| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
084. చెలువుడి చెల్లెలు
| పుట్టినింట ఉన్న చెలువుడి చెల్లెలి విహారమును గుర్తించండి ఈ పాటలో. ఈమె ఎవరో సుభద్రా సత్యభామలను గుర్తుకు తెస్తున్నది. |
|
చెరువుకట్ట దున్నించి వుయ్యాలా చెరుకులే నాటించి వుయ్యాలా మంచె మీదా మంచె వుయ్యాలా మంచి నీళ్ళా బావి వుయ్యాలా చెలువుడీ చెల్లెల్ని వుయ్యాలా చేను కావీలుంచి వుయ్యాలా ఈనెలూ బెండ్లొలిచి వుయ్యాలా మంచెలే కావించి వుయ్యాలా వెండిదీ వడిశెల వుయ్యాలా భమిడిదీ ఆరాయి వుయ్యాలా గిరగిరా తిప్పుతూ వుయ్యాలా గుప్పునా రాయొదల వుయ్యాలా టక్కునా తగులునూ వుయ్యాలా తల్లకిందుగ పడును వుయ్యాలా పొయ్యేటి పిట్టలను వుయ్యాలా బోరలే పగలేశె వుయ్యాలా నడిచేటి పిట్టల్ని వుయ్యాలా నడుములే విరగేశె వుయ్యాలా కూర్చున్న పిట్టలను వుయ్యాలా గుండెలే మురగేసె వుయ్యాలా వచ్చేటి పిట్టలను వుయ్యాలా వడిసె తోనే వేసె వుయ్యాలా ఆపిట్ట నీపిట్ట వుయ్యాలా గుది కట్టుకుని వచ్చె వుయ్యాలా వండుమని పెదవొదిన నుయ్యాలా వాకిట్లొ వేసెనే వుయ్యాలా రచ్చలో ఉండేటి వుయ్యాలా రాజేంద్రా భోగి వుయ్యాలా వినవయ్య నీ చెల్లి వుయ్యాలా వేటలాడొచ్చింది వుయ్యాల అట్టిమాటలు మతికి వుయ్యాల గిట్టునని చెప్పితి వుయ్యాల ఆడదానికి ఆటలుయ్యాల మొగవాడికి వేటలుయ్యాల |
| ఉయ్యాలా అన్న పాదాంత పదము సాధారణముగా జీవుని ఉద్దేశించిన వేదాంత గేయములలో కనపడుతుంది. ఈ పాటలలోనికి ఆ పదము అతివ్యాప్తి వల్ల ప్రవేశించినది. |