పురాణేతిహాసములు శ్రీమహాభారతము శాంతిపర్వము - షష్ఠాశ్వాసము
వసిష్ఠుఁడు జనకున కక్షరక్షర తత్త్వంబుల తెఱం గెఱింగించుట (సం. 12-291-13)
సీ. ‘గ్రంథంబు ధరియింతు గాని నీ కర్థబో | ధంబు లే దర్థబోధవ్యపేత
మగు గ్రంథధారణ మప్రయోజన మర్థ | నిశ్చయ మెఱిఁగింతు నిపుణబుద్ధి
నవధరింపుము సాంఖ్య మనుసరించును యోగ | తంత్రంబు నదియును దాని తెరువు
నొందుఁ గావున సాంఖ్యయోగంబు లేకంబ | యని కండ్రు ప్రాజ్ఞులు మనుజనాథ!
 
తే. సాంఖ్యమునకు యోగమునకు జనని శ్రుతియ | పురుషవనితానపుంసకంబు లనఁ బ్రకృతి
లింగములు గల నాత్ముం డలింగుఁ డతనిఁ | జెంద దది యెద్దియును నని చెప్పు శ్రుతులు.
29
క. విను బీజంబున బీజం | బును దేహమునందు దేహమును నింద్రియముల్‌
దనతనవలనం దానును | మనంబునకు మనసు పుట్టు మహితవిచారా!
30
తే. ఇతఁ డబీజుం డదేహుం డనింద్రియుండు | వీతమానసుఁడని యాత్మవిధము సెప్పు
వేదములు, భవదుఃఖ కర్మాదికములు | నాతనికి లేవు నిర్గుణుం డగుటఁ జేసి.
31
చ. ప్రకృతి యలింగ, తజ్జనితభంగులు లింగము, లట్టులయ్యు రం
జకగుణశీల లింగచయసంగతిఁ దాను సలింగమయ్యె, మూ
ర్తికలన లేక యుండియుఁ బరిస్ఫుట పుష్పఫలాదిసూచక
ప్రకరముచేత మూర్తమయి రంజిలదే ఋతువేళ సూడఁగన్‌.
32
క. కావున గుణములు ప్రకృతివ | యేవిధమునఁ జూచినను మహేశ్వరుని గుణి
త్వావేశము పొరయ దస | ద్భావము సద్భావమగునె? భరితవివేకా!
33
వ. ఇది యక్షర క్షర వివేకం, బేకం బనేకంబు దర్శనం బదర్శనంబు నిస్తత్త్వంబు దత్త్వం బపవర్గంబు వర్గంబని యక్షర క్షరంబుల పర్యాయ నిర్దేశంబు, లక్షరంబు నప్రబుద్ధులు గానరు, ప్రబుద్ధులగు సాంఖ్యులును యోగులును బుద్ధికిం బరంబై పంచవింశతితమంబైన యా తత్త్వంబు నాలోకింతు’రని చెప్పిన వసిష్ఠుతో నవ్వసుమతీవల్లభుండు. 34
సీ. ‘కలదు నానాత్వ మేకత్వ మాత్మునకు న | విద్యయు విద్య నా విందు నదియు
నదియును నెఱిఁగింపు మక్షరక్షరభేద | మీవు సెప్పితి బుద్ధి యెంతయేని
నస్థిరగాన యయ్యవబోధమును మాసె | సాంఖ్యయోగంబుల చందములును
దెలియంగఁ జెప్పఁగా వలయు నా’ కనుడు న | మ్ముని యిట్టు లనియె నమ్మనుజ పతికి
 
తే. ‘యోగమనఁగను ధ్యానంబు రాగరహిత! | యదియు వినుము ప్రాణాయామ మనఁగ నొకటి
మనసు నేకాగ్రతావృత్తి యనఁగనొకఁడు | పరఁగు సగుణత్వ నిర్గుణ భావగతుల.
35
వ. తదనుష్ఠాన ప్రకారంబు సెప్పెద. 36
క. ‘మలమూత్రంబుల కాలం | బుల భుక్తి కనంతరమున భూవర! యోగం
బలవఱుచు రెండు మార్గం | బులును నిషిద్ధంబు లండ్రు పూర్వాచార్యుల్‌.
37
సీ. కొంచెపుటశనంబుఁ గొనుచు సంగంబులఁ | బాసి యింద్రియముల పజ్జఁ జనమి
శబ్దాదియైన విషయజాత మంతరం | గంబున సందడిగాక యుండ
సద్బుద్ధి దృఢమగు సాధనంబుగఁ గొని | మరలిచి యాత్మన మనసు నిలిపి
యపగతసంకల్పుఁడై యుపలస్థాణు | భంగికస్థితిఁ బనుపడి దివంబు
 
తే. రాత్రియును యోగసేవానురతి నివాత | దీపమును బోలె వెలుఁగు నాత్మీయమూర్తిఁ
గనుచు నెడనెడ నుపరమకాలములు స | నంగ వర్తించి యోగి యానంద మొందు.
38
వ. ఇది యోగప్రకారంబు, సాంఖ్యంబు తెఱం గెఱింగించెద. 39
తే. ప్రకృతివాదు లవ్యక్తంబు ప్రకృతియండ్రు | ప్రసవధర్మిణియైన యా ప్రకృతి దన్ను
బుద్ధ్యహంకారములుఁ బంచభూతములును | విషయములు నింద్రియములుఁగా విస్తరించు.
40
వ. పురుషునివలన నివి యెల్లను గలుగుఁ బురుషుఁడింతకు నధిష్ఠాతయై యుండు. 41
క. అనులోమంబున సృష్టియు | జనవర! ప్రతిలోమవృత్తి సంహారముఁ గ
ల్గును జనన ప్రళయంబులఁ | దనకు బహుత్వంబు నేకతయు శోభిల్లున్‌.
42
వ. క్షేత్రంబన నవ్యక్తంబనం బకృతియనం బ్రధానం బనం బరఁగు తత్త్వం బొక్కటియ. దానిన సత్త్వంబు నండ్రు, జీవుం డా క్షేత్రంబు నెఱింగినవాఁడు, కావున క్షేత్రజ్ఞుఁడును, నవ్యక్తపురంబున వసియించుటఁజేసి పురుషుండు, ననవెలుంగు, క్షేత్రక్షేత్రజ్ఞులు వేఱగుట ప్రస్ఫుటంబు, అవ్యక్తంబు జ్ఞానంబు, పురుషుండు జ్ఞేయుండు, ప్రకృతి సగుణాత్మక, పురుషుండు నిర్గుణుం డిది సాంఖ్యప్రకారం, బిట్లు పరిసంఖ్యానరూపంబునఁ జతుర్వింశతితత్త్వంబుల నేర్పరించి పురుషుండు దన్నుఁదాన చూడం గైవల్యంబు సిద్ధించు; నిట్టిది యపునరావృత్తిపదంబు, తత్త్వసమూహం బప్రబుద్ధం బది క్షరంబు, పంచవింశతితత్త్వ విశిష్టుండగు పురుషుండు ప్రబుద్ధుం డక్షరంబునం బరఁగు, నిత్తెఱం గెఱింగిన వా రెల్లవలనను నిర్భయులు. భూవర! యోగంబును సాంఖ్యంబును నక్షరంబును జెప్పితి. విద్యావిద్యలు సెప్పెద నాకర్ణింపుము. 43
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )