వచన సాహిత్యము వ్యాసములు జానపద కళలు - భాషా సౌందర్యం

జానపద కళలు - భాషా సౌందర్యం : డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు

చైతన్య స్రవంతి
తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 నుంచి
TANAవారి సౌజన్యంతో.

భారతదేశం అనేక మతాలకు, భాషలకు, ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. సువిశాలమైన భారతదేశంలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జనపదం అంటే పల్లెటూరు. జనపదాల్లో నివసించే ప్రజలే జానపదులు. అయితే గ్రామీణులు, విద్యావిహీనులు మాత్రమే జానపదులనే అభిప్రాయం పాతది. ఏ ఒక్క విషయంలోనైనా భావసామ్యం కలిగిన జన సముదాయాన్ని జానపదులని విజ్ఞులు విశ్వసించి జానపద శబ్దానికి విస్తృతిని కలిగించారు. జానపదులకు సంబంధించిన సాహిత్యాన్ని జానపద సాహిత్యమని, ప్రజా వాఙ్మయమని, పామర సాహిత్యమని, శిష్టేతర సాహిత్యమని, దేశి సాహిత్యమని పలు పేర్లతో వ్యవహరిస్తారు.

జానపదులు జానపద సాహిత్యంతో పాటు కొన్ని కళల్ని కూడా సృష్టించారు. నేర్పుతో చేసే ఏ పనినైనా కళ అని చెప్పవచ్చు. జానపదులు తమ నిత్య జీవితానికి ఉపయోగపడే వస్తువుల్ని తయారుచెయ్యటాన్ని ఉపయోగ కళలని, వస్తుకళలని చెప్పవచ్చు. ఇవికాక జానపదుల మానసిక ఉల్లాసానికి, సంతోషానికి పనికి వచ్చే కళలున్నాయి. అవే ఉత్సవాల సందర్భంలో, వేడుకల సమయాల్లో ప్రజల మనసుల్ని రంజింపజెయ్యటానికి సృష్టించబడిన ప్రదర్శన కళలు. వీటినే స్థూలంగా జానపద కళలు అంటారు.

మానవుని అనుభూతులకు, ఆనందోత్సాహాలకు, మానసిక చైతన్యానికి కల్పనాశక్తికి, ఊహాశీలతకు ప్రతీకలు జానపద కళలు. ఇవి ప్రజలలో పుట్టి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రజా జీవితాలకు చాలా సన్నిహితంగా ఉంటాయి. ప్రజల అలవాట్లకు, ఆచార వ్యవహారాలకు, ఉత్సాహ ఉద్రేకాలకు, సుఖదుఃఖాలకు జానపద కళలు అద్దం పడతాయని చెప్పటంలో అతిశయోక్తి లేదు. అనంతమైన జీవన సాగరంలో నుంచి అవతరించిన అనర్ఘ రత్నాలే జానపద కళలని చెప్పవచ్చు. ఈ జానపద కళల్ని ప్రదర్శించే సందర్భంలో కళాకారులు ప్రయోగించే భాష సహజ సుందరంగా ఉంటుంది.

జానపద కళలు అనుకరణ నృత్యాలు, బొమ్మలాటలు, వీధి నాటకాలు, యక్షగానాలు, వీధి భాగవతాలు, పగటి వేషాలు, కలాపాలు, భజనలు, కులగాథా గానాలు, సుద్దులు, జాతర వేషాలు మొదలైన రీతిలో ఉంటాయి. ఈ జానపద కళల్ని ప్రదర్శించేవారు జానపదులు. వీరి భాష సహజంగా, సౌందర్యవంతంగా ఉంటుంది. వీరి ఉచ్చారణా రీతి ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కువమంది కళాకారులు విద్యలేనివారే. అయినా వారికి ఎన్నో గేయాలు, పద్యాలు, కథలు కంఠస్థాలై ఉంటాయి. మౌఖిక సాహిత్య సంరక్షకులుగా జానపద కళాకారుల్ని గుర్తించవచ్చు. నాగరికులకు వీరి భాష కొంత మోటుగా ఉండవచ్చు. మరికొన్నిచోట్ల ఘాటుగా ఉండవచ్చు. అయినప్పటికీ వారి భాషలో సహజ సౌందర్యం ప్రస్ఫుటమవుతుంది. ఆయా జానపద కళల్లో ప్రయోగించబడ్డ భాషా సౌందర్యాన్ని ఈ విధంగా దర్శించవచ్చు.

