వచన సాహిత్యము వ్యాసములు విశాలాంధ్రోద్యమము

విశాలాంధ్రోద్యమము
తెలంగాణలో జాతీయోద్యమాలు - డా॥ దేవులపల్లి రామానుజరావు

ఆంధ్రావళికి మోదము - చారిత్రాత్మక ప్రకటన
రెండు దశాబ్దాల క్రిందట భావన
రెండు పాయలు
విమోచన ఉద్యమము
పోలీసు చర్య
కృత్రిమ రాష్ట్రము - ప్రజల ఆకాంక్ష
కొంతకాలము పట్టినది
అంకురార్పణ - ప్రజాస్వామిక వాతారవణము
అసమగ్ర ఆంధ్రరాష్ట్రము
భాషారాష్ట్ర ఉద్యమము - అగ్రనాయకుల ఆగ్రహము
గొప్ప బలము
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘము
మొదటి ప్రతిఘటన లేదు
చాలా ముఖ్యమైన వారము
అభిప్రాయ సేకరణ
గోపాలరెడ్డిగారి జోస్యము
విచిత్రమైన తీర్పు
ప్రస్ఫుటమైన రెండు వర్గాలు
రెండు ముఖ్య సంఘటనలు
సంప్రదింపులు
ఉధృత విశాలాంధ్ర ఉద్యమము
తీవ్ర పరిస్థితులు
వాదోపవాదాలు - ఢిల్లీ యాత్రలు
పార్లమెంటులో
ప్రతిష్ఠంభన
శుభాంతము
మహోజ్జ్వల ఘట్టము

ఆంధ్రావళికి మోదము - చారిత్రాత్మక ప్రకటన

భారత ప్రధాని శ్రీ జవహర్‌లాల్‌ నెహ్రూ 5వ మార్చి 1956 నాడు నిజామాబాదులో సుమారు రెండు లక్షల ప్రజలతో కూడిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో విశాలాంధ్ర ఏర్పడవలెనని భారత ప్రభుత్వము చేసిన నిర్ణయమును ప్రకటించిన సందర్భము ఆంధ్రదేశ చరిత్రలో చరిత్రాత్మకమైన, మహోజ్వలమైన ఘట్టము. రెండువందల సంవత్సరాల తరువాత తిరిగి తెలుగుప్రజలందరు రాజకీయముగ ఏక కుటుంబీకులు కాగల అవకాశము నిచ్చిన భారత ప్రధాని ప్రకటన ఆంధ్రావళికి మోదము చేకూర్చినది. ఈ ప్రకటన నిజామాబాదున జరుగుటయందు కూడ ఒక విధమైన ఔచిత్యము కన్పించుచున్నది. ఈ నిజామాబాదులోనే పోలీసు చర్యకు చాలా సంవత్సరాల ముందు జరిగిన ఆంధ్ర మహాసభ నాలుగవ సమావేశములో ఆంధ్రోద్యమము రాజకీయోద్యమముగా రూపొందినది. పోలీసు చర్య తరువాత ఈ నిజామాబాదు పట్టణములోనే జరిగిన హైద్రాబాద్‌ స్టేట్‌ కాంగ్రెసు మహాసభలో హైద్రాబాదు విభజన గావించి ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను పొరుగుననున్న ఆ భాషా రాష్ట్రాలతో కలిపివేయవలెనని తీర్మానించనైనది. ఆ నిజామాబాదులోనే 1956 సంవత్సరమున విశాలాంధ్ర ప్రకటన జరిగినది.

ఇంగ్లీషు సామ్రాజ్య వ్యాప్తితో భారతదేశమున రాష్ట్రాల ఏర్పాటు ప్రజల అవసరాలతో నిమిత్తము లేక పరదేశ పరిపాలకుల అవసరాలకు ఉపయోగ పడునట్లుగా జరిగినది. తత్ఫలితముగ కుతుబ్‌షాహీల పాలనమందే కాక నిజామ్‌షాహీల పాలనమందుకూడ కొంతకాలము ఏకముగా నుండిన ఆంధ్రులు, మద్రాసు, హైదరాబాదు రాష్ట్రాలలో చీలిపోవుట జరిగినది. సుమారు నూటయేబది సంవత్సరాలకు పైగా చీలిపోయిన తరువాత తిరిగి ఏకము కావలెనను అభిలాష 1900 సంవత్సరములో మొట్టమొదట పొడసూపినది. బ్రిటిష్‌ ఆంధ్రుడైన కీర్తిశేషులగు కొమర్రాజు వేంకట లక్ష్మణరావుగారు హైదరాబాదుకు వచ్చి 1900 సంవత్సరములో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయము, 1904 సంవత్సరములో విజ్ఞానచంద్రికా గ్రంథమండలిని స్థాపించి, ఉభయ ప్రాంతాలలో నున్న తెలుగువారిని వైజ్ఞానికముగ దగ్గరకు తీసికొనివచ్చిరి. ఈ వైజ్ఞానికోద్యమము క్రమక్రమముగ నాటక ప్రదర్శనాలు, పత్రికలు, వైజ్ఞానికుల పర్యటనలు మొదలైన సాంస్కృతికోద్యమాల ద్వారా వ్యాపించి, బలపడి, పోలీసుచర్య జరిపిన కొన్ని సంవత్సరాలలోనే సాంస్కృతికముగ విశాలాంధ్ర స్థాపన కావించినది. అందుచేతనే తెలంగాణా నాయకులైన కొండా వెంకటరంగారెడ్డిగారు 1955 జూలై నెలలో జరిగిన తెలుగుభాషా సమితి శాఖ ప్రారంభోత్సవ సమయమున సాంస్కృతికముగ విశాలాంధ్ర ఏర్పడినదని ఉద్ఘాటించిరి. రాజకీయ విశాలాంధ్రకు పూర్వమే సాంస్కృతిక విశాలాంధ్ర ఏర్పడుట సహజము, స్వాభావిక పరిణామము.

రెండు దశాబ్దాల క్రిందట భావన

రాజకీయముగ విశాలాంధ్ర కూడ రెండు దశాబ్దాల క్రిందట భావించిన ఉద్యమమనియే చెప్పవచ్చును. హైదరాబాదులోని ఆంధ్రోద్యమమును గురించి ఇది విశాలాంధ్రోద్యమముగ పరిణమించ వచ్చునను అనుమానము ఇరువది సంవత్సరాల క్రిందట అప్పటి హైదరాబాదు ప్రభుత్వమునకు కలిగినది. 1936లో హైదరాబాదు ప్రభుత్వమునకు హోమ్‌ సెక్రటరీగా నుండిన నవాబ్‌ అలియావర్‌ జంగ్‌ బహద్దుర్‌ అప్పుడు ఆంధ్ర మహాసభ అధ్యక్షులుగా నుండిన మాడపాటి హనుమంతరావు పంతులుగారితో ప్రభుత్వమునకు గల పై అనుమానమును వెల్లడించి యుండిరి. 1946వ సంవత్సరములో కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్యగారు "విశాలాంధ్రలో ప్రజారాజ్యము" అను పుస్తకమును వ్రాసి, పై అనుమానము సకారణమైనదని నిరూపించినారు. హైదరబాదులోని సాంస్కృతికోద్యమము విశాలాంధ్రమునకు పునాదులు వేసినది. దేవులపల్లి రామానుజరావు సంపాదకత్వమున 1947లో ప్రారంభమై వరంగల్లు నుండి వెలువడిన "శోభ" మాస పత్రిక విశాలాంధ్ర దృక్పథముతో నడచినది.

రెండు పాయలు

ఈ శతాబ్దమున ఆంధ్రోద్యమము రెండు పాయలుగా అభివృద్ధి పొందినది. ఇందులో మొదటిది మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర రాష్ట్రోద్యమము. మన దేశమున భాషారాష్ట్రోద్యమము భారత జాతీయోద్యమమునకు అనుబంధముగ నిర్వహించబడినది. భాషారాష్ట్రాలను భారత జాతీయ కాంగ్రెసు స్వాతంత్ర్యమునకు పూర్వమే బలపరచి తన రాష్ట్ర కాంగ్రెసు సంఘాలను ఈ ప్రాతిపదిక మీదనే నిర్మించినది. భారతదేశమునకు స్వాతంత్ర్యము రాకపూర్వము మద్రాసు రాష్ట్రములోని ఆంధ్రోద్యమము ఆ రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతమునకు మాత్రమే పరిమితమైన రాష్ట్రోద్యమముగ నుండెను. రెండవ పాయ హైదరాబాదులోని ఆంధ్రోద్యమము. ఈ ఉద్యమము యొక్క లక్ష్యము పోలీసుచర్యకు పూర్వము వరకు హైదరాబాదులో బాధ్యతాయుత ప్రభుత్వస్థాపనయై యుండెను. కాని భారతదేశమునకు స్వాతంత్ర్యము ప్రాప్తించి స్వదేశ సంస్థానాలు స్వతంత్ర్య భారతము నందలి అంతర్భాగాలైన తరువాత ఉభయప్రాంతాలలోని ఆంధ్రోద్యమ దృక్పథములో స్పష్టమైన, సహజమైన పరిణామాలు కన్పించినవి. ఈ పరిణామమే తిరిగి ఆంధ్రులందరు ఏక రాష్ట్రవాసులు కావలెనను ఉద్యమముగ రూపొందినది. ఇటువంటివే సంయుక్త మహారాష్ట్ర, ఐక్య కర్ణాటక ఉద్యమాలు. కావుననే మైసూరు, హైద్రాబాదు రాష్ట్రాలు స్వతంత్ర భారత యూనియన్‌లో చేరిన తరువాత 26వ నవంబరు 1949వ సంవత్సరమున విశాలాంధ్ర మహాసభ స్థాపన జరిగినది. ఈ మహాసభ తరువాత 1950 ఫిబ్రవరి 13, 14 తేదీలలో సమావేశమై, విశాలాంధ్ర తన ఆదర్శముగ ప్రకటించినది. 1953 అక్టోబరు 2వ తేదీనాడు మద్రాసు రాష్ట్ర విభజన, అక్కడి తెనుగు ప్రాంతాలతో కూడిన ఆంధ్రరాష్ట్ర స్థాపన జరిగినది. ఇది విశాలాంధ్ర రాష్ట్ర స్థాపనకు తొలిమెట్టు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము కావలెననియు, మద్రాసు నుండి విడిపోవలెననియు అభిప్రాయము మొట్టమొదటి సారి 1912లో కలిగినది. తమిళులతో కూడిన మద్రాసు రాష్ట్రములో ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధికి సరియైన అవకాశాలు దొరకకపోవుటే ఈ అభిప్రాయానికి మూలము. ఆంధ్రరాష్ట్రోద్యమమును ప్రారంభించి దానికి నాయకత్వము వహించినది స్వర్గీయ కొండా వెంకటప్పయ్య పంతులు, స్వర్గీయ నాగేశ్వరరావు పంతులు, స్వర్గీయ న్యాయపతి సుబ్బారావు పంతులు, స్వర్గీయ కట్టమంచి రామలింగారెడ్డి గారలతో పాటు స్వర్గీయులు ప్రకాశం పంతులుగారు, బులుసు సాంబమూర్తిగారు, పట్టాభి సీతారామయ్య పంతులుగారు మొదలైన పెద్దలు. మొట్టమొదట భాషా రాష్ట్రవాదము కాంగ్రెసు వర్గాలలో కొంత అలజడిని కల్గించినది. భాషారాష్ట్రాల ఆవశ్యకతను గూర్చి ఇంగ్లీషులో ఒక ఉద్గ్రంథమును వ్రాసి, భాషారాష్ట్ర వాదమును పట్టాభి సీతారామయ్యగారు సహేతుకముగ సమర్థించిరి. ఆంధ్ర కాంగ్రెసు నాయకులు అఖిల భారత కాంగ్రెసుచే భాషా రాష్ట్రాల సూత్రమును ఆమోదింపజేసి, మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెసు సంఘమును సాధించిరి. తరువాత క్రమక్రమముగ ఆంధ్ర రాష్ట్రోద్యమము బలపడి, మనకు స్వతంత్రము వచ్చిన తరువాత ఆంధ్రరాష్ట్రము ఏర్పడినది. ఆంధ్ర రాష్ట్రోద్యమమును గూర్చి ఆంధ్రదేశములో ఎటువంటి అభిప్రాయ భేదము లేకుండెను. అన్ని రాజకీయపక్షాలీ ఉద్యమమును సమర్థించినవి. మద్రాసులో జరిగిన ఇరువదవ ఆంధ్ర మహాసభ సమావేశానికి ఆచార్య రాధాకృష్ణగారు అధ్యక్షత వహించిరి. తరువాత వారు ఇంగ్లండు వెళ్ళి, ఆంధ్రరాష్ట్ర స్థాపన గూర్చి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్స్‌తో సంప్రదింపులు కూడ జరిపిరి. మొదటినుండియు ఆంధ్రోద్యమము పట్ల సంపూర్ణమైన సానుభూతిని కలిగి రాధాకృష్ణగారు అవసరమైనపుడు తగిన సహాయమును చేసినారు.

విమోచన ఉద్యమము

భారత దేశమునకు స్వాతంత్ర్యము వచ్చిన తరువాత హైదరాబాదు ప్రజలయొక్క విమోచనోద్యమానికి క్రొత్త బలము చేకూరినది. భారత యూనియన్‌లో ప్రవేశించుటకు హైదరాబాదు నిజామ్‌ నిరాకరించుటతో హైదరాబాదు ప్రజల విముక్తి ఉద్యమములో నూతనాధ్యాయము ప్రారంభమైనది. 1947లో చెలరేగిన రజాకారు అమానుష చర్యల ఫలితముగ హైదరాబాదు ప్రజలు వేల సంఖ్యలో పొరుగు రాష్ట్రాలకు తాత్కాలికముగా వలస పోయిరి. హైదారాబాదాంధ్రులు విజయవాడ, కర్నూలు ప్రాంతాలకు వెళ్ళిరి. ఈ వెళ్ళుటలో ఉభయ ప్రాంతాల రాజకీయ సమైక్యత యొక్క మనస్తత్వము వెల్లడియగుచున్నది. 1947 జూలైలో విజయవాడ యందు అయ్యదేవర కాళేశ్వరరావుగారి యింటిలో స్వామీ రామానందతీర్థ అధ్యక్షతన ఇట్లు తాత్కాలికముగ వలసపోయిన రాజకీయ కార్యకర్తల సమావేశము జరిగి, హైద్రాబాదు ప్రజల స్వాతంత్ర్య పోరాట చర్యా సంఘము స్థాపితమైనది. దీని శాఖ యొకటి కర్నూలులో స్థాపితమైనది. ఈ చర్యా సంఘము పక్షాన మాట్లాడుచు, హైదరాబాదులో ప్రజలకు ఫాసిస్టు పరిపాలననుండి విముక్తి కలిగి బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన జరుగవలెనని స్వామి రామానందతీర్థ ఉద్ఘాటించిరి. ఇదే నెలలో మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర కాంగ్రెసు సంఘమువారు హైద్రాబాదు ప్రజల సహాయ సంఘము నొకదానిని కాళేశ్వరరావుగారి అధ్యక్షతన నెలకొల్పిరి.

పోలీసు చర్య

1948 ఏప్రిల్‌ 26 నాడు బొంబాయిలో రాజేంద్రబాబుగారి అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెసు స్థాయీ సంఘ రహస్య సమావేశము జరిగినది. దీనికి హైదరాబాదు కాంగ్రెసు నాయకులుకూడ వెళ్ళియుండిరి. ఈ రహస్య సమావేశములో హైద్రాబాదుపై పోలీసుచర్య జరపవలెనని వాదించిన వారిలో కాళేశ్వరరావుగారు ముఖులు. ఈ సందర్భమున ఆంధ్రరాష్ట్రము కావలెనని ఆంధ్రనాయకులు రాజేంద్రబాబును కోరగా, వారు ఆంధ్రులకు మాత్రమే వెంటనే రాష్ట్రము నిచ్చుటకు నిర్ణయించినచో మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడ ఈయవలసి యుండుననియు, ఈ అన్ని సమస్యలు ఒకేసారి నిర్ణయించుట మంచిదనియు తెలిపిరి. మొత్తముమీద 13 సెప్టెంబరు నుండి 17 సెప్టెంబరు (1948) వరకు హైద్రాబాదుపై పోలీసు చర్య జరిగి ప్రజల విముక్తి జరిగినది. 1948 నవంబరులో హైద్రాబాదుకు కాళేశ్వరరావుగారు వచ్చి, స్థానిక కాంగ్రెసు నాయకులైన స్వామీజీ మొదలైన వారితో సంప్రదించిరి. ఆ సందర్భములో హైదరాబాదు విభజన జరిగి విశాలాంధ్ర, ఐక్యకర్ణాటక, సంయుక్త మహారాష్ట్రల కొరకు పనిచేయ వలెనని నిర్ణయింపబడినది. 1949 ఏప్రిల్‌లో తిరిగి కాళేశ్వరరావుగారు హైదరాబాదుకు వచ్చినపుడు హైదరాబాదు తెలుగు నగరమనియు, అది తెలుగు సీమకు రాజధాని యనియు, మహారాష్ట్ర నాయకులు ఒప్పుకొని ఉద్ఘాటించుట జరిగినది. ఆ సమయమున రామకృష్ణారావు గారిచ్చిన తేనీటి విందు సందర్భమునకూడ హైదరాబాదు సకలాంధ్రమునకు రాజధానియని అందరు ఒప్పుకొనుట జరిగినది. సకలాంధ్రమునకు హైదరాబాదు రాజధానియని వ్యాపించుచున్న భావము సర్దారు పటేలుగారి దృష్టికి ఎట్టులో తీసుకొని రాబడినది. అపుడాయన ఈ విషయమై కాళేశ్వరరావుగారికి వ్రాసిన ఉత్తరములో ఇప్పుడే హైదరాబాదు విభజనను గూర్చి ఆందోళన చేయవద్దని హెచ్చరించిరి. తరువాత 1949 మే నెలలో డెహరాడూన్‌లో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశ సందర్భమున హైద్రాబాదు కాంగ్రెసు నాయకులతో మాట్లాడుచు సర్దార్‌ పటేల్‌గారు హైద్రాబాదు విభజనను గూర్చి ఆందోళన చేయు సమయము ఆసన్నము కాలేదనియు, ఒక అయిదు సంవత్సరాల కాలమున ఈ పని జరుగుటకు తగిన వాతావరణము సృష్టింప బడగలదనియు తెలిపిరి. ఈ విధముగ, తరువాత హైద్రాబాదు విభజనోద్యమమునకు తగిన వాతావరణము కల్గించబడినది. హైద్రాబాదు సకలాంధ్రమునకు రాజధానియని కూడ గుర్తింపబడినది. ఇట్లు గుర్తించిన అప్పటి మద్రాసు ఆంధ్ర కాంగ్రెసు నాయకులలో మొదటివారు కాళేశ్వరరావుగారు. మద్రాసు ఆంధ్రులకు లభించదని వీరు మొదటి నుండియు అభిప్రాయపడిరి. జనవరి 1950లో మద్రాసులో సమావేశమయిన ఆంధ్ర కాంగ్రెసు శాసన సభ్యులు కర్నూలు ఆంధ్రుల తాత్కాలిక రాజధానియని, హైద్రాబాదు శాశ్వత రాజధాని యనియు నిర్ణయించుట గమనింపదగిన విశేషము. ఆంధ్రరాష్ట్ర అవతరణమునకు ఒక రోజు ముందు అనగా 30వ సెప్టెంబరు 1953 నాడు సమావేశమైన ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెసు సంఘమువారు కూడ కర్నూలు తాత్కాలిక రాజధాని, హైద్రబాదు శాశ్వత రాజధానియని నిర్ణయించిరి. కమ్యూనిస్టు పార్టీవారు మొదటి నుండియు, అనగా 1947వ సంవత్సరము నుండియు హైదరాబాదు సంస్థానమును విచ్ఛిన్నము గావించి, మదరాసు రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతమును తెలంగాణముతో కలిపివేసి విశాలాంధ్రమును హైదరాబాదు రాజధానిగా యేర్పాటు చేయుట తమ ఆశయమని ఉద్ఘాటించుచు, యీ ఉద్యమము జన సామాన్యములో వ్యాపించుటకు కృషి సల్పుచుండిరి.

కృత్రిమ రాష్ట్రము - ప్రజల ఆకాంక్ష

ఇంగ్లీషువారి రాజ్యవిస్తరణ ఫలితముగ ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకములతో కూడిన యొక కృత్రిమ రాష్ట్రము ఆసఫ్జాహి పరిపాలనక్రింద ఏర్పడినది. మధ్యయుగములో నిరంకుశ పరిపాలన క్రింద ప్రజలు నలిగిపోయినారు. పోలీసుచర్య తరువాత ఏర్పడిన ప్రజాస్వామిక వాతావరణమున హైద్రాబాదు విభజన జరిగి ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు పొరుగు రాష్ట్రాలలోని ఆయా భాషాప్రాంతాలతో కలిసి విశాలాంధ్ర, సంయుక్త మహారాష్ట్ర, ఐక్యకర్ణాటకములు ఏర్పడవలెనని ప్రజలు ఆకాంక్షించినారు. ఈ ఆకాంక్ష పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాష్ట్రములోని అన్ని రాజకీయపక్షాల తీర్మానాలయందు ప్రతిబింబితమైనది. సాంస్కృతిక సంస్థలు యీ అభిప్రాయములను బలపరచినవి. పోలీసు చర్య తరువాత తూపురాన్‌లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు 194 9ఫిబ్రవరి సమావేశములో భాషారాష్ట్రాలను బలపరచుటయే కాక అది వాస్తవముగా విశాలాంధ్ర సారస్వత సమావేశముగ జరిగినది. తరువాత పరిషత్తు సభలు యీ మార్గముననే నడచినవి. అలంపురములో రాధాకృష్ణ పండితుని ఆశీర్వచనములతో ప్రారంభమైన ఆంధ్ర సారస్వత పరిషత్‌ సభలు వాస్తవముగ సకలాంధ్ర సారస్వత సభలు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఇతర సారస్వత సంస్థలు విశాలాంధ్రోద్యమమును సంపూర్ణముగ బలపరచినవి. పోలీసు చర్య జరిగిన వెంటనే కీ. శే. సర్దారు జమలాపురం కేశవరావుగారి అధ్యక్షతన ఘణపురంలో జరిగిన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సమావేశములో విశాలాంధ్ర కావలెనని ఉద్ఘాటించు తీర్మానము అమోదింపబడినది. ఈ తీర్మానమును అప్పటి తెలంగాణా ఏకైక దినపత్రికయగు గోలకొండ సంపాదకీయమున బలపరచింది. రాజకీయముగ, ఒక బహిరంగ సభలో ఇట్టి ఉద్ఘాటన జరుగుట బహుశా ఇదియే మొదటి పర్యాయమేమో! నిజామాబాదులో 1950 మార్చి నెలలో శ్రీ దిగంబరరావు బిందూ అధ్యక్షతన జరిగిన హైద్రాబాదు స్టేటు కాంగ్రెసు సమావేశమున హైదరాబాదు రాష్ట్రమును విభజించి ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను తత్పరిసర భాషా ప్రాంతాలతో కలిపి వేయవలెనని తీర్మానింపబడినది. ఈ తీర్మానమును ప్రతిపాదించినవారు బూర్గుల రామకృష్ణారావుగారు. ఈ తీర్మానమునకు రంగారెడ్డి, చెన్నారెడ్డి గారల ఆమోదము కూడ లభించెను. 1950వ సంవత్సరమున ఫిబ్రవరి 12, 13 తేదీలలో వరంగల్లులో అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన జరిగిన విశాలాంధ్ర మహాసభ స్థాయీ సంఘ సమావేశములో విశాలాంధ్ర తీర్మానము ఆమోదించుట జరిగినది. ఈ సమావేశములో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు పాల్గొనిరి. ఈ విశాలాంధ్ర స్థాయీ సంఘ సభ్యుల పట్టికను పరిశీలించినపుడు ఇందులో అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రతినిధులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు కనిపించుచున్నారు. కాంగ్రెస్సే కాక ఇతర రాజకీయ పక్షాలు కూడా, ముఖ్యముగా కమ్యూనిస్టు, సోషలిస్టు పక్షాలు విశాలాంధ్రోద్యమానికి ఎంతో బలమును చేకూర్చినవి.

కొంతకాలము పట్టినది

ఈ విధముగ ప్రారంభమైన విశాలాంధ్రోద్యమము హైదరాబాదు నగరములో అడుగుపెట్టి, తెలుగు సీమలో వ్యాపించుటకు కొంతకాలము పట్టినది. ఉస్మానియా విశ్వవిద్యాలయమున జరిగిన మొట్టమొదటి ఆంధ్రాభ్యుదయోత్సవాల సందర్భమున అయ్యదేవర కాళేశ్వరరావుగారు హైదరాబాదుకు వచ్చి, విశాలాంధ్ర మహాసభను మాడపాటి హనుమంతరావు పంతులుగారి సలహాతో ప్రారంభించుటకు ప్రయత్నించిరి. ఈ సందర్భమున సుల్తాను బజారులోని ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యాలయమున ఇందుకొరకై ఒక సమావేశము జరిగియుండెను. ఆ సమావేశానికి అపుడు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసుకు ఉపాధ్యక్షులుగా నున్న పల్లెర్ల హనుమంతరావుగారు అధ్యక్షత వహించిరి. సమావేశములో మాడపాటి హనుమంతరావు పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, పి. పుల్లారెడ్డి, దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావు, యం. యస్‌. రాజలింగం మొదలైన వారు పాల్గొని, కొంతకాలము ఆగి ఈ ఉద్యమమును ప్రారంభించవలెనని అభిప్రాయపడిరి.

