వచన సాహిత్యము వ్యాసములు తెలుగు జానపద నాటకం - ఓ పరిచయం

తెలుగు జానపద నాటకం - ఓ పరిచయం : డాక్టర్‌ జి. ఎస్‌. పస్రాదరెడ్డి

చైతన్య స్రవంతి
తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 నుంచి
TANAవారి సౌజన్యంతో.

మంచీ చెడుకు మధ్య జరిగే సంఘర్షణను తెలియజేస్తూ, చివరికి మంచికే విజయం లభిస్తుందని సందేశం ఇస్తూ జనపదుల్లో నైతిక విలువలు పెంపొందించి, సన్మార్గ బాటను పయనింపజేసే ఉత్తమ ప్రయోజనం కోసం జనంలోని ఆట, పాట, మాటల నుండి పుట్టిందే జానపద నాటకం. జానపదుల కోసం జానపదులచే ప్రదర్శింపబడే దేశి రూపకం జానపద నాటకం. మార్గ రూపకాలు నియమాలతో, కేవలం సమాజంలోని విద్యావంతులకు మాత్రమే ఉద్దేశింపబడినవైతే, గ్రామీణ ప్రజల కోసం, వారివారి మాండలీకాల్లో వినోదం ప్రధానాశయంగా కలిగి, భక్తిభావం పెంపొందిస్తూ, నీతిని తెలియజేయడానికి ఉద్దేశింపబడినవి ఈ దేశి రూపకాలు (జానపద నాటకాలు). ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పద్ధతిలో, ఒక్కో పేరుతో ప్రదర్శించే కళారూపాలకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలతో ఆయా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వినోదంతో పాటు, విజ్ఞానాన్ని కలిగిస్తూ, చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకు సాగిపోతోందీ జానపద నాటకం. ప్రాచీన కాలం నుండి ప్రజల జీవితంలో పెనవేసుకుపోయి, వారి సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రధాన భాగమైంది. జాతికి ప్రతీకగా నిలిచింది.

ఆంధ్ర జానపద నాటకరంగం సుసంపన్నమైనదీ, వైవిధ్యభరితమైంది. తెలుగులో ఉన్నన్ని జానపద నాటక కళారూపాలు ప్రపంచంలో ఎక్కడా లేవంటే అతిశయోక్తి కాదు. యక్షగానం, వీధి నాటకం (భాగవతం), కలాపం, తూర్పు భాగవతం, చిందు యక్షగానం, తోలుబొమ్మలాట ప్రధానమైన జానపద నాటక కళారూపాలుగా మనుగడ సాగిస్తుండగా- పగటి వేషాలు, చిరతల రామాయణం, వాలకం నాటకీయతను సంతరించుకొని, నాటకీయ లక్షణాలు కలిగిన కళారూపాలుగా కొనసాగుతున్నాయి. అయితే, నాటకీయత సంతరించుకొన్న కారణంగా వీటిని జానపద నాటక కళారూపాలుగా పేర్కొనలేం.

అన్ని భాషల దేశి రూపకాల ప్రదర్శనల తొలిదశలో మాదిరిగానే పౌరాణిక, ఇతిహాసాలకు సంబంధించిన గాథలే ప్రధాన ఇతివృత్తాలుగా మన జానపద నాటకాలు కూడా రూపుదిద్దుకొన్నాయి. అయితే కాలక్రమేణా జనపదుల మనోభావాల వ్యక్తీకరణ, వారి ఆచారాలు, సంప్రదాయాలు, సమకాలీన సమస్యలు, హాస్య-వ్యంగ్య పూర్వక సంభాషణలు ప్రదర్శనల్లో చోటు చేసుకొంటూ ఇంకా వారికి చేరువయ్యాయి. నృత్యం, నాటకం, సంగీతం మేళవింపుతో సమాహార కళగా కళాత్మక ప్రదర్శనలుగా పరిణతి చెందాయి. నీతి, ధర్మం, భక్తి ప్రధాన ప్రబోధకాంశాలుగా గ్రామీణ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి.

