వచన సాహిత్యము వ్యాసములు 19వ శతాబ్దమున హైదరాబాదులో పత్రికా స్వాతంత్ర్యము

19వ శతాబ్దమున హైదరాబాదులో పత్రికా స్వాతంత్ర్యము
తెలంగాణలో జాతీయోద్యమాలు - డా॥ దేవులపల్లి రామానుజరావు

ప్రాథమిక స్వత్వాలు - పత్రికలు
పత్రికలపై ప్రభుత్వం దాడి
పత్రికల నేడిపించిన ఏడు షరతులు
సాహసోపేత ధిక్కారము

ప్రాథమిక స్వత్వాలు - పత్రికలు

పోలీసు చర్యకు పూర్వము హైదరాబాదు రాష్ట్రమున పత్రికలు కఠిన నిర్బంధములకు గురియైన సత్యము సుప్రసిద్ధము. నిజానికి హైదరాబాదు ప్రజల పోరాటము ప్రాధమిక స్వత్వముల సాధన కొరకు జరిగిన పోరాటమే. గడచిన శతాబ్దమున హైదరాబాదు ప్రజల స్వాతంత్ర్య సమర వృత్తాంతమును పరిశీలించినపుడు నిర్భయముగా ప్రజల పక్షము వహించిన పత్రికల బాధలు మనకు ప్రస్ఫుటముగా కనబడుచున్నవి. 19వ శతాబ్దమున హైదరాబాదు రాష్ట్రమున ప్రజల భాషలలో నడిపిన పత్రికలు లేకుండెను. ఒకటి రెండు ఇంగ్లీషు పత్రికలు, కొన్ని ఉర్దూ పత్రికలు మాత్రము ఉండెను. ఆ పత్రికలకు గూడ ప్రజలపక్షము వహించి ప్రభుత్వమును విమర్శించు అవకాశము నిరాకరింపబడెను. ఈ సందర్భమున దొరికిన కొన్ని వివరాలు గమనించదగి యున్నవి.

పత్రికలపై ప్రభుత్వం దాడి

హైదరాబాదు రాష్ట్రమున 1891వ సంవత్సరమున ఆస్మాన్‌జా ముఖ్యమంత్రిగా నుండెను. ఆయన పరిపాలనలో పత్రికాస్వాతంత్ర్యము మీద మొదటిసారి తీవ్రమైన దాడి జరిగినది. ఈ సంవత్సరమున అప్పుడు హోమ్‌ సెక్రటరీగా నుండిన ఫతేనవాజ్‌ జంగ్‌ బహద్దుర్‌ సంతకముతో పోలీస్‌కమీషనర్‌కు ఒక నోటీసు జారీ చేయబడినది. ఆ నోటీసు ప్రకారం (1) "అప్సరుల్‌ అఖ్బార్‌" అను ఒక పత్రిక నుండి ప్రభుత్వ అనుమతి కొరకై విజ్ఞప్తి చేయ వలసినదని కోరబడినది. అప్పటివరకు పత్రికలు నడుపుటకు ప్రభుత్వము అనుమతి అవసరము లేకుండెను. అంతేగాక అప్పటికి 18 నెలలముందే ఆ పత్రికయొక్క ప్రకటన ఆగియుండెను. అయినను పునః ప్రకటన కొరకు ప్రభుత్వము యొక్క ఆజ్ఞ తీసుకొన వలసినదని యీ పత్రిక ఆదేశింపబడినది. (2) పత్రికలు ప్రభుత్వమునకు ఒక "ఎకరార్‌నామా" కూడా వ్రాసి యీయవలసినదని ప్రభుత్వము ఆజ్ఞాపించినది. "దక్కన్‌పంచ్‌", "హైదరాబాద్‌ గెజెట్‌"లు ఈ విధమైన "ఎకరార్‌నామా"లు దాఖలు చేసియుండెను. ఇతర పత్రికలు కూడా ఆ విధముగనే దాఖలు చేయవలెనని కోరబడినవి. (3) "ఎకరార్‌నామా"లో ఉల్లేఖించబడిన షరతుల నుల్లంఘించుటకు వీలులేదు. ఇట్లు ఉల్లంఘించిన పత్రికలను గూర్చి పోలీస్‌ కమీషనర్‌ వెంటనే ప్రభుత్వమునకు రిపోర్టు చేయవలెను. అత్యవసరమని తోచినప్పుడు ఏ పత్రిక నైనను ఆపివేయుటకు పోలీస్‌ కమీషనర్‌కు ఆజ్ఞ యీయబడెను. ఈ విధముగ పత్రికా స్వాతంత్ర్యము పోలీసువారి అదుపుఆజ్ఞలకు పరిమితము చేయబడినది.

