| కావ్యములు | మను చరిత్రము | ద్వితీయాశ్వాసము |
| వరూధిని పై కొనఁ బ్రవరుఁడు తిరస్కరించిపోవుట | ||
| మ. |
వెతలం బెట్టకు మింక న న్ననుచు నీవీబంధ మూడన్, రయో ద్ధతి నూర్పుల్ నిగుడన్ విరులు చిందం గొప్పు వీడం దనూ లత తోడ్తోఁ బులకింపఁగా, ననునయాలాపాతిదీనాస్యయై రతిసంరంభము మీఱ నిర్జరవధూరత్నంబు పై పాటునన్. |
67 |
| శా. |
ప్రాంచద్భూషణ బాహుమూల రుచితోఁ బాలిండ్లు పొంగారఁ బై యంచుల్ మోవఁగఁ గౌఁగిలించి యధరం బాసింప 'హా! శ్రీహరీ' యంచున్ బ్రాహ్మణుఁడోర మోమిడి తదీయాంసద్వయం బంటి పొ మ్మంచున్ ద్రోచెఁ గలంచునే సతుల మాయల్ ధీర చిత్తంబులన్? |
68 |
| క. |
త్రోపువడి నిలిచి ఘన ల జ్జా పరవశ యగుచుఁ గొప్పు సవరించి, యొడల్ దీపింప నతనిఁ జుఱచుఱఁ గోపమునన్ జూచి క్రేఁటుకొనుచున్ బలికెన్. |
69 |
| ఉ. |
పాటున కింతు లోర్తురె కృపారహితాత్మక! నీవు త్రోవ ని చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొనుమంచుఁ జూపి య ప్పాటలగంధి వేదననెపం బిడి యేడ్చెఁ, గలస్వనంబుతో మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందఁగన్. |
70 |
| క. |
ఈ విధమున నతికరుణము గా వనరుహనేత్ర కన్నుఁగవ ధవళరుచుల్ గావిగొన నేడ్చి, వెండియు నా విప్రకుమారుఁ జూచి యలమటఁ బల్కెన్. |
71 |
| ఉ. |
చేసితి జన్నముల్ దపము చేసితి నంటి, దయావిహీనతన్ జేసిన పుణ్యముల్ ఫలము సెందునె? పుణ్యము లెన్ని యేనియున్ జేసినవాని సద్గతియె చేకుఱు భూతదయార్ద్రబుద్ధి, కో భూసురవర్య! యింత దలపోయవు నీ చదు వేల? చెప్పుమా! |
72 |
| సీ. |
వెలివెట్టిరే బాదములు పరాశరుఁ బట్టి, దాశకన్యాకేళిఁ దప్పుఁజేసి? కులములో వన్నె తక్కువయయ్యెనే గాధి, పట్టికి మేనక చుట్టఱికము? ననుపుకాఁడై వేల్పు నాగవాసముఁ గూడి, మహిమ గోల్పడియెనే మాందకర్ణి? స్వారాజ్య మేలంగ నీరైరె సుర లహ, ల్యాజారుఁ డైన జంభాసురారి? |
|
| తే. |
వారికంటెను నీ మహత్త్వంబు ఘనమె? పవన పర్ణాంబు భక్షులై నవసి, యినుప కచ్చడాల్ గట్టుకొను ముని మ్రుచ్చు లెల్లఁ దామరసనేత్ర లిండ్ల బందాలు గారె? |
73 |