వచన సాహిత్యము వ్యాసములు తిక్కన్న తీర్చిన సీతమ్మ
- శ్రీమాన్‌ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

(భారతి జ. ర. సం. 1949)
(సారస్వతాలోకము -
ప్రథమ ముద్రణ: 1954; అష్టమ ముద్రణ: 1978;
త్రివేణి పబ్లిషర్సు, మచిలీపట్టణము.)

ఒక విధంగా చూస్తే తిక్కన్నగారి రచనలలో పాత్రపోషణమనే కావ్యధర్మాన్ని విమర్శించడం న్యాయం కాదనిపించును. ఎందుకంటే; ఆయన రచించిన ఉత్తరరామాయణం, భారతం రెండూ ఎరువు సొత్తులే, అందలి పాత్రలన్నీ వాల్మీకి వ్యాసుల కైవాడపు తీర్పులు; ఒక్కటైనా తిక్కన్న క్రొత్తగా సృష్టి చేయలేదు. వాటిలోని కథాసందర్భాలూ అట్టివే. అందులో ఆదేశాగమలోపాలేమైనా ఉంటే తిక్కన్నకు దొరకిన గ్రంథపాఠ మట్టిదనే మన మూహించుకోవలెను. రామాయణం ఉత్తరకాండలో, ముఖ్యంగా భారతంలో సర్వత్రా పాఠభేదాలకు మితీ మేరా లేదన్నది సుప్రసిద్ధవిషయం.

మఱి ఆ రెండు గ్రంథాల్లో మొదటిది వేదసమ్మితము; వేదములతో సమానము. రెండవది పంచమవేదమే. అసలు వాటిలోని వ్యక్తులూ, విషయాలూ ఇప్పటి చారిత్రదృష్టికి సత్యము లైనా, కవికల్పితాలైనా, మనచేతికి వచ్చే సరికి పరమసత్యములై, ప్రామాణికములై, ఏ ఇతరవ్యక్తి విషయాలకూ లేని స్థిరస్వరూపంతో మన జీవితంతో మేళగింపు చేసుకొని నిలబడినవి.

ఇందుమీద అవన్నీ అమానుషములూ, అతిమానుషములూ ఐన వస్తువులు, పుట్టుచావులు, రూపురేఖలు, మంచిచెడ్డలు మొదలైన అన్నిటియందూ మనుష్యుల కొలదిని చాలా మీరినవి. వట్టి వింతకథలూ, ఉద్రేచకఘట్టాలూ కాక ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాల స్వరూపాలను మనుష్యుల మనస్సులలో చిక్కగా నాటే ఉద్దేశంతోనే సిద్ధమైనవి.

    "ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని - యధ్యాత్మవిదులు వేదాంతమనియు
    నీతివిచక్షణుల్‌ నీతిశాస్త్రంబని - కవివృషభులు మహాకావ్యమనియు
    లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని - యైతిహాసికు లితిహాసమనియు
    పరమపౌరాణికుల్‌ బహుపురాణసముచ్చ - యంబని మహిఁ గొనియాడుచుండ

    వివిధవేదతత్త్వ వేదవ్యాసుఁ
    డాదిముని పరాశరాత్మజుండు
    విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై
    పరగుచుండఁ జేసె భారతంబు" (మహా భా. ౧ - ౩౨)

అని చెప్పిన నన్నపార్యుడు 'నిత్యసత్యవచను' డనడంలో సందేహమక్కర లేదు. 'ఏపట్టునఁ బూజ్యమూర్తియగు భారత సంహిత' అన్న తిక్కన్నమాట పైదాని సారసంగ్రహమే. వాల్మీకి రామాయణంకూడా, భారతమంత సార్వజనీనం కాకపోయినా, ప్రామాణ్య గౌరవాదులలో దానితో సమంగానే తూగునట్టిది. ముఖ్యంగా శ్రీరామానుజమతానుయాయులు దానిని శరణాగతి శాస్త్రంగా, ప్రత్యక్షర ప్రమాణంగా పరిగ్రహించినారు. 'రామాదివ ద్వర్తితవ్యం న రావణాదివత్‌' (శ్రీరాముడు మొదలైనవారి వలె నడువవలెను; రావణాదులవలె కాదు) అనే ధర్మసూత్రాన్ని ప్రచారంజేసేదే ఆ గ్రంథాల పరమోద్దేశం. తరతరాలుగా మనం వాటి నట్లే యథాశక్తిగా ఉపయోగించుకొన్నాము. కనుక స్వతంత్ర మిందులో చెల్లదు.