పత్రికల నేడిపించిన ఏడు షరతులు

ఈ ఎకరార్‌నామాలోని ఏడు షరతులను పరిశీలించినప్పుడు పోలీసుల చేతులలో పత్రికలు ఉండవలెనను ఉద్దేశము వాని వెనుకనుండి తొంగిచూచుచున్నది. ఈ షరతుల ప్రకారము

  1. బ్రిటిష్‌ ప్రభుత్వమునకు వ్యతిరేకముగా ఏమియు వ్రాయరాదు.
  2. నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకముగా అసలే వ్రాయగూడదు.
  3. బ్రిటిష్‌ ఇండియాలో కాని, హైదరాబాదు నందుకాని ప్రజలలో అభిప్రాయ భేదాలు, మత సంఘర్షణలకు దారితీయు వ్రాతలు వ్రాయరాదు. యీ వ్రాతల ధోరణిని నిర్ణయించువారు పోలీసు అధికారులే.
  4. ఎవరికిని భయము, బెదరింపు, విచారము కలిగించు వ్రాతలు వ్రాయకూడదు.
  5. ప్రభుత్వోద్యోగులను బెదరించు వ్రాతలు వ్రాయరాదు.
  6. ఆకాశరామన్న ఉత్తరాలు ప్రకటించగూడదు. విలేఖరి పేరులేని వ్రాతలు ప్రకటించకూడదు.
  7. ప్రజలకు ప్రభుత్వము మీదగాని, ప్రభుత్వ ఉద్యోగుల మీదగాని చెడ్డ అభిప్రాయము కలిగించు వ్రాతలు వ్రాయగూడదు.

ఇటువంటి హిరణ్యాక్ష వరములు ఇంకెన్నియో పత్రికల నుండి కోరబడెను. ఈ షరతుల నుల్లంఘించినచో పత్రికల నాపుటకు ప్రభుత్వమునకు అధికారము కలదు. పత్రికలను ఆపుటవలన కలుగు నష్టమునకు ప్రభుత్వము బాధ్యత వహించదు. ఇన్ని షరాలను అంగీకరించి నడిపిన పత్రికలు ప్రజలకు ప్రాతినిధ్యము వహించుట కెట్టి అవకాశము లేదు. ఈ షరతుల ప్రకారము నడిపిన పత్రికలు ప్రభుత్వము గెజెట్లుగనో లేక సమాచార శాఖవారు ప్రకటించు సమాచార వాఙ్మయముగనో తయారగుట స్పష్టము.

1891కి ముందు పత్రికలను నడుపుటకు ప్రభుత్వము నుండి అనుమతి తీసుకొనవలెనను నిర్బంధము లేకుండెను. ఈ సమయముననే బ్రిటిషు ఇండియాలో గవర్నరు జనరల్‌ యీ విధమైన ఒక ఉత్తరువును జారీ చేసినట్లు తెలుస్తుంది. ఆ ఉత్తర్వు యొక్క పుత్రికయే హైదరాబాదు హోమ్‌ సెక్రటరీగాని ఆజ్ఞయని చెప్పబడుచున్నది. పోలీసు చర్యకు పూర్వము ప్రజలమీద విశృంఖలముగా పుంఖానుపుంఖముగా ప్రయోగింపబడిన గష్తీనిషాన్‌ 53 అను వాగ్బంధన శాసనము పైన పేర్కొనిన ఉత్తర్వు యొక్క సంతానమే.

