వచన సాహిత్యము వ్యాసములు తెలంగాణా కళారూపాలు - ఒక విహంగ వీక్షణం

తెలంగాణా కళారూపాలు - ఒక విహంగ వీక్షణం : ఎన్‌. భక్తవత్సల రెడ్డి

చైతన్య స్రవంతి
తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 నుంచి
TANAవారి సౌజన్యంతో.

తెలంగాణా వైవిధ్యభరితమయిన జానపద కళారూపాలకు మారుపేరు. తరతరాలుగా కళాప్రదర్శనే తమ వృత్తిగా స్వీకరించి జీవనం సాగిస్తున్న కళాకారులు ఇక్కడ అధికంగా ఉన్నారు. త్యాగం తీసుకొనే మీరాశిహక్కు కల్గిన కళాకారులు వీరు. త్యాగం తీసుకొన్నాక కళా ప్రదర్శనలు ఇస్తారు. అలాగే త్యాగం సంప్రదాయం లేని వృత్తి కళాకారులూ ఉన్నారు. ఔత్సాహిక కళాకారుల ప్రదర్శనలూ ఉన్నాయి. గిరిజన కళారూపాలూ పుష్కలంగానే ఉన్నాయి.

వృత్తికళాకారులు ప్రదర్శించే కళారూపాలు సాధారణంగా కులపురాణాల మీద ఉంటాయి.

నేటి ప్రసార, ప్రచార మాధ్యమాల పోటీవల్ల జానపద కళాకారులు, కళారూపాలు కనుమరుగయి పోతాయేమోనన్న భయం ఒకప్పుడు ఉండేది. కానీ నేడు అది కేవలం భ్రమ అని తేలిపోయింది. పదేండ్ల ముందర యువతరానికి అంతగా ఇష్టం లేని సంప్రదాయ కళారూపాలు ప్రస్తుతం ఇష్టభరితమని సర్వేలు చెప్తున్నాయి. ప్రభుత్వం తన పథకాలని, తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి సంప్రదాయాన్ని, రాజకీయ, సాంస్కృతిక భావజాలాన్ని ప్రజల దగ్గరికి తీసుకపోవడానికి నేడు జానపద కళారూపాల్నే ప్రచార సాధనాలుగా చేసుకొన్నాయి. ఈ క్రమంలో మారుతున్న సమాజ పరిస్ధితులకు అనుగుణంగా సంప్రదాయ కళారూపాలు కూడా మారుతున్నాయి. ఈ మార్పు ప్రదర్శనకు సంబంధించిన వస్తువు, దుస్తులు, ఆభరణాలు, ప్రదర్శనా విధానం, రంగస్థల వేదికలతో పాటు ప్రేక్షకులు, కళాకారులలో కూడా కనబడుతుంది. కనుమరుగయి పోతాయనుకొన్న కొన్ని కళారూపాలు బలం పుంజుకొని గత వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేసి ప్రోత్సాహం కల్గిస్తున్నాయి. మరికొన్ని కళారూపాలు ప్రదర్శనలో మార్పు తీసుకొచ్చినాయి. అందులో ప్రత్యేకంగా తెలంగాణాకే పరిమితమయిన పటం కథా సంప్రదాయంలో ఇది స్పష్టంగా కనబడుతుంది. డప్పు విన్యాసం, లంబాడ నృత్యం లాంటివి కళారూపాలుగా మారి ప్రదర్శన రూపాలయినాయి.

తెలంగాణాలో బహుళ ప్రచారంలో ఉన్న కళారూపాలలో కొన్నిటిని కింద పేర్కొనడం జరిగింది. వీటిలో కొన్ని కథాగాన సంప్రదాయానికి, నాటక సంప్రదాయానికి చెందితే, మరికొన్ని ఇంద్రజాల విద్యకు ఆలవాలం. ఇంకా తోలుబొమ్మలాటలు, కొయ్యబొమ్మలాటలు, బాలసంతులు, శివసత్తులు, రాజన్నలులాంటి ఎన్నో కళారూపాలు కనువిందు చేస్తాయి.

గత ఆరేండ్లుగా, రెండు సంవత్సరాలకొకసారి రాష్ట్ర స్థాయి జానపద కళోత్సవాలని నిర్వహించి, జానపద కళారూపాల వైవిధ్యాన్ని, వైభవాన్ని ఈనాటి తరానికి పరిచయం చేస్తూ జానపద కళాకారుల్ని ప్రోత్సహించి ఆదుకొంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం - తానా - వారు ఎంతయినా అభినందనీయులు.

కాటిపాపలు

కాష్టం / కాడులో పాపలాగా పడుకుంటారు కాబట్టి వీరికి కాటిపాపలు అని పేరు వచ్చింది. వీళ్లు బుడిగె జంగం కులంలో ఒక శాఖ వారు. వీళ్లు ఏ కులం వారు చనిపోయినా శవ సంస్కార సమయంలో ఇద్దరు లేక ముగ్గురు పురుషులు ఒక బృందంగా శవం ముందు నడుస్తూ, చనిపోయిన వ్యక్తి గుణ గణాలను, గొప్పదనాన్ని రాజులతో పోల్చి పాట రూపంలో పాడుతారు. ఒకరు పాట పాడితే, మిగిలిన ఇద్దరు రామ రామ అని వంత పాడుతూ కర్రతో చేసిన గంటను వాయించుకుంటూ వెళతారు. వీళ్లు శవం బయలుదేరినప్పుటి నుండి ఖననం/దహనం చేసేంత వరకు శవం వెంటే ఉంటారు. శవం పాడెపైన పెట్టే ముందు వీళ్లు పాడె పైన పడుకుంటారు. అదే విధంగా పదవ రోజు బూడిద ఎత్తే ముందు కాష్టంలో పండుకొని వీరు అడిగినంత డబ్బు ఇచ్చినట్లైతేనే లేస్తారు. లేకపోతే బూడిద ఎత్తనీయరు. అదేవిధంగా పిండం పెట్టేటప్పుడు అడిగిన సంభావన ఇవ్వకపోతే పిట్టను ముట్టనీయకుండా తరుముతూ పీడించి మరీ సంభావనలు గుంజుతుంటారు. వీళ్లు మిగతా సమయాల్లో అడుక్కుంటారు. శికారి (వేట) చేస్తారు. ఆడవాళ్లు ఈత చాపలు అల్లుతారు లేదా కూలీ చేస్తారు.

గుస్సాడి

దేవుడికి ప్రతిరూపం గుస్సాడి. గోండులు దివాడి నెలలో దీపావళి పండుగకు ముందు రోజు భోగినాడు గుస్సాడీలుగా మారుతారు. సంప్రదాయంగా ఎవరైతే గుస్సాడీలు అయినారో వారే గుస్సాడీలు అవుతారు. ఎనిమిది రోజులపాటు నియమ నిష్టలతో గూడెంలో ఉదయం, సాయంత్రం ఇంటింటికి తిరుగుతారు. గుస్సాడి టోపి, పొట్టేలు కొమ్ము, గోగునారతో చేసిన గడ్డాలు, మీసాలు, జింక చర్మం, జోరి సంచి, పూసల దండ, గుస్సాడి రోకలి, లంగోటీలు గుస్సాడి వేషానికి ప్రధానమైనవి. ఇందులో పర్రా పెట్టె, డోలక్‌, డోల్కి, మద్దెల, తాళాలు, కొమ్మువాద్యాలు ఉంటాయి. ఎనిమిది రోజులు పవిత్రంగా గుస్సాడీలను ఆరాధించడం గోండుల కర్తవ్యం.

