వచన సాహిత్యము వ్యాసములు రాయలసీమ కళారూపాలు

రాయలసీమ కళారూపాలు : ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి

చైతన్య స్రవంతి
తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 నుంచి
TANAవారి సౌజన్యంతో.

గ్రామీణ జీవితంలో పుట్టి పెరిగి ధారావాహికంగా ఏ నృత్యశైలి ప్రవహిస్తూ ఉంటుందో అది జానపద నృత్యం. జానపద నృత్యం జాతికి దర్పణంగా ఉంటుంది. అంతేగాక ప్రకృతితో ప్రత్యక్ష సంబంధం వల్ల ఆదిమ జాతి నృత్యాలు జానపద నృత్యాలకు, జానపద నృత్యాలు శాస్త్రీయ నృత్యాలకు మూలాలు అయ్యాయి.

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రత్యేకమైన కళారూపాలున్నాయి. తెలంగాణాలో ఒగ్గుకథ, కోస్తా ప్రాంతంలో తప్పెటగుళ్ళు, రాయలసీమలో ఉరుముల నృత్యాలు ఉన్నాయి.

రాయలసీమ జానపద కళలు - వర్గీకరణ

రాయలసీమలోని జానపద, ప్రదర్శన కళల్ని ఆరు విభాగాలుగా వర్గీకరించవచ్చు.

 1. వ్యష్టి నృత్యాలు:
  1. నామాలసింగడు
  2. జ్యోతి నృత్యం.
 2. కథాగానాలు:
  1. అనాది కథ
  2. పిచ్చికుంట్ల కథ
  3. బుర్ర కథ.
 3. సమష్టి నృత్యాలు:
  1. కోలాటం
  2. కీలుగుర్రం
  3. కుంచెల నృత్యం
  4. ఉరుములు
  5. చెక్క భజన
  6. పండరి భజన
  7. కవ్వాయి కట్టెలు
  8. బీరప్ప దోల్లులు
  9. గోవయ్యలు
  10. మరగాళ్ళు
  11. తప్పెటగతులు.
 4. వీధి నాటకాలు:
  1. బైలాట
  2. చెంచు నాటకం
  3. యక్ష గానం
  4. వీధి నాటకం.
 5. స్త్రీల కళారూపాలు:
  1. స్త్రీల కోలాటం
  2. జడ కోలాటం
  3. గొబ్బి నృత్యం
  4. తిరగడ జక్కి.
 6. జంతువులాటలు:
  1. కోతులాట
  2. కోళ్ళ పందాలు
  3. గంగిరెద్దులాట
  4. గుర్రాలాట
  5. పాము-ముంగీసాట
  6. పొట్టేళ్ళ పందాలు
  7. ఎలుగుబంటి ఆట.
 1. వ్యష్టి నృత్యాలు

  ఒకరు మాత్రం ప్రదర్శించే కళారూపాల్ని వ్యష్టి నృత్యాలు అంటారు. వాద్య సహకారం ఉంటుంది. వీటిలో పాటలేని నృత్యం, పాటతో కూడిన నృత్యాలు ఉంటాయి. ముఖ్యంగా కళారూపాలు పండగల్లో, జాతర, తిరునాళ్ళలో ప్రదర్శిస్తారు.

  1. నామాలసింగడు:

   ఈ నృత్యాన్ని పీర్ల పండుగ (మొహరం) రోజు తప్పనిసరిగా, మిగిలిన పండగల్లో అప్పుడప్పుడు ప్రదర్శిస్తారు. నామాల గ్రామం పేరు. సింగడు పేరు. అనంతపురం జిల్లాలో ఉంది నామాలగుండు. పులివెందుల నుంచి కదిరి వెళ్ళే కనుమలో ఉంది. సింగడికోట ఉంది. దారిదోపిడి దొంగగా పేరుంది. ఎలాగైనా బంధించాలని ప్రభుత్వం, ప్రజలు మాటువేసి రుబ్బురు గుండు పందాలు పెట్టటం, సింగడు గుండును ఎత్తుతున్న సమయంలో బంధించి బేడీలు వేసుకొని పులివెందుల జైల్లో ఉంచటం జరిగింది. అలాగే ముఖానికి నామాలు, బేడీలు తలకు వేపమండలు, ఇద్దరు తాళ్ళతో పట్టుకొని తప్పెట దరువులకు అనుగుణంగా అడుగులు వేయటం ప్రదర్శనలో భాగం. నామాలగుండులో శివరాత్రికి ఉత్సవం జరుగుతుంది.