సాహసోపేత ధిక్కారము

ఆ రోజులలో కొన్ని పత్రికలు ధైర్యముగా యీ షరతుల అమలును వ్యతిరేకించినవి. 1891వ సంవత్సరము జూన్‌ 11వ తేదీనాడు "దక్కన్‌టైమ్స్‌" అను పత్రికలో ప్రభుత్వం కోరిన "ఎకరార్‌నామా" యొక్క అనువాదము ప్రకటించబడినది. ప్రభుత్వము ఇటువంటి షరతుల విధించుట చాలా అన్యాయమని, ఇది దురాక్రమణ అనియు, ప్రజాస్వామిక వ్యతిరేక చర్య యనియు ఈ ప్రకటనలో తీవ్రముగా నిరసించబడినది. ఆ కాలమున హైదరాబాదులో "షౌకతుల్‌ ఇస్లాం" అను ఒక పత్రిక యుండెను. ఈ పత్రికా సంపాదకుడు "హజీకర్తాన్‌" నిర్భయ స్వభావుడు, ప్రజాస్వామికవాది. అందుచేత యీ ఎకరార్‌నామాకు వ్యతిరేకముగా ప్రభుత్వముతో పోరాడెను. ఆ పోరాటము చారిత్రాత్మకమైనది, ఉజ్వలమైనది. ఈ సందర్భమున ఆయన వ్రాసిన వ్రాతలు ఆంధ్రీకరించి ప్రకటించినచో ఆనాడు ప్రజల హృదయాలలో యెటువంటి అగ్ని రగులుకొని యుండెడిదో స్పష్టము కాగలదు. 1891 జూన్‌ 14వ తేదీనాటి "షౌకతుల్‌ ఇస్లాం" అనుబంధములో ప్రజల నుద్దేశించి ఒక బహిరంగ లేఖ ప్రకటించబడెను. ఈ లేఖలో మొత్తము భారతదేశమునందు ఒక్క హైదరాబాదు రాష్ట్రములోనే మధ్యకాలపు రాజరికము చలాయించబడు చుండెననియు, ప్రభుత్వోద్యోగులు స్వార్థపరులు, లంచగొండులు, అధికార దుర్వినియోగము చేయువారై యున్నారనియు, వారి మనస్తత్వమే ఈ ఎకరార్‌నామాలో ప్రతిబింబించు చున్నదనియు, ప్రజలు తమ అభిప్రాయాలను ఈ విషయమయి స్వేచ్ఛగా ప్రకటించవలెననియు, వానిని పత్రికకు పంపించవలెననియు ఉద్ఘాటించ బడినది. ఈ సందర్భములో పోలీసు కమీషనరుకు సంపాదకుడు వ్రాసిన ఉత్తరముగూడ చాల గొప్పది. ఈ ఉత్తరములో ఎకరార్‌నామా యొక్క నియమము తీవ్రముగా నిరసించ బడినది. ప్రభుత్వము ఉద్దేశము గట్టిగా ప్రశ్నించబడినది. ఈ సందర్భమున ప్రభుత్వము అనుసరించ దలచిన విధానమేమిటో తెలుప వలసినదని కూడ యిందులో ప్రశ్నింప బడినది. "షౌకతుల్‌ ఇస్లాం" 14వ జూన్‌ 1891 నాటి 35వ సంచికలో హోం సెక్రటరీగారి యీ ఉత్తరువులను గూర్చి సంపాదకీయముగా తీవ్ర విమర్శ చేయుట జరిగినది. ఈ సంపాదకీయములో మిక్కిలి కఠినమైన పదజాలము ఉపయోగించ బడినది. లంచగొండితనము, అధికార దుర్వినియోగము, నిరంకుశత్వము, స్వార్థపరత్వము మొదలయిన వానికి