ఒగ్గుకథ

శివుని ఢమరుకాన్ని పోలిన జగ్గు/ఒగ్గు వాద్యాన్ని వాయిస్తూ చెప్పే కథను ఒగ్గు కథ అంటారు. ఈ కథను చెప్పే వాళ్ళని ఒగ్గువాళ్లు అంటారు. వీరు గొల్ల/కురుమ కులానికి ఉపకులస్ధులు. వీరు గొల్లవాళ్ళు చేసుకునే బీరన్న పండుగకు పూజారులుగా ఉంటారు. వీరు అన్ని కాలాలలో కుల ప్రసక్తి లేకుండా అందరికి కథలు చెపుతారు. పండుగలు, పెండ్లిళ్లు, చావులు, దినాలు, మాసికాలు మొదలైన సందర్భాలలో వీరు కథలు చెపుతుంటారు. సంక్రాంతికి నెలముందు నుండి సంక్రాంతి వరకు, శివరాత్రి నుండి దసరా వరకు పట్నాలు వేసి కథలు చెపుతారు. పట్నాలు వేసి కథ చెప్పడాన్ని సట్టి పండుగ అంటారు.

బీరన్న, మల్లన్న, ఎల్లమ్మ మొదలైన దేవతలకు పూస పలక, చక్రాల పలక అనే రెండు రకాల పలకలతో పట్నాలు వేస్తారు. ఈ పలకలు కొయ్యతో, చతురస్రాకారంలో, దీర్ఘ చతురస్రాకారంలో చేయబడి అందులో పూసల డిజైన్‌, చక్రాల డిజైన్‌ చెక్కబడి ఉంటుంది. ఈ పలకలలో చతురస్రాకారంలో పసుపు, కుంకుమ, తెల్లపిండి, పచ్చ (తంగేడు ఆకు ఎండబెట్టి చేసిన పొడి) మొదలైన రంగులతో పట్నాలు వేస్తారు. ఐదుగురు పురుషులు ఒక జట్టుగా ఉండి, ఒకరు ప్రధాన కథకుడు, ఇంకొకరు కథా సహాయకుడు, మిగిలిన ముగ్గురు వాద్యాలు వాయిస్తూ కథ చెపుతారు. వీరు వాయించే వాద్యాలు డోలు, తాళాలు, ఒగ్గు, కనకడప్పు, కంజరి. ఒగ్గు వాద్యాన్ని బీరన్న, ఎల్లమ్మ పండుగలప్పుడు, పట్నాలు వేసినప్పుడు వాయిస్తారు. కనకడప్పు అప్పుడప్పుడు వాయిస్తారు. ఇటీవల కంజరి కూడా వాయిస్తున్నారు. వీరు చెప్పే కథలు మల్లన్న కథ, బీరన్న కథ, ఎల్లమ్మ కథ, కాటమరాజు కథ, పెద్దిరాజు కథ, సువర్ణ సుందరి కథ, ఐదు మల్లెల కథ, మాంధాత చక్రవర్తి కథ, భూనాంచారి కథ, సుమిత్ర మహారాజు, హరిశ్చంద్ర, లవంగ మహారాజు, సారంగధర, భయ్యమ్మ కథ, నలువరాజు, కనకతార, గిరిజావతి, కీలుగుర్రం, మన్మథరాజు, లింగ మహారాజు, నల్లపోచమ్మ కథ, బాలనాగమ్మ, చిరుతొండ మహారాజు, అమెరికా రాజు కథ, నల మహారాజు కథ, అల్లిరాణి కథ, కాంభోజ రాజు కథ, మార్కండేయ పురాణం, మండోదరి కథ మొదలైనవి. వీరు ఈ కథలు కొన్ని తాత తండ్రుల నుండి మరికొన్ని ఇతరుల నుండి నేర్చుకుంటారు. ఇందులో కొన్ని కథలు ఐదు రోజులు, కొన్ని ఏడు రోజులు, కొన్ని పదిహేను రోజులు చెపుతారు. ఇంటి ఆవరణలో గాని, విశాలంగా ఉన్న దొడ్డిలో గాని, నాలుగు రోడ్ల కూడలిలో గాని చాపలు లేదా బల్లలు వేసుకొని కథలు చెపుతారు. వాద్యగాండ్లు కొంచెం వెనుకగా వేసుకొని కూర్చుంటారు. ప్రధాన కథకుడు తలకు రుమాలు చుట్టుకొని, చేతిలో కర్ర పట్టుకుంటాడు. సహ కథకుడు కథలో పాత్ర అవసరాన్ని బట్టి స్త్రీ వేషం వేసుకుంటాడు. స్త్రీ వేషానికి కావలసిన వస్త్రాలు, ఆభరణాలు ఆడవాళ్లని అడిగి తెచ్చుకుంటారు. కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. ప్రదర్శన గంగ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. గణపతిని, నాగన్నను, గ్రామదేవతను ప్రార్థిస్తారు. కొబ్బరికాయ కొట్టి, ఊది బత్తీలు వెలిగించి డోలుకు గుచ్చుతారు. కథను రాత్రి ఏడు లేదా ఎనిమిది గంటలకు మొదలుపెట్టి తెల్లవారుఝాము వరకు చెపుతారు. మంగళంతో కథ ముగించి, ప్రేక్షకుల నుండి ఒసుగులు (చిల్లరపైసలు) అడుక్కుంటారు.

సాధనాసూరులు

నిష్టతో సాధన చేసి, కనికట్టు లేదా ఇంద్రజాల ప్రదర్శనతో ప్రేక్షకుల్ని దిగ్భ్రాంతుల్ని చేసేవారిని సాధనాసూరులు అంటారు. వీరు పద్మశాలి కులస్థులే. అయినప్పటికీ పద్మశాలి కులస్థులకు ఆశ్రితకులంగా ఉంటూ, వారి అనుమతితో ప్రదర్శనలు ఇస్తారు. వీరు ఆరుగురు పురుషులే. వీరు ఒక జట్టుగా ఉండి ఊరూరు తిరుగుతూ దాదాపు సంవత్సరమంతా ప్రదర్శనలు ఇస్తారు. ఒక్కొక్క ఊరిలో ఐదు లేక ఆరురోజులు ఉంటారు. వీరి ప్రదర్శనలు గ్రామకూడలిలో ఉన్న విశాల ప్రదేశములో పగలే జరుగుతాయి. ప్రత్యేకంగా వేషధారణ ఉండదు. వీరిచ్చే ప్రదర్శనలో కొన్ని విద్యలు అగ్నిస్థంభన, జలస్థంభన, వాయుస్థంభన.

అగ్నిస్థంభన: తల మీద కుదురులాంటి దాన్ని పెట్టి దానిపై మంటపెట్టి, మూకుడులో అప్పాలు చేస్తారు.

జలస్థంభన: నీళ్ళు తాగి చెవులనుండి, ముక్కులనుండి నీళ్ళు బయటికి తెప్పిస్తారు.

వాయుస్థంభన: ఊపిరి బిగబట్టి గాలిలో తేలుతారు.

ఇవేకాక నాలుగు గుంజలు పాతి అందులో ఒక గుంజకు మనిషిని తాళ్ళతో బంధించి, చుట్టూ తెర కడతారు. తెర తీయగానే మనిషి ఇంకో గుంజ వద్ద కనిపించడం, ఒక వ్యక్తి రొమ్ముపై బండను పెట్టి, సుత్తితో పగులగొట్టడం, బెండు పుల్లలతో చేసిన త్రాసులో కూర్చుని ఊరేగడం, ఇలా వీరి ప్రదర్శన దాదాపు మూడుగంటల పాటు జరుగుతుంది. వీరు పద్మశాలి కులస్థులతో కట్టడి మాట్లాడుకొని ప్రదర్శన ఇస్తారు. ప్రదర్శనే జీవనాధారం.

పంబ కథ

పంబ అనే వాద్యాన్ని వాయిస్తూ కథ చెప్పడం వలన దీనికి పంబ కథ అని పేరు వచ్చింది. పంబ వాయిస్తూ కథలు చెప్పేవాళ్ళని పంబాలవాళ్ళు అంటారు. వీరు మాలకులంలో ఒక తెగవారు. వీరు మాలకులస్థుల పెండ్లిళ్లకు పురోహితులుగా ఉంటారు. సమ్మక్క పౌర్ణమి నుండి శివరాత్రి వరకు పట్నాలు వేసి కొలుపులు చేస్తారు. ఎవరైనా ఇండ్లకు పిలిపించి శాంతి చేయమని అడిగినప్పుడు, ఊరిలో వ్యాధులు వచ్చినప్పుడు పట్నాలు వేసి కథలు చెపుతారు. వీరు ఎనిమిది మంది ఒక జట్టుగా ఉంటారు. అందులో ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు కథ చెపుతారు. ఒకరు వంతగాను, కథాసహాయకారిగాను ఉంటారు. మిగిలిన ఐదుగురు వాద్యాలు వాయిస్తారు. పురుషులు మాత్రమే ఈ కథలు చెపుతారు. వీరు వాయించే వాద్యాలు పంబ, జోడు, జమిడిక, మద్దెల, శృతి, తాళం (జేగంట). ఎల్లమ్మ, పోచమ్మల వద్ద అప్పుడప్పుడు కొడతారు. కథకుడు కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటాడు. చేతిలో చీరగోల, వేప రెమ్మలు పట్టుకొంటాడు. (కొందరు పలకలు కూడా పట్టుకొంటారు.) వీరు ఎల్లమ్మ కథ, పోచమ్మ కథ, మాంధాత కథ, ఉప్పలమ్మ కథ చెపుతారు. మైసమ్మ కథకు మాత్రం మగవాళ్ళు మైసమ్మలాగా గంభీరమైన వేషం వేసుకొంటారు. బొడ్రాయి దగ్గర శక్తి పురాణం చెపుతారు. గ్రామ దేవతల ముందు పట్నాలు వేసి మత్తగొలుపు చేస్తారు.

మత్తగొలుపు అంటే- యాటకు మద్యం తాగించి వేపాకులపై పడుకోబెడతారు. యాటను బలి ఇచ్చి దాని కసరు, రక్తం తీసి బోనం అన్నంలో కలిపి ఊరంతా చల్లి శాంతి చేస్తారు. తరువాత గావు పడతారు. గావు అంటే- యాట పిల్లను భుజంపై పెట్టుకొని దాని మెడను నోటితో కొరకడం.

పంబాలవాళ్ళు మద్యం సేవించి, ఇండ్ల ముందు, దేవతల ముందు కథలు చెపుతారు. రాత్రి ఎనిమిది గంటలకు కథలు మొదలుపెడితే తెల్లవారు ఝాము వరకు సాగుతుంది. కొలుపులు లేనప్పుడు కూలి చేసుకొంటారు. వీరు ఊర్లను పంచుకొని, ఒకరికి కట్టడి ఉన్న ఊర్లకు ఇంకొకరు పోరు.

బాలసంతు

సంతు లేనివారికి సంతానం కలగాలని దీవిస్తూ అడుక్కొనే వాళ్ళని బాలసంతు వారు అంటారు. వీరు బుడిగె జంగం కులంలో ఒక తెగ. వీరు ఊరి బయట గుడిసెలు లేదా గుడారాలు వేసుకొని ఆ ఊరిలో అడుక్కొంటారు.

పురుషులు తెల్లవారక ముందే ధోవతి కట్టుకొని, చొక్కా వేసుకొని, తలకు పాగా చుట్టుకొని, నుదుట విభూతి రేఖలు పెట్టుకొంటారు. భుజం మీద కావడి పెట్టుకొని, కావడికి ఇరువైపులా రెండు సంచులు తగిలించుకొని కుడివైపున శంఖం, ఎడమవైపున గంట ఉండే విధంగా తాడుకు కట్టి మెడలో వేసుకుంటారు. గంట వాయిస్తూ ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి వీరగాథల్ని లేదా శైవకథల్ని పాడుతూ భిక్షం స్వీకరించి శంఖం ఊది పిల్లా పాపలతో చల్లగా ఉండమని దీవిస్తారు.

వీరి ఆడవాళ్ళు, పిల్లలు మధ్యాహ్న సమయంలో ఇంటింటికి తిరిగి అన్నం అడుక్కుంటారు. మిగతా సమయంలో చాపలు అల్లుతారు. మగవాళ్ళు అప్పుడప్పుడు వేటకు వెళ్ళడం వీరి జీవన విధానంలో ఒక భాగం.

చెక్కబొమ్మలాట

చెక్కతో చేసిన బొమ్మల్ని ఆడించటం చెక్కబొమ్మలాట. చెక్కబొమ్మల్ని ఆడించేవారిని బొమ్మలోళ్ళు, చెక్క బొమ్మలోళ్ళు అని అంటారు. వీరు బుడిగె జంగాలలో ఒక తెగవారు. వీరు వర్షాకాలం తప్ప తక్కిన అన్ని కాలాల్లో, అన్ని సమయాలలో ప్రదర్శనలు ఇస్తారు. ప్రదర్శనలు సాధారణంగా రాత్రిళ్ళు జరుగుతాయి. ఎవరైనా ప్రదర్శించమని అడిగితే పగలు కూడా ప్రదర్శిస్తారు. పగటి ప్రదర్శనకు బొమ్మలను ఆడించే దారాలు కనబడకుండా వలవేస్తారు. చెక్కబొమ్మల్ని పురుషులే ఆడిస్తారు. వీరు వాయించే వాద్యాలు హార్మోనియం, తబలా. స్త్రీలు తాళం వేస్తూ వంత పాడతారు. వీరు ప్రదర్శించే చెక్కబొమ్మలాటలలో లవకుశ, బాలనాగమ్మ, భక్త రామదాసు, ప్రహ్లాద, ధర్మాంగద చక్రవర్తి, చెంచులక్ష్మి మొదలైనవి. ఈ ప్రదర్శనకు వీరికి అయిదు లేక ఆరుగురు అవసరమవుతారు. బొమ్మల్ని ఇద్దరు ఆడిస్తే మిగిలిన వారు వాద్యాలు వాయిస్తారు.