ప్రారంభదశలో జానపద నాటక ప్రదర్శనలు దేవుడి మీద భక్తితోనో, సరదాతోనో, ఆచారంతోనో ప్రారంభమైనా, రానురాను వృత్తిగా మారి, ఒక్కో కళారూపం ఒక్కో మతం, కులం, వర్గం, ప్రాంతం, కుటుంబం వారే ప్రదర్శించే పరిణామానికి దారితీసింది. దాంతో అందరూ అన్ని కళారూపాలను ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. ఈనాటికీ కూడ ఇదే నియమం అమలౌతూ ఉంది. దేవుడి కొలుపులు, ఉత్సవాలు, ఊరేగింపులు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, కర్మకాండల్లో ప్రదర్శనలు కచ్చితంగా జరగాలనే కట్టుబాటు అమల్లోకి వచ్చి కొనసాగుతూనే ఉంది. దాంతోపాటు ఒక్కో బృందం ఊరూరా తిరుగుతూ మొబైల్‌ థియేటర్‌లా ప్రదర్శనలిస్తూ, వారెన్నుకొన్న కళారూపానికి పేరుప్రఖ్యాతలు తీసుకువచ్చారు. దేవాలయాల ప్రాంగణాల్లో మొదలైన ఈ జానపద నాటకం ప్రదర్శనలు క్రమంగా ఆ గ్రామం మధ్యలో, నాలుగురోడ్ల కూడలిలో లేదా ఆ ఊరి రచ్చబండ వద్దనో, తాత్కాలికంగా ఏర్పాటుచేసిన వేదికలపైననో ప్రదర్శించడం ప్రారంభమైన తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత 10-11 గంటల సమయంలో ప్రదర్శన ప్రారంభమై, తెల్లారే వరకూ కొనసాగడం కూడ జానపద నాటక ప్రదర్శనల సంప్రదాయంగా మారింది. కాగడాలు లేదా దీపపు సెమ్మెల వెలుగులో ప్రదర్శించిన నాటకాలు గంభీరంగా, తన్మయత్వంగా కొనసాగేవి. తెర ముందు పాత్రధారులు, తెర వెనుక వాద్యకారులు, ప్రదర్శన సహాయకారులు, ముఖ్యంగా ఈ బృందానికి నాయకత్వం వహించే సూత్రధారుడూ కలిసి ప్రదర్శన బాధ్యతను నిర్వర్తిస్తారు.

ప్రాంతాలవారీగా జానపద నాటకాల విభజన జరగడంతో ఆయా ప్రాంతాల్లో ప్రదర్శించే నాటకంలో ఆ ప్రాంత భాష లేదా మాండలీకం లేదా యాసను ఉపయోగించడంలో మన భాష, మన నాటకం, మన కోసం అనే మనోభావానికి గురై, మరింత ఆదరించడం జరిగింది. చాలా మంది నిరక్షరాస్యులైన కళాకారులు పద్యాలు, శ్లోకాలు, పాటల విషయంలో కూడా ఆయా ప్రాంత భాషలో వ్యక్తీకరించడం విశేషం. స్త్రీ పాత్రలను పురుషులే ధరించి రంజింప చేయడం మరో ప్రత్యేకత. నాటకపరమైన సంభాషణలు తక్కువగా ఉండి, సంగీతానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రేక్షకులు ఆనందించేవారు. అవసరమైనచోట్ల ముఖ్యంగా సమకాలీన సమస్యలు ప్రతిబింబించే సమయంలో పూర్తి వాడుకభాష ఉపయోగించడం మరో విశిష్ట లక్షణం. కొన్ని కొన్ని నాటకాలు హాస్యం, శృంగారానికి పెద్దపీట వేశాయి. తోలుబొమ్మలాటలో హాస్యం పాలు ఎక్కువగా ఉంటే, భామాకలాపంలో శృంగారం మెండు. ఇక సంగీతం విషయానికొస్తే ఎక్కువ శాతం జానపద బాణీల్లోంచి గ్రహించి, సమర్పించడం, వాద్యాలు కూడా సంప్రదాయపరమైనవి కాక ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో ఉపయోగించే డోలు, మృదంగం, తాళాలు, గజ్జెలు మొదలైన సాధారణ వాద్యాలతో వీనులవిందు చేయడం జానపద నాటక విలక్షణ లక్షణం. ఆట, పాట, మాట- ఈ మూడింటినీ అనుసంధానం చేస్తూ, దేని అవసరం మేరకు దాన్ని ఉపయోగిస్తూ, పరిధిని మించకుండా ప్రదర్శించడం ఒక్క జానపద నాటకంలోనే చూస్తాం. శ్రుతి, లయ, తాళాలకు అనుగుణంగా, ఆంగికాభినయానికి తోడు, సాత్వికాభినయాన్ని జోడిస్తూ, పాట పాడడం అనిర్వచనీయం.

