వచన సాహిత్యము వ్యాసములు తెలంగాణములో ఆంధ్రోద్యమము

తెలంగాణములో ఆంధ్రోద్యమము
తెలంగాణలో జాతీయోద్యమాలు - డా॥ దేవులపల్లి రామానుజరావు

ఆంధ్రభాషకు అజ్ఞాతవాసము
ఆంధ్రోద్యమ ప్రారంభము
మేలుకొలిపిన సంఘటన
ఆంధ్ర జనసంఘము ఆదర్శములు
ఉన్నత ఆశయాలు
ఉద్ధృత ప్రచారము
అండగా నిలిచిన పత్రికలు
ఆంధ్ర మహాసభ అవతరణ
సహజ పరిణామము - ఆలియావర్జంగ్‌ అనుమానాలు
రానురాను రాజకీయాలు
ఓరుగల్లు మహాసభ - చీలికలు
మహాసభలు - అధ్యక్షులు
నూతన అధ్యాయము

ఆంధ్రభాషకు అజ్ఞాతవాసము

రెండునూర్ల పాతిక సంవత్సరాల ఆసఫ్జాహి పరిపాలన ఫలితముగ హైద్రాబాదు రాష్ట్రములో ఆంధ్రుడు తౌరక్యాంధ్రుడైనాడు. అతనికి అరబ్బీ, ఫారసీ భాషలలో అక్షరాభ్యాసము కావించు దుస్థితి కలిగినది. ఉర్దూ భాషయే రాజభాష; మరియు ప్రాథమికదశనుండి విశ్వవిద్యాలయదశ వరకు బోధనా భాష అయినందున ఆంధ్రభాషకు కొన్ని శతాబ్దాల అజ్ఞాతవాసము ప్రాప్తించినది. ఈ కాలమున ఆంధ్రుడు అన్ని రంగములందు వెనుకబడినాడు. పరిపాలనా రంగమున అతనికి తగిన స్థానము లభింపలేదు. పరదా, వరశుల్కము మొదలైన సాంఘిక దురాచారాలు ప్రబలి యుండెను. తెలుగు రైతు పన్నుల భారముతో క్రుంగి, దరిద్రదేవత పాదాల క్రింద నలిగి పోయెను. చదువుకున్న వారి సంఖ్య నూటికి మూడింటి వరకు దిగజారెను. తెలంగాణమున పాఠశాలలు, కళాశాలలు చాలా కొద్దిగా నుండెను. ఇట్టి పరిస్థితులలో ప్రారంభమయినది ఆంధ్రోద్యమము.

ఆంధ్రోద్యమ ప్రారంభము

హైదరాబాదు నగరమున 1-9-1901 వ సంవత్సరమున స్వర్గీయ కొమర్రాజు వెంకటలక్ష్మణరావు ప్రోత్సాహముతో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయము స్థాపితమైనది. ఈ ప్రయత్నమున లక్ష్మణరావు గారి సహచరులుగా నిలిచి పని చేసినవారు మునగాల రాజాగారు, స్వర్గీయ రావిచెట్టు రంగారావుగారు. కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయమును తెలంగాణమందేకాక, సకలాంధ్రమందును మొట్టమొదటి గ్రంథాలయముగా పేర్కొనవచ్చును. తెలంగాణమున హనుమకొండ, వరంగల్‌ మొదలయిన పట్టణాలలో 1901 నుండి 1910 వరకు మరికొన్ని గ్రంథాలయాలు లక్ష్మణరావుగారి ప్రోత్సాహమున స్థాపితమయినవి. ఈ కాలముననే విజ్ఞానచంద్రికా గ్రంథమండలి కూడ హైదరాబాదులో స్థాపితమైనది. విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిని ఆంధ్ర- తెలంగాణాల మధ్య దృఢమైన సాంస్కృతిక బంధనముగా ఏర్పాటు గావించిన లక్ష్మణరావుగారే విశాలాంధ్ర ఉద్యమానికి కూడ పునాదులు వేసిరని చెప్పవచ్చును. హైదరాబాదులో ఆంధ్రోద్యమము యీ విధముగా యీ శతాబ్ద ప్రారంభమున వైజ్ఞానికోద్యమముగా ప్రారంభమయి, క్రమక్రమముగ రాజకీయోద్యమముగ పరిణమించినది. ఆనాడు గ్రంథాలయోద్యమముద్వారా తెలంగాణమును ప్రబోధించిన వారిలో కీ॥శే॥ ఆదిపూడి సోమనాథరావు, కీ॥శే॥మైలవరపు నరసింహశాస్త్రి గారలను ప్రత్యేకముగ స్మరించ వలసి యున్నది. శేషాద్రిరమణ కవుల "నిజాంరాష్ట్ర ప్రశంస" అను ఖండ కావ్యమును ప్రత్యేకముగ పేర్కొన వలసి యున్నది.