వీరి రంగస్థల నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. తెల్లని పరదాలను మాత్రమే కడతారు. ముందుగా రెండు వెదురు బొంగులు పాతుతారు. వాటికి గజం దూరంలో మరో రెండు బొంగులు పాతుతారు. వెనుక బొంగులకు అడ్డు తెర కడతారు. ఈ తెర కొంత ఎత్తు వరకే ఉంటుంది. ఈ తెరపైన వెదరు బొంగుకు తొమ్మిది చీలలు ఉంటాయి. బొమ్మల్ని తెరమీద స్థిరంగా నిలపాలని అనుకున్నపుడు దారాన్ని ఈచీలకు తగిలిస్తారు. తెర వెనుక, తెర ముందు చెక్క బల్లలు వేస్తారు. వెనుక ఉన్న బల్లలపై వీరు నిలబడి, తెరమీద నుండే దారాలతో బొమ్మలను ముందు ఉన్న బల్లలపైన ఆడిస్తారు. అయితే వీరు ప్రేక్షకులకు కనబడకుండా ముందు ఉన్న రెండు బొంగులకు వెనుక తెర మాత్రమే కనిపించేటట్లు దానికి అడ్డుగా ముందర ఒక వస్త్రం కడతారు. అప్పుడు చూసే వారికి వీరు కనిపించకుండా బొమ్మలు మాత్రమే కనిపిస్తాయి. వెలుతురు కేవలం బొమ్మలవైపు ప్రసరించేటట్లు దీపాలు లేదా ఫ్లడ్‌లైట్లు అమర్చుతారు. ప్రేక్షకులు చీకట్లో ఉండి ముందు వైపు నుండి చూస్తారు. వీరికి ఆటలలో బొమ్మలదే ప్రాధాన్యం. ఈ బొమ్మలు చెక్కతో చేయబడి చేతులు తల ఆడించే విధంగా ఉంటాయి. ఈ బొమ్మలకు కాళ్ళు ఉండవు. వీటిని రంగులతో అలంకరిస్తారు. బొమ్మల్ని పాత్రలకు అనుగుణంగా రంగు రంగుల వస్త్రాలతో ఏరోజు పాత్రకు ఆ వేషం వేస్తారు. బొమ్మల చెవులకు సన్నని నైలాన్‌ దారాలు కట్టి ఆ దారాల సహాయంతో ఆడిస్తారు. బొమ్మలను ప్రక్క నుండి తీసుకువచ్చి, పైనుండి చేతులతో వాటిని పాత్రానుగుణంగా కదిలిస్తూ వెనుక నుండి గాత్ర దానం చేస్తూ కథ నడిపిస్తారు. బొమ్మల అభినయానికి తగ్గట్టు వీరు కూడా అభినయిస్తారు. స్త్రీ పాత్రలకు కొంచెం స్వరాన్ని తగ్గించి చెపుతారు. అదృశ్యమయ్యే పాత్రలను, హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే పాత్రలను పైనుండి తెర ముందుకు తెస్తుంటారు.

వీరి ప్రదర్శనలో ప్రత్యేకత బొమ్మలతో కోలాటం వేయించడం. ఈ కోలాటం సుమారు 10 రకాలుగా మార్చి వేయిస్తారు. ఇందులో కృష్ణుడితో కలిపి ఏడు బొమ్మలు కోలాటం వేస్తాయి. మిగతా ఆరు బొమ్మలు గోపికలు.

బైండ్ల కథలు

భవానీ మాతకు కొలుపులు చేయించేవారు కావడం చేత వీరికి భవానీలు అనే పేరు వచ్చింది. భవానీలుగా మారి చివరకు బైండ్లగా రూపాంతరం చెంది ఉంటుంది. బైండ్ల వారు మాదిగల వివాహాలకు పురోహితులుగాను, గ్రామదేవతల ఉత్సవాల్లో పూజారులుగాను వ్యవహరిస్తుంటారు. ఆదిశక్తికి కొలుపులు చేయిస్తూ జీవించడం వీరి ముఖ్య వృత్తి. బైండ్ల వారు అయిదారుగురు ఒక బృందంగా చేరి, కొలుపులు ఉత్సవాల సందర్భంలో పంబ, జమిడిక మొదలైన వాద్యాలు వాయిస్తూ భవానీ కథలు చెపుతారు. పండుగల సందర్భాల్లో చెప్పే కథలు ముత్యాలమ్మ కథ, కాళికాంబ కథ, ఎల్లమ్మ కథ, కోట మైసమ్మ కథ, పోలేరమ్మ కథ, మహాలక్ష్మి, ఈదమ్మ, కనక దుర్గమ్మ, పోచమ్మ, వనం మైసమ్మ, కాటమయ్య మొదలైనవి వీరు చెప్పే కథల్లో ముఖ్యమైనవి.

కొలుపులు చేయించే సందర్భంలో వీరు కొన్ని ప్రత్యేకమైన కథలు చెబుతుంటారు. మూడూర్ల పొలిమేరల్లో మర్లమైసమ్మ కొలుపు చేసి కథ చెబుతారు. పశువులకు గాలి సోకినపుడు గాడి మైసమ్మ కొలుపు చేసి కథ చెబుతారు. సంతానం లేని వారి ఇండ్లలో బాల దనమ్మ కొలుపు చేసి కథ చెబుతారు. గొల్లల ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం లోపు ఈర్ల (వీరుల) కొలుపు చేస్తారు. (జొన్నలు వేయించి, విసిరి, ఆ పిండితో పిండాలు పెడతారు. వీటిలో శూలాన్ని దించి పాట పాడుతారు. ఆ తర్వాత వాటిని జల నిమజ్జనం చేస్తారు. ఈర్ల కొలుపులో ఇది ఒక ముఖ్యమైన తతంగం).

పండుగలు, కొలుపుల సమయాల్లోనే కాకుండా వీరు మామూలుగా కూడా కథలు చెబుతారు. అవి గౌతమముని, అహల్య, పోతరాజు, మాంధాత, మర్రిచెట్ల రాయబారం, రతీదేవి, రాజతేజన్న, హిమలాంగి, శక్తి పురాణం మొదలైనవి. ఈ కథలన్నీ వీరు వంశ పారంపర్యంగా నేర్చుకుంటారు. వీరు కథలు చెప్పే సందర్భాలనుబట్టి వేదికలు మారుతుంటాయి. గ్రామదేవత ఉత్సవాల్లో ఆయా గుడిముందు కథ చెబుతారు. మామూలు కథలు చెప్పినపుడు ఊరి చావిడి వద్ద, దేవతా ప్రతిష్ఠ సమయాల్లో దేవతముందు, కొలుపుల్లో పలకలతో పట్నాలు వేసి పందిరి కింద కథలు చెబుతారు.

పలకలు: టేకు కర్రతో చతురస్ర, దీర్ఘచతురస్ర ఆకారాల్లో పలకలుగా చేయబడి, వాటిపై పద్మం, గుడి, గవ్వలు మొదలైన డిజైన్లు చెక్కబడిన పలకలు.

పట్నాలు: పలకలతో చతురస్రాకారంలో పసుపు, కుంకుమ, పచ్చ (తంగేడాకు ఎండబెట్టి దంచి చేసిన పొడి) బియ్యపు పిండి మొదలైన వానితో చేసే ముగ్గులు. పట్నాలు వేనే ముందు చంద్రం (పసుపు, సున్నం కలిపిన మిశ్రమం = ఎర్రనీళ్ళు) చల్లుతారు. కొలుపుల్లో గావు (వేట పిల్ల గొంతును నోటితో కొరకడం), బలి (యాట నెత్తురు అన్నంలో కలిపి ఊళ్ళోను, పొలాల్లోను చల్లడం) అనే తతంగాలు జరుపుతారు.

