| కవితలు | ఆంధ్రప్రశస్తి: విశ్వనాథ సత్యనారాయణ |
యమదంష్ట్రిక |
12. యమదంష్ట్రిక
అళియరామరాయలు మహావీరశిఖామణి. రాజకీయ కోవిదుడు. కళ్యాణిదుర్గ మొక సారి అతడు ముట్టడించినపుడు జరిగిన సంగతులు ఈ కావ్యమున వ్రాయబడినవి. సదాశివ నాయకునిది కేళాదిపురము. ఆ వంశమువారు విజయనగర సామ్రాజ్యమునకు కుడిభుజము వంటివారు. ఇందు రామరాయల యుత్సాహశక్తి ప్రభుమంత్రశక్తుల కెట్లు మీఱిపోయినదో తెలియఁగలదు. అన్నిటికన్న చిత్ర మహా మహావీరుని కాలమున తల్లికోటలో తెలుఁగు లోడిపోవుట.
|
నెలనాళ్ళయినది కోటపట్టుపడలేనేలేదు కళ్యాణి, రా యలకున్ సిగ్గయిపోయెఁబో తెలుఁగుసైన్యంబుల్ వృధాక్రోధవ హ్నులతోమండెడునాఱెడున్ బతియుమంత్రుల్ దండనాధుల్ విని శ్చలదీప్తాస్యులు పాలువోక సభలో సారింత్రు రక్తాక్షముల్. |
|
కృత్స్నాకాశపుపాలవెల్లి యొడిలోఁ గ్రీడించె శుక్లాష్టమీ జ్యోత్స్నాకారికుమారిచంద్రముఁడుదిగ్వ్యూహంబులన్ హాసదీ వ్యత్స్నాతంబులుగాఁ బొనర్చిన నృపీఠాగ్రస్థ చంద్రోపలో ద్యత్స్నేహంబు వెలార్చు ఱేని యొడలంతన్ జల్లనై పొల్చినన్. |
|
చూచినచూపుత్రిప్పకయ చూచుచు గద్దియ నుండి మెల్లఁగా లేచి మదద్విపప్రణుతలీల నరేంద్రుఁడుపోవఁజొచ్చె నా త్మోచితవృత్తి సైన్యపతు లొక్కరునొక్కరురాజుపార్శ్వభూ మీచరు లౌచు మెల్లన గమించిరి తన్ముఖలగ్నదృష్టులై. |
|
నిసి యని కోటముట్టడిని నిల్పఁగలేదు తెలుంగు సైనికుల్ ముసరుచుఁబోయి యే బురుజుమూలకొ నిచ్చెనలెత్త, లోనివా రు శిలల మొత్త, నచ్చటికి ద్రోవను దీసెను రాజు, తీసి ని ల్చి, సకల దుర్గపార్శ్వపరిశీలనదృక్కులు చిమ్మె నంతటన్. |
|
మృత్యుదేవత చాచి మెఱపించు నాలుక - పోలిక కోట తల్పులను జూచి తనకు శత్రులకు మధ్యగ నిల్చియున్న ర-క్షో మూర్తివలెఁ గోటగోడఁ జూచి తెలుఁగు సేనల ప్రాణముల కెత్తిన ఫణాళి - వలె నున్న కోటకొమ్ములను జూచి విధి పన్నినది యనిర్భ్యేద్యమౌ వ్యూహ మ్మొ-కో యనఁజాలిన కోటఁజూచి |
|
చూచి యేఁమార్గమునుగూడఁదోచరామి పరమసాహసి యో ధరాఫాలమౌళి పార్శ్వమున వ్రేలు తన కరవాల మొఱను దూసి కోటలోపలఁ బాఱవేసె విసరి. |
|
తెలి లేవెన్నెల చాలులో తళతళై దీపించు వజ్రాల ప చ్చల నీలాల హొరంగువన్నెల సరుల్ చాయల్తలారింపులై తొలిక్రొక్కారు మెఱుంగులట్టులయి యెంతోవైనతేయాహృతో జ్జ్వల దివ్యాహివలెన్ జెలంగి నసి రాజద్ధూమకేత్వాకృతిన్. |
|
వివిధసైన్యములు నివ్వెఱవోయి నిలచిరి, - దండనాధులునుఁ జిత్రప్రతిమల వలెనైరి, కోటలోపలి శత్రుసైన్యంబు - మెఱుపువోలిక త్రాచుకరణి నేదొ పఱతెంచి కోటలోఁ బడుటయు దెలుఁగు సై-నికులు ముట్టడిని మాని నిలబడుటఁ గనుఁగొని దానికిఁ గారణం బెఱుఁగక - గుములుగానై కలగుండు వడిరి |
|
దండనాధులు రాజు నేత్రములయందు నిశితదృష్టులు చూచుచు నిలువబడిరి అరనిముస మాగి రామరాయాధినేత మెల్లన వచించె నిట్లు గంభీరమూర్తి |
|
"అదె యమదంష్ట్రిక శత్రుల సదనంబున బోయి వ్రాలె జనపతి రాజ్యం బది యేమిరాజ్య మాత్మ ప్రదరం బరికోట మాటుపడి యుండగన్. |
|
మీలో నెవ్వరు సాహసుల్ కదలుఁడీ, మీమీ ప్రతాపాగ్ని తే జోఽలంకారముగాఁగ శత్రుజన కళ్యాణంబు ఖడ్గాన కు ద్దాలించం జనుఁడీ, తెలుంగుముని విద్యారణ్య సన్యాసి ద త్తాలంకారము బుక్కరాజునసి తెండా! పోయి, సైన్యాధిపుల్" |