జానపదుల అనుకరణ నృత్యాల్లో అశ్వనృత్యం ఒకటి. గుర్రపు ఆకారాన్ని తయారుచేసుకొని దాని మధ్యలో డొల్ల (ఖాళీ) ఉంచి, దానిలో కళాకారుడు దూరి అంటే దాన్ని నడుముకు తగిలించుకొని వెనుకకూ ముందుకూ నడుస్తూ మధ్యమధ్య ఎగురుతూ ఖేల్‌ భాయి ఖేల్‌, ఖేలమ్మ ఖేల్‌ అంటూ అద్భుతంగా నర్తిస్తాడు. ఖేల్‌ శబ్దాన్ని ప్రయోగించటంవల్ల ఇది ఇటీవలి నృత్యమని చెప్పవచ్చు. ఈ నృత్యాన్ని అభినయించే కళాకారులకు ఉత్తేజాన్ని కలిగించటానికి డప్పు, కంజిర లాంటి వాద్యాల్ని మోగిస్తారు. ప్రేక్షకులు ఈలలు చప్పట్లతో ప్రోత్సహిస్తారు. కొన్ని సందర్భాల్లో చేతుల్లో చిరుతలు ధరించి పాటలు పాడతారు. ఒక పాట ఈ విధంగా సాగింది.

చంచెల చెరిగే చేడె కురులపై, లలన కురులపై
తుమ్మెద లాడిన ఓ లలనా
ఘన తుమ్మెదలాడిన ఓ లలనా     ॥కం॥

చెమటకు తడిసిన చెదిరిన గంధం
ఘుమఘుమలాడిందో లలనా     ॥కం॥

చెరిగేటప్పుడు చేతుల గాజులు
గలగలలాడిన ఓ లలనా     ॥కం॥

గొప్పది రోకలి గుప్పున దంచగ
జబ్బలు కదిలిన ఓ లలనా
ఘన జబ్బలు కదిలిన ఓ లలనా     ॥కం॥

అంటూ సాధారణంగా శృంగార పదాల ప్రోత్సాహంతో ఈ నృత్యం సంతోషంగా సాగిపోతుంది. ఆది ప్రాసలు, అంత్య ప్రాసలతో, లయాత్మకమైన పద ప్రయోగంతో, అద్భుత భావసంపదతో సాగిన ఈ అశ్వనృత్య గీతాన్ని ఇటీవలి కాలంలో ఒక చలనచిత్రంలో ఉపయోగించుకొన్నారు. చెమటకు తడిసిన గంధం ఘుమఘుమ, చేతుల గాజుల గలగల, జబ్బలు కదిలిన తీరు శ్రోతలకు వీనుల విందు చేస్తున్నాయనటం సహజోక్తి.

తప్పెటగుళ్ళు అనే జానపద కళారూపం కళింగాంధ్రలో బాగా ప్రసిద్ధి పొందింది. తప్పెట రూపంలో ఉబ్బెత్తుగా ఉండే ఈ వాద్యాన్ని గుండెల మీద పెట్టుకొని చేతులతో కొడుతుంటే శరీరం గగుర్పొడిచే రీతిలో శబ్దం వస్తుంది. దీన్ని కళింగాంధ్రలోని యాదవులు మాత్రమే ప్రదర్శిస్తారని తెలుస్తున్నది. అయితే ఇటీవలి కాలంలో కాళింగులు కూడా ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తున్నారు. కళింగాంధ్ర నుంచి ఆంధ్ర దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రజలు వలసరావటం వల్ల ఇతర ప్రాంతాల్లో కూడా ఈ కళారూపం కనిపిస్తున్నది.

శ్రీకృష్ణుడు యాదవవంశ సంభూతుడు కావటంవల్ల వీరి కళాప్రదర్శనలో ఎక్కువభాగం శ్రీకృష్ణ సంబంధమైన గేయాలు వినిపిస్తాయి. శ్రీకృష్ణ లీలావిలాసాలను పాత టెక్కలి వాస్తవ్యులు (శ్రీకాకుళం జిల్లా) బొల్ల రామయ్య పాడిన తీరు ఈ విధంగా ఉన్నది.

చిన్నికృష్ణయ్యా జాడలా కానరావయ్యా     ॥చిన్ని॥
ఎన్ని మాటలు నేర్చినాడు యశోదమ్మ నీ కొడుకు
చిన్ని తనయుడు నిన్న రేయపుడు ఎన్ని మాయలు నేర్చినాడో
నేను మా వంటింటి గదిలో తోటికోడలు పెరుగు తరువగ
ఉట్టి మీదను చట్టి పెట్టి చట్టిలో పాలారగించి
చట్టి పగలగొట్టి కృష్ణుడు పొట్టనింపుకున్నాడమ్మా     ॥చి॥

గోపికలు శ్రీకృష్ణుని ఆగడాలను యశోదమ్మకు వివరించిన తీరులో శ్రావ్యత ఉన్నది. ఎన్ని మాటలు, చిన్ని తనయుడు, నిన్న, ఎన్ని మాయలు అనే ప్రయోగాల్లోని ద్విత్వ 'న'కారం, ఉట్టి, చట్టి, పెట్టి, పొట్ట ప్రయోగాల్లోని ద్విత్వ 'ట'కారం వీనులవిందుగా ఉన్నాయి. జానపదుల భాషలోని ప్రత్యేకత ఈ గేయంలో వినిపిస్తున్నది. ఎలాంటి విద్యాగంధం లేకపోయినా సహజసిద్ధమైన పరిజ్ఞానంతో, శ్రుత పాండిత్యంలో తప్పెటగుళ్ళు కళాకారులు గేయాలు సృష్టించుకొన్న తీరు ప్రశంసనీయంగా ఉన్నది. ఎర్రన, పోతన పద్యాల భావసారం ఈ గేయంలో వినిపిస్తున్నది.

