనే జాతరలను సైతం పేర్కొన్నాడు.

సుమారు ఇదే కాలంలోని అంటే కాకతీయ గణపతి చక్రవర్తి గజసైన్యాధ్యక్షుడైన జాయపసేనాని రచించిన నృత్తరత్నావళిలోని అయిదో అధ్యాయం మొదలు ఎనిమిదో అధ్యాయం వరకు గొండ్లి, పేరణి, ప్రేక్కణం (ప్రేంకణం), రాసకం, చర్చరి, నాట్యరాసకం, దండరాసకం, శివప్రియం, చింతు (చిందు), కందుకం, భాండికం, ఘటిసణి, చూరణం, బహురూపం, కొల్లాటం (కోలాటం) - అనే దేశీనృత్తరీతులు వివరించబడ్డాయి. నృత్తరత్నావళి ననుసరించి రామప్ప దేవాలయంపై శిల్పాలు చిత్రితం. ఆనాటి ప్రాచీన కళ నుంచి పేరిణి నృత్యం మళ్ళీ పునరుద్ధరించిన ఘనత కళాప్రపూర్ణ నటరాజరామకృష్ణగారిది. ఇదెంతో ప్రశంసనీయం. 16

ఈ కళారూపాలకు బుర్రకథలనిగాని, జంగంకథలనిగాని, పదాలు, కథలు, పురాణాలనిగాని పేర్లుండేవని తెలిపి, ఇలాంటి కథాత్మకాలైన జానపద కళారూపాలైన హరికథలు, యక్షగానాలు, బొమ్మలాటలకు గల భేదసాదృశ్యాలను కృష్ణకుమారిగారు వివరించారు. 17 చాలా అంశాల్లో సామ్యమున్నా, బుర్రకథకు, హరికథకు భేదమే ఎక్కువ. యక్షగానంలో బుర్రకథాంశాలున్నా యక్షగాన వికాసంలో తేడా ఉంది. బుర్రకథ ఆడి చూపించేది, బొమ్మలాట ఆడించి చూపేది. వీటన్నిటిలో బుర్రకథకు మూలమైన జంగంకథ ప్రాచీనమైంది.

"బుర్రకథ కూడా అత్యంత ప్రాచీన కళారూపం. కాని ఇప్పుడు ప్రచారంలో ఉన్నది మాత్రం ఇటీవలిది. హోమర్‌ దాయీలు, కుశలవులు ఇద్దరు ముగ్గురు కలిసి ఆడి పాడి అభినయించే రూపం నేటి బుర్రకథకు మూలం" అని తెలిపి బుర్రకథ మరాఠా రాజాల కాలంలో పుట్టిందని రాంభట్ల కృష్ణమూర్తిగారు వివరించారు. పారశీక భాషలోని భళా పదానికి మరాఠీ భాషాపదం ఛాంగ్‌ చేరి ఛాంగ్‌భళారే ఛాంగ్‌భళా అయిందనీ, అలాగే భాయి అనే పదాన్ని దాదా అని మరాఠీలో అనువదించగా, తెలుగులో తమ్ముడా అని చేర్చి భాయి భళానోయ్‌ తమ్ముడా! అనే రూపమేర్పడిందనీ, రామరాజు వీరకథను రామరాజు బఖైర్‌ అనే రూపమేర్పడిందనీ మరాఠీ బుర్రకథను శివాజీ కాలంలో బుర్రకథగా ప్రచారం చేసినట్లు నిరూపించారు. 18

కానీ ఛాంగుభళా పదబంధం పాల్కురికి సోమనాథుడు ప్రయోగించాడు.

అలరుచు బడిహారులట్ల యందరును
లలిమచ్చి ఛాంగుభళా యనువారు 19

ఇలాగే తాళ్ళపాక అన్నమాచార్యులు సైతం ప్రయోగించారు.

చక్కని తల్లికి ఛాంగుభళా తన
చక్కెరమోవికి ఛాంగుభళా 20

దీన్ని బట్టి ఛాంగుభళా పదం ప్రాచీనమనీ, పాల్కురికి కాలానికే అది స్థిరపడి, అన్నమాచార్యుల నాటికి ప్రచారంలోకి వచ్చిందనీ విదితమవుతుంది. ఇలాగే తందనాన, తందనాన భళా పదాలు అన్నమాచార్యుల సంకీర్తనల్లో చూడగలము.

