వచన సాహిత్యము వ్యాసములు హైదరాబాదు ప్రజల స్వాతంత్ర్యోద్యమము

హైదరాబాదు ప్రజల స్వాతంత్ర్యోద్యమము
తెలంగాణలో జాతీయోద్యమాలు - డా॥ దేవులపల్లి రామానుజరావు

ఇంగ్లీషువారికి నైజాం లొంగుబాటు
ప్రజల తిరుగుబాటు
ప్రతిఘటించిన మొట్టమొదటి సంఘటన
భేదోపాయము
రోహిలాల సాహసము
విఫలయత్నము - కర్నూలు పతనము
'1857' ప్రభావము - తీవ్రమైన సంచలనము
నానాసాహెబ్‌ నాయకత్వము
సంకుల సమరము
వీరుడు భీమ్‌రావ్‌
రహస్య కార్యకలాపాలు
రాంజీ గోండు
గడీ కైవసము
కట్టుదిట్టాలు కుప్ప కూలిపోయినవి
చారిత్రక సత్యము
ఎవరికిని తీసిపోలేదు
మేధావుల దోహదము
నైజాం ప్రాంతాల అప్పగింత - పొరుగు వారితో సంబంధాలు
ప్రజల విజృంభణ
మౌల్వీల ప్రోత్సాహము
ఆంగ్లేయ సేనాని అపజయం - వెంకటప్పనాయక్‌ తొందరపాటు
వీరమరణము
దర్బారు ఈవల జహంగీర్‌ఖాన్‌ ధైర్యము
వాసుదేవ బలవంత్‌ ఉదంతం
చటోపాధ్యాయ బహిష్కరణము
విద్యావ్యాప్తి - వైజ్ఞానిక చైతన్యము
స్వాతంత్ర్య సమర యోధులు
విప్లవ వీరులకు నిలువ నీడయిచ్చిన నేల
శాంతి ఉద్యమాలు - సరోజినీదేవి
కొన్ని ఉజ్జ్వల ఘట్టములు
ఆంగ్లేయుల అనుమానాలు
దివాన్‌ చందూలాల్‌ హయాం
ప్రభుత్వముపై ప్రజల తిరుగుబాటు
నాందేడ్‌ జిల్లాలోని నాయక్‌ తిరుగుబాటు
చెలరేగిన స్థానిక నాయకులు

ఇంగ్లీషువారికి నైజాం లొంగుబాటు

క్రీస్తుశకము 1800 ప్రాంతమున భారతదేశములో ఇంగ్లీషు సామ్రాజ్యము స్థిరత్వము పొందినదని చెప్పవచ్చును. 1800 సంవత్సరమున అప్పటి గవర్నర్‌ జనరల్‌ స్వదేశీ సంస్థానాధీశ్వరులతో చేసుకొనిన ఒడంబడిక ప్రకారము నైజాం బ్రిటిష్‌వారికి సామంతుడయ్యెను. భారత దేశములో బ్రిటిష్‌వారి పరిపాలనను స్వదేశీ సంస్థానాధీశ్వరులు శిరసావహించినప్పటికిని ప్రజలలో వారి యెడల సానుభూతి లేకపోవుటయే కాక వారిని తొలగించవలెనను తీవ్రమైన ఆకాంక్ష ప్రబలి యుండెనని మన దేశములోని స్వాతంత్ర్యోద్యమము స్పష్టీకరించుచున్నది. ప్రజల ఆమోదము బ్రిటిషువారికి ఎన్నడును లభించియుండలేదు.

ప్రజల తిరుగుబాటు

ముఖ్యముగా బ్రిటిష్‌వారిని తొలగించుటకై మన దేశమునందలి అన్ని రాష్ట్రాలలో విప్లవ ఉద్యమాలు బయలుదేరిన సత్యము చాలా ప్రధానమైనది. ఈ విప్లవోద్యమాల చరిత్ర రక్తాంకితమై, మహోజ్వలమై, దేశభక్తి ప్రపూరితమై, త్యాగశోభితమై, ఉదాత్తమై విలసిల్లుచున్నది. అన్ని రాష్ట్రాలలో వలెనే నాటి హైద్రాబాదు రాష్ట్రములో బ్రిటిషు పరిపాలనకు వ్యతిరేకముగా విప్లవాలు బయలుదేరినవి.

ప్రతిఘటించిన మొట్టమొదటి సంఘటన

1803 వ సంవత్సరమున ఇంగ్లీషువారికిని, మహారాష్ట్రులకును యుద్ధము జరిగినది. నైజాం ఇంగ్లీషువారికి సామంతుడై యుండెను. అప్పుడు మహిపత్‌రాయ్‌ అను ప్రముఖుడు నైజాం ఏలుబడి క్రింద బీరారు రాష్ట్రమునకు గవర్నర్‌గా నుండెను. ఇప్పటికిని ఈయన వంశమువారు హైద్రాబాదులో ప్రముఖులై యున్నారు. అప్పటి నైజాం మహారాష్ట్రులకు వ్యతిరేకముగా ఇంగ్లీషువారి పక్షమున వెళ్ళి పోరాడవలసినదని రాజా మహిపత్‌రాయ్‌ను ఆజ్ఞాపించెను. కాని ఆయన ఉద్దేశపూర్వకముగా సహకరించలేదు. దానిమీద నైజాంకు, ఆయన ప్రధానులకు మహిపత్‌రాయ్‌పైన ఆగ్రహము కలిగినది. అప్పుడు నైజాంకు మీర్‌ఆలం ప్రధానమంత్రిగా నుండెను. ఇంగ్లీషు రెసిడెంటు మరియు నైజాం ప్రధాని మీర్‌ఆలం ఉభయులు మహిపత్‌రాయ్‌ నడవడికి కోపించి, మహిపత్‌రాయ్‌ను 1804లో ఉద్యోగము నుండి తొలగించిరి. అప్పుడు ఆయన షోలాపూర్‌ వెళ్ళి తిరుగుబాటు గావించెను. అందుచేత మహిపత్‌రాయ్‌ను అణచివేయుటకై 1806వ సంవత్సరమున నైజాం సైన్యాలు పంపబడెను. కాని యీ సైన్యాలను మహిపత్‌రాయ్‌ ఓడించి తరిమివేసెను. తరువాత ఇంగ్లీషువారి సైన్యాలు వెళ్ళి మహిపత్‌రాయ్‌ను ఓడించెను. ఈ ఓటమి ఫలితముగా మహిపత్‌రాయ్‌ ఇందూరు సంస్థానాధిపతి హోల్కారును ఆశ్రయించు నిమిత్తము పలాయనమై వెళ్ళెను. మార్గమధ్యమున మిక్కిలి దీన పరిస్థితిలో మహిపత్‌రాయ్‌ మరణించెను. ఇది హైదరాబాద్‌ రాష్ట్రములో ఇంగ్లీషు పరిపాలనను ప్రతిఘటించిన మొట్టమొదటి సంఘటన.

భేదోపాయము

1808వ సంవత్సరమున బొలారంలోని ఇంగ్లీషు సైన్యాలను ఇంగ్లీషువారికి వ్యతిరేకముగా తమవైపు త్రిప్పికొనుటకు కొందరు హైద్రాబాదు జాగీర్దారులు ప్రయత్నించిరి. అందుకు వారు హైద్రాబాదు ప్రభుత్వముచేత శిక్షింపబడిరి. ఇట్లు శిక్షింపబడిన వారిలో నూరుల్‌ - ఉమ్రా, రావు రంభా నింబాల్కర్‌ అను ఇరువురు జాగీర్దారులు ముఖ్యులు. ఈ ఉభయులను తమ జాగీరు గ్రామానికి వెళ్ళి అక్కడ నుండి కదలవద్దని అప్పటి ప్రభుత్వము ఆజ్ఞాపించెను.

రోహిలాల సాహసము

1817 వ సంవత్సరమున మూడవ మహారాష్ట్ర యుద్ధము జరిగినది. ఇది భారతదేశ చరిత్రలో చెప్పదగిన యుద్ధము. ఈ యుద్ధములో బ్రిటిష్‌ వారికి సహాయముగా పోరాడవలసినదని నైజాం ఆదేశింపబడెను. అందుచేత నైజాం సైన్యాలు యుద్ధానికి పంపబడెను. కాని నైజాం సైన్యములోని కొందరు రోహిలాలు మహారాష్ట్రులకు వ్యతిరేకముగా పోరాడుటకు నిరాకరించిరి. అప్పుడు వారు ఉద్యోగాల నుండి నైజాంచేత తొలగింపబడిరి. ఆ విధముగా తొలగింపబడిన రోహిలాలకు సర్దార్‌ ఖాన్‌ కోటేజాయి అను ముఖ్యుడు నాయకత్వము వహించి, పూనాకు వెళ్ళి పేష్వాలతో కలిసి, బ్రిటిషు వారికి వ్యతిరేకముగా పోరాడుచు యుద్ధరంగమున మరణించెను. ఆయన మరణానికి హైదరాబాదు నగరములోని ముషీరాబాదు, చెంచల్‌గూడా ప్రాంతంలోని ప్రతి రోహిలా కుటుంబము శోకించినట్లు ఆధారములు కలవు.

