వచన సాహిత్యము వ్యాసములు తొలి జానపద కళారూపం - కొరవంజి

తొలి జానపద కళారూపం - కొరవంజి : చిట్టినేని శివకోటేశ్వరరావు

చైతన్య స్రవంతి
తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 నుంచి
TANAవారి సౌజన్యంతో.

తెలిసినంతలో తెలుగువారి మొదటి జానపద కళారూపం కొరవంజి. ఈ విషయాన్ని దృశ్య కళారూపాల మీద పరిశోధించిన చాలామంది పెద్దలు ఋజువు చేశారు. దీన్ని కుఱవంజి అని కూడా ఉచ్చరిస్తున్నారు. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఈ పదం నుంచే యక్షగానం అనే పదం ఉత్పన్నమైందని చెప్పారు. కుఱవంజి అంటే కొరవజాతి స్త్రీ (ఎఱుకది) అని సూర్యారాయాంధ్ర నిఘంటువు చెబుతుంది. కొరవంజి అను పాత్ర ప్రవేశము గల యక్షగాన రచనకు కొరవంజి అనిపేరు అని ఆంధ్ర వాఙ్మయ సూచిక చెబుతుంది. వంజి అంటే తమిళభాషలో స్త్రీ అని అర్థం. దక్షిణదేశంలో కొరవలుగా చెప్పబడుతున్న జాతిని తెలుగునాట ఎరుకలు అని పిలుస్తారు. అక్కడా ఇక్కడా ఈ జాతి స్త్రీ ఎరుక చెప్పడం ఉంది. దీనిని బట్టే ఈ జాతి ఎరుకలుగా పిలువబడుతున్నారు. వీరి వేషంలో చోటు చేసుకొన్న రకరకాల చర్మాలు, నెమలి ఈకలు, ప్రతి గోళ్ళు వంటి వస్తువులతో వీరిని మొదట ఆటవికులై ఉండవచ్చని భావించవచ్చు.

ఈ కళారూపాన్ని గూర్చి శిలప్పదిగారంలో కురవైక్కూత్తు అని నృత్యవిశేషంగా చెప్పారు. అంటే ఈ కళారూపం ఎంత ప్రాచీనమైందో చెప్పవచ్చు. శిలప్పదిగారం క్రీ.శ. 2వ శతాబ్దం కాలం నాటిదని (దీక్షితులు వి.ఆర్‌.ఆర్‌.) పెద్దలు చెప్పారు. తమిళ దేశంలో కొండజాతి స్త్రీలు (కొరవలు) సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని కొలుస్తూ చేసే నృత్యం ఒకటి, కొరవ స్త్రీలు శ్రీకృష్ణుని కొలుస్తూ (రాసలీల) చేసే నృత్యం మరొకటి ప్రచారంలో ఉండేవని తెలుస్తుంది. మద్రాసు విశ్వవిద్యాలయ తమిళ నిఘంటువు కూడ కురవ అంటే ఒక నాట్య విశేషంగా చెప్పింది. అది మండల నృత్యంగా ఉండేదని ఉదహరించింది. తరువాతి కాలంలో తమిళంలో కొరవంజి పేరునే కొన్ని రచనలు వచ్చాయి. ఇప్పటికీ జానపద ప్రదర్శనలు వారు ప్రదర్శిస్తూనే ఉన్నారు.

తెలుగులో కొరవంజి శబ్దం మొదట వాడినవారు అయ్యలరాజు రామభద్రకవి. రామాభ్యుదయం ద్వితీయాశ్వాసంలో 131వ పద్యంలో,

అణునిభ మధ్యలాక్రియలు నాపరిభాషలు నొప్పఁజిందు జ
క్కిణి కొరవంజి మేళములఁ గేళిక సల్పిరి దేవతా నటీ
మణులకు బొమ్మువెట్లు క్రియ మర్దళతాళ నినాద పద్ధతిన్‌
రణదురు రత్ననూపుర ఝణం ఝణముల్‌ మెఱయం బదాహతిన్‌

అని కొరవంజి ప్రస్తావన చేశాడు. అంటే విజయనగర రాజుల కాలంలో దక్షిణాది అన్ని ప్రాంతాల్లోనూ ఈ కళారూపం విశేష ప్రచారంలో ఉండేదని చెప్పవచ్చు. అంతే కాదు యక్షగానంతో సమానమైన స్థానం ఈ కళారూపానికిచ్చి పోషించారని కూడా భావించవచ్చు.

