| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
004. గునాసారి గున్నమ్మ
| అయితే కూడుకి తక్కువైతే గుణానికి తక్కువా? వినండి వారి దినచర్య! ఉదయాన్న లేచింది మొదలు సూర్యుడు కుంకేవఱకు పొలమూ, గొప్పూ, నీరూ, కోత, కొలత. వీరే కాదా దేశానికి ధనము! |
|
వొడినిండ పసుపేస్కో వొయ్యారమేమే గునాసారి గున్నమ్మా పొద్దున్న నువు లెగసి పొలాని కెళ్ళే గునాసారి గున్నమ్మా ఎండెక్కి సూరీడు కొండెక్కి సూసే గునాసారి గున్నమ్మా గంపకిందా కోడి కంయ్యిమన కూసే గునాసారి గున్నమ్మా గొప్పు తవ్వేకాడ కొప్పెందుకోలే గునాసారి గున్నమ్మా గట్టెక్కి సూత్తాడొ గవరయ్య కాపూ గునాసారి గున్నమ్మా మద్దేన్నం యేలపుడు మరి దప్పికేత్తే గునాసారి గున్నమ్మా సల్దీగెంజీ కాంతతాగీ మరి వుండు గునాసారి గున్నమ్మా ఆకుమళ్ళాలోను ఆకెండిపోయే గునాసారి గున్నమ్మా తోడర్ర నీరంత బావుల్లనుంచీ గునాసారి గున్నమ్మా కుప్పానూర్పుల కాడ కూకున్నవేమే గునాసారి గున్నమ్మా పండినా సేలోకి పయినామై ఎల్లీ గునాసారి గున్నమ్మా కొయ్యండి కోతాలు కొడవళ్ళతోటీ గునాసారి గున్నమ్మా కొయ్యించి పొయ్యండి గాదెల్ల లోనూ గునాసారి గున్నమ్మా కుప్పించి కొలవండి కుంచాలతోటీ గునాసారి గున్నమ్మా ఎత్తండి బళ్ళాకి ఎగుదిగుడు లేకా గునాసారి గున్నమ్మా |
| వీరి కల్పనలు వీరి జీవితాల్లాగుననే సహజ సుందరముగా ఉంటవి. పని ఇచ్చే మహరాజుకి వీరు కల్పించే వాసన బాటలు చూడండి. |