విఫలయత్నము - కర్నూలు పతనము

1839 వ సంవత్సరమున ఉత్తర భారతమున వహాబీ ఉద్యమము ప్రారంభమయ్యెను. ఇది బ్రిటిషు పరిపాలనకు వ్యతిరేకముగా ప్రారంభింపబడిన ఉద్యమము. ఈ ఉద్యమ నాయకులలో ఒకరైన మౌల్వీ సలీం హైద్రాబాదు నగరానికి వచ్చి, ఇక్కడ బ్రిటిషువారికి వ్యతిరేకముగా ఒక విప్లవోద్యమము సాగించెను. అప్పుడు హైద్రాబాదుకు నిజాంగా నుండిన నాసిరుద్దౌలాను సింహాసనము నుండి దింపివేసి, ఆయన సోదరుడైన ముబారిజుద్దౌలాకు రాజ్యము అప్పగించి, బొలారంలోని సైన్యమును తమ ఆధీనము చేసుకొనవలెనని ఈ విప్లవకారులు ఉద్దేశించిరి. ఇందుకొరకై వారు కర్నూలు నవాబుతోకూడ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిరి. కర్నూలు నవాబు ఒక లక్షరూపాయల ఆయుధ సామగ్రిని సేకరించి పెట్టెను. బ్రిటిషు పరిపాలనకు ఎదురుతిరిగి బ్రిటిషు వారిని హత్యచేయుటకు ఈ విప్లవకారులు ఏర్పాటు చేసికొనిరి. కాని యీ ఏర్పాటు రహస్యాలు బయల్పడి, ముబారిజుద్దౌలాతోపాటు ఆయన అనుయాయులు నిర్బంధింపబడిరి. కర్నూలు నవాబుతో యీ సందర్భమున రెండు రోజులు యుద్ధము కూడ జరిగినది. యుద్ధములో కర్నూలు నవాబు ఓడింపబడి, కర్నూలు నగరము స్వాధీనము చేసికోబడెను. అప్పుడు కర్నూలు నవాబుగా నుండిన గులాం రసూల్‌ఖాన్‌, యుద్ధములో ఓడింపబడిన తరువాత మద్రాసు పంపివేయబడగా, మార్గ మధ్యమున హత్య గావింపబడెను. హైద్రాబాదు ప్రభుత్వము ఇంగ్లీషు మరియు నైజాం అధికారులతో కూడిన ఒక కమీషన్‌ నెలకొల్పి, ముబారిజుద్దౌలా మరియు ఆయన అనుయాయుల నేరమును విచారణ గావించెను. ఈ విచారణ ఫలితముగా మౌల్వీ సలీం మరియు ఆయన అనుచరులకు 18 సంవత్సరాల కఠిన శిక్ష విధింపబడెను. రాజ వంశీకుడైన ముబారిజుద్దౌలా గోలకొండలో బంధింపబడెను. ఆయన యీ బంధనములోనే 1854 సంవత్సరమున మరణించెను.

'1857' ప్రభావము - తీవ్రమైన సంచలనము

1856వ సంవత్సరమున ఔరంగాబాదులోని అరబ్బులు తిరుగుబాటు లేవదీసిరి. ఈ తిరుగుబాటులో బ్రిటిషువారు ప్రాణాలను కోలుపోయిరి. చాల కష్టముమీద ఈ తిరుగుబాటు అణచివేయబడెను. 1857వ సంవత్సరమున ఉత్తరదేశములో ప్రజలు తిరుగుబాటు చేసిరను వార్త తెలియగానే హైద్రాబాదులో కూడా తీవ్రమైన అలజడి చెలరేగెను. ఔరంగాబాదు లోని దేశీయ సైన్యము ఎదురు తిరిగెను. తరువాత యీ సైన్యము అణచివేయబడి, తొమ్మిదిమందికి ఉరిశిక్ష వేయబడెను. ఇందులో కొంతమంది దేశీయ సైనికులు ఔరంగాబాదు సైన్యమునుండి తప్పించుకొని హైద్రాబాదుకు వచ్చిరి. అప్పుడు హైద్రాబాదుకు దివానుగా (ప్రధానమంత్రి) నుండిన మొదటి సాలార్జంగ్‌ వీరిని బంధించి, ఇంగ్లీషువారి ప్రతినిధియైన రెసిడెంటుకు అప్పగించెను. హైద్రాబాదు పట్టణములోకూడ 1857 సంవత్సరమున తీవ్రమైన అలజడి చెలరేగెను. ఇంగ్లీషు వారిపైన తిరుగుబాటు చేయవలసినదని ప్రజలను కోరుచు కరపత్రాలు పంచిపెట్టబడెను. కాగితాలు గోడలమీద అంటివేయబడెను. అప్పటి దీవాన్‌ సాలార్జంగ్‌ గట్టి రక్షణ యేర్పాటులు గావించెను. కాని 1857వ సంవత్సరము 17వ జూలైనాడు బేగంబజారులోని నూర్లకొద్ది రోహిలాలు తుర్రెబాజ్‌ఖాన్‌, మౌల్వీ అల్లాఉద్దీన్‌ అను దేశభక్తుల నాయకత్వమున రెసిడెంటు మీద దాడి చేసిరి. అప్పుడు సుమారు రెండుగంటలసేపు కాల్పులు జరిగినవి. ఇరువదియైదుమంది చనిపోయిన తరువాత రోహిలాలు తిరోగమించిరి. తుర్రెబాజ్‌ఖాన్‌ అరెస్టు చేయబడెను. తప్పించుకొనిపోవు ప్రయత్నం చేయగా ఆయనను పోలీసులు తూపురాన్‌ గ్రామము వద్ద కాల్చి చంపిరి. మౌల్వీ అల్లావుద్దీన్‌ కూడ అరెస్టు చేయబడి, అండమాన్‌ దీవులకు యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్షమీద పంపబడెను. అక్కడ ఆయన 1884వ సంవత్సరమున మరణించెను. రాష్ట్రములోని ఇతర ప్రాంతాలలో కూడ అలజడులు చెలరేగెను. రాయెరాయాన్‌ సంస్థానోద్యోగియైన సోనాజి పంత్‌ 1857 జనవరి నెలలో ఉత్తర దేశములోని నానాసాహెబ్‌ పేష్వా కొక లేఖ వ్రాసెను. అందులో దక్షిణ దేశములో తిరుగుబాటుకు తగిన యేర్పాటులు చేయవలెనని కోరెను.

నానాసాహెబ్‌ నాయకత్వము

బీదర్‌ జిల్లాలోని నర్ఖేడ్‌ అను గ్రామము పట్వారీయైన రంగారావు ద్వారా యీ లేఖ నానాసాహెబ్‌కు పంపబడెను. అప్పుడు నానాసాహెబ్‌ కాన్పూరు సమీపమునందలి బేతూరులో నుండెను. అక్కడ ఆయన యీ ఉత్తరము అందుకొని తిరిగి అదే రంగారావు ద్వారా హైద్రాబాదులోని ముఖ్యులైన సోనాజిపంత్‌, గులాబ్‌ఖాన్‌ (రోహిలా ముఖ్యుడు), సఫ్దరుద్దౌలా (రావు రంభా నింబాల్కర్‌ ఆశ్రితుడు) మొదలైనవారికి ఉత్తరాలు వ్రాసెను. రంగారావు దక్కన్‌కు తిరిగివచ్చి నాందేడుజిల్లా దేగ్లూరు తాలూకాలోని కౌలాస్‌రాజా అయిన రాజా దీప్‌ సింగ్‌ను కలుసుకొనెను. సఫ్దరుద్దౌలా కూడ నానాసాహెబ్‌తో సహకరించగలనని వాగ్దానము చేయుచు జాబు వ్రాసెను. రాజా దీప్‌సింగ్‌ 800 సైనికులను సిద్ధము చేసుకొని, బ్రిటిష్‌వారిని హతమార్చి నాగపూరుకు వెళ్ళవలెనని నిశ్చయించుకొనెను. అయితే ఈ ప్రయత్నాలు తెలుసుకోబడి రాజా దీప్‌సింగ్‌, సఫ్దరుద్దౌలా, రంగారావులు అరెస్టు చేయబడిరి. రాజా దీప్‌సింగ్‌ జాగీరును ప్రభుత్వము స్వాధీనము చేసుకొని, ఆయనను మూడు సంవత్సరాలు నిర్బంధించెను. సఫ్దరుద్దౌలా స్థిరచరాస్థులు జబ్తీ చేయబడి, ఆయనకు యావజ్జీవ నిర్బంధశిక్ష విధింపబడెను. రంగారావు ప్రత్యేకముగా బ్రిటిష్‌వారిచే ఆల్వాల్‌లో విచారణ చేయబడి, మరణశిక్షకు గురిచేయబడెను.