కాలక్రమేణ కొరవంజి కళారూపానికి ఆదరణ అంతంత మాత్రం అయిపోయింది. కళారూపంలోనికి ప్రధాన పాత్రలు సింగి, సింగడు మాత్రం మిగిలాయి. ఎరుక చెప్పడం, అదే జీవనోపాధిగా ఎరుకలు స్వీకరించడం జరిగింది. ఒక విధంగా ఈ రెండు పాత్రలు కొరవంజి ఆటకు సూత్రధారులై నడిపేవి. యక్షగానంలోని నటి/నటుడు లేదా, సూత్రధారుడులాగా కొరవంజి ఆటకు అన్నీ తాము అయి నడిపిన సింగి - సింగడు జీవితానికే ఆధారమయ్యాయి. ఆ కళారూపం లేకపోయినా వివిధ యక్షగానాల్లో, నాటకాల్లో, కావ్యాల్లో సింగి (ఎరుక) పాత్ర చోటు చేసుకొంది. అయినా ఆమె వేషంలో మాత్రం వ్యత్యాసం లేదు.

శుకసప్తతి రాసిన తాడిగోళ్ళ కదిరీపతి ఒక రాజుగారిని దర్శింప వచ్చిన కొరవంజిని చూచి వర్ణించాడు.

ఇరుకు వలి గుబ్బ చన్ను
ఎరుకుంజవరాలొకర్తె యెఱుకో యవ్వా,
ఎరుకోయని తన చందం
బెరుకవడంగా హజార మెలమిం గిదిసెన్‌

ఇది విని ఆ రాజు తన కొలువుకు పిలువగా ఎరుకత వేషధారణ వర్ణించారు.

సవరని వని వన్నె ఱవిక పిక్కటిలంగ - గులుకు పొలుబ్చు గుబ్బలు చెలంగ
ముంజేతులను ముఖాంబుజమున నొక వింత - పొలుపు దెల్పెడు పచ్చబొట్టు లెసగ
గురుమావు పయ్యెంట చెరగులో నిడుకొన్న - ముద్దుబల్కుల చిన్నిబుడుత డమర
దరతరంబుల నుండి తమ యింట వెలయు పు - త్తడి పైడి బుట్ట మస్తమున వెలుగ
బోముల సందున నామంబు భూతి పూత - నెన్నొసట, బుక్కిట విడెంబు, కన్ను గొనల
కాటుక రహింప వచ్చి యీ క్ష్మాతలేంద్రు - చరణముల కోరగా వచ్చి చక్క నిలిచి

ఈ వేషధారణ ఇప్పటికీ ఎరుకసానికి ఉంది. వీరి విద్యలు లోకప్రసిద్ధాలు. స్తంభన, వశీకరణ, ఆకర్షణ, ఉచ్ఛాటన, విద్వేషణ, వ్యోమగమన, పరకాయ ప్రవేశాది, విద్య లెరుంగగునే యవ్వా! అశ్వలక్షణ, గజలక్షణ, రత్నలక్షణ, స్త్రీలక్షణ, పురుష లక్షణ, సాముద్రిక లక్షణంబలెరుంగుదునే యవ్వా! అని ఎరుకసాని తనకు తెలిసిన విద్యలు చెబుతుంది. ఇన్ని విద్యలు తెలిసిన పాత్ర గనుకనే చాలా నాటకాల్లో, యక్షగానాల్లో ఈ పాత్ర దూతిక అయింది. శ్రీ వేంకటేశ్వరస్వామి పద్మావతీ అమ్మవారితో సంధాన సందర్భంలో స్వామి ఎరుక వేషాన్ని ధరించడం తెలిసిందే గదా!

తంజావూరు విజయరాఘవ నాయకుని రఘునాధ నాయకాభ్యుదయము, ప్రహ్లాద చరిత్రల యందు ఈ కొరవంజి ప్రస్తావన ఉంది. ఆ మహారాజు అంకితం పుచ్చుకొన్న మన్నారుదాస విలాసం, విజయరాఘవ చంద్రికా విహారం, విజయరాఘవ కళ్యాణం యక్షగానాల్లో ఎరుక ఘట్టం ఉంది. జీవ కొరవంజి, జ్ఞాన కొరవంజి, రాగ మోహన కొరవంజి, సత్యభామ కొరవంజి, ఎరుకల కొరవంజి మొదలైనవి తెలుగునాట వెనకటి రోజుల్లో ప్రదర్శించినట్లు తెలుస్తుంది. అలాగే తమిళంలో మిన్నల్‌ కొరవంజి, అగత్తియార్‌ కొరవంజి, గరుడ కొరవంజి, పిళ్ళయార్‌ కొరవంజి, కుమార కొరవంజి, బాలాజీ కొరవంజి వంటి ఎన్నో రూపాలు ప్రచారంలో ఉన్నాయి. ఈమధ్య ఆధునికులు బెతల్‌హామ్‌ కొరవంజి, మదీనా కొరవంజి, లెనిన్‌ కొరవంజి పేర్లతో ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది.

సోది సెబతానమ్మ సోది అంటూ దారి వెంట కేక వేసే ఎరుకతని ఒక దశాబ్దం క్రితం దాకా అందరం చూచే ఉంటాం. ఈ వ్యాసంలో కొన్ని దరువులు ఉదహరిస్తాను.

విజయరాఘవ కల్యాణంలో కొరవంజి దరువు కొరవంజి వారి వేషభాషలు చెబుతుంది. త్రిపుట తాళంలో, మాళవికా తాళంలో సాగే ఈ దరువు ఎంతో లయాత్మకంగా సాగింది.

జింక పొక్కిటి యసటదీరిన
     చిన్ని తిలకము మించగా
సంకు కడెములు నూరు వజ్రపు
     సంది దండలు మెరయగా

వచ్చె నెరుకత వచ్చెన్‌ తా
వచ్చె నెరుకత వచ్చెన్‌

ఆరజముగా నెరుక వోసిన
     సోదిది చీర చెరంకులు
నీరజాకర ఊరు భరములు
     నిండుగా పొంగాడగా

వచ్చె నెరుకత వచ్చెన్‌ తా
వచ్చె నెరుకత వచ్చెన్‌

గుబ్బ చన్నుల మీద జేర్చిన
     గోవ కెంపులు పేరులు
గుబ్బిగా గురిగింజ పూసల
     కంటసరులై మించగా

వచ్చె నెరుకత వచ్చెన్‌ తా
వచ్చె నెరుకత వచ్చెన్‌

అలాగే మన్నారుదాస విలాసంలో ఎరుకత సోదిని గద్దె అని సంబోధించారు. ఇది వచనాన్నే ఒక విధమైన కూనిరాగపు ఒడుపుతో చదువుతారు. ఇందులో ఒక ఆకర్షణీయమైన లయ గోచరిస్తుంది.

యెరఖాడు గెరుఖాడు గెరుఖాడు గెదుండి,
నీవు తలంచిన తలంపు నీవు తలంచిన తలంపు
నిజముగా సెప్పేన్‌... నిజముగా సెప్పేన్‌...
............................................................

అమ్మమాయమ్మ, అమ్మమాయమ్మ
చెయి చూపు మాయమ్మ చెయి చూపవమ్మ
చెయి చూపు దుండిదనము గల చెయ్యి
చెయ్యి గొప్పది తల్లి దానమిచ్చే చెయ్యి
ధర్మమిచ్చే చెయ్యి దండగల నీ చేయి
దానమిచ్చే చెయ్యి బంగారు నీ చేయి
...................................................

చెయ్యంటే దుండి. కళ్ళంటే తోడు
కడుపంటే కొడుకు కంఠంబు మగడు
నుదురు నీ తలరాత నొసలు నీ సఖులు

ఇలా లయాత్మకంగా, రాగాత్మకంగా, నృత్యాత్మకంగా సాగే ఈ కొరవంజి కళారూపం నేడు పూర్తిగా మరుగైంది. ఇలాంటి కళారూపం జనాదరణలో ఉంటే ఎందరు కళాకారులుండేవారో!

ఒక కొరవంజి కళారూపమే కాదు, జానపద కళారూపాలన్నీ కల్పనకు అతీతమైనవి. వాస్తవిక సమాజము నుండి పుట్టినవి. ప్రజా సమస్యలను స్పృశిస్తూనే ప్రజలకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ చైతన్యవంతుల్ని చేసే ప్రత్యక్ష కళారూపాలు. ఈ కళారూపాలు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు మిగిలి ఉన్న, మూలనపడి ఉన్న ప్రతీకలు. వీటిని కాపాడుకోవటమంటే మన సంస్కృతిని కాపాడుకోవడమే. ఇది మనందరి కర్తవ్యం.


చిట్టినేని శివకోటేశ్వరరావు గుంటూరులో సాంస్కృతిక రంగానికి కేంద్ర బిందువు. థియేటర్‌ ఆర్ట్స్‌లో, అభినయంలో డిగ్రీ చేసిన వీరు వివిధ నాటక పోటీలు నిర్వహించడమే కాకుండా స్వతహాగా ప్రయోక్త, నటుడు. గుంటూరు వికాస విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారు. తానా నిర్వహించిన ఈ జానపద కళోత్సవాన్ని ఒక్క చేతి మీదుగా నిర్వహించారు.


ఈ వ్యాసము చైతన్య స్రవంతి - తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 లోనిది. ఆ కార్యక్రమాల వివరాలను ఇక్కడ చూడగలరు. దీనిని ఇక్కడ ఉంచుటకు అనుమతినిచ్చిన TANA వారికి, జంపాల చౌదరిగారికి మా కృతజ్ఞతలు. దీనికి మాకు తోడ్పడిన వాసిరెడ్డి నవీన్‌గారికి, సీత(అక్షర క్రియేషన్స్‌)గారికి మా కృతజ్ఞతలు.


AndhraBharati - AMdhra bhArati - toli jAnapada kaLArUpaM - koravaMji : chiTTinEni SivakOTESvararAvu - Koravanji - Chittineni Sivakoteswararao Chittineni Siva Koteswara Rao - TANA 2006 Chaitanyasravanti - telugu vachana sAhityamu - vyAsamulu ( telugu andhra )