| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
173. బేరము
| వస్తాను గాని మామ వస్తాను గానీ ... నన్ను కొట్టకుండ తిట్టకుండ పెట్టుకుంటావా? నిన్ను కొట్టకుండ తిట్టకుండ పెట్టుకుంటాను నువ్వు యెవరితోను మాట్లాడకుండ వుంటావు కదా? యెవరితోను మాట్లాడకుండ వుంటాను కాని నే నవ్వేటి నవ్వు మొఖం యెట్ల పెట్టేది? నవ్వేటి నవ్వు మొఖం అట్ల పెట్తేను నా చేతిలొ వుండె చారకోలు చెండాడదా? చేతిలొ వుండె చారకోలు చెండాడితే నా నోట్లో వుండె బండమాట బయటెల్లదా? నోట్లో వుండె బండమాట బయటెల్లితే నా కాళ్ళ వుండె కిర్రుజోడు దవడాడదా? నీ కాళ్ళ వుండె కిర్రుజోడు దవడాడితే నా అమ్మగారింటికీ నేనెళ్ళనా నీ అమ్మగారింటికీ నీవెళ్ళితే నే కొట్టకుండ తిట్టకుండ తోడ్కొని రానా? కొట్టకుండ తిట్టకుండ తోడ్కొనొస్తే నే కూడునీళ్ళు వండకుండ దిగనూకనా కూడునీళ్ళు వండకుండ దిగనూకితే నే సేద్యానికి పోకుండ యెగనూకనా? సేద్యానికి పోకుండ యెగనూకితే భావిలొ వున్న గుంటలోన నేను పడనా భావిలొ వున్న గుంటలోన నీవు పడితే వెట్టోణ్ణి పిలిపించి యెత్తించనా? వెట్టోణ్ణి పిలిపించి యెత్తించితే నే దెయ్యమై భూతమై నిన్ను పట్టనా దెయ్యమై భూతమై నన్ను పట్టితే నే వైదుగుణ్ణి పిలిపించి వదలగొట్టనా వైదుగుణ్ణి పిలిపించి వదలగొట్టితే నే తిరుపతి కొండెక్కి తిరిగిచూడనా తిరుపతి కొండెక్కి తిరిగిచూసితే నే బెంగపురీ కొండెక్కి బిందొక్కనా? |
| ఈ రకపు పాటల తునకలు పెక్కులు. దీనియంత పెద్దది అచ్చులో వచ్చినట్లు లేదు. ఇది కావలిలో ఒక బిచ్చగాని వద్ద రాసుకున్నది. |