సంకుల సమరము

1858 లో పైజాపూరుకు చెందిన గోవిందరావు దేశపాండే ఔరంగాబాదులో 2000 భిల్లులతో కూడిన సైన్యము సమకూర్చుకొని, బ్రిటిషువారిపై తిరుగుబాటు చేసెను. క్యాప్టెన్‌ పెడ్లర్‌ నాయకత్వమున ఇంగ్లీషు సైన్యానికి ఈ భిల్లు సైన్యానికి మధ్య సంకుల సమరం జరిగెను. ఈ యుద్ధములో 40 మంది భిల్లులు మరణించిరి, చాలమంది నిర్బంధింప బడిరి. గోవిందరావు పరిస్థితి ఏమైనదో తెలుపు వివరాలు దొరకలేదు. నానాసాహెబ్‌పేష్వా సేనానాయకుడైన తాంతియాతోపె రోహిలా సైన్యముతో అజంతా పట్టణములో ప్రవేశించి, పట్టణమును స్వాధీనము చెసుకొని, కొన్ని రోజులు తన స్వాధీనములో నుంచుకొనెను. తరువాత ఘోర యుద్ధము జరిగి, బ్రిటిషు సైన్యముచే ఓడింపబడెను. రోహిలాలు అనేకులు బస్మత్‌ తాలూకాకు వెళ్ళిపోయిరి. ఫర్బనీజిల్లా బస్మత్‌ తాలూకా లోని ఔలా జాగీర్దార్‌ అయిన పీర్జాదా ఈ రోహిలాలను కలుసుకొనెను. అప్పుడు వారందరు బ్రిటిషువారితో పోరాడిరి. చాలామంది ఇంగ్లీషువారు యీ యుద్ధములో హతమార్చబడిన తరువాత, ఈ సైన్యము అణచి వేయబడి, రోహిలాలు నామావశేషులు గావింపబడి, జాగీరారు పీర్జాదా బంధింపబడి, యావజ్జీవ నిర్బంధశిక్ష అనుభవించెను. 1858 సంవత్సరము ఫిబ్రవరి నెలలో గుల్బర్గా జిల్లాలోని షోలాపూర్‌ రాజు అయిన వేంకటప్ప నాయక్‌ బ్రిటిషువారి మీద తిరుగుబాటు చేసెను. తీవ్ర సంఘర్షణ తరువాత ఆయన ఓడింపబడి, నిర్బంధింపబడి, మద్రాసుకు పంపివేయబడుచుండగా మార్గమధ్యమున హైదరాబాదు పట్టణ సమీపమునందు అంబరుపేట వద్ద ఆయన ఆత్మహత్య గావించుకొనెను.

వీరుడు భీమ్‌రావ్‌

1858 జూన్‌ నెలలో రాయచూర్‌లో భీమ్‌రావు దేశాయి అను వీరుడు ఒక సైన్యము సమకూర్చుకొని, కొప్పల్‌ కోటను స్వాధీనము చేసుకొనెను. తరువాత ఇంగ్లీషు సైన్యాలు వచ్చి ఆయనమీద దాడి చేసెను. యుద్ధములో భీమ్‌రావు దేశాయితోపాటు నూటయేబది మంది సైనికులు మరణించిరి. మిగిలినవారు నిర్బంధింపబడి మరణశిక్షకు గురియైరి.

రహస్య కార్యకలాపాలు

ఆ రోజులలో నానాసాహెబ్‌పేష్వా, తాంతియాతోపేల వార్తాహరులు గూఢచారులు చాలమంది హైద్రాబాదు రాష్ట్రములో సంచరించిరి. ఇంతకు ముందు రంగారావు పట్వారినిగూర్చి ప్రస్తావించినాను. ఇంకొక బ్రాహ్మణుడు తాంతియాతోపే వద్దనుండి షోలాపూర్‌ రాజాకు సందేశము తీసికొని పోవుచుండగా గుర్తింపబడి నిర్బంధింపబడి మరణశిక్ష పాలయ్యెను. నానాసాహెబ్‌పేష్వా బంధువైన రావుసాహెబ్‌ సైన్యమును సమకూర్చు కొనుటకు దక్కన్‌కు వచ్చెను. నిర్మల జాగీర్దార్‌ అయిన వెంకట్రావుకు ఆయన కొన్నాళ్ళు అతిథిగా నుండెను. తరువాత ఆయన హైద్రాబాదు వచ్చెను. కాని ఒక ఇంగ్లీషు సైనికుడు ఆయనను వెంటాడగా తప్పించుకొనిపోయెను. తరువాత యీ రావు సాహెబ్‌ పేష్వా ఆగ్రావద్ద నిర్బంధింపబడి, మరణశిక్షకు గురియయ్యెను. రావుసాహెబ్‌ పేష్వాకు ఆతిథ్య మిచ్చిన నేరమునకై వేంకట్రావు జాగీరును ప్రభుత్వము స్వాధీనము చేసికొనెను.

రాంజీ గోండు

ఆదిలాబాదు జిల్లాలోని గోండులుకూడ ఇంగ్లీషువారికి ఎదురు తిరిగిరి. వారి నాయకుడు రాంజీ గోండు. ఉట్నూరు తాలూకాలో గోండులకు ఇంగ్లీషువారికి మధ్య యుద్ధము జరిగి గోండులు పరాజితులైరి. రాంజీ గోండు నిర్బంధితుడై నిర్మల్‌కు తీసికొనిరాబడి, అక్కడ ఒక చెట్టుకు ఉరి వేయబడి చంపబడెను. ఈనాటికిని ఆ చెట్టు నిర్మలలో నున్నది. దానిని రాంజీ గోండు చెట్టు అని చెప్పెదరు.

గడీ కైవసము

1848 సంవత్సరమున ఇంగ్లీషువారు సతారా సంస్థానమును స్వాధీనము గావించుకొనిరి. తరువాత 1858-1867 సంవత్సరాలమధ్య చాల మంది సతారా ప్రజలు హైద్రాబాదుకు వచ్చి ఔరంగాబాదు, బీదర్‌, బీడ్‌ జిల్లాలలో అలజడులను చెలరేగజేసిరి. 1867 సంవత్సరములో జంగ్‌ బహద్దర్‌ అను పేరుగల రాంరావు అను యోధుడు కొన్ని నూర్లమందితో కూడిన సైన్యమును సిద్ధము చేసుకొని, అష్టీవద్ద గల గడీని స్వాధీనము చేసుకొని తన జండాను ప్రతిష్టించెను. తిరిగి సతారా జిల్లాను బ్రిటిషు వారి నుండి తీసికొని స్వాధీనము చేసికొనుట తన ఉద్దేశమని ఆయన వెల్లడి చేసెను. తరువాత 1867లో రాంరావు నిర్బంధింపబడి, అండమాను దీవులకు పంపబడి, యావజ్జీవ ద్వీపాంతరశిక్ష విధింపబడెను. ఈ వివరాల వలన కొన్ని సంగతులు స్పష్టమగుచున్నవి -

 1. అన్ని జిల్లాలలో స్వాతంత్ర్యోద్యమము వ్యాప్తి జెంది అభివృద్ధి చెందెను. ఇంగ్లీషు ప్రభుత్వమునకు వ్యతిరేకముగా తిరుగుబాటులు చెలరేగినవి.
 2. నూర్లమంది చంపబడిరి.
 3. వేలకొద్ది జనులు నిర్బంధములో నుంచబడిరి.
 4. డజన్ల వీరులు అండమాన్‌ దీవులకు పంపబడిరి.
 5. లక్షల రూపాయల ఆస్తి జప్తు చేసుకొనబడెను.

కట్టుదిట్టాలు కుప్ప కూలిపోయినవి

ఇందువలన సాలార్జంగు చేసిన యేర్పాటుల ఫలితముగా హైద్రాబాదులో యెటువంటి అల్లరులు చెలరేగలేదను సంగతి సత్యము కాదని స్పష్టమగుచున్నది. 1857 సంవత్సరము తరువాత నైజాం రాజభవనపు ప్రాంగణములో అప్పుడు ఇంగ్లండు ప్రభుత్వ ప్రతినిధిగా నుండిన రెసిడెంట్‌ డేవిడ్‌సన్‌ను హత్య చేయుటకు ప్రయత్నము జరిగియుండెను. 1860వ సంవత్సరము తరువాత ఇంగ్లీషు వారిని పారద్రోలుటకు మరి కొన్ని ప్రయత్నాలు జరిగినవి. మహబూబ్‌నగరం జిల్లాలో పండుగ శాయన్న అను యోధుడు తెల్లదొరను చంపాలె అను నినాదము లేవదీసి తిరుగుబాటు చేసియుండెను. తరువాత యితనికి మరణశిక్ష విధించుట జరిగినది.

చారిత్రక సత్యము

నర్మదానదికి దక్షిణాన మన దేశములో 1857వ సంవత్సరమున యెటువంటి అలజడులు చెలరేగక పరిస్థితి ప్రశాంతముగ నుండెనని కొందరు చెప్పుచుందురు. కాని ఇది సరికాదు. 1857వ సంవత్సరముననే కాక అంతకుముందు కూడ ఈ ప్రాంతమున స్వాతంత్ర్యోద్యమాలు విజృంభించి యుండెను. చరిత్ర ఈ సత్యమును ఋజువు చేయుచున్నది. 1800 నుండి 1857 వరకు ఈ ప్రాంతమున పరదేశ పరిపాలనకు వ్యతిరేకముగ ఎన్నియో తిరుగుబాట్లు జరిగి యుండెను. ఈ ఘట్టము మన స్వాతంత్ర్య సమరదశ యొక్క మొదటిదశ; రెండవదశ 1857 నుండి ప్రారంభమై 1885 న ముగిసినది.

