| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ద్వితీయాశ్వాసము |
| రావణుని శక్తి ప్రహారముచే లక్ష్మణుని మూర్ఛ | ||
| ఉ. |
తల్లడ మంది రామవసుధాపతి కడ్డము లక్ష్మణుం డుల్లమునొవ్వనాటుచు మహోన్నత కోపముతోడ దైత్యుచే విల్లును నారియుం దునిమివేసి వడిన్ శరసప్తకమ్ముచే బల్లిదుఁడైన దైత్యకులపాలుని వక్షముఁ దూర్చి యార్చినన్. |
36 |
| క. |
అంత విభీషణుఁడమరేం ద్రాంతకు నరదంబుఁ గూల నట నేసిన న త్యంత బవంబున ధరణికి గంతుగొనెన్ వడిని బంక్తి కంధరుఁ డలుకన్. |
37 |
| వ. |
ఇట్లు తన రథంబుఁ గూలనేసిన విరథుండై రావణుండు మయదత్తంబైన శక్తినిఁ బూని తమ్ముని నేయఁ జూచు చున్నంత శరణాగత వజ్రపంజరుండగు రాఘవేశ్వరునితోబుట్టు వగుటంజేసి లక్ష్మణుండు కరుణాపరుండై విభీషణుం దనవెనుక నిడికొని యెదిర్చినం గని నీవు నాపగర కడ్డంబ వైతివి గావున నీవ యీశక్తిచేత హతుఁడవు గమ్మన యేసిన నదియును శతఘంటికారంజితంబును శతకోటినినదంబును బావకజ్వాలాభీలకీలాన్వితంబునునై పఱతేరంగని సురేంద్రాది దేవగణంబులు భయంబంది రాముతమ్మునకు దీర్ఘాయు వగుం గావుత మని దీవింప జగంబులు తల్లడిల్ల సముద్రంబులు ఘూర్ణిల్లఁ గులాచలంబులు వడంకఁ జంద్రార్క బింబంబులు దలంక నేఁగుదెంచి సౌమిత్రియురంబునాటి ధాత్రిం బడియె నట్టియవసరమ్మున. |
38 |
| సీ. |
పంక్తికంధరుఁ డేయుబాణంబు లవి లెక్క-సేయక రఘుకులసింహుఁ డపుడు తమ్మునిమెయి నాటి ధరణి గాడినశక్తి-నొగి వానరులు తీయ నోపకున్న నవలీల దాని నొయ్యనఁ దీసి పోవైచి-ఘనులైన కపులను గాపు వెట్టి నేనె రాఁముడ నైతినేని మజ్జనకుండు-దశరథుం డగునేనిఁ దప్పకుండఁ |
|
| తే. |
గలన నెదిరించి నాతోఁడ గయ్యమునకు-నిలిచె నేనియు దనుజేంద్రు నిజము గాఁగ నమరు లెఱుఁగంగ జంపుదు నతనిచేతఁ-జత్తు నింతియకాని నే రిత్తమగుడ. |
39 |
| వ. | అని మఱియును. | 40 |
| క. |
రాముఁడు రావణుఁ డనుచును భూమిపయిని నిర్వురునికి పొసఁగదు సుండీ నామాట వినుఁడు లెస్సగ రాముఁడ నే నొండె భువిని రావణుఁ డొండెన్. |
41 |
| వ. |
ఉండుదు మని వీరాలాపంబు లాడుచు రామచంద్రుండు ధనుర్ధరుండై శరవర్షంబులు గురియించిన నసురేశ్వరుండును బ్రతిశరంబుల వాని నన్నింటినిం దూల నేసినఁ గనలి రామచంద్రుండు తొడిగినయమ్మును వెడలు తూఁపులును విల్లుగుడుసుపడుటయు నెఱుంగ రాని చందంబునఁ బింజపింజంగఱచి పాఱుచుండునట్లుగా హస్తంబు ముడుచుటయుఁ జాచుటయు దెలియరాకుండ రావణు కాలు సేతు లాడకుండ శరలాఘవంబు నెఱపుచు నేయుచున్న యప్పుడు విఱిగి శరీర భూషణంబు లురులఁ గిరీటంబులు డుల్లఁ దలలు వీడ మరలి మరలి చూచుచు మృగేంద్రుం గన్నగజేంద్రుని చందంబున భీతచేతస్కుండై దశముఖుండు లంకాపురంబుఁ జొచ్చెఁ దదనంతరంబున. |
42 |
| క. |
ఆ వేళ లావు సూపుచు రావణుచేశక్తి దాఁకి రణరంగమునన్ జేవ సెడి పడిన లక్ష్మణ దేవున్ డగ్గఱఁగ రామదేవుఁడు వచ్చెన్. |
43 |
| వ. | ఇట్లరుగుదెంచి. | 44 |
| తే. |
రక్త సిక్తాంగుఁడై ధాత్రి శక్తి నాఁటి యున్న తమ్మునిఁ గనుఁగొని యుస్సు రనుచు దుఃఖ మంతంత నాఁగక తొంగలింపఁ దొడలపై నిడి బాష్పముల్ దొప్పదోఁగ. |
45 |