| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
148. సంతలో బావ
| ఈ చిన్నదానికి విధి విపర్యయమైనది. బావ ఈమెను వివాహమాడలేదు. అయినప్పటికీ సంతలో నిండుకన్నుల చూచి సంతోషించినది. వాని వర్తనమును గమనింపుడు. |
|
శుక్రవారం సంతలోన బావయ్యో బావయ్యో చుట్లమీద తొక్కినావు బావయ్యో బావయ్యో నువ్వు తొక్కినందుకేడ్వలేదు బావయ్యో బావయ్యో నీ కాలు నొప్పి కేడ్చాను బావయ్యో బావయ్యో ఆదివారం సంతలోన బావయ్యో బావయ్యో అంది అంది గుద్దినావు బావయ్యో బావయ్యో నువ్వు గుద్దినందుకేడ్వలేదు బావయ్యో బావయ్యో నీ గుత్తి నొప్పికేడ్చాను బావయ్యో బావయ్యో బుధవారం సంతలోన బావయ్యో బావయ్యో నా బుగ్గలట్టుకు కరిసేవు బావయ్యో బావయ్యో నువ్వు కరిసినందుకేడ్వలేదు బావయ్యో బావయ్యో నీ పళ్ళ నొప్పి కేడ్చినాను బావయ్యో బావయ్యో |
| మొదట అతిశయము ఎక్కువై ఆమె కాలిచుట్ల మీద తొక్కినాడు. ఆమె బాధపడలేదు. తరువాత గుద్దినాడు. ఆమెకు నొవ్వలేదు. దీనితో వానికే దెబ్బ తగిలినది. బుధవారము సంతలో తన తప్పు తీర్చినాడు. కాని ఏమి ఫలము? బాధయే మిగిలినది. ఈ సందర్భమును బట్టి వేరొక పాట జ్ఞప్తికి వస్తున్నది. |
| చీమిడి ముక్కుది చింపిరి తలకాయా ఒల్లానంటివి గదర ఒల్లానంటివి గదర ఓ మేనమామా॥ ప్రాయామొచ్చీనపుడు - పైటొచ్చినపుడూ ఓగిస్తె వచ్చీనె ఓగిస్తె వచ్చీనె ఓ మేనమామా॥ |
| అని చిన్నప్పుడు చూచి తన్నొల్లని మామను దెప్పిపొడుచుచున్నది వయసులోనున్న చిన్నది. అయితే యీమె స్వాధీనపతిక. ఇందాకటి పాటలోనిది ప్రోషిత వలెనే కన్పించుచున్నది. |