జానపద కళల్ని, నృత్యాల్ని ఆధునిక కాలంలో ప్రజా చైతన్యంకోసం వినియోగించటం మెచ్చుకోదగిన అంశం. కోలాటం పల్లె ప్రజలకు బాగా పరిచయమైన నృత్యం. కోలలతో అంటే చిన్నచిన్న కర్రలతో ఆడే ఆట కోలాటం. దీన్ని ప్రదర్శించే కళాకారులు ఇటీవల అక్షరజ్యోతి కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ పాడిన పాట ఈ విధంగా ఉన్నది.

ఔను నిజమేనా - ఔను నిజమేనా - చందురూడా
అక్షరాలు నేర్చుకుంటే - అజ్ఞానం తొలగిపోతదా     ॥ఔ॥

అక్షరాలు నేర్చుకొంటా చందురూడా - జ్ఞానజ్యోతి వెలిగించు చందురూడా
నేను జ్ఞానజ్యోతి వెలిగిస్తా చందురూడా - అందుకే
అక్షరాలు నేర్చుకుంటా - చందురూడా
ఇన్నాళ్ళు నేనేమొ దోపిడీకి గురియైతి - ఇప్పుడేమొ కళ్ళు దెరిస్తి
ఒళ్ళు వంచి చదువుకుంటా - నా ఇల్లాలు నేనేమొ
శ్రద్ధగాను చదువుకుంటాం
కూలినాలి పైసలేమొ - లెక్కలేమొ తెలియవాయె
పక్క వూరు వెళ్దమంటే - బస్సు పేరు తెలవదాయె
అందుకే అక్షరాలు నేర్చుకొంటా - నా బతుకు బాగు చేసుకొంటా

అనే పాట ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తుంది. ప్రాచీన కళారూపాల్ని ఆధునిక సామాజిక ప్రయోజనంకోసం వినియోగించుకోవటం నిజంగా ప్రశంసనీయం. తేలిక పదాలతో, ప్రబోధంతో సాగిన ఈ గేయం వీనుల విందుగా ఉంది.

పల్లెల్లో స్త్రీలు ప్రదర్శించే నృత్యాల్లో గొబ్బి నృత్యం ఒకటి. ఆవు పేడను ముద్దలుగా చేసి వాటిని గొబ్బెమ్మలని పిలుస్తూ పసుపుతోను, కుంకుమతోను, పూలతోను, రంగులతోను అలంకరిస్తూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. కొన్ని భక్తి భావాలతో సాగినా మరికొన్ని శృంగార రసంతో నిండి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో గొబ్బెమ్మల్ని పళ్ళెంలో పెట్టి ఎత్తుకు తిరుగుతూ కన్యలు పాటలు పాడతారు. కన్యలు పాడే పాట ఒకటి ఈ విధంగా సాగింది.

గొబ్బియాలో తుమ్మీద, తుమ్మీద నల్ల తుమ్మీద
తుమ్మీద కళ్ళన్ని దూలాల మీద
మాయన్న కండ్లన్ని లంజింటి మీదా
లంజకు లంచంబు ఏమిస్తివన్నా
చీరిస్తి మూరేస్తి సిరిగందమిస్తీ
సెమ్మూతో నీల్లిచ్చి బుడబడ ముంచీతి

అని ప్రశ్న-సమాధానం రీతిలో సాగింది. ఇక్కడ అరమరికలు లేకుండా ఆడపడుచులు ప్రశ్నించటం, అన్న దానికి తగిన రీతిలో సమాధానం చెప్పటం ముఖ్యంగా చీరిస్తి, మూరేస్తి సిరిగందమిస్తీ అనే గ్రామ్య పద ప్రయోగం, సెమ్ముతో (చెంబు) నీల్లిచ్చి (నీళ్ళిచ్చి) అనే పదాల ప్రయోగం జానపదుల అచ్చమైన భాషా సౌందర్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి.

రాయలసీమలోని జనపదాల్లో స్త్రీలు సరిసంఖ్యలో చేరి నృత్యం చేసే విధానాల్లో జక్కి నృత్యం ఒకటి. ప్రేయసీ ప్రియులు తమ ప్రేమకు గుర్తుగా ఒకరికొకరు కానుకలు ఇచ్చి పుచ్చుకొంటారు. ఒకసారి ప్రియుడు ప్రియురాలికి ఎన్నో కానుకలు తెచ్చాడు. ప్రేమతో తెచ్చిన కానుకల్ని ప్రియురాలు పుచ్చుకోగానే ప్రియుడు చేసే ఆగడాలను చెప్పుకొని ఈ విధంగా వాపోతున్నది.