మేలుకొలిపిన సంఘటన

ఇరువది సంవత్సరాల గ్రంథాలయోద్యమము తెలంగాణాను కొంత మేల్కొలిపినది. ఇట్టి సందర్భంలో 1921వ సంవత్సరమున హైదరాబాదు నగరమున సుప్రసిద్ధ మహారాష్ట్ర విద్వాంసుడైన కర్వే పండితుని అధ్యక్షతన జరిగిన సంఘసంస్కరణ సభలలో అప్పుడు హైదరాబాదులో న్యాయవాదులుగా నుండిన ఆలంపల్లి వెంకటరామారావుగారు తమ ఉపన్యాసమును తెలుగులో ప్రారంభించగా, సభ్యులు చప్పట్లతో హేళన గావించిన సంఘటన చరిత్ర నిర్మాణమునకు కారణ భూతమైనది. ఈ సంఘటనను అవమానముగ భావించిన ఆంధ్రులు ఆనాటి రాత్రి కీ॥శే॥ టేకుమాల రంగారావుగారి ఇంటిలో సమావేశమై, ఆంధ్ర జనసంఘమును స్థాపించిరి. ఇది ఆంధ్రోద్యమ చరిత్రలో మహత్తరమైన సంఘటన. ఆంధ్ర జనసంఘ స్థాపన గావించిన సమావేశములో బూర్గుల రామకృష్ణారావు, పద్మవిభూషణ మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలయిన పెద్దలు పాల్గొనియుండిరి. ఈ ఆంధ్ర జనకేంద్ర సంఘము తత్క్షణమే తన పనిని ప్రారంభించి, నూరుగురు సభ్యులను చేర్పించి 4-4-1922 నాడు కొండా వెంకటరంగారెడ్డిగారి అధ్యక్షతన సమావేశమును ఏర్పాటు కావించి, చిత్తునియమావళి నామోదించి కార్యనిర్వాహక వర్గమును ఎన్నుకొనుట జరిగినది. ఆనాటి కార్యనిర్వాహకవర్గమునకు కీ॥ శే॥ బారిస్టరు రాజగోపాలరెడ్డిగారు అధ్యక్షులుగను, మాడపాటి హనుమంతరావు పంతులుగారు కార్యదర్శిగాను ఎన్నుకొనబడిరి.

ఆంధ్ర జనసంఘము ఆదర్శములు

  1. ఈ సంఘమునకు నిజాంరాష్ట్రాంధ్ర జనసంఘమని పేరు.
  2. నిజాం రాష్ట్రము నందలి ఆంధ్రుల యందు పరస్పర సానుభూతిని కలిగించి, వారి అభివృద్ధికై ప్రయత్నించుట యీ సంఘము ఉద్దేశము.
  3. ఈ రాజ్యములోని ఆంధ్రులకొరకు సంఘములను, సంస్థలను స్థాపించుట, ఉన్నవానికి సహాయము చేయుట, ఉపన్యాస సభలను సమావేశపరుచుట మున్నగు కార్యముల వలన పై ఉద్దేశములు నెరవేర్చబడును.
  4. ఈ రాజ్యములోని ప్రతి ఆంధ్ర వ్యక్తియు, పదునెనిమిది వత్సరములకన్న మించిన వయస్సు కలిగి, చదువను, వ్రాయను నేర్చినచో యీ సంఘమున సభాసదుడు కావచ్చును.

ఉన్నత ఆశయాలు

ఈ ఆంధ్రజన కేంద్ర సంఘము స్థాపితమైన సంవత్సరము తరువాత అనగా 1923వ సంవత్సరమున ఒక ఉపనియమావళి సిద్ధము చేయబడి, అందులో జిల్లాలలోను, కేంద్రమునందును ఆంధ్రజన సంఘము నెరవేర్చవలసిన విధులు యీ విధముగా నిర్ణయింప బడినవి:

ఉద్ధృత ప్రచారము

ఈ ఆదర్శములను, సాధనములను గమనించినపుడు యీ సంస్థ నిజాం రాష్ట్ర వాసులైన స్త్రీ పురుషులకు మాత్రమే పరిమితమయినటుల స్పష్టమగుచున్నది. తరువాత నగర ఆంధ్ర జనసంఘ కార్యకర్తల పర్యటన, ప్రచార, ప్రబోధ ఫలితముగ జిల్లాలలో ఆంధ్ర జనసంఘములు స్థాపితమైనవి. 1-4-1923 నాడు యీ విధముగ స్థాపితమయిన హైదరాబాదు, సికింద్రాబాదు, వరంగల్లు, ఖమ్మం, హుజూరాబాదు ప్రతినిధులు హనుమకొండలో సమావేశమై, ఆంధ్రజన కేంద్ర సంఘ నియమావళి నంగీకరించిరి.

