| భాష | నిఘంటువులు | ఆంధ్రనామసంగ్రహము |
| మానవవర్గు | ||
| తే. |
పాఱుఁ డనఁగఁ బుడమివేల్పు - బాఁపఁ డనఁగ జన్నిగ ట్టన విప్రుండు - జగతిఁ బరఁగు నొడయఁ డేలిక యెకిమీఁడు - పుడమిఱేఁడు ఱేడు దొర సామి యన నొప్పు - నృపతి పేళ్లు. |
1 |
| సీ. |
కోమట్లు మూఁడవ - కొలమువాండ్రన బేరు లన వైశ్యనామము - ల్దనరుఁ గాఁపు వాండ్రుఁ నా నాలవ - వాండ్రు నా బలిజెవాం డ్రను శూద్రస - మాహ్వయములు వడుగు నా గోఁచిబాఁ - పఁడు నాఁగ బ్రహ్మచా రికిఁ బేళ్లు నడచు ధ - రిత్రియందు నాలుబిడ్డలు గల - యతఁ డిలుఱేడు గే స్తన నొప్పుఁ బేళ్లు గృ - హాధిపతికి |
|
| ఆ. |
నడవిమనికిపట్టు - జడదారి యన వన వాసి యొప్పు నిల్లు - వాసితిరుగు బోడ తపసి కావి - పుట్టగోఁచులసామి యన యతీంద్రుఁ డలరు - నలికనేత్ర! |
2 |
| సీ. |
అమ్మ నాఁ దల్లి నా - నవ్వ నాఁ గన్నది యన మాతృకాఖ్యలౌ - నభ్రకేశ! అబ్బ నాయన యయ్య - యనఁ దండ్రి యన నప్ప యన జనకాఖ్య లౌ - నగనివేశ! తోడఁబు ట్టనఁగ సైదోడు తోఁబు ట్టన సోదరాహ్వయము లౌ - నాదిదేవ! భర్తృసహోదరు - భార్యకుఁ దోడికో డ లన నేరా లన - నలరు నభవ! |
|
| తే. |
చెలియ లనఁ జెల్లె లనఁగను - వెలయుచుండు నాహ్వయములు కనిష్ఠక - న్యకు గిరీశ! జ్యేష్ఠకన్యకు నాఖ్యలై - క్షితిని వెలయు నప్ప యన నక్క యనఁగ జం - ద్రార్ధమకుట! |
3 |
| సీ. |
ముగ్ధఁ బేళ్లగు - ముగుద యనన్ ముద్ద రాలు నా గోల నా - బేల యనఁగ గట్టివాయి యనంగ - గయ్యాళి యన ఱాఁగ యన ధూర్తసతికి - నాహ్వయము లమరు నైదువ నాఁగ ము - త్తైదువ నా నయి దువరాలు నాఁ బుణ్య - యువతి వెలయు మృతచిరంటికి నాఖ్య - లెసఁగుఁ బేరంటాలు నాఁగను జక్కిని - నా ధరిత్రి |
|
| తే. |
గేస్తురా లనునాఖ్యచే - గృహిణి వెలయు నాలు పెండ్లాము రాణి - యిల్లా లనంగ భార్య దనరును దొత్తన - బానిసె యన వరవు డన దాసికాఖ్య లౌ - గరళకంఠ! |
4 |
| సీ. |
కన్నియ కన్నె నాఁ - గన్యకుఁ బే ళ్లొప్పు జవరాలు కొమరాలు - జవ్వని యనఁ దనరు యువతి ప్రోడ - యన గట్టివయసుది యనఁ బ్రౌఢ దాల్చునీ - యాహ్వయములు ముసలి మిండలకోర - ముప్పదియాఱేండ్లు చనినది యనుపేళ్ల - నెనయు లోల ముసలిది ముదుసలి - ముదియ పె ద్దన నివి యాఖ్యలై తనరు వృ - ద్ధాంగనకును |
|
| ఆ. |
చెడిప ఱంకులాడి - చెడ్డతొయ్యలి వెలి చవులుగనిన దనఁగ - జార దనరు నిలను విటులదూత - యెడకాఁడు కుంటెన కాఁ డనంగఁ దనరుఁ - గరళకంఠ! |
5 |
| తే. |
వేల్పుబానిస వెలయాలు - వేడ్కకత్తె లంజె బోగముచాన వె - ల్లాటకత్తె పడపుఁజెలి యాటచేడియ - గడనకత్తె నాఁగ నివి వేశ్య కాఖ్యలౌ - నగనివేశ! |