బైండ్లకథ శారదాదేవి ప్రార్థనతో ప్రారంభమౌతుంది. కథ చెప్పేటప్పుడు కథకుడు చేతిలో వేపరెమ్మలు, పలకలు పట్టుకుని భుజంపైన వీరగోల (గోగునారతో మొదలు లావుగా ఉండి రాను రాను సన్నగా ఉండేటట్లు పేనిన తాడు) వేసుకుంటాడు. కథకుడు కథ చెబుతూ ఉంటే ఒకడు జమిడిక, మరొకడు శ్రుతి వాయిస్తూంటారు. ఇలా ముగ్గురు కలిసి మూడు గంటలు కథ చెబితే, తర్వాత మరొక జట్టు అందుకొని కథ నడిపిస్తారు. ఈ విధంగా కథ రాత్రంతా నడిచి మంగళంతో ముగిస్తుంది. బైండ్ల వారు చెప్పే ఎల్లమ్మ కథలో కొంత ప్రత్యేకత కనిపిస్తుంది. ఎల్లమ్మ, పరశురాముడు, జమదగ్ని, జంపన్న మొదలైన వేషాలను ధరించిన పాత్రలు, వారి వంతు కథ వచ్చినప్పుడు పోయి చెబుతుంటారు. సారాయి తాగిన తర్వాతే కథ చెప్పడం వీరికి అలవాటు. వీరు బీరప్ప, ఉప్పలమ్మ పండుగల సమయాల్లోను, పోచమ్మ బోనాల సందర్భంలోను గ్రామ దేవతకు మైలలు తీస్తారు.

బీరప్ప పండుగ గొల్లల ఇండ్లలో జరుగుతుంటుంది. ఆ సందర్భంలో బైండ్లవారు, గొల్లవారు గొల్లవారింటికి పోయి, ఇంటి ముందు వడ్లతో మైల పోలు (ముగ్గు) వేసి, దాని పైన ఇంట్లో ఉన్న వారినందరను కూర్చోబెట్టి మైలపాట పాడుతూ, వారి చుట్టూ కల్లునీళ్లను వేప రెమ్మలతో చల్లుతూ తిరుగుతారు. తర్వాత అందరూ తలస్నానం చేసి పండుగ జరుపుకుంటారు. ఉప్పలమ్మ పండుగ చేసుకునే వారు కూడా ఇదే విధంగా మైలలు పోగొట్టుకొని పండుగ జరుపుకుంటారు. పోచమ్మ బోనాల సమయంలో బియ్యంతో మైల పోలు పోసి దాని మధ్యలో పసుపు కుంకుమలుంచి మైలపాట పాడుకుంటారు. తర్వాత పోచమ్మ కథ చెబుతారు. బైండ్ల వారు కొలుపులు చేసేటప్పుడు మాత్రమే జంధ్యం ధరిస్తారు. తర్వాత వాటిని తీసి జాగ్రత్తగా ఒక పవిత్ర స్థలంలో ఉంచుతారు. మాదిగవాడలో నివసించే బైండ్లవారు కొలుపులు లేని సమయాల్లో కూలి నాలి చేసుకుని జీవిస్తుంటారు.

బుడబుక్కల జోస్యం

బుడ్‌ బుడక్‌ అని శబ్దం చేసే చిన్న ఢమరుకాన్ని వాయిస్తూ ఊరూరు తిరుగుతూ జోస్యం చెప్పేవాళ్ళని బుడ్‌ బుడక్కులు లేక బుడబుక్కల వాళ్ళు అంటారు. వీరు మహారాష్ట్ర నుండి వచ్చి ఆంధ్రదేశంలో స్ధిరపడిన ఆరెకులం వాళ్ళు. వీరు సంవత్సరమంతా జోస్యం చెబుతూ అడుక్కుంటారు. ఒక్కొక్క ఊరిలో కనీసం రెండు నెలలు ఉంటారు. రోజుకు మూడు లేక నాలుగు ఇండ్లు మాత్రమే అడుక్కుంటారు. బుడబుడక్కల జోస్యం పురుషులు మాత్రమే చెపుతారు. వీరు ఒక్కొక్కరే భిక్షానికి పోతారు. బుడబుడ్కని వాయిస్తూ అంబపలుకు జగదాంబపలుకు అని అందరు దేవుళ్ళను స్మరిస్తూ భిక్షాటనం చేస్తుంటారు. రాత్రి ఆరు గంటల ప్రాంతాల్లో ఇంటికి వస్తారు. వీరు అడుక్కునే సమయంలో సానిపి (కళ్లపి) తొక్కరు. ఏ ఇంటికి ముందుకు పోతే ఆ ఇంటి సంగతులు పగిడి అంటే పక్షి పలికిన దాన్ని బట్టి జోస్యం చెబుతారు. అంతే కాకుండా మరుసటి రోజు అడుక్కోబోయే ఇంటిని ముందురోజే నిర్ణయించుకుంటారు.

వీరి వేషధారణ ప్రత్యేకంగా ఉంటుంది. తెల్లటి పంచెను సైకిల్‌ కట్టు పద్ధతిలో కట్టుకుని, చొక్కావేసుకుని దానిపై నల్లని కోటు ధరిస్తారు. భుజంపై బొంతను వేసుకొని వీపుకు దుప్పి లేక పులితోలు కట్టుకుంటారు. ఈ దుప్పి తోలు వీరికి ఎవరైనా చెడుపు చేస్తే దగ్గరికి రాకుండా కాపాడుతుంది. బుర్ర మీసాలు కలిగి నుదుటిపై నల్లని కావు అడ్డంగా పెట్టుకొని, తలకు ఎర్రని పాగా చుట్టుకుని, పాత గొడుగు పట్టుకుంటారు. చెవులకు రింగులు ధరిస్తారు. వీరు వైద్యం కూడా చేస్తారు. అంతేకాకుండా భూత వైద్యంలో సిద్ధహస్తులు. ధాన్యాన్ని వస్త్రాల్ని, డబ్బుల్ని భిక్షంగా స్వీకరిస్తారు. వీరు కూడా ఊర్లను పంచుకుంటారు. ఒకరికి కట్టడి ఉన్న ఊర్లకు ఇంకొకరు పోరు. బుడబుక్కల స్త్రీలు బొంతలు కుడతారు.

రాజన్నలు-శివమేళం-చామల్లాలీ డోలు

శివుని కీర్తిస్తూ వాయించే వాద్యాన్ని శివమేళం అంటారు. దీనినే చామల్లాలీ డోలు అని కూడా అంటారు. ఈ డోలు వాయిస్తూ రాజేశు దేవుణ్ణి తలపైన పెట్టుకుని అడుక్కునే వాళ్లను రాజన్నలు అంటారు. పూజగోల్ల కులస్థులైన వీరు అన్ని కులాల వారిని అడుక్కుంటారు. సాధారణంగా భార్యాభర్తలిద్దరు లేదా ఇద్దరు మగవాళ్ళు కలిసి అడుక్కోవడానికి వెడతారు. మగవాళ్ళు అడుక్కోవడానికి వెళ్ళేటప్పుడు కోటు ధరించి, తలకు రుమాలు చుట్టుకుంటారు. తెల్లవారు ఝాముననే లేచి ఒకరు రాజేశు దేవుణ్ణి ఎత్తుకుంటే ఇంకొకరు డోలు వాయిస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ, పంట కాలంలో కల్లాల దగ్గరకు వెళ్లి ధాన్యాన్ని అడుక్కుని దీవెనలిస్తుంటారు. అన్నంవేళ వరకూ అడుక్కుని స్వస్థలం చేరుకుంటారు.