  2. జ్యోతి నృత్యం:

   నేసే కులంలోని తొగట వంశస్థులు తమ ఇంటి దేవత చౌడమ్మకు జ్యోతులు, బోనాలు ఊరేగించడం. ఏడాది కొకసారి జరిగే పండగ జ్యోతిని గ్రామం వెలుపల తయారుచేసి భక్తితో ఒకరు నెత్తి కెత్తుకొని గ్రామంలో తిరుగుతూ రకరకాల అడుగులు వేస్తూ చౌడమ్మ గుడి దగ్గరకు రావడం ప్రదర్శనలో ముఖ్యమైంది. ఊరేగింపులో జ్యోతి మధ్యలో చుట్టూ 30 మంది కళాకారులు తాళాలు చేతబట్టి రకరకాల పాటలు పాడగా అడుగులు వేస్తారు. జ్యోతి దగ్గర బలిపిల్లలు కోయడం, రక్తతర్పణం జరగడం, చివరకు చౌడమ్మ గుడి దగ్గర జ్యోతిని దించి యాటను కొడతారు. ఈ విధంగా చేస్తే ఆ ఏడాది పంటలు, ఆరోగ్యం బాగుంటుందని వీరి నమ్మకం.

 2. కథాగానాలు

  జానపదుల కథలు చెప్పటం కొన్ని కథల్ని గానం చేయటం ప్రత్యేకం. అలాంటి వాటిలో కథాగానాలు ముఖ్యమైనవి. ఈ గానాల్లో ముగ్గురు కళాకారులుంటారు. అందరి దగ్గర వాద్యాలుంటాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కథాగానాలున్నాయి.

  1. అనాది కథ:

   అనాదులు మాదిగల్లో ఒక తెగ. పెద్దమ్మ కథ, ఎల్లమ్మ కథ చెబుతారు. ముగ్గురి దగ్గర జవికిని అనే వాద్యాలుంటాయి. ఉగాది పండుగ మరుసటి రోజు (పౌర్ణమినాడు) తప్పనిసరిగా కథ చెబుతారు. కథ మూడు, ఏడు, తొమ్మిది రోజులు చెబుతారు. గ్రామాల్లో కలరా వ్యాధి (తట్టు, అమ్మవారు) సోకినప్పుడు తప్పకుండా కథను ఏర్పాటు చేస్తారు.

  2. పిచ్చికుంట్ల కథ:

   కళాకారులు ముగ్గురుంటారు. కడప జిల్లాలో ప్రతి సంవత్సరం ఒకసారి రెడ్ల కులగోత్రాలు వారి ఇళ్ళ దగ్గరే గానం చేస్తారు. రెడ్ల కథలు చెబుతారు. కథలో కుంటి మల్లారెడ్డి కథ ప్రధానమైంది.

  3. బుర్ర కథ:

   బుర్రనుపయోగించి చెప్పే కథ బుర్ర కథ అని సులభంగా చెబుతారు. ప్రధాన గుమ్మెట్లు ఉంటాయి. అనేక రకాల కథలు చెబుతారు. ముఖ్యంగా తిమ్మమ్మ కథ, సాసమ్మ సినమ్మ కథ, గుత్తి దుర్గం కథ, దేశింగు రాజు కథ మొదలైనవి. గానంలో అనేక రకాల రాగాలు, వరుసలుంటాయి.

 3. సమష్టి నృత్యాలు (బృంద నృత్యాలు)

  సమష్టిగా అంటే గుంపుగా, పది నుంచి ఇరవైమంది వరకు బృందంగా కలిసి ప్రదర్శించే వాటిని బృంద నృత్యాలు అంటారు.

  1. కోలాటం:

   కోలలతో ఆడే ఆట కోలాట అంటారు. సరిసంఖ్యలో పాల్గొంటారు. గురువు మధ్యలో తాళాలు పట్టుకొని ఉండగా అతని చుట్టూ సుద్దులుంటారు. సుద్దులు తెలుద్దిలో సుద్ది అనే పేర్లు గురువు ...యిరడ తయ్య తద్దిమితా... అంటూ మొదలుపెడతారు. వీటిలోని రకాలు కోపులు అంటారు. రకరకాల కోపులుంటాయి. ప్రార్థన కోపు - సెలగట్టి, నిండు సితారి, మెలుర్ది సితారి, శివకోపు, ముంగారి కోపు, బజారు కోపు, రెడ్డివారి కోపు, ఒక్కో కోపులో ఒక్కో రకమైన పాట పాడుతారు.

   కోలుకోలన్న సెలియా మేలుకోలన్న... అందరి కోలుకోలన్న సెలియా మేలుకోలన్నా... కొలు కొలు కొలే కొలు కొలు కొలే కొలన్న కొల్‌కొలే. కొలుకోలు కొలే కొలన్న కోల్‌ కోలే.

   చివరిగా గురువు తయ్యకు తద్దిమిత... అంటూనే కోలాటాన్ని నిలిపేస్తారు.

  2. కీలుగుర్రం:

   గుర్రంలాగా తయారు చేసుకొని ఒకరు రెండు భుజాలకు తగిలించుకొని తప్పెట దరువుకు అనుగుణంగా గుర్రంలాగా అడుగులు వేయటం కీలుగుర్రం నృత్యం అంటారు. రకరకాల కాగితాలు, వెదురు దబ్బలతో కాళికా రూపు తయారు చేసుకొంటారు. కీలుగుర్రం కథల్లో చెబుతారు.

  3. కుంచెల నృత్యం:

   నెమలి ఈకలతో కుంచెను తయారుచేస్తారు. ఉరుము వాద్యగతికి కుంచెను పట్టుకొని నెమలిలాగా అడుగులు వేయటం కుంచెల నృత్యం అంటారు. ఏకాదశి పండుగనాడు తప్పకుండా ప్రదర్శిస్తారు.

  4. ఉరుములు:

   అనంతపురం, కడప జిల్లా ప్రత్యేక నృత్యం క్రింద వివరించడం జరుగుతుంది.

  5. పండరి భజన:

   పండరిపురంలోని పాండురంగడ్ని భక్తితో స్మరిస్తూ చేసే భజన పండరి భజన. ప్రతి గ్రామంలో పండరి భజన బృందం మూడునెలలు నేర్చుకొని, ఆ పాండురంగని దగ్గరకు వెళ్ళటం, అగ్నిగుండంలో దిగటంతో నృత్యం ముగుస్తుంది. విట్టల్‌ విట్టల్‌ జై జై విట్టల్‌, పాండురంగ పండరినాథ, హరిలో రంగహరి... అంటూ ప్రతి పాటకు అడుగు మధ్యల్లో గురువు ఉంటాడు. రకరకాల పాటలు పాడతారు.

  6. కవ్వాయి కట్టెలు:

   వెదురు శివ్వలు బాగా రంగులు వేసి చివరిలో పిడిబాకు చెక్కి నిమ్మకాయను చెక్కుతారు. ఇరవైమంది కుడిచేత్తో పట్టుకొని తప్పెట దరువుకు అనుగుణంగా బజార్లలో తిరుగుతారు. ఊరేగింపుల్లో ప్రదర్శిస్తారు.

  7. బీరప్ప డోల్లులు:

   బీరప్ప గ్రామ దేవతల్లో ఒకరు. డోల్లు నడుముకు తగిలించుకొని రెండు వైపులా కడతారు. కుడి చేత్తో జానెడు పొడవు కలిగిన కర్ర, ఎడమ చేత్తో కడతారు. రకరకాల విన్యాసాలుంటాయి. పల్టీలు కొడతారు. ఏడాది కొకసారి బీరప్ప పూజలు తప్పకుండా ప్రదర్శిస్తారు.

  8. గొరవకొయ్యలు:

   కర్నూలు జిల్లా ప్రత్యేక నృత్యం క్రింద వివరించటం జరుగుతుంది.

  9. మరగాళ్ళు:

   కాళ్ళకు మరలతో తగిలించి ఎత్తుగా ఉండేలా కట్టుకొంటారు. రకరకాల అడుగులు వేస్తారు. చూడ ముచ్చటగా ఉంటాయి.

  10. తప్పెటగతులు:

   తప్పెటను డప్పు పలక కనుక తప్పెట అంటారు. శుభ, అశుభ కార్యాలకు ఉపయోగిస్తారు. జెగ్‌నకన్‌ అనే వరసల్ని కోపులు అంటారు. దండువారి కోపు (చాటింపు), గుండ కోపు, మదిలి కోపు, సావు కోపు మొదలైనవి.

 4. వీధి నాటకాలు

  వీధిలో ఆడే నాటకాలు వీధి నాటకాలు. వీధి అంటే సందు, గౌరి అంటారు. ఆరుబయలు రంగస్థలం ఏర్పాటు చేసుకొని ప్రదర్శిస్తారు. ముఖ్యంగా బయిలాట, బయలు నాటకం, వీధి నాటకం, చెంచునాటకం అనే పేర్లతో ప్రదర్శిస్తున్నారు. బయల్లో ఆడే ఆట బయిలాట, బయల్లో ఆడే నాటకం బయల్నాటకం. చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి, నరసింహ స్వామి, సింగి, సింగడు పాత్రలతో ప్రదర్శించేది చెంచు నాటకం అని కూడా అంటారు. వీధి నాటకం చిత్తూరు జిల్లా ప్రత్యేక నాటకం క్రింద వివరించడం జరుగుతుంది. ఇటీవల కడప, మైదుకూరు ప్రాంతాల్లో యక్షగానం అనే పేరుతో కూడా ప్రదర్శిస్తున్నారు. నాటకం ప్రక్రియలో ఈ ప్రాంతంలో శివరాత్రి, ఉగాది పండుగలకు ప్రదర్శిస్తారు.

 5. స్త్రీల కళారూపాలు

  జానపద స్త్రీలు ప్రత్యేకంగా ప్రదర్శించే కళారూపాలున్నాయి. ముఖ్యంగా ప్రతి పండుగలో కొన్ని కళారూపాలు ప్రదర్శనయోగ్యంగా ఉన్నాయి. సంక్రాంతి పండుగనాడు గొబ్బి నృత్యం, ఉగాదిరోజు స్త్రీల కోలాటం, జక్కికి జడకోలాటం కళారూపాలు ప్రదర్శిస్తారు.

  1. స్త్రీల కోలాటం:

   స్త్రీలు సరిసంఖ్యలో నేలపై కూర్చొని చేతులతో కుడి ఎడమల అందించుకొంటూ కోలాటమేస్తారు. అరచేతులతో కోలాటమేస్తారు. కోలాటంలో కర్రలు ఉపయోగిస్తారు. అందరు నేలపై చక్కముళ్ళు వేసుకొని కూర్చొని చప్పట్లు చరుస్తూ రకరకాల పాటలు పాడతారు.