మరి పాత్రపోషణ మనేది, స్వతంత్రమైన కల్పనకు సంబంధించిన శిల్పధర్మం. దానిని కొలిచిచూపే మానదండము మన అనుభవమే. ఈ పాత్రము ఇట్లు వర్తించుట యుక్తం, ఈ సందర్భమీరీతిగా పరిణమించడం న్యాయం, సహజం, మరొకరీతిగా కాదు - అని నిర్ణయించడానికి మన సాక్షాదనుభవమో, దానిచేత ఏర్పడిన భావనాశక్తియో సాధనం కావలెనుకాని వేరులేదు. కాని అవి రెండూ రామాయణ భారతాలవంటి గ్రంథాల విషయాలను కొలిచి తీర్పుచెప్పడానికి చాల చిన్నతక్కెడలు.

ఐనా మనం మనుష్యులం గనుక, మనకై మనలో వచ్చి చేరిన వస్తువులను మనదృష్టితో చూడక, మన మితిలోపలనే కొలవక ఉండలేము. పండు నోటికి పెద్దదైతే అనుకూలంగా చిన్న చిన్న ముక్కలుగా తరగుకొని తినవలెననేది బుభుక్షువుల కందరికీ సహజమైన అధికారం. ఇట్టి విషయాలలో మన దౌర్బల్యమే మన నడతను సమర్థిస్తుంది. పౌరాణికవిషయాలను స్వానుభవం లోనికి తెచ్చుకొని నెమరువేయడానికి ప్రయత్నించిన పెద్దలూ, చిన్నలూ అందరూ అన్ని కాలాల్లోనూ కొంచెంగానో గొప్పగానో ఈ పనిచేసినవారే.

తిక్కన్న 'ఎత్తఱినైనను ధీరోదాత్త నృపోత్తముడు రామ ధరణీపతి సద్వృత్తము సంభావ్యము' (నిర్వ. ౧-౧౧) అని నమ్మినవాడు. కాని భారతంమీద ఉన్నంత భక్తిప్రతిపత్తు లాయనకు రామాయణమం దుండలేదేమో అని సందేహించే అవకాశముంది. పూర్వరామకథను తెలుగులో ఆయన యేల రచింపక వదలెనో నికరంగా కారణం చెప్పలేము. ఉత్తరకథను రచింపబూనినవాడు తెలుగులో మూలగ్రంథం తూ- చా తప్పకుండా దించితే అనుభవానికి చాలదనీ, అది రచన కానేరదనీ ఆయన తెలుసుకున్నాడు. ముఖ్యవిషయాలు మార్చే అధికారం మనకు లేదు. అవి యెంత అమానుషాలైనా అసంభవాలైనా అట్లే ఉండవలసినవే. మూలగ్రంథం గొప్పతనానికీ, వ్యాప్తికీ అవి ముఖ్యహేతువులు. కాని వాటి గొప్పతనానికి లోపంరాకుండా, వాటి సందులలోని చిన్న చిన్న వంకలను చక్కనొత్తడమూ, బంగలను మెత్తడమూ ఐనా చేయకపోతే మనకు రక్తి - అంటే అనుభవానికి నింపు - ఉండదు. మనకు కానవచ్చిన వంకరలు, బంగలు నిజంగా వంకలేనా, బంగలేనా అన్న ప్రశ్న తెగేది కాదు. ఆర్జవంగా మన మనస్సుకూ అనుభవానికీ అట్లు గోచరిస్తే చాలును; ఈ మెట్టు దాటి తత్వాన్ని అందుకునే భాగ్యం మనకు లేదు. తిక్కన గారి పాత్రపోషణశిల్పం ఈ మితిలో ఈ ఉద్దేశంతో నడిచింది. దీనిలో ఆ మహానుభావుడు చూపిన నయగారపు పనితనం వాల్మీకి వ్యాసుల మూలగ్రంథాలతో పోల్చి చూచినప్పుడు ప్రతిపదమునందూ గోచరిస్తుంది. ఉత్తరరామాయణంలో సీతమ్మ విగ్రహానికి ఆయన చేసిన ప్రతికర్మ మనం గమనిస్తే ఈవిషయం స్పష్టమౌతుంది.

రామాయణాన్ని వాల్మీకి మహర్షియే 'సీతాయాశ్చరితం మహత్‌' అని వర్ణించినాడు. (రా. బా. ౪-౭) ఉత్తర రామాయణంలో సీతమ్మ విషయంగా తిక్కన్న చూపిన పక్షపాత గౌరవాలు గమనిస్తే, వాల్మీకి దీనికి 'సీతాయన' మని యేల పేరు పెట్టలేదని మనస్సులో నొచ్చుకున్నాడేమో అని పిస్తుంది. ఉత్తరరామకథలో నిజమైన పట్టుగొమ్మ సీత. గ్రంథంలో ఇంచుమించు సగానికి మించి రావణాదుల పురాణకథాశ్రవణం ఆక్రమించింది. దానికి తరువాతనే సీతమ్మపాత్ర ప్రవేశం. సీతా రాముల విహారలీలలు; వెంటనే గర్భధారణం; జనాపవాదశ్రుతి; దానిఫలంగా సీత కోర్కి తీర్చేనెపంతో లక్ష్మణునిద్వారా ఆమెను గంగాతీరారణ్యంలో వదలుట; కుశలవుల జననం; రాముని అశ్వమేధయజనము; అక్కడ కుశలవుల రామాయణ గానము; సీతను పిలిపించి మహాసభలో తన చరిత్రనుగూర్చి శపథం చేయించడం; ఆయమ మాతృభూమిగర్భంలో లయించుట; రాముని కోపము; శాంతి; పరమపదప్రాప్తి - ఇవి ఇందలి సుప్రసిద్ధ కథావస్తువులు.

