| కవితలు | చీకటి నీడలు - బైరాగి | 21. చీకటి నీడలు! |
| చీకటి నీడలు! |
|
నీడలు! నీడలు! చీకటి నీడలు! గాలిమేడలకు ఎగిరే గోడలు! అమావాస్య, చిక్కని చీకటిలో చలిచీమల్లా ముసిరే నీడలు! నీడలు! నీడలు! ఊళ్ళూ, ఇళ్ళూ పేదలగూళ్ళూ, కుబేరులమేడలు! ఆకాశంలో మబ్బులనీడలు! భూమిపైన ప్రారబ్ధపునీడలు! కునుకుకనులలో నిద్దురనీడలు! అచేతనంలో అద్దపునీడలు! ప్రేమలనీడలు! ద్వేషపునీడలు! శాంతపునీడలు! రోషపునీడలు! కదిలేనీడలు! కదలనినీడలు! తెలిసేజాడలు! తెలియనిజాడలు! రంగులనీడలు! తావులనీడలు! తెల్లకాగితపు టావులనీడలు! గడచినకాలపు చారల నీడలు! గడిచేకాలపు భారపు నీడలు! గడువనికాలపు దూరపు నీడలు! కాలసముద్రపు తీరపునీడలు! అంతులేని బ్రహ్మాండపుతెరపై దేశకాలముల మార్పులనీడలు! విరహప్రణయములు, సృష్టిప్రళయములు ఏడ్పులపై ఓదార్పుల నీడలు! పురిటిపాప చిరునగవు పెదిమపై పాకేచావుల పురుగుల నీడలు! ప్రొద్దుటిపూటల లే ఎండలపై మబ్బులచీకటి చెరగులనీడలు! జీవితసీమ, నీలికొండలపై ఎండలనీడల దాగుడుమూతలు! పూలజల్లులా చిరుకన్నీరులు! వెలుగుకుంచతో బంగరుపూతలు! మానవజీవిత కాళరాత్రిలో ప్రేమచితాగ్నుల ఎర్రనినీడలు! నైరాశ్యపు చిక్కని చీకటిలో అక అస్పష్టపు కదలిక జాడలు! రివ్వున దూసుకపోయే నీడలు! నీడలనే వెన్నాడే నీడలు! చీకటి మూలల ఏకాంతంలో ఎందులకో వెదుకాడే నీడలు! గాలిలోన మృతకాత్మల నీడలు! నేలపైన కృతకాత్మల నీడలు! ఆశయాల ఆకాశపు నీడలు! వాస్తవాల యమపాశపు నీడలు! నీడల యుద్ధం, యుద్ధపు నీడలు! కర్తవ్యాల విరుద్ధపునీడలు! నిశ్చల విశ్వాసపు నీడల్లో, సంశయాల కదులాడే నీడలు! ఉత్సాహపు ఉరికే నీడల్లో అనుమానపు వెనుకాడే నీడలు! చావు పుట్టుకల కొండలోయలో బ్రతుకుల దోబూచులాడే నీడలు! నీడలు; నీడలజగత్తు మానవులంతా సుఖదుఃఖాల కోల్పోయిన అడుగులజాడలు! వెదుకుతున్న నల్లని నీడలు! ఘోరనిశీథపు చీరచెరగులో మూగరహస్యపు నీలిముసుగులో త్వరత్వరగా ముందుకు అడుగిడుతూ తడబడుతూ మరిమరి పొరబడుతూ పోతున్నారా? లేస్తూ పడుతూ నీడలు వారల మిగిలినజాడలు! నీడలు! నీడలు! చీకటినీడలు! |