  2. జడ కోలాటం:

   జడబిళ్ళను చెక్కతో తయారుచేసి రంధ్రాలు పెట్టి ఒక్కో రంధ్రంలో ఒక తాడును అమర్చుతారు. ఒక్కొక్క స్త్రీ ఒక తాడు ఎడమచేత్తో పట్టుకొని, కుడిచేత్తో కర్రను పట్టుకొని రకరకాల జడలను వేయటం, మరల విప్పటం. ప్రత్యేకంగా స్త్రీలు మాత్రం కొన్ని ప్రాంతాల్లో పాల్గొంటారు. పురుషులు కూడా వేస్తారు.

  3. గొబ్బి నృత్యం:

   సంక్రాంతి పండుగరోజు ఆవుపేడతో గొబ్బెమ్మను బెట్టి గుండ్రాకారంగా నిలబడి చేతులతో లయాత్మకంగా చప్పట్లు చరుస్తూ గొబ్బిల్లో గొబ్బియల్లో అనే ఊతపదంతో పాటలు పాడుతూ నృత్యం చేస్తారు.

  4. తిరగడజక్కి:

   స్త్రీలు రెండు వరుసల్లో నిలబడి గుండ్రాకారంగా లోపలికి బయటికి చేతులతో చప్పట్లు కొడుతూ తిరుగుతూ ప్రదర్శించేది తిరగడజక్కి. పండగల్లో వన భోజనాల్లో తప్పకుండా ప్రదర్శిస్తారు.

 6. జంతువులాటలు

  జానపదులు కొన్నిరకాల జంతువులను, పశుపక్ష్యాదులను మచ్చిక చేసుకొని శిక్షణ ఇచ్చి పొట్టకూటి కోసం ఆటలు ఆడిస్తారు. అలాంటివి ఈవాళ్టికి కొంతమంది కళాకారులు ఊరూరూ తిరుగుతూ ఆటలు ఆడిస్తున్నారు.

  1. కోతులాట:

   కోతులను మచ్చిక చేసుకొని రకరకల విన్యాసాల్ని చేయిస్తూ పొట్ట గడుపుకొంటారు. నడిబజార్లో కోతులతో ఆటల్ని ఆడిస్తూ ఉంటారు.

  2. కోళ్ళపందాలు:

   కోళ్ళు అనేక రకాలు. పుంజుకోళ్ళతో పోటీలు పెట్టుకొంటారు. కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టి ఈ పందాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవల ప్రభుత్వం నిషేధించినా మారుమూల గ్రామాల్లో కోళ్ళ పందాలు జరుగుతున్నాయి.

  3. గంగిరెద్దులాట:

   ఎద్దుల్ని బాగా అలంకరించి, కొన్ని విన్యాసాలు సాధన చేయించి ఆటను ఆడిస్తారు. రెండు ఎద్దులు రామలక్ష్మణుల్లాగా, ఒక ఆవు సీతలాగా ఒక్కొక్కరు ఉండి ఆడిస్తారు. గంగిరెద్దులాటలు మేళం, డోలు, గరుడ స్థంభం ఉంటాయి. మనిషిపై ఎద్దును ఎక్కించుకోవడం, మనిషి చెప్పినట్లు ఎద్దు ఆటలాడడం ప్రత్యేకం. చివరకు సీతారాముల పెళ్ళి జరగడం (ఎద్దు-ఆవు) ఆట ముగుస్తుంది.

  4. గుర్రాలాట:

   గుర్రాలతో అడుగులు వేయించటం. పండరిభజనలోని కొన్ని అడుగులను నేర్పించి ఆడిస్తారు. అంతేగాక రకరకాల విన్యాసాలు, స్వారీలు చేయించడం ముఖ్యం.

  5. పాము-ముంగీసాట:

   పాము ముంగీస బద్ధ శత్రువులు. వాటిని నడిబజార్లో డోలు, బుర్ర డమరుకం వాద్యాలతో పోటీ పెట్టించి రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తారు.

  6. పొట్టేళ్ళ పందాలు:

   పొట్టేళ్ళు బాగా కొమ్ములు తిరిగినవి ఎన్నుకొని వాటితో పోటీలు పెట్టుకొంటారు. పొట్టేళ్ళు వెనక్కి వెళ్ళి బరబరమని తలలతో ఢీ కొంటాయి. జానపదులు ఈ దృశ్యాన్ని చూడముచ్చటగా తిలకిస్తారు.

  7. ఎలుగుబంటి ఆట:

   అడవిలోకి వెళ్ళి ఎలుగుబంటి తెచ్చి కొన్ని విన్యాసాలు నేర్పించి ఆడిస్తారు. పల్టీలు కొట్టించటం, చిన్నపిల్లల్ని ఎక్కించి తిప్పటం. ఎలుగుబంటి వెంట్రుకల్ని చిన్నపిల్లల మొలకు కడితే భయం ఉండదని అంటారు.

 7. బొమ్మలాటలు

  జానపదులు రకరకాల బొమ్మలు చేసుకొని వాటితో అనేక రకాల ఆటలు ఆడిస్తారు. కర్రతో, ఆకులతో బొమ్మలను తయారుచేస్తారు.

  1. చెక్కబొమ్మలాట:

   చెక్కతో అనేక రకాల బొమ్మలను తయారుచేసుకొని పెళ్ళిళ్ళు చేయడం. చిన్నపిల్లలు బాగా ఆడుకోవటం చేస్తారు.

  2. తాటాకుబొమ్మలాట:

   తోలుచర్మంతో భారత, భాగవత, రామాయణ బొమ్మల్ని తయారుచేసి ఆట ఆడతారు. ఆమడెల్లి తోలుబొమ్మలాట చూసేవారు. అరవై ఆమడెల్లి ఆవుల పబ్బం చూసేవారని అంటారు. వాటిలోని హాస్య పాత్రలు జుట్టు పోలిగాడు, బంగారక్కల సన్నివేశం తప్పనిసరిగా చూడాల్సిందే.

 8. ఇతరాలు

  జానపదులు కొన్ని విన్యాసాలు చేస్తారు. వాటిని ఇతరాలు అనే శీర్షిక క్రింద వివరించడం జరుగుతుంది.

  1. కర్రసాము:

   కర్రలతో రకరకాలుగా కొట్టటం, పదిమందితో ఒకరు పోరాడటం ఉంటుంది. ఇద్దరు రెండు కర్రలతో చూడముచ్చట విన్యాసాల్ని ప్రదర్శిస్తారు. నాలుగు మూరలున్న వెదురు కర్రనుపయోగిస్తారు.

  2. పగటి వేషాలు:

   పగటిపూట భారత, భాగవత, రామాయణం పాత్రలు వేసుకొని ప్రదర్శించడాన్ని పగటి వేషాలు అంటారు. కానీ వీధి నాటకాలు తెల్లవార్లు ప్రదర్శించినా తర్వాత ఉదయం గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర కొచ్చి సహాయాన్ని ఆర్థిస్తారు. ఈ రోజుల్లో పగటి వేషాలు నగరాల్లోలాగా ప్రదర్శిస్తున్నారు.

కర్నూలు జిల్లా గొరవయ్యలు

మహిమల్లాసురులు అనే రాక్షసుల్ని సంహరించడానికి శివుడు ఎత్తిన అవతారమే గొరవయ్య. తలపై ఎలుగుబంటి చర్మం కిరీటంలాగా, నడుముకు బండారు తిత్తి, మెడలో గవ్వలదండ, నిలువు అంగీ కంబడి, కుడిచేతిలో ఢమరుకం, ఎడమచేతిలో పిల్లనగ్రోవి ఉంటాయి. శ్రీశైల మల్లికార్జునుని మీద అనేక రకాల గేయాలు పాడతారు. జిల్లాలో గట్టు మల్లయ్య కొండ దగ్గర దసరా పండుగనాడు జరుగుతుంది. ఆలూరు మండలంలోని దేవరగట్టం దగ్గర ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. కురుబ కులంలో ఒకరు వంశానికి తప్పనిసరిగా గొరవయ్యగా మారతారు. గొరవయ్య పాటలు పాడుతూ నృత్యం చేస్తారు.

కడప జిల్లా చెక్కభజన

భజన అనేక రకాలు. రాం భజన, హరి భజన, తాళ భజన, సమతాళ భజన, పండరి భజన, చెక్క భజన. చెక్కలతో చేసేది చెక్కభజన. రామాయణ, భాగవత, భారత సంబంధ గేయాలు పాడతారు. అనేకరకాల జానపద గేయాలు పాడతారు. ఈ భజన శ్రీరామ లీలలు, శ్రీకృష్ణ లీలలు, జడకోపులు ప్రదర్శిస్తారు. వీటిలోని రకాల్ని అడుగులు అంటారు. ఆది అడుగు, కుప్ప అడుగు, పోటు, బేరి, పద్మవ్యూహం, పర్ణశాల అనే పేర్లుంటాయి. గురువు మొదటిగా శ్రీమద్‌ రమారమణ గోవిందో హరి గోవిందా... అంటూ గణేశ్వర ప్రార్థనతో ఆది అడుగులో భజన ప్రారంభిస్తారు.

చిత్తూరు జిల్లా వీధి నాటకం

చిత్తూరు జిల్లాలో వీధినాటకం ప్రత్యేక జానపద కళారూపం. రాష్ట్రంలో వీధి నాటకాన్ని బయిలాట, బయిల్నాటకం, వీధి భాగవతం, చిందు భాగవతం, యానాది భాగవతం, నక్కల భాగవతం, జేగంట భాగవతం, చెంచు నాటకం, యక్షగానం, చిరతల రామాయణం, తూర్పు భాగవతం అనే పేర్లతో ప్రదర్శిస్తున్నారు. కానీ చిత్తూరు జిల్లాలో కుప్పం వీధినాటక సంప్రదాయం ప్రత్యేకమైంది. మహాభారతం వీధి నాటకాలుగా ఈనాటికీ తమదైన శైలిలో ప్రతి ఏడాది 18 పర్వాలు, 18 రోజులు సంప్రదాయబద్ధంగా ప్రదర్శనలు ఇస్తారు.

అనంతపురం జిల్లా ఉరుములు

ఉరుము చర్మవాద్యం. మాలకులం వారు, గంగమ్మ అక్కదేవతల దగ్గర పూజారికి పూనకం తెప్పించడానికి ఉరుము వాద్యాన్ని వాయిస్తారు. ఆకాశంలో ఉరిమే మేఘ గర్జనను పోలి ఉంటుంది. అడవిలో నెమలి నృత్యం చేస్తుంది. ఇది ప్రకృతి సహజం. అలాగే జానపదులు ఉరుము అనే వాద్యాన్ని తయారుచేసుకొని (నెమలిలాగా) నృత్యం చేస్తారు. ఉరుము వాద్యంపై కుడిచేతిపై పుల్లతో డప్‌డప్‌ అనే గతి, ఎడమచేతి పుల్లతో బూర్‌బూర్‌ అనే శబ్దాన్ని పుట్టిస్తారు. ప్రతి మంగళవారం గ్రామడావతం దగ్గర వాద్యాన్ని కొడతారు. కళాకారులు తలకు రుమాలు, నిలువుటంగీ, పంచె కడతారు. నియమనిష్టలతో ఉంటారు. కల్లు సారాయి తాగుతారు. కాళ్ళకు చెప్పులుండవు. ఈత చాపలు వాడతారు. ఈతకాయలు తినరు. ఇంటిలో అంటు ముట్టు ఉంటే గుడి దగ్గరకు వెళ్ళరు. ప్రతి మంగళవారం, సోమవారం రోజుల్లో గంగమ్మ అక్క దేవతలు వీర నారాయణస్వామి దేవతలకు కొలువు చేస్తారు. పరాకు పాట, మేలుకొలుపు గేయాలు, మంగళం పాటలు పాడతారు.