6 |
| ఆ. |
వెచ్చకాఁడు బొజుఁగు - వేడుకకాఁడు మిం డండు ననుపుకాఁడు - మిండగీఁడు లంజెకాఁడు నా ధ-రం జనుఁ బల్లవ నామధేయములు పి - నాకహస్త! |
7 |
| ఆ. |
కోడెకాఁడనంగ - గోవాళ్ళు నాఁగను యువజనాఖ్య లొప్పు - చుండు రెండు నాగవాస మనఁగ - నామ మౌ వేశ్యాజ నంబు మేళమునకు - నంబికేశ! |
8 |
| సీ. |
నెలఁతుక క్రాల్గంటి - పొలఁతుక ముద్దియ వాలుఁగంటి మగువ - పడఁతి మడఁతి చెలి మచ్చెకంటి యు - గ్మలి యింతి తొయ్యలి నవలా కలువకంటి - నాతి గోతి పూఁబోఁడి చిగురాకుఁ - బోఁడి పైదలి మించు బోఁడి ముద్దులగుమ్మ - పొలఁతి కొమ్మ ప్రోయా లువిద తీఁగె - బోఁడి చేడియ యించు బోఁడి యన్ను వెలంది - బోటి జోటి |
|
| తే. |
చాన తెఱవ వెలందుక - చామ లేమ చెలువ యెలనాఁగ చిలుకల - కొలికి కలికి తలిరుఁబోఁడి యలరుఁబోడి - నెలఁత పొల్తి గరిత యతివ నా స్త్రీ సమా - ఖ్యలు మహేశ! |
9 |
| తే. |
చెలిమి నేస్తంబు పొందు నా - స్నేహ మలరు నెచ్చెలి యనుంగు సంగాతి - నేస్తకాఁడు సంగడీఁ డనఁ జెలికాఁడ - నంగఁ దనరు స్నేహితునకు సమాఖ్యలు - శ్రీమహేశ! |
10 |
| సీ. |
దొంగ తెక్కలికాఁడు - దొరకోలుసన్నాసి ము చ్చెత్తుబరికాఁడు - ముడియవిడుపు తెరువాటుకాఁడు క - త్తెరదొంగ చేవాఁడి కాఁడు వల్లడికాఁడు - కన్నగాఁడు మునిముచ్చు గడిదొంగ - యనఁ దస్కరాఖ్యలౌఁ జెండిపోతు గరాసు - మొండికట్టె టకటొంకు టాటోటు - టక్కులాఁడు పిసాళి టక్కరి ముడికాఁడు - ఠవళికాఁడు |
|
| తే. |
కల్లరియు గొంటు కైలాట - కాఁడు చెడుగు బేరజము కుచ్చితుఁడు దోస - కారి చెనఁటి పాలసుఁడు నాలిబూతంబు - పలువ తులువ కూళ గడు సన వర్తిల్లుఁ - గుజను పేళ్లు. |
11 |
| ఆ. |
పాప బుడుత చిఱుత - పట్టి సిసువు కందు కూన నిసువు బిడ్డ - కుఱ్ఱ బొట్టె యనఁగ శిశుసమాఖ్య - లగుఁ గొమరుండు నాఁ గొడుకు నాఁ గుమార - కుండు వెలయు. |
12 |
| ఆ. |
వటుసమాఖ్య లగును - వసుధలోఁ గొండిక వాఁ డనంగఁ బడుచు - వాఁ డనంగఁ బిన్న వాఁ డనంగఁ - జిన్నవాఁ డనఁగను వినుతగుణసనాథ! - విశ్వనాథ! |
13 |
| సీ. |
గిటక పొట్టి కుఱుచ - గిట్ట గు జ్జనఁగ వా మనుఁ డొప్పుఁ జను నప - స్మారిపేళ్ళు వెడఁగు వేఁదుఱు వెఱ్ఱి - వీఱిడి వేఱిఁడి వెంగలి వెంబర - విత్తనంగఁ జతురునకును బేళ్లు - జాణ దంట వలంతి వెరవరి ప్రోడ నే - ర్పరి యనంగ ప్రన్ననివాఁడు రూ - పరి చూడఁగలవాఁడు చక్కనివాఁడు నా - జగతిఁ బరఁగు |
|
| తే. |
