కీర్తనలు తూము నరసింహదాసు కోదండపాణి యదుగో! కోదండపాణి యదుగో!
భైరవి - ఆది
పల్లవి:
కోదండపాణి యదుగో! కోదండపాణి యదుగో!
అనుపల్లవి:
ఆళి సముదయముల వదలించెడు బల్‌
తళుకు ముంగురుల బెళుకు గలుగువా డదుగో
చరణము(లు):
కోటిరవిప్రభ దీటుగొనిన బహు
తేటగలుగు కిరీటము గలవా డదుగో
తీరుగ కస్తూరితిలకము మెఱయగ
చాల భ్రూయుగముపై సైగలు గలవా డదుగో
చందురురుచి గడు మందముజేసెడు
పొందు గలుగుమో మందము గలవా డదుగో
సారసములుగడు సరకుగొనని కరుణా
రసములు గల కన్నులు గలవా డదుగో
వెన్నెల నీనెడు సన్నపునగవుల
చెన్నలరెడు నాపన్నరక్షకు డదుగో
ఎట్లు చూచినను యినకులసోముని
యట్లుదోచు చౌకట్లు మెఱయువా డదుగో
కంబుకంఠమున ఘనరుచి గల ర
త్నంబు మెఱయ శ్రీరఘుకులతిలకుం డదుగో
మేలిమివక్షమున మించుహారములు
చాలముత్తియపు సరములు గలవా డదుగో
కరయుగముల వరశర చాపంబులు
తిరముగ దాల్చిన గురువీరుడువా డదుగో
కదలక కుదురుగ జగములు దరమున
పదిలముగా నిడి పాలించెడు వా డదుగో
నాలుగుమొగములబాలుని గన్న వి
శాలనాభి గుహజాలము గలవా డదుగో
జాంబూనదమయచేలము మెఱయగ
అంబుజ మనగ ముఖంబు గలుగువా డదుగో
ధరణి సహితుడై దాసుల బ్రోచెడు
దొర యీతండని సురలు పొగడువా డదుగో
వాసిగ భద్రాచలేశు డగుచు భువి
భాసిలు నృసింహదాసు నేలువా డదుగో
AndhraBharati AMdhra bhArati - tUmu narasiMhadAsu kIrtanalu - koodaMDapaaNi yadugoo! koodaMDapaaNi yadugoo! - Tumu Narasimhadasu - Tumu Narasimha Dasu ( telugu andhra )