వచన సాహిత్యము వ్యాసములు విలక్షణ జానపద కళారూపం - పగటి వేషం

విలక్షణ జానపద కళారూపం - పగటి వేషం : డా॥ జి. భరద్వాజ

చైతన్య స్రవంతి
తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 నుంచి
TANAవారి సౌజన్యంతో.

తెలుగు సాంస్కృతిక వారసత్వంలో జానపద కళారూపాలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. జనజీవన నిర్మాణంలో కళారూపాలు ఆది నుండి తమ వంతు పాత్రని పోషిస్తునే ఉన్నాయి. జానపద కళారూపాల అధ్యయనం ఒకరకంగా జనచరిత్రగా చెప్పకోవచ్చు. ఆంధ్రదేశానికి సంబంధించినంత వరకు అనేక జానపద కళారూపాల వారసత్వ సంపదగా ఇప్పటికే సజీవంగా ఉంది. అలాంటి జానపద కళారూపాల్లో పగటివేషాలది ఒక ప్రత్యేక స్థానం. ఇతర కళారూపాల్తో పోల్చినప్పుడు పాఠ్యము, ప్రదర్శన ఇత్యాది విషయాల్లో విలక్షణమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది పగటివేషం.

అయితే పగటివేషం గురించి పూర్తి అవగాహన చేసుకునే ముందు అసలు జానపద కళారూపాలకు సంబంధించిన సామాన్య లక్షణాలను గమనించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ జానపద కళారూపాల్ని స్థూలంగా అధ్యయనం చేసినట్లయితే అన్నింటిలోను కొన్ని సామాన్య లక్షణాలు కనపడతాయి. అవి

 1. చాలా వరకు జానపద కళారూపాలు మతానికి, మత సంబంధమైన కర్మకాండలకు అతి దగ్గరగా ఉంటాయి. ఇతివృత్తాలు చాలావరకు పురాణాల నుంచి లేదా పురాణ పురుషులకు సంబంధించి ఉంటాయి.

 2. దాదాపు అన్ని జానపద కళారూపాలు ప్రేక్షకులతో అత్యంత దగ్గరి భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే కళారూపాల్లో ప్రదర్శించబోయే అంశాలకు సంబంధించి ప్రదర్శకులకు, ప్రేక్షకులకు, ప్రదర్శన తాలుకూ అనుభూతులకు, ఉద్వేగాలకు సంబంధించి సమాన భాగస్వామ్యం ఉంటుంది.

 3. అన్ని జానపద కళారూపాలు సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్రని నిర్వహిస్తాయి. వినోదంతో పాటు విజ్ఞానాన్నీ అందిస్తాయి. మానవ జీవన అంతిమ సత్యాలను అవి ప్రబోధిస్తాయి. ఇవి ఒకరకంగా విద్యాత్మకాలు.

 4. ప్రదర్శించబోయే ఇతివృత్తాలు దాదాపు ప్రేక్షకులందరికి సుపరిచితాలై వుంటాయి కాబట్టి ఇక్కడ కళాకారుడు కళారూప మనుగడకు కీలకమవుతాడు.

 5. వీటికి లిఖిత రూపం ఉండదు. ఒకవేళ అవి ఏ విధంగానైనా గ్రంథస్థం చేయబడినా నిత్యం అనేక మార్పులకు లోనవుతాయి.

 6. చాలా కళారూపాలలో భగవంతుడు లేదా సూత్రధారుడు అతి ముఖ్యడవుతాడు. అతని పాత్ర అతి కీలకమైనది.

 7. జానపద నాటకాల ఇతివృత్తాల నిర్మాణం సాధారణంగా వివిధ భాగాలుగా ఉంటుంది.

 8. పాత్రపోషణ స్క్రిప్ట్‌ని ఎక్కువగా ఆధారం చేసుకోకుండా ప్రదర్శనా సందర్భం బట్టి వుంటుంది.

 9. అన్ని కళారూపాలు సంగీతం, నాటకం, సంభాషణ, ఆంగికాలు, మూకాభినయం ద్వారా అభివ్యక్తీకరించ బడతాయి.

 10. కొన్ని కళారూపాల్లో పాఠ్యం అతి పవిత్రంగా భావించబడుతుంది. ప్రధాన పాత్ర పోషిస్తున్న కళాకారుడు దాదాపు భగవదవతారంగా కొలువబడతాడు.