సుందరాకారవంతుండు - సొగసుకాఁడు వన్నెకాఁ డన శృంగారి - వసుధ వెలయు నంధకుని పేళ్లు చీకు గ్రు - డ్డనఁగ మూఁగ మూవ యన మూకనామముల్ - దేవదేవ! |
14 |
| క. |
కాయము పేళ్లై వెలయును మే యన నొడ లనఁగ మేను - మెయి యన భోగ్య ప్రాయము పేళ్లగుఁ బరువము పాయము జవ్వన మనంగ - భావజదమనా! |
15 |
| తే. |
నెఱులు కురులు వెండ్రుకలు నా - నెఱక లనఁగఁ గొప్పు తుఱు మన వేనలి - క్రొవ్వెద యనఁ గేశధమ్మిల్లములు మించుఁ - గీలుగంటు క్రొమ్ముడి యనంగఁ గేశబం - ధ మ్మగు భవ! |
16 |
| తే. |
నొసలు నెన్నొసల్ నుదురు నె - న్నుదు రనంగఁ దనరు ఫాలంబు చూడ్కి చూ - పనఁగ నొప్పు నాహ్వయము లీక్షణమునకు - నక్షికాఖ్య లలరుఁ గ\న్ గన్ను కన్ను నా - నభ్రకేశ! |
17 |
| క. |
వీను లనఁ జెవు లనంగా జానుగు లన నాహ్వయములు - శ్రవణంబులకున్ గౌ నన నడు మనఁగా నభి ధానము లగు మధ్యమునకుఁ - దరుణేందుధరా! |
18 |
| తే. |
అక్కు ఱొమ్మెద బోర నా - నలరు వక్ష మాస్యమున కొప్పుచుండు నా - ఖ్యలు మొగంబు మోర మో మనఁ బేళ్లొప్పు - నూరువునకుఁ బెందొడ యనంగఁ గుఱువు నా - నందివాహ! |
19 |
| తే. |
వదనగుహ యొప్పు నోరు నా - వాయి యనఁగఁ బల్లు పలు నాఁగ దంతంబు - పేళ్ళు వెలయుఁ బెదవి వాతెఱ మోవి య - న్పేళ్లఁ దనరు చుండు నోష్ఠంబు శీతాంశు - ఖండమౌళి! |
20 |
| క. |
కయి యనఁ గై నాఁ గేలనఁ జెయి యనఁ జై నాఁగఁ జెయ్యి - చే నా హస్తా హ్వయము లగు నన్నపూర్ణా ప్రియవల్లభ! కాశికాపు - రీవరనిలయా! |
21 |
| క. |
ఎద యన డెందం బనఁగా మది యనఁగా నెడఁ దనంగ - మఱి యుల్లము నా హృదయమునకు నివి యెసఁగును విదితంబుగ నాహ్వయములు - విశ్వాధిపతీ! |
22 |
| క. |
లోఁజెయ్యన నరచెయ్యనఁ గాఁ జెల్లును బేళ్లు రెండు - కరతలమునకున్ మీఁజె య్యన బెడ చెయ్యియు నాఁ జనుఁ గరచరమభాగ - నామములు శివా! |
23 |
| ఆ. |
పొట్ట డొక్క కడుపు - బొజ్జ బొఱ్ఱ యనంగ నొప్పుచుండు నాఖ్య - లుదరమునకు నాభిబిలమునకును - నామధేయములగు బొడ్డు నాఁగ మఱియుఁ బొక్కి లనఁగ. |
24 |
| తే. |
వె న్ననంగను వీఁపు నా - వెనుకమేను నాఁగఁ జరమాంగమున కొప్పు - నామములుగఁ బుఱ్ఱె తలపాల నాఁ బున్క - పుఱియ నాఁ గ పాలమున కాఖ్యలై యొప్పు - ఫాలనేత్ర! |
25 |
| క. |
అడు గంజ హజ్జ యనఁగాఁ బుడమిఁ బదంబునకును నామ - ములు విలసిల్లున్ మెడ కుత్తు కఱ్ఱు గొం తన నడరు గళంబునకుఁ బేళ్ల - నంగధ్వంసీ! |
26 |
| ఆ. |
బువ్వ వంటకంబు - బోనంబు మెతుకు కూ డోగిరము పసాద - మోరె మనఁగ నన్న మొప్పుఁ జేల - మలరుఁ బుట్టంబు దు వ్వలువ చీర కోక - వలువ యనఁగ. |
27 |
| తే. |