సిత్తూరు పోతాడక్కా - సిలకం సీసా తెస్తాడక్కా
పెట్టుకో పెట్టుకోమంటాడక్కా - పెట్టుకుంటే
        పని పడతాడక్కా

పుంగనూరికి పోతాడక్కా - పూలరైకా తెస్తాడక్కా
తొడుక్కో తొడుక్కో మంటాడక్కా - తొడుక్కుంటే
        పని పడతాడక్కా

అంటూ సాగిన పాటను గమనించినప్పుడు ఇది రాయలసీమ ప్రాంతంలో పాడే పాటని గుర్తించవచ్చు. చిత్తూరును సిత్తూరు అనటం, తిలకాన్ని సిలకం అనటం, రవికను రైక అనటం జానపదుల భాషకు సహజమైన రీతిలో ఉన్నదని చెప్పవచ్చు. వస్తువులు తెచ్చి వాటిని ధరించమని చెప్పి ఆ తర్వాత ఆగడాలు చేస్తుంటాడని ప్రియురాలు పలకటం ద్వారా ప్రియుని శృంగార చేష్టలు స్పష్టమవుతున్నాయి.

జానపదులకు తోలుబొమ్మలాటలు బాగా పరిచయమైనవి. బొమ్మల్ని ఆడిస్తూ పాటలు పాడతారు. సంభాషణలు చేస్తారు. రాత్రివేళల్లో తెరలు కట్టి దీపపు వెలుగులో బొమ్మల్ని ఆడిస్తారు. ఈ తోలుబొమ్మలాటలో కేతిగాడు బంగారక్కల పాత్రల సంభాషణలు హాస్యానికి నిలయాలు.

బంగారక్క వచ్చీనాది భామలారా
సుందరముగా చూపరార సుజనులారా...
పసిడివన్నెల రెయికా దొడిగీ అమ్మలారా
నీలిరంగు చీరె కట్టి అమ్మలారా
నీటుగాను వచ్చినాదీ అమ్మలారా

అంటూ బంగారక్క పాత్రను ప్రవేశపెడతారు. ఆ తర్వాత బంగారక్క

అబ్బబ్బ వళ్ళంతా ఈ వూరి నీళ్ళు తాగి జిల పుట్టింది

అంటుంది. అప్పుడు ప్రక్కన ఉన్న వంతవాళ్ళు

చవుడు సున్నం పెట్టుకో తగ్గిపోతుంది

అంటారు.

బంగారక్క

చవుడు సున్నమా! చవుడు సున్నం నేను గాదు పెట్టుకోవాల్సింది
ఎవరికి పెట్టాలంటే
వసే తసే అనేవాళ్లకూ
వరే తరే అనేవాళ్ళకూ
అన్నం పెట్టే దాన్నో మన్ను పోసేవాళ్ళకూ
ఆట ఆడించి పాట పాడించి
సంభావన ఎగ్గొట్టి పోయేవాళ్ళకు
చవుడు సున్నం పెట్టాలిరా...

అని పలుకుతుంది. బొమ్మలాట వారిని చులకనగా చూస్తూ అసభ్యంగా మాట్లాడేవాళ్ళకు ఈ పలుకులు చురకల్లాంటివి. పదిమంది ముందు ఇలా ప్రతిచోటా అవమానంగా మాట్లాడతారని భయపడి చందాల విషయంలోగానీ, బొమ్మలాటవారిపట్ల మర్యాదగా మసలుకొనే విషయంలోగానీ ప్రేక్షకులు జాగ్రత్త పడతారు.

రాయలసీమలో జరిగే వేడుకల్లో భారత నాటకోత్సవాలు ప్రముఖమైనవి. ఈ నాటకాల్ని ప్రదర్శించేటప్పుడు ప్రేక్షకుల నిద్రమత్తును వదిలించటానికి హాస్య పాత్రలు ప్రవేశిస్తాయి. బఫూన్‌ పాత్రనే అక్కడ బప్పన్‌ అంటారు. ప్రతి నాయకుని వెంట వచ్చిన బప్పన్‌ పాత్ర

సారాయి దాగినోడు సావుకారు కొడుకు
సిగిరెట్టు దాగినోడు శివుని కొడుకు
బంగాకు దాగినోడు బగమంతుని కొడుకు
బీడీలు దాగినోడు బీద నా కొడుకు
ఏమీ దాగనోడు ఎర్రి నా కొడుకు

అని చివరి పాదం పాడటంతో ప్రేక్షకులు గొల్లున నవ్వుతారు. వారి నిద్రమత్తు వదులుతుంది. ప్రేక్షకుల్ని నవ్వించటమే ఈ పాత్రల ప్రయోజనం. సిగిరెట్టు, బీడీ పద ప్రయోగాల వల్ల ఈ గేయం ఆధునిక కాలంలో కల్పించబడిందని చెప్పవచ్చు.

చెంచునాటకం జానపద కళల్లో బాగా ప్రచారం పొందిన విశిష్ట కళారూపం. దీనిలో సింగి-సింగడు ప్రధాన పాత్రలు. వీరి మాటలు, పాటలు చమత్కారంగా సాగి ప్రేక్షకుల్ని ఆనందడోలికల్లో ఊగిస్తాయి.