ఎవరికిని తీసిపోలేదు

1857 నుండి 1859 వరకు అనగా రెండు సంవత్సరాలు పూర్తిగా హైదరాబాదు నాయకులు తాంతియాతోపేతో సన్నిహిత సంబంధాలు కలిగియుండిరి. ఈ కాలమున విదేశ పరిపాలనను తుదముట్టించుటకు జరిగిన మహాప్రయత్నాలలో అసంఖ్యాకులు పాల్గొని యుండిరి. ఎన్నియో నూర్లమంది చెరసాలలో నిర్బంధింపబడిరి. లక్షల రూపాయల విలువగల ఆస్తి జప్తి చేయబడియుండెను. ఈ విధముగా 1857 నాటి స్వాతంత్ర్య సంగ్రామమున హైద్రాబాదు సంస్థాన ప్రజలు తమ వంతును పూర్తిగా పంచుకొనియుండిరి. ఇతర రాష్ట్రాల వారికి ఈ విషయమున ఈ ప్రాంత ప్రజలు ఏమాత్రమును తీసిపోలేదు. చిత్రమేమనగా, 1857వ సంవత్సరమున ఇంగ్లీషు వారికి పరమ విశ్వాస పాత్రుడుగానుండిన సాలార్జంగ్‌ తరువాత కొన్ని సంవత్సరములకే ఇంగ్లీషువారి అయిష్టతకు పాత్రుడయ్యెను. బీరార్‌ సమస్యపైన సాలార్‌జంగ్‌ ఇంగ్లీషు వారి క్రోధమునకు గురి అయ్యెను. ఆనాడు లార్డ్‌ లిట్టన్‌ సాలార్‌జంగ్‌ను గూర్చి వ్రాయుచు, ఈయన వలన బ్రిటిష్‌ సామ్రాజ్యమునకు ప్రమాదము కలదని పేర్కొనుట ఇందుకు నిదర్శనము.

మేధావుల దోహదము

1857లో జరిగిన స్వాతంత్ర్య సంగ్రామము దేశీయులలో కొంతమంది ప్రతిబంధముగా నిలువకుండినచో మన దేశ చరిత్రనే మార్చివేసెడిదని నిస్సందేహముగా చెప్పవచ్చును. ముఖ్యముగా ఆనాడు హైదరాబాదు ప్రధానమంత్రిగా నుండిన సాలార్జంగ్‌ ఇంగ్లీషు వారికి అండగా నిలిచి, స్వాతంత్ర్యోద్యమాలను అణచడానికి తోడ్పడి, మన దేశ చరిత్రలో తన కీర్తిని శాశ్వతముగా కళంకము చేసికొనినాడు. సాలార్జంగ్‌ ఒక వైపున బ్రిటిష్‌ వారిని బలపరుచుచుండగా ప్రజలు వారికి వ్యతిరేకముగా పనిచేసిన సత్యము గమనింప దగియున్నది. ముఖ్యముగా పత్రికా సంపాదకులు ప్రజలలో చైతన్యము కలిగించుటకు విశేషముగా కృషి కావించి యుండిరి. స్వాతంత్ర్యోద్యమము యొక్క రెండవ దశయందు పొరుగు రాష్ట్రాలనుండి వచ్చిన మేధావులు స్థానిక స్వాతంత్ర్యోద్యమాలకు మంచి దోహదము కావించినారు. వీరిలో బెంగాలు నుండి వచ్చిన అఘోరనాథ చటోపాధ్యాయ, మద్రాసునుండి వచ్చిన ముల్లా అబ్దుల్‌ ఖయూమ్‌, రామచంద్ర పిళ్ళె, ఢిల్లీ నుంచి వచ్చిన సయ్యద్‌ అఖిల్‌ అను పత్రికా రచయిత, ఇటావా నుండి వచ్చిన మొహీబ్‌ హుసేన్‌ యీ స్వాతంత్ర్యోద్యమాలలో పాల్గొని యుండిరి. 1879 లో జమాలుద్దీన్‌ ఆఫ్ఘన్‌ అను ఆసియా సమైక్యవాది హైదరాబాదుకు వచ్చి, ఇక్కడి వారిలో మధ్య ప్రాచ్య రాజకీయాలయందు అభిరుచి కల్గించినాడు. తత్ఫలితముగా ఇక్కడివారిలో మధ్య ప్రాచ్యమున ఇంగ్లీషువారు అనుసరించుచున్న విధానాల పట్ల అసంతృప్తి ఏర్పడినది.

హైద్రాబాదు సంస్థాన ప్రభుత్వము ఇంగ్లీషువారి దేశీయ, విదేశీయ విధానాలను బలపర్చుచుండగా హైద్రాబాదు ప్రజలు వారి దేశీయ విదేశీయ విధానాలను నిరసించిరి. పత్రికలు తీవ్ర విమర్శలు గావించినవి. 1883వ సంవత్సరమున అఘోరనాథ చటోపాధ్యాయ అరెస్టు జరిగినది. ఈ అరెస్టు చట్టబద్ధమైన ఆందోళనకు మార్గదర్శకమైనది. జాతీయ కాంగ్రెస్‌ స్థాపనను ప్రభుత్వ ప్రతినిధులుగా మొహిసినుల్‌ ముల్క్‌ మొదలగువారు వ్యతిరేకించగా ప్రజా ప్రతినిధులైన అఘోరనాథ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్‌ ఖయూమ్‌, మొహీబ్‌ హుసేను, రామచంద్ర పిళ్ళె మొదలగువారు హర్షించిరి. 1883 కు ముందు అనగా అఘోరనాథ చటోపాధ్యయ అరెస్టుకు ముందు వచ్చిన ఉద్యమములన్నియును హింసాత్మకమైనవి. 1883 నుండి చట్టబద్ధమైన ఆందోళనాయుగము ప్రారంభమగుచున్నది. కావుననే 1857 నుండి 1883 వరకు గల కాలమును మనము రెండవ దశగా స్వీకరించవచ్చును.

నైజాం ప్రాంతాల అప్పగింత - పొరుగు వారితో సంబంధాలు

1853వ సంవత్సరమున అనగా 1857కు నాలుగు సంవత్సరాలకు ముందు ఈస్టు ఇండియా కంపెనీకి నైజాంకు మధ్య ఒక ఒడంబడిక జరిగినది. ఈ ఒడంబడిక వలన నైజాం కంటింజెంట్‌ మీద ఇంగ్లీషు వారు చేసిన ఖర్చులకు బదులుగా బీరార్‌, ఉస్మానాబాదు, రాయచూర్‌ జిల్లాలను ఇంగ్లీషువారికి ప్రత్యేకించుట జరిగినది. ఇది హైద్రాబాదులోని అన్ని తరగతుల ప్రజలకు అసంతృప్తిని కలిగించినది. అసలు 1800 సంవత్సరమునుండియే ఇంగ్లీషు వ్యతిరేకభావాలు హైద్రాబాదు ప్రజలలో ప్రబలముగా నుండెను. హైదరాబాదు ప్రజలకు దేశములోని ఇతర ప్రాంతాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉండెను. హైదరాబాదు నగరానికి వివిధ రాష్ట్రాల ప్రజల రాకపోకలు చురుకుగా జరిగుచుండెను. అరబ్బులు అధిక సంఖ్యాకులుగా వచ్చి నైజాము ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిరి. రోహిలాలు, ఆప్ఘన్‌లు కూడా దక్కనుకు ఎక్కువ సంఖ్యలో వచ్చుచుండిరి. పంజాబు నుండి సిక్కులను చాలా మందిని రాజా చందూలాల్‌ పిలిపించి యుండెను. ఈ విధముగా ఇతర రాష్ట్రాల స్వాతంత్ర్యోద్యమాలతో హైదరాబాదు ప్రజలు గట్టి సంబంధాలు కలిగి యుండిరి. ఇటువంటి పరిస్థితులలో సాలార్జంగ్‌ హైదరాబాదు ప్రధాని అయ్యెను.

ప్రజల విజృంభణ

1857వ సంవత్సరమున ఉత్తరదేశములో చెలరేగిన స్వాతంత్ర్యోద్యమాల వార్తలు హైదరాబాదుకు చాల తొందరగా చేరుచుండెను. హైదరాబాదులో అప్పటివరకే ప్రబలముగా నుండిన ఇంగ్లీషు వ్యతిరేక భావాలు మరింత విజృంభించినవి. 17వ జులై 1857 నాడు మిట్ట మధ్యాహ్నము అయిదువేల ప్రజలు హైదరాబాదు రెసిడెన్సీమీద దాడి గావించిరి. వీరికి తుర్రెబాజ్‌ ఖాన్‌ అను వీరుడు నాయకత్వము వహించెను. ఇంగ్లీషు సైనికులు ఎక్కువ క్రమశిక్షణ కలిగి యున్నందువలనను, ఎక్కువ నిశితమైన ఆయుధాలు కలిగి యున్నందునను యీ దాడి విఫల మయ్యెను. ఇంగ్లీషువారి ఆయుధాలకు గురియై యీ దాడి జరిపినవారిలో చాల మంది మరణించిరి. ఈ దాడిలో మతవిభేదాలను పాటించక హిందువులు, ముస్లిములు పాల్గొనియుండిరి. ఇది మన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన వీరగాథ.