తందనాన ఆహి తందనాన పురె
తందనాన భళా తందనాన (ఆధ్యా.సం. 2-388)

ఇది పల్లవి. దీన్నిబట్టి ఛాంగుభళా, తందనాన, తందనాన భళా మొదలైన ప్రయోగాలు ఆనాటికే ప్రసిద్ధమై ఉన్నాయనడం సముచితం.

కాబట్టి బుర్రకథ తెలుగులో ప్రాచీనమైన జానపద ప్రదర్శన కళారూపం. తరువాతి కాలంలో అది మార్పు చెంది, ఈనాటి రూపంలో మనం చూస్తున్నామని రాంభట్ల కృష్ణమూర్తిగారి వివరణ. ఏది ఏమైనా ఇది అతి ప్రాచీనమని వారంగీకరించారు.

దీనికి మరికొంత వివరణ. "బుర్రకథ అనే వ్యవహారం ప్రధాన కథకుడు శృతి సారించే తంబూరా బుర్రను బట్టి వచ్చింది. తందనాన కథ, తందాన పాట అనే వాడుక తందాన తందాన అని వంతలు చేసే అనుశృతిని బట్టి వచ్చింది.

కాగా శ్రీనాథుని కాలానికి వీరగుంభితల - నేడు గుమ్మెటల- ధుంధుంధుం కిటాత్కార సంగతితో వీనుల విందవుతున్న బుర్రకథ- తెనుగువారి మౌలిక సంగీత రూపకం.

ఈ మౌఖిక సంప్రదాయాన్ని కళాకారులెందరో శతాబ్దాలుగా తెనుగుజాతి కోసం భద్రపరుస్తూ వచ్చారు." 21

తిరుమల రామచంద్రగారి మాటలు ఆచార్య నాయని కృష్ణకుమారిగారి వివరణతో సంవదిస్తున్నాయి. నిజమే! నా చిన్నతనంలో ఈ తందాన పాటలను పూసల వాళ్ళ పాటలనేవారు. ఏదో ఒక వీరగాథ, వ్రతకథ, పాట వినిపించేవారు. ఈలాంటి తందాన పాటలను కోలాచలం శ్రీనివాసరావు రామరాజు చరిత్ర నాటకంలో విజయనగర వైభవాన్ని తెర వెనుక పాడించారు. అంటే ఆ తందాన పాటలనేవి పల్లెటూళ్ళలో తీరిక సమయాల్లో వినోద విజ్ఞానాల కుపకరించేవని స్పష్టమవుతుంది.

తెలుగు బుర్రకథకు, మహారాష్ట్ర పనాగా గాని, కన్నడ లావణీ గాని ఆధారాలు కావనీ, మహారాష్ట్ర కీర్తన పద్ధతి బుర్రకథకు గాక మన హరికథకు మూలం కావచ్చునేమోనని ఊహించారు తిరుమల రామచంద్రగారు. 22 ఇలాగే కృష్ణకుమారిగారు సైతం వివరించారు. 23

బుర్రకథ - ప్రారంభ వికాసాలు

బుర్రకథ ప్రధాన లక్ష్యం కథాకథనం. ప్రారంభంలో కథ మతసంబంధమై ఉండేది. తరువాత వీరప్రశంసతో చారిత్రక సత్యాన్ని తెలుపడం ముఖ్య లక్షణమైంది. ఇది తరువాత దశ. దీనికి గానం, నృత్యం, వాద్యం సహకారులు. యక్షగాన లక్షణాల్ని కలిగి దానికే మౌలిక రూపమనదగ్గ ప్రక్రియగా రూపొందింది. మత సంబంధి కార్యకలాపాలను, మానవుని తొలిదశకు సంబంధించిన పురాగాథలను వివరించడానికి అవసరమేర్పడినప్పుడీ ప్రక్రియ ఉద్భవించిందనవచ్చును. పండగ పబ్బాల్లోను, గ్రామదేవతల జాతర్లలోను ఈ బుర్రకథలను ప్రవర్తింపజేస్తూ వచ్చారు. అయితే క్రమంగా మత సంబంధి విశిష్టత తగ్గిపోయి, సందర్భోచితంగా ప్రవర్తింపజేసే విధానం ప్రారంభమైంది. క్రమ వికాసం పొందింది. అయితే ఒక శాఖ కేవలం కొన్ని కులాల గొప్పదనాన్ని కీర్తించే కథలను చెప్పే తీరు తరువాతి కాలంలో వచ్చింది. 24

