| కావ్యములు | మను చరిత్రము | ప్రథమాశ్వాసము |
| ఆశ్వాసాంత పద్యగద్యములు | ||
| శా. |
గంగా స్వచ్ఛ తరంగ భంగిక యశో గాఢ చ్ఛవి చ్ఛన్న సా రంగాంకాంక! నిరంకుశ ప్రతికళా ప్రౌఢి ప్రియంభావుకా! గాంగేయాచలచాప నూపుర వచో గాంభీర్య లీలాస్పదా! బంగా ళాంగ కళింగ భూప సుభటాభ్రశ్రేణి ఝంఝానిలా! |
81 |
| క. |
మండలికతపన! శోభిత కుండలపతిశయన! కర్ణకుండలిత రసా ఖండకవికావ్య! దిగ్వే దండ శ్రుతిదళన కలహ తాడిత పటహా! |
82 |
| ఉత్సాహ. |
కుకురు కాశ కురు కరూశ కోస లాంధ్ర సింధు బా హ్లిక శకాంగ వంగ సింహళేశ కన్యకామణి ప్రకర పాణిఘటిత రత్న పాదుకా కలాచికా ముకుర వీటికాకరండ ముఖ్య రాజలాంఛనా! |
83 |
| గద్యము. |
ఇది శ్రీ మదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక, పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర, నందవరపుర వంశోత్తంస, శఠకోప తాపస ప్రసాదాసాదిత చతుర్విధ కవితామతల్లి కాల్లసాని చొక్కయా మాత్య పుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మనుసంభవం బను మహా ప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము. |
|