మౌల్వీల ప్రోత్సాహము

విద్వాంసులైన మౌల్వీలు కొందరు ఆనాడు యీ ఉద్యమాలను ప్రోత్సహించి వీరికి నాయకత్వము వహించిరి. వీరిలో మౌల్వీ అల్లాఉద్దీన్‌ ప్రముఖుడు. ఆయన మక్కా మసీదులో మాట్లాడుచు, ఇంగ్లీషువారిని బలపరచినవారు, ఇంగ్లీషు ప్రభుత్వము నిలుచుటకు సహాయము చేసినవారు ఇస్లామ్‌ మతమునకు శత్రువులనియు, ఇస్లామ్‌ ద్రోహులుగా పరిగణింప బడగలరనియు ఉద్ఘాటించెను. మౌల్వీలతోపాటు జాగీర్దార్లు మొదలగు ఉన్నత వంశీయులు కూడ ఈ ఉద్యమాలను బలపరచిరి. వీరిలో షంసుల్‌ ఉమ్రా కొడుకు ఇఫ్త్‌భారుల్‌ ముల్క్‌ను పేర్కొన వలసి యున్నది. ఈ విధముగా జాగీర్దార్లు మొదలైన ఉన్నత శ్రేణివారు రాజకీయమయిన మార్పును కోరిరి. ప్రజల ఉద్యమాలకు కొందరు జాగీర్దారుల బలము లభించియుండెను. వీరిని అదుపులో పెట్టుట ఆనాటి మంత్రికిగాని, నైజాం దర్బారుకు గాని సాధ్యముకానిపని యని కర్నల్‌ డేవిడ్‌సన్‌ వ్రాసినాడు. 1857 నాటి స్వాతంత్ర్యోద్యమాలకు నాయకత్వము వహించిన తుర్రెబాజ్‌ఖాన్‌ ఏదో విధముగా తప్పించుకొని పోయెను. మౌల్వీ అల్లాఉద్దీన్‌ ద్వీపాంతరవాస శిక్షమీద అండమాన్‌ దీవులకు పంపబడెను.

ఆంగ్లేయ సేనాని అపజయం - వెంకటప్పనాయక్‌ తొందరపాటు

షోలాపూర్‌ లోని రాజా వెంకటప్పయ్యనాయక్‌ ఆనాటి స్వాతంత్ర్యయోధులలో మరొక ముఖ్యుడు. రాజకీయ స్వాతంత్ర్యము ఆయన ఆశయమై యుండెను. పెద్ద సైన్యమును సమీకరించి ఉండెను. ఇది ఇంగ్లీషువారికి అనుమానము కలుగ జేసినది. ఈ సైన్యమును అణచి వేయుటకు 1858వ సంవత్సరమున ఇంగ్లీషువారు తమ బలమును పంపగా, కర్నల్‌ న్యూబెరి ఇంగ్లీషు సేనానాయకుడు రోహిలాలతో సంఘర్షణయందు షోలాపూర్‌ వద్ద చంపబడెను. తరువాత రాజ వెంకటప్పయ్య నాయక్‌ తొందరపడి హైదరాబాదు చేరెను. హైదరాబాదులో ఆయనను ఇంగ్లీషు రెసిడెండుకు పట్టి ఇచ్చుట జరిగినది. ఈయన విచారణ చేయబడి యావజ్జీవ శిక్షకు గురిచేయబడెను. కొన్ని సంవత్సరాలు నిర్బంధములో నుండి ఈయన తుపాకితో ఆత్మహత్య చేసుకొనెను. వెంకటప్పయ్యనాయక్‌ విచారణ వలన్‌ మిరాజ్‌, కొల్హాపూర్‌, సర్గుంద్‌, కొబ్బల్‌, రాయచూర్‌, షోలాపూర్‌లలో విప్లవోద్యమాలు చెలరేగినట్లు వెల్లడి యగుచున్నది.

వీరమరణము

భీమ్‌రావ్‌ దేశాయి అను యోధుడు కొబ్బల్‌ దుర్గమును స్వాధీనము గావించుకొని, దానిని తన బలమునకు కేంద్రముగా చేసికొనెను. ఇంగ్లీషువారు ఈదుర్గమును స్వాధీనము చేసుకొనుటకై దాడి చేసిరి. అప్పుడు జరిగిన యుద్ధములో భీమ్‌రావ్‌ దేశాయి మరియు ఆయన కుడిభుజమైన పెంచన్‌ గౌడ్‌ వీరమరణము పొందిరి. ఆ కాలమున తాతియాతోపే పేరు ఇంగ్లీషువారికి సింహస్వప్నముగా నుండెను. తాతియాతోపే వార్తాహరులు చాలామంది హైదరాబాదుకు వచ్చుచుండిరి. గులామ్‌ హుసేన్‌ అను బస్మత్‌నగర్‌ జాగీర్దార్‌ ఆనాటి యోధులలో పేర్కొనదగినవాడు. రాజా రాయ్‌రాయాన్‌ జాగీరులో దప్తర్‌దార్‌గా నుండిన సోనాజీ పండిత్‌ 1857 ఫిబ్రవరి నెలలో నానాసాహెబ్‌ పేష్వాకు రంగారావు పాగె ద్వారా ఒక ఉత్తరమును పంపియుండెను. ఈ విధముగా దేశమంతటను స్వాతంత్ర్య భావాలు తీవ్రముగా ప్రబలియుండెను.

దర్బారు ఈవల జహంగీర్‌ఖాన్‌ ధైర్యము

1859 వ సంవత్సరము మార్చి నెల 15వ తేదీ నాడు హైదరాబాదులో నైజాం ఒక దర్బారు చేసెను. అప్పుడే కలకత్తానుండి తిరిగివచ్చిన రెసిడెంటు గవర్నర్‌ జనరల్‌ ముఖ్యసందేశమును నైజాంకు అందచేసెను. తరువాత రెసిడెంటు ప్రధానమంత్రి చేతిలో చేయి వేసుకొని ఈవలకు వచ్చుచుండగా జహంగీర్‌ ఖాన్‌ అనువాడు రెసిడెంటును హత్య చేయుటకు ప్రయత్నించెను. ఆ ప్రయత్నము విఫలమైనది. ఈ విధముగా ఆ రోజులలో వివిధ ప్రాంతాలయందు స్థానిక నాయకులు బయలుదేరి యీ ఉద్యమాలకు నాయకత్వము వహించిరి. ఈ రెండవ దశలో అనగా 1857 నుండి 83 వరకు సాలార్జంగే హైదరాబాదు ప్రధానమంత్రిగా నుండెను. ఆ కాలమున ఆయన అడుగడుగున రాజకీయ ఆందోళనములను ఎదుర్కొని అణచివేయవలసి వచ్చెను. 1867వ సంవత్సరమున సాలార్జంగ్‌ కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టెను. కాని ఆ సంస్కరణలు ప్రజలను సంతృప్తిపరచలేదని వేరుగా చెప్పవలసిన పనిలేదు.

వాసుదేవ బలవంత్‌ ఉదంతం

1879వ సంవత్సరమున బ్రిటిష్‌వారికి ఎదురు తిరిగిన పూనాలోని మహారాష్ట్ర నాయకుడగు వాసుదేవ బలవంత ఫడ్కే, గుల్బర్గా జిల్లాలోని సరిహద్దు గ్రామాలలో కొంతకాలము రక్షణ పొందియుండెను. గంగాపూర్‌ లోని దత్తాత్రేయ దేవాలయములోకూడ ఈయన కొంతకాలము నివసించియుండెను. ఇందుకొరకై అక్కడి బ్రాహ్మణ పూజారులు అరెస్టు చేయబడిరి. కాని, వాసుదేవ బలవంత్‌ అక్కడ దొరకలేదు. తరువాత ఆయన బీజాపూర్‌ జిల్లాలోని దేవన్‌గిరిలో పట్టుపడినాడు. ఆయన విచారణ వలన హైదరాబాదులోని ఇస్మాయిల్‌ఖాన్‌తో పాటు ఇతర రోహిలాలు ఆయనకు సహాయము చేయుటకు వాగ్దానము చేసిరనియు, ఇంగ్లీషువారికి వ్యతిరేకముగా పెద్ద సైన్యమును సమీకరించుటకు నిశ్చయించిరనియు తెలియవచ్చుచున్నది. ఇంచుమించుగా ఇదేకాలమున హైదరాబాదు రాష్ట్రపు తూర్పు సరిహద్దులో గోదావరిజిల్లా చోడవరము ప్రాంతమందలి రంప గ్రామములో ఒక పెద్ద తిరుగుబాటు జరిగెను. ఇదే సమయమున భద్రాచలము తాలూకాలోని రేకపల్లెలో మరొక తిరుగుబాటు జరిగెను. ఈ రెండు తిరుగుబాట్లు 1880 సెప్టెంబరులో అణచివేయబడెను. రంప, రేకపల్లె గ్రామాలు హైదరాబాదు సరిహద్దున నుండుటవలన ఖమ్మం జిల్లాలోని కొన్న తాలూకాలపై వీని ప్రభావము బాగుగా పడినది. మధిర తాలూకాలోని కాకపల్లె ప్రాంతమున, పాల్వంచ దగ్గరి ఒడ్డిగూడెము ప్రాంతమున, ఇతర ప్రాంతాలయందును సంఘర్షణలు జరిగినవి. 1883లో సాలార్‌జంగ్‌ చనిపోయినాడు. ఆయన మరణానంతరము రాజా నరేంద్రబహద్దుర్‌, లాయఖలీఖాన్‌ అను వారికి రాష్ట్ర పరిపాలన అప్పగించబడినది. ఆ కాలమున హైదరాబాదు నుండి వాడీ వరకు ఒక రైల్వే లైను ఉండెను. ఆ రైల్వే లైనును ఒక ఇంగ్లీషు కంపెనీకి అప్పగించి, యీ లైనును వరంగల్లువరకు, అక్కడి నుండి ఒకవైపున భద్రాచలము, బెజవాడ వరకు, ఇంకొకపైపున చాందావరకు పొడిగించుటకు ఒక ప్రణాళిక సిద్ధము చేయబడినది.