ఆధునిక కాలం

ప్రాచీన మానవుని బుద్ధి పరిణామ వికాసాలకు నిదర్శనమైన జానపద కళారూపం అతి ప్రాచీనమైంది. కానీ ఈనాడు మనం చూస్తున్న బుర్రకథ ముఖ్యంగా ఇతివృత్తానికి సంబంధించిన దానికి, ప్రాచీనమైన దానికి ఎంతో తేడా ఉన్నమాట వాస్తవం.

ఈనాటి బుర్రకథ స్వాతంత్య్రానికి పూర్వమే ప్రారంభమై అచిరకాలంలో మిక్కిలి వికాసం పొందింది. మొట్టమొదట 1942లో కాకుమాను సుబ్బారావుగారు బాబూరావు బుర్రకథను, 1943లో రష్యావీరవనిత టాన్యా బుర్రకథను రచించారు. వీటిని షేక్‌ నాజర్‌, రెంటాల గుడ్డి జంగం గానం చేసేవారు. సుంకర సత్యనారాయణగారు, 1943లో సామ్యవాద సిద్ధాంతాలతో కష్టజీవి బుర్రకథను రచించగా షేక్‌ నాజర్‌ బెంగాల్‌ కరువు బుర్రకథను, తరువాత రాయలసీమ బుర్రకథను రచించి కరుణరసాత్మకంగాను, ఆ వెనుక పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు వీరరసభరితంగాను, అల్లూరి సీతారామరాజు, బొబ్బిలియుద్ధం దేశభక్తితో రచించి బుర్రకథా గానం చేసి ప్రజల మెప్పును పొంది, బుర్రకథ పితామహ బిరుదు పొంది, కనకాభిషేకాలు చేయించుకొని పెండేరం తొడిగించుకొన్న గొప్ప బుర్రకథా ప్రవర్తకుడు. 1945లో సుంకర సత్యనారాయణ రైతు విజయం, అంతకుముందే ఏటుకూరి వెంకటనరసయ్య రైతు బుర్రకథ రచించారు. ఇవి స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా వచ్చాయి. కాంగ్రెసు పార్టీకి సంబంధించిన కథలు 1946-48 మధ్యలో అనేక బుర్రకథలు వచ్చాయి. 1947లో వారణాసి సత్యనారాయణగారి నేతాజీ రచితం. 1948లో జంపన చంద్రశేఖరరావు నేతాజీ జీవితచరిత్ర, బుద్ధిరెడ్డి కోటేశ్వరరావుగారి నైజాం రజాకారుల దురంతాలు, తిరునగరి రామాంజనేయులు తెలంగాణ వీరులు రచింపబడి ప్రజల్లోకి వెళ్ళాయి. ఇదే రీతిగా ప్రజానాట్యమండలి పక్షాన తెలంగాణ విమోచనోద్యమ సందర్భంలో అనేకమైన బుర్రకథలు వచ్చాయి. తదనంతరం ఈనాడున్న తీరులో బుర్రకథ ప్రజలకు వినోద విజ్ఞానాలను ప్రసాదిస్తూంది.

బుర్రకథ - విశిష్టత

బుర్రకథ విశిష్టతలో మనం బుర్రకథా ప్రవర్తన, బుర్రకథా రచయితలు, బుర్రకథా ప్రవర్తకులు, బుర్రకథ వర్గీకరణ అనే అంశాలను గుర్తింపవలసి ఉంది.