పైన పేర్కొన్న కొన్ని లక్షణాలు దాదాపు అన్ని జానపద కళారూపాలకి సామాన్య లక్షణాలుగా భావించవచ్చు. ఇక పగటివేషం విషయానికివస్తే పగటివేషాలు పగటిపూట ప్రదర్శించే కళారూపమని అర్థం. సాధారణంగా మిగతా జానపదకళలు ఏ సమయాల్లోనైనా ప్రదర్శించవచ్చు కాని పగటివేషాలు మాత్రం కేవలం పగటి పూట మాత్రమే ప్రదర్శించబడతాయి. కేవలం ప్రదర్శనా సమయం కారణంగా దీనికా పేరు రావడం దీని విలక్షణత.

పగటివేషం అంటే వేషం, మారువేషం, పాత్రధారి, పాత్రపోషణ అనే పర్యాయ పదాలకు సమానార్థంగా ఇక్కడ తీసుకోవాలి. అలాగే పగటివేషం, లేదా పగటివేషాలు అనే వాడుకలు ఒకే అర్థాన్ని కలిగి వుంటాయి. ఎందుకంటే పగటివేషం అంటే కేవలం ఒక వేషం కాదు. ఒకే వేషం పేరుతో ప్రదర్శితమయ్యే వివిధ వేషాలు.

అంతేకాక ఇతర కళారూపాల మాదిరి ఒకేసారి ప్రదర్శింపబడక రోజుకు అనేక సార్లు, అనేక ప్రదర్శనా స్థలాల్లో అంటే ఇంటి ముందు, రోడ్ల కూడలిలో, దుకాణాల ముందు ఇలా, ఎలాగైనా, ఎప్పుడైనా నిత్యనూతనంగా ప్రదర్శింపబడే కళారూపం పగటివేషం. ఇక్కడ వేషం అనే పదానికి ప్రదర్శనా సందర్భం బట్టి బహువచనంగా మాత్రమే అర్ధం చేసుకోవాలి.

కర్ణాటక రాష్ట్రంలోని 'పగలువేషద ఆట', తమిళ దేశంలో ప్రదర్శించే 'పగల్‌ వేషం' మన పగటి వేషంతో సమానమైన లక్షణాలు కలిగి వుంటాయి.

పగటివేష ప్రదర్శనాలక్షణం ఒకరకంగా అలవోకగా ప్రదర్శింపబడే జానపద నాటక ప్రక్రియ. అంటే ఇతర కళారూపాల్లాగే, పూర్వరంగాలు, సుదీర్ఘ ప్రారంభాలు లేకుండా నేరుగా వేషంలోనికి కళాకారుడు పరకాయ ప్రవేశం చేసి, ప్రదర్శనా స్థలం, ప్రేక్షకుల స్పందనను, ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళే ప్రక్రియ పగటివేషం.

పగటివేషాల ఆవిర్భావానికి సంబంధించినంత వరకు అనేక మంది జానపద పరిశోధకులు వివిధ ప్రయత్నాలు చేశారు. అయితే జానపద కళారూపాల కాల నిర్దేశానికి సంబంధించినంత వరకు ఫలానా కళారూపం, ఫలానా కాలంలోనే పుట్టింది అని నిర్ణయించడం కష్టం. అయితే శాతవాహన రాజుల పరిపాలనా కాలం నుండి ఈ ప్రక్రియ ఉండేదని హాలుడు రాసిన గాథాసప్తశతిలో దీని ప్రస్తావన ద్వారా అర్థమవుతుంది. అలాగే పాల్కురికి సోమన పండితారాధ్యచరిత్ర, బసవ పురాణంలో కూడా ఈ కళారూపాన్ని ప్రస్తావించడం విశేషం. శ్రీశైల క్షేత్రాన్ని దర్శించే యాత్రికుల అలసట పోగొట్టేందుకు ఒకప్పుడు పగటివేషం ఉపయోగపడిందని ఒక వాదన. దీన్ని బట్టి పగటివేష వికాసం సామాజిక వ్యవస్థతోనూ, మతపరమైన ధోరణులతోనూ ముడిపడి ఉందని అర్థమవుతుంది.

