వచన సాహిత్యము వ్యాసములు ఆంధ్రుల జానపద ఆరాధనా నృత్య రీతులు

ఆంధ్రుల జానపద ఆరాధనా నృత్య రీతులు : డా॥ వి. సింగారావు

చైతన్య స్రవంతి
తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 నుంచి
TANAవారి సౌజన్యంతో.

భరతశాస్త్రము ననుసరించి కరణాంగహార రేచక విన్యాసముల ప్రదర్శన కలిగినట్టి, దైవారాధనకు సంబంధించినట్టిది మార్గి నృత్యము. ఆయా ప్రాంతములలో నివసించు ప్రజలు తమ వినోదార్థము వృద్ధి పొందించుకున్నట్టి నృత్య సంప్రదాయము దేశికళ. నృత్యాభినయములందు ఒక భావము ప్రకటించుటకు శాస్త్రీయ నృత్త, నృత్య హస్తములు, కరణాంగహార ప్రయోగము నాట్యధర్మి. అట్లుగాక స్వాభావికముగా అభినయించుట లోకధర్మి.

నృత్యకళ కొన్ని ప్రత్యేక తెగలవారిచే అభ్యసించబడి పాండితీప్రకర్ష కనువైన కళగా రూపొంది ప్రతిభావంతులచే ప్రదర్శింపబడుతూ వచ్చినది. శాస్త్రముతో సంబంధములేక లోకధర్మిపై ఆధారపడినవి జానపద నృత్యములు. జానపదులు అధికోత్సాహం కలిగినప్పుడు అమితానందపూరిత మనస్సులలో ఆహ్లాదం వెల్లివిరిసేటట్లు చిందులు తొక్కి, గంతులు వేసి ఆ మానసికానందాన్ని ఒలకబోసుకొంటారు. సౌంజ్ఞారూపకమైన భావ వ్యక్తీకరణతో సర్వాంగాలతో చేసినది అభినయంగాను, హృదయంలోంచి వచ్చిన అమాయక పలుకులే పాటలుగా, వారి పదఘట్టనలే నృత్యముగా రూపొందాయి. ఈ నృత్యములెక్కువ కష్టమైనవి కావు. ప్రత్యేక సాధన అవసరము కాదు. ఎల్లరూ పాల్గొనుటకు వీలైన బహు సులభపద్ధతిలో ఏర్పాటగుటచే పల్లెల్లోని ప్రతివారు వీటిలో పాల్గొనగల్గుతున్నారు.

ఆలయమునందు స్వామి సన్నిధిని చేయు నృత్యములు ఆరాధనా నృత్యములు. కాగా కొలువు నందు చేయునది కేళికా ప్రదర్శన. శాస్త్రీయ పద్ధతులతో దేవనర్తకి ఆరాధనా నృత్యము సలుపును. గ్రామదేవతల సంబరాలు, మొక్కుబడులు, సంక్రాంతి తెలుగునాట ప్రధానమైన పండుగలు. ఈ పండుగలలో గ్రామదేవతలకు నైవేద్యాలిచ్చుటకు గరగలు ఊరేగింపు చేస్తుంటే డప్పుల మీద మాదిగలు సప్తతాళాలు వాయిస్తుంటే, గరగలెత్తుకున్న చాకళ్ళు ఘటనృత్యం చేస్తూ రాగతాళలయాభినయ బద్ధంగా చిందులు తొక్కుతూ తమ దేవతలకు ఆరాధనా నృత్యాలు సలుపుతారు. ఈ జానపద నృత్యములలో జనపదులు ఊరూర, పల్లెపల్లె, వాడవాడ రామాయణ, మహాభారత గాథలను, శివపురాణ గాథలను, వీరుల గాథలను రసవత్తరంగా ప్రదర్శించి ఆరాధించుచున్నారు. గొబ్బి, కోలాటము, బతుకమ్మలాట, చిరుతల భజన, తప్పెటగుళ్ళు మున్నగునవే కాక జంగం కథ, పల్నాటి కథ, కాటమరాజు కథ, బొబ్బిలి కథలోని నృత్యములన్నియు జానపద ఆరాధనా నృత్యమునకు సంబంధించినవని, వీరభద్రుని సంబరములోని వీరనాట్యము, సింహాచల దేవుని సేవ మొదలైనవి జానపద ఆరాధనా నృత్యమునకు సంబంధించినవని నటరాజ రామకృష్ణగారు చెప్పియున్నారు.