చటోపాధ్యాయ బహిష్కరణము

ఈ ప్రణాళిక సాలార్జంగ్‌ కాలముననే ఆమోదింపబడెను. ఈ ప్రణాళికవల్ల రాష్ట్రమునకు ఆర్థిక నష్టము కలుగునని భావించి విద్యావంతులు కొందరు ఇందుకు వ్యతిరేకముగా పోరాడుటకు ఒక కమిటీని ఏర్పరిచిరి. ఈ కార్యక్రమానికి డాక్టర్‌ అఘోరనాథ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్‌ ఖయ్యూమ్‌లు నాయకత్వం వహించిరి. తత్ఫలితముగా అఘోరనాథ చటోపాధ్యాయ ఉద్యోగమునుండి తొలగింపబడి హైదరాబాదు నుండి పంపివేయబడెను.

విద్యావ్యాప్తి - వైజ్ఞానిక చైతన్యము

1885వ సంవత్సరము వరకు హైదరాబాదులో విద్యావ్యాప్తికి కొన్ని సదుపాయాలు ఏర్పడి, ప్రజలలో చైతన్యము కలుగజేయగలిగిన ఒక ఉన్నత విద్యావంతుల శ్రేణి అవతరించినది. దారుల్‌ ఉలూమ్‌, సిటి హైస్కూల్‌, చాదర్ఘాట్‌ హైస్కూల్‌, మదర్సే ఆలియా, మదర్సే ఐజా మొదలయిన ప్రభుత్వ పాఠశాలలతో పాటు క్రిస్టియన్‌ మిషనరీలు స్థాపించిన గ్రామర్‌ స్కూల్‌, ఆల్‌సెంట్స్‌ స్కూల్‌, వెస్లి స్కూల్‌, సెంట్‌ ఆన్స్‌ కాన్వెంటు మొదలయినవి పని చేయసాగినవి. వీటితో పాటు కొన్ని ప్రయివేటు సంస్థలు కూడ స్థాపితమైనవి. వీనిలో ముఫీదుల్‌ నామ్‌ హైస్కూల్‌, కీస్‌ హైస్కూల్‌, ధర్మవంత్‌ హైస్కూల్‌, మహబూబ్‌ కాలేజీ పేర్కొనతగినవి. హైదరాబాదులో 1887 వరకు మెడికల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఏర్పడినవి. కొందరు విద్యావంతులు ఉన్నత విద్య కొరకు ఇంగ్లాండుకు వెళ్ళివచ్చుట కూడ జరుగుచుండెను. న్యాయవాదుల వర్గము ఒకటి అవతరించినది. పత్రికలు స్థాపితమై ప్రజాభిప్రాయమును దిద్దసాగినవి. 1864 సంవత్సరమున మొట్టమొదటి ఇంగ్లీషు పత్రిక దక్కన్‌ టైమ్స్‌ స్థాపించబడినది. 1885 వరకు సుమారు ఇరువది అయిదు ఇంగ్లీషు, ఉర్దూ పత్రికలు వెలువడినవి. షౌకతుల్‌ ఇస్లామ్‌ వంటి ఉర్దూ పత్రికలు పత్రికా స్వాతంత్ర్యమునకై సాగించిన పోరాటము చారిత్రాత్మకమైనది; మహోజ్వలమైనది. అప్పటివరకు ఫార్సీ భాష రాజభాషగా నుండెను. ప్రథమముగా 1884వ సంవత్సరము ఫిబ్రవరి 21 తేదీనాడు ఉర్దూను రాజభాషగా ప్రభుత్వము ప్రకటించినది. క్రమక్రమముగా ఫార్సీ స్థానమును ఉర్దూ ఆక్రమించి రాజభాషగను, విద్యాబోధనా భాషగను రూపొందినది.

హైదరాబాదులోని పరిస్థితులు ఇట్లుండగా 1882వ సంవత్సరము డిసెంబరు నెల 28వ తేదీనాడు బొంబాయిలోని గోకుల్‌దాసు తేజ్‌పాల్‌ సంస్కృత కళాశాల భవనమున అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన జరిగినది. ఈ సంఘటనను హైదరాబాదులోని విద్యావంతులు, స్వాతంత్ర్యోద్యమ నాయకులు హర్షించిన సత్యమును ఇదివరకే ప్రస్తావించినాను. ఈ విధముగా 1885వ సంవత్సరమున స్వాతంత్ర్య ఉద్యమము యొక్క రెండవ దశ ముగిసి మూడవ దశ ప్రారంభమగు చున్నది.

స్వాతంత్ర్య సమర యోధులు

1895వ సంవత్సరమున జవ్వాద్‌ హుస్సేన్‌ అను వ్యక్తి అప్పటి రెసిడెంటును హత్య చేయుటకు ప్రయత్నించిన నేరముపై హైదరాబాదు నుండి వెలుపలకు పంపివేయబడినాడు. 1897లో పూనాలో కర్నల్‌ రేగాండ్‌ను హత్యచేయ ప్రయత్నించెనను నేరారోపణలో చిక్కుకున్న ఛాపేకర్‌ కొంతకాలము హైదరాబాదుకు వచ్చి దాగుకొని, రాయచూరు జిల్లా గంగావతీ తాలూకాలో అరెస్టు చేయబడుట జరిగినది. 1879లో వాసుదేవ్‌ బల్వంత్‌ ఫడ్‌కే అను మాహారాష్ట్ర విప్లవ వీరుడు గుల్బర్గా జిల్లా లోని గాన్గాపూర్‌లో అరెస్టు చేయబడెను. 1899లో బాబాసాహెబు అను విప్లవవీరుడు బీడ్‌ జిల్లాలో గొప్ప తిరుగుబాటు లేవదీసెను. అప్పటి ఇంగ్లీషు సైన్యమునకు యీయన సైన్యమునకు మధ్య సంకుల సమరము జరిగెను. 1899 ఏప్రిల్‌ నెల 14వ తేదీనాడు బాబా సైనికులు చాలామంది చంపబడి, బాబా పారిపోవుట జరిగినది. తరువాత అతనిని గూర్చిన వివరాలు తెలియవు.

విప్లవ వీరులకు నిలువ నీడయిచ్చిన నేల

1900 సంవత్సరము తరువాత స్వదేశీ ఉద్యమము ప్రారంభమయినది. బెంగాలు, మహారాష్ట్ర ప్రాంతాల ఉద్యమాల ప్రభావము హైదరాబాదులో కూడ కనపడుచున్నది. హైదరాబాదులో విచారణ చేయ బడినవారు, వెలుపలకు పంపబడినవారు, వెలుపలికి వెళ్ళిపోయినవారు చాలామంది కలరు. స్వదేశీ ఉద్యమముతోబాటు విప్లవోద్యమము కూడ నడచినది. ఉస్మానాబాదు జిల్లాలోని ఔసాగ్రామములో విష్ణుపింగ్లే అను మహారాష్ట్ర వీరుడు కొన్ని సంవత్సరాలు నివసించెను. ఇండియా వైస్రాయి హార్డింగ్‌ పైన బాంబు వేసిన నేరములో చిక్కుకొన్న సేనాపతి బాపట్‌ కొన్ని సంవత్సరాలు ఔరంగాబాదులో దాగుకొనెను. 1909వ సంవత్సరములో నాసిక్్‌ జిల్లా కలెక్టరైన జాక్సన్‌ను హత్యచేసిన విద్యార్థిదళ నాయకుడు అనంతకావేరే కొంతకాలము ఔరంగాబాదులో గడిపెను. 1933లో కాకినాడ బాంబు కేసుతో సంబంధము కలిగిన భయంకరాచారి హైదరాబాదుకు వచ్చి ఆయుధ సామగ్రిని తీసికొని తిరిగివెళ్ళు సందర్భమున కాజీపేటలో పట్టుబడెను.

శాంతి ఉద్యమాలు - సరోజినీదేవి

ఈ విధమైన విప్లవ ఉద్యమాలతో పాటు మొదటి ప్రపంచయుద్ధము తరువాత ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక జిల్లాలలో చట్టబద్ధమైన శాంతియుత ఉద్యమాలు బయలుదేరినవి. ఈ ఉద్యమాలను స్థాపించి పోషించిన వారిలో కేశవరావ్‌ కోరట్‌కర్‌, వామన్‌ నాయక్‌, మాడపాటి హనుమంతరావు గార్లను పేర్కొనవలసి యున్నది. ఈ విధమైన ఉద్యమాలలో ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక మహాసభలతో పాటు హైదరాబాదు రాజకీయ మహాసభను కూడ పేర్కొనవలసి యున్నది. వీటిలో మార్గదర్శకమైనది ఆంధ్ర మహాసభయని మనము గమనించవలసి యున్నది. రాఘవేంద్రరావు శర్మ, తారానాథ్‌ మొదలయినవారు యీ కాలమునందలి రాజకీయ బాధితులు. ఖిలాఫత్‌ ఉద్యమంలో చాలామంది ముస్లింలు పాల్గొనిరి.