సింగి:
    మేకలన్ని యాడ యిడిచి
    యిప్పుడొత్తివిరా సింగా
    నువ్వెప్పుడొత్తివిరా సింగా

సింగడు:
    మేకలన్ని కొండకు తోలి
    కత్తె కొరకను కావలిపెట్టి
    ఇప్పుడె వత్తినే సింగీ
    నేనిప్పుడె వత్తినే సింగీ...

సింగి:
    గుడిసెలన్నీ యాడయిడిసి
    ఎప్పుడొత్తివిరా సింగా నువు
    ఎప్పుడొత్తివిరా సింగా

సింగడు:
    గుడిసెలాకు అగ్గిపెట్టి
    యలకరాజును కావలిపెట్టి
    ఇప్పుడె వత్తిని సింగీ నేవ్‌
    ఇప్పుడె వత్తిని సింగీ...

అని సాగిన ఈ గేయంలో ఇంకా ముసలిదాన్ని ఎక్కడ పెట్టి వచ్చావు? అంటే గుంటలో పెట్టి గుంటనక్కల్ని కాపలా పెట్టి వచ్చానని, పిల్లల్ని ఎక్కడ పెట్టి వచ్చావంటే, పిల్లల్ని బావిలో పడేసి గాండ్రు కప్పను కావలిపెట్టి వచ్చానని పలికే హాస్యోక్తులతో సాగుతుంది. ప్రేక్షకుల్ని నవ్వించటమే జానపద కళాకారుల ప్రధానాశయం కాబట్టి ఉచితానుచితాలు, సందర్భాసందర్భాలు వాళ్ళు పట్టించుకోరు.

చినచిన్న చిరుతల్ని చేతిలో ధరించి పాటలు పాడుతూ ఆడే కళా ప్రదర్శనను చిరుతల భాగవతం అంటారు. మధ్యమగతిలో మొదలయ్యే ఈ కళా ప్రదర్శన

రామరామ అనుకొంటూ రామభజనలు చేసుకొంటూ
ఒకసారి రామ యనరాదా ఓ పాటి మనసా

అని ఉంటుంది. ఇది తారా స్థాయిలో

లేరా లేరా లక్ష్మణ లేరా
లేడి వాయెరా బాణమేయరా
అదిగో లేడి లక్ష్మణ లేరా
లేడి వాయెరా బాణమేయరా
గుంతన లేడి మిట్టన రాముడు
మిట్టన లేడి గుంతన రాముడు
పరుగున పరుగులు దీసే లేరా
లేరా లేరా లక్ష్మణ లేరా
లేడి వాయెరా బాణమేయరా

అని సాగుతుంది. చిరుతల భజనలు ప్రారంభమైన దశలో రామాయణమే ఆడేవారు. అందువల్ల చిరుతల రామాయణమని దీనికి పేరు. అయితే తర్వాతి కాలంలో ఇతర భాగవతాల సామ్యంతో దీనికి చిరుతల భాగవతమని పేరు వచ్చింది. ఈ గేయంలో లేడి + పాయెరా అనేది గసడదవాదేశం వల్ల లేడివాయెరా అని మారటంలో ఒక ప్రత్యేకమైన శ్రావ్యతను సంతరించుకొన్నది. అలాగే గుంతన లేడి మిట్టన రాముడు, మిట్టన లేడి గుంతన రాముడు అనే పాదాలలో పదాలు మారిన తీరు శ్రుతిహితంగా సాగింది.

ప్రజా చైతన్యం కోసం ప్రజానాట్యమండలి వారు భూమి భాగవతం అనే కళారూపాన్ని రూపొందించి ప్రచారం చేస్తున్నారు. ఈ కళాకారులు గిరిజనులు నివసించే ప్రాంతాలకు వెళ్ళి బంజర్ల పంపకంలో జరుగుతున్న అవకతవకల్ని వివరిస్తూ వారికి దక్కవలసిన భూముల కోసం పోరాటం సాగించమని ప్రబోధ గీతాలు పాడే తీరు ఎంతో ఉద్వేగభరితంగా ఉంటుంది. వాళ్ళు ప్రయోగించే భాష కూడా పదునుగా ఉంటుంది.

చావుకైన జంకకుండ - అడవి భూమి సాగు చేస్తె
గోచిపాత గిరిజనుడు - బారడంత పొడుకొడితె
మాయజేసి సావుకార్లు - మా భూవులు కాజేసె
మా నోట్లో మన్ను కొడితె - మా బతుకులు బూడిదాయె
పోరాటం బాట మాది - మరోబాట లేనెలేదె
శ్రీకాకుళమడవిలోన - ఆయుధాలె పట్టినామె
అన్నా నాయనలార గొడ్డళ్ళే నూరుదామె

ఈ గేయంలోని పదాల పొందికలో ఒక లయ ఉన్నది. భూస్వాముల మోసాల్ని తొలగించటానికి సాయుధ పోరాటమే శరణ్యమని చెప్పిన తీరులో విప్లవభావాలున్నాయి. గొడ్డళ్ళే నూరుదామె అనటం ద్వారా ఈ పాటకు ఒక మకుటాన్ని సంతరించినట్లనిపిస్తున్నది.