సాధారణంగా అన్ని జానపద కళారూపాలు, వాటి పాఠ్యాలు అన్నీ, శిష్టసాహిత్యం, లేదా మార్గకళారూపాల నుండి కొద్ది మార్పులతో ఆవిర్భవించినవేనని ఒక వాదన. అలాగే పగటి వేషాలు కూడా శాస్త్రీయ నృత్యం ప్రదర్శించే కూచిపూడి భాగవతుల యక్షగానాలలోని చిన్ని చిన్ని అంశాలే పగటి వేషాలుగా కాలక్రమేణ మార్పుచెందాయన్నది ఒక వాదం. పగటివేషాల పాఠ్యాలు, అర్ధనారీశ్వర, శక్తివేషాలు, సోమయాజులు - సోమిదేవమ్మ ఈ వాదనని బలపరుస్తాయి.

ఇక పగటివేషాన్ని ప్రదర్శించే కళాకారుల వివరాలలోకి వెళితే ప్రస్తుతం జంగాలు ముఖ్యంగా గణాయత జంగాలు మాత్రమే ఈ ప్రక్రియని తమ జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విశ్వబ్రాహ్మణులు, సాతానులు కూడా పగటివేషాలు వేసేవారు. వారికంటే ఇంకా ముందు కూచిపూడి అగ్రహారంలోని భాగవతులు కూడా పగటివేషాలు వేసేవారు. కానీ అదంతా చరిత్ర. ప్రస్తుతం ఈ కళారూపాన్ని సజీవంగా, ఇంకా వారసత్వ సంపదగా కొనసాగిస్తున్న కళాకారులు గణాయత జంగాలు.

"జంగమ" అంటే అర్థం ఒక ప్రదేశంలో స్ధిరంగా ఉండనివాడని. భక్తి ఉద్యమకాలంలో శైవమత ప్రచారంలో భాగంగా అటు సామాజిక వ్యవస్థలోనూ, ఇటు సాహిత్య కళారూపాల్లోకి దూసుకు వచ్చిన వాళ్ళు జంగాలు. గణాయత జంగాలు సంచార జీవన విధానాన్ని కలిగి ఉండి కొన్ని ప్రదేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు.

ఆంధ్రప్రాంతంలో విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఏలూరు, నూజివీడు, రావులపాలెం, తాడేపల్లిగూడెం, కాకినాడ, తెనాలి, ఒంగోలు, అనకాపల్లి ప్రాంతాలలోను, రాయలసీమలో మైదుకూరు, నంద్యాల, పొన్నాపురం, కర్నూల్‌, అనంతపురం, ప్రొద్దుటూరు, పులివెందుల, కదిరి, చిత్తూరు, జమ్మలమడుగు, నెల్లూరులలోనూ, ఇక తెలంగాణా ప్రాంతానికి వస్తే నర్సంపేట, వరంగల్‌, కరీంనగర్‌, చేర్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్‌, మక్తల్‌, గద్వాల, నారాయణఖేడ్‌, మహబూబ్‌నగర్‌, హయత్‌నగర్‌ ప్రాంతాలలో విరివిగా స్థిరపడ్డారు.

స్థావరాలు ఏర్పాటు చేసుకున్నా సంచార జీవన విధానం మాత్రం మారలేదు. ప్రదర్శనలకు సంబంధించినంత వరకు సంచారం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి తిరిగి స్థావరాలకు చేరుకోవడం వారి జీవనవిధానం. గణాయత జంగాలు, పగటి వేషాలేకాక కాటిపాపలు, మందహెచ్చులు, బాలసంతులు, శారదకాండ్రు, విప్రవినోదులు, బుర్రకథ, యక్షగాన కళాకారులుగా వివిధ కళారూపాల్లో రాణిస్తున్నారు. ఇక వీరు ప్రదర్శించే పగటివేషాల కొస్తే ముందు దాదాపు 64 వేషాలు ప్రదర్శించేవారు. అవి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కారణాల వల్ల వాటి సంఖ్య తగ్గి 32కు కుదించబడ్డాయి. వివిధ అంశాలుగా, విడి భాగాలుగా, ముఖ్యాంశాలుగా, స్వగతం, సంభాషణ, వచనం, పద్యం, పాట, నృత్యం ఇలా అనేక అంశాలతో సాగే పగటివేషాలు ముప్ఫయి రెండు - అవి:

