| కవితలు | ఆంధ్రావళి - ప్రబోధము - రాయప్రోలు | తమ్ముడా |
| 6. తమ్ముడా |
|
శ్రీలు పొంగిన జీవ గడ్డయి, పాలుపాఱిన భాగ్యసీమయి, వ్రాలినది ఈ భరతఖండము భక్తిపాడర తమ్ముడా! |
|
వేదశాఖలు పెరిగె నిచ్చట, ఆది కావ్యం బందె నిచ్చట, బాదరాయణ పరమఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా! |
|
విపినబంధుర వృక్షవాటిక ఉపనిషన్మధు వొలికె నిచ్చట విపులతత్త్వము విస్తరించిన విమలతల మిదె తమ్ముడా! |
|
సూత్రయుగముల శుద్ధవాసన, క్షాత్రయుగముల శౌర్యచండిమ, చిత్రదాస్యముచే చరిత్రల చెఱిగిపోయెనె చెల్లెలా! |
|
మేలికిన్నెర మేళవించీ రాలు కరగగ రాగ మెత్తీ పాలతీయని బాలభారత పదము పాడర తమ్ముడా! |
|
నవరసమ్ములు నాట్యమాడగ చివురుపలుకులు చెవులవిందుగ కవిత లల్లిన కాంతహృదయుల గారవింపవె చెల్లెలా! |
|
దేశ గర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగ దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా! |
|
పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహిత రణకథ కండ గల చిక్కని తెనుంగుల కలిసి పాడవె చెల్లెలా! |
|
లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కదనపాండితి చీకిపోవని చేవపదముల చేర్చి పాడర తమ్ముడా! |
|
తుంగభద్రా భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుళ్లీ భంగపడని తెనుంగు నాథుల పాట పాడవె చెల్లెలా! |