జానపద కళారూపాల్లో పిట్టలదొర అనే పగటివేషం బాగా ప్రచారంలో ఉన్నది. పగటి వేషాల కళాకారులు తమ మాటల ద్వారా, చేష్టల ద్వారా ప్రజలకు నవ్వు పుట్టిస్తారు. వాళ్ళలో పిట్టలదొర వేషం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అతని మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. అతిశయోక్తులు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. పిట్టలదొర మాటలు ఈ విధంగా ఉన్నాయి.

"అయ్యా మాకేం తక్కువైందని మీ దగ్గరికి వచ్చామనుకుంటున్నారు. ఏడంతస్తుల మేడ, ఏడు దున్నల పాడి, వీపు మీద ఇస్తరి, పిర్రల మీద పీట. బాగా భోంచేసే వాళ్ళమే. ఇంతెందుకు గుమ్మడికాయంత బంగారం కుక్క మూచ్చూసిందని దిబ్బలో వెయ్యటానికి మైలబడతామని ముగ్గురు కూలీలకి మూడు దమ్మిడీల కూలిచ్చి వూరవతల కోనేట్లో పారేయించాం. ఈ సంగతి తెలిసి పక్కింటి పరమేశం భార్య దాన్ని తెచ్చుకొని కాళ్ళకడ్డదిడ్డాలు, నడుముకు నానా తిప్పలు, ముక్కుకు ముంగిర, చెంపకు చెంపసరాలు, నెత్తికి మూకుడుచిప్ప చేయించుకున్నది. మాకు నీళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఇంట్లో పంపు. వీధిలో పంపు. పొయ్యి గడ్డ మీద పంపు. పొయ్యిలో పంపు. అన్నీ వున్న పొయ్యి మీదికి పై వంట మీదికి రెండు మాత్రమే తక్కువై వచ్చాం" అని చివరకు బియ్యం లేక వచ్చాననే సత్యాన్ని చెప్పటంతో వింటున్నవాళ్ళంతా నవ్వుల్లో మునిగిపోతారు.

ఈమధ్యకాలంలో కొంతమంది పగటివేషం కళాకారులు ఇంగ్లీషు పదాల్ని జోడించి పిట్టలదొర వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. "అయ్యా! నేను అమెరికాలో ఆరు సంవత్సరాలు, ఇండియాలో ఐదు సంవత్సరాలు ఉన్నాను. నేను స్కూలుకు వెళ్ళినప్పుడు స్కూల్‌ ఇన్‌స్పెక్టర్‌ వచ్చి, 'పిల్లి వచ్చింది. పాలు తాగింది. గోడ మీద నుంచి వెళ్ళింది. దీన్ని ఇంగ్లీషులో చెప్పు' అన్నారు. అప్పుడు నేను ఓ ఇదంత కష్టమా చాలా పెద్ద పెద్ద ఇంగ్లీషు మాటలే మాట్లాడగలను అని, 'క్యాట్‌ కమింగ్‌, మిల్క్‌ డ్రింకింగ్‌, వాల్‌ గోయింగ్‌,' అన్నాను. అంతే చెంప ఛెళ్ళుమంది. మళ్ళీ ఇంగ్లీషు జోలికి వెళ్ళలేదు" అని నవ్వించిన తీరులోని భాష ఒక ప్రత్యేక రీతిలో ఉన్నది. జానపద కళల్లోని భాషా సౌందర్యం హాస్య సంభాషణల్లో అధికంగా ఉంటుంది.

ఆంధ్ర దేశంలో బాగా ప్రచారంలో ఉన్న జానపద కళారూపాల్లో చెక్కభజన ఒకటి. చెక్కభజనల్లో భక్తి, శృంగార, సాంఘిక సంబంధమైన గేయాలుంటాయి. ఈ గేయాలు జానపదుల ఊహాశీలతకు నిలువుటద్దాలు. రామాయణ, భారత, భాగవతాల్లోని అనేక ఘట్టాల్ని భజన పాటలుగా జానపదులు మలచుకొన్న తీరు 'ఔరా' అనిపిస్తుంది. శ్రీకృష్ణ లీలల్ని పాడుకొంటూ,

గొల్లభామలు:
    గొల్లభామల మంతగూడి చల్లనమ్మను బోవుచుంటె
    చల్లబానలు సుంకమిమ్మని చిల్లులు పడవేసెనమ్మ
    అమ్మా అడుగావె తల్లీ అడుగావె
    తల్లీ తనయుని తప్పులు తెలిపెదమే

అని చెప్పగా,

యశోద:
    ఏలరా కిష్నయ్యా గొల్లబామల మీద నీకు
    గొల్లబామలంత గూడి చల్లనమ్మను బోవుచుంటె
    కిష్నా బామలపై నీకు సరసమేలరా
    కిష్నా పడుచులపై నీకు పంతమేలరా

అని మందలిస్తుంది. అప్పుడు

కృష్ణుడు:
    వారు పోయే యాలలో వడగండ్ల వరసమొచ్చెనె
    అమ్మా బామల బానలపై చిల్లేసెనమ్మ
    అమ్మా బామల మాటలు నమ్మ వలదె
    అమ్మా పడుచుల మాటలు నమ్మవలదె

అని సమాధానమిస్తాడు.