ఇక హాస్యం విషయానికి వస్తే, తొలిదశలో లేకపోయినా, కాలానుగుణంగా సమకాలీన సమస్యలు చర్చించేందుకు (ముఖ్యంగా ప్రదర్శించే గ్రామ విషయాలు), అలసిపోయిన ప్రధాన పాత్రధారులకు కొద్ది సమయం విశ్రాంతి కల్పించేందుకూ, పూర్తిగా ప్రధాన కథలో లీనమైన ప్రేక్షకులకు కాస్సేపు ఉల్లాసం కల్గించేందుకు ప్రదర్శన మధ్యలో అడపా దడపా హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ జోడించి నవ్వుల్ని పండించడం జానపద నాటక మరో ప్రత్యేకత. ఇక్కడే అప్పుడప్పుడూ సామెతలు, పిట్ట కథలు, వ్యంగ్యోక్తులు, ఎత్తిపొడుపులు, వెక్కిరింపులు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ హాస్య సన్నివేశాలు కేవలం సృష్టించినవే. ప్రధాన కథలో భాగం మాత్రం కావు. అయితే కొన్ని సందర్భాల్లో కథలో మేళవించి హాస్య సంభాషణలు చోటు చేసుకొంటాయి. ఒక్కో కళారూపానికి ఒక్కొక్క హాస్యపాత్ర లేదా రెండు పాత్రలు ఉంటాయి. ఉదాహరణకు తోలు బొమ్మలాటలో కేతిగాడు, బంగారక్క, వీధి నాటకంలో విదూషకుడు ఇలాంటివే. వీరి ఆహార్యం, దుస్తులు కూడ ప్రధాన కథలో ఉండే సంప్రదాయక పాత్రలకు భిన్నంగా, చోద్యంగా ఉంటాయి.

తెలుగు జానపద నాటకాలు - లక్షణాలు

1) ప్రాంతీయం (regional), 2) సంప్రదాయం (traditional), 3) దేవతా సంబంధం (ritual), 4) వంశ పారంపర్యం (heridition), 5) స్థానిక భాష (local language and day-to-day language), 6) ముఖాంగరచన అధికం (hevay make-up), 7) విలువైన వస్త్రాలు, నగలు (rich costumes & ornaments), 8) పురాణేతిహాసాల ఇతివృత్తం (myths & epics), 9) సుదీర్ఘ ప్రదర్శన (lengthy performance), 10) సద్యోనటన ప్రయోగం (improvisation), 11) సమయోచిత సంభాషణం (extempore), 12) ప్రేక్షకుల పాత్ర (ప్రదర్శనలో) (audience participation), 13) నృత్యం, నాటకం, సంగీతం (dance, drame & music - total theatre), 14) మతం, కులం, వర్గం, కుటుంబాల ప్రదర్శన (caste, creed, community, family show), 15) సంచార ప్రదర్శనలు (mobile touring performaces), 16) కాలానుగుణ ప్రదర్శనలు (seasonal), 17) నిరక్షరాస్య కళాకారులు (ఎక్కువగా) (mostly illiterate performers), 18) నాటక ప్రతిలేని ప్రదర్శన (no script mostly).

ప్రపంచంలో ఏ దేశంలోని లేదా ఏ ప్రాంతంలోని జానపద నాటకాన్ని చూసినా, మౌలిక లక్షణాలు ఇలాగే ఉంటాయి.

ఆంధ్రదేశ సంస్కృతినీ, వైభవాన్నీ, వారసత్వాన్నీ చాటి చెప్పిన జానపద నాటకాలలో ఇంతకుముందు చెప్పుకొన్న ప్రధాన స్రవంతిలోని నాటకాలను గురించి ఇప్పుడు సూక్ష్మంగా తెలుసుకొందాం.