మెసవె నారోగిణమొనర్చె - మెక్కెఁ దినియెఁ గుడిచె నారగించెను బసా - పడియె నమలె సాపడె ననంగ నొప్పు భో - జనము సేసె ననుట కివి యాఖ్యలై యీశ! - యభ్రకేశ! |
28 |
| కా. |
నాన యన సిగ్గు సిబ్బితి నా విని వ్రీ డాపదంబు - నామంబు లగుం బానము సేయుట పేళ్లగు నానుట త్రావు టనఁ ద్రాగు - టనఁ గ్రోలు టనన్. |
29 |
| ఆ. |
తళియ పళ్ళెరంబు - తెలె హరివాణంబు తట్టి కంచ మనఁగఁ - దనరుఁ బాత్ర చెల్లుఁ జషకమునకు - బేళ్లు డబ్బుర కోర గిన్నె యనఁగ రజత - గిరినివాస! |
30 |
| తే. |
నతికిఁ బే ళ్లొప్పు జోత దం - డము జోహారు మ్రొక్కు జేజే యనంగఁ గేల్ - మొగిచెఁ గొలిచె నెఱగెఁ జేమోడ్చె నన నమ - స్కృతి యొనర్చె ననుట కివి యాఖ్య లగు నీశ! - యభ్రకేశ! |
31 |
| తే. |
ఒప్పు శయనించుటకును బ - న్నుండె బండెఁ బవ్వడించెఁ బరుండెను - బవ్వళించె నత్తమిల్లె నన న్మఱి - మెత్త సెజ్జ పఱపు పా న్పనఁ దగు శయ్య - ఫాలనేత్ర! |
32 |
| తే. |
ఒప్పు ధ్వనిపేళ్లు రొద యన - నులివు నాఁగ స ద్దనంగను గూఁత నాఁ - జప్పు డనఁగ నలుకు డన రోదనము సేసె - ననుట కాఖ్య లెసఁగు నఱచెను వాపోయె - నేడ్చె ననఁగ. |
33 |
| క. |
అగుఁ బేళ్లు నీరువ ట్టన దగ దప్పియు దూప యనఁగ - దాహంబునకున్ నగవు నగు నవ్వు నవు నా నగు నాఖ్యలు హాసమునకు - నగజాధీశా! |
34 |
| క. |
చాగము నాఁ బుడు కనఁగా నీగి యనఁగ నిడుట యనఁగ - నీవి యనంగాఁ దేగము నాఁ బెట్టుడు నాఁ ద్యాగమునకు నాఖ్య లగుచు - ధరఁ బరఁగు శివా! |
35 |
| ఆ. |
ఎలసె బెరసె హత్తె - నెనసె నదికెఁ జెందె బొందె దొరసెఁ గూడె - నొందె చెనకె ననఁగ సక్తమయ్యె - ననుటకు నివి యాఖ్య లగు గిరీశ! యీశ! - యభ్రకేశ! |
36 |
| ఆ. |
ఎడసెఁ బాసె వేఱు - పడెఁ బురువిచ్చె నా నలరు భేద మయ్యె - ననుట పేళ్లు స్వవశ మయ్యె ననుట - కవుఁ బేళ్లు లోనయ్యె నగ్గమయ్యె ననఁగ - నసమనేత్ర! |
37 |
| ఆ. |
అగు గృహీత మయ్యె - ననుటకుఁ బే ళ్లగఁ పడియెఁ జేపడియెను - బట్టువడియెఁ జిక్కువడియెఁ దగిలెఁ - జిక్కెఁ దగుల్పడె ననఁగ నగనివేశ! - యభ్రకేశ! |
38 |
| తే. |
అనియె నొడివె వక్కాణించె - నాడెఁ జెప్పె వినిచె వాక్రుచ్చెఁ బలికె నాఁ - జను వచించె ననుట కాలించె నాలకిం - చెను వినె నన నలరు నవధరించె నటంట - కాఖ్య లీశ! |
39 |
| క. |
కనియెను చూచెను కాంచెను కనుఁగొనెఁ గన్గొనె ననంగఁ - గలయవి పేళ్లై చను వీక్షించె నటంటకు ఘనతరగోరాజగమన! - కాయజదమనా! |
40 |
| క. |
చనుఁ గృతగమనుఁడ నయ్యెద ననుటకు నామంబు లగుచు - నవని నరిగెదన్ జనియెదఁ బోయెద నేగెద పనివినియెద ననెడునట్టి - పలుకులు రుద్రా! |