|
అను నలియరామరాయల జననాథుని మాటలు విని సభయులు సాలో చనులును సాశ్చర్యులు నౌ చు నిలంబడిరి దళవాయి శూరులు పెలుచన్. |
|
తాళతరుప్రమాన తనుదైర్ఘ్యము గాఢకవాటవక్షమున్ నీలసరోరుహాభ రమణీయ విశాల విలోచనంబులున్ హాళిఁ జరించు మత్తగజయానము తుమ్మెదఁగేరు కోరమీ సాలును బొల్చునాయకుఁడు చాగి యొకండుకృతప్రణాముడై. |
|
"క్షోణీవాసవ! నా పొనర్చు నిదిగో జోహారు! మీ యాజ్ఞఁ, గ ళ్యాణంబెంత త్రిలోకముల్ గెలిచి మీయందెం జెలంగున్ మణి శ్రేణిం గ్రుచ్చెద" నంచు విన్నప మొనర్చెన్ మందహాసంబు ని శ్శ్రేణుల్ గట్టెను లేతవెన్నెల ధరిత్రీభృన్ముఖోద్గారమై |
|
ఱేనియనుజ్ఞ మెచ్చుఁదల రీతిని వచ్చెను "మా యనుజ్ఞ, వి ద్యానగరమ్ము నిక్కము సదాశివనాయకుగారు మీ భుజా స్థాన పరాక్రమార్జిత దిశాసువిశాలము, మీరు నిన్ననే కా! నెల దాటలేదు, కడకన్ హరియించి బిజాపురోద్ధతిన్." |
|
తలవాంచి సెలవుఁగైకొని మెలమెల్లన రాజు పార్శ్వమేదిని జేరెన్ దళవాయి, గూడచేతః ప్రలోభగతులైరి సైన్యపతు లెల్లరునున్. |
|
ముట్టడి మానివేసి యొకమూల గుడారము చెంత నేగి ర ప్పట్టున తెల్గుసేన, లరిపక్షమువారలు వంతువారు కా కెట్టిరు కోటగోడలఁ జరింపరు, రాతిరి వేళ నెప్పుడో యట్టె శశాంకబింబ మది యస్తమయంబును బొందె నెఱ్ఱనై. |
|
కడల నాల్గింటఁ గటికచీఁకటులు క్రమ్మి యరులజాడలఁ దెలిసికో నపుడు కోట గోడలందున దివిటీ లొకండు రెండు కడగి వెలిగింపఁబడి యార్పఁబడుచు వచ్చె. |
|
అంతట కాగడావెలుఁగులారిఁ, జీకటు లింక దట్టమై చెంతలనున్న జీవ మొక చీమయుఁ గన్పడకుండ నాంధ్య మ త్యంతము క్రమ్మె, కోటదరి ద్వారమునొద్ద నదేమొ నల్లనై యింతయు సవ్వడిం బడి చరింపదు! చీకఁటిలోన నైక్యమై. |
|
ఒక నిముసంబులో ఫెళఫెళోద్ధతి, నేనుఁగు తాకి యొత్తిగి ల్లకమునుపే మఱొక్కటి బలంబుగఁ దాకుచు నిల్చియున్న యే నిక లొక బారు తీర్చి గజనిర్భరకుంభ మహాప్రఘాత మే చి కదలి కోటతల్పు లవి చీలెఁ బటాపటమంచు బ్రద్దలై. |
|
నెఱిఁ గోటలోవారు నిద్రామదపరీత - నేత్రులై యాయుధాల్ నెమకుకొనుచు చేరక మును సదాశివనాయకులవారి - తెలుఁగుబంటులు కోటతలుపుచెక్క లటు నిటు త్రోసి యభ్యంతర భటశిర - స్స్కంధముల్ తెగఁగొట్టి గంధసింధు రమ్ములు విడివడ్డ రమణ, పై బురుజుల - కెగఁబ్రాకి స్వాధీనముగ నొనర్చి |
|
కోట యెల్లెడ తామయై ఘూర్ణమాన వారిరాశి విధంబున వఱలునంత ఉదయ పర్వతశిఖర సానూపలములు ధగధగని ప్రజ్వరిల్లె మార్తాండరోచి. |
|
ఉదయ నవారుణాంశులు కవోష్ణములై దెసలందుఁ బర్వుచో ముదితుఁడు రామరాయలు విభుండు మహాసభతీర్చి పొల్చినన్ దదవసరంబునందు 'యమదంష్ట్రిక' చేకొనివచ్చి శత్రుహ స్తదళనయోగ్యహస్తుఁడు సదాశివనాయకుఁ డిచ్చె ఱేనికిన్. |
|
దేహముతోడ స్వర్గము గతించిన వైఖరిఁబొంగె ఱేఁడునున్ బాహుల గౌగిలించి తనపజ్జ నిషణ్ణునిజేసి 'కోటి కో లాహల రాయనాయక బలా!' యని క్రొంబిరుదంబు లిచ్చి మే లౌ హరులున్ గజంబులు పురావళి యిచ్చెను రాజు వానికిన్. |
|
ఆ కేళాదిపురాధిరాట్పటకుటీరాగ్రంబునన్ మ్రోసె నాఁ డేకా రావము "రాయనాయక! బలారే! శత్రుసప్తాంగహా రీ! కేళాది పురీంద్ర! యాదవమురారీ! కోటికోలాహలా! కైకోసామి! పరాక!"టంచు పతి రాఁగా మాగధధ్వానముల్. |