శివమేళం వీరే తయారు చేసుకుంటారు. ఇనుముతో చేసిన గుండ్రటి రెండు చట్రాలు తీసుకుని ఒక దానిని మేకతోలు తోను, ఇంకొక దానిని జింక తోలు తోను ముడుస్తారు (బిగిస్తారు). ఈ రెండింటిని జతగా కడతారు. ఒక దానిని తంగేడు పుల్లతోను, ఇంకొక దానిని జానపుల్లతోను వాయిస్తారు. ఈ పుల్లల్ని వారికి కావలసిన ఆకారంలో పచ్చిగా ఉన్నప్పుడే వంచి దారంతో కడతారు. డోలు ముందువైపు రంగు రంగుల గుడ్డలతోను, అద్దాలతోను డిజైన్లు కుట్టిన బొంత వేస్తారు. ఈ శివమేళం పై 33 దరువులు (వరుసలు) వేయవచ్చు కానీ ప్రస్తుతం పీర్ల దెబ్బ, మజిలీ దెబ్బ, వీరంగం, ఈర్లగిరి దెబ్బ అనే నాలుగు రకాల దరువులు (వరుసలు) మాత్రమే వాయిస్తున్నారు. వీరు ఒక ఊరిలో కనీసం పదిహేను రోజులు ఉండి చుట్టు ప్రక్కల గ్రామాల్లో అడుక్కుంటారు. ఈత చాపలతో ఊరి బయట గుడిసెలు వేసుకుంటారు. స్త్రీలు ఈత చాపలు అల్లుతారు. మేకల్ని మేపుతారు.

చెంచులు

చెంచులక్ష్మిని తమ ఆడబిడ్డగా భావించి ఆమెకు సంబంధించిన కథను పాడుతూ అడుక్కునే వాళ్ళు చెంచులు. చెంచులు ప్రతిదినం తమకు కట్టడి ఉన్న గ్రామాలలో కుల ప్రసక్తి లేకుండా అందరినీ అడుక్కుంటారు. స్త్రీ పురుషులిద్దరూ అడుక్కోవడానికి వెడతారు. వీరు శరీరాన్ని నెమలి ఈకలతో అలంకరించుకుంటారు. నెమలి ఈకల్ని చీల్చి అందంగా పేర్చి కట్టి, తలకు కిరీటంలాగా, మెడలో కంఠాభరణం లాగా వేసుకుంటారు. కట్టె చేత బట్టుకుని, కంచు గంట వాయిస్తూ తెల్లవారు ఝామున బయలుదేరి చుట్టు ప్రక్కల గ్రామాలలో అడుక్కుని మధ్యాహ్నానికి స్థిర నివాసం చేరుకుంటారు. చెంచులక్ష్మి గుడి ఉన్న ప్రాంతాలలో వెంకటేశ్వరుని పెండ్లి వేడుకల సందర్భంలో వీరికి ప్రాధాన్యం ఉంటుంది. ఊరేగింపు జరుగుతున్నప్పుడు వీరు ముందుకు నడుస్తారు. వీరు కూడా ఊర్లు పంచుకుంటారు. ఒకరికి కట్టడి (హక్కు) ఉన్న ఊర్లకు ఇంకొకరు పోరు.

డక్కలి పురాణం

డక్కలి వారు చెప్పే పురాణం. డక్కలి మాదిగ కులానికి ఆశ్రిత కులం. వీరు మాదిగ కుల ఆవిర్భవాన్ని గురించి, ఇతర కులాల ఆవిర్భవాన్ని గురించి వివరించే అయిదు పురాణాలను చెబుతారు. ఈ అయిదు పురాణాలను వీరు అది పురాణం అని చెబుతారు. అవి శక్తి పురాణం, జాంబపురాణం, కామధేను పురాణం, అరుంధతి కళ్యాణం, బలభద్ర విజయం. వీరు తాటియాకుల పైన ఉన్న ఈ పురాణాలను చదివి అర్థం చెబుతూ పటంలో ఆ సన్నివేశానికి తగిన చిత్రాన్ని చూపిస్తారు. ఈ పురాణాలను పురుషులు మాత్రమే చెబుతారు. వైవిధ్యం కోసం నేడు వీరు ప్రదర్శన స్వరూపాన్ని మార్చుకుంటున్నారు. వేషాలు వేసుకుని చిందు యక్షగాన పద్ధతిలో ప్రదర్శన ఇస్తూ, పటం చూపిస్తూ కథను చెబుతున్నారు. వీరు మార్చి నెల మొదలుకొని జూన్‌, జూలై వరకు ప్రదర్శన ఇస్తారు. ఈ ప్రదర్శనలు రోజూ గానీ, రోజు విడిచి రోజుకాని జరుగుతాయి.

వీరు వాయించే వాద్యాలు, హార్మోనియం, మద్దెల, తాళాలు. ప్రదర్శనకు అనువుగా విశాలంగా ఉన్న ప్రదేశాన్ని గానీ, చెట్ల కింద గానీ రంగస్థలాన్ని నిర్మిస్తారు. నాలుగు వైపులా నాలుగు గుంజలు పాతి చాందినీ పరదా కడతారు. పటాన్ని చూపించడానికి అనువుగా వ్రేలాడదీస్తారు. పటానికి వెనుక భాగంలో వేషాలు వేసుకుంటారు. వాద్యగాండ్రు రంగస్థలం పైన ఒక ప్రక్కన కూర్చుని వాయిస్తారు.

రంగస్థలం పైకి మొదట జోకర్‌ వచ్చి ప్రేక్షకుల్ని తన మాటలతో నవ్విస్తాడు. తరువాత ఒక్కొక్క పాత్రను పోషించి ఆ సన్నివేశానికి తగిన చిత్రాన్ని పటంలో చూపిస్తూ ప్రదర్శన ఇస్తారు. ఇలా కథ చెప్పడం పూర్తి అయిన తరువాత దేవతలనందరినీ ప్రార్థించి మంగళ హారతి ఇచ్చి ముగిస్తారు.

వీరికి కట్టడి ఆచారం ఉంది. ఈ కట్టడి ప్రకారం ఊళ్ళు పంచుకొంటారు. వీరికి కట్టడి ఉన్న ఊరికి పోయి ప్రదర్శనలిచ్చి, మాదిగవారిని మాత్రమే త్యాగం అడుక్కొంటారు. త్యాగం అంటే వీరి ప్రదర్శనలకు ప్రతిఫలంగా మాదిగలిచ్చే పారితోషికం.

ఎనోట్టివారు (గౌడ పురాణం)

పటం (గౌడ పురాణానికి సంబంధించిన చిత్రాలు ఉన్న 50 గజాల వస్త్రం) ఆధారంతో గౌడ పురాణం చెప్పే వాళ్ళు ఎనోట్టివారు. వీరు గౌడ కులస్థులకు మాత్రమే కథ చెబుతారు. వీరు కట్టడి ఉన్న గ్రామాలకు సంవత్సరానికి ఒకసారి పోయి కథలు చెప్పి త్యాగం అడుక్కొంటారు.

