| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
150. రాజడిగితేమందును?
| ఈ పాట కాలు జారిన చిన్నదానికినీ ఆమెను తప్పుదారి త్రొక్కించిన చిన్నవానికినీ జరుగు సంభాషణను వినిపించుచున్నది. వీడు గడేకారి. ఆమెకు ఉపాయములూ, సాకులూ చెప్పి పెట్టుచున్నాడు. |
|
కాలి మట్టెలు పోయెను । చినవాడ! రాజడిగితేమందును? మన గడప పెద్దదనవే । చినదాన! గడప తగిలి పోయెననవే. చేతి గాజులు పోయెను। చినవాడ! రాజడిగితేమందును? శెనగపువు రోకలనవె! చినదాన! చెయిజారి పోయెననవే। వళ్లెల్ల రక్కులారె । చినవాడ! రాజడిగితేమందును? మన యిల్లు చీకటిల్లు । చినదాన! మన పిల్లి రక్కులనవే। నొష్ఠ కుంకుమ (బొట్టులు) పోయెను । చినవాడ! రాజడిగితేమందును? చిరు చెమటలెక్కెననుమా । చినదాన! చెమటనూ కరిగెననుమా । |
| ఈమె తలుపు దగ్గర పాట నొక్కదాని నైననూ విన్నట్లు లేదు. |