యక్షగానం

15, 16 శతాబ్దాలకు చెందిన తొలి జానపద కళారూపం యక్షగానం. యక్షులు గానంచేసే సంప్రదాయం కారణంగా దీనికా పేరు వచ్చింది. శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీశైలంలో తొలి యక్షగాన ప్రదర్శన జరిగినట్టుగా పాల్కురికి సోమనాథుడి (1280-1340) పండితారాధ్యచరిత్ర పర్వత ప్రకరణంలో చెప్పబడింది. శ్రీనాథుడి (1430) భీమేశ్వర పురాణంలో కూడ దీని ప్రసక్తి తెలియవచ్చింది. పండుగల సందర్భంగా యక్ష (జక్కుల) జాతికి చెందిన పురుషులు, స్త్రీలు పాడుతూ, నృత్యం చేసేవారని క్రీడాభిరామం (15వ శతాబ్దం) తెలియజేస్తోంది. గాన ప్రక్రియలో ప్రారంభమైన ఈ కళారూపం క్రమంగా నాటక కళారూపంగా మారిందని తెలుస్తోంది. తంజావూరు నాయకరాజుల కాలంలో ఈ కళారూపం ఆదరింపబడి, పరిపూర్ణ నాటక కళారూపంగా రూపుదిద్దుకొంది. 18వ శతాబ్దం శహాజీ కాలం నాటికి యక్షగానం ఉచ్ఛస్థితికి చేరింది. ఈ ఇద్దరు రాజులూ వరుసగా 23, 20 యక్షగానాలు రచించడం ఈ కళారూపానికి ఉన్న ప్రాముఖ్యతను చాటుతుంది.

తెలంగాణ ప్రాంతంలో 18వ శతాబ్దం నుండి యక్షగానం బహుళ ప్రజాదరణ పొందింది. శేషాచలకవి రాసిన ధర్మపురి రామాయణం (1780), రాపాక శ్రీరామకవి రాసిన ఆధ్యాత్మ రామాయణం ప్రసిద్ధమైనవి. ఆ తర్వాత చెర్విరాల భాగయ్య 34 యక్షగానాలు రాసి చరిత్ర సృష్టించాడు. ఇప్పటికీ ఆయన రచనలు ప్రదర్శితాలు. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన యక్షగానం పలు దిశల్లో, దశల్లో పయనించి, పలు స్థానిక అవసరాలను తీరుస్తూ, తిరుగులేని సంప్రదాయ నాటక కళారూపంగా విలసిల్లుతోంది. కలాపం దీని నుంచే పరిణామం చెందింది. యక్షగానం యక్షగాన ప్రబంధం, యక్షగాన మహానాటకం పేర్లతో కూడా వినుతి కెక్కింది.

కలాపం

నృత్య-సంగీత ప్రధాన పాత్రలతో నడిచే నాటకీయతతో కూడిన కళారూపాన్ని కలాపం అని సాధారణంగా అంటారు. భామాకలాపం, గొల్లకలాపం ఈ ప్రక్రియలో పేరొందిన కళారూపాలు. కథ అంతగా లేకపోయినా, అభినయం, నృత్యం, పాట, సంగీతంతో సమ్మోహనపరిచే నాటక కళారూపం. యక్షగానానికి-వీధినాటకానికి వారధి ఈ కలాపం అని చెప్పవచ్చు. పాత్రలు స్వయంగా పరిచయం చేసుకోవడం (ప్రవేశ దరువు) కలాపంతోనే ప్రారంభమైంది. రాధాకృష్ణుల ప్రేమోదంతం దీని ప్రధాన కథా వస్తువు. అయితే, సత్యభామ ప్రధాన పాత్రధారిగా ఆంధ్ర కలాపం పరిచయమైంది. శృంగారరసంలోని ఎనిమిది అంశాలను ప్రతిబింబిస్తూ కృష్ణ-సత్యభామల మధ్య సాగే ప్రేమ కథే ఈ కలాప ప్రదర్శన. కూచిపూడి వాళ్ళు ప్రదర్శిస్తే సంప్రదాయ శైలిగాను, తూర్పు భాగవతులు ప్రదర్శిస్తే తూర్పు భాగవతం (జానపద) శైలిగాను పరిగణింపబడుతోంది. 15వ శతాబ్దంలో సిద్ధేంద్రయోగి ఈ శైలికి మూలకారకుడని తెలుస్తోంది. ఈ శైలిలో పురుషులే మహిళల పాత్రలు ధరిస్తారు. ప్రాచీన వాయిద్యాలు వాడుతూ, కృష్ణలీల నృత్యాలు చేయడం దీని ప్రత్యేకత. గిరిజా కల్యాణం, కీచకవధ, రామ నాటకం, రుక్మాంగద, శశిరేఖా పరిణయం, కిరాతార్జునీయం, కాళీయ మర్దనం, లవకుశ మొదలైనవి యక్షగాన ప్రదర్శనలకు ఉదాహరణలు.