ఇందు రసానుభవదృష్టికి, ధర్మదృష్టికి ప్రధానమైనది సీతాపరిత్యాగ ఘట్టము. రామకథలో ఇంత హృదయద్రావకము, ఉద్వేజకము ఐన సన్నివేశ మింకొకటిలేదు. మరి లోకాపవాదానికి భయపడి నిర్దోషియైన ప్రియపత్నిని త్యాగంచేయడం ధర్మమా, అధర్మమా అనే ప్రశ్న తలంలేని లోతుగలది. మనుష్యజీవితంలోని పెక్కు మహాధర్మసంకటాలకు ఇదొక మచ్చు. ఇదమిత్థమని దీనిని నిర్ణయించే పూనిక వ్యర్థం. ఆ సంకట మేర్పడినప్పుడు సంస్కృత చిత్తుడైన మనిషి తన అంతరాత్మ ఋజుసాక్షికి లోబడి అప్పటి కనుకూలంగా కర్తవ్యం నిర్ణయించి చేయును; లేదా తనకంటె జ్ఞాన వయో వివేక వృద్ధుల నడిగి వారి యుపదేశప్రకారం ఆచరించును. ఏమైనా అది తాత్కాలిక మైన తీర్మానమే; సర్వకాలాన్వయికాదు; కానేరదు. ఏ సంకటమూ లేక గట్టున కూర్చొని చూస్తూ విమర్శించే మనవంటి వారు చేసే నిర్ణయం పుస్తకాలకో, ఉపన్యాస పీఠాలకో మాత్రమే పనికివస్తుం దంతే. ఏకపక్షదృష్టి ఇందులో తప్పదు. ఏకపతివ్రతం స్త్రీలకు పరమధర్మమనీ, పరపురుషస్పర్శమే దోషమనీ, బుద్ధిపూర్వకమైనా, కాకపోయినా వ్యభిచారం ప్రాయశ్చిత్తమే లేని పరమపాపమనీ, అట్టి స్త్రీకి త్యాగమే శిక్షయనీ నమ్మిన రాష్ట్రంలో, ప్రజలను ధర్మం దాటకుండా పాలించే భారంగల ప్రభువు, ఇంచుమించు ఒక సంవత్సరకాలం -

    'స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవ న సంశయః
    గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్య వా' (రా. సుం. స. ౨౦-౫)

(సీతా! పరస్త్రీలను పొందుటగాని, బలవంతంగా హరించుటగాని రాక్షసులకు సర్వధా స్వధర్మము. -- సీతతో రావణుని వాక్యం.)

అని బహిరంగంగా ఘోషించేవా నింటిలో చెర జిక్కి యున్న భార్యను జూచినప్పుడు -

    'ప్రాప్తచారిత్ర సందేహా మమ ప్రతిముఖే స్థితా
    దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢమ్‌' (రా. యు. స. ౧౧౮-౧౭)

(నీ నడతలో సందేహమున్నది. నీవు నా యెదుట నిలబడితే, కండ్ల రోగం కలవాడు దీపంవలె, నేను చూడలేకున్నాను - రామునిమాట సీతతో.)

అని తీవ్రంగా భావించి పల్కడంలో అస్వాభావికతగాని, అధర్మంగాని కలదనుకోవటం అవిచార రమణీయం. హిందువుల నమ్మకము ప్రకారంగా, ధర్మం మూడుపాళ్ళు నశించిన ద్వాపరాంతంలోనే -

    'స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః'
    'సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ' (భగవద్గీత. ౧-౪౧, ౪౨)

(స్త్రీలు చెడితే వర్ణసంకరమేర్పడును. దానిచే కులము చెరిచినవారికీ, కులానికీ అంతా నరకం రాక తప్పదు.)

