| కీర్తనలు | తూము నరసింహదాసు | శ్రీరామ జయరామా - శ్రీసీతామనోరామా! కారుణ్యగుణధామా కౌసల్యరామా |
| ఘూర్జరి (శంకరాభరణము) - ఆది |
| పల్లవి: |
| శ్రీరామ జయరామా - శ్రీసీతామనోరామా! కారుణ్యగుణధామా కౌసల్యరామా నీల నీరదశ్యామా నిత్యశోభననామా! ఫాలలోచన కామా భద్రాద్రిధామ |
| చరణము(లు): |
| సంపెంగతైలమును చారు శిరోజముల నలది యింపుగ చందననలుగు లింతు లిడియెదరు |
| పన్నీటిజలమును బాగుగా మజ్జనమాడి సన్నపు వల్వలు దాల్చు సమయ మిదియె |
| నవతులసీ మాలికలు నవ్యశృంగారముగ దాల్చి కవగొని చక్కెరశొంఠి గైకొను మీవేళ |
| మాయామానుషవేష మునిజనావనతోషా మాయాదానవశోష మంజులభాషా |
| కుటిలకుంతలజాల కోటిమన్మథలీల చటుల కస్తూరిఫాల సామగానలోల |
| సరయూతీరవిహారా సాధుజనావనధీరా గురుతరమౌక్తికహార కోమలాకారా |
| సురుచిరకాంచనచేల నరసింహావనశీలా వరదా శౌర్యవిశాల భక్తానుకూల |