తూర్పు భాగవతం

భామాకలాపం, గొల్లకలాపం రెండు విభిన్న శైలులతో తూర్పు భాగవతం ప్రదర్శింపబడుతోంది. ప్రపంచం - మానవుడి పుట్టుక గురించి ఒక పాలమ్మే గొల్ల యువతికీ, ఒక బ్రాహ్మణుడికీ మధ్య జరిగే చర్చ, సంవాదమే గొల్ల కలాప ప్రదర్శన. విజయనగరం, విశాఖ జిల్లాలలో విశేషాదరణ పొందిన ఈ కళారూపం నేటికీ సజీవంగానే ఉంది. తన ఉనికినీ, అవసరాన్నీ చాటుతూనే ఉంది. కృష్ణ గాథల్ని బలంగా నాటకీయ ధోరణిలో ప్రదర్శించేది భామాకలాపం. 13వ శతాబ్దిలో వైష్ణవ ప్రదర్శనల ఆధారంగా ఈ భాగవత ప్రదర్శనలు ఆంధ్రలోకి వెలుగులోకి వచ్చాయని జయదేవుడి గీతగోవిందం ద్వారా విదితమౌతోంది. భాగవత కథలను తూర్పు ప్రాంతంవారు ప్రదర్శిస్తున్న కారణంగా ప్రదర్శించేవారిని తూర్పు భాగవతులని, ప్రదర్శనలను తూర్పు భాగవతాలని పిలుస్తూ వచ్చారు. కృష్ణలీలలు, జలక్రీడలు పేరిట రెండు పద్ధతుల్లో సాగే ఈ ప్రదర్శనలు హృద్యంగా ఉంటాయి. కృష్ణలీలలు బాలకృష్ణుని చేష్టలు, మహిమల్ని తెలియజేయగా, జలక్రీడలు కృష్ణుని శృంగార చేష్టల్ని బహిర్గతం చేస్తాయి. రెండూ కూడ కృష్ణుడి ప్రేమ తత్వాన్ని, కృష్ణుడి పట్ల భక్తిభావాన్నీ వ్యక్తం చేస్తాయి. నాటక పాఠ్యం సంగీత ప్రధానంగా సాగుతుంది. చాలా రాగాలు దేశి పద్ధతిలో ఉంటాయి. పాట, రగడ, పద్యం, ద్విపదల వాడకం అధికం. కృష్ణ-సత్యభామల సంవాదం, సత్యభామ-రాధల మధ్య సవతుల కయ్యం ప్రధానేతివృత్తం. భాగవత పాత్ర సంక్లిష్టమై, బహువిధాల పోషణ ఓ ప్రత్యేకత. సూత్రధారుడిగా, వంత గాయకుడిగా, హాస్యగానిగా, సంభాషణల కర్తగా బహువిధాలుగా పోషించవలసి ఉంటుంది. కీర్తన, పురాణ ప్రవచనం ప్రముఖ పాత్ర వహిస్తాయి. ముఖాంగ రచన, వేషధారణ, నగలు సుందరంగా ఉంటాయి. మృదంగం ప్రధాన పాత్ర వహిస్తుంది. వంకాయల బలరామభుక్త ప్రథమ తూర్పు భాగవత రచయితగా గుర్తించబడ్డాడు. పురుషులే అన్ని పాత్రలూ ధరిస్తారు. ప్రదర్శన సాధారణంగా 6-7 గంటలపాటు సాగుతుంది. ఒక్కోసారి 3 రాత్రులు కూడ కొనసాగుతుంది. ఇప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో స్థానిక దేవతల పండుగలు, ఉత్సవాలు ఈ భాగవత నాటక ప్రదర్శనలు లేనిదే ప్రారంభం కావు. సంప్రదాయ-జానపద శైలులకు మధ్యస్థంగా ఉండి ఇరువర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం దీని ప్రత్యేకత.