అంకురార్పణ - ప్రజాస్వామిక వాతారవణము

ఇట్టి పరిస్థితులలో హైదరాబాదు రాష్ట్రమున జనరల్‌ ఎన్నికలు జరిగినవి. మొట్టమొదటిసారిగా శాసనసభకు బాధ్యతవహించు ప్రభుత్వము ఏర్పడినది. కమ్యూనిస్టులు తెలంగాణ పోరాటమును విరమించి శాసనసభలో ప్రవేశించిరి. ఈ ప్రజాస్వామిక వాతావరణములో విశాలాంధ్రోద్యమ వ్యాప్తికి తగిన తరుణము ఆసన్నమైనదని ఉద్యమాభిమానులు అభిప్రాయపడినారు. ఈ అభిప్రాయముతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల కార్యాలయమున మీర్‌ అహమ్మదలీఖాన్‌ గారి ప్రేరణతో మీర్‌ అహమ్మదలీఖాన్‌, దేవులపల్లి రామానుజరావు, నందగిరి వెంకట్రావు గారలు 13 ఆగస్టు, 1953 నాడు సమావేశమయి, హైదరాబాదు రాష్టములో విశాలాంధ్రోద్యమము ప్రారంభింపవలెనని నిర్ణయించి, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి గారలతో సంప్రదింపవలెనని నిశ్చయించిరి. ఈ సంప్రదింపులు 20 ఆగస్టు 1953 నాడు ఎగ్జిబిషను గ్రౌండ్సులోని ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల కార్యాలయములో జరిగినవి. ఈ సంప్రదింపులలో మాడపాటి హనుమంతరావు, అహమ్మదలీఖాన్‌, సురవరం ప్రతాపరెడ్డి, నందగిరి వెంకట్రావు, దేవులపల్లి రామానుజరావు, పల్లెర్ల హనుమంతరావు, సర్దారుల్లాఖాన్‌, భోజరాజ్‌ గారలు పాల్గొని యుండిరి. ఆనాడు ఈ ఎనిమిది మంది సంతకాలతో 1953 సెప్టెంబరు 14వ తేదీనాడు సాయంకాలం 5 గంటలకు పట్టభద్రుల కార్యాలయములో ఒక పెద్ద సమావేశమును జరుపుటకు నిర్ణయించబడినది. ఆ సమావేశమునకు నగరమునుండి, జిల్లాలనుండి నూరుమందికిపైగా ప్రతినిధులు ఆహ్వానింపబడిరి. సమావెశపు నోటీసు సురవరం ప్రతాపరెడ్డిగారు ఇంగ్లీషులో వ్రాసిరి. 14 సెప్టెంబరు 53 నాటి సమావేశమున మాడపాటి హనుమంతరావు, పల్లెర్ల హనుమంతరావు, భోజరాజ్‌, బొజ్జం నరసింహులు, కొమ్మవరపు సుబ్బారావు, ఆదిరాజు వీరభద్రరావు, యస్‌. శ్యామరావు, కమతం వెంకటరెడ్డి, మీర్‌ అహమ్మదలీ ఖాన్‌, దేవులపల్లి రామానుజరావు, సర్దారుల్లాఖాన్‌, మడూరి శంకరలింగం, రంజిత్‌ సింగ్‌, భద్రదేవ్‌, నూకల నరోత్తమరెడ్డి గారలు పాల్గొనిరి. మాడపాటి హనుమంతరావుగారు ఈ సమావేశమునకు అధ్యక్షత వహించిరి. ఈ విధముగ హైద్రాబాదు నగరమున, జిల్లాలలో విశాలాంధ్రోద్యమ అభిప్రాయాలు క్రమక్రమముగ వ్యాపింపసాగినవి. విశాలాంధ్ర మహాసభను స్థాపించవలెనని అభిప్రాయములు బలపడినవి. ఇది ఇట్లుండగా మద్రాసులో ఆంధ్రరాష్ట్రముకొరకు పొట్టి శ్రీరాములుగారి ఆత్మార్పణము తరువాత భారత ప్రభుత్వముచే ఆంధ్రరాష్ట్ర స్థాపన ప్రకటన జరిగినది. ఈ పరిస్థితిలో 1953 ఏప్రిల్‌ నెలలో విజయవాడ యందు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యనిర్వాహక వర్గ సమావేశము జరిగియుండెను. ఈ సమావేశము మిక్కిలి ముఖ్యమైనది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘానికి సంజీవరెడ్డిగారు అధ్యక్షులుగా నుండిరి. ఈ సందర్భమున తెలంగాణా ప్రతినిధులు కొందరు విజయవాడకు వచ్చిన బాగుండునని కాళేశ్వరరావుగారు మాడపాటి హనుమంతరావు పంతులుగారికి వ్రాసిరి. మాడపాటి హనుమంతరావుగారు తమ ఆంతరంగికులను సంప్రదించి అహమ్మదలీఖాన్‌, దేవులపల్లి రామానుజరావు లను విజయవాడకు వెళ్ళమని కోరిరి. వీరు విజయవాడకు వెళ్ళకముందు కొండా వెంకటరెడ్డిగారిని కలుసుకొనిరి. రంగారెడ్డిగారు కొంతముందుగానో, ఆలస్యముగనో, అనివార్యముగ విశాలాంధ్ర ఏర్పడగలదనియు, ఈ విషయమై తమను కలుసుకొనిన ముగ్గురు, అనగా మాడపాటి హనుమంతరావు, అహమ్మదలీఖాన్‌, దేవులపల్లి రామానుజరావుగారలు పనిచేయుట తమకు సమ్మతమేనని ప్రోత్సహించిరి. విజయవాడలో ఈ ఉభయులకు ఘన స్వాగత మీయబడినది. అక్కడ ఈ ఉభయులు సంజీవరెడ్డి, కాళేశ్వరరావు మొదలయిన కాంగ్రెసు నాయకులతో సంప్రదించిరి. ఆంధ్రనాయకులు విశాలాంధ్రకు తమ సంపూర్ణ సుముఖత్వమును వెల్లడించి, విశాలాంధ్ర ఉద్యమము తెలంగాణమునుండియే సాగవలెనని అభిప్రాయపడిరి. ఆనాడు విజయవాడలో యీ విషయమై జరిగిన బహిరంగసభలో పై ఉభయులు ప్రసంగించిరి. దీని తరువాత హైదరాబాదు, సికింద్రాబాదు మ్యునిసిపల్‌ కార్పొరేషనులు హైదరాబాదు రాష్ట్ర విభజన జరిగి, హైదరాబాదు రాజధానిగ విశాలాంధ్ర ఏర్పడవలెనని తీర్మానించినవి. 2వ జూన్‌ 1953 నాడు హైద్రాబాదులో హైద్రాబాదు ప్రదేశ్‌ కాంగ్రెసు సర్వసభ్య సమావేశము రామానందతీర్థ అధ్యక్షతన జరిగినది. అందులో విశాలాంధ్ర, ఐక్యకర్ణాటక, సంయుక్త మహారాష్ట్రముల స్థాపన వాంఛించుచు తీర్మానము జరిగినది. ఈ సంఘటనలు హైదరాబాదు, సికింద్రాబాదు నగరాలలోను తెలంగాణా జిల్లాలలోను విశాలాంధ్రోద్యమ వ్యాప్తికి బలమైన ఊతనిచ్చినవి. కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్రను బలపరచుచు ప్రకటన గావించినది. 1953 ఆగస్టు 14, 15 తేదీల హిమాయత్‌నగర్‌లో తెలంగాణా రైతుసంఘ కార్యాలయమున బద్దం ఎల్లారెడ్డిగారి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభ కార్యవర్గ సమావేశములో విశాలాంధ్ర కావలెనను తీర్మానము ఆమోదింపబడినది. తరువాత కొన్ని నెలలకు ఈ ఆంధ్రమహాసభ సమావేశము ప్రతాపగీర్జి కోఠిలో జరిగినది. విశాలాంధ్రము సత్వరముగా ఏర్పడవలెనని తీర్మానింపబడినది. 1953 ఆగస్టు 24వ తేదీనాడు రెడ్డి విద్యార్థి వసతి గృహమున విశాలాంధ్రోద్యమమును బలపరచుటకై మాడపాటి హనుమంతరావుగారి అధ్యక్షతన ఒక సమావేశము జరిగినది. ఇందులో దేవులపల్లి రామానుజరావు, వి. బి. రాజు, గురుమూర్తి, వెంకటేశం, వాసుదేవ నాయక్‌, అహమ్మదలీఖాన్‌, సర్దారుల్లాఖాన్‌, డాక్టరు రంగాచారిగార్లు విశాలాంధ్ర నిర్మాణము తొందరగా జరుగవలెనని ఉపన్యసించిరి. 1953 అక్టోబరు 2వ తేదీన ఆంధ్రరాష్ట్ర స్థాపన జరిగినది. ఈ సందర్భమున కర్నూలులో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ సమావేశమున హైదరాబాదు రాజధానిగ విశాలాంధ్ర స్థాపన జరుగవలెనని తీర్మానింపబడినది. ఇది గమనించదగినది. ఆంధ్ర రాష్ట్రావతరణ ఉత్సవాలలో పాల్గొనుటకు హైదరాబాదునుండి సుమారు రెండునూర్లమంది విశాలాంధ్రోద్యమాభిమానులు కర్నూలుకు వెళ్ళియుండిరి. 1953 అక్టోబరు ఒకటవ తేదీ సాయంకాలము కర్నూలులో తెలంగాణా ప్రతినిధుల సమావేశము జరిగినది. ఆ సమావేశములో అనంతశయనం అయ్యంగార్‌, బెజవాడ గోపాలరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైన ఆంధ్రనాయకులు పాల్గొనిరి. సమగ్రమైన చర్చలు జరిగిన పిదప తెలంగాణా ప్రతినిధులు విశాలాంధ్రకు కృషి చేయడానికి నిర్ణయించిరి.

అసమగ్ర ఆంధ్రరాష్ట్రము

రెండవ అక్టోబరు 1953 నాడు స్థాపితమైన ఆంధ్ర రాష్ట్రము అసమగ్రమైనది. మద్రాసు పట్టణము సంయుక్త రాజధానిగా అంగీకరించు కృషి విఫలమైనది. కర్నూలు రాజధానిగ ఎన్నుకొనుట జరిగినది. మద్రాసు నగరమే ఆనాడు సంయుక్త రాజధానిగ ఎన్నుకొనబడి యుండినచో హైదరాబాదు రాజధానియగు సమస్యకు తీవ్ర ప్రతిబంధకము కలిగెడిదేమో! హైదరాబాదు రాజధానికాని విశాలాంధ్రకు తెలంగాణమునుండి హృదయపూర్వకమగు సానుభూతి లభించెడిది కాదేమో! మద్రాసు రాజధాని కాకపోవుటలో ప్రకృతి యొక్క ప్రభావము కన్పడుచున్నది. కర్నూలు తాత్కాలిక రాజధాని మాత్రమే ననియు, ఆంధ్ర రాష్ట్రము అసమగ్రమైన దనియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుగారు పలుమారులు ఉద్ఘాటించిరి. మొట్టమొదటి భాషారాష్ట్రముగ ఆంధ్రరాష్ట్రము ఎంత అసమగ్రముగా నయినను ఏర్పడుట హైదరాబాదు ఆంధ్రులందరికి సంతోష కారణమైనది. ఆంధ్రరాష్ట్రము తొలిమెట్టుగా వారు విశాలాంధ్ర రాష్ట్ర సాధనకు ఉద్యుక్తులైరి. రెండవ అక్టోబరు 1953 నాడు హైదరాబాదులో ఆంధ్రరాష్ట్ర అభినందన సమావేశము కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయమున జరిగినది. ఈ సమావేశమున మాడపాటి హనుమంతరావు, కొండా వెంకటరెడ్డిగారలు ఉపన్యసించుచు విశాలాంధ్రను అభిలషించిరి. తరువాత కొంతకాలమునకు బందరులో జరిగిన ఆంధ్ర నాట్యకళా పరిషత్తు సభలను ప్రారంభించుచు చెన్నారెడ్డిగారు విశాలాంధ్రను సమర్థించిరి. 1953 అక్టోబరు 2వ తేదీనాడు కమ్యూనిస్టు పార్టీవారు ఆంధ్రరాష్ట్ర అవతరణ అభినందన బహిరంగసభను హైదరాబాదు నగరమున జరిపియుండిరి. అందు విశాలాంధ్రను కోరియుండిరి. ఈ విధముగ విశాలాంధ్రోద్యమము ప్రజల ఉద్యమముగ తెలుగుసీమలో బలపడినది.

భాషారాష్ట్ర ఉద్యమము - అగ్రనాయకుల ఆగ్రహము

ఆంధ్రరాష్ట్ర స్థాపనవల్ల ఇతర భాషారాష్ట్రాలు కావలెనను వాదము మరింత బలపడినది. మహారాష్ట్రులు కర్ణాటకులు కూడ తమతమ రాష్త్రములు కావలెనని ఆందోళన బయలుదేరదీసిరి. అందుచేత భారత ప్రభుత్వము రాష్ట్రాల పునర్నిర్మాణము కొరకు చర్య తీసుకొనక తప్పలేదు. బెంగుళూరులో జరిగిన అఖిల భారత కాంగ్రెసు స్థాయీ సంఘ సమావేశమున అయ్యదేవర కాళేశ్వరరావుగారు అఖిల భారత కాంగ్రెసు వేదికనుండి మొట్టమొదటిసారిగా విశాలాంధ్ర సమస్యను గురించి ప్రస్తావించగా కాంగ్రెసు అగ్రనాయకులు ఆగ్రహించిరి. ఈ సమయమున బాబూ పురుషోత్తమదాస్‌ టాండన్‌ కాంగ్రెసుకు అధ్యక్షులుగా నుండిరి. బెంగుళూరులో కాళేశ్వరరావుగారి వాదమునకు నిజలింగప్ప, రామానందతీర్థ ప్రభృతులు అనుకూలురై యుండిరి. హైదరాబాదు నానల్‌ నగరమున జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభకు వచ్చిన ప్రతినిధులను ఆహ్వానించుచు తన ఆహ్వాన సంఘాధ్యక్షోపన్యాసమున స్వామి రామానందతీర్థ భాషారాష్ట్రాల స్థాపనయొక్క ఆవశ్యకతను పునరుద్ఘాటించిరి. నిజలింగప్ప వంటి కర్ణాటక నాయకులు, గాడ్గిల్‌, హీరేలవంటి మహారాష్ట్ర నాయకులు మొదటి నుండియు భాషారాష్ట్రాల వాదమును బలపరచుచు ఐక్య కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రముల కొరకు పనిచేయసాగిరి. నానల్‌ నగర సమావేశములో మొసలికంటి తిరుమలరావు, కళావెంకట్రావుగారలు భాషారాష్ట్రాలను బలపరచుచు మాట్లాడిరి. ఆంధ్రరాష్ట్రము కావలెనని ఉద్ఘాటించుచు కళావెంకట్రావుగారు నానల్‌ నగరసమావేశంలో తెలుగులో ఉపన్యసించుట గమనింపదగిన విశేషము. అఖిల భారత స్థాయిలోకూడ భాషారాష్టోద్యమము వ్యాప్తి నందసాగినది. అఖిల భారత భాషారాష్ట్రవాదుల సమావేశము అకోలా నగరములో 1952లో జరిగినది. ఇందులో అన్ని పక్షాలవారు పాల్గొనిరి. ఈ సమావేశానికి హైదరాబాదు నుండి మీర్‌ అహమ్మదలీ ఖాన్‌ వెళ్ళి పాల్గొనిరి. హైదరాబాదు విభజన ఐక్య కర్ణాటక, సంయుక్త మహారాష్ట్ర, విశాలాంధ్ర స్థాపన తీర్మానము ఇందులో ఆమోదింపబడినది. ఈ భాషారాష్ట్ర మహాసభకు అధ్యక్షులు డాక్టరు లంకా సుందరంగారు. డాక్టరు లంకా సుందరంగారు బొంబాయి, హైదరాబాదు మొదలగు కొన్ని నగరాలు కేంద్ర పరిపాలిత ప్రాంతాలు కావలెనని అభిప్రాయపడిరి. ఈ అభిప్రాయము భాషారాష్ట్రాభిమానులెవరికిని నచ్చలేదు. అందుచేత ఈ అఖిల భారత భాషారాష్ట్రాల మహాసభ ఎక్కువగా ప్రజలను ఆకర్షించలేదు. కాని భాషా రాష్టోద్యమము మాత్రము ప్రజల ఉద్యమముగా పరిణమించినది.

గొప్ప బలము

ఇట్టి పరిస్థితులలో హైదరాబాదు నగరమున విశాలాంధ్రోద్యమము వ్యాపించినది. విశాలాంధ్ర మహాసభ కార్య నిర్వాహక సమావేశము 1953 సెప్టెంబరు 13, 14 తేదీలలో హైదరాబాదు నగరమున జరిగినది. ఇది విశాలాంధ్రోద్యమానికి గొప్ప బలము కల్గించినది. ఈ సమావేశము హైదరాబాదు నగరమునందలి కల్వ సూర్యనారాయణగారి భవనమున జరిగినది. బులుసు సాంబమూర్తి మొదలైన పెద్దలు ఇందులో పాల్గొని యుండిరి. ఈ విశాలాంధ్ర మహాసభ యొక్క కార్యనిర్వాహకవర్గము, స్థాయీ సంఘములలో ఆంధ్ర తెలంగాణా ప్రముఖులు సభ్యులుగా చేరిరి. తెలంగాణాలోని అన్ని వర్గాల ప్రతినిధులు ఇందులో సభ్యత్వమును అంగీకరించిరి.