బుర్రకథా ప్రవర్తన

బుర్రకథా గానం చేసేవాళ్ళు ముగ్గురు. ప్రధాన కథకుడు, అతనికి ఇటు అటు రెండువైపుల ఇద్దరు వంతలుంటారు. వీరిలో ఒకడు రాజకీయము, రెండోవాడు హాస్యము వివరిస్తారు. ప్రధాన కథకుల్లో సెంటర్‌ అంటారు. ప్రధాన కథకుడు భుజం మీది తంబురా మీటుతూ, ఎడమ చేతివ్రేళ్ళలోని అందెల్ని మ్రోగిస్తూ తంబురా శృతిలో కథా గానం చేస్తాడు. షరాయి, నిలువుటంగీ, తలపాగ ధరించి, కాళ్ళకు గజ్జెలు ధరించి, రసానుగుణంగా చిందులు తొక్కుతూ, గంతులు వేస్తూ, అభినయిస్తూ పాడుతాడు. వంత లిరువురూ గుమ్మెటలు ధరించి, కథాకథనంలో తాళరీతిని అందిస్తారు. ఇది బుర్రకథా గానరీతి.

బుర్రకథ జానపద ప్రదర్శన కళారూపం. ఇది ప్రజా ప్రదర్శన కళారూపం. ఇందులోని సంగీత నృత్యాలు దేశి సంబంధి. ప్రజలకు దగ్గరగా ఉండే, అంటే జానపద సంగీత, నృత్యాలు ప్రాధాన్యం వహిస్తాయని చెప్పనక్కర్లేదు. 25

బుర్రకథా ప్రవర్తకులు

కొందరు ప్రముఖులైన బుర్రకథా ప్రవర్తకులు - షేక్‌ నాజర్‌, జూనియర్‌ నాజర్‌, మిక్కిలినేని, కోగంటి, కర్నాటి, ప్రయాగ, నిట్టలా బ్రదర్స్‌, బెనర్జీ, లక్ష్మీకాంతమోహన్‌, నదీరా, పున్నంరాజు, జయంలు మొదలైన పురుషులతో పాటు శ్రీమతి భద్రకాళి, శ్రీమతి శారద, కుమారి వాణి, తాప రాజమ్మ, కొండేపూడి రాధ, వీరమాచనేని సరోజిని మొదలైన మహిళామణులు సైతం బుర్రకథాగానం చేసి రాణించారు.

బుర్రకథలు - వర్గీకరణ

బుర్రకథలు ఇతివృత్తాన్ని బట్టి అనేక రీతులుగా విభజించవచ్చు. ప్రబోధాత్మకాలు, చారిత్రకాలు, పౌరాణికాలు, పతివ్రత కథలు, మతసంబంధి కథలు- అని వర్గీకరించవచ్చును. వీటిలో మళ్ళీ అంతర్భాగాలను గుర్తించవచ్చు. ప్రబోధాత్మకాలలో రాజకీయ, జాతీయ, సామాజికాలు, ప్రభుత్వ ప్రచార ప్రబోధాత్మకాలు అని విభజింప వీలవుతుంది. అలాగే పౌరాణికాలను భారత, భాగవత, రామాయణ సంబంధి, ఇతరాలు అని విభజించవచ్చును. ఇన్ని రకాలుగా ఈనాడు బుర్రకథలు ప్రాముఖ్యం వహించాయి.

బుర్రకథలు - సామాజిక ప్రయోజనం

సమాజ ప్రజలను మేల్కొలిపి వినోదంతో పాటు విజ్ఞానాన్ని ప్రసాదించి చైతన్యవంతులను చేయడానికి ఈ బుర్రకథలు ఎంతగానో ఉపకరించాయి.

ప్రారంభదశలో బుర్రకథల ప్రయోజనం

స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటిషు ప్రభుత్వం గుట్టు రట్టు చేయడానికి, జమీందారులు, పెత్తందార్లు ప్రజలను పీడించే తీరుతెన్నులను వివరించడానికి బుర్రకథ వజ్రాయుధంగా ఉపకరించింది. వామపక్ష భావజాలంతో సామ్యవాద సిద్ధాంతాల ప్రచారంలో జానపద ప్రదర్శన కళారూపాలు మిక్కిలి సహకరించాయి. ప్రత్యేకించి బుర్రకథ ప్రాముఖ్యం ప్రధానమైంది. తెలంగాణ విమోచన పోరాటంలో బుర్రకథ ప్రజానాట్యమండలి చేతిలో సానలు దీరి ప్రజల్లోకి చొచ్చుకొని పోయి ప్రజలకు వివిధ విషయాలను వివరించి చైతన్యవంతుల్ని చేయడంలో బాగా ఉపకరించింది. బుర్రకథలు సామాజిక సమస్యలను ఎత్తి చూపడమే కాక, వాటితోపాటు హాస్యం జోడించడంతో ప్రజలు ఉత్తేజ పూర్వకంగా చూసి విషయాలను గ్రహించగలిగారు.