41 |
| ఆ. |
ద్విగుణమున కభిఖ్య - లగు నిబ్బ డిమ్మడి జంట దంట దుగయు - జమిలి రెట్టి యినుమడి యన మిథున - మున కాఖ్య లగుజోడు దోయి కవ యనంగ - ధూతకలుష! |
42 |
| సీ. |
ఒం డొక్కఁ డొకటి యొ - క్కొం డన నగు నేక మీరు రెం డిరు నాఁగ - నెసఁగు ద్వయము తిగ మూఁడు మూ ర్నాఁగఁ - దగు ద్రయి తీవంచ నలు నాల్గు చౌ యన - నగుఁ జతుష్క మెసఁగు జౌవంచ యై - దే ననఁ బంచకం బా ఱిరుమూఁ డిత్తి - గనఁగ నొప్పు షట్కంబు ఋషిసంఖ్య - సత చక్కుపగడ యే డన నొప్పు నష్ట సం - ఖ్యకును బేళ్లు |
|
| తే. |
దనరు నిరునాలు గెనిమిది - దచ్చి యనఁగఁ బరఁగు నీరాఱు పండ్రెండు - బార యనఁగఁ ద్వాదశమునకు నాఖ్యలు - ధరణియందు వినుతకరుణాసనాథ! శ్రీ - విశ్వనాథ! |
43 |
| తే. |
జరిగె నూడెను జాఱెను - నుఱికి వెళ్లెఁ బాఱెఁ బఱచెను దొలఁగె న - ప్పలుకు లెల్ల నవనిలోనఁ బలాయితుం - డయ్యె ననుట కాఖ్యలై యొప్పుఁ జంద్ర రే - ఖావతంస! |
44 |
| క. |
వేంచేసెను వచ్చెం జను దెంచెను విచ్చేసె నరుగు - దెంచె ననఁగ నే తెంచె నన నయ్యె నాగతుఁ డంచుం బలుకుటకు నాఖ్య - లంబరకేశా! |
45 |
| తే. |
నాటిఁసుత నాఁటినుండియు - నాఁటఁగోలె నాఁటఁబట్టి నాఁడుమొదలు - నాఁగ నాహ్వ యమ్ము లయ్యెఁ దదారభ్య - యనుట కవని వినుతకరుణాసనాథ! శ్రీ - విశ్వనాథ! |
46 |
| తే. |
వైరమునకును ధర సమా - హ్వయము లమరుఁ గంటు పగ మచ్చరంబు సూ - డొంటమి యన వలపు కూరిమి మేలు నా - నలరుఁ బేళ్లు మోహమునకును శారదాం - బుదనిభాంగ! |
47 |
| క. |
పెనఁకువ జగడము కయ్యం బని బవరము కలను చివ్వ - యాలము పోట్లా టన దురము పోరు నాఁగాఁ జను యుద్ధంబునకుఁ బేళ్లు - చంద్రార్ధధరా! |
48 |
| ఆ. |
సదమదంబు సేసెఁ - జక్కాడె నుగ్గాడెఁ జదిపెఁ బీఁచమడచెఁ - జంపెఁ గెడపె నుఱుముసేసెఁ ద్రుంచెఁ - బరిమార్చెఁ దెగటార్చె మన్నిగొనియెఁ దునిమె - మడిపె ననఁగ |
49 |
| తే. |
హతము గావించె ననుటకు - నాఖ్య లయ్యె మనిపె నేలెను బ్రతికించె - మంచెఁ బ్రోచె సాకెఁ నన నొప్పు నాఖ్యలు - సరవితోడ నరయఁ బోషించె ననుటకు - నంబుకేశ! |
50 |
| క. |
ధరలో శూరాహ్వయములు పరఁగున్ మొనకాఁ డనంగ - బం టనఁగాఁ బో టరియన వడిగలవాఁ డన బిరు దన వాఁడిమగఁడనఁగ - భీమకపర్దీ! |
51 |
| తే. |
బాసట యనంగఁ దోడ్పాటు - నా సమాహ్వ యంబు లగుచుండు రెండు సా - హాయ్యమునకు నాఖ్యలు శుభంబునకును ల - గ్గనఁగ బా గ నంగ మే లన లెస్స య - నంగ నీశ! |
52 |
| ఆ. |
కూలె నీల్గెఁ జచ్చెఁ - గాలంబు సేసెను గెడసె సమసె నాఱె - మడిసెఁ జెల్లెఁ బెద్దనిదురవోయె - బిద్దె దోరెను గంతు గొనియె ననుట పే ళ్ల - గును మృతునకు. |
53 |
| సీ. |
తిమ్మనైనది యనఁ - దిన్ననైనది యన జానైన దనఁగ బా - గైన దనఁగ నాణెమైన దన వి - న్నాణమైనది యన మానైన దనఁగ లె - స్సైన దనఁగఁ బిన్ననైనది యనఁ - జెన్నైనదన నలు వైనది యనఁగఁ జె - ల్వైన దనఁగఁ బొనరినయది యన - నొనరిన దనఁగఁ జొ క్కటమైన దనఁగఁ జ - క్కని దనంగ సొబగైన దనఁగను - సొంపైన దనఁ గొమ రైనది యన గొన - బైన దనఁగఁ దోరమైన దన సిం - గారమైనది యన మేలైన దనఁగ - మెచ్చైన దనఁగ |
|
| తే. |
మురువుగలయది యొప్పైన - దొఱపు గలది యందమైనది తనరిన - దలరినట్టి దనఁగఁ బరఁగిన దనఁ బేళ్లు - తనరుచుండు మంజులం బైన దనుటకు - మదనదమన! |
54 |
| తే. |
కపుర మనఁ గప్పురం బనఁ - గప్ర మనఁగఁ బుడమిఁ గర్పూర మొప్పుఁ దాం - బూల మొప్పు వీడియము వక్కలాకులు - విడెము తమ్మ లంబు వీడెంబు వీడ్య మ - నం బురారి! |
55 |
| తే. |
వెలయుచుండును సిరి లచ్చి - కలిమి యనెడు పేళ్ల సంపద యెద్దడి - పేదఱికము లేమి నిప్పచ్చరము నెవ్వ - లేమి డనఁగ నలరు దారిద్ర్యమునకు నా - ఖ్యలు గిరీశ! |
56 |
| తే. |
మగతనంబన గండన - మగఁటిమి యనఁ బౌరుషంబున కాఖ్యలై - పరఁగుచుండు నుక్కు చేగ దిటము చేవ - యుదుటు గట్టి దిట్ట ముఱిది బిగువు నాఁగ - ధృతికిఁ బేళ్లు. |
57 |
| తే. |
బద్దు నా బొంకు నాఁగ ద - బ్బర యనంగఁ గల్ల నాఁగ హుళక్కి నాఁ - జెల్లుఁ బేళ్లు ధర నసత్యమునకును స - త్యంబు పరఁగు నిజ మనఁగ నిక్కువం బన - నిక్క మనఁగ. |
58 |
| క. |
బెడఁద దెస చేటు చేడ్పా డ్గొడ వ్రాతం బంగలార్పు - గోరంబు దొసం గిడుమ వెత కస్తి యంగద కడగం డ్లనఁ జను విపత్తు - గౌరీరమణా! |
59 |
| క. |
వెల జట్టి విలువ రోయనఁ గలనుడువులు దనరుచుండుఁ - గ్రయనామములౌ వెలయంగ వంగసము నాఁ గొల మన వంగడము నాఁగ - గులమొప్పు శివా! |
60 |
| క. |
క్రమ్మర నెప్పటి వెండియుఁ గ్రమ్మఱి తిరుగన్ మఱిన్ మ - రల మగుడను నా నిమ్మహిఁ బునః పదంబున కిమ్ముల నివి యాఖ్యలగు మ - హీధరచాపా! |
61 |
| క. |
ఒకమరి యొకపరి యొకమా టొససా రొకతేప యనఁగ - నొకపా రనఁగా నొకవిడుత యొక్కతూ కన నొకతడవ యనంగ మఱియు - నొకతూరి యనన్ |
62 |
| తే. |
ఏకవారం బనుట కొప్పు - నిన్ని పేళ్లు జగతిఁ బల్మాఱు వేమాఱు - సారె పెక్కు మాఱు లెన్నేనిమా ర్లనఁ - బరఁగు నాఖ్య లగుచు నివి బహువారంబు - లనుట కీశ! |
63 |
| తే. |
