| కావ్యములు | మను చరిత్రము | తృతీయాశ్వాసము |
| వరూధినీ కాముకుఁడైన గంధర్వుని మాయోపాయము | ||
| శా. |
ఏ గంధర్వుఁడు తద్విలాసములు మున్నీక్షించి తా నెంతయున్ రాగాంధుం డయి కోరి హత్తక గడున్ రారాపులం గంతుఁ డు ద్వేగం బందఁగఁ జేయ నెవ్వగల నువ్విళ్లూరుచున్ వేఁగుఁవాఁ, డా గంధర్వకుమారుఁ, డంగభవవిద్యాపారగుం డాత్మలోన్. |
68 |
| ఉ. |
ఒక్కొకవేళఁ బద్మముఖు లొల్లమి సేయుదు, రొక్కవేళఁ బె న్మక్కువ నాదరింతురు, క్షణక్షణముల్ జవరాండ్రచిత్తముల్, పక్కున వేసఱన్ జన, దుపాయములన్ దగు నిచ్చకంబులన్ జిక్కఁగఁజేసి డాసి, సతి చిత్తముఁ బట్టి సుఖింపఁగాఁ దగున్. |
69 |
| క. |
అని తలఁచి యవ్విలాసిని యనిశముఁ గ్రీడించు పుష్పితారామంబున్ మును కలుగఁ జొచ్చి యొక చం దనభూజము నీడ నిల్చి దంభం బమరన్. |
70 |
| సీ. |
అర్ధచంద్రునితేట నవఘళించు లలాట, పట్టిఁ దీర్చిన గంగమట్టితోడఁ జెక్కుటద్దములందు జిగి వెల్లువలు చిందు, రమణీయ మణికుండలములతోడఁ బసిఁడివ్రాఁత చెఱంగు మిసిమి దోఁపఁ జెలంగు, నరుణాంశు కోత్తరీయంబుతోడ సరిలేని రాకట్టు జాళువా మొలకట్టు, బెడఁగారు నీర్కావి పింజెతోడ |
|
| గీ. |
ధవళధవళము లగు జన్నిదములతోడఁ గాశికాముద్ర యిడిన యుంగరముతోడ శాంతరస మొల్కు బ్రహ్మతేజంబుతోడఁ బ్రవరుఁ డయ్యె వియచ్చర ప్రవరుఁ డపుడు. |
71 |