అలవాటు పడిన ప్రభుత్వోద్యోగుల దుశ్చర్యలే ఈ ఉత్తర్వు రూపము పొందినవని యిందులో ఉద్ఘాటించ బడినది. ఇది అనాగరిక చర్యయని తెలుపబడినది. ఈ ఉత్తర్వులకు హంతక కాండయని ఈ సంపాదకీయములో నామకరణము చేయబడినది. సకల భారతమందలి పత్రికా చరిత్రలో యింత నిర్భయముగా వ్రాసిన సంపాదకీయాలు మిక్కిలి తక్కువ. పత్రికా సంపాదకులు, స్వాతంత్ర్య ప్రియులందరు ఈ సంపాదకీయమును పఠించవలసియున్నది. తరువాత కొన్ని రోజులకు "జైనొద్దీన్‌" అను పోలీసు "మొహత్మీమ్‌" సంతకముతో వెంటనే ఎకరార్‌నామా ఈయవలసినదని సంపాదకునికి నోటీసు అందజేయబడినది. సంపాదకుడు యీ ఎకరార్‌నామా షరతుల గురించి వ్యాఖ్యానించుచు వాడిన పదాలు గమనించ దగినవి. "నాజాయజ్‌", "నాలాయఖ్‌", "ఋష్వత్‌ఖోర్‌", "బద్మాష్‌" మొదలైన పదాలు ఇందులో ఉపయోగించ బడినవి. తరువాత రెండు వారాలకు అపుడు హోమ్‌ సెక్రటరీగా నున్న ఫతేనవాజ్‌ జంగ్‌ సంతకముతో జారీ చేయబడిన ఉత్తర్వు ననుసరించి ఈ పత్రిక ఆపుచేయబడెను. ఈ ఉత్తర్వులో అప్పటి ముఖ్యమంత్రియైన నవాబ్‌ ఆస్మాన్‌ జా బహద్దుర్‌గారి దృష్టికి "షౌకతుల్‌ ఇస్లాం" 35వ సంచికలోని సంపాదకీయము తీసుకొని రాబడినదని, అందులో ఉపయోగింపబడిన పదజాలము కఠినముగాను, అసభ్యముగా ఉన్న దనియు, చేయబడిన ఆరోపణలు నిరాధారమైనవనియు తెలుపుచు పత్రికను వెంటనే ఆపివేయ వలసిందని ఉత్తరువు పంపబడినది. ముద్రణాలయము మాత్రం యజమాని కీయవలసినదని ఆజ్ఞాపింపబడెను. అయితే ఒక షరతు విధింపబడినది. ఆ షరతు ప్రకారము ముద్రణాలయము ప్రభుత్వమునకు వ్యతిరేకముగా ఏ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించనని యజమాని ఒక "ఎకరార్‌నామా" దాఖలు చేయవలెను. ఈ విధముగా "షౌకతుల్‌ ఇస్లాం" పత్రిక ఆపివేయబడినది. ఇది హైదరాబాదు వాగ్బంధన శాసన పిశాచ తాండవము యొక్క అనేక నిదర్శనాలలో ఒక్కటి మాత్రమే. హైదరాబాదు స్వాతంత్ర్య చరిత్రలో యిటువంటి ఉజ్వల ఉదాహరణ లింకెన్నియో కలవు.

AndhraBharati AMdhra bhArati - 19va shatAbdamuna haidarAbAdulO patrikA svAtaMtryamu - telaMgANalO jAtIyOdyamAlu - DA\.. dEvulapalli rAmAnujarAvu - telugu vachana sAhityamu - vyAsamulu ( telugu andhra )