| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆదిపర్వము - సప్తమాశ్వాసము |
| వ. | ‘సకలరాజసమక్షంబున నిట్టి యతిమానుషం బయిన యద్భుతకర్మం బర్జునునక కా కన్యులకుఁ జేయ శక్యంబె? యని యెఱింగితిమి; మీపరాక్రమంబ మిమ్ము నెఱింగించె; నధర్మనిరతు లగు ధృతరాష్ట్రదుర్యోధనులు సేసిన లాక్షాగారదాహప్రయోగంబువలన విముక్తుల రయితి; రింక మీకు ల గ్గుగు’ నని చెప్పి బలదేవసహితుం డయి వాసుదేవుం డరిగిన; నిట ద్రుపదుండు దనకూఁతునకు వరుం డైన వాఁ డెవ్వఁడో యేవంశంబునవాఁడో వాని చరితం బెట్టిదో యెఱింగి రమ్మని ధృష్టద్యుమ్నుం బనిచిన, నతండు భీమార్జున ద్రౌపదుల పిఱుందన వచ్చి త న్నొఱు లెఱుంగకుండ నక్కుంభకారగృహంబున నుండి యంత వృత్తాంతంబు నెఱింగిపోయి ద్రుపదున కి ట్లనియె. | 222 |
| సీ. |
అ య్యిద్దఱును గృష న్ణ ట్లొప్పఁ దోడ్కొని | చని యొక్క ముదుసలి సాని కపుడు మ్రొక్కి యక్కన్యను మ్రొక్కించి మఱియొక్క | గౌరవర్ణుఁడు పంపఁ గడఁకతోడ నలువురు భూసురనాథగృహంబుల | కరిగి భైక్షము దెచ్చి యంతగూడు నొగిన యయ్యవ్వకు నొప్పించియున్న న | య్యవ్వయు ద్రౌపది నర్థిఁ బిలిచి |
|
| ఆ. |
బలివిధానములకు బ్రాహ్మణాతిథులకు | నన్నకాంక్షు లైన యధ్వగులకు నగ్రమిందుఁ బుచ్చి యయ్యగ్రశేషంబుఁ | జెలువ రెండు పాళ్ళు సేయు మొనర. |
223 |
| క. |
వెడఁదయురంబును నన్నువ | కడుపును దృఢకఠినతనువుఁ గల యాతని కిం దడర నొకపాలు వెట్టుము | వడి; నాగాయుతబలంబువాఁ డతఁ డబలా! |
224 |
| వ. | ‘మఱియు రెండగుపా లన్నలువురకుం బెట్టి తద్భుక్తశేషం బేనును నీవు నుపయోగింత’ మని పంచినఁ; గృష్ణయు నయ్యవ్వ పంచినరూపున నందఱకుం గుడువం బెట్టి, తానును గుడిచి, దర్భపూరులు విద్రిచి యందఱకు వేఱువేఱ శయనమ్ము లిమ్ముగా రచియించి, వానిపయి వారల కృష్ణాజినంబులు పఱచి సుఖశయను లై యున్న వారి పాదంబులకు నుపధానభూత యై శయనించి. | 225 |
| ఆ. |
కఱకు దర్భపూరి పఱపులు; భిక్షాన్న | మశన; మట్టివారి నతిముదమున నాదరించెఁ బ్రీతి; నాదిగర్భేశ్వరి | యయ్యు నేవగింపదయ్యెఁ గృష్ణ. |
226 |
| క. |
కడవసములుఁ గోలలుఁ గ | ప్పడములు వీరలధనంబు పరికింపఁగ నె క్కడి దేశికు లని వగవక | మడవక తనుమధ్య నిండుమనమున నుండెన్. |
227 |
| సీ. |
‘అంత నయ్యేవురు నయ్యయికథ లొప్పఁ | జెప్పుచు మఱి రథసింధురాశ్వ విషయంబులును, సమవిషమ మహావ్యూహ | నిర్భేదనోపాయనిపుణవిధులు, నాయుధవిద్యారహస్య ప్రయుక్తులుఁ | బలికిరి; పలికినబాసఁ జూడ నత్యుత్తమక్షత్రియాన్వయు లగుదురు; | చరితఁ జూడఁగ విప్రజాతు లగుదు; |
|
| ఆ. |
రెఱుఁగరాదు వారి; నీ రెండు జాతుల | వార కాని, కారు వైశ్య శూద్ర హీనజాతు’ లనిన నెంతయు సంతస | మందెఁ బృషతపుత్త్రుఁ డాత్మలోన. |
228 |
| వ. | వెండియు వారల నిమ్ముగా నెఱుంగవేఁడి తనపురోహితుం బుత్తెంచినం, బురోహితుండును బ్రాహ్మణ సమూహంబుతోడ వచ్చి పాండవులం గని ధర్మరాజు నియోగంబున భీమసేనుచేత నర్ఘ్యాదివిధుల నర్చితుం డయి యి ట్లనియె. | 229 |
| ఉ. |
మీ కులగోత్ర నామములు మిమ్మును నెమ్మి నెఱుంగవేఁడి చిం తాకులు డైనవాఁడు ద్రుపదాధిపుఁ; డాతనికిం బ్రియంబుగా నా కెఱిఁగింపుఁ డింతయు; ఘనంబుగ నద్భుతయంత్ర మత్స్యమున్ వీకున నట్టు లేసిన సువిక్రము నాతఁడు గోరుఁ జూడఁగన్. |
230 |
| వ. | అనిన విని నగుచు ధర్మతనయుండు ద్రుపద పురోహితున కి ట్లనియె. | 231 |
| క. |
ఇవ్వైహాయసలక్ష్యం | బివ్విలు మోపెట్టి నెట్టనేసిన వీరుం డివ్వనితకు వరుఁ డగు నని | నెవ్వగ మీ రాజు చులక నియమము సేసెన్. |
232 |
| తే. |
అతని నియమించి నట్లు యయ్యంత్ర మేసి | యీతఁ డిక్కన్యఁ బడసె నుర్వీశు లొద్ద; నేల మమ్ముఁ దా నెఱిఁగెడు? నెఱిఁగి యేమి | సేయువాఁ డింక మీ పతి సెప్పుమయ్య! |
233 |
| క. |
బలహీనుఁ డైన వానికి | నలవియె? మోపెట్టి తివియ న క్కార్ముకముం; గులహీనున కకృతాస్త్రున | కలవియె? యా లక్ష్యమేయ? నశ్రమలీలన్. |
234 |