| కావ్యములు | మను చరిత్రము | అవతారిక |
| ఇష్టదేవతా వందనము | ||
| ఉ. |
శ్రీ వక్షోజ కురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా దేవిన్ దత్కమలా సమీపమునఁ బ్రీతిన్ నిల్పినాఁడో యనం గా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిం దోఁచు రా జీవాక్షుండు గృతార్థుఁజేయు శుభదృష్టిన్ గృష్ణరాయాధిపు\న్. |
1 |
| ఉ. |
ఉల్లమునందు నక్కటిక మూనుట మీకులమందుఁ గంటి మం చల్లన మేలమాడు నచలాత్మజ మాటకు లేఁతనవ్వు సం ధిల్లఁ గిరీటిఁ బాశుపత దివ్యశరాఢ్యునిఁ జేయు శాంబరీ భిల్లుఁడు గృష్ణరాయల కభీష్టశుభ ప్రతిపాది గావుతన్. |
2 |
| ఉ. |
నాలుగు మోముల\న్ నిగమ నాదము లుప్పతిలం బ్రచండవా తూలహతి\న్ జనించు రొదతోడి గుహావళి నొప్పు మేరువుం బోలి పయోజపీఠి మునిముఖ్యులు గొల్వఁగ వాణిఁ గూడి పే రోలగ మున్న ధాత విభవోజ్జ్వలుఁ జేయుతఁ గృష్ణరాయని\న్. |
3 |
| ఉ. |
అంకముఁ జేరి శైలతనయాస్తన దుగ్ధము లానువేళ బా ల్యాంక విచేష్టఁ దొండమున నవ్వలి చ\న్ కబళింపఁబోయి యా వంకఁ గుచంబు గాన కహివల్లభహారముఁ గాంచి వే మృణా ళాంకురశంక నంటెడు గజాస్యునిఁ గొల్తు నభీష్టసిద్ధికి\న్. |
4 |
| సీ. |
చేర్చుక్కగా నిడ్డ చిన్నిజాబిల్లిచే, సిందూరతిలకంబు చెమ్మగిల్ల నవతంసకుసుమంబు నందున్న యెలదేఁటి, రుతి కించిదంచిత శ్రుతుల నీన ఘనమైన రారాపు చనుదోయి రాయిడిఁ, దుంబీఫలంబు తుందుడుకుఁ జెందఁ దరుణాంగుళిచ్ఛాయ దంతపుసరకట్టు, లింగిలీకపు వింతరంగు లీన |
|
| తే. |
నుపనిషత్తులు బోటులై యోలగింపఁ బుండరీకాసనమునఁ గూర్చుండి మదికి నించువేడుక వీణ వాయించు చెలువ నలువరాణి మదాత్మలో వెలయుఁగాత! |
5 |