| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
026. ఓ చిన్నదాన
| "జంబైలే జోరు లంగరు" అన్నది తుమ్మెదా, వెన్నెలా, గునాసారి గున్నమ్మా వంటి పాదాంతం పదావళే (పల్లవి కాదు). ఈ పాదాంత పదావళితో ఎన్ని పాటలైనా వినబడుతాయి. జంబైలే జోరు లంగరు "కొండామీదా కోడిపెట్ట" అన్న ఇంకొక పాట పూర్తిగా దొరికినది కాదు. కూలివారందరూ "జంబైలే జోరు లంగరు" అని కలిసి పాడుతారు. కల్పనాకారుడొకడు మాటలు అల్లుతాడు. ఈ అల్లిక సొగసును బట్టి వారప్పుడప్పుడు గొల్లుమంటుంటారు కూడా. |
| రోడ్డు రోలరు లాగుకుంటు పోయే కూలీల పాట చూడండి. లిబిడో ఇంకొక అడుగు వేస్తుంది. |
|
ఓ చిన్నదానా విడువనె చెంగు ఓ చిన్నదానా వదలనె కొంగు బందారు చిన్నదాన బాజాబందూల దాన బాజా బందూల మీద మోజేల లేదే | ॥ఓ చిన్నదాన॥ |
| గుంటూరు చిన్నదాన గుళ్ళాపేరులదాన గుళ్ళాపేరుల మీద కళ్ళూ పోలేదే | ॥ఓ చిన్నదాన॥ |
| కాకినాడ చిన్నదాన కాసూల్ కంటేలదాన కాసూల్కంటేల మీద మనసేల లేదే | ॥ఓ చిన్నదాన॥ |
| అర్ధారూపాయి బెట్టి అద్దాల రయిక కొంటె అద్దాల రయిక మీద బుద్ధేల లేదే | ॥ఓ చిన్నదాన॥ |
| నల్లా నల్లాని దాన నడుమూ సన్నాని దాన తళుకూసేపల మల్లె కులుకూ సూపులదాన | ॥ఓ చిన్నదాన॥ |
| నిన్ను సూసీ మనసు నిలవకున్నాదోలె | ॥ఓ చిన్నదాన॥ |
| ఈ పాటల లోని దీర్ఘాలూ, యతిప్రాసలున్నూ బృందగానమున్నూ దారిని పోయే బాటసారుల నెందరినో పట్టి అలరించగలవు. అలరించును గూడ. పాడుకుంటూ రోలరు లాగే జట్లు నేటికీ సుందర సామగ్రియే. కనుకనే కవికొండల వేంకటరావు గారు కూలియన్నల (ఈ) కుతుకమును ఒక ఖండకావ్యములో ఇమిడ్చినారు. |