| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
075. వెర్రిమగడు
| పెంకిపెండ్లాము శ్లేషార్థమును పట్టి పెనిమిటిని యెగతాళి చేస్తున్నది. ఈ గేయము పశ్చిమ గోదావరి మండలానిది. |
|
ర్యాలీ రావులపాడు రేలంగి సంతలోన బొచ్చెపరిగె తెచ్చినానె ముక్కెయ్యవే పిల్ల ముక్కెయ్యవే ఓరోరి నా మగడ ఒయ్యారి నా మగడ ఎర్రిబాగుల నా మగడ ఏబ్రాసి నా మగడ రెక్కలున్న సేపకీ ముక్కులుంటాయా? నరసాపురం పాలకొల్లు మారుటేరు సంతలోన కోడిపెట్ట తెచ్చినానె గుడ్డెయ్యవే పిల్ల గుడ్డెయ్యవే ఓరోరి నా మగడ ఒయ్యారి నా మగడ ఎర్రిబాగుల నా మగడ ఏబ్రాసి నా మగడ జుట్టున్న కోడికీ గుడ్డుంటదా? భీమవరం ఆకీడు ఈరవాసరం సంతలోన గేదెపెయ్య తెచ్చినానె పాలెయ్యవే పిల్ల పెరుగెయ్యవే ఓరోరి నా మగడ ఒయ్యారి నా మగడ ఎర్రిబాగుల నా మగడ ఏబ్రాసి నా మగడ కొమ్ములున్న గేదెకూ పెరుగుంటదా పాలుంటయా? |