ఈ విధముగ ఏర్పడిన కేంద్ర సంఘము మొదటి సమావేశము 27-7-1923 నాడు హైదరాబాదులో ఏర్పాటు జరిగి, ఆంధ్ర జనకేంద్ర సంఘములు చేయవలసిన కార్యములను నిర్ణయించిరి. ఈ కార్యములను పరిశీలించినపుడు ఆంధ్రజన సంఘముల కార్యక్షేత్రము విద్య, వైజ్ఞానిక, వర్తక, వ్యాయామాది సమస్యలకు మాత్రమే పరిమితమై యుండి, రాజకీయాలకు దూరముగా నుండినట్లు స్పష్టము కాగలదు. తరువాత కేంద్ర సంఘ సమావేశాలు నల్లగొండ, మధిర, సూర్యాపేట, జోగిపేట, దేవరకొండ, ఖమ్మం, సిరిసిళ్ళలో మొత్తం ఎనిమిది సమావేశాలు జరిగినవి. ఈ కాలమున ఆంధ్ర జనకేంద్ర సంఘము కార్యక్రమమును పరిశీలించినపుడు విద్యార్థులను ప్రోత్సహించుట, గ్రంథాలయములను స్థాపించుట, గ్రంథాలయ సభలను నిర్వహించుట, వర్తక సంఘములను స్థాపించుట, వర్తక సమస్యలను గూర్చిన లఘు పుస్తకములను ప్రచురించుట, వెట్టి చాకిరి మొదలగు సామాజిక సమస్యలను గూర్చి ప్రబోధము గావించి తీర్మానాలు చేయుట, పాఠశాలల స్థాపనను గూర్చిన సమస్యలను చర్చించుట, ప్రచారకార్యక్రమమును నిర్వహించుట ప్రధానముగ గన్పట్టు చున్నది. మధిర, సూర్యాపేటలో ఈ కేంద్ర సంఘ సమావేశాలతో పాటు రెందు గ్రంథాలయ సభలు కూడ జరిగినవి. తాళపత్ర గ్రంథ సేకరణను గూర్చి యీ సంఘము ప్రత్యేక శ్రద్ధను వహించి, ఒక ఆంధ్ర పరిశోధక సంఘమును కూడ స్థాపించినది. ఇదియే లక్ష్మణరాయ పరిశోధక మండలి. ఈ మండలి, విశేషించి మండలియొక్క కార్యదర్శి ఆదిరాజు వీరభద్రరావుగారు తెలంగాణమందలి శాసనములను సేకరించి ప్రకటించుటలో ప్రశంసనీయమయిన కృషిని గావించిరి.