జె. వి. నర్సింగరావు, సర్వోత్తమరెడ్డిగారలు ఇందులో సభ్యులుగా నుండుటకు అంగీకరించి సమావేశములలో పాల్గొనిరి. కమ్యూనిస్టులకు మాత్రము విశాలాంధ్ర మహాసభలో సభ్యత్వము కల్గించబడలేదు. వారు ప్రత్యేకముగ తమ ఆంధ్రమహాసభ, ఇతర సంఘాలద్వారా విశాలాంధ్రోద్యమానికి బలము చేకూర్చిరి. ఈ విధముగా విశాలాంధ్రోద్యమము రెండు పాయలుగ పనిచేసినది. సూర్యమహలులో జరిగిన విశాలాంధ్ర మహాసభ సమావేశము హైదరాబాదు, సికింద్రాబాదు నగరాలలో నూతనోత్సాహము కలుగచేసి అనేక కార్యకర్తలను తయారుచేసినది. ఉస్మాన్‌గంజ్‌ వర్తకులు హైదరాబాదు, సికింద్రాబాదు మ్యునిసిపల్‌ కార్పరేషన్ల సభ్యులు ఈ ఉద్యమములో ముందుకువచ్చి పనిచేయుట గమనింపదగినది. ఈ సందర్భమున హైదరాబాదులోని ముగ్గురు వ్యక్తులను ప్రత్యేకముగ పేర్కొనవలసియున్నది. వారిలో మొదటివారు మీర్‌ అహమ్మదలీఖాన్‌, రెండవవారు కొత్తూరు సీతయ్య, మూడవవారు పి. పుల్లారెడ్డి. పుల్లారెడ్డిగారు విశాలాంధ్ర మహాసభ కార్యదర్శిగా పనిచేసిరి. ఈ ముగ్గురు చివరి వరకు విశాలాంధ్రోద్యమ విజయముకొరకు గట్టి పట్టుదలతో అహోరాత్రములు కష్టపడి పనిచేసిరి. తరువాత విశాలాంధ్ర మహాసభ స్థాయీ సంఘ సమావేశము 14 నవంబరు 1953నాడు, హైదరాబాదు నగరమున లింగంపల్లిలోని వైశ్యవిద్యార్థి వసతిగృహములో మిక్కిలి వైభవముగ జరిగినది. ఆంధ్ర, తెలంగాణమందలి అన్ని ప్రాంతాల నుండి ఈ మహాసభకు ప్రతినిధులు వచ్చిరి. ఆహ్వాన సంఘమునకు కొత్తూరి సీతయ్యగారు అధ్యక్షులుగ, కల్వ సూర్యనారాయణ, నూకల సర్వోత్తమరెడ్డి, ధరణీధరసంఘి, లక్ష్మీచంద ఛలాని, డి. డి. ఇటాలియా, బెలిదె జగదీశ్వరయ్య, శాంతాబాయి, డాక్టర్‌ రంగాచారి, సర్దారుల్లాఖాన్‌, బి. కిషన్‌లాల్‌ గారలు ఉపాధ్యక్షులుగ, యన్‌ భోజరాజ్‌ గారు ప్రధాన కార్యదర్శిగా, కొమరగిరి నారాయణరావు, బి. రామిరెడ్డి, సుమిత్రాదేవిగారలు కార్యదర్శులుగ, ఎఱ్ఱం సత్యనారాయణగారు కోశాధ్యక్షులుగను పనిచేసిరి. అధ్యక్షత వహించిన అయ్యదేవర కాళేశ్వరరావుగారు విశాలాంధ్ర యొక్క ఆవశ్యకతను గూర్చి సమగ్రమైన ఉపన్యాసమును చదివిరి. మాడపాటి హనుమంతరావుగారు ఈ సమావేశములో పాల్గొని సంపూర్ణముగ సహకరించిరి. తెలంగాణమందలి అన్ని పక్షాలవారిందు పాల్గొనిరి. అప్పటి ఆంధ్ర రాష్ట్ర మంత్రులైన కడప కోటిరెడ్డి, పట్టాభి రామారావు, తెన్నేటి విశ్వనాధం గారలో సభలో పాల్గొని ఉత్తేజకరమగు ఉపన్యాసముల నిచ్చిరి. హైదరాబాదులోని ఆంధ్ర మహిళలు యీ సభలతో సంపూర్ణముగ సహకరించిరి. హైదరాబాదు మంత్రులెవరు ఇందు పాల్గొనలేదు. మొత్తముమీద సభలు చాల దిగ్విజయముగా జరిగినవి. హైదరాబాదును సంపూర్ణ ఆంధ్రనగరము కావించినవి. ఈ సమావేశమున గడియారము రామకృష్ణశర్మగారు చక్కని స్వాగత పద్యాలు వ్రాసి పఠించిరి. తరువాత శర్మగారు రెండు మూడు పర్యాయములు విశాలాంధ్రమును బలపరచుచు రసవంతమైన కవిత్వము వ్రాసిరి. ఈ పద్యాలు గోలకొండ పత్రికలో ప్రకటితమైనవి. తెలంగాణమున ప్రముఖాంధ్ర కవులు, రచయితలు విశాలాంధ్రను బలపరచిరి. మూడు కోట్ల తెలుగు ప్రజలను ఒక్కటిగా ముడివేయవలెనని దాశరథికవి వ్రాసెను. ఈయన తన కావ్యమునకు "మహాంధ్రోదయ" మని నామకరణము కావించెను. బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రిగారు విశాలాంధ్ర కావలెనని ప్రబోధించుచు చక్కని పద్యములు వ్రాసిరి.

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘము

22వ డిశంబరు 1953 నాడు పార్లమెంటులో భారత ప్రధాని నెహ్రూ కొన్ని నెలల క్రింద తాము చేసిన వాగ్దానమును అనుసరించి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘమును ఏర్పాటుచేయు నిర్ణయమును ప్రకటించిరి. మిస్టర్‌ ఫజులెఅలీ అధ్యక్షులుగా, హృదయనాథకుంజ్రు, ఫణిక్కర్‌ గార్లు సభ్యులుగ మన దేశములోని రాష్ట్రాల పునర్నిర్మాణమును గూర్చి సమగ్రమైన విచారణ కావించి 1955 జూన్‌ 30వ తేదీ లోగా నివేదికను సమర్పించుటకు ఈ ఉన్నతాధికార సంఘమును భారత ప్రభుత్వము నియమించినది. భాష ప్రాధాన్యముతోపాటు, భారతదేశ ఐక్యత, రక్షణ, ఆర్థిక సమస్యలు మొదలైన వానిని దృష్టిలో నుంచుకొని రాష్ట్రాల పునర్నిర్మాణమును గూర్చి విచారణ చేయుటకు ఈ సంఘము ఆదేశింపబడినది.

మొదటి ప్రతిఘటన లేదు

ఉద్యమ ప్రారంభములో విశాలాంధ్రోద్యమమునకు బలమైన ప్రతిఘటన ఏమియు లేకుండెను. అప్పుడు రెండే అభిప్రాయములు హైద్రాబాదులో ప్రబలముగ నుండెను. హైద్రాబాదు విభజన కాకూడదనియు, రాష్ట్రము యథాతథముగ నుండవలెననియు ఒక అభిప్రాయము. దీనిని కొన్ని ప్రత్యేక వర్గాలు, వ్యక్తులు మాత్రమే బలపరచుట జరిగినది. రాష్ట్రములోని ఏ రాజకీయ పక్షముకూడ యీ వాదనను అంగీకరించలేదు. అందుచేత ఈ వాదమునకు ప్రజాబలము లోపించినది. హైదరాబాదు విభజన జరిగి, ఐక్య కర్నాటక, సంయుక్త మహారాష్ట్ర, విశాలాంధ్రములు ఏర్పడవలెననునది రెండవ వాదము. ఈ వాదమును అన్ని రాజకీయ పక్షాలు ఆమోదించినవి. అందుచేత ఈ వాదమునకు ప్రజాబలము సంపుర్ణముగ లభించినది. అప్పటివరకింకను ప్రత్యేక తెలంగాణవాదము బయలుదేరలేదు. తరువాత తెలంగాణ వాదమును సమర్థించిన అనేకులు ప్రారంభమున విశాలాంధ్రోద్యమమును బలపరచి, సమర్థించిన వారగుట గమనింపదగిన విశేషము. 1954 వ సంవత్సరము జనవరి 14వ తేదీ నాడు సంక్రాంతి పండుగ సందర్భమున ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యాలయ ఆవరణలో విశాలాంధ్ర మహాసభ పక్షాన ఒక తేనీటివిందు ఏర్పాటు చేయబడినది. ఆ విందులో ఆంధ్రపితామహులతో పాటు హైద్రాబాదు ఆంధ్ర ప్రముఖులందరు పాల్గొని యుండిరి. ముఖ్యులైన కొందరు ముస్లిములు కూడ ఈ విందులో పాల్గొని యుండిరి. హైకోర్టు జడ్జిగా రిటైరయిన నవాబు నాజర్‌ యార్‌ జంగ్‌ బహద్దర్‌, కామర్సు అండ్‌ ఇండస్ట్రీస్‌ సెక్రటరీగా రిటైరయిన మిస్టర్‌ హబీబుర్‌ రహిమాన్‌, సియాసత్‌ పత్రికా సంపాదకులైన మిస్టర్‌ అబిదలీ ఖాన్‌లు ఈ విందులో పాల్గొని, విశాలాంధ్రోద్యమమునకు తమ ఆమోదమును తెలిపిరి. ఈ ముగ్గురు తుదివరకు విశాలాంధ్రోద్యమమును బలపరచిరి. ఈ విందులో ఆంధ్రేతరులైన ప్రముఖులు కూడ చాలమంది పాల్గొనియుండిరి. కొమర్రాజు వేంకట లక్ష్మణరావుగారి సహచరులుగా పనిచేసిన మునగాల రాజాగారు ఈవిందులోనేకాక ఇంతకు ముందు జరిగిన సభలలో కూడ పాల్గొనియుండిరి. హైద్రాబాదు పోలీసు శాఖలో గొప్ప పదవుల నలంకరించి రిటైరయిన ఆంధ్ర ప్రముఖులు యస్‌. యన్‌. రెడ్డిగారు విశాలాంధ్ర నామోదించిరి. వీరు విశాలాంధ్ర మహాసభ నగరశాఖ యొక్క కొన్ని సమావేశాలలో పాల్గొనియుండిరి. తరువాత వీరు ఫజులెఅలీ కమీషను ముందు విశాలాంధ్రకు అనుకూలముగ సాక్ష్యము ఇచ్చి యుండిరి. 1954వ సంవత్సర ప్రారంభములో హైద్రాబాదు విశాలాంధ్ర మహాసభ నగరశాఖ దేవులపల్లి రామానుజరావు అధ్యక్షుడుగను, భోజరాజ్‌ కార్యదర్శిగను, ఇతర ప్రముఖులు సభ్యులుగను ఏర్పాటు జరిగి, వార్డు కమిటీలను కూడ నెలకొల్పి పనిచేయుట ప్రారంభమైనది. విశాలాంధ్ర మహాసభ కార్యాలయము నిజామ్‌షాహి రోడ్డులో నెలకొల్పబడినది. మహాసభ కార్యదర్శి పుల్లారెడ్డిగారు కార్యాలయ నిర్వహణ భారము వహించిరి. కొత్తూరు సీతయ్య, మీర్‌ అహమ్మదలీ ఖానుగారలు కార్యదర్శికి పెట్టని కోటలై పనిచేసిరి. ధరణీధర సంఘి, బచ్చు గురుమూర్తి, యన్‌. ఆర్‌. వెంకటేశం, డాక్టరు రంగాచారి, నరసింహాచారి, ఎఱ్ఱం సత్యనారాయణ, ఎల్లాప్రగడ సీతాకుమారి, తెలుగు దేశము సంపాదకురాలు రాజ్యలక్ష్మీదేవి మొదలైనవారు ఉత్సాహముతో ముందుకువచ్చి పనిచేసిరి. 1954 జూన్‌ 14, 15 తేదీలలో తెలంగాణా ఆంధ్రమహాసభ పక్షాన ఎగ్జిబిషన్సు గౌండ్సులో మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావుగారి అధ్యక్షతన విశాలాంధ్ర సదస్సు జరిగినది. ఇందులో కాంగ్రెసేతరులే ప్రధానముగ నుండిరి. ఆంధ్ర, తెలంగాణాలనుండి ఈ సదస్సులో వేయిమందికి పైగా ప్రతినిధులు పాల్గొనిరి. సదస్సు ప్రారంభ సమావేశమున మాడపాటి హనుమంతరావు పంతులుగారు ఆశీస్సుల నిచ్చిరి. ఈ మహాసభ ఏర్పాటు చేసి విజయవంతముగా నిర్వహించుటలో తెలంగాణా కమ్యూనిస్టు నాయకులకు చండ్ర రాజేశ్వరరావుగారు సహాయపడి, కొన్ని రోజులు హైద్రాబాదులో నుండి పనిచేసిరి. తరువాత గూడ రాజేశ్వరరావుగారు తెలంగాణాలో విశాలాంధ్రోద్యమ వ్యాప్తికి మంచి కృషి కావించిరి.

చాలా ముఖ్యమైన వారము

1954 మే నెల చివరి వారము హైద్రాబాదు చరిత్రలో చాల ముఖ్యమైనది. ఈ వారము హైద్రాబాదు ప్రజల అభిప్రాయ సేకరణకొరకు ఫజులెఅలీ కమీషనువారు హైద్రాబాదు వచ్చిరి. ఈ సందర్భమున ఒక ముఖ్యమైన సంఘటన గూర్చి ప్రత్యేకముగ వివరించవలసి యున్నది. ఈ సంఘము యొక్క రాకకు సుమారు ఆరువారముల ముందు హైదరాబాదు ప్రదేశ్‌ కాంగ్రెసు కార్యనిర్వాహక వర్గము యొక్క నిర్ణయము ప్రకారము ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల డెలిగేట్ల సమావేశము విడివిడిగ జరుపబడినది. రాష్ట్ర భవిష్యత్తును గూర్చి ఫజులెఅలీ కమీషనుకు ఏమి చెప్పవలెనో నిర్ణయించుటకు ఈ సమావేశములు ఉద్దేశించబడినవి. మహారాష్ట్ర, కర్ణాటకులు సంయుక్త మహారాష్ట్ర, ఐక్య కర్ణాటకాలను బలపరచుచు తీర్మానించిరి. తెలంగాణా డెలిగేట్లలో మాత్రము అభిప్రాయ భేదము కలిగెను. డాక్టరు చెన్నారెడ్డిగారు తెలంగాణా ప్రత్యేకముగ నుండవలెనను వాదమును లేవదీసి, ఒక బలమైన వర్గమునకు నాయకత్వము వహించిరి. ఈ సమావేశములో తెలంగాణ రాష్ట్రమును ముప్పదిమూడు (33) మంది డెలిగేట్లు బలపరచిరి. పదముగ్గురు (13) విశాలాంధ్రను బలపరచిరి. నూరుమంది డెలిగేట్లలో మిగిలిన 54 గురు సమావేశములో పాల్గొనలేదు. మొత్తముమీద తెలంగాణ కాంగ్రెసు డెలిగేట్లలో రెండు అభిప్రాయములు కలవనియు, ఆ రెండు అభిప్రాయాలను కమీషనుకు నివేదించవలెననియు నిర్ణయింపబడెను. కాంగ్రెసు నియమావళి ప్రకారము మొత్తము హైద్రాబాదు రాష్ట్రమునకు ఒకటే ప్రదేశ్‌ కాంగ్రెసు కలదు. విడివిడిగా మూడు ప్రాంతాల డెలిగేట్ల సమావేశమునకు అవకాశము లేదు. మొట్టమొదటిసారి రాష్ట్ర విభజన తదనంతరము కర్తవ్యము గూర్చిన సమస్యమీద ఈ మూడు ప్రాంతాల డెలిగేట్లు, నియమావళిలో అవకాశము లేకపోయినను, విడివిడిగా సమావేశమగుట జరిగినది. ఇది సరియైన పద్ధతి కాదని కొందరి అభిప్రాయము. ఇందుకు అనుగుణముగా ఆ సమావేశములో పుల్లారెడ్డిగారు ఆక్షేపణ తెలిపిరి. ఏమయినప్పటికిని హైద్రాబాదు ప్రదేశ్‌ కాంగ్రెసునందు రెండు స్పష్టమైన పక్షాలు ఏర్పడినవి. ఒకటి విశాలాంధ్ర పక్షము, రెండవది తెలంగాణా పక్షము. తరువాత ఈ పక్షాల ప్రభావము అడుగడుగున గోచరించినది.