గొబ్బి

గొబ్బి అనే పదం గర్భా అనే పదం నుండి ఉద్భవించిందని డా॥ బి. రామరాజుగారు, టి. దొరెప్పగారు వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఉత్తరదేశంలో గర్భనాట్యం పేరున రాసక్రీడ పండుగ చేస్తారు. దీని ననుసరించే మన తెలుగు స్త్రీలు కుమ్మ (బృందగానం) చేస్తే బాలికలు గొబ్బి పాడతారు. గొబ్బి అంటే గోపికాదేవి. తల్లిగొబ్బి, పిల్లగొబ్బి అని రెండు రకాలు. తల్లిగొబ్బికి అయిదు గొబ్బెమ్మలు, పిల్లగొబ్బికి మూడు గొబ్బెమ్మలు ఉంచుతారు. ధనుర్మాసంలో ఆంధ్రదేశంలోని ఆడపిల్లలు గోమయాన్ని తీసుకువచ్చి గుండ్రని కందుకములవలె తయారుచేసి, పై భాగాన గురుగు చేసి అందులో పువ్వులు గుచ్చుతారు. ఇంటి ముందు చిత్ర విచిత్రములైన రంగవల్లులను తీర్చిదిద్ది, గొబ్బెమ్మలను పసుపు కుంకుమలతో అలంకరించి, పూజించి, ధూపదీప నైవేద్యములర్పించి అలంకార ప్రాయంగా ఆ రంగవల్లుల మధ్యనుంచెదరు. తరువాత బాలికలందరూ రంగురంగుల దుస్తులు ధరించి, ఆనందంతో వలయాకారంగా నిలిచి, చప్పట్లు చరుస్తూ, పాటలు పాడుతూ, పాటకు తగినట్లుగా అడుగులు వేస్తూ, పాట గమనాన్ని బట్టి వేగాన్ని పెంచుతూ గొబ్బి పాటలను పాడుతూ, తమ భక్తిశ్రద్ధలను వెల్లడిస్తారు. గొబ్బి పాటలలో పౌరాణిక గాథలకు సంబంధించిన పాటలు ఎక్కువ. కొన్ని ప్రాంతాలలో గొబ్బి గౌరి వ్రతం చేస్తారు. వివిధ కోర్కెలు తీర్చమని పాటలు పాడుతూ నృత్యం చేస్తారు.

సుబ్బీ గొబ్బెమ్మా సుఖములియ్యవే
చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే
మొగిలి పువ్వంటి మొగుణ్ణియ్యవే

అంటూ చక్కని కుటుంబసౌఖ్యాన్ని, ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించమని గొబ్బిదేవతను వేడుకొంటారు. అన్నమయ్యలాంటి వాగ్గేయకారులందరూ గొబ్బిపదాల్ని రచించారంటే ఆనాడు అవి ప్రజల్ని ఎంతగా అలరించాయో అర్థం చేసుకోవచ్చు. ధనుర్మాసమంతనూ ఈ గొబ్బిదేవత పూజలో బాలికలు గడుపుతారు. దీనికే గొబ్బియాలు అని పేరు.

