| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శాంతిపర్వము - పంచమాశ్వాసము |
| వ. | దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె నట్లింద్రబలిసంవాద రూపంబునఁ గాలప్రకారంబు విని యుధిష్ఠిరుండు దేవవ్రతునితోడ. | 2 |
| క. |
‘ఏమిట రూపగుఁ? బురుషుం | డేమెయిరూపు సెడు? నాకు నెఱిఁగింపుము తే జోమహిత! యనిన నతఁ డా | భూమిపతికి నిట్టు లనియె భూపప్రవరా! |
3 |
| వ. | ‘ఇవ్విషయంబునకు నొక్క యితిహాసంబు శ్రీశక్రసంవాదం బనంగలదు. దానిం జెప్పెద నాకర్ణింపుము. నారదమునీశ్వరుం డెందును నిజేచ్ఛంజరియించుచుండి యొక్కనాఁడు మందాకినికిం జని కృతస్నానుండై. | 4 |
| క. |
ఆ నదియం దాచరిత | స్నానుండై నియతినున్న శక్రుం గని య చ్చో నయ్యిరువురు సల్లా | పానందముఁ బొందుచుండ నాకాశమునన్. |
5 |
| తే. |
బాలభాను బింబంబు గీడ్పఱుచునట్టి | దీప్తి మండలి దోఁచె; నద్దేవపతియు మునిపతియుఁ జూచుచుండ గ్రక్కున విమాన | మవతరించి యాసన్నయై యతివ యోర్తు. |
6 |
| క. |
పురుహూతున కభిముఖి యై | కరములు మోడ్చుటయు, నతఁడు గారవమున ‘నె వ్వర వబ్జానన! యెచటికి | నరిగెద, వెందుండి రాక?’ యనియె నరేంద్రా! |
7 |
| సీ. |
అనవుడు నద్దేవి యాదరభరిత యై | ‘బాలార్కబోధిత పద్మజాత యైనట్టిదాన; శ్రీయన లక్ష్మి నా భూతి | యనఁగ వెలుంగుదు ననఘ! యేను స్వాహాస్వధామతి శ్రద్ధాధృతిస్మృతి | మేధల దనుజుల మెచ్చి వారి కడనుండి మెచ్చ కిప్పుడు నీకడకు నేఁగు | దెంచితి’ ననిన నద్దివిజనాథుఁ |
|
| తే. |
‘డేమికారణమున మెచ్చి? తేకతమున | మెచ్చవైతి దానవుల? నీ మెచ్చుచొప్పు మాకు నెఱిఁగింపు’ మనిన నమ్మాననీయ | వాక్య యిట్లని చెప్పె నవ్వాసవునకు. |
8 |
| క. |
‘దానాధ్యయనాతిథిస | మ్మానాది విశిష్ట గుణసమగ్రత కలిమిన్ దానవుల నియ్యకొంటిని; | వాని విడిచి గర్వు లగుట వారి విడిచితిన్. |
9 |
| వ. | సత్యధర్మపరుండ వగుటంజేసి నీపాల వసియింప రుచివుట్టి వచ్చితి’ నని చెప్పి వెండియు. | 10 |
| సీ. |
గురుభక్తి నిరతులు, సురపితృపూజన | పరులును, సత్యసంభాషణులును, దానశీలురుఁ, బరధన పరదార ప | రాఙ్ముఖచిత్తులు, బ్రాహ్మణ ప్రి యులు, దివానిద్రా వియుక్తులు, వృద్ధదు | ర్బల దీన యోషిత్కృపారతులును, శౌచులు, నతిథిభోజనశిష్టభోజులు | నేను మెచ్చు జనంబు; లిట్లుగాక |
|
| తే. |
ధర్మ మెడలి, కామంబు క్రోధంబుఁజాలఁ | గలిగి, గర్వులై బలియు భైక్షంబు నిడక పరుష వాక్కులఁ గ్రూరంపుఁ జరితములను | మిగిలి వర్తించువారు నా మెచ్చు గారు. |
11 |
| క. |
బుద్ధియు ధృతియును నీతియు | శ్రద్ధయు సన్నతియు క్షమయు శాంతియు ననఁగా వృద్ధశ్రవ! యేడ్వురు మ | ద్వృద్ధి ప్రదదేవతలు శ్రుతిస్మృతికథితల్. |
12 |
| క. |
అష్టమి యగు దేవత నేఁ | గష్టాత్మత యసురులందుఁ గని విడిచితి మ త్తుష్టికరచరితు లగుటఁ ద్రి | విష్టప సదుల కడ నిలిచి వెలసెద ననినన్. |
13 |
| క. |
అభినందించిరి దేవ | ప్రభుఁడును నారదుఁడు నపుడు పవనంబును సౌ రభసుఖ సంస్పర్శంబుల | నభిరామం బగుచు వీచె నల్లన యచటన్. |
14 |
| ఆ. |
కురిసెఁ బుష్పవృష్టి, మొరసె గీర్వాణ దుం | దుభులు, సిరి వరింప నభినవోజ్జ్వ లత్వమొంది దివిజులకు నేత్రపర్వమై | పొలిచి యింద్రుఁ డాత్మపురికి నరిగె. |
15 |
| క. |
శతమఖకమలావాసా | ప్రతిమ సమాగమ విశేష బహుమత మగు నీ యితిహాసము శ్రుతమైనఁ బ | ఠితమైనను నెఱయ సంఘటించును లక్ష్మి న్. |
16 |
| క. |
ఇందుల తాత్పర్యము నీ | డెందము నొందించి యతిదృఢీకృతశీలా స్పందితుఁడ వగుము; తిరమై | యిందిర నీకడ వసించు నిభపురనాథా!’ |
17 |
| క. |
అనిన విని ధర్మజుఁడు శాం | తనవునితో జనుల కెవ్విధము నాచారం బున నెట్టిపాటి శీలం | బున నే విద్యను మహాత్మ! ముక్తి దొరకొనున్. |
18 |
| క. |
అనవుడు నతనికి నతఁ డి | ట్లను ‘విను మితిహాస మొకటి యది నీ ప్రశ్నం బున కుత్తర మగు; నేర్పడ | వినిపించెద గాఢతర వివేక నిరూఢా! |
19 |