త్వరితమున కొప్పుఁ బేళ్లు చె - చ్చెరను సరగ వేగిరము వేగ వేళము - వెసను వడిగ గ్రక్కునను గ్రద్దన ననంగఁ - గ్రన్న ననఁగ గొబ్బునను దిగ్గున ననంగఁ - గుధరచాప! |
64 |
| క. |
కలవు వివరింపఁగా నా ఖ్యలు వరుసన్ నిర్గమించె - ననుటకు ధరలో వెలువడియె వెళ్లె వెడలెను వెల లె ననం జిత్ప్రకాశ! - విశ్వాధిపతీ! |
65 |
| క. |
వినుతి యొనరించె ననుటకుఁ దనరున్ నామంబు లగుచు - ధరపై నగ్గిం చెను గైవారము సేసెన్ గొనియాడెను బొగడె ననఁగఁ - గొండాడె ననన్. |
66 |
| సీ. |
చుట్టలు విందులు - చుట్టాలు బందుగు లనఁ జను బంధు - సమాహ్వయములు వఱలు నన్యుఁడు లాతి - వాఁ డనఁగా వింత వాఁడనఁగాఁ బెఱ - వాఁ డనఁగ వ్యాజంబునకు నామ - మౌ నెపం బనఁగ న న్వేషించె ననుట కౌ - వెదకె నెమకె సరసె రోసె ననంగ - నారసెఁ దడవె నాఁ గాంక్షకుఁ బేరు లౌఁ - గ్రమముతోఁడ |
|
| తే. |
గ్రచ్చు కోరిక తమి కోర్కి - యిచ్చ యనఁగ నెపుడు నెడపక యుడుగక - యెల్లపు డన నిచ్చ యనయంబు నాఁగను - నిచ్చ లనఁగఁ దనరు నాఖ్యలు సంతతం - బనుట కీశ! |
67 |
| సీ. |
తనరుఁ బ్రవేశించె ననుటకు నాఖ్యలు తూకొనెఁ జొచ్చెను - దూఱె ననఁగ నంఘ్రితాడితుఁ జేసె - ననుటకుఁ బేళ్లగుఁ దాఁచెఁ గాళ్లఁ గుమ్మెఁ - దన్నె ననఁగ నాలస్య మొనరించె - ననుటకుఁ జెల్లు నా మమ్ములు తడసెను - మసలె ననఁగఁ ద్యక్తంబు గావించె - ననుటకు నాఖ్య లౌ వీడెను వదలెను - విడిచె ననఁగఁ |
|
| తే. |
దాఱుమాఱయ్యె వీడ్వడెఁ - దడఁబడె నన నాఖ్య లొప్పు విపర్యస్త - మయ్యె ననుట కలరుఁ బ్రహరించె ననుట కా - హ్వయము లడిచెఁ గొట్టె మొత్తెను మోఁదె నాఁ - గుధరనిలయ! |
68 |
| సీ. |
ముందట నెదుటను - మ్రోల ముంగల నాఁగ నాఖ్య లౌ సముఖమం - దనుట కభవ! యలయిక బదలిక - యలపు సేద యనంగ శ్రమమున కాఖ్య లౌ - శమనదమన! తాలిమి యోరుపు - తాలిక నాఁగను క్షమకు నాహ్వయము లౌఁ - జర్మవసన! ఠవళి బవంతంబు - టక్కు దుత్తూరంబు వెడ్డు నా ఛద్మ మౌ - విషమనేత్ర! |
|
| తే. |
వెఱ పనఁగ నెద యనఁగను - వెఱ యనంగ నళు కనఁగ భీతి కాఖ్యలౌ - నసితకంఠ! నిమ్మళం బన నెమ్మి నా - నెమ్మది యనఁ దనరుఁ బేళ్లు నిరాతంక - మునకు నీశ! |
69 |
| సీ. |
అసదు కొంచెము సైక - మలఁతి యన్నువ చిన్న నలికంబు సన్నంబు - నాఁ దనర్చు స్వల్ప మెక్కుఁడు నాఁగఁ - జాల నెంతేనియు మిగులఁ దద్దయుఁ దద్ద - మిక్కిలి యనఁ బెద్దయు ననునివి - పేళ్లగు భృశముగా ననుటకు నుత్కట - మయ్యె ననుట కగుఁ బేళ్లు వెగ్గలం - బయ్యెఁ గ్రిక్కిఱిసె వె క్కసమయ్యె ననునివి - క్రమముతోడ |
|
| ఆ. |