అనే దృఢశ్రద్ధ చదువరులలో గలదు. అట్లుండగా ధర్మం మూడు పాదాలతో నడుస్తూఉన్న త్రేతాయుగంలోనివారిమాట చెప్పబనిలేదు. ఇంత తీవ్రంగా ఈయభిప్రాయాలను, నమ్మకాలను నెలకొల్పుకొనవచ్చునా అన్నది ఇప్పుడు మనమేకాదు, అప్పుడుకూడా ఒకప్రక్క కొందరైనా తీవ్రంగానే వేసుకొన్న ప్రశ్న. కాని 'ధర్మా దర్థశ్చ కామశ్చ' (ధర్మము వల్లనే అర్థకామాలు రెండు అనుభవింప వీలు కలదు - మహా భారతం) అనే మాట సత్యమైతే, ఆ ధర్మసూత్రాలు శిథిలంగా చేసికొనలేము, చేసి జీవింపలేము. వాటిని సంఘంలో వ్యాప్తికి తెచ్చే అధికారమూ, ఉద్యోగమూ కలవారు వ్యక్తులకు దానివల్ల కలిగే సుఖ దుఃఖాలను గమనింపరు; గమనింపలేరు. ఇట్లు ధర్మసూత్రాలను దృఢంగా బిగించినప్పుడు నడుమ చిక్కి నలిగిపోయే కోటానకోటి వ్యక్తులలో సీతమ్మకూడా ఒకతె. రాముని నడతను గూర్చి ఇంతకంటె ఎవరూ చెప్పగలిగింది లేదు. 'రామో విగ్రహవాన్‌ ధర్మః' (రా. అర. ౩౭-౧౩) - రాముని స్వరూపమే ధర్మము.

కాని సీతాదేవి ఇందుచేత పడినపాట్లు తలచుకుంటే ఎవరికైనా కడుపు చుమ్మలుచుట్టి తీరుతుంది. మన అనుకంప అంతా ఆమె ప్రక్క మ్రొగ్గుతుంది. 'నీధర్మమూ, రాజ్యమూ ఏ యేట్లోపోతే మాకేమి, మా సీతమ్మకు నిష్కారణంగా నీవు పెట్టిన ఈ కష్టం చూడవయ్యా' అనే చూపుతోనే రాముని నడతను విమర్శిస్తాము. కవి ముఖ్యంగా ప్రజాహృదయానికి ప్రతినిధి. తిక్కన కవిబ్రహ్మ, ఉత్తరరామాయణంలో సీత నిట్లే భావించినాడు.

ఇందు సీతపాత్రప్రవేశమే వివిధ శృంగార విహార విలాసములతో నడిచింది. మూలంలో పది పద్యములలో ముగిసిన యీ దంపతుల స్వచ్ఛందవిహారాలను తిక్కన్న అరవై పెద్ద పద్యాలలో వింతవింతగా విరివిగా వర్ణించినాడు. (నిర్వ. ౮: ౨౦-౮౦) ముందు ఆమె పడబోయే మహాయాతనను కవి భావనచేయగల్గుట కిది పాథేయంగా భావించినాడేమో! వాల్మీకి యీ సందర్భంలో సీతారాములకు మైరేయ మాంససేవ చేయించినాడు. (రా. ఉ. ౪౨-౧౮). కాని తిక్కన దానిమాట చల్లగా జార్చినాడు. అసలు సీతారాము లేమిచేసినా చేయకపోయినా తిక్కన్న బ్రాహ్మణ దృష్టిలో ఆ రెంటికీ చోటు లేదాయెనేమో! అప్పటికింకా ఆయన సోమయాజియైనా కాలేదుగా!

రహస్య గోష్ఠిలో రాముడు లోకవార్తను త న్నడిగినప్పుడు భద్రుడు సీతమ్మమీది అపవాదాన్ని ఒకతాయంతో నోరు విడువలేదు. మూలంలో ఉన్న 'సుసమాహితః' (౩౩-౧౨) అన్న ఒకమాట నాధారం చేసుకొని తిక్కన్న, యీమాట చెప్పవలసిన భద్రుని మనోవేదనను వివిధంగా పెంచినాడు. రాముడు చేసిన బలవంతానికి -

    '... అతండు వెలువెల్లనగుచు డెందంబు గొందలం బందగఁ జెప్పను
    జెప్పకుండనేరక, అనుమానముతోడ నిక్కడక్కడఁ బడి ...'

తుదకు విధిలేక 'ఎలుగు రాలుపడ' చెప్పినాడు (ని. ఉ. ౮: ౧౦౦-౧౦౩). దానిని విన్న రాముడు 'పరమార్తవత్‌' (రా. ఉ. ౪౩-౨౧) ఉండెనని వాల్మీకి చెప్పినమాట కథకు చాలినా అనుభవానికి చాలదు. తిక్కన్న రాముడు మొదటిసారి 'సుఱ సుఱ డెందము సూడిన తెఱగున నొక్కింత స్రుక్కి' మరల 'మూర్ఛవచ్చిన మనంబునకున్‌ ధృతినూత నిచ్చి' వ్యవహరిస్తాడు (నిర్వ. ౮: ౧౦౬-౧౦౯).