 1. ఆది బైరాగి
 2. బుడబుక్కలు
 3. చాత్తాది వైష్ణవులు
 4. మందులవాళ్ళు
 5. సోమయాజులు - సోమిదేవమ్మ
 6. ఫకీరు
 7. లంబాడీ
 8. బోడి బ్రాహ్మణ స్త్రీలు
 9. వీరబాహు
 10. గొల్లబోయ
 11. భట్రాజు
 12. కోయ వేషం
 13. కోమటి - లింగబల్జి
 14. దేవర పెట్టె
 15. దేవాంగులు
 16. అత్తరు సాయిబు
 17. శిద్ది కంచినీ
 18. కారువాసోమయాజి
 19. ఎరుకల సోది
 20. పిట్టలదొర
 21. వడ్డి ఉప్పర
 22. కొమ్మదాసరి
 23. కాశికావిళ్ళ
 24. చిట్టి పంతులు-పఠానీ
 25. హరిదాసు
 26. జంగమదేవర
 27. పాములోళ్ళు
 28. గంగిరెద్దులు
 29. అర్ధనారీశ్వర
 30. శక్తి
 31. రంభ-శుకముని
 32. శారద

సాధారణంగా జానపద కళారూపాలు కుల కథాగానాల రూపంలో ప్రధాన కులాలను ఆధారం చేసుకొని జీవించే ఆశ్రిత కులాలచే ప్రదర్శించబడతాయి. అయితే పగటివేషాలు మాత్రం ఏ ప్రధాన కులాలను ఆశ్రయించక ఒక సామూహిక ప్రేక్షక ఆదరణకి సంబంధించి ప్రదర్శితమయ్యే విలక్షణ కళారూపం.

పగటివేషాల ఇతివృత్తాలను పరిశీలిస్తే సమాజంలోని వివిధ కులవ్యవస్థల, వాటి జీవన విధానాన్ని వ్యంగ్యాత్మక ధోరణిలో ప్రదర్శిస్తాయి. అంటే ఒకవిధంగా అవి పగటివేషధారుల ప్రపంచవీక్షణను తెలియజేస్తాయి. ఈ పగటి వేషాలు ఒకే కథారూపంలో ఉండవు. ప్రధాన వేషం మీద, లేదా ఒక అంశం మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రదర్శనా స్థలాన్ని, ప్రాంతాన్ని బట్టి మార్చుకోవటానికి వీలుగా ఉంటాయి. ఈ వెసులుబాటు వల్లనే దీనిని విలక్షణ కళారూపంగా పేర్కొనడం జరిగింది. ఈ కళారూప అధ్యయనం వల్ల, ప్రదర్శనా సామర్థ్యాన్ని మరింత విపులంగా అర్థం చేసుకోగలిగితే అటు జానపద పరిశోధకులకు, ఇటు ఆధునిక రంగస్థల పరిశోధకులకు, ప్రయోక్తలకు ఇతివృత్త నిర్మాణం, ప్రయోగధోరణికి సంబంధించిన అనేక విషయాల పట్ల మరిన్ని కొత్త ఆలోచనలు రేకెత్తడానికి అవకాశం ఏర్పడుతుంది.

ఇంకో సౌలభ్యం ఏమిటంటే ఈ ప్రక్రియ ఏ కళారూపాన్నైనా తనలో కలుపుకొని, తనదైన శైలిలో ప్రదర్శించ గలిగిన సామర్థ్యం, శైలి కలిగిఉండడం. ఇప్పటికీ, బహుశా ఎప్పటికీ ప్రతిరోజు ఆంధ్రదేశంలో ఏదో మూల పగటివేష ప్రదర్శన కొనసాగుతూనే ఉంటుంది. అది దాని ప్రత్యేకత.


డా॥ జి. భరద్వాజ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నివాసం హైదరాబాదు. ఇండియన్‌ థియేటర్‌ మీద, జానపద కళారూపాల మీద పరిశోధన చేశారు.


ఈ వ్యాసము చైతన్య స్రవంతి - తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 లోనిది. ఆ కార్యక్రమాల వివరాలను ఇక్కడ చూడగలరు. దీనిని ఇక్కడ ఉంచుటకు అనుమతినిచ్చిన TANA వారికి, జంపాల చౌదరిగారికి మా కృతజ్ఞతలు. దీనికి మాకు తోడ్పడిన వాసిరెడ్డి నవీన్‌గారికి, సీత(అక్షర క్రియేషన్స్‌)గారికి మా కృతజ్ఞతలు.


AndhraBharati - AMdhra bhArati - vilaxaNa jAnapada kaLArUpaM - pagaTi vEShaM : DA\.. ji. bharadvAja - Dr. G. Bharadwaja - TANA 2006 Chaitanyasravanti - telugu vachana sAhityamu - vyAsamulu ( telugu andhra )