వీరు వర్షాకాలం తప్ప, మిగిలిన అన్ని కాలాలలో పగలు రాత్రి ఎప్పుడైనా కథ చెబుతారు. వీరు హార్మోనియం, మద్దెల, తాళాలు వాయిద్యాలతో కాళ్ళకు గజ్జెలు కట్టుకొని కథ చెబుతారు.

పటం కథ అయిదు రోజులు చెబుతారు. ఆ తరువాత కాటమయ్య పండుగ చేస్తారు. గావు పట్టడం, బలి పట్టడం అయిపోయిన తర్వాత ఆరు రోజులు నాటకాలు కూడా వేస్తారు. కాని ఇక్కడ గౌడ పురాణం చెప్పేటప్పుడు ఉన్న పటం ఉండదు. వీరు ఎక్కువగా సత్య హరిశ్చంద్ర, లవకుశ, గయోపాఖ్యానం, భక్త ప్రహ్లాద నాటకాలు వేస్తారు.

కథ అయిదురోజులు చెబుతారు. రెండవ రోజు కథలో గౌడ పెండిండ్ల ప్రస్తావన ఉంటుంది. ఆరోజు గౌడ కులస్థుల ఇండ్ల నుంచి హారతి, టెంకాయ, అక్షింతలు వస్తాయి.

గుర్రపువాళ్ళ పటం కథ

గుర్రపువాళ్లు పటం ఆధారంతో కథలు చెబుతారు. వీరు శివకంఠ మాలవాళ్ళకు ఆశ్రిత కులం. మొదట శివకంఠ మాలవాళ్ళు, గుర్రపువాళ్ళు ఒకే కులం. ఒకసారి ఇద్దరు అన్నదమ్ములలో తమ్ముడికి పెళ్లి జరిగితే, ఆ పెళ్లి ఊరేగింపుకు గుర్రం కోసం అన్న వెళ్లాడు. పెళ్లి అయిపోయిన తరువాత గుర్రాన్ని తోలుకువచ్చిన అన్నని కులంవాళ్లు వెలివేశారట. వెలికి గురయిన వ్యక్తి జీవనాధారం ఏదని అడిగితే కథలు చెబుతూ, మమ్మల్ని ఆశ్రయించుకొని బ్రతకమన్నారట. అప్పటి నుండి గుర్రం కోసం వెలి వేయబడ్డ అన్న సంతతి వారు గుర్రపువాళ్లు అయ్యారు అనే జననానుడి ప్రచారంలో ఉంది.

వీరు సంవత్సరానికి ఒకసారి కట్టడి ఉన్న ఊర్లకు వెళ్లి త్యాగం అడుక్కుంటారు. దసరా పండుగ అయిపోయిన తరువాత వెళ్లి జూన్‌ వరకు కథలు చెబుతారు. వీరు ఎనిమిదిమంది పురుషులు ఒక జట్టుగా ఊరు బయట డేరాలు వేసుకొని ఒక్కొక్క ఊరిలో ఐదు నుండి పది రోజుల వరకు కథలు చెబుతారు. కథ చెప్పేటప్పుడు వీరు వాయించే వాద్యాలు మద్దెల, హార్మోనియం, తాళాలు, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు.

వీరు చెప్పే కథలు బసవ పురాణం, శక్తి పురాణం, బేతాళుని కథ, కరమల రాజు కథ మొదలైనవి. ఈ కథలు తాత తండ్రుల నుండి నేర్చుకుంటారు. మాలవాడలో విశాలంగా ఉన్న ప్రదేశంలో నాలుగు గుంజలు పాతి చుట్టూ పరదాలు కడతారు. పటాన్ని చూపించడానికి వీలుగా వేలాడదీస్తారు. కొబ్బరికాయ కొట్టి, గణపతిని ప్రార్థించి ప్రదర్శన ప్రారంభిస్తారు. కథ ఒకరి తరువాత ఒకరు ఇద్దరు చెబుతారు. కర్ర సహాయంతో కథా సందర్భానికి తగిన సన్నివేశాన్ని పటంలో చూపిస్తూ కథ చెబుతారు. ముగ్గురు వాద్యాలు వాయిస్తే, ముగ్గురు వంత పాడుతారు. కథ మంగళంతో ముగుస్తుంది. వీరి ప్రదర్శన పగలు తొమ్మిది గంటలకు మొదలయితే సాయంత్రం నాలుగు గంటల వరకు, రాత్రి ఎనిమిది గంటలకు మొదలైతే అర్ధరాత్రి రెండున్నర వరకు సాగుతుంది. ఇలా ఐదు రోజులు కథ చెప్పి, తరువాత ఐదు రోజులు వేషాలు వేసుకొని ప్రదర్శనలు ఇస్తారు. పటం కథకు ఆదరణ తగ్గిపోవడం వలన వీరు ఇలా వేషాలు వేసుకొని ప్రదర్శన ఇస్తున్నారు. వేషానికి కావాల్సిన సామాగ్రి అంతా కొనుక్కుంటారు. ప్రదర్శన లేని సమయాల్లో వ్యవసాయం, కూలి చేసుకుంటారు.

మందెచ్చుల కథలు

గొల్లల మందలు (గొర్లు, మేకలు) హెచ్చు కావాలని కథలు చెప్పడం, గావు పట్టడం, బలి చల్లడం మొదలైనవి చేసే వారిని మందహెచ్చుల లేక మందెచ్చుల వాళ్ళు అంటారు. వీరి కథల్ని మందెచ్చు కథలు అంటారు. బుడిగె జంగాలలో ఒక వర్గంవారైన ఈ మందెచ్చుల వాళ్ళు గొల్లలకు ఆశ్రితకులం. వీరు సంవత్సరానికి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతి నుండి దసరా వరకు కట్టడి ఉన్న ఊర్లకు వెళ్ళి కథలు చెబుతూ త్యాగం అడుక్కొంటారు.

వీరు గొల్లలకు మాత్రమే కథలు చెప్పి సంభావన పుచ్చుకొంటారు. గంగురాజు, వల్లరాజు, పెద్దిరాజు, కాటమరాజు, పోలురాజు, శ్రీదేవి, బయ్యమ్మ, కరియావుల రాజు, బేతాళుని కథ, సింహాద్రి రాజు మొదలైన కథలు చెబుతారు. వీరు చెప్పే కథలను గొల్ల కథలు, వృత్తి కథలు అంటారు. వృత్తి కథలు కాకుండా కనకతార, క్రూరసేన, ఐదు మల్లెపూలు, మునిచక్ర మహారాజు, ఎరుకల నాంచారి మొదలైన ఇతర కథల్ని కూడా చెప్తారు. వీరి కథల ముఖ్య ఉద్దేశం దొడ్డి హెచ్చు, మంద హెచ్చు, దోరణం హెచ్చు కావడం. వీరు చెప్పే కథలో ప్రధాన పాత్ర స్త్రీ అయితే కథకుడు స్త్రీ వేషం వేసుకొని కథ చెబుతాడు. స్త్రీలు వంత పాడుతారు. స్త్రీ పాత్ర వేయవలసి వస్తుంది కాబట్టి కథకుడు వెంట్రుకలు పెంచుకొంటాడు. త్యాగంలో లభించిన మేకల్ని మేపుకొని, అవసరానికి అనుగుణంగా అమ్ముకొంటారు. స్త్రీలు ఈత చాపలు అల్లుతారు.