స్వాతంత్ర్యానంతరం బుర్రకథల ప్రయోజనం

సామాజిక రుగ్మతలైన సాంఘిక దురాచారాలను దుయ్యబట్టి సంఘసంస్కరణకు బుర్రకథ లుపకరించాయి. వరకట్న దురాచారం, కులమతాల విభేదాలు రూపుమాపడానికి, స్త్రీ జనోద్ధరణకు, వెట్టిచాకిరి నిర్మూలనకు ఈ బుర్రకథలు ప్రబోధించాయి. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు- సహకార వ్యవసాయం, హరిత విప్లవం, శ్వేత విప్లవం, దేశభక్తి ప్రబోధం మొదలైన ముఖ్యాంశాల ప్రచారార్థం బుర్రకథలు ప్రజల్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని ప్రసాదించాయి.

ప్రస్తుతం బుర్రకథల ప్రయోజనం

ఈనాడు ప్రజలను చైతన్యపరచడానికి బుర్రకథలు ప్రధాన సాధనాలుగా ప్రయోగిస్తున్నారు. అక్షరజ్యోతి - సాక్షరతా మిషన్‌ ద్వారా నిరక్షరాస్యులను చదువరులుగా చేయడం, కుటుంబ నియంత్రణ, శిశు సంరక్షణ, సారా సంహారం, సామాజిక రుగ్మతలైన వరకట్నం నిర్మూలన, బాల్య వివాహాల ఖండన, బాలకార్మిక వృత్తి నిర్మూలన, లంచగొండితనం అక్రమార్జనల ఖండన, మహమ్మారి ఎయిడ్స్‌ నివారణ మొదలైన వాటికీ బుర్రకథలు ప్రజలకు ఉపకరిస్తూ వస్తున్నాయి.

అలాగే ఈనాడు ప్రభుత్వ పథకాల్లో ముఖ్యమైన విద్య, వైద్య, ఆరోగ్యం, బాలికా సమృద్ధియోజన, బాల కార్మిక వృత్తి నిర్మూలన, అక్షర సంక్రాంతి, నీరు-మీరు, వన సంరక్షణ మొదలైన అనేక పథకాలను తెలియజెప్పడానికి, ప్రచారానికి ఈ బుర్రకథ లుపకరిస్తున్నాయి.

ముగింపు

బుర్రకథ ప్రజల వినోదార్థమే ప్రారంభమైంది. కానీ ప్రయోజనం కూడా సాధించాలన్న కోరికతో ప్రజా చైతన్యం కోసం విజ్ఞానాన్ని ప్రదానం చేయడం లక్ష్యమైంది.

ఇందులో సంగీతం, అభినయం, సాహిత్యం వాద్యాలతో కూడి ప్రజలకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కూరుస్తూ వచ్చాయి.

జాతీయోద్యమ కాలంలో దేశభక్తిని ప్రబోధించాయి. ప్రారంభంలో కాంగ్రెసు సిద్ధాంతాలను, ఆశయాలను ప్రచారం చేయడాని కుపకరించాయి. తెలంగాణ విమోచన పోరాటోద్యమ కాలంలో ప్రజానాట్యమండలి ఈ బుర్రకథల మూలంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి అద్భుతంగా ప్రయత్నించి విజయం సాధించారు.

ఈనాడు సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి చక్కటి మాధ్యమంగా, ప్రసార, ప్రచార సాధనంగా బుర్రకథ ఉపకరిస్తుంది.

కథాగేయ గానం చాలా ముందటి కాలంలో ఉన్నప్పటికి ముందటి నుంచి బుర్రకథలనే పేరు లేకపోయినా తరువాతి కాలంలో జంగం కథలు, జముకుల కథలు, తందాన పాటలు, యక్షగానాల నుంచి గాని ఈ బుర్రకథలు ఏర్పడ్డా, నాడు నేడు సామాజిక ప్రయోజనాన్ని సాధించే లక్ష్యంలో ఇవి చాలా విశిష్టస్థాన మాక్రమించాయనడంలో సందేహం లేదు.