కొచ్చర్ల వీరభద్రుడు, చేబ్రోలు సన్యాసయ్య, దూడల శంకరయ్య, బొంతలకోటి జగన్నాథం, కొచ్చర్ల బ్రహ్మానందం బృందాలు ఈ భాగవత ప్రదర్శనల్లో విశేషఖ్యాతి పొందాయి.

వీధి నాటకం

ఆంధ్రదేశంలో అన్ని కళారూపాల కంటే బహుళ ప్రాచుర్యంలో ఉన్న కళారూపం వీధి నాటకం. రాయలసీమ ప్రాంతంలో దీన్ని బయలాట అంటారు. భాగవతం, వీధి భాగవతం అని ఆంధ్ర ప్రాంతంలో పిలుస్తారు. వీటిని ప్రదర్శించే కళాకారులను భాగవతులు అంటారు. దాసరి భాగవతం, యానాది భాగవతం, చెంచు భాగవతం, చిందు భాగవతం, మేలట్టూరు భాగవతం అని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలిస్తూ ఉంటారు. ప్రదర్శనాపరంగా చూస్తే మిగిలిన నాటక కళారూపాల కంటే వీధి నాటక కళారూపం భిన్నమైందీ... ప్రత్యేకమైందీ. ఆంధ్ర ప్రాంతంలో కృష్ణభక్తి ప్రచారానికిగాను 16-17 శతాబ్దాల మధ్యకాలంలో ఈ కళారూపం వెలుగులోకి వచ్చింది. విజయరాఘవ నాయకుడు వీధి నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించినట్టు తెలుస్తోంది. రగడలు, త్రిపుటలకు మారుగా పదాలు, దరువులతో, పాత్రలే స్వయంగా పరిచయమౌతూ, నాటకీయతకు దెబ్బ రాకుండా నృత్య, సంగీతాలతో కనువిందు చేసే కళారూపం వీధి నాటకం. యక్షగానం, కలాపం కంటే ఎక్కువగా నాటకీయతను సంతరించుకొంది. సంఘర్షణలను నాటకీయతతో చెప్పడం దీని ప్రత్యేకత. సంభాషణలు ఎక్కువగా పాటల రూపంలో ఉంటాయి. సూత్రధారుడు ప్రధాన భూమిక నిర్వహిస్తాడు. నాటకీయతతో కూడిన సంభాషణలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆంగిక, వాచికాభినయాలకు ప్రాధాన్యత, హాస్యానికి పెద్దపీట దీని అదనపు ప్రత్యేకతలు.

1943-44లోనే ప్రజానాట్యమండలి కోగంటి గోపాల కృష్ణయ్య రచించిన హిట్లర్‌ భాగవతం, సిమ్లా భాగవతం నాటకాలను సంప్రదాయ వీధి నాటక శైలిలో ప్రదర్శించి, సమకాలీన సమస్యల్ని సంప్రదాయ శైలిలో ప్రదర్శించే పద్ధతికి, మార్గదర్శకులయ్యారు. ఈ రెండు నాటకాలకు కోడూరి అచ్చయ్య దర్శకత్వం వహించారు.

సంప్రదాయ వీధి నాటక లక్షణలను ఆపాదించుకొని, సమకాలీన సమస్యలతో కదం తొక్కుతూ ప్రజలకు చేరువైంది ఆధునిక వీధి నాటకం. అనేక ఆధునిక వీధి నాటకాలలో పలు జానపద కళారూపాల బాణీని, సంగీతాన్ని, నృత్యాలను మేళవించి ప్రదర్శిస్తూ, వెనుకబడి పోయిన ఈ కళారూపాలను ముందు తరాలకు పరిచయం చేస్తూ ఉంది ఆధునిక వీధి నాటకం.