అభిప్రాయ సేకరణ

ఫజులెఅలీ కమీషను ఆగమనముతో హైద్రాబాదు రాజకీయ రంగమున కోలాహలము ప్రారంభమైనది. హైద్రాబాదు రాష్ట్రములోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన ప్రదేశ్‌ కాంగ్రెసు, కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీలు హైద్రాబాదు విభజన జరిగి తీరవలెనని ఉద్ఘాటించినవి. కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీలు విశాలాంధ్ర కావలెనని స్పష్టము చేసినవి. హైద్రాబాదు ప్రదేశ్‌ కాంగ్రెసులోని ఒక వర్గము విశాలాంధ్రము కావలెననియు, రెండవ వర్గము తెలంగాణము కావలెననియు తెలిపినవి. హైద్రాబాదు మంత్రివర్గము పక్షాన ఎటువంటి అభిప్రాయము వెల్లడిచేసినట్లు కనబడదు. వ్యక్తిగతముగా కొందరు మంత్రులు తమతమ అభిప్రాయములు తెల్పిరి. శాసన సభ్యులలో అధిక సంఖ్యాకులు విశాలాంధ్రమునే బలపరచిరి. సాంస్కృతిక సంస్థలయిన ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణ రచయితల సంఘము విశాలాంధ్రమునే బలపరచినవి. బద్దం ఎల్లారెడ్డిగారు అధ్యక్షులుగానున్న ఆంధ్రమహాసభ విశాలాంధ్రమునే బలపరచినది. హైద్రాబాదు, సికింద్రాబాదు మునిసిపల్‌ కార్పొరేషనులు విశాలాంధ్రకు అనుకూలముగా సాక్ష్యము లిచ్చినవి. ఈ సందర్భమున విశాలాంధ్ర మహాసభ చాలా చురుకుగా పనిచేసినది. విశాలాంధ్ర మహాసభ పక్షాన ఒక రాయబార వర్గమును వెంట తీసికొని వెళ్ళి విజ్ఞప్తిని సమర్పించినది. విశాలాంధ్ర మహాసభ నగరశాఖ పక్షాన కూడ విశాలాంధ్రకు అనుకూలముగ సాక్ష్యము నిచ్చుట జరిగినది. హైద్రాబాదు విభజన కాకూడదని తెలిపినవారిలో మందుముల నర్సింగరావు, నవాబ్‌ మెహిదీ నవాజ్‌ జంగు బహద్దుర్‌, పండిత వినాయకరావు, గోపాలరావు ఎక్బోటె, పండిత నరేంద్రజీ, కర్నల్‌ వాఘ్రే ప్రభృతులు పేర్కొనదగినవారు. ఫజులెఅలీ నివేదిక ప్రకటనానంతరము హైద్రాబాదు విభజన తప్పనిసరి అయినప్పుడు తెలంగాణ రాష్ట్రము ఏర్పడరాదనియు, విశాలాంధ్రమే ఏర్పడవలెననియు వీరందరు ఉద్ఘాటించిరి. తెలంగాణా కాంగ్రెసు డెలిగేట్ల సంఖ్య నూరు. ఇందులో విశాలాంధ్రకు అనుకూలముగా సుమారు యేబది మంది సంతకాలను సేకరించి ఒక విజ్ఞప్తిని కమీషనుకు సమర్పించుట జరిగినది. ఈ సంతకాల సేకరణకై జిల్లాలు తిరిగి కష్టపడిన వారిలో బొమ్మకంటి సత్యనారాయణరావు, పి. పుల్లారెడ్డి, వి. బి. రాజు, కొత్తూరి సీతయ్య, అహమ్మదలీఖాన్‌ గారలను పేర్కొన వలసి యున్నది. కమీషనువారు వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాలలో పర్యటన కావించిరి. ఈ పర్యటన సందర్భములో వారి కనేక విజ్ఞప్తులు సమర్పించబడినవి. ఈ విజ్ఞప్తులను పరిశీలించినపుడు విశాలాంధ్రోద్యమానికి ప్రజల అభిప్రాయము అనుకూలముగ నున్నదని వెల్లడియైనది. తరువాత విశాలాంధ్ర మహాసభ వైపునుండి రెండు అనుబంధ విజ్ఞప్తులు కూడ అంకెలతో సహా వివరాలను తెలుపుచు సమర్పించబడినవి. అప్పటి హైద్రాబాదు ముఖ్యమంత్రి రామకృష్ణారావుగారు వ్రాతపూర్వకముగ ఏమియును ఇచ్చినట్లు కనపడదు. అయినను వారు విశాలాంధ్రకే సుముఖులై యుండినట్లు అభిజ్ఞవర్గాల ద్వారా తెలిసినది. అంతేకాదు, విశాలాంధ్రకు అనుకూలురమని అంతకుముందే ప్రకాశం పంతులుగారికి రామకృష్ణారావుగారు తెలిపినట్లు వారి సన్నిహితవర్గాల వలన తెలిసినది. తరువాత కమీషను పర్యటన ఆంధ్రరాష్ట్రములో జరిగినది. ఆంధ్రరాష్ట్రములో అన్ని రాజకీయపక్షాలవారు, అన్నివర్గాలవారు విశాలాంధ్రను ఆమోదించిరి. జాతీయ సమరములో ఆరితేరిన వృద్ధమూర్తి, త్యాగమూర్తి అయిన ప్రకాశం పంతులుగారి నాయకత్వాన ఆంధ్ర మంత్రివర్గము విశాలాంధ్రము కావలెనని ఉద్ఘాటించినది. ఆనాడు మంత్రివర్గములో సభ్యులుగా నుండిన తెన్నేటి విశ్వనాధంగారు విశాలాంధ్రము కొరకు ప్రశంసనీయమైన కృషి కావించిరి. మొదటినుండియు సంజీవరెడ్డిగారు విశాలాంధ్రకు పెట్టని కోటగా నుండిరి. సంజీవరెడ్డిగారి పట్టుదల, కార్యదక్షత విశాలాంధ్ర సాధనకు మిక్కిలి ఉపకరించినది. పదవ సెప్టెంబరు 1954నాడు మద్రాసులో పత్రికా ప్రతినిధులతో మాడ్లాడుచు, ఐక్య కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రములు ఏర్పడినచో విశాలాంధ్ర కూడ ఏర్పడి తీరవలెనని బూర్గుల రామకృష్ణారావు గారు ప్రకటించిరి. ఇది ఇంతవరకు స్పష్టముగా బహిర్గతము కాని వారి మనోగతాభిప్రాయము యొక స్పష్ట ప్రతిబింబముగా ప్రకాశితమైనది. కాని రామకృష్ణారావుగారు నిజామాబాదు కాంగ్రెసు సమావేశమున తీర్మానమును ప్రతిపాదించుటలోనే వారి విశాలాంధ్రము ఆమోదము ప్రకటితమైనది. అంతేకాదు, పోలీసు చర్యకు పూర్వము ముషీరాబాదులో స్వామీ రామానంద అధ్యక్షతన జరిగిన సమావేశములో బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన తీర్మానమును ప్రతిపాదించుచు "హైద్రాబాదు కృత్రిమముగా యేర్పడిన రాష్ట్రము" అని రామకృష్ణారావుగారు ఉద్ఘాటించి యుండిరి. ఈ ఉద్ఘాటనకూడ హైదరాబాదు విభజనకు, విశాలాంధ్రకు వారి ఆమోదమును వెల్లడించుచున్నది. కమీషనువారు హైదరాబాదు రాష్ట్రములో పర్యటన చేసి వెళ్ళిన పిదప కాంగ్రెసులో రెండు భిన్న వర్గాలు ప్రస్ఫుటముగ బయలుదేరినవి. ప్రదేశ్‌ కాంగ్రెసు ప్రత్యేక తెలంగాణా వర్గమువారి అధీనమైనది. కొంతమంది తలవని తలంపుగా అంతకు ముందు విశాలాంధ్ర వాదులు అయినప్పటికిని తరువాత తెలంగాణా వాదులైరి. 1954వ సంవత్సరము ఈ విధముగ గడచినది. విశాలాంధ్రోద్యమము మరింత బలపడినది. విశాలాంధ్ర మహాసభ పక్షాన ఒక సుహృద్భావ రాయబార వర్గము ఏడవ ఆగస్టు 1954 నాడు హైదరాబాదు నుంచి హైదరాబాదు మేయర్‌ నాయకత్వమున బయలుదేరినది. కర్నూలు, గుంటూరు, విజయవాడలలో పర్యటించి వచ్చినది. ఈ రాయబార వర్గములో విశాలాంధ్రోద్యమ ప్రముఖ కార్యకర్తలు వెళ్ళిరి. వీరికి పై మూడు పట్టణములలో ఘనమైన స్వాగత మీయబడినది. వీరికి ఈయబడిన స్వాగతములో అన్ని రాజకీయ పక్షాలవారు పాల్గొనుట గమనించ దగిన విషయము. ఈ సంవత్సరము (1954) హైద్రాబాదుకు అప్పటి ఆంధ్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి తెన్నేటి విశ్వనాధముగారు నాలుగైదు మారులు విచ్చేసి, ఇక్కడి కార్యకర్తలను కలుసుకొని, వారిని ప్రోత్సహించి, సుహృద్భావ వాతవరణము ఏర్పడుటకు చక్కని కృషి గావించిరి. 1955వ సంవత్సర ప్రారంభంలో అప్పటి ప్రదేశ్‌ కాంగ్రెసు అధ్యక్షులు బెజవాడ గోపాలరెడ్డిగారు కళావెంకటరావు గారితో కలిసి హైద్రాబాదు విచ్చేసి, విశాలాంధ్ర మహాసభలోను, కాంగ్రెసు కార్యాలయమైన గాంధీ భవనములోను ప్రసంగించి విశాలాంధ్రోద్యమమును ప్రోత్సహించిరి. తరువాత ఆంధ్రలో ఎన్నికలు జరిగినవి. ఇక్కడివారు అక్కడికి వెళ్ళి ఎన్నికలలో పనిచేసి పరస్పర స్నేహసంబంధాలను కల్పించుకొనిరి. ఆ పైన ఆంధ్ర రాష్ట్రములో కొత్త మంత్రివర్గము ఏర్పడినది. ముఖ్యమంత్రి గోపాలరెడ్డిగారు 1955 ఏప్రిల్‌ నెలలో తిరిగి హైద్రాబాదు వచ్చి విశాలాంధ్ర మహాసభలో ప్రసంగించి విశాలాంధ్రోద్యమమును ప్రోత్సహించిరి.

గోపాలరెడ్డిగారి జోస్యము

జూన్‌ 1955లో ఫజులెఅలీ కమీషను నివేదిక ప్రకటింపబడవలసి యుండెను. కాని మూడు నెలలు ఆలస్యముగ ఈ నివేదిక వెలువడినది. నివేదిక వెలువడుటకు కొన్ని వారాల ముందుగా ఢిల్లీనుండి కర్నూలు వెళ్ళుచు మార్గమధ్యమున హైద్రాబాదులో ఆగిన బెజవాడ గోపాలరెడ్డిగారు నిజాం కళాశాల తెలుగు సమితికి ప్రారంభోత్సవము కావించుచు హైద్రాబాదు విభజన కాగలదనియు, విశాలాంధ్ర సమస్యను తెలంగాణా శాసన సభ్యుల నిర్ణయానికి వదలివేయవచ్చుననియు రాజకీయ జోస్యము చెప్పిరి. ఇది రాజకీయ వర్గాలలో కొంత కలవరము కలిగించినది. మొత్తము మీద హైద్రాబాదు విభజన తప్పక జరిగి తీరగలదను సత్యము స్థిరపడినది.

విచిత్రమైన తీర్పు

తుదకు చాలాకాలమునుండి ఎదురుచూచిన కమీషను నివేదిక 1955 అక్టోబరు పదవతేదీనాడు ప్రకటితమయినది. కమీషను నివేదికలో తెలుగు ప్రజలు విశాలాంధ్రము కాంక్షించుచున్నారనియు, విశాలాంధ్రము వారి గమ్యస్థానమనియు, ఆ గమ్యస్థానమును చేరుటకు ఎటువంటి ప్రతిబంధకాలు కల్పించరాదనియు స్పష్టీకరించనైనది. కోర్టులో వాదము విన్న తరువాత న్యయమూర్తులు తుదినిర్ణయము ప్రకటించు సందర్భమున నిర్ణయించుటకు చెప్పిన తీర్పులోని అభిప్రాయములన్నియు ఒక తీరుగను, తుట్టతుదకు డిక్రీమాత్రము మరొకవిధముగను ఇచ్చినట్లుగా వాదమంతయు విశాలాంధ్రకు అనుకూలముగ చెప్పి, అయిదేండ్లవరకు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు చేయవలెనని, ఆ తరువాత అనగా 1961వ సంవత్సరమున ఎన్నికయిన శాసన సభలో మూడింట రెండు వంతుల సభ్యుల ఆమోదముతో విశాలాంధ్రము ఏర్పడవలెనని కమీషను వారు డిక్రీ యిచ్చిరి. కమీషను నివేదిక ప్రకటన అయిన తరువాత వ్యక్తులు, రాజకీయ పక్షాలు తమతమ అభిప్రాయాలను ప్రకటించుట జరిగినది. ప్రత్యేక తెలంగాణా వర్గాలు హర్షించుటయు, విశాలాంధ్రవర్గాలు ఆశా భంగము వెల్లడించుటయు జరిగినది. పుల్లారెడ్డి, దేవులపల్లి రామానుజరావు మొదలైన విశాలాంధ్ర వాదులు అసంతృప్తిని ప్రకటించి, తక్షణ విశాలాంధ్రస్థాపన కావలెనని ఉద్ఘాటించిరి. విశాలాంధ్ర కావలెనని మాత్రము తక్షణమే నిర్ణయించి ఆరేండ్ల తరువాత ఆ నిర్ణయము అమలు జరుపవచ్చునని శ్రీ ఎం. ఎస్‌. రాజలింగంగారొక సూచన కావించిరి. (14 అక్టోబరు 1955 నాటి గోలకొండ పత్రిక చూడుడు.) ఆరేండ్ల వ్యవధిని నిర్ణయించుటకు బదులుగా తెలంగాణా శాసనసభ్యులు యెపుడు ఇష్టపడిన అపుడే విశాలాంధ్ర యేర్పాటు చేయుటకు వీలుకలిగించవలెనని మాత్రము వల్లూరి బసవరాజుగారింకొక సూచన గావించిరి. (12 అక్టోబరు 1955 నాటి ఆంధ్ర జనత చూడుడు.) హైదరాబాదు విభజనకు వ్యతిరేకులయినవారు రాష్ట్ర విభజన తప్పనిసరి అయినప్పడు ప్రత్యేక తెలంగాణముకన్న విశాలాంధ్రమే వాంఛనీయమని వ్యాఖ్యానించిరి. ఈ విధముగ విశాలాంధ్రము బలపరచువారి సంఖ్య హెచ్చినది. ఇట్లు బలపరచిన వారిలో మందుముల నర్సింగరావు, పండిత వినాయకరావు, పండిత నరేంద్రజీ, గోపాలరావు ఎక్బోటె, నవాబ్‌ మెహిదీనవాజ్‌ జంగు మొదలయినవారు కలరు. అన్నిటి కన్న విచిత్రమైన సంఘటన యేమనగా, విశాలాంధ్రోద్యమానికి మొదటినుండి పట్టుగొమ్మయై ఆంధ్రోద్యమ రథసారథియై, ఆంధ్రపితామహ బిరుదాంకితులై, హైద్రాబాదులో ఆంధ్రత్వమునకు పర్యాయపదముగ ప్రసిద్ధిగాంచిన పద్మభూషణ మాడపాటి హనుమంతరావు పంతులుగారు అయిదేండ్లవరకు తెలంగాణము ప్రత్యేకముగ నుండుట తమకు సమ్మతమేయని ప్రకటించిరి. ఈ విధముగ పంతులుగారు చూపిన నూతన మార్గమును ఇంతవరకు విశాలాంధ్రవాదులుగ నుండిన మరికొందరు అనుగమించిరి. తత్ఫలితముగా హైద్రాబాదు మ్యునిసిపల్‌ కార్పొరేషనులో విశాలాంధ్ర అనుకూలుర సంఖ్య తగ్గినది.