అండగా నిలిచిన పత్రికలు

ఈ కాలమున ఆంధ్రోద్యమమునకు అండగా నిల్చిన "నీలగిరి" (స్థాపితము 24-8-1922 నల్లగొండ), "తెలుగు పత్రిక" (స్థాపితము 27-8-1922 మానుకోట తాలూకా) అను వారపత్రికలను ప్రత్యేకముగ ప్రశంసించవలసి యున్నది. 10-5-1926 నాడు ఆంధ్రోద్యమమునకు పెట్టని కోటగా "గోలకొండ" పత్రిక ప్రారంభమైనది. ఆంధ్రోద్యమ వ్యాప్తికి, వికాసమునకు ఈ పత్రికలు మిక్కిలి తోడ్పడినవి. ఆంధ్రజన సంఘము కేవలము రాజకీయేతర సమస్యలనే తీసుకొన్నప్పటికినీ ఈ సభల సందర్భమున ప్రభుత్వము యొక్క వ్యవసాయ, పశుచికిత్స, సహకార, వైద్యశాలల ప్రదర్శనాలు ఏర్పాటు చేసినప్పటికిని, ఇతర విధములుగ ప్రభుత్వముతో సహకరించుటకు ప్రయత్నించినప్పటికిని, ప్రభుత్వమునకు మాత్రము ఇందులో ఏవో రాజకీయాలు ఇమిడి యున్నవను అనుమానము అప్పుడప్పుడు కలుగుచుండెను. ఈ అనుమానముతో సభలకు అనుమతి నిచ్చుటయందు ప్రతిబంధకములు కల్పించబడినవి. అప్పుడు హైదరాబాదులో నుండిన వాగ్బంధన శాసనము యొక్క ప్రతిబంధకములను గూడ యెదుర్కొన వలసి వచ్చెను. ఈ వాగ్బంధన శాసన ప్రయోగము వలన ప్రభుత్వము అనుమతిలేక సమావేశాలు జరుపుట గాని, పత్రికలు నడుపుటగాని సాధ్యముగాని పరిస్థితి యేర్పడి యుండెను. ఈ అనుమతి సాధారణముగా దొరుకుచుండెడిది కాదు. విశ్వప్రయత్నము గావించ వలసి వచ్చెడిది. ఇట్టి ప్రతికూల పరిస్థితులలో ఈ ఆంధ్రోద్యమ నౌకను బహు జాగ్రత్తగా నడిపిన గౌరవము మాడపాటి హనుమంతరావు పంతులుగారికి చెందుచున్నది. క్రమక్రమముగ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనప్పటికినీ, ప్రజల కష్ట నిష్ఠురములను గూర్చి ఈ సభలు శ్రద్ధ వహించక తప్పలేదయ్యెను. అందుచేత తిప్పర్తి, సూర్యాపేట మున్నగుచోట్ల రైతుల కష్ట సుఖములను విచారించుటకు రైతు సంఘములు స్థాపించుట కూడ జరిగెను. మొత్తముమీద 1930వ సంవత్సరము వరకు అనగా మొదటి ఎనిమిది సంవత్సరాల కాలము ఆంధ్ర సంస్కృతిని, ఆంధ్ర భాషను కాపాడుటకు కృషి సల్పుటయే ఆంధ్రోద్యమము యొక్క ఆశయమయి యుండెను. ఈ కాలమున స్త్రీల సభలను ఏర్పాటుచేసి మహిళలలో ప్రచారము చేయు కార్యక్రమము నిర్వహించుట జరిగినది. ఆనాడు మహిళా ప్రబోధము గావించిన వారిలో చాట్రాతి లక్ష్మీ నరసమ్మగారిని ప్రత్యేకముగ పేర్కొన వలసి యున్నది.

ఆంధ్ర మహాసభ అవతరణ

ఆంధ్ర జనసంఘములు ఈ విధముగా అక్కడక్కడ స్థాపితమై కొంత పని చేయుచుండగా "అరువది లక్షలకు మించిన నిజాం రాష్ట్ర ఆంధ్రుల కష్ట సుఖములను తెలిసికొనుటకు, వారి సమిష్టి అభిప్రాయమును నిర్మించుటకును" ఒక మహాసభ ఏర్పాటు అవసరమను భావము క్రమక్రమముగ ప్రచారమయి, తత్ఫలితముగ 3, 4, 5 మార్చి 1930 తేదీలలో జోగిపేటలో మొట్టమొదటి ఆంధ్రమహాసభ ఏర్పాటు జరిగినది. ఈ మహాసభలకు అధ్యక్షులు కీ॥శే॥ సురవరం ప్రతాపరెడ్డిగారు. ఈ మహాసభలకు బహు కష్టము మీద క్రింది షరతుల ప్రకారము అనుమతి లభించినది. 1. అధ్యక్షుడు పరదేశీయుడు కాకూడదు (గైర్‌ముల్కి) 2. ఇతర మతస్థులకు మనస్తాపముకాని, అనుమానముకాని కలుగు పరిస్థితి కల్పింప కూడదు 3. రాజకీయాల ప్రసక్తి ఉండకూడదు. ఈ మహాసభలతోపాటు మొట్టమొదటి ఆంధ్రమహిళాసభ కూడా జరిగినది. ఈ ఆంధ్ర మహాసభలో వాగ్బంధన శాసనము రద్దు చేయవలెననియు, ప్రాథమిక విద్య నిర్బంధముగ ప్రవేశపెట్టవలెననియు, మద్యపాన దురభ్యాసమును పోగొట్టవలెననియు, రైతులకు కొన్ని అనుకూలములు కల్పించవలెననియు, వెట్టి చాకిరి పోవలెననియును, మహిళా సభలో వివాహ సమస్య, వితంతువుల స్థితి మొదలగు సమస్యలను గూర్చియు తీర్మానములు జరిగినవి. ఈ తీర్మానాలను పరిశీలించినపుడు ఇవి అన్నియు రాజకీయేతర తీర్మానములే యని స్పష్టము కాగలదు. ఈ విధముగ 1930 నుండి 1946 వరకు పదమూడు ఆంధ్ర మహాసభా సమావేశాలు జరిగినవి. ఈ సమావేశాల వలన అపారమైన ప్రబోధము కలిగినది. మొదటి పది మహాసభలతో పాతు పది మహిళా సభలు కూడ జరిగినవి. ఈ మహాసభలు జరుపుకొనుటకు ప్రభుత్వ అనుమతి తీసికొనుటకై భగీరథ ప్రయత్నాలు జరిపిన నిదర్శనాలు కన్పించుచున్నవి. ఆంధ్రోద్యమము సజీవమైన ప్రజల ఉద్యమముగ అభివృద్ధి చెంది, మహారాష్ట్ర, కర్ణాటక ఉద్యమాలకు మార్గదర్శకమై, 1946 తరువాత స్టేటు కాంగ్రెసు ఉద్యమములో లీనమైనది.

