| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
121. పడవపాట
| ఈ తెప్పపాట రచనయేమో ననిపిస్తున్నది. కాని దీని నిచ్చిన మిత్రులు కోటిఫలిలో పడవవాని కడ వ్రాసుకున్నానని చెప్పినారు. అందంగా ఉన్నది. "రవ్వమువ్వల తెప్ప రవగాలి" కి వెళ్లినదట. |
| పల్లవి:- |
గట్టెకు తాదా నాతెప్ప కల్లోల జలధిలో మునిఁగిపోతుందా | ॥గ॥ |
| చరణము:- |
కొక్కురో; కోయంచు । కోడి కూయంగానె దేవుడిచ్చిన నిద్ర । తెలిసిందిరాయంచు చలిగాలిలో వళ్ళు । సవరించుకొంటు చద్ది గట్టుక నేను । చక్క వచ్చాను | ॥గ॥ |
| చరణము:- |
చల్లన్ని గాలిలో । మెల్లంగ వెలిగేటి, చంద్రయ్యనే జూచి । సంద్రమే పొంగింది, పొంగేటి కెరటాలు । వంగుతూ, వాలుతూ, రవ్వమువ్వల తెప్ప । రవగాలి కెళ్ళింది | ॥గ॥ |
| చరణము:- |
పదిగుళ్ళ వలదీసి । పారజూస్తే, తెప్ప పొంగినా కెరటాలు । బొబ్బలెట్టాయి కారు చీకటి గ్రమ్మి । కళ్ళకు పస్తయ్యె సరిగ పోయే తెప్ప । గిరగిరా తిరిగింది | ॥గ॥ |
| చరణము:- |
గాలిజోరు చూచి । కల్లోలమే చూచి కుదురు లేని గుండె । కొట్టుకో సాగింది చుక్కాని తిప్పుచు । శోకాన మునుగుతూ అంతు, పంతూ లేని । ఆ నీటిలో నుండి | ॥గ॥ |
| చరణము:- |
ఇంతలోనే యిల్లు । యింటి పిల్ల నాకు జ్ఞప్తి రాగా వల్లు । గలగలా లాడింది యింటి పిల్లింక, నా । కంట పడతాదా సరసాలతో నేను । మురిసిపోతానా | ॥గ॥ |
| చరణము:- |
పొమ్మంటె పోతుంద? । రమ్మంటె వస్తుంద? రంగడి దయలుంటె । కంగారు పడనేల? గాలిలో నేనింక । కూలినా సరె గాని; రంగడే మాయోడు । రంగడే దొంగోడు | ॥గ॥ |
| చరణము:- |
మనసు కలిసిన వారి । మనసులొకటల్లేను కుటిలమెఱుగని బాబు । గుండె కాయల్లేను మబ్బులన్నీ దాటి । మా రాజు సూరయ్య గప్పు గప్పూమంటు । గంతేస్తు వచ్చాడు | ॥గ॥ |
| చరణము:- |
పొంగుతూ వలదీసి । బుంగ నిండే దాక చేపలేరుక నేను । చెంగున గట్టెక్కి నావ కట్టిబెట్టి । నా యింటి కెళ్ళాను పిల్ల కంటబడితె । వల్లు చల్లాగుంది | ॥గ॥ |
| (గట్టెక్కినాది, నాతెప్ప । కల్లోల జలధిలో కడతేరినాది) | ||