| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
126. చంద్రి - బాలయ్య
| పడుచువాడు పలుకుబడి కలవాడై తనకు అమ్మా బాబూ లేని పడుచైనట్లయితే చురుక్కున జవాబివ్వలేదు. వినండి. |
| బాలయ్య: | నీ లేడి కన్నులోలె శంద్రి నీ లేత నవ్వులోలె శంద్రి ఆ తీగె సొగసులోలె శంద్రి ఆ పళ్ళగుత్తులోలె శంద్రి ఆ నడక జోరులేమె శంద్రి నీ నడుము సన్నమోలె శంద్రి రంగు పింగులు సూత్తె రంబలాగున్నావు రంగం వెడదామోలె శంద్రి |
| శంద్రి: | నే కైకాల సిన్నదాన్ని బాలయ్య నన్ను కంకులు బెట్టకు బాలయ్య నాకమ్మ బాబు లేరు బాలయ్య నన్ను ఆరళ్లు బెట్టకు బాలయ్య నా మేనత్త సాకుతూంది బాలయ్య నాకు మేనరికమున్నది బాలయ్య ఇరుగు పొరుగు సూత్తె ఏమనుకొంటారొ ఎంటరాకురోరి బాలయ్య |
| బాలయ్య: | కమ్మోరి బాయి కాడ శంద్రి నువ్వు కడవ నెత్తి బెట్టి శంద్రి సందుగొందులు దాటి శంద్రి నువ్వు సిందులు దొక్కంగ శంద్రి నీ కొప్పు తిప్పులు సూసి శంద్రి నా కోరికలూరేయి శంద్రి నీ కాళ్ళ కడియాలోలె శంద్రి గణ గణ మోగేయి శంద్రి గిలుకు మట్టెల తోనె శంద్రి నువ్వు గిర్రున తిరిగేవు శంద్రి సూపులో సూపెడితె సుక్కలా గున్నావు లక్క రైకలిస్తా శంద్రి |
|
నీలంపు బావినీలు శంద్రి నే నిక్కంగా తెచ్చిస్తా శంద్రి తీగె పట్టెడోలె శంద్రి నే తిన్నంగా శెయ్యిత్తా శంద్రి నడుము వడ్డాణము శంద్రి నే నాణెంగ శెయ్యిత్తా శంద్రి నీ సిట్టి ముక్కు సూత్తె సిల్కలాగున్నావు సీరెలిత్తా నోలె శంద్రి | |
|
నే మరులు గొన్నానోలె శంద్రి నువ్వు మాయదారివోలె శంద్రి మత్తుమందు జల్లేవె శంద్రి నావి ఉత్తమాటలు గావె శంద్రి నా కెర్రెత్తి పోతూందె శంద్రి నువ్వు ఎంత పాపివోలె శంద్రి సేతిలో సెయ్యేసి సందిటలో కొత్తేను సంక గొడతానోలె శంద్రి |
| తరువాత కథ ఎట్లు నడచినదీ మనకు తెలియదు. తెలియకుంటేనే అందము. ఇటైతే మేనరికానికీ, అటైతే బాలయ్యకీ దెబ్బ. అందుకే ఇట్లా ముగిసిందేమో పాట. |