శారద కథలు

శారద అనే వాద్యాన్ని వాయిస్తూ కథను చెపుతారు కాబట్టి దీనికి శారద కథ అని పేరు. శారద కథలు చెప్పే వారిని శారదగాండ్రు అని పిలుస్తారు. బుడిగె జంగాలలో ఒక వర్గంవారైన ఈ శారదగాండ్రు కథలు చెపుతూ అన్ని కులాలవారిని అడుక్కుంటారు. శుభ కార్యమైనా, దినమైనా, మాసికమైనా వీరు కథలు చెపుతారు. దాదాపు ఆరుగంటలు కథ చెపుతారు. పురుషులు కథ చెపితే స్త్రీలు వంత పాడుతూ ముంత వాద్యాలు వాయిస్తారు. సాధారణంగా వంత పాడే స్త్రీలు కథకుని భార్యలై ఉంటారు. శారదగాండ్రు సాధారణంగా ఇద్దరు భార్యలను కలిగి ఉంటారు.

కథకుడు శారదను కుడి భుజం మీద పెట్టుకొని, ఎడమ చేతి బొటన వ్రేలుకు అందెలు ధరిస్తారు. ఈ వాద్యాలు వీరే తయారుచేసుకొంటారు. బాలనాగమ్మ, రాములమ్మ, మైనావతి, చిత్రావతి, బొబ్బిలి కథ, పాండవుల కథ, ధర్మాంగరాజు, ఎరుకల నాంచారి, చిన్నమ్మ కథ, కావమ్మ కథ, సర్వాయి పాపడు మొదలైన కథలతో పాటు ఆ ప్రాంతంలో పేరు పొందిన వ్యక్తుల జీవితచరిత్రలను కూడా కథారూపంలో తయారుచేసుకొని చెపుతుంటారు. వీరు ఇంటింటికి తిరిగి కథ చెపుతారు. కథ దాదాపు పాట రూపంలో అరగంట సాగుతుంది.

శివసత్తులు

శివుని ప్రమథ గణాల్లాగా వేషం వేసుకొని ఒగ్గుడోలు వాద్యానికి అనుగుణంగా నర్తించేవాళ్ళను శివసత్తులు అంటారు. ఈ వేషం పురుషులు మాత్రమే వేస్తారు.

నడుముకు రంగు వస్త్రం, శరీరంపైన విభూది రేఖలు, నుదుట విభూది రేఖల నడుమ ఎర్రటి కుంకుమ బొట్టు, గుబురు మీసాలు, జటాజూటాల్లాగా తలపైన జడలు కట్టిన శిరోజాలు, చేతిలో బల్లెం, కాళ్ళకు అందెలు, మోకాలి కింద కూడా అందెలు, మెడలో నిమ్మకాయల దండ వీరి వస్త్రధారణ. కొందరు ఎర్రటి చీర, ఎర్రటి జాకెట్‌ ధరించి వేపరెమ్మలు నడుముకు కట్టుకొని, కొన్ని చేతులలో పట్టుకొంటారు. నోటికి ఇరువైపులా తెల్లటి కోరలను చిత్రించుకొంటారు. కాళ్ళ కింది భాగాన తెల్లటి నామాలు అడ్డంగా పెట్టుకొంటారు.

దుబ్బుల వాళ్ళు

దుబ్బు అనేది వాద్యం. ఈ వాద్యాన్ని వాయిస్తూ కనకదుర్గమ్మ కథను చెప్పేవాళ్ళను దుబ్బుల వాళ్ళు అంటారు. దుబ్బుల వాళ్ళు ఎక్కువగా చాకలి తెనుగు కులాల వాళ్ళు ఉంటారు. కనకదుర్గమ్మను కొలుపు చేస్తారు. పురుషులు మాత్రమే ఈ కొలుపులు చేస్తారు.

వరంగల్‌ జిల్లాలో ఉపయోగించే డప్పు వాద్యమే దుబ్బు. ఇది చిన్నదిగా, డప్పు ఆకారంలో ఉంటుంది. చేతితో వాయిస్తారు. నల్గొండ జిల్లాలో వాయించే దుబ్బు ఒగ్గు ఆకారంలో ఉంటుంది.

ఏ కులంవారికైనా ఆరోగ్యం బాగలేకపోయినా, దిష్టి తగిలిందని భావించినా, విచిత్రమైన రోగాలు వచ్చినా వీరిని పిలిపించి ఇంట్లో శాంతి చేయిస్తారు. మూడు సంవత్సరాలకు ఒకసారి ఊరి వారందరు కలిసి కొలుపు చేస్తారు. ఇంట్లో కొలుపు చేస్తే ఆ ఇంటి దంపతులు ఉపవాసం ఉండి కార్యక్రమంలో పాల్గొంటారు.

దుబ్బుల వాళ్ళు ముంతలో కొన్ని బియ్యం వేసి అందులో తూర్పు ముఖంగా కనకదుర్గమ్మ చిన్న ప్రతిమ, రెండు నల్లగాజులు, లాక్కాకులు, ఐదు నల్లపూసలు, జీడిగింజ, మేకు, ఐదు పైసలు మొదలైనవన్నీ పెట్టి, దానిపైన మూకుడు బోర్లిస్తారు. ఈ ముంతను దీగూడు (దీపం పెట్టే గూడు)లో గాని ఉట్టిపైన గాని ఉంచి పూజలు చేస్తారు.

ఒకరు కథ చెబితే, ఒకరు దుబ్బు వాయిస్తారు. ఒకరు గావు పడతారు. ఇద్దరు అలంకరించడం మొదలైన పనులు చేస్తారు. మొత్తం ఐదుగురు అవసరమౌతారు.

ఇంట్లో కొలుపు చేస్తే ఇంటివారు, ఊరందరూ కలిసి కొలుపు చేస్తే ఊరి వారందరూ ఒడి బియ్యం పోసి కట్నాలు చదివిస్తారు.


ఆంధ్ర దేశంలో జానపద కళల పట్ల స్పష్టమైన అవగాహన, క్షుణ్ణమైన పరిజ్ఞానం కలిగిన అతికొద్ది మంది వ్యక్తుల్లో భక్తవత్సల రెడ్డి ఒకరు. మొన్నటి వరకు తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళాపీఠం డీన్‌గా వరంగల్‌లో పనిచేసి, ఇటీవలే విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రదేశంలోని అనేక జానపద కళాబృందాలతో గత కొద్ది సంవత్సరాలుగా సజీవ సంబంధాలు కలిగినవారు. 2000 సంవత్సరం నుండి తానా నిర్వహిస్తున్న జానపద కళోత్సవాలకి ప్రధాన సలహాదారు, సహాయకుడు, కీలకమైన వ్యక్తి.


ఈ వ్యాసము చైతన్య స్రవంతి - తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 లోనిది. ఆ కార్యక్రమాల వివరాలను ఇక్కడ చూడగలరు. దీనిని ఇక్కడ ఉంచుటకు అనుమతినిచ్చిన TANA వారికి, జంపాల చౌదరిగారికి మా కృతజ్ఞతలు. దీనికి మాకు తోడ్పడిన వాసిరెడ్డి నవీన్‌గారికి, సీత(అక్షర క్రియేషన్స్‌)గారికి మా కృతజ్ఞతలు.


AndhraBharati - AMdhra bhArati - telaMgANA kaLArUpAlu - oka vihaMga vIxaNaM : en.h. bhaktavatsala reDDi - N. Bhaktavatsala Reddy - TANA 2006 Chaitanyasravanti - telugu vachana sAhityamu - vyAsamulu ( telugu andhra )