తరువాత అతని యాజ్ఞతో తమ్ములు ముగ్గురూ వచ్చి చేరుతారు. ఈ తీవ్రోద్వేగ సన్నివేశంలో, ఈ అల్పవిషయాన్ని ౧౧ పద్యాలతో నిదానంగా వ్రాస్తాడు వాల్మీకి మహర్షి (స. ౪౪:౧-౧౧). సమలోష్టాశ్మకాంచనమైన ఆ మహామహుని శాంతిసిద్ధికి జోహారులు! కాని తిక్కన్న మనవంటి అల్పజీవులపై దయతో 'తమ్ముల నప్పుడ పిల్వబంచె'; 'ఆ భరతాదులు నగరి కేగుదెంచి' అని చిటుకలో ముగించినాడు (౮-౧౦౯).

తమ్ములకు వచ్చిన సీతాపవాదమును చెప్పుచు మూలంలో రాముడు:

    'అంతరాత్మా చ మే వేత్తి సీతాం శుద్ధాం యశస్వినీమ్‌' (రా. ఉ. ౪౫-౧౦).

(నా అంతరాత్మకు సీత పరిశుద్ధురాలని, కీర్తిమంతురాలని తెలియును.)

అన్న ఒకమాటకూడా సీతపై మనకు, రామునకు ఉండవలసిన భక్తిశ్రద్ధాగౌరవములకు చాలదు. తెలుగులో రాముడు స్పష్టముగా -

    'వేవురు నేల? నేను పృథివీసుత చిత్తముపెం పెఱుంగనే!
    భూవలయంబు సంచలతబొందిన, వారిధి మేర దప్పినన్‌,
    దేవనగంబు పాతగలి త్రెళ్ళిన, నందొక కీడుగల్గునే!
    ఆ వనజాక్షి నిట్లు సెడనాడిన నక్కట! నోరు ప్రువ్వదే?' (నిర్వ. ౮-౧౧౭)

అని ముక్తకంఠంగా అంటాడు! సరి. అన్నమాటకు మారాడే అధికారమూ, స్వభావమూ లేని లక్ష్మణుడు మరుదినం సుమంత్రునికి చెప్పి రథం సిద్ధంచేయిస్తాడు. వాల్మీకి గ్రంథం ప్రకారంగా సీతమ్మయింటికి అతడే పోయి 'అమ్మా, నీవేమో వరమడిగితివట, అన్న యిచ్చినాడట, శీఘ్రముగా గంగాతీరములో ఋష్యాశ్రమాలలో నిన్ను విడిచిరమ్మని నాకాజ్ఞ' అని చెప్పినాడు. (ఉ. రా. ౪౬-౭).

లక్ష్మణస్వామి పెద్ద ఉద్రేకపు ముద్ద. పాదాలుతప్ప తక్కిన అంగాలలో దేనినీ చూచియెఱుగనంత మహాభక్తి వదినమీద అతనికి. అట్టివా డీ సందర్భంలో ఇట్లు శుష్కంగా నిర్దాక్షిణ్యంగా, నిర్వికారంగా వదినెను పిలువగల్గెనా? ఆవ్యక్తి కంత ఆత్మసంయమం స్వాభావికమా? ఇదొక ప్రశ్న.

ఇంకొక్కటి: ప్రయాణవేళలో సాగనంపడానికై సీతమ్మ వద్దకు రాముడు రాబనిలేదా? అట్లు రాకపోవడం సీతమ్మకు వింతగా తోచదా? శాశ్వత పరిత్యాగం చేస్తూ, దగ్గర నిలిచి సాగనంపే మొగము రామునికి లేకపోవచ్చును. కాని సీతమ్మకింకా ఆ విషయ మప్పటికి తెలియదు. కనుక ఆమె రాముడు కానరానందుకు ఆక్షేపించి తీరవలయును. లేదా ప్రయాణవేళలోనే ఆమె కీ పరిత్యాగవార్త తెలియజేయవలెను. కాబట్టి లక్ష్మణుని మాట విన్న మాత్రంతో సీత 'ప్రహర్ష మతులం లేభే' (౪౬-౧౦) అన్న వాల్మీకి మాట సీతాస్వరూపానికి చాలదు. భవభూతి ఉత్తరరామచరితంలో - రాముడు సీతను ఋష్యాశ్రమాలకు తప్పక పంపుతానని, లక్ష్మణునితో రథము సిద్ధంచేయుమంటే, సీత 'ఆర్యపుత్ర, మీరూ అక్కడికి రావలెను,' అని ఆజ్ఞ చేస్తుంది. 'ఇదికూడా చెప్పవలెనా?' అంటాడు రాముడు. అందుపై ఆమె నెమ్మదిగా నిద్రిస్తుంది. మేలుకొనేలోపల లోకాపవాదకథ విని రాముడు శోకించి ఆమెను విడిచిపోతాడు. ప్రయాణసమయంలో రాముడు లేనందు కాశ్చర్యపడి 'కానీ, అతని మీద కోపంచూపుతాను - అతని మొగం చూచినప్పుడు నా తెలివి నాలోఉంటే?' అంటుంది. (ఉ. రా. చ. అం. ౧) ఆ కవి యింతకు మించి పోలేకపోయినాడు. ఇంతేకాదు, త్రోవలో సీతాలక్ష్మణుల సంవాద కథంతా తెరమరుగుకే వదలి తాను తప్పించుకొన్నాడు!