బతుకమ్మలాట

దేవీ నవరాత్రోత్సవములలో స్త్రీలు బతుకమ్మను ఆరాధిస్తారు. ఈ ఆచారము తెలంగాణ ప్రాంతంలో అధికంగా ఉన్నది. వివిధ రంగుల పుష్పములను సేకరించి గోపురాకారముగా పేర్చి వీధి గుమ్మము ముగ్గులతో అలంకరించి పుష్పశిఖర రూపములో నున్న బతుకమ్మను పూజించి స్త్రీలందరూ గుమిగూడి బతుకమ్మ పాటలు పాడుతూ తాళయుక్తముగా చప్పట్లు చరుస్తూ వలయాకారంగా తిరుగుతూ నృత్యం చేస్తారు. తొమ్మిదిరోజులు ఈ విధంగా దేవిని సేవించి, ఆరాధించి పదవ రోజున చల్దుల బతుకమ్మ పూజతో ముగిస్తారు. ఈరోజు ఉత్సాహంతో మహిళలు పేర్చే పూలు మనిషి ఎత్తున ఉండుట కూడా కద్దు. ప్రతి దినమూ పూజానంతరం పుష్ప శిఖరమును నీట వదులుతారు. ఇదొక విధమైన గౌరీ దేవ్యారాధనగా పేర్కొనవచ్చును.

కోలాట కోపులు

కోల అంటే కర్రపుల్ల. ఆట అంటే తాండవం, నృత్యం, నాట్యం, క్రీడ, విహారం అనీ. కోలాటం అంటే పుల్లలతో నటనం లేక నర్తనం లేక తాండవం అని చెప్పవచ్చుననీ, అంటే రెండు చేతులతోనూ కర్రముక్కలు పట్టుకొని పదాలు పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతి కర్రముక్కను వేరొకరి చేతి కర్రముక్కలతో తాకించే ఒక ఆటని కోలాట ప్రక్రియ గురించి విశేషించి పరిశోధన గావించిన డా॥ బిట్టు వెంకటేశ్వర్లుగారు వివరించారు.

కోలాటము వేయునప్పుడు వివిధ రకముల గతుకులకు చెందిన పాటలు పాడుతూ అందుకు తగిన విధముగా నృత్యమాడుటకు కోపు అని పేరు. కోలాట నృత్యమును స్త్రీలు, పురుషులు కూడా చేస్తారు. వ్యవసాయ వృత్తియందున్న రైతు పురుషులు ఈ కోలాటములలో పాల్గొంటారు. దినమంతా కష్టించి పొలం పనిచేసి, సంధ్యవేళ ఇల్లు చేరి, భోజనాదులు ముగించుకొన్న పిదప వినోదముగా కాలము గడుపు ఆటలలో కోలాటము ముఖ్యమైనది. కోలాట విద్యలో నిపుణులైనవారు కరీంనగర్‌ జిల్లాలో అధికముగా ఉన్నారు. సుమారు నలుబది ఏబది కోపులను తెలిసిన వారు కూడా కరీంనగర్‌ జిల్లాలో నున్నారు.

ఆంధ్రప్రజల జీవితంలో ఈ కోలాట నృత్యం పెనవేసుకొనిపోయి ఉన్నది. భక్తిభావంతో దేవుని స్తంభాన్ని పట్టుకొని ఇంటింటికీ తిరిగి, ప్రతి ఇంటిముందూ రాత్రిపూట ప్రొద్దుపోయే వరకూ ఈ కోలాట నృత్యాలు చేస్తుంటారు. ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో, ఈ కోలాట నృత్యాలను పెద్దపెద్ద తిరునాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీధుల్లోనూ ప్రదర్శిస్తారు. ఇరవై నుంచి నలభైమంది వరకు రంగురంగుల కోల కర్రలతో కాళ్ళకు గజ్జెలు కట్టుకొని బృంద నాయకుని ఆధ్వర్యంలో ఇద్దరు చొప్పున ఒకరికొకరు ఎదురుగా నిలబడి వలయాకారంగా నృత్యం నిర్వహిస్తారు. అందులో జడకోపు కోలాటంలో లయబద్ధంగా నృత్యంచేస్తూ కోలాలతోనే జడను అల్లడం, విప్పడం చేయడం అనేది అత్యంత అద్భుతమైన ప్రదర్శన.