హైదరాబాదు కాంగ్రసు వాదులలో మొట్టమొదటి వారిలో నొకరు ముల్లా అబ్దుల్‌ ఖయూం. ఈయన కుమారుడే ముల్లా అబ్దుల్‌ బాసిత్‌. మన జాతీయోద్యమములో అగ్రశ్రేణి నలంకరించి సకల భారత - కాదు - సకల ప్రపంచ ప్రఖ్యాతి వహించిన విదుషీమణి, వీరనారీమణి, త్యాగమూర్తియైన సరోజినీదేవి హైదరాబాదు వాస్తవ్యురాలు; ఆంధ్రుల ఇంటి కోడలు, అఘోరనాథ్‌ చటోపాధ్యాయ కూతురు.

కొన్ని ఉజ్జ్వల ఘట్టములు

ఆంగ్లేయుల అనుమానాలు

క్రీ॥ శ॥ 1800 సంవత్సరమున నైజాం బ్రిటిష్‌ ప్రభుత్వానికి సామంతుడై ఒడంబడికను కుదుర్చుకొని నందువలన ఆయన పరిపాలిత ప్రాంతము రక్షిత ప్రాంతమయ్యెను. ఈ ఒడంబడిక ప్రకారము ఇంగ్లీషు వారికి యుద్ధకాలమునందు సహాయము చేయవలసిన బాధ్యత నైజాముకు కలిగెను. కాని కొంతకాలము వరకు నైజాము సహాయము బ్రిటిష్‌ వారికి సంతృప్తి కరముగ నుండలేదు. మహారాష్ట్రులతో బ్రిటిషు వారికి కలిగిన యుద్ధములలో నైజాము సైనికులు సక్రమముగా సహకరించలేదని బ్రిటిషు వారికి ఆగ్రహము కలిగెను. ఇంతవరకుముందు నిజాము ఫ్రెంచివారి మిత్రుడుగా నుండినందువలన నైజాము సైన్యమునకు కొంత ఫ్రెంచి పక్షపాతము ఉండినట్లు అనుమానించబడెను. ఫ్రెంచివారితో సైన్యసంబంధము వదలిపోయిన తర్వాతకూడ కొంతమంది ఫ్రెంచివారు నైజాము సైన్యములో పనిచేయు చుండిరి. ఈనాటికిని నల్లగొండకు వ్రెళ్ళు త్రోవలో దిల్సుఖ్‌ నగర్‌ వద్ద ఫ్రెంచి వారి గోరీలు కనబడును. హైద్రాబాదులోని త్రూప్‌ బజారు ఫ్రెంచి సైన్యముల ఉనికవలన త్రూప్‌ బజారని పేరందెను. ఫ్రెంచి వారి ప్రభావము ఇప్పటికిన్ని హైదరాబాదులోని ఆనాటి భవనములమీద కనబడును. ఇప్పటి గోషామహల్‌ హైస్కూలులోనికి వెళ్ళి చూసినచో ఫ్రెంచి ప్రభావము గోచరించును. బహుశ ఈ ఫ్రెంచివారితో కలిగిన గాఢ సంబంధము వలననే కాబోలు, చాలాకాలము వరకు నైజాము సైన్యమునకు బ్రిటిషు వారితో ఆప్తత కుదురలేదు. నిజామ్‌ సైనికులు బ్రిటిషు వ్యతిరేకులను భావము బ్రిటిషు వారికి కలిగెను. డ్యూక్‌ ఆఫ్‌ వెల్లింగ్టన్‌ అని ప్రసిద్ధి గాంచిన ఆర్థర్‌ వెల్లస్లీ అపుడు హైదరాబాదు సైనికోద్యోగిగా యుండెను. ఆయన నిజాము సైనికుల యొక్క బ్రిటిషు వ్యతిరేకతను గూర్చి తీవ్రంగా ఆక్షేపించెను. దానిపైన అపుడు గవర్నర్‌ జనరల్‌గా నుండిన వెల్లస్లీ నిజాము ఔదాసీన్యమునకు, నిర్లక్ష్యతకు, మైత్రీ లోపమునకు గట్టిగా మందలించెను. అంతియేగాక నైజాము సైన్యమును కట్టుదిట్టము చేయవలెనని ఆయన సూచించెను. 1812లో అప్పుడు హైద్రాబాదులో రెసిడెంటుగా నున్న ఆంగ్లమహాశయుడు యూరోపియన్‌ సైనికులను కొందరిని నైజాము సైన్యములోనికి దిగుమతి గావించి, నైజాము సైన్యమును సంస్కరించు కార్యము నారంభించెను. ఈ విధముగా సంస్కరింపబడిన సైన్యమే హైద్రాబాదు కంటింజెంట్‌. ఈ సైన్యమే హైదరాబాదు రాష్ట్రములోని తిరుగుబాట్లను అణచివేయుటకు నలుబది సంవత్సరముల వరకు ఉపయోగపడెను. ఈ సైన్యమునకు ముఖ్య కేంద్రము బొల్లారమై యుండెను. దీనికి శాఖలు ముఖ్తల్‌, లింగ్స్‌గూర్‌, మోమినాబాద్‌, ఔరంగాబాద్‌, వరంగల్‌ నగరములలో యుండెను.

దివాన్‌ చందూలాల్‌ హయాం

సుమారు నలుబది సంవత్సరాలు అనగా హైద్రాబాదు రాష్ట్రానికి సాలార్‌జంగ్‌ దివానగునంతవరకు, అప్పటి హైద్రాబాదు ప్రభుత్వ సక్రమ పరిపాలన, సత్పరిపాలనలను గూర్చి తగిన శ్రద్ధ గైకొనినట్లు కానరాదు. అపుడు దివాన్‌గా నుండిన చందూలాల్‌కు ఇంగ్లీషువారి అనుగ్రహమును సంపాదించుటే ప్రధాన లక్ష్యమయి యుండెను. ప్రజలను గూర్చిగాని, పరిపాలనను గూర్చిగాని ఆయన తగిన శ్రద్ధ తీసికొనలేదు. 1800 నుండి 1850 వరకు హైద్రాబాదు రాష్ట్ర పరిస్థితు లీ విధముగా నుండెను. నిజానికి ఆ కాలమున ఇంగ్లీషు వారిచే శిక్షితమయిన సైన్యము లేకపోయినచో హైద్రాబాదులో చెలరేగిన తిరుగుబాటులను, స్వాతంత్రోద్యమాలను అణచ వీలు లేక పోయెడిది. ఈ విధముగా తిరుగుబాటుల నణచి నిజాము అస్తిత్వమును నిలబెట్టిన ఇంగ్లీషువారు ఇక్కడి పరిపాలనను సవరించుట తమ కర్తవ్యమని భావించి అందుకొరకై నిజాముకు సలహాల నియ్యవలసి యుండెను. కాని వారట్లు చేయలేదు. 1820 సంవత్సరములో ఒక్కసారి మాత్రము సర్‌ చార్లెస్‌ మెట్కాఫ్‌ సర్వే మరియు సెటిల్మెంట్‌ శాఖలలో (బందోబస్తు) ఇంగ్లీషువారిని నియమించ వలసినదని చందూలాల్‌ను కోరెను. కాని యీ కోరిక అప్పుడు దివాన్‌ గా నుండిన చందూలాల్‌కు రుచించలేదు. అప్పుడు గవర్నర్‌ జనరల్‌గా లార్డ్‌ హేస్టింగ్స్‌ ఉండెను. మార్క్విన్‌ ఆఫ్‌ హేస్టింగ్స్‌కు, మెట్కాఫ్‌కు మధ్య మంచి సంబంధములు లేకపోయినందున చందూలాల్‌ కొక మంచి నెపము దొరికెను. అందుకొరకు చందూలాల్‌ బ్రిటిషు వారు తమ ఆంతరంగిక వ్యవహారములలో జోక్యము కలుగచేసికొనవలదని గవర్నర్‌ జనరల్‌కు అసమ్మతి తెలిపెను. అందుచేత మెట్కాఫ్‌ ప్రారంభించిన యూరోపియన్‌ ఉద్యోగుల నియామకమను ఉద్యమము కొన్ని సంవత్సరాలలోనే అంతమొందెను. తర్వాత దినదినము పరిపాలనము చెడిపోజొచ్చెను. ఇట్టి పరిస్థితులలో ప్రజలకు తిరుగుబాటొక్కటే మార్గాంతరముగా నుండెను. అందుచేత యీ కాలమందు తిరుగుబాటులు అన్ని జిల్లాలలో వ్యాపించెను. యీ తిరుగుబాటులకు ముఖ్యకారణము దుష్పరిపాలనము. తిరుగుబాటుల నణచుటకు నిజామునకు సహాయము చేసిన ఇంగ్లీషువారు రాష్ట్రములో సత్పరిపాలనను ప్రవేశపెట్టుటకు శ్రద్ధ వహించలేకపోయిరి. బహుశః పరిపాలన దినదినము చెడిపోయి పరిస్థితి అధ్వాన్నమయినచో రాష్ట్ర పరిపాలనను పూర్తిగా తమ చేతిలోనికి తీసికొనుటకు తగిన అవకాశము లభించునని ఇంగ్లీషువారు భావించి యుండిరేమో! ఎందుకనగా, తర్వాత పరిపాలనా లోపమును కారణముగా పురస్కరించుకొని, రాష్ట్రములోని సారవంత ప్రాంతములయిన బీదరు మొదలయిన వానిని నిజాము నుండి ఇంగ్లీషు వారు తమ స్వాధీనములోనికి తీసికొనిరి. అందుచేతనే హైద్రాబాదు పరిపాలనము యొక్క సంస్కరణను గూర్చి శ్రద్ధ వహించక పోవుట వలన ఇంగ్లీషువారి ఉద్దేశాలను అనుమానించవలసి వచ్చుచున్నది.