తిక్కన్న కిది చాలకపోయింది. వాల్మీకి కొక మ్రొక్కు మ్రొక్కి, సీత ప్రయాణసమయంలో రామునినే ప్రధానంగా తెచ్చి నిలుపుతాడు, రాముడు -

    "అడలడచి నెమ్మనంబున
    వెడ తెలివొడగూర్చి మాట వేర్పడకుండన్‌
    జడిముడిపడక నయంబున
    నెడమడు వొక్కింత లేక యిట్లను సతితోన్‌."

    "పొలతుక గంగచేరువ తపోవనభూములు సూడ నీమదిన్‌
    మొలచిన కౌతుకంబు తుదిముట్టగ లక్ష్మణ దేవు నిన్ను నం
    దులకు మనోముదం బెసగఁ దోకొనిపో నియమించితిన్‌ సము
    జ్జ్వలమణికాంతమైన రథసత్తమ మెక్కుదు రమ్ము నావుడున్‌." (౮-౧౩౨)

సీతమ్మ నిండుమనస్సుతో -

    "అక్కట! నాదువేడ్క కుచితానుచితంబులు సూడకే విభుం
    డొక్కతలంపువాడయి సముత్సుకతన్‌ నను దవ్వుపుచ్చగా
    నిక్కమ యియ్యకోలరయ నెయ్యము తియ్యముగాదె! ..." (౮-౧౩౩)

అనుకొని సరేనన్నది. కాని యీ నాటకాన్ని లక్ష్మణుడు చూచి సహించగలడా? మఱి సహింపకమాత్రం ఏమనగలడు! అన్న ధైర్యానికీ, వదినె పిచ్చినమ్మికకూ ఆశ్చర్యమూ, దుఃఖమూ అతని నావరింప మొగంమీద తోచినవి. దానిని చూచి రాముడు సీతతో -

    "దూరమునాక ఘోరవనదుర్గతలంబులఁ గేలి సల్పగాఁ
    గోరెడు భామలన్‌ బ్రియులఁ గోరినయట్టుల పుచ్చు రాజులన్‌
    ధారుణి నెందుఁ గానమని తా మును దీనికి నడ్డపెట్ట నేఁ
    బోరితమాడి యిట్లు నిను బుచ్చుట కల్గినవాఁడు సూచితే!" (౮-౧౩౫)

అని పెద్ద అల్లకమొకటి అల్లి సీతను వలలోవేసి, తమ్ముని నోరు - తెరవనిదాన్నే - మూస్తాడు. 'ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చ రాఘవః' (అయో. ౨-౩౨) అన్న రాముని కీర్తికి భంగం దీనితో వచ్చిందని దుఃఖించేవారు దుఃఖింపనీలెండి. సీతమ్మ వ్యక్తికిమాత్రం దీనితో కొంత ప్రాణబలం వచ్చింది. పొమ్మంటే పోయి, రమ్మంటే వచ్చే రకం కాక, రాముడు అసత్యమైనా చెప్పి మనస్సు నెమ్మదిపరచవలసిన పాత్రంగా ఆమె యిందు తయారైంది. మఱి మునిపత్నులకని వాల్మీకిసీత స్వయంగా తీసికొన్న 'మణిమయ భూషణాంబరాదులు' తిక్కన రామునిచేతనే ఆమె కిప్పించినాడు. ఇట్లు ఆమెను -

    "పాలతోడ విషంబిడు పగిది ననిచి
    పుచ్చి రాఘవుఁ డుల్లంబు నొచ్చి మరలె" (౯-౩)

సీతను తోడ్కొనిపోయి లక్ష్మణుడు రథమును సుమంత్రునితోగూడ గట్టున నిలిపి గంగానది దాటి అద్దరిలో, ఆమెతో, రాముని పరాధీనత, పరిత్యాగావశ్యకత స్పష్టమగునట్లు, పరమ దుఃఖముతో విషయమంతా మనవిచేస్తాడు. "వాల్మీకియాశ్రమ మిందేయున్నది. అందు సుఖంగా వసించు" మన్నాడు. అంటూ కడపటిదిగా ఒక అధికప్రసంగపుమాట జారవిడిచినాడు -

    "ఉపవాసపరైకాగ్రా వస త్వం జనకాత్మజే
    పతివ్రతాత్వ మాస్థాయ రామం కృత్వా సదా హృది" (రా. ఉ. ౪౭-౧౮)

(ఏకాగ్రచిత్తంతో ఉపవాసాలు చేస్తూ, పతివ్రతాధర్మాన్ని అవలంబించి రాముని నెప్పుడూ ధ్యానిస్తూ ఉండవమ్మా.)