తప్పెటగుండ్లు

తప్పెటగుళ్ళు గుండ్రంగా టిన్నురేకుతో చేయబడిన తప్పెటలాంటి ఒక వాయిద్య పరికరాన్ని మెడలందు ధరించి రెండు చేతులతోనూ, వివిధ గతులతో ఉధృతంగా వాయిస్తూ, కాళ్ళకు గజ్జెలు కట్టి ఒకే విధమైన రంగుల నిక్కర్లు తొడిగి, కేకలతో, అరుపులతో కేరింతలు కొడుతూ, ఆనందంతో వలయాకారంగా తిరుగుతూ కట్టుదిట్టమైన అడుగులతో అందరూ వంగుతూ లేస్తూ, గెంతుతూ సుదీర్ఘ రాగాలతో ఆలాపన చేస్తూ మృదుమధురమైన సంగీతంతో ప్రేక్షకులను రంజింపచేస్తారు. పురుషులు మాత్రమే ఈ నృత్యమందు పాల్గొనెదరు. అమ్మవారి కొలుపులందు సాధారణంగా ఈ నర్తకులు పాల్గొంటారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని గొల్లకులానికి చెందినవారు వర్షాభావంతో పశువులకు, గొఱ్ఱెల, మేకల మందలకు పశుగ్రాసం లభించనప్పుడు భగవంతుని కటాక్షంకోసం చేసే దేవతారాధనలో ఈ తప్పెటగుళ్ళు నర్తనం చేస్తారు. గంగజాతర, దశావతారాలు మొదలైనవి యాదవులు జరిపే తప్పెటగుళ్ళు నర్తనాల్లో ముఖ్యమైనవి.

జోగాట

తెలంగాణ ప్రాంతంలో హరిజనులలో జోగువారను ఒక నర్తకులశాఖ వారున్నారు. వారు డప్పుల వాద్యము నాధారముగా చేసుకొని నృత్యము చేసెదరు. ఈ జాతి వారిలో ఎవరైనా చనిపోయినప్పుడు శవమును స్మశాన వాటికకు గొనిపోవునప్పుడు జోగాట ఆడుతూ వెళ్తారు. వీరి నృత్యములన్నింటిలోను పిండోత్పత్తి క్రమము తెల్పునట్టిది ప్రత్యేకంగా చెప్పదగినది. ఈ నృత్యంలో జీవుడా తల్లి గర్భంలో బిందురూపంలో ప్రవేశించినది మొదలు, వివిధ మాసములందు ఆ పిండము పెరుగు విధానము, ప్రసవం, అటుపై జీవితములోని వివిధ ఘట్టములను వారు చక్కగా ఆడతారు. ఇలాంటిదే వేదాంతచర్యలతో కూడిన గొల్లకలాపము నందలి గొల్లభామ శృతి, స్మృతుల ఆధారంగా ఉదాహరణలిస్తూ అభినయించెదరు. కేవలం చావు సందర్భాలలోనే కాక సంతోష సమయాలలో, వేడుకలలో, వివాహాలలో, ఉత్సవాల్లో కూడ ఈ జోగువారు వారి డప్పు నృత్యాన్ని ప్రదర్శిస్తారు.

సర్కారాంధ్రలో వీరిని మాదిగలంటారు. చాటింపు వేయడం, జాతర్లకు, ఉత్సవాలకు డప్పు వాయిద్యాలను వేస్తుంటారు.

వీరనాట్యము

ఆంధ్రదేశంలో వీరశైవం విరివిగా ప్రచారములోనున్న కాలములో ఆలయములందు దేవదాసీల నృత్యారాధనయే కాక శివభక్తుల తాండవపద్ధతికిచెంది వీరావేశము కలిగించు నాట్యము కూడ చేసేవారు. వీరరస ప్రధానమైన రచనలను, ఖడ్గములను చదువుతూ వీరొక చేత ఖడ్గమును, మరొక చేత డాలును ధరించి నృత్య మాడేవారు. దీనినే వీరనాట్యమంటారు. ఈ నాట్యము యుద్ధ నాట్యములను పోలి ఉంటుంది.

