| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | కంచికామాక్షమ్మ |

| కంచికామాక్షమ్మ |
కంచికి పోతావా కృష్ణమ్మా! ఆ - కంచి వార్తలేమి కృష్ణమ్మా? కంచిలో ఉన్నది అవ్వ; ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ. బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా? కోమటి యింటిది అప్పు; ఆ - అప్పు నాకు పెట్టు పప్పు. పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా, నీకు - కూర యెక్కడి దోయి కృష్ణమ్మా? దొడ్లోను ఉన్నది బీర; ఆ - బీర నాకు పెట్టు కూర. కూర ఉన్నదిగాని కృష్ణమ్మా; నీకు - నెయ్యి యెక్కడిదోయి కృష్ణమ్మా? కోమటి అక్కెమ్మ చెయ్యి; ఆ - చెయ్యి నాకుపోయు నెయ్యి. నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా; నీకు - పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మా? ఉన్నయింటి యిరుగుపొరుగు, ఆ - పొరుగు నాకుపోయు పెరుగు. బువ్వ తిందువుగాని కృష్ణమ్మా; నీకు - ఆ వూళ్ళోపనియేమి కృష్ణమ్మా? అక్కడ ఉన్నది అమ్మ, నేను - మొక్కివత్తును కామాక్షమ్మ. |
