| కీర్తనలు | తూము నరసింహదాసు | నమ్మిన నిన్నే నమ్మవలె రఘునాయక నీతోడు |
| ఆరభి - ఆది |
| పల్లవి: |
| నమ్మిన నిన్నే నమ్మవలె రఘునాయక నీతోడు నెమ్మది నీవలెఁ బ్రోచెడు దొర లెమ్మిక మఱి లేడు యిమ్మహి నీదాసునిగా నను బ్రహ్మ నిల్పినాడు గ్రమ్ముకొనెడు నాపదలెల్లను బహుసమ్మతి తోడను జిమ్మెడి దొరవని |
| చరణము(లు): |
| మించి నే జేసితి దాసత్వము కొంచెమనక నేడు యించుక నీకృప గలిగిన రాణించును యిదె చూడు సంచితప్రారబ్ధంబుల నెల్లను కొంచెపఱచి చూడు మించి యాఱు దాటిన పిమ్మట మది నెంచరాని పద మొసగుదువట యిక |
| ముందుగ మీ పాదాబ్జములం దంది చూడగంటి పొందుగ మీకథలే మది కానందముతో వింటి సుందరరాములె గతి యని ముద మంది దెల్పుచుంటి విందుగ మాయింటికి రమ్మని వందన మొనరించిన దయసేతువు |
| తిరముగ భద్రాచలమం దొక యిరవుచేసి మీరు కలకాలము దాసుల బ్రోచుటకై బిరుదు పూనినారు అరుదుగ నరసింహుని వెంటను మరిగి తిరిగినారు కరుణను మాపాలిటి సీతావరుడ వనఁగ వెలసిన రఘురామ |