తోలుబొమ్మలాట

కళాకారుల స్థానంలో రంగురంగుల, వింత ఆకృతుల్లో, వివిధ పరిమాణాల్లో తయారుచేసిన తోలుబొమ్మలే పాత్రధారులుగా, నేపథ్యం నుండి ఆయా పాత్రల సంభాషణలతో, తెర మీద బొమ్మల కదలికలతో పాటు ప్రాధాన్యంగా గల కళారూపం తోలుబొమ్మలాట. పౌరాణిక ఇతివృత్తాలే ప్రధానంగాగల ఈ ప్రదర్శనలో ఆ ఇతివృత్తంలోని పాత్రలు బొమ్మల రూపంలో దర్శనమిస్తాయి. తోలుతో తయారు చేసిన బొమ్మలు కాబట్టి దీనిని 'తోలు బొమ్మలాట' అన్నారు. 12, 13 శతాబ్దాల్లో దీని ఉనికి తెలిసినప్పటికీ, 18,19 శతాబ్దాలకు ప్రజాదరణ పొందిన కళారూపంగా కనిపిస్తుంది. సంవత్సరానికి 9 నెలల పాటు అన్ని ప్రాంతాలూ తిరిగి తమ ప్రదర్శనలివ్వడం బొమ్మలాట ప్రత్యేకత. రాత్రి 9-10 గంటల మధ్య ప్రారంభమై, తెల్లవారే వరకూ ప్రదర్శనలు కొనసాగుతాయి. ప్రధాన కథకు సంబంధం లేని పలు హాస్య సంఘటనలు ఇందులో చోటు చేసుకొంటాయి. కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు వంటి హాస్య పాత్రలు అందించే ఈ బొమ్మల కదలికలు, హావభావాలు సంభాషణల కనుగుణంగా ఉంటాయి. బొమ్మల కదలికలు సజీవంగా ఉంటాయి. పాత్ర, పాత్రకూ పరిమాణంలో, రంగుల్లో, ఆకృతుల్లో తేడాలుంటాయి. నాటకీయత పాలు అధికంగా ఉండే ఈ కళారూపంలో పాట, సంభాషణలు, బృందగానం ప్రధానంగా చోటు చేసుకుంటాయి. తెరవెనుక నుండి బొమ్మల నాడించే వ్యక్తులు ప్రధాన సూత్రధారులు.

సుందరకాండ, కుశలవ, పద్మవ్యూహం, కీచకవధ, లక్ష్మణ మూర్ఛ, యుద్ధకాండ, మైరావణ, శశిరేఖా పరిణయం బొమ్మలాట ప్రధాన ప్రదర్శనలు. నెల్లూరు జిల్లా డి.సి.పల్లి కుమార రాజారావ్‌ బృందం, అనంతపురం జిల్లాలోని నిమ్మలకుంట వనారస చలపతిరావ్‌, రామకృష్ణల బృందం, తూర్పుగోదావరి జిల్లా మాధవపట్నం తోట సుబ్బారావ్‌, అనపర్తి త్రినాథ్‌ల బృందం, గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని మరో బృందం తోలు బొమ్మలాట ప్రదర్శనలకు పెట్టింది పేరు.

చిందు యక్షగానం / భాగవతం

ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వృత్తి కళాకారులైన హరిజనులు - హరిజనుల కోసమే ప్రధానంగా ప్రదర్శించే, మహిళలు ప్రధాన పాత్రలు పోషించే జానపద నాటకం చిందుయక్షగానం /భాగవతం, రామాయణ, మహాభారత, భాగవత కధలు ఇతివృత్తంగా మరియు స్థానికంగా బహుళ ప్రచారంలో ఉన్న చెంచులక్ష్మి వంటి కథలను ఇతివృత్తాలుగా ప్రదర్శిస్తారు. 'చిందు' అంటే నాట్యంలో వేసే లయబద్ధమైన అడుగు. ఈ చిందుకు ప్రాధాన్యమిస్తూ కథను కొనసాగించడం చేత దీనికాపేరు వచ్చింది. పండుగలకు, పెళ్ళిళ్ళకు ఆచారంగా ప్రదర్శించే 'జాంబపురాణం'లో వారి కులదేవత 'ఎల్లమ్మ' ఆవిష్కరింపబడుతుంది. పురుషులు, మహిళలు కలిసి చేసే ఈ ప్రదర్శనలు సాధారణంగా పగటి పూట చోటు చేసుకుంటాయి. ఒక్కోసారి పురుషులు మహిళా పాత్రలు, మహిళలు పురుష పాత్రలు ధరించడం ఈ కళారూపం ప్రత్యేకత. తమ కులదేవతను ప్రసన్నం చేసుకోవడానికి, తద్వారా సుఖశాంతులు కలుగుతాయనే నమ్మకంతో, ప్రదర్శనలనే 'పూజావిధానం'గా ఈ భాగవత నాటకాన్ని ప్రదర్శించడం మరో ప్రత్యేకత.