సహజ పరిణామము - ఆలియావర్జంగ్‌ అనుమానాలు

ఆంధ్రోద్యమము క్రమక్రమ వ్యాప్తి ప్రభుత్వమునకు అనుమానాలు అధికము కావింపజొచ్చినది. ఈ ఉద్యమ పరిణామము ఆంధ్ర తెలంగాణాల ఏకీకరణగా రూపొందగలదేమో యని 1936వ సంవత్సరమున అప్పటి హోం సెక్రటరి నవాబ్‌ అలియావర్జంగ్‌గారు ప్రసంగవశమున నాల్గవ ఆంధ్రమహాసభ అధ్యక్షులైన మాడపాటి హనుమంతరావుగారితో తెలిపినట్లు ఆంధ్రోద్యమ చరిత్రలో గ్రంథస్థము కావింపబడినది. (91వ పేజీ "తెలంగాణా ఆంధ్రోద్యమము" రెండవ భాగము) ఆనాటి ప్రభుత్వము అనుమానము తుదకు సత్యస్వరూపము దాల్చుట గమనింపదగిన విశేషము.

రానురాను రాజకీయాలు

మొట్టమొదటి అయిదు ఆంధ్ర మహాసభలు రాజకీయాల జోలికి పోలేదు. ఆంధ్ర మహాసభల సమావేశాలలో వ్యాయామ ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు, ప్రబోధాత్మకమగు పద్యపఠనము మొదలగు సాంస్కృతిక కార్యకలాపములు ప్రత్యేక స్థానము వహించుచుండెను. ఇట్టి పరిస్థితులలో 1937వ సంవత్సరమున నిజామాబాదులో జరిగిన ఆంధ్ర మహాసభ ఆరవ సమావేశమునకు చారిత్రాత్మకమగు రాజకీయ ప్రాధాన్యము కలదు. ఇందుకు కారణాలు రెండు: 1. ఆంధ్ర మహాసభలలో తెలుగు మాతృభాష కాని వారు కూడ పాల్గొనుట జరుగుచుండెను. అప్పటివరకు "మహాసభ కార్యక్రమము, చర్యలు కవిలె ఆంధ్రభాషయందే జరుగవలె"నను నియమము ఒకటి యుండెను. కాని నిజామాబాదు సభలో కొందరు ఉర్దూభాషలో మాట్లాడుట, దానిపై కొందరు ఆక్షేపణ తెలుపుట, ఈ ఆక్షేపణలపై తీవ్ర వాదోపవాదములు జరిగి, ఆంధ్ర ప్రాంతమున నివసించు వారందరు వారి మాతృభాష ఏమయినప్పటికిని ఆంధ్రులే యనియు, ఆంధ్రభాష మాట్లాడ లేని వారు సభా వేదిక నుండి ఇతర భాషలలో మాట్లాడవచ్చుననియు అధిక సంఖ్యాక ప్రతినిధులు నిర్ణయించిరి. మొదటినుండియు ఆంధ్రోద్యమ వ్యాప్తి కుల, మత, వర్గ విచక్షణలకు అతీతముగా జరుగుచుండెను. అందుచేత మహారాష్ట్రులు, కర్ణాటకులు, ముస్లింలు యీ సభలలో పాల్గొని ప్రసంగించుట జరుగుచుండెను. కావున భాషా విషయమై పట్టుదల వహించుట సమంజసము, రాజనీతి కాకుండెను. కుల, మత, వర్గ, భాషా విచక్షణలను పాటింపక నిజాం రాష్ట్రాంధ్ర ప్రాంతమున నివసించు వారందరి అభివృద్ధికై పాటుపడుట యను ఆంద్రోద్యమము యొక్క విశాల దృక్పథమును అసందిగ్ధముగా స్పష్టీకరించుట యీ సందర్భమున జరిగినది. తత్ఫలితముగ సురవరం ప్రతాపరెడ్డిగారి నాయకత్వమున అసంతృప్తులైన కార్యకర్తలు అభివృద్ధి పక్షము నొకదానిని స్థాపించిరి. కాని ఈ పక్షము చురుకుగా పనిచేసినట్లు అగుపడదు. క్రమక్రమముగ ఆంధ్ర మహాసభలలో రాజకీయములు ప్రాధాన్యము