సగ్గెఁ గుందె డొంకెఁ - దగ్గెను సడలెను క్రుంగె నుబ్బణంగె - స్రుక్కె ననఁగఁ దనరుఁ బేళ్లు క్షీణ - దశ నొందె ననుటకు నీశ్వరీసనాథ - విశ్వనాథ! |
70 |
| ఆ. |
మించు వాసి మేలు - మేటి పెచ్చె చ్చన నధికమునకు నాఖ్య - లగుచు వెలయుఁ బనులు నాఁగఁ జెయువు - లనఁ జేత లన నొప్పుఁ గర్మమునకుఁ బేళ్లు - చర్మవసన! |
71 |
| ఆ. |
అనిపె ననిచెఁ బనిపెఁ - బనిచె నంపెను బంపెఁ బుచ్చె గెలువుమనియెఁ - బొమ్మటనియె ననఁగ నివి సమాఖ్య - లగును ప్రస్థాపించె ననెడు క్రియకు నీశ! - యభ్రకేశ! |
72 |
| తే. |
కొదవ కొద కుందు తగ్గు త - క్కువ కొఱంత వెలితి కొఱ లొచ్చు కడమ నా - వెలయు న్యూన సమభిధానము లర సాము - సగము సవము నాఁగ నర్ధాహ్వయంబు లౌ - నాగభూష! |
73 |
| తే. |
పేళ్లు పశ్చాత్తనుటకును - జెల్లు వెనుకఁ బిదపఁ దర్వాతఁ బదపడి - పిమ్మట నన మునుపు మునుమున్ను తొలి తొల్లి - ముందు తొలుత ననఁగ బూర్వపదార్థాఖ్య - లౌ గిరీశ! |
74 |
| ఆ. |
పాఱుఁబోతు పిఱికి - పంద కోఁచ యనంగఁ బేళ్లు దనరు సమర - భీరువునకు దిట్ట యుక్కుతునియ - గట్టిడెందంబువాఁ డనఁగ ధైర్యవంతుఁ - డలరు నీశ! |
75 |
| తే. |
పౌఁజు చేరువ మొత్తంబు - బారు తుటుము దండు పరి గమి కూటువ - పిండు దాఁటు మూఁక దళమునకు బేళ్లు స - మూహమునకు భుజగవరహార! యవిముక్త - పురవిహార! |
76 |
| సీ. |
పూనె నూచెను దాల్చె - నానెను మోచె నా వహియించె ననుట కౌ - నహివిభూష! నామము లుచ్చాట - నము చేసె ననుటకు వరుసతోఁ దఱిమెను - బఱపె వెలిచెఁ దోలెను ఱొప్పె నా - ద్రుహిణాదిసురనుత! త్రిప్పెను నాఁ గ్రమ్మ - ఱించె ననఁగ మగిడించె ననఁగను - మరలించె నన సమా హ్వయములై పరఁగు ని - వర్తితంబు |
|
| తే. |
చేసె ననుటకు సురముని - సిద్ధసేవ్య! యడ్డగించెను నా నిల్పె - ననఁగ నాఁగె నన నివారించె ననుటకు - నాఖ్య లమరు నగసుతానాథ! గుహగజా - ననసనాథ! |
77 |
| తే. |
దండ చేరువ సంగడి - దాపు చెంత సరస చెంగట యెద్ద డ - గ్గఱ కురంగ టండ పజ్జయు నా సమీ - పాఖ్య లమరు రమ్యధవళాంక! కలశనీ - రధినిషంగ! |
78 |
| తే. |
అచట నచ్చట నచ్చోట - నందు నాడ నచొట నచ్చొట నక్కడ - నయ్యెడ నట ననఁగఁ దత్ప్రదేశంబునం - దనుట కాఖ్య లయ్యె భక్తవిధేయ! యా - ర్యాసహాయ! |
79 |
| క. |
ఇరుగెలఁకుల నిరువంకల నిరుదెసల నిరుచక్కి యందు - నిరుపక్కి యలం దిరుగ్రేవల నిరుగడ నన బొరిఁ బేళ్ళగు నుభయపార్శ్వ - ముల ననుట కజా! |
80 |
| క. |
నవముగ ధరలో నీమా నవవర్గువు వేడ్కఁ జదివి - నను వ్రాసిన మా నవులకు ననవతరంబును శివుఁ డవిముక్తేశ్వరుండు - చెలువం బొసఁగున్. |
81 |