| కవితలు | చీకటి నీడలు - బైరాగి | 16. నిద్రాభంగం |
| నిద్రాభంగం |
|
పువ్వుల్లో పురుగులాగు నైరాశ్యపు చెరగులాగు నిశ్శబ్దంలో మృత్యువు ప్రాకింది. వెన్నెల్లో కడలినురుగు పొంగుతోన్న పాలమెరుగు జీవిత పల్లవం, పాప నిద్రిస్తోంది. మూసిన కనురెప్పల్లో స్వప్నలోక సౌందర్యం చలియించే పాపమోవి పైన చిన్న నవ్వొకటి ఉదయించింది. మండుతున్న కళ్ళల్లో భీషణ రౌరవజ్వాలలు బిగిసిన మృత్యువు పెదిమల పైన వికృతహాసమొకటి గికురించింది తమతమాళ వాటికలో ఏవో నల్లని ఛాయలు కదులాడాయి. మబ్బుల ముట్టడి లోపల చిక్కుకొన్న తెలితారలు పెనుగాడాయి. పేరుకొన్న నిశ్శబ్దం కదలొద్దని పలుకొద్దని వారించింది. ప్రేమలేఖలై చిరిగిన మబ్బుల్లో వెన్నెలొకటి భయపడుతూ తొంగితొంగి చూచింది. పక్కపైన బిక్కబోయి నిద్రచెడిన పాపొక్కతె కూచుంది. |