వీరుల కొలుపు

ముఖ్యముగా పల్నాటి యుద్ధమున వీరస్వర్గ మలంకరించిన ఆంధ్రయోధుల సంస్మరణార్థము ఈ వీరుల కొలుపు ప్రారంభమైనది. ఇందులో ప్రదర్శింపబడే ఆరాధనా నృత్యములు కూడా తాండవ పద్ధతికి చెందినట్టివే. కార్యమపూడి, మాచెర్ల, గురజాల మున్నగు చోట్ల పల్నాటి తాలుకాలోని ఈ వీరుల కొలుపు లీనాటికీ ప్రతి యేటా జరుగుతుంటాయి.

సేవ

ఇత్తడి రేకులతో చేసిన పెద్దపెద్ద తాళములను చేత ధరించి సింహాచల నృసింహస్వామిని కీర్తిస్తూ నెమలి కుంచెను చేతిలో పట్టుకొని నాయకుడు నామం చెబుతుంటే అందరూ కలిసి పాడుతూ వలయాకారంగా తిరుగుతూ చేసే నృత్యం సేవ. దీనినే సింహాద్రి అప్పన్న సేవ అంటారు.

హరిహరీ నారాయణాదినారాయణో
కరుణించి మమ్మేలు కమలలోచనుడా

అనునది ఈ సేవలో చెప్పబడే నామం పద్ధతిలోనిదే.

గరగలు

దేవీ నవరాత్రములలో గాని, అమ్మవారి జాతరలలో పంచ శిరస్సుల నాగుతో రంగురంగుల వస్త్రాలతో, అలంకరంచిన కరండాలను తలపై ధరించి డప్పుల వాద్యముల కనుగుణంగా చేసే భక్తిరస ప్రధానమైన నాట్యములనే గరగ నృత్యములంటారు.

బుర్రకథ లేక జంగముకథ

ఈ పాటకులు తంబురను చేతబూని వ్రేలికి తగిలించుకొన్న కంచు కడియాలతో తాళం వేయటం. ఇరుప్రక్కల నున్నవారు గుమ్మటలు వాయించుచూ వంత పాడగా పల్నాటి వీరగాథ, బొబ్బిలి కథ, బాలనాగమ్మ కథ మొదలైన కథలను గానం చేయుచు మధ్యమధ్య రస భావ పోషణ కొరకు నాట్యం చేస్తూ కథను చెప్పెదరు. సాధారణంగా కోస్తా జిల్లాలో జంగము వారు, హైదరాబాదులో పిచ్చుకగుంట్ల వారు ఈ కథలను చెప్పుదురు. ఈ పాట పాడేటప్పుడు ప్రతి పాట చివర తందాన అను మాటలను పాడి ముగించుటచే దీనికి తందాన పాట అని కూడ పేరు కలదు. ఇది ఒక అతి ప్రాచీనమైన కళ. నేటి కాలమున ఈ విద్య గొప్ప ప్రచారకళగా ఉపయోగపడుతున్నది.

జముకుల కథ

కుంచము ఆకారము కలిగి అడుగు భాగములో కప్పబడి దాని మధ్యనుండి యొక నరమును బిగించి లోపలి వైపునకు లాగి, దాని చివరను ఒక కర్రముక్క ముడివైచి ఆ కర్రముక్కను ఒక చేతితో బిగించి పట్టుకొని శ్రుతిబద్ధముగా దానిని లాగుచూ రెండవ చేతితో ఆ నరముపై తాళగతులతో పలికించుచు వీరగాథలను పాడుచు కాలి మువ్వలను పలికించుచు నవరసంబు లొలుకునట్లు నాట్యమాడువారే జముకుల కథకులు. వాయించే వాద్యములకే జముకులని పేరు. వీరు హరిజన జాతికి చెందిన గోసంగి కులమువారు. ఈ జముకు మీదనే వారు మృదంగ శబ్దాలన్నీ చాలా హెచ్చరికగా పలికిస్తారు.