ఈ భజన పాటలో శ్రీకృష్ణుని సమాధానంలోని చమత్కారం కేవలం జానపదుల కల్పన. వడగండ్ల వర్షం వల్ల బానలు చిల్లులు పడ్డాయని తన తప్పు లేదని శ్రీకృష్ణుడు తప్పించుకొన్న తీరు రమణీయంగా ఉన్నది. అడుగవె అనటానికి గోపికలు అడుగావె అని పలికారు. కృష్ణయ్యా అనటానికి యశోద కిష్నయ్యా అన్నది. భామలనటానికి బామలన్నది. శ్రీకృష్ణుడు వేళ అనటానికి బదులు యాలలో అన్నాడు. వర్షము అనటానికి వరస మన్నాడు. జానపదుల కల్పనలో ఎవరైనా తమ భాషనే మాట్లాడినట్లు సృష్టిస్తారు. యశోదను, శ్రీకృష్ణుని కూడా జానపదులుగా మార్చి పలికించిన జానపద కళాకారుల ఊహాశక్తి, సహజ ప్రతిభ ప్రశంసనీయమని చెప్పవచ్చు.

బుర్రకథ అనే కళారూపం ఆంధ్రదేశంలో బాగా ప్రచారం పొందింది. జానపద కథాగాయకులు భళానంటి భాయి తమ్మూడా మేల్‌ భళానోయి దాదానా, తందానతాన తందానతాన అంటూ ఆయా కథల్ని వివిధ రసాల సమ్మేళనంతో వినిపిస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో బుర్రకథ కళాకారులు ప్రత్యేక పాత్రను పోషించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. బుర్రకథలో ప్రయోగించే భాష వివిధ గతుల్లో ఉంటుంది. పల్నాటియుద్ధం బుర్రకథలో నాయకురాలు నాగమ్మ శౌర్యాన్ని వర్ణిస్తూ -

చిన్ననాడె విల్లుబట్టెరా - సై
చిన్నప్డె విల్లెక్కు బెట్టెరా - సై
నింగిలో పిట్టనే గొట్టెరా - సై
నీటిలో చేపనే గొట్టిందా - భళానంటి ॥

అల్లనాడె కత్తి దూసెరా - సై
అల్లపుడె సాములకు డాసెరా - సై
కత్తి కదిలే తీరు గాంచితే - సై
కన్నులకు మిరుమిట్లు గొలిపేనా - భళానంటి ॥

అని పాడతాడు.

ఈ పాదాల్లో ఒక ఊపు ఉన్నది. వేగంగా సాగే పదాల ప్రవాహం ప్రేక్షకులకు ఉద్వేగాన్ని కలిగిస్తుంది. సై అనే పదాన్ని ప్రతి పాదానికీ జోడించటం ఊపు మరింత అధికమవుతుంది. మాత్రాఛందంలో సాగిన ఈ పాదాలు జానపదుల లయాత్మక పద ప్రయోగ దక్షతకు సాక్ష్యాలు.

అల్లూరి సీతారామరాజు బుర్రకథలో తెలుగుతల్లి గొప్పదనాన్ని భళీభళీ వరసల్లో ఈ విధంగా పాడతారు.

ఓ తెలుగు బిడ్డడా! ఓ వీర యోధుడా!
        లేవయ్యా లేచి రావయ్యా
బంగారు నీ తెలుగుతల్లి    భళీ భళీ
పాడిపంటల పాలవెల్లి    ॥
వీరాధివీరులను గన్న    ॥
వీరమాత యెరుంగుమన్న    ॥
శాలివాహనుడొక్కనాడు    ॥
శాత్రవుల దునిమి యేలాడు    ॥
తెలుగువారల కీర్తి దిగ్దిగంతములందు వ్యాపింపజేసి వచ్చాడు ॥ఓ తెలుగు॥

తెలుగు ప్రజల్ని ఉద్దీప్తం చేసే పాదాలు ఈ పాటలో ఉన్నాయి. ప్రాచీన తెలుగు రాజుల వైభవాన్ని వర్ణిస్తూ ప్రస్తుత ప్రజల్ని చైతన్యం చేసే భాష ముఖ్యంగా తల్లి, వెల్లి, వీరులనుగన్న, ఎరుంగుమన్న, నాడు, ఏలాడు మొదలైన పదాల్లోని అంత్యప్రాసలు శ్రోతల్ని రంజింపజేస్తాయి.

మాస్టీలు అనే భిక్షుక గాయకులు మాల మాదిగలకు వినోదం కల్పించే వ్యాయామ ప్రదర్శనలిస్తూ కాలక్రమంలో కథాగానం చెయ్యటం కూడా నేర్చుకొన్నారు. వీళ్ళు వీధినాటకాలు యక్షగానాలు ప్రదర్శిస్తూ ఉంటారు. లవకుశ అనే వీధినాటకంలో చాకలి-చాకితల మధ్య సాగిన సంభాషణను ఈ విధంగా గానం చేస్తారు.