లక్ష్మణుని నోట సీతమ్మ కీ యుపదేశపు మాట రానిచ్చుట యిద్దరు వ్యక్తుల యోగ్యతకూ చాలనిది. కనుకనే తిక్కన్న దానిని వాల్మీకికే వదలినాడు.

తనకు కల్గిన అచింతితమైన దౌర్భాగ్యానికి సీత మూర్ఛ పోవడమూ, ఏడ్వడమూ సహజమే కదా. కాని యీ స్థితిలో మనకంతమాత్రం చాలదు. సీత పాతివ్రత్యధర్మంలో మనకు తృప్తీ, శ్రద్ధా ఉన్నవి. ఆ స్థితిలో ఆమె భర్తను తిట్టి, తిరస్కరించి, ఇంకొక పెండ్లో పేరంటమో చేసికొని ఉంటే 'బలే' అని సంతోషించే కొందరు ఈనాడే కాదు, ఆనాడుగూడా ఉండి ఉంటారు. అది వేరుమాట. కాని తిక్కన్న ఆజాతికి చేరడు. ఆయనకు మనలో ననేకులవలె, వచ్చిన కష్టమేమంటే: సీతమాత్రం ధర్మబద్ధురాలు కాదా? భర్తకు సహధర్మిణిగాగదా ఆవ్యక్తి తయారైనది? అట్టిచో ధర్మాచరణ విషయంలో భర్త ఆమెతో ఆలోచింపక యిట్లు వచించుట యేల? - అనేది. రాముని నడతలోని గొప్ప మచ్చ అది; కనుకనే తిక్కన్న సీత యేమన్నది?

    "తన మది నొక్క యుమ్మలిక దక్కిన మంచిది; దానిఁ బాపగాఁ
    నని తలపోసి చేయుపని కక్కట యేనును లోనుగానె? నా
    కు నెఱుఁగఁ జెప్పి పొమ్మనుటకుం దగనె! మొగమోట లేక మ
    న్నన యెడవైన రాజులమనంబుల ద్రిప్పఁగ బల్మి గల్గునే!" (౯-౧౭)

ఈ ప్రశ్న తిక్కన మాత్రమే ప్రతిభాధైర్యంతో సీతమ్మ నోట వేయించింది. తెలుగులో పిన్నవీరన్నకుగానీ, పాపరాజుకుగానీ, సంస్కృతంలో కాళిదాసుకుగానీ యీ చొరవ లేకపోయింది. ఈ ఒక్కమాటతో సీతమ్మ కుండవలసిన స్వాభిమాన గౌరవాలు తళుక్కున మెరసి ఆమెను మీదికెత్తినవి.

లక్ష్మణుడు విడిచి వెళ్ళిన తరువాత ఆమె అఖండంగా ఏడుస్తూ ఉంటే వాల్మీకి వచ్చి ఆదుకుంటాడు. ఇందుకూడా వాల్మీకి వాల్మీకికిన్నీ, తిక్కన్న వాల్మీకికిన్నీ భేదమున్నది. మూల వాల్మీకి సీతను మధురంగా పల్కరించినాడు. తిక్కన్న చేతికి వచ్చే సరికి అతడు మనఃక్షోభంబు సంధిల్ల 'గద్గదికానిరుద్ధవచనుండై' పోయినాడు (౯-౪౧). ఇంతేకాదు; వాల్మీకి -

    "సర్వం చ విదితం మహ్యం త్రైలోక్యే యద్ధి వర్తతే
    అపాపాం వేద్మి సీతే త్వాం తపోలబ్ధేన చక్షుసా" (౪౯-౧౪)

(మూడులోకాలలోని విషయాలన్నీ నే నెరుగుదును. నీయందు పాపము లేదని, సీతా! తపోదృష్టిచే నాకు తెలుసును.)