సంగీత సాహిత్యాభినయం సంపూర్ణ స్వరూపం మన బుర్రకథలు.


సూచికలు:

1 డా॥ ఆర్వీయస్‌ సుందరం: ఆంధ్రుల జానపద విజ్ఞానం. పు. 5, 440, 441.

2 ఆచార్య నాయని కృష్ణకుమారి: తెలుగు జానపద గేయగాథలు. పు. 2-47.

3 పైదే. పు. 21

4 ఆచార్య బి. రామరాజు: తెలుగులో జానపద గీతాల సాహిత్యము. పు. 805-807.

5 పాల్కురికి సోమనాథుడు: పండితారాధ్య చరిత్ర - పర్వత ప్రకరణము. పు. 345-349.

6 పై 2వ సూచికలోనిదే. పు. 21-28

7 మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: ఆంధ్ర నాటకరంగ చరిత్ర. పు. 205.

8 తిరుమల రామచంద్ర: తెలుగుజాతి ప్రాచీన సంగీత రూపకం: బుర్రకథ - సాహితీ సుగతుని స్వగతం. పు. 18.

9 పైదే. పు. 18.

10 మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: బుర్రకథలు; నాట్యకళ. పు. 47-49. అక్టోబర్‌, 1971.

11 తంగిరాల వెంకటసుబ్బారావు: బుర్రకథలు; నాట్యకళ. పు. 24-30. జూన్‌, 1977.

12 నన్నెచోడుడు: కుమారసంభవం. 4-112.

13 పాల్కురికి సోమనాథుడు: పండితారాధ్య చరిత్ర-పర్వత ప్రకరణము. పు. 435.

14 పాల్కురికి సోమనాథుడు: బసవ పురాణము - చతుర్థాశ్వాసము. పు. 108

15 పాల్కురికి సోమనాథుడు: బసవ పరాణము - ప్రథమాశ్వాసము. పు. 20.

16 నా వ్యాసం: జాయపసేనాని - నృత్త రత్నావళి. పు. 11, 12, 13.

17 పై 2వ సూచికలోనిదే. పు. 45-65.

18 రాంభట్ల కృష్ణమూర్తి: జానపద కళలు - దృశ్య విధానము; నాట్యకళ. పు. 92, 93. జూన్‌ 1977.

19 పాల్కురికి సోమనాథుడు: పండితారాధ్య చరిత్ర - పర్వత ప్రకరణము. పు. 434. ఇలాగే చాలాచోట్ల ఛాంగుభళ పద ప్రయోగం చేశాడు పాల్కురికి.

20 తాళ్ళపాక అన్నమాచార్యులు: శృంగార సంకీర్తనలు. 12-107.

21 పై 8వ సూచికలోనిదే. పుట 18.

22 పైదే. పు. 18, 19.

23 పై 2వ సూచికలోనిదే. పు. 63, 64.

24 పైదే. పు. 60.

25 పై 11వ సూచికలోనిదే. పు. 28, 29.


ఆచార్య ఎస్‌. గంగప్ప నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా చిరకాలం పనిచేసి పదవీ విరమణ చేశారు. జానపద కళారూపాలపై అధ్యయన, పరిశోధన వీరి ప్రధాన రంగం. ప్రస్తుతం గుంటూరులో నివాసం.


ఈ వ్యాసము చైతన్య స్రవంతి - తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 లోనిది. ఆ కార్యక్రమాల వివరాలను ఇక్కడ చూడగలరు. దీనిని ఇక్కడ ఉంచుటకు అనుమతినిచ్చిన TANA వారికి, జంపాల చౌదరిగారికి మా కృతజ్ఞతలు. దీనికి మాకు తోడ్పడిన వాసిరెడ్డి నవీన్‌గారికి, సీత(అక్షర క్రియేషన్స్‌)గారికి మా కృతజ్ఞతలు.


AndhraBharati - AMdhra bhArati - burrakatha - sAmAjika prayOjanaM : AchArya es.h. gaMgappa - S. Gangappa - Burrakadha - Burra kadha - TANA 2006 Chaitanyasravanti - telugu vachana sAhityamu - vyAsamulu ( telugu andhra )