వహించి, భాషకు ప్రాధాన్యము తగ్గుట వలన భాషాభిమానులకు కొంత మనస్తాపము, నిస్పృహ కలిగినది. తరువాత మెల్లమెల్లగా ఆంధ్ర భాషాభివృద్ధికి ప్రత్యేక సంస్థ కావలెనను భావము అంకురించి, వ్యాప్తిచెంది, బలపడి 1943లో హైదరాబాదు నగరమున ఆంధ్ర మహా సభల సందర్భమున ఆంధ్ర సారస్వత సంస్కృతుల అభివృద్ధి ఆశయములతో ఆంధ్ర సార్వస్వత పరిషత్తు స్థాపన జరిగినది. అది యొక ప్రత్యేక చరిత్ర. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆశయాలమీద విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి, ఆంధ్ర జన సంఘ ఆశయాల ప్రభావము స్పష్టముగా కనబడుచున్నదని యీ సందర్భమున గమనించవలసిన సత్యము. 2. రెండవ కారణము ఇంతకన్న ముఖ్యమైనది. ఆంధ్రమహాసభ కార్యకర్తలలో చాలామంది కాంగ్రెసు భావాలు, జాతీయ భావాలు కలిగి యుండిరి. కాని మొట్టమొదటిసారి ఆంధ్రమహాసభ వేదికనుండి ఈ నిజామాబాదు సమావేశములోనే "బాధ్యతాయుత ప్రభుత్వము" నిజాం రాష్ట్రాంధ్రుల ఆదర్శమని అర్థము నిచ్చు తీర్మానము ఆమోదింపబడినది. ఈ విధముగా ఆంధ్రోద్యమానికి రాజకీయాలతో సంబంధము లేదను పరిస్థితి తొలగిపోయినది. క్రమక్రమముగ బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన కృషితో ఆంధ్ర మహాసభలో మితవాద నాయకుల పలుకుబడి తగ్గసాగినది. ఈ సమావేశము తరువాత బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన కొరకు అప్పటి స్టేటు కాంగ్రెసు సత్యాగ్రహము నడిపినది. ఈ సత్యాగ్రహముతో ఆంధ్ర మహాసభకు ప్రత్యక్ష సంబంధము లేకపోయినప్పటికి ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వ్యక్తిగతముగ యీ సత్యాగ్రహములో పాల్గొనిరి. అప్పటి ఆంధ్ర నాయకులలో ప్రముఖులుగ నుండిన రావి నారాయణరెడ్డి, మందముల రామచంద్రారావు, జమలాపురము కేశవరావుగార్లు సత్యాగ్రహము కావించి జైలుకు పోయిరి. తరువాత 1940లో జరిగిన మాల్కాపురం ఆంధ్ర మహాసభకూడ రాజకీయముగ ముఖ్యమైనది. అప్పటి హైదరాబాదు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను బహిష్కరించవలెనను తీర్మానము యీ మహాసభలో అతివాదులైన రావి నారాయణరెడ్డిగారు ప్రవేశపెట్టిరి. దీనిని మితవాదులైన మందుముల నరసింగరావు, మాడపాటి హనుమంతరావు, కొండా వెంకటరంగారెడ్డిగార్లు ప్రతిఘటించిరి. అయినప్పటికి తీర్మానము నెగ్గినది. ఈ సందర్భమున "ఏడవ ఆంధ్ర మహాసభ నాటికి యువ నాయకత్వము బలపడినది" అని ఆంధ్రోద్యమ చరిత్రకారులు గ్రంథస్థము కావించి యున్నారు. (తెలంగాణ ఆంధ్రోద్యమము, రెండవ భాగము పుట. 142)

