| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
174. బొల్లారపిల్ల
| చెడిన పిల్లను ఉంపుడుగత్తెనుగా చేసుకున్నాడు వీడు. కులము చెడిన బొల్లారపిల్ల ఏమి చేయగలదు? అన్నలే చెయ్యలేక పోయిరి. |
|
పెట్టీ పోస్తావుంట పైనిండ బట్టలు పెడ్త నాపేరు మీద బతుకవే ఓ బొల్లారపిల్లా! అచ్చాము తెల్లచీర అంచూన జిల్లెడు గొమ్మ నీ కొంగున రామచిలుకలే ఓ బొల్లారపిల్లా! బాయిల యిల్లుగట్టి బొజ్జోడు యెంటవడితె కుంటోడు కులము జెరిపెనే ఓ బొల్లారపిల్లా! నీకాలుకు నామట్టె నాసేతులున్నకటె నిన్ను కొట్టకుంటె ఒట్టెనే ఓ బొల్లారపిల్లా! సంకల సపై తట్టా సేతుల సీపురుకట్టా నీయెంట జెమానెందుకే ఓ బొల్లారపిల్లా! బండమీద బలిజోల్లు బాగోతులాడంగా బాగ తన్నుల్ తింటివే ఓ బొల్లారపిల్లా! దొరగారి జీతగాడు దోరెడ్ల మేపెటోడు దొడ్డెక్కి సీటిగొట్టెనే ఓ బొల్లారపిల్లా! పటేండ్ల జీతగాడు పై ఎడ్ల మేపెటోడు బండమీద సీటిగొట్టెనే ఓ బొల్లారపిల్లా! దిగింది డిచ్చు వెళ్ళిపోయింది సుద్దవెళ్ళి పని జేసె సాంపెల్లి ఓ బొల్లారపిల్లా! ఇందూర్ల నాది యిల్లు మారుకట్టుకు నాది మడిగె మాసాలకన్న రావమ్మా ఓ బొల్లారపిల్లా! బొంబాయిల బొట్లసీరె కనుకుట్ల కనుల రైకె నీకొంగున మల్లెమొగ్గలే ఓ బొల్లారపిల్లా! బొంబాయిల బొంగులొర్రే యిందూర్లె గంటలేగే మనరజా ఎత్తిపోతదే ఓ బొల్లారపిల్లా! కలకల యనబోకు కన్నీరు దియ్యబోకు మన అంతు నుంటె తప్పదే ఓ బొల్లారపిల్లా! యిందూర్ల జోగిపేట నీ అన్నలున్నారాట నన్నేమి జెయ్యజాలరే ఓ బొల్లారపిల్లా! |