చాకలి:
    ముండమోపిరావె - నీ మూట యాడ వేసినావు
    పోద్దామె ఊళ్ళాకు - పోయిరావె చానాచానా

చాకిత:
    కూయకురా కుక్కా నీవు - గుడ్డీవ ఎడ్డీవ
    ఎనక మూట ఉన్నది నీకు - ఎత్తూకోరా

చాకలి:
    కొప్పును కొప్పును కొన్నాల్లు తరగకు
    సెప్పినట్లు వింటేను సౌఖ్యంబు ఉండును

చాకిత:
    నీవు గాకుండె నీయబ్బా- మరి యింకొక్కడాయె
    పోరా పొమ్ము పొమ్ము - నా ఎంట రాకుమురా

అని సాగిన వీళ్ళిద్దరి సంవాదం హాస్యపూరితంగా ప్రత్యేకమైన యాసలో ఉంటుంది. భర్త భార్యను ముండమోపి అనటం భార్య భర్తను కుక్క అనటం ఆయా పాత్రల స్వభావాలకు తగినట్లుగా ఉందని చెప్పవచ్చు. ఎక్కడ అనటానికి యాడె అనటం, పోద్దామె ఊళ్ళాకు అనే పలుకుల్ని పోయి వద్దాం ఊళ్ళోకి అనేదానికి బదులుగా పలకటం, వెనుక అనటానికి ఎనక అనటం జానపదుల ప్రత్యేక భాషోచ్చారణకు అద్దం పడుతుందని చెప్పవచ్చు.

బుడబుక్కల జాతిని అనుకరిస్తూ జానపద కళాకారులు ప్రజలకు శుభం పలుకుతూ, ఢమరుకాన్ని వాయిస్తూ ఉంటారు. ఈ కళాకారుడు ఏ ఇంటికి వెళతాడో ఆ ఇంటి యజమానికి శుభం కలుగుతుందని దీవిస్తాడు.

ముత్యాలమూటలే - మీ యింట మూల్గాలె
రతనాల రాసులే - మీ చెంత జేరాలె...
శుభోజ్జయం, శుభోజ్జయం, మీకు జయం, మాకు ధనం

అని ఇంటి యజమానిని ఉబ్బించి, కానుకలు సంపాదిస్తాడు. యజమానికి శుభం ఉన్నప్పుడే తనకూ ధనం ప్రాప్తిస్తుందని చెప్పటం ద్వారా యజమాని దయను తన మీద ప్రసరింపజేయమనే అభ్యర్థన కూడా ఉన్నది.

ఈ కళారూపాన్ని ప్రజానాట్యమండలి కళాకారులు సామాజిక చైతన్యానికి వినియోగిస్తున్నారు.

ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి అవినీతిని అంతం చెయ్యాలని, పేదరికాన్ని పారదోలాలని పాడిన గీతం ఎంతో ఉత్తేజపూర్వకంగా ఉన్నదని చెప్పటం అతిశయోక్తి కాదు.

జానపద కళారూపాలు పల్లె ప్రజల అచ్చమైన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనాలు. ఆయా కళారూపాల్ని ప్రదర్శించే సందర్భాల్లో వాళ్ళు ప్రయోగించే భాష వారికి సహజసిద్ధమై ప్రత్యేక ధోరణితో సాగి శ్రోతలకు వీనులవిందును కలిగిస్తుందనటంలో సందేహం లేదు. సెలయేటి ప్రవాహంలా, మందమలయానిలంలా, పండు వెన్నెల హాయిలా జానపదుల భాష సర్వజనరంజకమని చెప్పవచ్చు. ఇలాంటి జానపద కళల్ని రక్షించుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉన్నదనటంలో అతిశయోక్తి లేదు.


డా॥ గుమ్మా సాంబశివరావు విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తున్నారు. అన్నమాచార్య సంకీర్తనలోని వర్ణనలు అనే అంశంపై పరిశోధన చేశారు. వివిధ ప్రక్రియల్లో నాలుగు పుస్తకాలు ప్రచురించారు. మరో నాలుగు ప్రచురణ కావలసి ఉంది. వివిధ పత్రికల్లో సమీక్షలు, వ్యాసాలు ప్రచురించారు.


ఈ వ్యాసము చైతన్య స్రవంతి - తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 లోనిది. ఆ కార్యక్రమాల వివరాలను ఇక్కడ చూడగలరు. దీనిని ఇక్కడ ఉంచుటకు అనుమతినిచ్చిన TANA వారికి, జంపాల చౌదరిగారికి మా కృతజ్ఞతలు. దీనికి మాకు తోడ్పడిన వాసిరెడ్డి నవీన్‌గారికి, సీత(అక్షర క్రియేషన్స్‌)గారికి మా కృతజ్ఞతలు.


AndhraBharati - AMdhra bhArati - jAnapada kaLalu - bhAShA sauMdaryaM : DAkTar.h gummA sAMbaSivarAvu Dr. Gumma Sambasivarao Dr. Gumma Sambashiva Rao - TANA 2006 Chaitanyasravanti - telugu vachana sAhityamu - vyAsamulu ( telugu andhra )