ప్రస్ఫుటమైన రెండు వర్గాలు

విశాలాంధ్ర, తెలంగాణా అను రెండు వర్గాలు హైద్రాబాదు రాజకీయ రంగమున ప్రస్ఫుటముగ బయలుదేరి పని చేయసాగినవి. కాంగ్రెసు, ప్రజా సోషలిస్టు పార్టీలో యిట్టి రెండు భిన్న వర్గాలు ముందుకు వచ్చినవి. కమ్యూనిస్టు పార్టీలో ఇట్టి విభేదాలు రాలేదు. వారందరు ఒకే గొంతుతో మాట్లాడిరి. భారత ప్రభుత్వము ఈ విషయమై తుది నిర్ణయము చేయవలసినదై యుండెను. అందుచేత విశాలాంధ్ర, తెలంగాణ ఉభయపక్షాలు తమ తమ అభిప్రాయాల కనుకూలముగ భారత ప్రభుత్వము నిర్ణయము చేయవలసినదని అభ్యర్థనలు, విజ్ఞప్తులు మొదలైన కార్యకలాపాలు ప్రారంభించిరి. విశాలాంధ్రోద్యమము సంఘటితము కాజొచ్చెను. అక్టోబరు నెలలో విశాలాంధ్ర మహాసభ కార్యాలయమున తెలంగాణమందలి విశాలాంధ్రోద్యమ కార్యకర్తలు బొమ్మకంటి సత్యనారాయణరావుగారి అధ్యక్షతన సమావేశమయి విశాలాంధ్ర సాధనకై పనిచేయుటకు నిర్ణయించుకొనిరి. 1955 నవంబరు 3వ తేదీనాడు ఫీల్ఖానాలో గల వైశ్యభవనములో విశాలాంధ్రోద్యమ కార్యకర్తలు మీర్‌ అహమ్మదలీఖాన్‌గారి అధ్యక్షతన సమావేశమయి వెంటనే విశాలాంధ్ర కావలెనని తీర్మానించిరి. ఇందుకొరకై ఢిల్లీకి వెళ్ళి అక్కడి పెద్దలను కలుసుకొని తక్షణ విశాలాంధ్ర నిర్మాణావశ్యకతను తెలియచెప్పుటకు ఒక రాయబారవర్గము నియమింపబడినది. ఈ రాయబారవర్గములో మీర్‌అహమ్మదలీఖాన్‌, బొమ్మకంటి సత్యనారాయణరావు, పాగ పుల్లారెడ్డి, కొత్తూరి సీతయ్య, బి. వి. గురుమూర్తి, వి. బి. రాజు మొదలైనవారుండిరి. వీరు నవంబరు మొదటివారంలో ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక వారము రోజులుండి భారత ప్రధాని జవహర్లాలు నెహ్రూ, ఉప రాష్ట్రపతి డాక్టరు రాధాకృష్ణ, దేశీయ హోమ్‌ వ్యవహారాల మంత్రి గోవింద వల్లభపంత్‌, కాంగ్రెసు అధ్యక్షులు ధేబరు మొదలైన పెద్దలను సందర్శించి తక్షణమే విశాలాంధ్రను యేర్పర్చవలసిన ఆవశ్యకతను వెల్లడించిరి. తెలంగాణా కమ్యూనిస్టుల పక్షానకూడ రావి నారాయణరెడ్డిగారి నాయకత్వాన ఒక రాయబారవర్గము ఢిల్లీలోని పెద్దల సందర్శించి వెంటనే విశాలాంధ్ర ఏర్పడవలెనని వివరించిరి. ఆంధ్ర కమ్యూనిస్టు నాయకులైన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు గారలు ఢిల్లీకి వెళ్ళి తక్షణ విశాలాంధ్రకు అనుకూలముగ పనిచేసిరి.

రెండు ముఖ్య సంఘటనలు

నవంబరు నెలలో అఖిల భారత కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ సమావేశము జరిగినది. ఈ సమావేశమునకు ముందు జరిగిన రెండు ముఖ్య సంఘటనలను వివరించవలసి యున్నది. మొదటిది, 1955 అక్టోబరు 22వ తేదీన క్రొత్తఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశము. ఈ సమావేశానికి బయలుదేరి వెళ్ళుటకు ముందు హైద్రాబాదు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుగారిని ఉభయపక్షాలు కలుసుకొని తమ తమ అభిప్రాయాలను కేంద్రప్రభుత్వానికి తెలుపవలసినదని కోరిరి. విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు మహాసభ పక్షాన విజయదశమి 17 అక్టోబరు 1955నాడు రామకృష్ణారావుగారిని కలుసుకొని తమ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వమునకు తెలుపవలసినదని కోరిరి. అందరి అభిప్రాయాలను, స్థానిక పరిస్థితులను కేంద్ర ప్రభుత్వమునకు తెలియ చేయగలనని రామకృష్ణారావుగారు తెలిపియుండిరి. ముఖ్యమంత్రుల సమావేశమున పాల్గొని హైద్రాబాదుకు తిరిగివచ్చిన పిమ్మట కొద్దిరోజులకే రామకృష్ణారావుగారు సుదీర్ఘమైన ప్రకటన గావించుచు, వెంటనే విశాలాంధ్ర ఏర్పడవలెనని 28 అక్టోబరునాడు ప్రకటించిరి. అయిదేండ్లవరకు తెలంగాణాను ప్రత్యేకముగా నుంచినచో యిందువల్ల పెక్కు చిక్కులు ఉత్పన్నము కాగలవని, ఈ అయిదు సంవత్సరాలలో విశాలాంధ్ర, తెలంగాణ జగడము ప్రతినిత్యము జరుగుచునే యుండగలదని, ఇది యెన్నికల సమస్యకూడా కాగల అవకాశము కలదనియు, అందుచే తక్షణ విశాలాంధ్ర నిర్మాణము శ్రేయస్కరమనియు రామకృష్ణారావుగారు తెలిపిరి. వెంటనే విశాలాంధ్ర ఎందుకు రావలెనో ఈ ప్రకటనలో చక్కగా వివరించబడినది. ఈ ప్రకటనయొక్క తెలుగుభాషాంతరీకరణము విశాలాంధ్ర మహాసభ అచ్చువేసినది. ఈ ప్రకటన విశాలాంధ్రోద్యమానికి బలమైన ఊతయైనది. ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశము తరువాత కర్నూలు తిరిగి వెళ్ళుచు హైద్రాబాదులో కొన్ని గంటలు ఆగి, ఆనాడు విశాలాంధ్ర మహాసభ పక్షాన వారిని కలుసుకొనిన విశాలాంధ్ర కార్యకర్తలతో బెజవాడ గోపాలరెడ్డిగారు ప్రసంగించుచు, ముఖ్యమంత్రుల సమావేశములో ఆంధ్ర, హైదరాబాదు ముఖ్యమంత్రులు ఉభయులు తక్షణము విశాలాంధ్ర నిర్మాణమును కోరిరనియు, రామకృష్ణారావుగారు తమ ప్రసంగమున విశాలాంధ్ర వాదమును అతి సమర్థతతో కావించిరనియు తెలిపిరి. రెండవ సంఘటన నవంబరు మొదటి వారములో ఢిల్లీలో జరిగిన ప్రదేశ్‌ కాంగ్రెసు అధ్యక్షుల సమావేశము. ఈ సమావేశానికి ముందు 1955 అక్టోబరు 31వ తేదీన తెలంగాణా కాంగ్రెసు డెలిగేట్ల సమావేశము ఏర్పాటు చేయబడెను. ఈ సమావేశములో అధిక సంఖ్యాక డెలిగేట్లు (1-11-55 నాడు ఏబదిమంది డెలిగేట్లు) కమీషను వారి నిర్ణయమును, అనగా అయిదేండ్ల తెలంగాణాను బలపర్చిరి. అల్పసంఖ్యాక డెలిగేట్లు (17 మంది) విశాలాంధ్రను బలపరిచిరి. వీరిలో రామకృష్ణారావుగారొకరు. ప్రదేశ్‌ కాంగ్రెసు అధ్యక్షుల సమావేశములో పాల్గొనిన హైద్రాబాదు ప్రదేశ్‌ కాంగ్రెసు అధ్యక్షులు జె. వి. నర్సింగరావుగారు శాశ్వత ప్రత్యేక తెలంగాణా కావలెనని కోరిరి. నర్సింగరావుగారు ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత శాశ్వతముగ ప్రత్యేక తెలంగాణము ఏర్పడుట తమ అభిప్రాయమని ప్రకటించిరి. చెన్నారెడ్డిగారు కూడ ఇట్టి ప్రకటననే కావించినారు. రంగారెడ్డిగారు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వము వహించిరి. ఈ విధముగ తెలంగాణా రాష్ట్ర ఉద్యమము విజృంభించుట జరిగినది. ఇట్టి పరిస్థితిలో క్రొత్తఢిల్లీలో అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశము జరిగినది. 1955 నవంబరు 9వ తేదీన వర్కింగ్‌ కమిటీ విశాలాంధ్ర ఏర్పడుట ఉచితమని తెలంగాణా ప్రజలకు సలహానిచ్చినది. ఈ సందర్భమున అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ, అఖిల భారత ప్రజా సోషలిస్టు పార్టీ వెంటనే విశాలాంధ్ర ఏర్పడవలెనని తీర్మానించిన సత్యము గమనించదగినది.

సంప్రదింపులు

1955 నవంబరు మొదటి వారములో ఆంధ్ర ముఖ్యమంత్రి గోపాలరెడ్డిగారు, డిప్యూటీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిగారు, ప్లానింగ్‌ మంత్రి కళా వెంకటరావుగారు, సహకారమంత్రి సంజీవయ్యగారు, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెసు అధ్యక్షులు అల్లూరి సత్యనారాయణరాజుగారు హైదరాబాదుకు వచ్చి ఉభయపక్షాల వారితో సంప్రదింపులు జరిపిరి. ఆనాడు పగలు మూడు గంటలకు గాంధి భవనంలో పైన పేర్కొన్న ఆంధ్రనాయకులతో హైదరాబాదు కాంగ్రెసు నాయకులు బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి, చెన్నారెడ్డి, జె. వి. నరసింగరావు గారల సమావేశము జరిగి, దీర్ఘ చర్చల తరువాత నవంబరు 23వ తేదీ 1955 నాడు కర్నూలులో తిరిగి సమావేశమగుటకు నిర్ణయించబడినది. ఈ సమావేశములో రామకృష్ణారావుగారు విశాలాంధ్రను గట్టిగ బలపరచిరి. తరువాత ప్రత్యేక తెలంగాణా నాయకులు కర్నూలు వెళ్ళుటకు ఇష్టపడలేదు. అందుచేత ఈ సమావేశము జరుగలేదు.