ఓరుగల్లు మహాసభ - చీలికలు

1942వ సంవత్సరమున ఓరుగల్కు సమీపమున ధర్మవరము గ్రామమందు జరిగిన ఆంధ్రమహాసభ కూడ రాజకీయముగ చాల ముఖ్యమైనది. ఇందులో రావి నారాయణరెడ్డిగారు క్రొత్త ఆదర్శములచే ప్రేరితులై ముందుకు వచ్చిరని "ఆంధ్రోద్యమ చరిత్రకారులు" వ్రాసి యున్నారు. క్రమక్రమముగ ఆంధ్ర మహాసభలో రావి నారాయణరెడ్డి గారొక నూతన వర్గమునకు నాయకత్వము వహించిరి. తత్ఫలితముగా తరువాత జరిగిన సభలలో జాతీయ పక్షము, కమ్యూనిస్టు పక్షము అను రెండు ప్రస్ఫుటమైన వర్గాలు ఏర్పడినవి. భువనగిరిలో జరిగిన పదకొండవ ఆంధ్రమహాసభలో రావి నారాయణరెడ్డిగారి పక్షము ప్రాబల్యము వహించినది. మితవాదులు, జాతీయవాదులు ఇందు పాల్గొనలేదు. భువనగిరి మహాసభ తరువాత ఆంధ్రమహాసభ రెండు మహాసభలుగా చీలిపోయినది. ఒకటి జాతీయాంధ్ర మహాసభ, రెండవది రావి నారాయణరెడ్డిగారి ప్రాబల్యము కలిగిన ఆంధ్ర మహాసభ. భువనగిరి మహాసభను బహిష్కరించిన ఆంధ్రనాయకులు 1945వ సంవత్సరమున మడికొండలో మందుముల నరసింగరావుగారి అధ్యక్షతన పండ్రెండవ మహాసభ కావించిరి. ఈ మహాసభకు కొండా వెంకటరెడ్డిగారు పెట్టనికోటలై యుండిరి. ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు పంతులుగారి ఆశీస్సులు ఈ సభకు లభించినవి. బూర్గుల రామకృష్ణారావుగారి సానుభూతి కూడ యీ మహాసభకు లభించినది. కీ॥ శే॥ జమలాపురం కేశవరావుగారు కూడ ఈ మహాసభనే బలపర్చిరి. రావి నారాయణరెడ్డి వర్గమువారు పండ్రెండవ ఆంధ్రమహాసభను ఈ సంవత్సరమే ఖమ్మం పట్టణములో జరిపిరి. ఈ విధముగ ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయినది. తరువాత 1946లో జమలాపురం కేశవరావుగారి అధ్యక్షతన పదమూడవ మహాసభ మెదకు జిల్లా యందలి కంది గ్రామమున జరిగినది. ఇదియే తుట్టతుది ఆంధ్రమహాసభ. వైజ్ఞానికోద్యమముగా ప్రారంభమైన ఆంధ్రోద్యమము బాధ్యతాయుత ప్రభుత్వమే తమ ఆదర్శముగా నిర్ణయించుకొన్న ఉద్యమముగా పర్యవసించినది. కంది మహాసభ తరువాత ఆంధ్ర మహాసభ స్టేటు కాంగ్రెసులో లీనమయి, స్టేటు కాంగ్రెసు ఆంధ్ర ప్రాంత సంఘముగ రూపొందినది. ఈ స్టేటు కాంగ్రెసు ఆంధ్ర ప్రాంత సంఘము మొదటి సమావేశము 1947లో జడ్చర్లలో జరిగినది. హైదరాబాదులో పోలీసుచర్య జరిగిన తరువాత స్టేటు కాంగ్రెసు హైదరాబాదు ప్రదేశ్‌ కాంగ్రెసుగా రూపొంది, ప్రత్యేకముగ హైదరాబాదులో ఆంధ్ర ప్రాంతమునకు కాంగ్రెసు కమిటి అవకాశము లేకపోయినది.

మహాసభలు - అధ్యక్షులు

పదునారు సంవత్సరాల వయస్సు కల్గిన ఆంధ్రోద్యమ చరిత్రలో మొత్తము పదమూడు ఆంధ్ర మహాసభలు జరిగినవి. వీని కధ్యక్షత వహించిన పెద్దలు :

వీనితోపాటు జరిగిన పది మహిళా సభలకు

గారలు అధ్యక్షత వహించిరి.