1817 - 1857 వరకు హైద్రాబాదు చరిత్ర ప్రజల తిరుగుబాటుల చరిత్ర యని చెప్పవచ్చును. ఈ తిరుగుబాటులకు కారణము దుష్పరిపాలన యనియే చాలామంది గ్రంథకర్తలు అభిప్రాయ పడినారు.

ప్రభుత్వముపై ప్రజల తిరుగుబాటు

ప్రభుత్వముపై ప్రజలు చేసిన యీ తిరుగుబాటులో కొన్ని ముఖ్యమైన వాని వివరాలు యీ క్రింది విధముగా నున్నవి.

నాందేడ్‌ జిల్లాలోని నాయక్‌ తిరుగుబాటు

 1. నాందేడ్‌, పర్భినీ, బీదర్‌ జిల్లాలలో గంగానదీ తీరమున హట్‌కర్లను ఒక తెగ వారు నివసించుచుండిరి. ఈ తెగవారి నాయకులు సుమారు 20 సంవత్సరముల కాలము క్రీ॥శ॥ 1819వ సంవత్సరము వరకు నిరంతరము వరుసగా తిరుగుబాటులు చేయుచునే యుండిరి. వీరి నాయకుడు నౌసాది, నాందేడ్‌కు 20మైళ్ళు దూరమున నున్న నావా దుర్గమున కధిపతిగా నుండెను. 1819వ సంవత్సరమున బ్రిటిష్‌వారి నాయకత్వమున హైదరాబాదు సైన్యాలు ఈ దుర్గమును ముట్టడించి 24 రోజులు యుద్ధము గావించి, తుట్టతుదకు బహుకష్టముమీద అతి ప్రయాసతో కోటను స్వాధీనము చేసుకొనిరి. ఈ కోటలో 538 మంది యుండిరి. అందులో 438 మంది యుద్ధములో చంపబడిరి. 80 మంది తీవ్రముగా గాయపడిరి. 20 మంది మాత్రమే సజీవముగా నుండిరి. బ్రిటిష్‌వారి సైన్యమునకు కూడ చాల నష్టములు కలిగెను. తరువాత హట్కర్ల స్వాధీనమున నున్న మరికొన్ని కోటలు కూడ పట్టుకొనబడి వారి తిరుగుబాట్లు అణచివేయబడెను.
 2. 1818వ సంవత్సరమున జులై నెలలో బీడ్‌ జిల్లాలో ధర్మాజ్‌ ప్రతాపరావు అను వీరుడు బ్రిటిష్‌వారికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసెను. ఆయన కోట 'దివి'. బ్రిటిష్‌వారి సైన్యాలు దివిమీద దాడిచేసి, తీవ్ర ప్రతిఘటన తరువాత దానిని పట్టుకొనెను.
 3. 1818 వ సంవత్సరము మే నెలలో రాయచూర్‌ జిల్లాలో వీరప్ప యను యోధుడు తిరుగుబాటు గావించి "కొప్పల్‌" మరియు "బహద్దుర్‌ బండ" అను కోటలను స్వాధీనము చేసుకొనెను. తరువాత అప్పుడు లెఫ్టినెంట్‌ కర్నల్‌ ఫ్రేజర్‌ నాయకత్వమున హైద్రాబాదు సైన్యము ఈ కోటలను స్వాధీనము గావించుకొనెను.
 4. 1822 వ సంవత్సరములో ఆదిలాబాదు జిల్లాలోని మాహూర్‌లో మరొక తిరుగుబాటు చెలరేగగా, కమాండర్‌ గొర్డన్‌ నాయకత్వమున కొంత సైన్యము వెళ్ళి దానిని అణచివేసెను.
 5. 1820వ సంవత్సరమున బీదర్‌ జిల్లాలోని ఉద్గీర్‌లో దేశ్‌ముఖ్‌ శివలింగయ్య తిరుగుబాటు గావించి, కొన్ని కోటలను ఆక్రమించుకొనెను. అప్పుడు హైద్రాబాదు సైన్యము దాడిచేయగా శివలింగయ్య తప్పించుకొని పోయెను. కాని ఉద్గీర్‌, జల్కోడ్‌, బత్తిదామ్‌, సూలాలి కోటలు బ్రిటిష్‌వారి స్వాధీనమయ్యెను. తిరుగుబాటు అణచివేయ బడెను. 1821వ సంవత్సరమున బీదర్‌ జిల్లాలోని క్రిష్ణాపూర్‌ ప్రాంతమున తిర్మల్‌రావు తిరుగుబాటు గావించెను.
 6. 1821 లో నిజామాబాదులోని సిర్ణపల్లిలో, భవానీపేటలో, కామారెడ్డి వద్ద బీబీపేటలో తిరుగుబాటుకు లక్ష్మణరెడ్డి నాయకత్వము వహించెను. ఈ తిరుగుబాటులన్ని తరువాత అణచివేయబడినవి. ఇంచుమించుగ ఈ కాలముననే మంతెన తాలూకాలోని "మహదేవ్‌పూర్‌"లో ఒక తిరుగుబాటు చెలరేగెను.
 7. భిల్లుల తిరుగుబాటులు ఈ కాలమున చాల జరిగినవి. 1818 మరియు 1822 సంవత్సరము లందు రెండు సారులు భిల్లులు ఔరంగాబాదులో తిరుగుబాటు గావించిరి. ఈ తిరుగుబాటులు 1860వ సంవత్సరము వరకు సాగుచునే యుండెను. 1859వ సంవత్సరము అహమ్మద్‌నగరములో భాగోజీ నాయక్‌, ఔరంగాబాదులో గోవిందరావు కాశీరాజ్‌, షాభాజీ నాయక్‌ అనువారలు భిల్లుల తిరుగుబాటులకు నాయకత్వము వహించిరి.
చెలరేగిన స్థానిక నాయకులు

1841వ సంవత్సరమున రాయచూర్‌ జిల్లాలో తిరుగుబాటు చెలరేగెను. ఈ తిరుగుబాట్లకు కోహ్రా అను అరబ్బుతోపాటు నరసింగరావను యోధుడు నాయకత్వము వహించి, దేవ్‌దుర్గ్‌వద్ద సైన్యమును సమీకరించుకొనిరి. వీరు ఆనెగొందివద్ద గొప్ప యుద్ధముచేసి బీజపూర్‌ జిల్లాలో ప్రవేశించి 'బాదామి' అను దుర్గమును పట్టుకొనిరి. తరువాత ఈ కోటలను హైద్రాబాదు సైన్యము తమ స్వాధీనము గావించుకొని కోహ్రా, నర్సింగరావులను బంధితులను గావించెను. 1831లో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వనపర్తియందు లక్ష్మయ్య అను యోధుడు తిరుగుబాటు గావించెను. 1860లో ఆదిలాబాదు జిల్లాలోని నిర్మల్‌లో రామాగౌడ్‌ అను వీరుడు తిరుగుబాటు చేసెను. భద్రాచలము జమీందారుకూడ ఈ కాలముననే ఒక తిరుగుబాటుకు నాయకత్వము వహించెను. ఇది క్లుప్తముగా కొన్ని ముఖ్యమైన తిరుగుబాట్ల చరిత్ర. గమనించ దగిన విశేష మేమనగా, యీ తిరుగుబాట్లకు రోహిలాలుగాని, అరబ్బులుగాని నాయకత్వము వహించ లేదు. వీనికి జిల్లాలలో స్థానికులైన వీరులే నాయకత్వము వహించిరి. నలుబది సంవత్సరాల వరకు నిరంతరము కొనసాగిన యీ తిరుగుబాట్లను అణచివేయుట ఇంగ్లీషువారిచే శిక్షితమైన నైజాం సైన్యమునకు ఒక పెద్ద సమస్యగా నుండెను. బహుకష్టముతో యీ తిరుగుబాట్లు అణచివేయబడెను. 1857వ సంవత్సరము తరువాత ప్రభుత్వ విధానమున కొంత మార్పు వచ్చెను. పరిపాలనా విధానమును బాగుచేసి ప్రభుత్వమును సమర్థవంతముగా నిర్వహించనిచో రాష్ట్రమునకు భద్రతలేదను సత్యము తుట్టతుదకు హైద్రాబాదు ప్రభుత్వము గ్రహించక తప్పలేదు. విదేశ పరిపాలనమును, ప్రజల శ్రేయస్సును అభిలషించని ప్రభుత్వమును ప్రజలు ఎన్నడును సహించలేరని యీ స్వాతంత్ర్యోద్యమ చరిత్ర నిరూపించుచున్నది.

AndhraBharati AMdhra bhArati - telaMgANalO jAtIyOdyamAlu - DA\.. dEvulapalli rAmAnujarAvu - telugu vachana sAhityamu - vyAsamulu ( telugu andhra )