ఉధృత విశాలాంధ్ర ఉద్యమము

ఇది ఇట్లుండగా విశాలాంధ్రోద్యమము క్రమక్రమముగా బలపడ సాగినది. విశాలాంధ్ర మహాసభ పుస్తకాలను, కరపత్రాలను ఉర్దు, తెలుగు భాషలలో ప్రకటించి, సమావేశాలను జరిపి, సదస్సులను నిర్వహించి ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా అఖిల భారత కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ సలహా ప్రకారము విశాలాంధ్రోద్యమమును బలపరచసాగినది. జిల్లాలలో సమావేశాలను జరిపి విశాలాంధ్రోద్యమమును బలపరచినవారిలో బొమ్మకంటి సత్యనారాయణరావు, పి. పుల్లారెడ్డి, కొత్తూరి సీతయ్య, మీర్‌ అహమ్మదలీఖాన్‌, వి. బి. రాజు, నరేంద్రజీ, కొండా లక్ష్మణ్‌, ఎఱ్ఱం సత్యనారాయణ మొదలైనవారిని పేర్కొనవలసి యున్నది. జనార్దన్‌ దేశాయ్‌ గారు విశాలాంధ్రోద్యమమునకు తోడ్పడిరి. కమ్యూనిస్టు నాయకులుకూడ జిల్లాలలో అనేక సభలను, సదస్సులను జరిపి విశాలాంధ్రోద్యమమునకు బలము చేకూర్చిరి. కొన్ని చోట్ల అఖిలపక్ష సమావేశాలు కూడ జరిగి విశాలాంధ్రను బలపరచుట జరిగినది. ఈ అఖిలపక్ష సమావేశాలలో చుండి జగన్నాథం, కోదాటి, కొమరగిరి, కాళోజీ గారలు ఉత్సాహముతో పాల్గొని పనిచేసిరి. వావిలాల గోపాలకృష్ణయ్యగారు కొన్ని సమావేశాలలో పాల్గొనిరి. మహిళలు కూడ విశాలాంధ్రోద్యమములో పాల్గొని ముందుకు వచ్చిరి. ఇట్లు పని చేసిన మహిళలలో ఎల్లాప్రగడ సీతాకుమారి, సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి, విజయలక్ష్మి, రాజమణీదేవిగారలను పేర్కొనవలసి యున్నది. రెండు నూర్లకుపైగా విశాలాంధ్ర సదస్సులు తెలంగాణమందు జరిగినవి. గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కాంగ్రెసు సంఘాలు, కార్మిక సంఘాలు విశాలాంధ్రకు తమ అమోదమును కేంద్ర ప్రభుత్వమునకు తెలియచేసినవి. విద్యార్థులలో ఉభయపక్షాలు విజృంభించినవి. తాత్కాలికోద్రేకాల వల్ల అక్కడక్కడ కొద్ది దౌర్జన్యాలు కూడ జరిగినవి. వివిధ వర్గాలవారు విశాలాంధ్రను బలపరచుచు తీర్మానాలు కావించి కేంద్ర ప్రభుత్వమునకు తెలియజేసిరి. 12 నవంబరు 1955 నాడు రెండు ముఖ్యమైన సమావేశాలు జరిగినవి. ఒకటి ప్రతాపగీర్జి కోఠీలో, రెండవది చార్మినార్‌వద్ద.ఈ రెండు సమావేశాలు హైదరాబాదులోని అల్పసంఖ్యాకులైన మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాతి, ముస్లిమ్‌, మర్వాడి ప్రతినిధులచేత, ప్రముఖులచేత ఏర్పాటు చేయబడినవి. ఈ రెండు సమావేశాలలో విశాలాంధ్రను బలపరచుచు చేయబడిన తీర్మానాలు కేంద్ర ప్రభుత్వానికి పంపబడినవి. 1955 నవంబరు 22 వ తేదీనాడు జి. వెంకటాచలం (అడ్వకేటు) గారి అధ్యక్షతన హైదరాబాదు న్యాయవాదులు సమావేశము విశాలాంధ్రమే తమ అభిమతమని ప్రకటించిరి. 24 నవంబరు 1955 నాడు చార్మినార్‌ వద్ద రావి నారాయణరెడ్డిగారు అధ్యక్షులుగా, కాళోజీ నారాయణరావుగారు ప్రారంభకులుగ జరిగిన తెలంగాణా ప్రతినిధుల సమావేశములో జిల్లాల నుండి అయిదు నూర్లకు పైగా ప్రతినిధులు పాల్గొని వెంటనే విశాలాంధ్ర కావలెనని ప్రకటించిరి. ఇవిగాక వర్తక, వృత్తి సంఘాలు మొదలైనవి విశాలాంధ్రను బలపరచి, కొన్ని వందల టెలిగ్రాములు కేంద్ర ప్రభుత్వానికి పంపినవి. ఈ ఉద్యమ నిర్వహణలో విశాలాంధ్ర మహాసభ అతి జాగ్రత్తగా, మిక్కిలి చురుకుగా పని గావించినది. ఈ పరిస్థితులలో 22 నవంబరు 1955 నాడు హైదరాబాదు శాసనసభ సమావేశము జరిగినది. ఈ సమావేశములో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుగారు ఆంధ్ర, తెలంగాణాల ఏకీకరణ కావలెనను తీర్మానమును ప్రతిపాదించిరి. ఈ తీర్మానమును ప్రతిపాదించుచు రామకృష్ణారావుగారు విశాలాంధ్ర ఎందుకు కావలెనో వివరించుచు సమగ్రమైన ఉపన్యాసమును కావించిరి. హైద్రాబాదు శాసనసభలో 175 మంది సభ్యులు. ఇందులో 147 మంది చర్చలలో పాల్గొనిరి. 103గురు తక్షణ విశాలాంధ్రను కోరిరి. 28 మంది మాత్రమే ప్రత్యేక తెలంగాణమును కోరిరి. అసెంబ్లీలో చర్చలు యీవిధముగా జరుగుచుండగా కొండా వేంకట రంగారెడ్డిగారు ఢిల్లీకి వెళ్ళి ఒక ఆదేశమును దెచ్చిరి. ఆ ఆదేశము ఫలితముగ అంతవరకు అనుకొనినట్లుగా శాసనసభలో ఓటింగ్‌ జరుగక, సమావేశము 4 డిసెంబరు 55 నాటికి వాయిదా పడినది. కాని సభ్యుల అభిప్రాయాల వివరాలు మాత్రము కేంద్ర ప్రభుత్వమునకు అందచేయబడెను. శాసనసభలో ముఖ్యమంత్రిగారు 23 నవంబరు 55 నాడు చేసిన ప్రసంగముయొక్క సారాంశము తెలుగులో విశాలాంధ్ర మహాసభచే ప్రకటింప బడినది. ఇదిగాక మరికొన్ని కరపత్రాలు ప్రకటింప బడినవి. రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాదు తిరుపతి విశ్వవిద్యాలయ సెనేటుకు ప్రారంభము జరుపుచు విశాలాంధ్రను ఆశీర్వదించినారు. విజ్ఞాన మూర్తులై, వేదాంతవేత్తలై సకల ప్రపంచమునకు సన్మార్గము చూపగలిగిన మహానుభావుల ఆశీర్వచనములు యీ ఉద్యమానికి లభించినవి. వినోబా భావే విశాలాంధ్రను ఆమోదించిరి. ఆర్థిక శాస్త్రవేత్తలు తెలంగాణము స్వయంపోషకముగాదని, విశాలాంధ్ర ఏర్పడుటయే ప్రజలకు శ్రేయస్కరమైనదని తెలిపిరి. ధేబరు విశాలాంధ్ర ఏర్పడవలెనని సలహా నిచ్చిరి. ఈ పెద్దల ఆశీస్సులను, సలహాలను ఒకచోట క్రోడీకరించి విశాలాంధ్ర మహాసభ పక్షాన ఒక కరపత్రము ప్రకటింప బడినది. విశాలాంధ్ర మహాసభవారు ప్రకటించిన పుస్తకాలు, కరపత్రాలను వేల సంఖ్యలో ప్రజలకు అందజేయుట జరిగినది. "ఆంధ్రజనత", "తెలుగుదేశం", "డెయిలీ న్యూస్‌" (ఇంగ్లీషు), "సియాసత్‌", "పయామ్‌" (ఉర్దూ), "విశాలాంధ్ర", "ఆంధ్రప్రభ", "ఆంధ్రపత్రిక", "విజయవాణి" మొదలైన పత్రికలు విశాలాంధ్రను బలపరచినవి.

తీవ్ర పరిస్థితులు

తెలంగాణములో పరిస్థితులు యీ నాలుగయిదు నెలలు తీవ్రముగా నుండెను. నవంబరు, డిసెంబరు, జనవరి నెలలలో యీ తీవ్రత మరీ ఎక్కువగా నుండెను. డిసెంబరు నెల రెండవ వారము నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయుటకు వెళ్ళుచు ప్రధాని నెహ్రూగారు హైద్రాబాదు విచ్చేసి ఒకరోజిచ్చట ఉండిరి. 9వ డిసెంబరు 55 నాడు ఉర్దూహాలుకు ప్రారంభోత్సవము చేయుచు హైదరాబాదులో జవహర్లాలు నెహ్రూగారు మొదటనుండియు తాము హైద్రాబాదు విభజనకు వ్యతిరేకులమనియు, అయినను అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవముగ కోరినందున, ఫజులెఅలీ కమీషనుకూడ సిఫారసు చేసినందున హైద్రాబాదు విభజన్‌ అనివార్య మైనదని తెలిపిరి. తమ వ్యక్తిగత అభిప్రాయమేమైనప్పటికిని హైద్రాబాదు విభజన నిర్ణయానికి తాము బద్ధులమై యున్నట్లు ప్రధాని నెహ్రూ తెలిపిరి. ఆనాడు సాయంకాలమున షామంజిల్‌లో జరిగిన కాంగ్రెసు కార్యకర్తల సమావేశములో ముచ్చటించుచు ఆరేండ్లవరకు తెలంగాణమును వేరుగానుంచుట సరికాదనియు, ఈ ఆరేండ్ల జగడము పెట్టుకొనక ఇప్పుడే ఏదో ఒక తుది నిర్ణయము చేయవలెననియు వర్కింగ్‌ కమిటీ తనకు సలహా నిచ్చినదనియు స్పష్టీకరించిరి. మరుసటిరోజు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన గావించుచు, కృష్ణానదీ జలాలు ఉభయ ప్రాంతాల తెలుగు ప్రజలకు అవిభాజ్యమైన ప్రేమబంధముగా నున్నవని తెలిపిరి. తెల్లవారి గుంటూరులోని రాజకీయ మహాసభలో మాట్లాడుచు ఆంధ్ర ప్రజల నుద్దేశించి "మీరందరు విశాలాంధ్రను కోరుచున్నారని నాకు తెలుసును. ఈ కోరిక సంభావ్యము" అని తెలిపిరి. ఈ ఉపన్యాసములన్నియును ప్రధాని నెహ్రూ విశాలాంధ్రకు వ్యతిరేకులు కారని స్పష్టము చేయుచున్నవి. గుంటూరు రాజకీయ మహాసభలకు ఆంధ్రరాష్ట్ర డిప్యుటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డిగారు అధ్యక్షత వహించిరి. ఈ మహాసభలో తక్షణమే విశాలాంధ్రను ఏర్పరచవలెనను తీర్మానము ఏకగ్రీవముగ అంగీకరించుట జరిగినది. ఈ తీర్మానమును గుంటూరుకు వెళ్ళి బలపరచిన హైద్రాబాదు కార్యకర్తలలో విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి పుల్లారెడ్డిగారు కలరు. సుప్రసిద్ధ ఆంధ్ర నాయకులు, భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షులుగా పనిచేసిన మేధావులు, మధ్యప్రదేశ్‌ గవర్నరు డాక్టరు భోగరాజు సీతారామయ్యగారు 1955 డిసెంబరు నెలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ స్నాతకోపన్యాసము నిచ్చుటకు హైద్రాబాదుకు వచ్చిరి. ఆ సందర్భమున వారికి స్వాగతమిచ్చుటకై ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యాలయ ఆవరణలో ఒక గొప్ప సభ, పరిషత్తు పక్షాన జరిగినవి. ఆ సభలో ప్రసంగించుచు డాక్టరు భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులుగారు "అతిత్వరలో మీరు, మేము అను భేదము పోయి జనవరి రెండవవారములోగా మనము 'మనము' కాగల" మని సెలవిచ్చిరి. ప్రప్రథమమున తప్పక విశాలాంధ్ర ఏర్పడగలదను అసందిగ్ధమైన ప్రకటనగా ఇది భావించబడినది.

వాదోపవాదాలు - ఢిల్లీ యాత్రలు

జనవరి, ఫిబ్రవరి రెండు నెలలలో విశాలాంధ్ర, తెలంగాణా వాదోపవాదాలు తీవ్రముగా చెలరేగినవి. ఢిల్లీ యాత్రలు అధిక సంఖ్యలో జరిగినవి. టెలిగ్రాములు అసంఖ్యాకముగ వెళ్ళినవి. ఫలాన తేదీన ఢిల్లీ నిర్ణయ ప్రకటన జరుగ గలదని పలుమారులు ఆశింపబడినది. పలుమారులు ఆశాభంగము చెందుటకూడ జరిగినది. ఉభయపక్షాలవారు ఢిల్లీవర్గాలు తమకే అనుకూలముగ నున్నవని పుంఖానుపుంఖముగ ప్రకటనలు కావించుట జరిగినది. ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడి చాల చీకాకు కల్గించినది. జిల్లాలలో, గ్రామాలలో విశాలాంధ్ర సదస్సులు జరుగుచునే యుండెను. తీర్మానాలపై తీర్మానాలు ఢిల్లీకి పంపబడుతునే యుండెను. ప్రజాభిప్రాయము విశాలాంధ్రకు అనుకూలముగా లేదని, ఢిల్లీలోని ఒకరిద్దరు పెద్దలకు, ప్రత్యేకముగ మౌలానా ఆజాద్‌ గారికి కొన్ని అపోహలు కలవని భావించబడినది. 1956 జనవరి మూడవ వారములో ఈ అపోహలను తొలగించు ఉద్దేశ్యముతో గౌలీగూడెములోని వివేకవర్ధనీ మైదానమున ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుపబడినది. ఈ సభలో కొన్ని వేలమంది ప్రజలు పాల్గొనిరి. సభ దిగ్విజయముగ జరిగినది. సభలో పండిత వినాయకరావు, శ్రీనివాసరావు ఎఖిలేకర్‌, దేవులపల్లి రామానుజరావు, గురుమూర్తి, కొండా లక్ష్మణ్‌, కొత్తూరి సీతయ్య, పి. పుల్లారెడ్డి, పండిత నరేంద్రజీ, యమ్‌. యస్‌. రాజలింగం, అహమ్మదలీఖాన్‌ మొదలైనవారు విశాలాంధ్రను బలపరచుచు ప్రసంగించిరి. ఇదేరోజు విశాలాంధ్రను బలపరచుచు కమ్యూనిస్టు నాయకులు హైద్రాబాదు నగరవీధులలో ఒక పెద్ద ఊరేగింపు తీసిరి. ఊరేగింపులో రెండువేలకు పైగా ప్రజలు పాల్గొనిరి. ఊరేగింపు రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, రాజ బహద్దుర్‌ గౌడు, మక్దుం మొహియొద్దీన్‌, వి. డి. దేశపాండే ప్రభృతుల నాయకత్వమున నగరమందంతటను తిరిగి విశాలాంధ్ర వెంటనే ఏర్పడవలెనని నినాదాలు కావించినది. ఈ సభ, ఊరేగింపువలన హైద్రాబాదు నగరము విశాలాంధ్రకు అనుకూలమని ఋజువైనది.

పార్లమెంటులో

1956 జనవరిలో పార్లమెంటు సమావేశము జరిగినది. ఈ పార్లమెంటు సమావేశములో రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్య చర్చకు వచ్చినది. పార్లమెంటు చర్చలను సమగ్రముగ పరిశీలించినప్పుడు అధిక సంఖ్యాకుల అభిప్రాయము విశాలాంధ్రకే అనుకూలముగనుండినట్లు స్పష్టమైనది. ఆచార్య గోగినేని రంగనాయకులుగారి ఉపన్యాసము కొంత ఆశ్చర్యమును కల్గించినది. వారు కొంతకాలము తెలంగాణము విడిగా నుండవచ్చునని రాజ్యసభలో తెలిపియుండిరి. ఆ రోజులలో ఆంధ్రరాష్ట్రమున విశాలాంధ్రము కావలెనను పట్టుదల లేదని ఢిల్లీలోని ఒకరిద్దరు పెద్దలు తలంచినట్లు భావింపబడినది. ఈ వార్త తెలిసినంతనే ఆంధ్ర రాష్ట్రములోని అన్ని రాజకీయపక్షాలు వేల సంఖ్యలో విశాలాంధ్రను బలపరచుచు ఢిల్లీ పెద్దలకు టెలిగ్రాములు పంపిరి. జనవరి తుది వారములో యస్‌. కె. పాటిల్‌ గారు హైద్రాబాదుకు వచ్చి రెండు రోజులు రిట్జు హోటలులో మకాము చేసి మూడు నాలుగు ప్రకటనలు కావించిరి. ఈ ప్రకటనలు పరస్పర విరుద్ధముగా నుండి హైద్రాబాదు, ఆంధ్ర రాజకీయ వర్గాలలో తీవ్ర అసంతృప్తిని కలిగించినవి. ఆంధ్ర, తెలంగాణాలలోని అన్ని వర్గాలవారి ఆమోదముతో విశాలాంధ్ర ఏర్పడవలెనని వారొక ప్రకటనలో తెలిపిరి. దానిపై వ్యాఖ్యానించుచు డాక్టరు చెన్నారెడ్డిగారు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రముకన్న తక్కువ యేమియు తమకు సమ్మతము కాదని తెలిపిరి.