నూతన అధ్యాయము

పోలీసు చర్య తరువాత ఆఅంధ్రోద్యమములో మరొక అధ్యాయము ప్రారంభమైనది. ఆనాడు 1936లో అప్పటి హైద్రాబాదు హోం సెక్రటరీ ఆంధ్రోద్యమము ఆంధ్ర-తెలంగాణాల ఏకీకరణ ఉద్యమముగా రూపొంద గలదని వెల్లడించిన అనుమానము పోలీసుచర్య తరువాత సత్యమైనది. పోలీసుచర్య తరువాత ఘనపురంలో జరిగిన హైదరాబాదు ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్‌ సంఘ సమావేశములో ఆంధ్ర-తెలంగాణాల ఏకీకరణ జరుగ వలెనని తీర్మానించ బడినది. ఈ తీర్మానమును గోలకొండ మొదలైన తెలుగు పత్రికలు ఆమోదించి హర్షించినవి. నిజామాబాదునందు జరిగిన హైద్రాబాదు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సమావేశమందు హైద్రాబాదు విభజన జరిగి ఆంధ్ర -తెలంగాణాల ఏకీకరణ జరుగ వలెనని ఆర్థమునిచ్చు తీర్మానము చేయబడినది. ఈ తీర్మానమునే 2-6-1953 హైద్రాబాదు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పునరుద్ఘాటించినది. ఈ విధముగ పోలీసుచర్య తరువాత నుండి జూన్‌ నెల 1954 వరకు హైద్రాబాదు ప్రదేశ్‌ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీ మరియు యితర రాజకీయ పక్షాలు విశాలాంధ్ర స్థాపనను బలపరచినవి. ప్రత్యేకముగ విశాలాంధ్రోద్యమము ప్రారంభమైనది. విశాలాంధ్ర మహాసభ అవతరించినది. ఆంధ్ర - తెలంగాణ ఏకీకరణకొఱకు కృషి చేసినది. జూన్‌ 1954లో హైద్రాబాదు ప్రదేశ్‌ కాంగ్రెస్‌లో ఒక వర్గము ప్రత్యేక తెలంగాణా రాష్ట్రము కావలెనను వాదమును లేవదీసినది. తత్ఫలితముగ హైద్రాబాదాంధ్ర రాజకీయ రంగమున విశాలాంధ్రవర్గము, తెలంగాణావర్గము అను రెండు పక్షాలు బయలు దేరినవి. ఉభయపక్షాల వాదనలు భారత ప్రభుత్వమునకు అందజేయబడినవి. హైద్రాబాదు శాసనసభలో అధిక సంఖ్యాకులు విశాలాంధ్రమును బలపర్చినారు. అఖిల భారత కాంగ్రెస్‌ కార్యవర్గము ఆంధ్ర-తెలంగాణాల ఏకీకరణ జరుగవలెనని సలహా నిచ్చినది. తరువాత హైద్రాబాదు రాజధానిగ ఆంధ్ర- తెలంగాణాల ఏకీకరణ అతిత్వరగా జరిగి సమగ్ర ఆంధ్ర రాష్ట్రముగా 1956 నవంబరు నెల మొదటితేదీనాడు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ జరిగినది. ఇందువలన నూటయేబది సంవత్సరాల క్రింద ఇంగ్లీషు రాజ్య విస్తరణ ఫలితముగా విడిపోయిన మూడుకోట్ల ఆంధ్రులు తిరిగి ఏకపరిపాలన క్రిందకువచ్చి, కృష్ణా, గోదావరినదుల జలాలతోపాటు, తెలుగు సీమలోని ప్రకృతి సంపదను తెలుగు ప్రజల అభ్యుదయము కొరకు వినియోగించి "ఆంధ్రావళికి మోదము" కలుగునటుల సకలాంధ్రము సర్వతోముఖాభివృద్ధి కొరకు ప్రయత్నించు అవకాశాలు లబ్ధమై, విశాలాంధ్రము భారతదేశమునకు పెట్టనికోటయై, ఆసేతుహిమాచలమున ఒక సుందర నందన వనముగా శోభిల్లు చున్నది.

AndhraBharati AMdhra bhArati - telaMgaaNamuloo aaMdhroodyamamu - telaMgANalO jAtIyOdyamAlu - DA\.. dEvulapalli rAmAnujarAvu - telugu vachana sAhityamu - vyAsamulu ( telugu andhra )