సతీ సావిత్రి, చెంచులక్ష్మి, అల్లీరాణి, బాలనాగమ్మ, భక్త ప్రహ్లాద, వీరాభిమన్యు, గంగా-గౌరి సంవాదం పేరెన్నిక గన్న చిందు ప్రదర్శనలు. బాలక్రిష్ణ, రంభ నృత్యంతో ప్రారంభమై ఎల్లమ్మ సాక్షాత్కారంతో ప్రదర్శన ముగుస్తుంది. కాంభోజ, సావేరి, మోహన రాగాలు ప్రధానంగా కొనసాగుతుంది. రూపక, ఆది, త్రిపుట తాళ వినియోగం అధికం. మృదంగం. తబలా లయ ప్రధాన వాద్యాలు. కళాకారులందరూ కాలి గజ్జెలు ధరిస్తారు.

నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉన్న కళారూపం చిందు భాగవతం. చిందుల ఎల్లమ్మ, చిందుల శ్యాం, చిందుల గోపాల్‌ బృందాలు ఈ ప్రదర్శనలకు ప్రపంచ ప్రఖ్యాతి నార్జించి పెట్టాయి.

సాధారణ పల్లె ప్రజలచే ప్రదర్శించే ఈ జానపద నాటకాల్లో సాహిత్యపరమైన విలువలు అంతగా లేకపోయినా, ప్రదర్శనాపరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతేగాక, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే భాషలో, శైలిలో ప్రదర్శించబడడం చేత వారికి కావలసిన మానసికోల్లాసం లేదా భక్తి భావం లేదా సంప్రదాయానుసరణ విధానం ప్రదర్శించారన్న తృప్తి లభించేవి. నిరాడంబరంగా సాగే ఈ జానపద నాటక ప్రదర్శనలు సామాన్య ప్రజల జీవితంలో పెనవేసుకుపోయి, గ్రామీణ నాటక రంగంగా నిలదొక్కుకొని, నాటి నుంచి నేటి వరకూ వారి వారి అవసరాలు తీరుస్తూనే ఉంది. గ్రామీణ సంస్కృతికి నెలవైంది.


డా॥ జి.ఎస్‌. ప్రసాదరెడ్డి నాటకరంగంలోను, నటనలోను డిప్లొమా తీసుకొన్నారు. పదహారు సంవత్సరాల పాటు దర్శకత్వం, నటన, నాటక రంగాల్లో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. అనేక సెమినార్లకి హాజరయ్యారు. పలు సందర్భాల్లో నంది నాటక పోటీలకి న్యాయనిర్ణేతగా ఉన్నారు. తెలుగు నాటకరంగం మీద తెలుగు యూనివర్సిటీ ప్రచురిస్తున్న ఎన్‌సైక్లోపీడియాకి సంపాదకుడుగా ఉన్నారు.


ఈ వ్యాసము చైతన్య స్రవంతి - తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 లోనిది. ఆ కార్యక్రమాల వివరాలను ఇక్కడ చూడగలరు. దీనిని ఇక్కడ ఉంచుటకు అనుమతినిచ్చిన TANA వారికి, జంపాల చౌదరిగారికి మా కృతజ్ఞతలు. దీనికి మాకు తోడ్పడిన వాసిరెడ్డి నవీన్‌గారికి, సీత(అక్షర క్రియేషన్స్‌)గారికి మా కృతజ్ఞతలు.


AndhraBharati - AMdhra bhArati - telugu jAnapada nATakaM - O parichayaM : DAkTar.h pasrAdareDDi - Dr. G. S. Prasada Reddy - TANA 2006 Chaitanyasravanti - telugu vachana sAhityamu - vyAsamulu ( telugu andhra )