ప్రతిష్ఠంభన

1956 జనవరి నెలలో బొంబాయిపై అఖిల భారత్‌ కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీవారి నిర్ణయ ప్రకటన జరిగినది. మహారాష్ట్ర, గుజరాత్‌, బొంబాయి అను మూడు రాష్ట్రాల ఏర్పాటు జరుగవలెనని వర్కింగ్‌ కమిటీవారు నిర్ణయించిరి. ఈ నిర్ణయము ప్రకారము బొంబాయి నగరము గుజరాతులో గాని, మహారాష్ట్రలోగాని చేరక ప్రత్యేక రాష్ట్రముగ నుండ గలదు. బొంబాయి తప్ప కదమ మహారాష్ట్ర ప్రాంతాలన్నియు కలసి సంయుక్త మహారాష్ట్రముగా రూపొందగలవు. విదర్భకూడా మహారాష్ట్రలో చేర్చబడినది. ప్రత్యేక విదర్భ రాష్ట్రము ఏర్పడవలెనని వాదించిన బ్రిజలాల్‌ బియాని ప్రభృతులు వర్కింగ్‌ కమిటీ నిర్ణయమును సమ్మతించి బలపరచిరి. విదర్భను ప్రత్యేకముగ నుంచుటకు వీలులేదని, దానిని మహారాష్ట్రలో చేర్చవలెనని వర్కింగ్‌ కమిటీ నిర్ణయించిన తరువాత ప్రత్యేక తెలంగాణా రాష్ట్రమునకు ఇక అవకాశము లేదనియు ఇక విశాలాంధ్రమే ఏర్పడగలదనియు గాఢ విశ్వాసము రాజకీయ వర్గాలలో కలిగినది. బొంబాయిపై వర్కింగ్‌ కమిటీ చేసిన నిర్ణయముపై ఆ నగరమున శాంతిభంగమై ఘోర దౌర్జన్యాలు జరిగినవి. ఈ దౌర్జన్యాలు దేశమున సంచలనము కలుగచేసినవి. ఒరిస్సా, బీహారు రాష్ట్రాలలో కూడా దౌర్జన్యకాండ జరిగినది. ఈ సంఘటనలపై ఆలోచించుటకు, ఇతర సమస్యలను గూర్చి నిర్ణయించుటకు ముఖ్యమంత్రుల సమావేశము, కాంగ్రెసు అగ్రనాయకుల సమావేశము జరిగినది. సరిహద్దులు మొదలైన సమస్యలపై సంఘర్షణలు జరిగి దౌర్జన్యమునకు దారితీయుట కాంగ్రెసు అగ్ర నాయకులకు ఆవేదన కలిగించినది. అపుడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు సమంజసము కాదనియు, పెద్దరాష్ట్రాలు ఏర్పడుట అవసరమనియు, అంతేకాక ద్విభాషా రాష్ట్రాలు, బహుభాషారాష్ట్రాలు ఏర్పడుట సమంజస మనియు కాంగ్రెసు అగ్రనాయకులకు ఒక ఆలోచన కలిగినది. ఢిల్లీలో జనవరి తుది వారమున ముఖ్యమంత్రుల సమావేశ సందర్భమున కలుసుకొన్న బెంగాలు, బీహారు ముఖ్యమంత్రులైన బి. సి. రాయ్‌, శ్రీకృష్ణసిన్హాగారలు బెంగాలు, బీహారు లీనమగుటకు ఒప్పుకొనిరి. వర్కింగ్‌ కమిటీ దీనిని హర్షించిరి. దీనిపైన దేశములో భాషా రాష్ట్రాల ఏర్పాటు వెనుకపడునేమో అను అనుమానము కలిగినది. బెంగాలు, బీహారు రాష్ట్రాల విలీనీకరణ ఉభయ రాష్ట్రాలలో తీవ్ర ప్రతిఘటన వచ్చినది. దేశమందంతటను ముఖ్యులైనవారు ద్విభాషా రాష్ట్రాల ఏర్పాటుపై ప్రకటనలు చేయుట ఆరంభించిరి. హైదరాబాదు ముఖ్యమంత్రి డాక్టరు బూర్గుల రామకృష్ణారావుగారు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలు కలిసి ఏక రాష్ట్రముగ ఏర్పడవలెనని సూచించిరి. ఆంధ్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డిగారు ఆంధ్ర, మహారాష్ట్రములను కలిపి ఏకరాష్ట్రముగ ఏర్పడవలెనని సలహా నిచ్చిరి. అయ్యదేవర కాళేశ్వరరావు పంతులుగారు ఒరిస్సాతో ఆంధ్ర ప్రాంతములను కలిపిన బాగుండునేమోయని సెలవిచ్చిరి. చెన్నారెడ్డిగారు ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక ప్రాంతాలను ఏక రాష్ట్రముగ చేసిన బాగుండున్నని వెల్లడించిరి. కొండా వెంకట రంగారెడ్డిగారు ఈ సమస్యపై ఏమియు వెంటనే చెప్పుటకు వీలులేదనియు, జాగ్రత్తగా ఆలోచించవలసి యున్నదనియు ప్రకటించిరి. మొట్టమొదట విశాలాంధ్రము ఏర్పడుట అవసరమనియు, కడమ సంగతులు తరువాత ఆలోచించుకొన వచ్చుననియు అసందిగ్ధముగ సంజీవరెడ్డిగారు ప్రకటించిరి. ద్విభాషారాష్ట్రముల ప్రతిపాదనను విశాలాంధ్ర వాదులు హర్షించలేదు. భాషాసూత్రముపైన రాష్ట్రాలు ఏర్పాటు కావలెనని వీరు అభిప్రాయపడిరి. ఈ విషయమై సుదీర్ఘమైన ప్రకటన కావించుచు దేవులపల్లి రామానుజరావు భాషా రాష్ట్రప్రాతిపదికమీదనే భాషారాష్ట్రాలు ఏర్పడవలెనని ప్రకటించుట జరిగినది. గోలకొండ పత్రిక, ఈ సందర్భమున ఒక చక్కని సంపాదకీయమును వ్రాసినది. ఆ సంపాదకీయములో భాషారాష్ట్ర ప్రాతిపదికను బలపరచి ఏకభాషారాష్ట్రాలు కావలెనని ఉద్ఘాటించుట జరిగినది.

శుభాంతము

జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వములోని ముఖ్యులైనవారు కొందరు హైదరాబాదు నగరమునకు విచ్చేసిరి. రక్షణ శాఖామంత్రి డాక్టరు కైలాసనాధ్‌ కట్టూ, రైల్వేలమంత్రి లాల్‌బహద్దుర్‌ శాస్త్రి, విదేశాంగ వ్యవహారాలశాఖలో మంత్రిగానున్న డాక్టరు సయ్యద్‌ మహమూద్‌ ఇట్లు హైదరాబాదుకు వచ్చినవారిలో ముఖ్యులు. వీరందరినీ విశాలాంధ్ర మహాసభ పక్షాన విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు అహమ్మదలీఖాన్‌, కొత్తూరి సీతయ్య, పుల్లారెడ్డి, దేవులపల్లి రామానుజరావు, ఎఱ్ఱం సత్యనారాయణ, పండిత నరేంద్రజీ, సర్దారుల్లాఖాన్‌, ధరణీధర సంఘి, అబిదలీఖాన్‌ మొదలైనవారు కలుసుకొని, తక్షణ విశాలాంధ్ర స్థాపనావశ్యకతను నిరూపించుట జరిగినది. విశాలాంధ్రోద్యమానికి రామకృష్ణారావుగారు నాయకత్వము వహించిరి. ఫిబ్రవరి రెండవవారములో అఖిల భారత కాంగ్రెసు జాతీయ మహాసభ అమృతసర్‌లో జరిగినది. ఈ సమావేశానికి హైదరబాదులోని ఉభయపక్షాల ప్రతినిధులూ వెళ్ళిరి. కాంగ్రెసు అగ్రనాయకుల నిర్ణయము ప్రకారము దేశములో పెద్ద రాష్ట్రాల నిర్మాణము కావలెనని భావము కాంగ్రెసు వర్గాలలో క్రమక్రమముగా బలపడసాగినది. హైదరాబాదు నాయకులను ఢిల్లీకి పిలిచి పెద్ద రాష్ట్రాల నిర్మాణావశ్యకతను తెలుపుట జరిగినది. రక్షణలతో తెలంగాణమును ఆంధ్ర ప్రాంతములో లీనముచేయుట సమంజసమని నిర్ణయించబడినది. తెలంగాణా వారికి ఉద్యోగాలలోను, విద్యా వైద్యాభివృద్ధి ప్రణాళికలోను తగిన రక్షణలనిచ్చి, ఆ రక్షణలు కాపాడుటకు ఒక ప్రాంతీయ కౌన్సిలును ఏర్పాటు చేయుటకు నిర్ణయము జరిగినది. ఈ వివరాలలో ముఖ్యమైన వానిని పార్లమెంటు చట్టములో పొందుపర్చుట జరిగినది. రక్షణలకు ఎవరు, ఎన్నడును వ్యతిరేకులు కారు. మొదటినుండియు తెలంగాణమునకు తగిన రక్షణలతో విశాలాంధ్రము ఏర్పడవలెనని విశాలాంధ్ర వాదుల అభిప్రాయమై యుండెను. విశాలాంధ్ర మహాసభ పక్షాన ఫజులెఅలీ కమీషను కిచ్చిన నివేదికలో తెలంగాణాకు రక్షణల ఆవశ్యకతను ఉద్ఘాటించుట జరిగినది. కమీషను నివేదిక ప్రకటనకు ముందుగను తరువాతగను చెన్నారెడ్డిగారు మాత్రము రక్షణలకు ఏమంత ప్రాధాన్యము లేదనియు, దాని ఆవశ్యకత అంతగా లేదనియు చెప్పుట జరిగినది. మొత్తముమీద ఈ వ్యవహారము శుభాంతముగ పరిణమించినది. ఆంధ్ర నాయకులు తెలంగాణమునకు "బ్లాంక్‌ చెక్‌" ఇచ్చుటకు సిద్ధముగా నున్నట్లు ప్రకటన గావించిరి. ఇక విశాలాంధ్ర ప్రకటన మాత్రము జరగవలసి యుండెను. ఆ ప్రకటన మార్చి మొదటివారములో నిజామాబాదు పట్టణమున భారత సేవక సమాజ్‌ వార్షికోత్సవాలకు అధ్యక్షత వహించిన భారతదేశము యొక్క ఉదాత్త సంస్కృతికి చిహ్నము, భారత ప్రజలకేకాక సకల ప్రపంచ ప్రజలకు ప్రేమాస్పదుడైన నాయకుడైన జవహర్లాలు నెహ్రూ చేయుట జరిగినది. ఈ ప్రకటనను హైదరాబాదు, ఆంధ్రరాష్ట్రములోని అన్ని వర్గాలు హర్షించి, సంపూర్ణముగ సమర్థించుట జరిగినది. పెద్దలైన కొండా వెంకట రంగారెడ్డిగారు నెహ్రూగారు ప్రకటించిన భారత ప్రభుత్వ నిర్ణయము హైద్రాబాదులోని ప్రజలందరు శిరసావహించవలసినదని ప్రకటించిరి. ఈ విధముగ మూడుకోట్ల తెలుగు ప్రజలమధ్య కృత్రిమముగ నూట ఏబది సంబత్సరాలు ఏర్పడిన అఖాతము తొలగిపోయినది; విశాలాంధ్ర వచ్చినది.

మహోజ్జ్వల ఘట్టము

1946 నుండి 1956 వరకు హైద్రాబాదు రాజకీయ చరిత్రలో మహోజ్జ్వలమైన ఘట్టము. 1946కు ముందు హైద్రాబాదులో ప్రజాస్వామ్య వ్యతిరేకమైన మధ్యకాలపు నిరంకుశ రాజరికము అధికారములో నుండెను. ఈ ప్రభుత్వమును తొలగించి ప్రజాస్వామిక ప్రభుత్వమును స్థాపించుటకు 1946 సంవత్సరమునకు చాలాకాలము ముందునుండియే ప్రజల ఉద్యమాలు బయలుదేరి పనిచేయుచుండెను. 1946 తరువాత కాంగ్రెసు ఉద్యమము బాధ్యతాయుత పరిపాలన ఆదర్శముతో విజృంభించి పనిచేయసాగినది. 1948లో పోలీసుచర్య జరిగినది. తరువాత హైదరాబాదు విభజనోద్యమము బయలుదేరినది. 1952 లో ఎన్నికలు జరిగి, బాధ్యతాయుత ప్రభుత్వము ఏర్పడినది. అప్పుడు విభజనోద్యమము మరింత బలపడినది. విశాలాంధ్ర, సంయుక్త మహారాష్ట్ర, ఐక్య కర్ణాటక ఉద్యమాలు తీవ్రముగ ప్రారంభమయి, 1956 లో విజయవంతముగ ముగిసినవి. ఈ విధముగ 1946 నుండి 1956 వరకు ఒక దశాబ్దమున కొన్ని శతాబ్దములలో జరుగునటువంటి మహోజ్జ్వలమైన చరిత్ర నిర్మాణము జరిగినది. ఆంధ్రదేశ చరిత్రలోనే ఇది అద్వితీయమైన ఘట్టము.

నోటు:- ఆంధ్ర, తెలంగాణాలతో కూడిన రాష్ట్రమునకు ఆంధ్రప్రదేశ్‌ అను పేరు పెట్టవలెనని ఆంధ్ర శాసనసభ, హైద్రాబాదు శాసనసభ (దుర్ముఖి ఉగాదినాడు) నిర్ణయించినవి.

AndhraBharati AMdhra bhArati - vishaalaaMdhroodyamamu - telaMgaaNamu - telaMgANalO jAtIyOdyamAlu - DA\.. dEvulapalli rAmAnujarAvu - telugu vachana sAhityamu - vyAsamulu ( telugu andhra )