చిరుతల భజన

పామర భజన చేసేవారు సాధారణంగా పల్లెవాసులే. వీరు శ్రామిక జీవులు. పగలంతయూ కష్టించి, పశులు గాసి రాత్రులందు అందరూ ఒక్కచోట చేరి తమకు అనువైన కీర్తనలను కరతాళాలతోను, కర్రచిడతలతోను, కంచుతాళాలతోనూ గంతులు వేస్తూ తమకు తోచిన రాగ తాళాలతో వాయిస్తూ భజన చేసుకొంటారు. వీరు ఊరంతా తిరుగుతూ కూడా భజనలు చేయడం కలదు. తీరిక సమయాల్లోనే కాక పర్వదినాల్లోనూ, తీర్థాలలోనూ, ఉత్సవాలలోనూ కూడ తాళ మృదంగాలతో భజనలు చేస్తూ ఉండేవారు. మొదట ఒక కర్ర దీపపు సెమ్మె మీద తిళ్ళిక అనే మట్టి ప్రమిదలో నూనెపోసి గుడ్డ వత్తివేసి దీపారాధన చేసి దాని చుట్టూ వారంతా నిల్చుని భక్తి ప్రపత్తులతో భజనలు చేసేవారు. రైతాంగంతో మిక్కిలి చేరికగా ఉండే భట్రాజు శాఖవారు భజన విధానాన్ని సంస్కరించి పాడడంలోనూ, అడుగులు వేయడంలోనూ తాళ మృదంగాది వాద్య పరికరాలను ఉపయోగించడంలోను మెలకువలు పెంచారు. కర్రదీపపు సెమ్మెకు మారుగా ఇత్తడి సెమ్మెను, తరువాత పొన్నచెట్టును దీపారాధనకు ఏర్పాటుచేశారు. రానురాను రామాయణ గాథలను, కృష్ణలీలలను, తత్వాలను కూడా ఇందులో చేర్చి ఆరాధన కావించటం చేస్తున్నారు.

తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందిన ఒక నూతనమైన ప్రక్రియ. చిరుతల భజన, భాగవతం రెండింటినీ చేర్చి ఒక నూతన పద్ధతిలో నృత్యకేళిగా రూపొందించినట్టిదే ఈ చిరుతల భజన. రామాయణ మహాభారత కథలలోని పాత్రల వేషములు ధరించి నర్తకులు చిరుతలు వాయిస్తూ గుండ్రముగా తిరుగుతూ నృత్యం చేస్తారు. తమతమ పాత్రలు వచ్చినప్పుడు ఆ వలయం మధ్యలోనికి వెళ్లి ఆయా పాత్రల అభినయానికి తిరిగి బృందనర్తనం సల్పుదురు.

ఇవన్నీ జానపద నృత్యములలోని ఆరాధనా విధానములను తెలుపు రీతులు.


డా॥ వెన్నిశెట్టి సింగారావు ధరణికోట ఆర్‌.వి.వి.యన్‌. కాలేజీలో తెలుగు విభాగం రీడర్‌గా ఉన్నారు. తిరునగరి రామాంజనేయులు రచనలపై పిహెచ్‌.డి చేశారు. గుంటూరులో జరిగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ఉంటారు.


ఈ వ్యాసము చైతన్య స్రవంతి - తెలుగునాట తానా కార్యక్రమాల సంచిక, 2006 లోనిది. ఆ కార్యక్రమాల వివరాలను ఇక్కడ చూడగలరు. దీనిని ఇక్కడ ఉంచుటకు అనుమతినిచ్చిన TANA వారికి, జంపాల చౌదరిగారికి మా కృతజ్ఞతలు. దీనికి మాకు తోడ్పడిన వాసిరెడ్డి నవీన్‌గారికి, సీత(అక్షర క్రియేషన్స్‌)గారికి మా కృతజ్ఞతలు.


AndhraBharati - AMdhrula jAnapada ArAdhanA nR^itya rItulu : DA\.. vi. siMgArAvu - Dr. V. SingaRao Dr. Vennisetti Singarao