ఆధునిక కాలంలో కళారూపాలు

ఆధునిక కాలంలో రాయలసీమ జానపద కళలకు అత్యంత ఆదరణ లభిస్తోంది. ప్రతి పండుగ సమయంలో ఈ కళారూపం ప్రదర్శింపబడుతోంది. అంతేగాక అడుగంటి పోతున్న భజన సంప్రదాయాల్ని భావితరాల వారికి అందించాలనే కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలోని ధర్మ ప్రచార పరిషత్‌వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు కళాకారులకు కొంత జీవనోపాధి లభిస్తోంది. ఎందుకంటే భజనలు రాంభజన, కాంభజన, తాళభజన, సప్తతాళ భజన, కోలాటభజన, కులుకు భజన, చెక్కభజన, పలకల భజన, చిరతల భజన, పండం భజన మొదలగువాటిని ఆయా గ్రామాల్లోని రామాలయంలో ప్రతిరోజు పై భజనలు తప్పని సరిగా ప్రదర్శించేలా చూస్తున్నారు.

ఈ కళారూపాలు వర్షాలు రాని సమయంలో పశువులకు, మనుషులకు రోగాలు సోకినపుడు ప్రదర్శించే వారు. కాని ఈనాడు ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు బాగా వాడుకొంటున్నారు. వాటిలో ప్రతి జిల్లా స్థాయిలో జిల్లా పౌరసంబంధాల శాఖవారు, ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వ్యవహారాల వారు, శిల్పారామంలో, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్ర సారస్వత పరిషత్‌, చలన చిత్రాలలో కూడా ఈ కళారూపాలను వాడుకొంటున్నారు.

ప్రభుత్వం వారు ముఖ్యంగా ఆకాశవాణి, దూరదర్శన్‌ల నియమాల ప్రకారం జానపద సంగీతం, కళారూపాల కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం వారు ఇటీవల కాలంలో ప్రచారం నిమిత్తం అన్ని రాజకీయ పార్టీలవారు కళారూపాలు ఉపయోగించుకొంటున్నారు.

తానా వారు ప్రతి రెండేళ్ళకొకసారి ఉత్సవాలు జరపటం కళాకారులకు వరం. భజన సంప్రదాయాన్ని అడుగంటిపోకుండా కాపాడవలసిన బాధ్యత మనందరిది.

ఈ తరంవారు ముందు తరాల వారికి అందించే వరాలు జానపద కళారూపాలు.


చిగిచెర్ల కృష్ణారెడ్డి జానపద కళలపై, ముఖ్యంగా రాయలసీమ కళారూపాలపైన విస్తృతంగా పరిశోధనలు చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళల శాఖాధిపతిగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. తానా నిర్వహించిన జానపద కళోత్సవాలకు ఎంతగానో సహకరించారు.


ఈ వ్యాసము చైతన్య స్రవంతి - తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 లోనిది. ఆ కార్యక్రమాల వివరాలను ఇక్కడ చూడగలరు. దీనిని ఇక్కడ ఉంచుటకు అనుమతినిచ్చిన TANA వారికి, జంపాల చౌదరిగారికి మా కృతజ్ఞతలు. దీనికి మాకు తోడ్పడిన వాసిరెడ్డి నవీన్‌గారికి, సీత(అక్షర క్రియేషన్స్‌)గారికి మా కృతజ్ఞతలు.


AndhraBharati - AMdhra bhArati - rAyalasIma kaLArUpAlu : AchArya chigicherla kR^iShNAreDDi - Chigicherla Krishna Reddy - Chigicherla Krishnareddy - TANA 2006 Chaitanyasravanti - telugu vachana sAhityamu - vyAsamulu ( telugu andhra )