అని తాను మొదలు చెప్పిన మాటనే చక్కదిద్దుకొని తెనుగులో -

    "లోకముల నెద్దియేనియు నాకు నెఱుగ
    రాని యట్టిది లేదు, నిర్మలతనొప్పు
    నీదు చరితంబుగాదె? రాము
    నేరమియ చూవె యింతయు నిక్కమరయ" (౯-౪౪)

అన్నాడు. వాల్మీకివంటి రసతపస్వికి, ప్రజాపాలనదృష్టితో రాముని ధర్మపరాధీనతను మెచ్చుకొన్నా, సీతను చూచిన కంటితో చూచినప్పుడు అతనినడత అవిచారరమణీయమని తోపకపోదు. ధర్మమును చూచేవారికి ఈ రెండు చూపులూ లేకపోతే, ధర్మసామాన్యానికి మూలమైన లోకకల్యాణాన్నే క్రమంగా వారు మరచిపోయే అపాయం కలదు. ఈ రెండు ధర్మకోణాలకున్న సామరస్యం సాధించడమే తపస్సుకు ఆధిభౌతికమైన పరమఫలం. వాల్మీకికవికి శిష్యుడైన కాళిదాసుకు గూడా గురువుగారియం దీ లోపం కనిపించింది. ఆ సందర్భంలో అతడు గురువునోటనే సీతమ్మకు యీక్రింది మాట చెప్పించినాడు:

    "ఉద్ఘాతలోకత్రయకంటకేఽపి సత్యప్రతిజ్ఞేఽప్యవికత్థనేఽపి
    త్వాం ప్ర త్యకస్మా త్కలుషప్రవృత్తా వస్త్యేవ మన్యుర్భరతాగ్రజే మే" (రఘు. ౧౪-౭౩)

(రాముడు త్రిలోక కంటకులగు రాక్షసులను నిర్మూలించినాడు; సత్యప్రతిజ్ఞుడు; ఆత్మశ్లాఘ లేనివాడు; కాని, సీతా, నిష్కారణంగా నీ విషయమున వాని మనసు కలుషితమయినది, కాన వానిమీద నాకు కోపముండనే యున్నది.)

తిక్కన్న కింతమాత్రం చాలలేదు. ఆమెను పిలుచుకొనిపోయి తపస్వినుల కప్పగించునప్పుడు గూడా, యీమె -

    "జనకునికూఁతు రార్య గుణశాలిని రామునిదేవి సీత యా
    తని కొఱగామి నియ్యెడకుఁ దాపసవృత్తిఁ జరింపవచ్చె..." (౯-౪౮)

అని కచ్చితంగా చెప్పి అప్పగించినాడు. కాని వాల్మీకికి గలిగిన యీకోపం ఇంతవరకూ పరోక్షంగానే వెల్లడియైనది. రాముని కీ విషయం తెలియవద్దా? కనుక, కుశలవుల రామాయణ గానం విన్న తరువాత వీ రెవరని రాముడు ప్రశ్నింపగా, ఇది సమయ మనుకొని తెలుగువాల్మీకి, కసితీర, గంభీరంగానే ఇట్లన్నాడు:

    "వినయముఁ బెంపు నేర్పును వివేకమునుం గల నీవు మేదినీ
    తనయఁ దొరంగు టెట్టు లుచితంబుగఁ జూచితి విట్లు వోలునే?
    యనలవిశుద్ధయైన సతి నక్కట 'యెక్కడ కేనిఁ బొమ్మునీ'
    వని వెడలంగఁ ద్రోచిన దయాగుణకీర్తికి హానిపుట్టదే?"

    "నాఁ డగ్నిలోనఁ ద్రోచిన
    వాఁడ వకట! యంతఁబోక వల్లభ నిమ్మై
    నేఁ డడవిఁ ద్రోచి తెద చడు
    వాఁడిగదే నీకు రాఘవకులప్రవరా!"

    "అంతనుండియు నీతోడ నలిగియున్న
    వార మది యట్టులుండె..."    (౧౦-౧౨౮,౧౨౯,౧౩౦)

నాటికి నేటికి 'అది యట్లే' యున్నది. రాగమూ ధర్మమూ రెండూ అన్యోన్య బీజభూతములు. సమరసంగా పెరుగవలసినవి. కాని ఎన్నోమార్లు అవి పరస్పర విరుద్ధంగా వర్తించడం సృష్టిలోని మాయలలో మొదటిది. ఇది ఉన్నన్నినాళ్లూ సీతారాముల నాటకం జరుగుతూనే ఉంటుంది. దీనిని ముఖ్యంగా రాముని దృష్టితో చూచి యనుభవించినవాడు భవభూతి; అట్లే సీతాదేవి దృష్టితో చూచి వేదనపడినవాడు తిక్కనామాత్యుడు; వాల్మీకి మహర్షిది ప్రధానంగా ధర్మదృష్టియని చెప్పబనిలేదు.

AndhraBharati AMdhra bhArati - tikkanna tIrchina sItamma - telugu vachana sAhityamu - vyAsamulu - rALLapalli anaMta kRiShNa sharma ( telugu andhra ) Rallapalli Anatha Krishna Sarma tikkana